యానేవ శబ్దాన్ వయమాల పామో, యానేవ శబ్దాన్ వయముల్లి ఖామో
తైరేవ విన్యాస విశేష భవ్వ్య్ణై, సమ్మోహ యన్తే కవయో జగన్తి ॥
ప్రతిరోజు మనం మాట్లాడే మాటలే... మనం రాసే రాతలే... కాని కవి కలం నుండి జాలు వారినపుడు, కొత్త అందంతో కన్పిస్తాయి. ‘ఓహో’ అనిపించి మైమరపించేస్తాయి. కారణం వారి ప్రతిభావ్యుత్పత్తులు, పదప్రయోగ వైచిత్రి... నుడికారాల నేర్పు.... మాటల కూర్పు... అన్నిటిని మించి భావుకత... భావాలను వ్యక్తీకరించే నిర్మాణశిల్పము. ఆ శిల్పాన్ని ఆవిష్కరించే సౌందర్యము... Pశీవtతీy tuతీఅs aశ్రీశ్రీ tష్ట్రఱఅస్త్రs tశీ శ్రీశీఙవశ్రీఱఅవss అని అంటాడు షెల్లీ... నిజమే!
కవిత్వానికే కాదు, చలనచిత్రకళకూ సౌందర్యమే భూమిక. అందుకొరకే, సినిమా కళాభివ్యక్తీకరణకు కూడా కవులు అవసరమయ్యారు. కాల్పనిక సాహితీసృజనలో కళాసౌందర్య విలువల ప్రాతిపదికన, కావ్యగౌరవం కలిగిన గేయాలను రచించే కవిశ్రేష్ఠులెందరో పుట్టారు.
తెలుగు చలన చిత్రసాహితీ రంగానికి సంబంధించినంతవరకు సముద్రాల వారు ‘కవిబ్రహ్మ’ లాంటివారు. తెలుగు టాకీ పుట్టి (1931) పురుడుపోసుకొన్న ఆరేళ్ళకే (1937) సముద్రాల కలం పట్టారు. మÖడు దశాబ్దాల కాలంలో (1937-1968), ఆ కలం సృష్టించింది కమనీయ పా(ట)ల కడలియే!
తెలుగు సాహిత్యానికి సంబంధించి చూస్తే, ఆదికాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ, రాయప్రోలు నవ్యత్వాన్ని సృజించారు.
తెలుగు చలనచిత్ర సాహిత్యాన్ని పరిశీలిస్తే, సముద్రాలవారు నవ్య సృజన కోసం పరితపించినట్లు తెలుస్తుంది. భావసంపద, శబ్ద ప్రభుత, అభివ్యక్తి సాంద్రత వంటి మేలిమి గుణాలతో, వీరి పాటల ప్రవాహం ఉప్పొంగి సాహితీక్షేత్రాన్ని సుసంపన్నం చేసింది.
సముద్రాలవారి కలం ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా
1. సమకాలీన సమాజాన్ని వివేచన చేసి విశ్లేషించింది.
2. జీవన విలువల్ని ప్రతిపాదించింది.
3. పౌరాణిక పాత్రల మనస్తత్వాలకు, ఆధునిక సమాజ ఆలోచన రీతుల్ని అనువర్తింప జేసింది.
4. జాతీయతా భావాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది.
5. పాటల రచనా విధానానికి పరిమళాలు అద్దింది.
అంటే ‘వందేమాతరం’ (1939) నుండి ‘మనదేశం’ (1949) వరకు - ‘కనకతార’, ‘గృహలక్ష్మి’ చిత్రాలు తదుపరి, అంటే సముద్రాల వారు రచన చేసిన 17 చిత్రాలలో పౌరాణిక (చెంచులక్క్ష్మి), చారిత్రక (పల్నాటియుద్ధం), సాంస్కృతిక (భక్త పోతన, త్యాగయ్య), ఆధ్యాత్మిక (వేమన), విషాదప్రేమ (లైలామజ్ను), సాంఘిక సమస్య (సుమంగళి), జానపదం (బాలరాజు), కుటుంబ సమస్య (దేవత), దేశభక్తి (‘మనదేశం’) మొ॥ అన్ని పార్శ్వాలకు సంబంధించినవి వుండటం గమనించవచ్చు.
వస్తువేదైనా, యితివృత్తమేదైనా, sTÖ చిత్రాలలోని వీరి పాటలు కొత్త ఒరవడిని సృష్టించాయి. అంతేకాదు ఈ పది సం॥రాల కాలంలో సముద్రాల వారి కలం కాలం రాపిళ్ళకు ఎదురొడ్డి నిలిచింది. ఓటమి అంచుల నుండి జారి పడకుండా తనను తాను కాపాడుకొన్నది.
1931-49 మధ్య కాలంలో సినీరచన చేసిన వారందరిలో విలక్షణ సాహితీ వ్యక్తిగా నిలిచిన వారు సముద్రాల. ఈ కాలంలో మొత్తం 148 చిత్రాలు విడుదలయ్యాయి. అంటే 1:7 నిష్పత్తిలో ప్రతి ఏడో చిత్రానికి సముద్రాల రచయితగా పనిచేశారు.
1950 లో ప్రవేశించే సమయానికి, సముద్రాల కలం స్వీయముద్రతో ఎంతో ఎత్తుకు చేరుకున్నది. సముద్రాలవారి కలం కొత్తవెలుగులని ప్రసరించింది.
ఇందుకు కేవలం సముద్రాల వారొక్కరే అభినందనీయులు కారు. అలాంటి రచన చేయడానికి తగిన స్వేచ్ఛాస్వాతంత్య్రాలు, అవకాశాలు కలిగించిన ఆదర్శభావాలున్న నిర్మాత దర్శకులు కూడా అభినందనీయులే! ఎందుకంటే సినిమా పాటలు, కథను, సన్నివేశాలను బట్టి రూపొందుతాయి కాబట్టి.
సముద్రాల సినిమా కోసమే కవిగా అవతరించలేదు. దీనికి పూర్వమే దాదాపు పది సంవత్సరాలు అవధానకవిగా రాణించారు. చిన్నతనంలోనే కవిత్వాన్ని ఉపాసించారు. ప్రసిద్ధ సంస్కృతాంధ్ర కావ్యాలనన్నిటినీ ఔపోశన పట్టారు. హిందీ, బెంగాలీ, తమిళ భాషా సాహిత్యాలను కూడా పరిశీలించారు. నిరంతర అధ్యయనం, కృషి, సాధన వల్ల వివిధ విషయాలపై పట్టు చిక్కింది. పాండిత్యం సిద్ధించింది.
కేవలం పండితకవిగా మాత్రమే అయితే, నారికేళపాకంలోనే రచనలు చేసేవారేమో! కానీ వీరు అందరికవిగా, కదళీపాకంలో రాసే రీతిని ఏర్పరచుకొన్నారు. ఈ శైలికి దోహదం చేయడానికి కారణం ప్రధానంగా వీరి పత్రికారచన. విద్యార్థి దశలో, ఆనాటి పత్రికలకు వీరు వ్యాసాలు, కథలు, పద్యాలు రాసేవారు. ఉపాధ్యాయవృత్తిలో ఉన్నపుడు కూడా ఎన్నో విమర్శనాత్మక వ్యాసాలు రాశారు.
అంతేకాదు దాదాపు ఎనిమిది సంవత్సరాలు సబ్ ఎడిటర్‌గా ‘ప్రజామిత్ర’ పక్షపత్రికలో పనిచేశారు. పత్రికారచనా వ్యాసంగం వల్ల వీరి రచనలో స్పష్టత (్ప్పుజిబిజీరిశిగి) ఏర్పడింది.
1933లో ఆంధ్రపత్రిక (శ్రీముఖ నామ సంవత్సరాది సంచిక)లో “ఆంధ్రుల - రాధ” అన్న శీర్షికతో వీరు రాసిన వ్యాసము ఎంతో ఆలోచనాత్మకంగా వున్నది. ఆ వ్యాసము యిలా మొదలవుతుంది.
“ఆంధ్రమున నేడొక క్రొత్తయుగము జరుగుచున్నది. ఈ యుగ పరివర్తనమున నాంధ్ర సంప్రదాయములన్నిటిలోను మార్పురాక తప్పినది కాదు. నూతన సన్నివేశమున గలిగిన ఆంధ్రమానసిక సంస్కారము భాషలో గూడ దాని క్రొత్తపోకడలను ్పు£నుపుచున్నది. శిల్పమున గూడ దాని పలుకుబడి చెల్లకపోలేదు. ఆంధ్రులలో విప్పారుచున్న నూతన వికాసమునకు గల కారణములన్నిటి యందును వంగభాషశిల్పములు ప్రధానములు”.
వ్యాసము ప్రారంభంలోనే వీరి ఎత్తుగడ (Takఱఅస్త్ర శీff) పాఠకులకు కొత్త అంశాన్ని తెలిపే విధంగా వుండటాన్ని గమనించవచ్చు. దాదాపు 4 పేజీల్లో విస్తరించిన ఈ వ్యాసం సముద్రాలవారికి సాహిత్యంపట్ల కొన్ని దృక్పథాలు సూచిస్తున్నది.
1. తెలుగు సాహిత్యంలో నూతనయుగ అవతరణను అర్థంచేసుకున్న తీరు. 2. తెలుగు భాషా వికాసానికి గల కారణాలు.
3. ఆధునిక కాలంలో ఆంధ్రుల్లో కలిగే మానసిక సంస్కారము.
4. మన భాషపై ఇతర భాషా సాహిత్యాల ప్రభావం.
5. శిల్ప నిర్మాణ విషయంలో, బెంగాలీ సాహితీవేత్తల స్ఫూర్తి.
ఇక విషయంలోకి తమ పాఠకులను మరలించడానికి సముద్రాలవారి నేర్పు, టెక్నిక్ గురించి చెప్పాలంటే, ఇదే వ్యాసంలో రెండవ పేరాలో ఉటంకించిన విషయం! తెలుగు వారికి శ్రీరాముడే అభిమానదైవమని, శ్రీరామ చుట్టనిదే తెలుగువారి కలం సాగదని, చివరకి ‘సీతారామ పరబ్రహ్మణే నమ్ణ’ అని అననిదే బిచ్చగాడు జోలెత్తడని వివరించారు. అయితే తెలుగువారికి శ్రీకృష్ణుడంటే కూడా అభిమానమేనని, తెలుగు వారి కృష్ణుడు ద్వారకాకృష్ణుడే కాని రాధాకృష్ణుడు కాడని సబ్జెక్ట్‌లోకి లింక్ ఏర్పరిచారు. ఈ ప్రతిపాదనకు నన్నయ్య యుగం నుండి ప్రuంధ యుగం వరకు వ్యాపించిన ఆంధ్రసాహిత్యంలోని వివిధ రచనలనీ వుదహరించారు. రాధను ‘రాధికాస్వాంతనం’ మొ॥ ప్రబంధాలలో పచ్చి శృంగారయువతిగా చిత్రించటాన్ని తీవ్రంగా ఖండించారు. రాధ ప్రకృతి స్వరూపిణియని అమ్మవారని వర్ణించిన గోపీ¾నాధుని వెంకటకవిని ప్రశంసించారు. ఈ వ్యాసము మెత్తము విÖద సముద్రాల వారి సదసద్వివేచనను విమర్శనా శక్తిని తెలియజేస్తుంది.
ఇలా పాఠకులనాడి తెలుసుకోవడానికి సముద్రాలవారికి పత్రికారచనా వ్యాసంగమెంతగానో దోహదపడింది.
పత్రికారచన వలెనే సినీ రచన కూడా అన్ని వర్గాలవారికి చేరాలి. పాండితీప్రకర్ష ప్రదర్శిస్తూ భాషాజ్ఞానం చూపిస్తూ, పాటలు రాసినా మాటలు రాసినా అవి పాషాణపాకాలుగా మిగులుతాయే గాని పామరలోకాన్ని అలరించవు.
కావ్యరచన వేరు.. పత్రికారచన వేరు.. సినిమా రచన వేరు. అయితే కావ్యాన్ని, సినిమాని తులనాత్మకంగ పోలుస్తూ మరో సంచికలో సముద్రాల వారు రాసిన వ్యాసం (చిత్రం కావ్యం) వారి అవగహనను, తెలియజేస్తుంది.
సముద్రాల కలం పట్ట్టేనాటికే, తెలుగు సినిమా పాట, రంగస్థలనాటకం నుండి మెల్లిగా మెట్టు దిగుతూ, సినీ సొబగుల కోసం శీజూవఅ aఱతీ tష్ట్రవatతీవ లోకి రాసాగింది. తెలుగు నాటకాలలో పాటలను ప్రవేశపెట్టిన ఖ్యాతి ధర్మవరం కృష్ణామాచార్యులది. పైడిపాల గారి పరిశోధననుసరించి చందాల కేశవదాసు గారే తొలి సినీగీత రచయిత. 1931లో హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన భక్తప్రహ్లాదలో ‘పరితాప భారంబు - భరియింప తరమా’ అనే పాటను లీలావతి కొరకు చందాల కేశవదాసు రాశారు.
తెలుగు సినిమా పాటకు కేశవదాసు పాదు చేûస్తే, దైతా గోపాలం, బలిజేపల్లి ప్రభృతులు నారుపోశారు. తెలుగు సినీ సాహిత్యాన్ని యుగవిభజన చేస్తే, sTÖ యిద్దరు మహనీయులూ తొలియుగ కవులుగా ప్రాత్ణస్మరణీయులు - పైడిపాల పేర్కొన్నట్లు ఇది ‘అరుణోదయ’ యుగం.
సముద్రాల మలియుగకవి. వీరు ‘భానోదయ’ కాలంలోకి వస్తారు. వీరితో పాటు తాపీ ధర్మారావు, కొసరాజు రాఘవయ్య చౌదరి, బలిజేపల్లి, పింగళి వంటి కవులు ఈ కాలంలో సినీరంగ ప్రవేశం చేశారు.
తెలుగుటాకీ తొలిదశలో వచ్చిన పాటల్లో గ్రాంథిక భాషే ఎక్కువ. బ్రోతున్, చూతున్, గాంతున్ - వంటి ద్రుతాంత పదాలు ఎక్కువ కనిపిస్తాయి. భావుకత, కాల్పనికత కన్న నాటకీయతే ఎక్కువ!
సముద్రాలవారు సినీగీతనిర్మాణం, రూపకల్పనాది విషయాల కొన్ని మార్పులు తెచ్చారు. అవి ఏమనగా
1. నవ్య రచనకు నాంది :
లెండు భారతీయులార!
నిదుర లేవండోయ్ - (గృహలక్క్ష్మి - 1938)
అని ప్రబోధాత్మకంగా విషయంలోకి వెళ్ళి, పల్లవితో పాటకు గోపురం కట్టారు సముద్రాల. శ్రీకారం చుట్టారు అని చెప్పడం సబబు కాదు. ఎందుకంటె లలిత గేయ రచనకు ఆనాటికే బసవరాజు అప్పారావు, నండూరి, దేవులపల్లి ప్రాచుర్యం తెచ్చారు. సినిమాలలో మాత్రం sTÖ సూటిదనం వుండాలని భావించినవారు సముద్రాల. అందుకే కవిత్వం, నాటకీయశిల్పం, కన్న విషయవివేచనకే ప్రాధాన్యం యిచ్చారు. ఈ పాట చరణాలలో మహమ్మారి, రహదారి, పింజారి వంటి ప్రాస పదాలు కన్పిస్తాయి. కానీ కల్లుత్రాగటం వల్ల కలిగే అనర్థాలను పేర్కొని, ఓ పరివర్తన తెచ్చేకోణంలోనే దృష్టి సారించారు.
“మీరు త్రాగేకల్లు మీ భార్యా పిల్లల రక్తమే” అని సూటిగా చెప్పడం వల్ల ఆ మాట, sTÖటెగా మారి, త్రాగుబోతుల గుండెలకు తాకుతుంది. ఇలా కల్లుత్రాగడం మాన్పించడానికి, సముద్రాలవారి కలం తాళవృక్షంగా మారింది. కొత్త నిర్మాణ పద్ధతికి స్వాగతం చెప్పింది.
2. బాణీలకు సముద్రాల వాణి - తొలి బోణి :
తనకు నచ్చే విధంగా రాసుకొనే వాడు కవియైతే, అందరికి నచ్చే విధంగా రాసేవాడు సినీకవి - అని డా॥ సి.నారాయణరెడ్డిగారు కవికి - సినీకవికి గల తేడా చెప్పారు.
అందరూ - అంటే నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, హీరో, హీరోయిన్ కొండొకచో డిస్ట్రిబ్యూటర్ మొ॥ వారన్న మాట-
‘కల్లుమానండోయ’ పాటకు మÖలం హిందీ ట్యూన్. ఆ బాణీకే పాట రాయాల్సిందిగా సముద్రాలను నిర్మాత దర్శకులు కోరారు. ఇలా బాణీలకు, సులభమైన పదాలతో రాసే నేర్పుతో పాటు చక్కని భావుకతను, చక్కని శైలిని కూడా పొదిగిన ఖ్యాతి సముద్రాల వారిదే!
3. ఆహ్లాదకరమైన యుగళ గీతాలకు అంకురార్పణ :
మబ్బుతునకల దోమతెర చాటులోకి
అమృతము చిందునీమోము మధురముగా
నిలబోకుమా చందమామా! - (‘సుమంగళి’)
‘గృహలక్క్ష్మి’, ‘వందేమాతరం’ చిత్రాల పాటల రచనలో వైవిధ్యం చూపించినప్పటికి, వలపు తేనెల పాటలకు, చిలిపి తనాల పాటలకు ఆహ్లాదకరమైన యుగళగీతాలకు సముద్రాల ‘సుమంగళి’ చిత్రంతోనే అంకురార్పణం చేశారు.
హీరో హీరోయిన్లు, చందమామను అడ్డం పెట్టుకొని పాడేపద్ధతి, అనంతర కాలంలో వచ్చిన చిత్రాలలో మనకు విరివిగా కన్పిస్తుంది. వాహిని నుండి విడివడిన ‘విజయా’ వారి సినిమాల్లో ఈ సంఖ్య ఎక్కువ! అందుకు పింగళి వారి పాటలే నిదర్శనం.
పై గీతంలో ‘నిలబడకుమా’ అనే బదులు ‘నిలకుమా’ అని ప్రయోగం కన్పిస్తుంది. ఈ ఒరవడి, పింగళి వంటి కవులకు (ఉర్రూత, ఉర్రు) మార్గదర్శనం చేసింది.
పాటలో వచనాన్ని, సంభాషణలను ‘పాడవే కోయిలా...’ (‘సుమంగళి’) మొ॥ పాటల్లో చమత్కారంగా ప్రవేశపెట్టారు.
4. వాడుక భాషకు వెన్నెల పూత :
ఆధునిక కాలంలో, గిడుగు రామÖ్మర్తి పంతులుగారి వ్యావహారిక భాషోద్యమం సినిమా మీడియంను కూడా ప్రభావితం చేసింది. మÖడు గంటల సేపు సాగే సినిమాను కొంతకాలానికి మరిచిపోతాం. కానీ మÖడు నిముషాల పాటను మనం మరచిపోలేం. అలా కలకాలం పాడుకొనేలా వుండాలంటే సులభశైలిలో, వాడుకభాషలో రాస్తేనే ఉద్దేశ్యం నెరవేరుతుంది. సముద్రాలగారి “వస్తాడే మా బావ’ పాట వాడుకభాషకు శ్రీకారం చుట్టింది.
ఇలాంటి ఎత్తుగడతో అనంతరకాలంలో ఎన్నో పాటలు వచ్చాయి. ఉదా:-
1. వస్తాడు నారాజు ఈ రోజు... (అల్లూరి సీతారామరాజు - సినారె)
2. వస్తాడే నా రాజు... (తూర్పు వెళ్ళే రైలు - జాలాది)
3. వస్తాడమ్మా నీ దైవము... (మురళీకృష్ణ - ఆత్రేయ)
4. వస్తా వెÞ£్ళస్తా... (సిసింద్రీ చిట్టిబాబు - సినారె)
5. పాట నిర్మాణంలో కొత్తబాట :
పల్లవిని అర్థోక్తిలో ప్రారంభించే సంప్రదాయానికి సముద్రాలవారే కొత్త మార్గం వేశారు. వాహినీ వారి ‘దేవత’ (1941)లో
“రాదే చెలీ నమ్మరాదే చెలి
మగవారినిలా నమ్మరాదే చెలి” అన్న పాట యిందుకు ఉదాహరణ. ఈ పల్లవే ‘భాగ్యలక్క్ష్మి’ (1943) చిత్రంలో ఓ పాటలో మళ్ళీ కన్పిస్తుంది కూడా!
సముద్రాల, ఎక్కువగా క్రియాపదాలతో పాటలు నిర్మిస్తారు. తొలి చిత్రం ‘కనకతార’ (1937) మొదలు, పరిశీలిస్తూ పోతుంటే, వారి ప్రతి సినిమాలో ఈ పద్ధతితో రూపొందించిన పాట తప్పకుండా కన్పిస్తుంది. అందుకు నిదర్శనంగా ఈ దిగువ ఉదాహరణలు గమనించండి!
1. మానరా ! హింసమానరా... (కనకతార - 1937)
2. లెండు ! భారతవీరులారా... (గృహలక్క్ష్మి - 1938)
3. వస్తాడే ! మా బావ... (సుమంగళి - 1940)
4. చేస్తాను ! పెండ్లికొడుకును... (భాగ్యలక్క్ష్మి - 1943)
5. మేలుకో! కృష్ణా... (స్వర్గసీమ - 1945)
6. ఆగవే - మరదల... (రత్నమాల - 1947)
7. వెడలిపో తెల్లదొర... (మనదేశం - 1949)
8. పలుకరాదటే చిలుకా... (షావుకారు - 1950)
9. సాగుమా ! సాహిణి... (స్వప్నసుందరి - 1950)
10. అన్నానా? భామిని... (సారంగధర - 1957)
11. నిలువుమా - నీలవేణి... (అమరశిల్పి జక్కన్న - 1964)
ఇలా ఉదహరిస్తూ పోతుంటే కోకొల్లలు.
6. సంప్రదాయ రచనకు స్వస్తి - భావకవిత్వానికి వ్యాప్తి :
భావకవితా ప్రభంజనం తెలుగు సాహిత్యాన్ని, తెలుగునాడును చుట్టుముట్టి నపుడు, శ్రీశ్రీ వంటి అభ్యుదయ కవులు సైతం భావగీతరచనా ప్రవాహంలో కొట్టుకొని పోయారు. సముద్రాల వారు క్రమంగా సంప్రదాయ ధోరణికి స్వస్తి చెప్పి, సౌకుమార్యానికి, సౌందర్యానికి ప్రాధాన్యం యిచ్చారు. సులభశైలిలో లలిత భావాలను వ్యక్తం చేసే తీరున పాటల రచనకు కొత్త బాటలు వేశారు.
‘వందేమాతరం’ (1939) చిత్రంలోనే వారి భావకవితాధోరణి, సూర్యోదయమునకు ముందు, కనకాంబరవర్ణం వంటి సంజెవెలుగుల దీప్తి వలె కన్పిస్తుంది.
‘తూరుపు తెలతెలనాయె
పోయెను - చలీ బడాయి’- అని ‘వందేమాతరం’లో వర్ణించారు. ‘జీవన్ముక్తి’ (1942)లోని వీరి పూల పాట పేర్కొనదగింది. ఈ గీతంలో అన్ని రకాల పూలనుదహరిస్తూ
“తెలుగు తోటలో పూచినపూలుగా
తెలుగు తల్లి కట్టిన పూలుగా”, వూహించడమే కాదు ఆ పూలను ‘దేవార్చనకు, ప్రేమార్చనకు’ వినియోగించాలని అన్నారు. ఈ భావన కాల్పనిక కవిత్వ (=శీఎaఅtఱc Pశీవtతీy) లక్షణాన్ని తెలుయజేస్తున్నది.
ప్రణయమేకాదు, విషాదము కూడా భావకవుల ýక్షణము! “నన్ను మనసార ఏడ్వనీరు” అన్న దేవులపల్లి వారి కవిత అందరికీ తెలిసిందే! ‘వందేమాతరం’ చిత్రంలో “తరిపి వెన్నెలలోన చిరునవ్వులేలా” అన్న గీతం, కథానాయకుడు తనకు దూరమైన భార్య గురించి విచారిస్తున్న సందర్భం కోసం రాసింది - ఇది కృష్ణశాస్త్రిగారి “కన్నీటి కెరటాల వెన్నెలేలా?” అన్న గీతాన్ని గుర్తు తెస్తుంది.
సముద్రాల హృదయంలో ‘వందేమాతరం’ సినిమానుంచే మొలకెత్తిన భావకవితాలతిక, వెలుగుపూలతో సాగి, ‘షావుకారు’ (1950) చిత్రంలో (ఏమననే చిన్నారి...) విరగబూసిన తెలుగు పూపందిరిగా, వ్యాపించింది.
ఏమనెనే చిన్నారి ఏమనెనే
వన్నెల సిగపూవా, కనుసన్నలలో భావమేమి
ఆమని కోయిల, పాటý, గోముల చిలికించు
వలపు కిన్నెర, తానేమని రవళించెనే?....
ఈ పాటలోని భాషా లాలిత్యం, పదచిత్రాలు రసజ్ఞచిత్తాలను మెత్తగా హత్తుకొనే వెన్నెల కిరణాలు అని చెప్పవచ్చు.
ఇలాంటి అభివ్యక్తులతో 1950 తదుపరి వచ్చిన చిత్రాలలో ఎక్కువ రాశారు.
1. చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట వినరావమ్మా... (దొంగరాముడు)
2. ఓ తారకా నవ్వులేలా... (చండీరాణి)
3. కలిసె నెలరాజు... (అనార్కలి)
4. శ్రావణమేఘాలు కూరిమిభావాలు... (భక్త పోతన)
5. నిన్న చూసింది ఈ అరుణాకాంతులె... (భార్య)
7. భావ గీతాల్లో వైవిధ్యం :
భావకవితలో 1. ప్రకృతి సౌందర్యానికి పరవశించడం 2. ప్రకృతిని దేవతగా ఆరాధించటం కనిపిస్తాయి. అంతేకాదు పల్లెసీమల గురించి, పంటపొలాల గురించి, పండుగల గురించి, భక్తి, దేశభక్తి తదితర అంశాల గురించి చిత్రించటం కూడా భావకవుల లక్షణం.
ప్రకృతి కవిత్వ చిత్రణానికి, విస్తరణానికి మార్గం వేసింది సముద్రాల గారే! ఉదా:-
“పాడవే కోయిలా...” (సుమంగళి).
అలాగే ‘కిలా కిలా నవ్వుల కురిసేలే వెన్నెల...’ (చండీరాణి) అన్న పాటను ఎలా మరచిపోతాం చెప్పండి?
8. భక్తి పాటలకడలి - భావతరంగాలు కదలి :
భావకవిత్వంలో భక్తి, దేశభక్తి కూడా అంతర్భాగాలే. సముద్రాల రాసిన భక్తిగీతాలు సంఖ్యాపరంగా ఎక్కువే... పౌరాణిక చిత్రాలలో ఎలాగూ వస్తువు భక్తిని ఆశ్రయించి వుంటుంది (ప్రణయగీతాల్లో తప్ప) సాంఘిక చిత్రాలలోనూ భక్తి గీతాలు రాశారు.
కె.వి.రెడ్డిగారు తొలిసారి దర్శకత్వం వహించిన ‘భక్త పోతన’లో భక్తిగీతాలను భావబంధురంగా రచించారు. ‘సర్వమంగళ నామా సీతా రామా...’, ‘పావనగుణరామా...’ పాటలు ఆల్‌టైం హిట్స్‌గా నిలిచాయి. ‘పావన గుణరామా...’ అన్న పాటలో ‘వేదాంత వధూ హృదయవిహారా...’ అన్న అభివ్యక్తి సముద్రాల వారి భావుకతను నిరూపిస్తుంది.
‘భూకైలాస’, ‘సీతారామకల్యాణం’, ‘వాల్మీకి’, ‘లవకుశ’, ‘నర్తనశాల’, ‘పాండవవనవాసం’ మొ॥ చిత్రాలలోని పాటలు భక్తిరసాన్ని ఆవిష్కరించే భావదీపికలు... భూకైలాస్‌లో “నీలకంధరా దేవా”పాట సాకీలో శంకరుని “శ్రుతి శిఖర సంచారా” అని సంబోధించారు. కానరార కైలాసనివాస... (సీతారామకల్యాణం), దేవాదీన బాంధవా... (పాండవవనవాసం)- మొ॥నవి మరికొన్ని ఉదాహరణలు.
భగవంతుని అవతార వర్ణనకు సంబంధించిన గీతాలను సముద్రాల గారే ఎక్కువ రాశారు.
‘దశావతారాలు’ (1962) ‘భూకైలాస’ (మున్నీట పవళించు...) మొ॥ చిత్రాల్లో పది అవతారాల వర్ణన వున్నది - రామాయణ కథాగానాన్నీ ఎక్కువ సంఖ్యలో రాసిన ఖ్యాతి సముద్రాలగారిదే. ‘వాల్మీకి’, ‘సతీ సులోచన’, ‘భూకైలాస’, ‘లవకుశ’, ‘శ్రీరామకథ’ ఇందుకుదాహరణలు.
‘శ్రీకృష్ణావతారం’, ‘శ్రీకృష్ణపాండవీయం’, ‘వీరాభిమన్యు’ మొ॥ చిత్రాల్లో కృష్ణపరమైన అవతార స్తుతి చేశారు.
9. దేశభక్తి - ప్రబోధాత్మక గీత పరికల్పన :
‘లెండు భారతీయులారా!...’ అన్నది సముద్రాల వారి తొలి ప్రబోధగీతం. అది మొదలు ‘మనదేశం’ వరకు జాతీయోద్యమ నేపథ్యంలో పాటలు రాశారు. ‘బాలరాజు’ జానపద చిత్రమైనప్పటికీ యిందులో ‘నవోదయం...’ గీతం ఉద్యమస్ఫూర్తిని కలిగించేదే! ‘జయహో మహాత్మగాంధి...’ (గృహలక్క్ష్మి), ‘జయహో మహాత్మగాంధి... (మనదేశం), ‘భలేతాత మన బాపూజీ...’ (దొంగరాముడు) మొ॥ పాటలు, గాంధీజీ వ్యక్తిత్వంపై అల్లిన గీతాలు.
10. పండుగలపై భావవీచికలు :
ప్రకృతి సౌందర్యంతో బాటు మన సంస్కృతి సంప్రదాయాలలో అంతర్భూతమైన పండుగలపై కవితలు చెప్పటం భావకవుల లక్షణం. ‘రైతుజనములా పండుగ దినమిదిరా...’ (దేవత) అని ఇంగ్లాండ్ నుండి వస్తున్న అన్నయ్య గురించి, సంతోషంగా పాడుకొంటుంది ఆ చెల్లెలు. అయితే ఆమె తోటి రైతులతో పంటపొలాల్లో తిరుగుతూ, వ్యవసాయపనులు తనే చేస్తూ పాడుతుంది.
‘షావుకారు’ చిత్రం కోసం సముద్రాల వారు రాసిన ‘దీపావళి’ పాట వారి ‘భావదీపావళి’ అని చెప్పవచ్చు. ఈ పాటలో ఒక చోట
‘తొలకరి స్నేహాలు
వలపుల వానగా
కురిసి సెలయేరుగా
పొంగే ప్రమోద తరంగావళీ...’ - అని వ్యక్తీకరించిన తీరు వారి భావుకతను తెలయజేస్తుంది - ‘దీపావళి’ వంటి పౌరాణిక చిత్రాలలో భావకవిత్వపు మెరుపులు సత్యభామ సౌందర్యాన్ని సమానంగా చిత్రితమయినాయి.
11. స్మృతి గీతికలు (జుశ్రీవస్త్రఱవs) :
భావకవిత్వంలోని మరొక పాయ స్మృతి కవిత. ఆంగ్లభాషలో ‘ఎలిజి’ లంటారు. తనకు సంబంధించిన ఆప్తులు దూరమైనపుడు, తనవారితో ఎడబాటు కలిగినపుడు, స్మృతులు హృదయంలోంచి ఉబికివస్తుంటాయి.... తనకు సంబంధించిన వారే కాదు, తను సంచరించిన వూళ్ళు, ప్రాంతాలు, చిన్ననాటి జ్ఞాపకాలతో అల్లే కవితలు కూడా ఎలిజీలే! చారిత్రక ప్రాంతాల సందర్శించినపుడు, మదిలో కలిగే గత వైభవ స్ఫురణ కూడా స్మృతి కవితలకు దోహదం చేస్తుంది. ఒక్కోసారి గతించిన కాలము, మారిన సంప్రదాయము, సంస్కృతి, కూడా స్మృతి తరంగాలుగా వుప్పొంగుతాయి. ఆధునిక తెలుగు సాహిత్యంలో విశ్వనాథ వారి వరలక్క్ష్మీత్రిశతి, కొడాలి హంపీక్షేత్రం, నాయని సుబ్బారావు విషాదమోహనము మొ॥ విశిష్ట స్మృతికావ్యాలు...
సినిమాలలో స్మృతిగీతాలను సముద్రాల వారే తొలిసారి ప్రవేశపెట్టారు.
వాహినీ వారి ‘వందేమాతరం’లో వీరి తొలి స్మృతికవిత పద్యరూపంలో వెలువడింది. ఈ చిత్రంలో హీరో (నాగయ్య) హంపీక్షేత్రాన్ని సహకళాశాల విద్యార్థులతో సందర్శిస్తాడు.
‘ఇటు తెల్గు కవికోటినృపుల కైదండతో
ఏనుగులెక్కి యÖరేగినారు...’ అని శిథిలమైన
విజయనగర సామ్రాజ్యవైభవాన్ని తలచి చింతిస్తారు.
అనంతరం చాలాకాలానికి ఆత్రేయ, ‘అహో ఆంధ్ర భోజా!’ అని అద్భుతమైన స్మృతి గీతాన్ని (మంచిమనసులు) అక్షరశిల్పంగా చెక్కినారు.
‘లైలామజ్ను’, ‘దేవదాసు’, ‘బాటసారి’ మొ॥ చిత్రాలలో సైతం వైయక్తిక స్మృతి గీతాలను రాశారు.
12. ప్రణయ రాగవాహిని - సముద్రాలవారి లేఖిని :
ప్రణయం లేకుంటే ప్రపంచమే ఉండదంటారు. ప్రేమగీతాల పరికల్పనలో సముద్రాల వారి కలం ప్రవాహమై రసతరంగిణిగా కదలాడింది.
జి హాయి హాయిగా ఆమనిసాగె... (సువర్ణసుందరి)
జి చిగురాకులలో చిలకమ్మా... (దొంగరాముడు)
జి అన్నానా? భామిని! ఏమని?... (సారంగధర)
జి ఓ సుకుమార నిను గని... (సీతారామకల్యాణం)
జి హిమగిరి సొగసులు... (పాండవనవాసం)
జి ఇదియే జీవితానందము... (స్వర్ణమంజరి)
జి నాదు ప్రేమభాగ్యరాశి... (భక్త జయదేవ)
జి మధురమధుర మీ చల్లనిరేయి... (విప్రనారాయణ)
జి నీసరి మనోహరి జగాన కానలేనురా... (బభ్రువాహన)
జి నీవు నేను కలిసిననాడే ... (శకుంతల)
జి సరసన నీవుంటే జాబిలి ... (శకుంతల)
ఇలా ఉదహరిస్తూ పోతుంటే జాబితా సముద్రమంతవుతుంది. ఈ గీతాలన్ని పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలలోనివి కావడం గమనించవచ్చు. యుగళగీతాలు, ‘సోలో’లు, ప్రేమపరాగాన్ని అందించిన మధురరసాలు.
నిజానికి ఈ అంశమే ఓ ప్రత్యేక అధ్యయనవిషయమవుతుంది....
13. విషాదమాధుర్యాల - సముద్రాల :
మాధురీ గుణం - నవరసాలను ఆశ్రయించి వుంటుంది. తీపి అనేది చక్కర, తేనె మొ॥ వస్తువుల్లో వున్నట్లు..
విషాదగీతాలను రాసేప్పుడూ, తదనుగుణమైన అనుభూతి లోతుల్లోకి వెళ్ళాల్సి వుంటుంది. పాత్రల మనోవేదనను అనుభవంలోకి తెచ్చుకొంటేనే పాట పల్లవిస్తుంది. సముద్రాల వారి విషాదగీతాలు, హృదయాలను కదలిస్తాయి. అంతేకాదు, ఆయా పాత్రలను సాక్షాత్కరింపజేసి, సానుభూతి కలిగించేలా చేస్తాయి.
‘లైలామజ్నూ’, ‘దేవదాసు’, ‘అనార్కలి’, ‘బాటసారి’ మొ॥ విషాదాంత చిత్రాల్లోకి పాటలు యిందుకు ఉదాహరణలు. ప్రత్యేకించి ఉటంకించాలంటే
చెలియ లేదు చెలిమి లేదు... (దేవదాసు)
కలయిదని నిజమిదని... (దేవదాసు)
ఓ బాటసారి నను మరువకోయి... (బాటసారి)
దేవా! దీనబాంధవా!... (పాండవవనవాసం)
విషాదాలే కాదు వినోదాలు, హాస్యగీతాలు కూడా సముద్రాల వారి కలం నుండి జాలువారాయి. భావకవిత్వంలోని సినీసాహిత్యంలోకి వ్యాపింపజేయటమేకాదు, ఆ కొమ్మలకు కొత్తపూలను పూయించిన ఖ్యాతి నిస్సందేహంగా సముద్రాలగారిదే! రసపోషణ - సముద్రాల వారి పాటలకు కావ్యగౌరవాన్ని తెచ్చిపెట్టింది.
14. సముద్రాలవారి వస్తువైవిధ్యం - భాషా ప్రయోగం :
సముద్రాలగారి కవిత్వతత్వంలో మరో అంశం వస్తువైవిధ్యం. వస్తువుకు తగినట్లు భాష, శైలి... వీరి పాటల్లో కన్పిస్తుంది.
జీవితానికి సంబంధించిన అన్ని కోణాలను, చిత్రించిన ఖ్యాతి సముద్రాల గారిది. జీవితానికి, ప్రేమ పునాదియైతే త్యాగం గోపురం. ఈ విలువలతో జీవనయానం సాగాలని మన సంస్కృతి ప్రపంచానికి చాటి చెపుతుంది. ఈ జీవన సూత్రాన్ని పూలలో దారంలా సముద్రాలవారు తమ పాటలలో అక్షరనిక్షిప్తం చేశారు.
ఉదా :- 1. ప్రేమమయ మీ జీవితం
త్యాగమయమీ జగము... (సుమంగళి) అని సమీకరించారు.
అలాగే
2. జీవితమే సఫలము ప్రేమసుధా భరితము... (అనార్కలి)
అని వక్కాణించారు.
3. ప్రేమేనేరమౌనా? నాపై ఈ పగేల?...
4. హాsTÖ హాsTÖ ఈ జీవితమే హాsTÖ... (లైలామజ్నూ)
అని జీవనవృక్షానికి ప్రేమ మÖలధాతువని చెప్పారు.
జీవనతత్త్వాన్ని, వేదాంతాన్ని, తర్కాన్ని వాదసంవాదాల రూపంలో చిత్రించిన సముద్రాల బ్రతుకంతా ప్రశ్నలమయంగా చేసుకోవద్దని హెచ్చరిస్తూ చెప్పిన విధానం అందరికీ చేరుతుంది.
ఉదా :-
జి కనులకుదోచీ చేతికందని ఎండమావులున్నై ... (‘బాటసారి’)
జి జగమే మాయ - బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా... (‘దేవదాసు’)
జి ఇదేనా - ఇంతేనా - జీవిత సారమింతేనా?... (యోగి వేమన)
జి వింత లోకమయా... (స్త్రీ జీవితం)
మనిషి పుట్టింది మొదలు గిట్టే వరకు, సాగించే జీవనదశలైన, పెళ్ళి, సీమతం, బారసాల తదితర ఘట్టాలపై పాటలు రాశారు.
ఇల్లు, ఇల్లాలు, తల్లి, తండ్రి, తాత - పసిపాప : మామాకోడళ్ళు, బావామరదళ్ళు, అన్నాచెల్లెలు, అక్కాతమ్ముడు... ఇలా కుటుంబ బంధాలు, అనుబంధాల గురించి సముద్రాలవారి కలం కమనీయ గీతాల నందించింది.
15. పౌరాణిక వస్తువుపై సముద్రాలవారి ప్రజ్ఞ :
సముద్రాలవారు బహుపురాణాలను చదివినవారు. వేదవేదాంగాలను, కావ్యప్రబంధాలను అధ్యయనం చేశారు. ఈ విజ్ఞానం, పౌరాణిక చిత్రాల రచనకు ఎంతో దోహదం చేసింది.
వివిధ దేవతలు, వారి మహిమల గురించి ఎన్నో పాటలు రాశారు.
ఉదా :- ‘దేవా దీనబాంధవా...’ (పాండవవనవాసం) పాట. నిండు సభలో, దుశ్శాసనాదులు, వలువలు తొలగించినపుడు, నిస్సహాయస్థితిలో ద్రౌపది, శ్రీకృష్ణుని మహిమలు కొనియాడుతూ దీనంగా పాడుతుంది. ఇంతమందిని కాపాడావు... నీ చెల్లెలి మానం పోతుంటే కాపాడవా? అని ఆర్తితో కూడిన తర్కం, వాదన ధ్వనింపజేశారు సముద్రాల...
16. ప్రతి వస్తువు - కవితా వసంతం :
‘కుక్కపిల్ల, అగ్గిపిల్ల’ మొ॥ ప్రతివస్తువు కవితకు అర్హమైనదేనని శ్రీశ్రీ తీర్మానించారు. అది నిజమేనని సముద్రాలవారు సినిమాల్లో నిరూపించారు. వీర, శృంగార, భయ, రౌద్ర, విస్మయ, హాస్యాది నవరసాలను పోషించారు.
ఉదా :- ధనము (సంతోషము), దైవము (ఎన్నో వున్నాయి), మగువ (విప్రనారాయణలో ఆడది అంటే భయం...), మదిర - పిల్లి (చండీరాణి), సైకిల్ (దేవత), u£మ్మ (సువర్ణసుందరి), చెప్పులు (జీవన్ముక్తి), డిన్నర్ పాట (భాగ్యలక్క్ష్మి), నాన్-వెజిటీరియన్ (దొంగరాముడు), ఇంగ్లీష్ పాఠం (సొంతవూరు), బదిలీ (చరణదాసి), అవతారవర్ణన, (రాముడు, కృష్ణుడు, శివుడు మొ॥) విధి, జీవితం, ప్రేమ. ఇలా ప్రతివిస్తువుపై కొత్తకోణంలో పాటను మలచారు.
విభిన్న ప్రక్రియల రసవంతం :
ప్రక్రియాపరంగా హరి కథలు, బుర్రకథలు, యక్షగానాలు, వీధి భాగవతాలను, చలనచిత్రాలలో ప్రవేశపెట్టిన ఖ్యాతి సముద్రాలవారిదే. విజయావారి సినిమాలలో తొలి హరికథ అని పరిశోధకులు తేల్చారు. (తెలుగు సినిమా పాట - రచన పైడిపాల - పుట 171)
తెలుగు గేయసాహిత్యంలో బుర్రకథ - ప్రక్రియకు మÖలం జానపద వీరగాథలు. షేక్‌నాజర్ బృందం మొ॥ కళాకారుల వల్ల స్వాతంత్య్రోద్యమ కాలంలో బుర్రకథగా పరిఢవిల్లి ప్రాచుర్యంలోకి వచ్చింది.
‘మనదేశం’ (1949) చిత్రంలో సముద్రాల వారు u£బ్బిలివీరుల యితివృత్తంతో బుర్రకథను రాశారు. ఈ బుర్రకథను హీరోయిన్ కృష్ణవేణి, లక్క్ష్మీకాంతమ్మ, సురభి బాలసరస్వతి పై చిత్రించారు. వాహిని వారి ‘స్వర్గసీమ’ (1945) చిత్రంలో ‘మోహినీ రుక్మాంగద’ - వీధి భాగవతం ప్రక్రియలో మýచారు. ఇలా విభిన్న జానపద కళారూపాలను, రచించి తన బహుముఖ ప్రజ్ఞను చాటారు.
ఇది జానపదాలకే పరిమితం కాలేదు - సంప్రదాయ సాహిత్యానికి మరింత విస్తరించింది. కృతి, సంకీర్తన, కీర్తన, జావళి మొ॥ రూపాలలో ‘సముద్రాల’ వారి పాట అనేక పోకడలు పోయింది. వారు రాసిన కొన్ని పాటల్లో వాగ్గేయకారుల ....., సంకీర్తనల లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు గమనించండి:-
పావన గుణరామా - హరే... (భక్త పోతన)
శ్రీకరంబైనట్టి శ్రీకృష్ణ తులసి... (త్యాగయ్య)
తెరతీయగ రాదా... (పల్నాటియుద్ధం)
నీదయరాదా.. నిరుపమరామా... (భక్త పోతన)
అలాగే ‘జావళి’ అనగానే దాసు శ్రీరాములు (1846-1908) స్ఫురణలోకి వస్తారు. వీరి ప్రభావము సముద్రాలపై కన్పిస్తుంది. ఇది వారి భావుకతలోనే కాని భాషా విషయంలో మాత్రం కాదు.
వాహిని, భరణీ, అంజలి, వినోదా వారి చిత్రాలలో జావళీలు, పదాలు ఎక్కువ వుండేవి.
ఉదా :-
నను విడనాడకురా... (విప్రనారాయణ)
దీనికి ‘నను విడనాడుట న్యాయమా’ - అన్న దాసు శ్రీరాములు గారి జావళి పోలిక కన్పిస్తుంది.
జావళి, శృంగార సంబంధిగా రూపొందించబడుతుంది. అలాంటి మరికొన్నింటికి ఉదాహరణలు :
రారా శతకోటి మన్మథాకార... (భక్త పోతన)
రారా సుందరా రసతీరాల తేలింతు... (భామా విజయం)
రావేల స్వామి ఈవేళ... (భక్త జయదేవ)
సరసాల జవరాలను... (సీతారామకల్యాణం)
కనరా మునిశేఖరా... (శకుంతý)
నరవరా ఓ కురువరా... (నర్తనశాల)
రారా ప్రియాసుందరా... (భక్త ప్రహ్లాద)
జావళియైనా, జానపదమైనా - ప్రక్రియ ఏదైనప్పటికి భాషా ప్రయోగాల విషయంలో, పదాల పోహళింపులో, సముద్రాలవారి శైలి రమణీయంగా, నిరంతరం కొత్త దారుల వెతుక్కొని సాగే స్రవంతిలా కన్పిస్తుంది.
‘ఆటలాడదు వదిన...’ (భక్త పోతన), ‘పూలోయమ్మపూలు...’ (జీవన్ముక్తి), ‘మావారు వచ్చేవేళయింది...’, ‘తిన్నెమీద సిన్నోడ...’ (భాగ్యలక్క్ష్మి), ‘వస్తాడే మాబావ...’ (సుమంగళి) - పాటల్లోని సొగసు ఆ రసస్రవంతిలోని కొన్ని పాయలకు ఉదాహరణే కదా!
18. సముద్రాలవారి తెలుగు పదకోశం :
సముద్రాలవారి పాటల్లో ఎన్నో అరుదైన తెలుగు పదాలు, ఆణిముత్యాల వలె కన్పిస్తాయి. సందర్భానుసారంగా ఆయా చిత్రగీతాలను వ్యాఖ్యానించినపుడు, ఆ పదాలను తెలుసుకోవచ్చు. అయితే స్థూలంగా కొన్ని ఉదాహరణలు గనించండి!
తరిపి వెన్నెల (మబ్బుపట్టిన వెన్నెల), బాళీ (కాంక్ష, వాంఛ), మోడి (బింకం), మిటారి (విలాసిని), చలము (పట్టుదల), మొయిలురాజు (చంద్రుడు), అత్తలం (ఈటె, బల్లెం), ఆళ్వారు (హరిభక్తుడు), ఇసుము (ఇసుక), ఈవి (దానం), ఈవు (నీను), ఎలనవ్వు (చిరునవ్వు), ఎలమి (ఆనందం), ఒడిసెల (పొలంలో పిట్టలను తోలటానికి రాళ్ళు విసరటానికి వుపయోగించే తాళ్ళతో తయారు చేసిన చిక్కం), ఒడ్డోలగం (నిండుకొలువు), సాహిణి (గుర్రము నడిపేవాడు), లంగరు - (ఓడనిలిపే సాధనం) - మొ॥నవి.
ఇవేగాక ‘బడాయి’, ‘లడాయి’, ‘బజారు’, ‘కైజారు’, ‘మజా’, ‘ఖుషీ’ వంటి అన్యదేశ్య పదాలెన్నో ప్రయోగించారు.
సముద్రాలవారిపై మబ్బుచాటు లేత ఎండగా పింగళి వారి ముద్ర కొంతపడింది. ‘పాండవ వనవాసం’ చిత్రంలో దుర్యోధనాదుల భాష, ‘తెనాలి రామకృష్ణ’లో శ్రోత్రియభాష - ఇది రుజువు చేస్తుంది. ‘తెనాలి రామకృష్ణ’, ‘విప్రనారాయణ’లో వైష్ణవ పరిభాష (అన్నిన్నీ కూడానున్నూ...) కూడా కన్పిస్తుంది. అలాగే సముద్రాలవారి పదప్రయోగాలను పింగళివారూ వాడారు.
సముద్రాలవారికి సినీరచన గురించి కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలుండేవి. “సినిమాల్లో జనసామాన్యానికి అర్థంకాని పద్యాలను, పదాలను ్పు£ప్పించడంలో అర్థం లేదు” అని భావించేవారు.
“పురాణాల్లో లేని విషయాన్ని డ్రామా కోసం పాత్రల ఔచిత్యానికి భంగం కలుగనీయకుండా చెబితే తప్పులేదు.” అని, చెప్పుకునేవారు.
సముద్రాలవారు ఎరుగని పుస్తకం గాని, పఠించని పురాణం గాని, కంఠస్థం చెయ్యని కావ్యం గాని లేవు. ఆ రోజుల్లో వారిని నడిచే సాహితీ గ్రంథాలయంగా చెప్పుకొనేవారు. బహుగ్రంథ పఠనం, అధ్యయన నేపథ్యం, ఉన్నవారు, కాలంతో పాటు ప్రవహిస్తూ, కొత్త మార్పులు స్వీకరిస్తే ఆయా రచనలు అజరామరంగా వుంటాయి - అని చెప్పడానికి సముద్రాలవారే నిదర్శనం.
సంప్రదాయాన్ని అనుసరిస్తూనే, ప్రయోగాలు చేస్తూ సమకాలీనతను, సార్వకాలీనతను ప్రతిబింబించే విలువలు గల సాహిత్యాన్ని సృష్టించిన సముద్రాల రాఘవచార్యులుగారు, నిజంగా “సినీ కవి కులపతి”...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి