‘విద్యను ఆర్జించటం అంటే ఇది - విషయ జ్ఞానాన్ని పొందటం అంటే ఇది’ - అని తెలియజేస్తూ పరిశోధన పరిధులను విస్తృతం చేసి, జ్ఞాన పరిధి ఇదీ అని తెలియజేసిన అరుదైన మÖర్తిమత్వం డాక్టర్ కపిలవాయి లింగమÖర్తి గారిది. వారి అధ్యయన పరిధి, అభివ్యక్తి పరిధి - మాటలకందని విశాలమైనది. కవిగా, రచయితగా, సాహితీ చరిత్ర పరిశోధకులుగా, జ్యోతిష బ్రహ్మగా, నిఘంటు నిర్మాణ కర్తగా ప్రసిద్ధి చెందిన వీరు అంతకుమించి గొప్ప ఆధ్యాత్మిక వేత్త కూడా. వ్యక్తి జీవితంలో ఎన్ని అంశాలు ఉంటాయో అన్ని అంశాలను స్పృశించిన, సమాజంలో ఎన్ని కోణాలు ఉంటాయో, అన్ని కోణాలను దర్శించిన, సామాజిక సాహితీ పరిశోధకులు వారు.
జీవాత్మ పరమాత్మ తత్వాన్ని, జననానికి ముందు, మరణం తరువాత, జీవుని ప్రయాణం, విశ్వ ప్రయాణం, సృష్టి మÖలం - తదితర అంశాలను తెలియజేస్తూ వారు రచించిన ‘జీవుడు-దేవుడు’ మనకు ఒక కొత్త జ్ఞానాన్ని అందిస్తుంది. మనం అంటే ఏమిటో నేను అంటే ఏమిటో భగవంతుడు అంటే ఏమిటో తెలియజేస్తుంది ఈ ఒక్క గ్రంథాన్ని పరిశీలిస్తే చాలు మన పురాణ ఇతిహాస తాత్త్విక నేపథ్యం అంతా మనకు బోధపడుతుంది.
‘విశ్వమీమాంస’ అనే వ్యాసంలో విశ్వసృష్టి గురించి సామాన్య మానవునికి అర్థమయ్యేలా, వీరు వివరించిన తీరుని పరిశీలిస్తే ‘అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు’ అన్న జాతీయానికి ఒక ఉదాహరణగా ఉంటుంది.
శ్లో. న భూమి న జలం చైవ న తేజో నచ వాయవః
న చ బ్రహ్మా, నచం విష్ణు నచం నక్షత్ర తారకాః
సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణః (పుట 1)
అని విశ్వకర్మ పురాణం చెబుతుంది ఈ సృష్టికి మొదట విశ్వంలో ఈ పంచభూతాలు గాని, సూర్య చంద్రాది గ్రహాలు కాని, బ్రహ్మ విష్ణు త్రిమÖర్తులు గాని ఎవ్వరు లేరు. సర్వశూన్యం మరియు నిరారంబమైన శూన్యం ఒకటే ఉన్నదని, ఆ శూన్యంలో స్వయంభువైన విశ్వకర్మ ఒక్కడు మాత్రమే ఉన్నాడని ఆయన అంటారు. ఈ శూన్యం నుండే విశ్వంలోని బ్రహ్మాండాలు ఆవిర్భవించి వానిలో జీవసృష్టి ప్రారంభమైంది. ‘విశ్వం విష్ణుః వషట్కారో’ అన్నప్పుడు విష్ణువు కంటికి కనిపించని అణోరణీయాన్ - అణువులో అణువైన సూక్ష్మ రూపంలో అణిగి విస్తరించి పాలలో నేయి వలె ఉన్నాడు అని వీరు వ్యాఖ్యానిస్తారు.
సప్తవర్ణాలు శ్వేతము నుండి పుట్టినట్లు, తల్లి కడుపులో పిండం ఏర్పడే ముందు, మొదట అక్కడ ఏమీ లేదని, మావి అనే కోశంలో కేవలం ఉమ్మనీరు మాత్రమే ఉందంటారు. ఇది ఒక్క మానవ జన్మకే కాదు విరాట్ పురుషుని స్థితి కూడా. ప్రళయం తరువాత సృష్టిలో ఎక్కడ చూసినా నీరే ఉందని, ఆ నీటి నుండే శ్రీ మహా విష్ణువు పుట్టాడని, అందుకే నారాయణుడు అనే పేరు ఏర్పడిందని అన్నారు. విశ్వంలో కనిపించని జీవాణువులే క్రమంగా ఘనీభవించినప్పుడు పాలపుంతలు ఏర్పడి బ్రహ్మాండాలవుతున్నాయి. అనంతకోటి బ్రహ్మాండాలకు శ్రీమన్నారాయణుడే నాయకుడనీ, మనం పురుష సూక్తంలో స్తుతి చేస్తామని కపిలవాయి గారు సూచిస్తారు.
‘తల్లి కడుపులో పిండం పూర్తయి, మావిని ఛేదించుకొని శిశువు బయటికి వచ్చినట్లు, రోదసిలో గ్రహాలు విస్ఫోటంతో పగిలి, ఆ గ్రహ శకలాలు రోదసిలో చెల్లాచెదరవుతాయి. అప్పుడు వానికొక పరిధి ఏర్పడుతుంది.ఆ పరిధికే బ్రహ్మాండమని పేరు. సూర్యుడు అలా ఏర్పడినవాడే. ఆ సూర్యుని శకలాలే నవగ్రహాలు’ (పుట 5-6). ఇలా విశ్వాన్ని తల్లి గర్భంతో పోలుస్తూ సృష్టి రహస్యాలను తెలియజేశారు. భూమి సూర్యుడి నుండి వేరైన తరువాత నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఏర్పడ్డాయని, దశావతార సిద్ధాంతాన్ని అనుసరించి జలచరాలు, ఉభయచరాలు, వనచరాలు, నరుడు - ఈ విధంగా సాగిందన్నారు. స్థావర జంగమాల గురించి ఏకదళ, ద్విదళ బీజాలను - సృష్టికి అన్వయం చేసి చూపారు. ‘ఏకో నారాయణ హరిః’ అన్నట్లుగా అంతా అఖండమే అంటారు ఆయన. ‘శ్రీయన గౌరీనాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయిత మÖర్తియై హరిహరంబగు రూపము దాల్చి’ (విరా. ప్ర. - 1) అన్న తిక్కన మాటలతో - ప్రకృతి, పురుషుల సమ్మేళనంతో సృష్టి రహస్యాన్ని తెలిపారు కపిలవాయి గారు.
“తల్లి కడుపులో ఉన్నప్పుడు చేప, పక్షి, కుందేలు, మనిషి యొక్క ప్రారంభ దశలో మానవ శిశువు నాలుగవ నెల వరకు ఎట్టి రూపంలో ఉంటాయో అన్ని అదే తీరుగా ఉండి, ఆ తరువాత తమ తమ విభిన్నత్వాన్ని సంతరించుకుంటవి. కాబట్టి దాన్ని బట్టి మనకు దశావతారతత్వం ఈ పిండ దశల్లో లీలగా దర్శనమిస్తుంది. అవతారాలలో మనకు నాలుగవదైన నరసింహ అవతారం నుండియే జీవునికి జంతు దశ నుండి మానవునిగా పరివర్తన చెందడానికి పునాది పడింది. మన వారి సాంఖ్యం ప్రకారం జీవులు మొత్తం స్థావరాలు21 లక్షలు, జల జంతువులు 9లక్షలు, క్రిములు 11 లక్షలు,పక్షులు 10 లక్షలు,గోజాతి 30 లక్షలు, మానవులు 4 లక్షలు.
శ్లో. స్థావరో లక్ష వింశశ్చ జలేజః నవ లక్షకః
క్రిమీణాం రుద్ర సంఖ్యశ్చ పక్షీణాం దశ లక్షకమ్
త్రింశల్లక్ష గవాణాంచ చాతుర్లక్షంతు మానవాః
ఎనుబది నాలుగు లక్షలు వానిలో ఇరువదిలక్షలు స్థావరాలు పోగా మిగిలిన 64 లక్షలలో నాలుగు లక్షలు మనుష్య జాతియే కనుక ఈ నాలుగు లక్షల మనుష్య జాతికి తక్కిన అరువది లక్షల జీవులు వారసులే అవుతుంటవి. కాబట్టి వాని లక్షణాలు మనుష్య జాతి పుట్టి ఇప్పటికి కొన్ని కోట్ల సంవత్సరాలు అయినా ఇంకా పూర్ణ మానవుడు పుట్టనే లేదు. ఆకారంలోనైతే నేమి వికారంలోనైతే నేమి, గుణంలోనైతే నేమి, ఇప్పటికీ మనుష్యునికి కోతి ముఖం, కొంగమెడ, గాడిద కాళ్లు అని, వికారంలోనూ చేపకన్నులు, సింహం నడుము, తాబేలు పాదాలు, అని అందులోనూ పిల్లిశీలం, కుక్క బుద్ధి, పాము పగ అని గుణ విషయంలోనూ అతనికి ఇంకా జంతువుల పోలిక తప్పటమే లేదు. భారతీయులకు పరమశివుడు మొదటి దైవం అతనిది అంతా అనాగరికమైన అరణ్యక సంస్కృతి. అతని సైన్యమైన ప్రమథులంతా వివిధమైన జంతు రూపాలు గానే వర్ణింప బడుతుంటారు వారి ముఖ వికారాలు గాని కంఠ ధ్వనులు గాని అన్ని జంతు వికారాలు గానే ఉంటవి.” (పుట 18)
ప్రమథుల గురించి విచారిస్తూ, మానవులకు జంతుసంతతి- జంతువులకు మానవ శిశువుల జననం గురించి తెలిపారు (పుట 19-30). ఆధునిక కాలంలోని సంఘటనలతో సోదాహరణంగా వివరించిన తీరు, ఆయన వైజ్ఞానిక దృష్టిని తెలియజేస్తుంది. అంతేకాక, మానవులకు జంతువులకు ఉన్న పరస్పర సంబంధాన్ని, వాటి సహకార స్వభావాన్ని, అతీంద్రియ జ్ఞానాన్ని వివరిస్తూ (పుట 31-32) సమాజంలో జరిగిన సంఘటనలతో అన్వయం చేసి తెలిపారు. వీరి అభిప్రాయాలు - సర్వప్రాణులు ఒక్కటే, సర్వప్రాణులలో ఉన్న పరమాత్మ ఒక్కటే అన్న భావాన్ని మరింత గాఢంగా తెలియజేస్తాయి.
‘కృత్రిమ గర్భధారణ’ వ్యాసంలో వారు చేసిన చర్చ, మన పూర్వీకులు, శాస్త్రజ్ఞులకన్నా, ఏవిధంగా ముందు ఉన్నారో తెలియజేస్తుంది. “స్త్రీ గర్భంలో అండము యొక్క ఫలదీకరణానికి పురుష శుక్లాణువులే కానక్కరలేదు మానవ దేహంలోని ఏ ఒక్క జీవ కణమైనా చాలు దానితో అండం ఫలదీకరణ చెంది పూర్ణ రూపం ఏర్పడుతుందని ఆధునిక శాస్త్రజ్ఞులు తెలిపిన విషయాన్ని, వీరు పురాణ విషయంతో సమన్వయం చేశారు. ‘అంగాత్ అంగాత్ సంభవసి’ ఈ శరీరం చేత మరొక శరీరం కూడా పుడుతుంది. అయితే అది సంభోగం చేతనే కాక ‘దీపంబుచేత ఒండొక దీపము ప్రభవించినట్లు’దీపానికి ఏవైపు నుండి ముట్టించినా రెండవ దీపం వెలిగినట్లు ఈ శరీరంలోని ఏ ఒక్క అణువు చేతనైన రెండవ శరీరం పుడుతుంది” (పుట 46) అనే విషయం - మనవారికి ఆనాడే అవగతమైందని వారు అంటారు. “భాగవతంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ‘ఏడిరా నీ హరి’ అని గద్దించినప్పుడు అతడు -
‘హరిమయము విశ్వమంతయు
హరి విశ్వమయుండు సంశయముతో పనిలేదు
ఎందెందు వెదకి చూచిన అందందే కలడు’ - అని బదులు చెప్పినాడు
ఆ శ్రీహరి ఈ విశ్వంలో ముళ్ళు గుచ్చ సందు లేకుండా ఎట్లా నిండి ఉన్నాడో, అట్లాగే ఈ దేహంలో జీవుడు కూడా సూది మొన గుచ్చ సందు లేకుండా నిండి ఉన్నాడు. మన దేహంలో సూది మొన ఎన్నవ వంతు కానీ దానితో మీరే శరీరాన్ని ఎక్కడైనా కుచ్చండి. అబ్బా! నేను ఇక్కడనే ఉన్నాను అంటాడు. కనుక మానవ శరీరంలోని కన్ను, ముక్కు, చెవి, నాలుక, కాలు, వేలు, ఎక్కడినుండి అయినా ఆ జీవాణువుని మన శరీరం నుండి తీసుకొని వచ్చును”. అని శాస్త్రజ్ఞులు భావించి ప్రయోగాలు మొదలు పెట్టారు (పుట 46-47). విదేశీయులు చేసిన, చేసే ప్రయోగాలకు మన భారతీయ ఆలోచన ధారే ఆది అన్నది కపిలవాయి గారి భావన.
‘విచిత్ర జననాలు’ - అనే వ్యాసంలో కర్ణ జననం మొదలుకొని మొన్నటి వేములవాడ భీమకవి తదితరుల జననము గురించి తెలుపుతూ (పుట 50) ఇతర లోకాలలోని వారి ప్రభావం భూలోకంలోని వారిపై ఎలా ఉంటుందో సోదాహరణంగా వివరించారు. కంగారు కాన్పు, కర్కట గర్భం, పుట్టిన పిమ్మట ప్రాణం పోసికున్న శిశువు, పాప కడుపులో పాపలు, మగ పిల్లవాని కడుపులో మరో అయిదుగురు పిల్లలు, పుట్టగానే నడిచిన పాపలు, అంటుడు కవలలు, అపర ప్రద్యుమ్నులు - అనే శీర్షికలతో విభిన్న విషయాలను (పుట 50-58) చర్చించారు. ఈరోజున లోకాల మధ్య దూరం ఉంది కానీ, ఆనాడు అన్ని లోకాలకు సాధారణ రాకపోకలు ఉండేవని, పురాణ ఇతివృత్తాలు (నారదుడు, విక్రమార్కుడు మొ॥) తెలియజేస్తాయి. దత్తాత్రేయుడు, షణ్ముఖుడు, బ్రహ్మ, జరాసంధుడు - మొదలగు వారి ఇతివృత్తాలతో కవలల జననం లోని వైవిధ్యాన్ని సహేతుకంగా వివరించారు. బైబిల్ లోని సంఘటనలను కూడా, ఆధునిక కాలంలోని సంఘటనలతో (పుట 60) అన్వయం చేసి చూపారు. నేటి బాలమేధావులను, నాటి ప్రహ్లాదుడు, అభిమన్యుడు తదితరులతో పోల్చి చూపారు.వీరి వివరణ పరిశీలిస్తున్నప్పుడు కాలం, ఎంత ఆధునిక మైనా మన మÖలాలు ఇంకా మÖలాన్ని పట్టుకునే ఉన్నాయనిపిస్తుంది.
“మÖకం కరోతి వాచాలం పంగులంఘయతే గిరిం
యత్కృ పాతమహం వందే పరమానంద మాధవమ్
ఎవని దయచేత మాటాడలేనివాడు మాటాడుతున్నాడో, నిస్సత్తువ కలిగిన కాలితో గుట్టలెక్కగలుగుతున్నాడో అట్టి వానికి నమస్కారము. (పుట 81-82) అంగ వైకల్యం కలిగిన వారందరూ ప్రత్యేక నైపుణ్యాలతో వెలుగొందుతున్నారంటే, ఆ పరమాత్మే కారణం. ధ్యానం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకోవడం, మరణించిన తరువాత తిరిగి బ్రతకడం, తల తెగిన తరువాత కూడా ప్రాణంతో ఉంటడం, తల్లి మరణించినా గర్భస్థ శిశువు జన్మించడం - మొదలైన వాటిని ప్రాచీన విషయ సమ్మేళనంతో (పుట 98-105) వివరించిన తీరు, వారి జ్ఞాన విస్తృతికి తార్కాణం.
అపర కర్మల ప్రస్తావన చేస్తూ, దేవతార్చన ఎంత ముఖ్యమో పితృ దేవతారాధన కూడా అంతే ముఖ్యమని, దేవతార్చనలో సడలింపు ఉందేమో కాని, పితృదేవతల శ్రాద్ధ కర్మలో మినహాయింపు లేదని (పుట 154) తెలిపారు. మన గత జన్మలు, వర్తమాన జన్మలు, రాబోవు జన్మలు - ఇవన్నీ అన్యోన్య సంబంధాలు కాబట్టి ప్రతి దశలోనూ, మనం బాధ్యతాయుతంగా ఉండాలన్నది వారి అభిప్రాయం. ఎప్పటి కప్పుడు ఆధునిక ఘటనలతో సమన్వయం చేసి చూపడం - వారి విశాలమైన పరిశోధన దృష్టికి, గాఢమైన పరిశోధక దృష్టికి చక్కటి ఉదాహరణలు. దైవప్రసాదాలు, తీర్థాలు పవిత్ర భావంతో చేసినప్పుడు అవి ప్రేతలకు ప్రేతవిముక్తి కలిగిస్తుంది. ఆముక్త మాల్యదలో-దాసరి ఒకనాడు పాడిన పాటతో అక్కడ ఉన్న బ్రహ్మరాక్షసునికి ఆ జన్మ విముక్తి కలిగింది. కాబట్టి, శ్రద్ధాభక్తులతో చేసే అపరకర్మలు - దైవాభిషేకాలు, పూజలు, పురస్కారాలు వంటివి వ్యర్థం కావని తెలుస్తుంది (పుట 156). అంతే కాక - మంత్రం, యంత్రం, తంత్రం - ఇవన్నీ మనిషి ఉన్నతికే ఉపకరిస్తాయన్నది వారి భావన.
“నేను దీనిలోని విషయాలు దాదాపు 40 సంవత్సరాల నుండి పత్రికలు వ్యక్తులు వివిధ మాధ్యమాల ద్వారా సేకరించి పెట్టుకున్నాను. ఆ విషయాలన్నీ సమన్వయం చేస్తూ గ్రంథరూపం ఇచ్చినాను. నా దృష్టికి రాని ఇలాంటి వింత విషయాలు సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. వాటినన్నిటిని సేకరించి పురాణాలలోని విషయాలతో సమన్వయం చేస్తే ఒక బృహత్ గ్రంథమే అవుతుంది. ఇది నేను చేసిన ఒక చిన్న ప్రయత్నం. పాఠకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను.” (పుట 156) అనే భావనతో, కపిలవాయి లింగమÖర్తి గారు, తమ జీవితకాలంలో ఏ చిన్న అనుభవాన్ని, కూడా చిన్నదిగా చూడకుండా ప్రతి ఘటనలోని అనల్పార్థాన్ని, పారమార్థికతను, అనేక జీవుల సామరస్యాన్ని పరిశీలించి, పరిశోధించి మనకందించిన తీరు అనన్య సామాన్యం. మనమందరం - వీరు నిర్దేశించిన బాటలో ప్రయాణం చేస్తే, పరాయి సంపదైపోయిన మన భారతీయ జ్ఞాన స్రవంతి (Iఅdఱaఅ ఖఅశీwశ్రీవdస్త్రవ Systవఎ)ని పూర్తిగా అందుకుంటాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి