తెలుగు సినిమా ప్రస్థానంలో నర్తకిగా మరపురాని నృత్యాలెన్నింటినో చేసి ప్రేక్షక మహాజనుల చేత వహ్వా అనిపించుకున్న మేటి నర్తకి కుచల కుమారి. ‘సరసాల జవరాలను...’ (సీతారామకల్యాణం), ‘కొమ్ములు తిరిగిన మగవారూ...’ (భట్టి విక్రమార్క), ‘నెలనడిమి వెన్నెల రేయి...’ (జయసింహ), ‘రంగరంగేళి...’ (భార్యాభర్తలు) వంటి వందలాది అపురూప గీతాలకు మరపురాని నృత్యాలు చేసి ఈనాటికి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కుచలకుమారి జ్ఞాపకాలు ఈ వారం...
మా స్వస్థలం తంజావూరు. ‘సంగీతం కుచలాంబాల’ అంటే ఆ రోజుల్లో ఎరుగని వారు చాలా తక్కువ మంది. ఒక్క తంజావూరు నగరంలోనే కాకుండాదక్షిణా పథమంతటా కూడా ఆమె పేరు ఇంతో అంతో కళాశక్తి గల వారికి పరిచితమే. ఆమెకు ఐదుగురు అమ్మాయిలు. అందులో పెద్దమ్మాయి సరస్వతి. ఆమె కూతురే నేను. మా అమ్మ సోదరీమణులలో ఒకరు సుప్రసిద్ధ నటి. టి.ఆర్.రాజకుమారి. జెమినీ వారి “చంద్రలేఖ”, “మనోహర” చిత్రాల్లో ఆమె టాప్ హీరోయిన్. మా ఇంట్లో అందరూ సినిమా రంగంలో పనిచేసిన వారే. మా పిన్ని మాట అలా ఉంచితే మా అమ్మ కూడా సినిమా నటే. ఆమె 1935 లోనే సినిమారంగంలోకి వచ్చింది. “పార్వతీ కల్యాణం”, “వికటయోగి”, “గంగావతరణ’, “మణి మేఖలై” మొదలైన సినిమాల్లో నటించింది. మా మేనమామ టి.ఆర్. రామన్న. ఈయన తెలుగు, తమిళ భాషల్లో పెద్ద నిర్మాత. తెలుగులో “కార్తవరాయని కథ”, “ఇంటికి దీపం ఇల్లాలే”, “మంచి చెడు” వంటి పెద్ద చిత్రాల్ని నిర్మించారు. ఆయనకు ముగ్గురు భార్యలు. వాళ్లలో ఇద్దరు సుప్రసిద్ధ కథానాయికలు. బి.ఎస్. సరోజ, ఇ.వి. సరోజ. సరోజ తమిళంలో పెద్ద హీరయిన్. ఇ.వి. సరోజ తెలుగులో కూడా చాలా చిత్రాల్లో నృత్యాలు చేసింది. “ఇంటికి దీపం ఇల్లాలు”, “ఇద్దరు మిత్రులు” వంటి చిత్రాల్లో కథానాయిక వేషాలు వేసింది. ఇక తెలుగు, తమిళ భాషల్లో ఆనాటి కుర్రకారును హుషారు పరచిన శృంగార నర్తకీమణులు జ్యోతిలక్ష్మి, జయమాలిని, ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు నా కజిన్ సిస్టర్స్. ఇదీ మా కుటుంబ నేపథ్యం.
మా అమ్మ అనేక తమిళ చిత్రాల్లో నటించింది కానీ ఎందువల్లనో తారాపథం ఆమెకుర అందని మ్రావి పండయ్యింది. దాంతో ఆమె తిరిగి తంజావూరు వెళ్లిపోయింది. అక్కడే నేను 06-12-1937 లో జన్మించాను. నేను పుట్టిన తర్వాత బ్రతుకు తెరువు కోసం మా అమ్మ మళ్లీ మద్రాసు వచ్చింది. నాకు ఒక తమ్ముడు. పేరు శేఖర్. అతను ఓ వాచీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నేను అతని దగ్గరే ఉంటున్నాను. నా ముద్దుపేరు కుచిలీ, గుజిలీ. ఇప్పటికీ తెలిసిన వాళ్లు నన్ను అలాగే పిలుస్తారు. నా ఏడవ ఏటనే మా అమ్మ వళ్ళువుర్ రామయ్య పిళ్లెí దగ్గర భరతనాట్య శిక్షణ కోసం చేర్పించింది. అప్ప్పుడే టి.నగర్‌లోని ‘విద్యోదయ’ స్కూలులో విద్యాభ్యాసం చేశాను. అక్కడ నాల్గవ ఫారం వరకూ చదివి, ఆపైన హోలీ ఏంజిల్స్ కాన్వెంటులో చదివి ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తి చేశాను.
విద్యోదయలోనే సుప్రసిద్ధ నటీమణి కాంచన, నా సహాధ్యాయి. చిన్నప్ప్పుడు కాంచన చాలా అందంగా ఉండేది. వాళ్ల అమ్మ బేబీ కాంచనకు ఆ రోజుల్లోనే లిప్‌స్టిక్, రంగురంగుల గౌన్లు, రిబ్బన్లు, షూస్ వేసి చాలా నాజూకుగా స్కూలుకు పిలుచుకొని వచ్చేది. మా అందరిలోనూ కాంచన చాలా ప్రత్యేకంగా కన్పించేది. ఆ తర్వాత నేను విద్యోదయ నుండీ హోలో ఏంజిల్స్‌కు మారడంతో మా స్నేహం కొనసాగలేదు. మళ్లీ నేను సినిమాల్లో పెద్ద నర్తకి గా ఉన్నరోజుల్లో ఒక రో జు ‘న్యూటోన్ స్టూడియో’ లో షూటింగ్‌లో ఉండగా కన్పించింది. దగ్గరకొచ్చి ‘ఏమే కుచిలీ, ఎంత పెద్ద స్టార్‌వి అయిపోయావు’ అని ముద్దు పెట్టుకొని ప్రశంసలతో ముంచెత్తింది. నేను “కాంచనా! నీవు నాకంటే అందంగా ఉన్నావు. సినిమాల్లో సిన్సియర్‌గా ప్రయత్నించు, పైకొస్తావు” అన్నాను. “ఆ... నాకెవరిస్తారు అవాకాశాలు” అని తేలికగా మాట్లాడేసి వెళ్లిపోయింది. కొన్నేళ్ల తరువాత డైరెక్టరు శ్రీధర్ దర్శకత్వంలో ‘కాదలిక్క నేరమిళ్లెí’ చిత్రంలో కథానాయికగా ఊహించని తారాపథానికి వెళ్లిపోయింది కాంచన.
అయితే కాంచన నాకు చాలా మంచి స్నేహితురాలు. మొదట్లో నాతో ఎలా ఉండేదో, తారాపథానికి వెళ్లిన రోజు, ఈ రోజూ నాతో అలాగే ఉంది. గర్వం లేదు. ఎప్ప్పుడు చెన్నెí వచ్చినా నన్ను కలవకుండా వెళ్లదు. నేనంటే తనకు ఎంతో ఇష్టం. తరచూ పుట్టపర్తిలో కలిసేవాళ్లం. ఎద్దరమÖ సాయిబాబా భక్తులమే.
నేను రామయ్య పిళ్లెí గారి దగ్గర భరతనాట్యాన్ని 1950 వరకూ క్షుణ్ణంగా నేర్చుకున్నాను. నేను ‘ఆరంగేట్రం’ ఇవ్వకుండానే నాట్యప్రదర్శనలివ్వడం ప్రారంభించాను. అది సంప్రదాయ విరుద్ధమైనా ఆ రోజుల్లో సాహసమే.
మా పిన్ని (టి.ఆర్. రాజకుమారి) అప్పట్లో తమిళంలో టాప్ హీరోయిన్ గనుక నా సినీరంగ ప్రవేశం చాలా సులువుగానే జరిగింది. మా పిన్ని నేను చాలా చిన్న పిల్లను కదా, ముద్దుగా ఉంటానని సినిమా షూటింగ్ýకు తీసుకువెళ్లేది. ఏడవ ఏటనే “మహామాయ” అనే తమిళ చిత్రంలో కన్నాంబ కూతురు పాత్ర ధరించాను. చిన్న పిల్లను కదా, మొదటి రోజు ఆ లైట్లు, కెమెరాలు ఆ హంగామా అంతా చూసి భయపడిపోయాను. కన్నాంబ నన్ను ఒళ్లోనే కూర్చోబెట్టుకొని, లాలిస్తూ, బుజ్జగిస్తూ మధ్యమధ్యలో చాక్లెట్లు, బిస్కట్లు తీసిస్తూ నా భయం పోగొట్టింది. అప్పటి నుండీ కన్నాంబ గారు నన్ను సొంత కూతురులాగే చూసుకునేది. నేను ఎంత పెద్దస్టార్‌ని అయినా ఆమె చాక్లెట్లు, బిస్కట్లు తీసివ్వడం మానలేదు. కన్నాంబ పోయిన రోజు మా అమ్మే చనిపోయినంతగా ఏడ్చాను నేను.
ఆ తర్వాత “ప్రభావతి”, “కృష్ణభక్తి”, “పెళ్లికూతురు”, “పరాశక్తి”, “వాళప్పి రందవళ”, “నన్‌బన”, “రక్తకన్నీర”, “లైలామజ్ను” వంటి అనేక తమిళ చిత్రాల్లో చాలా నృత్యాలు చేశాను. ముఖ్యంగా జెమినీ వారి “అవ్వయార” చిత్రంలో కౌమారదశలో ఉన్న ‘అవ్వయార’ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాను. ముద్దుý£లికే నా ముఖంలో ముగ్ధత్వమÖ, అప్రతిహతమైన భగవద్విశ్వాసాన్ని ఆ చిన్నతనంలోనే చాలా బాగా ప్రకటించానంటూ అప్పటి పత్రికలన్నీ నా గురించి చాలా బాగా రాశాయి. అవ్వయార్‌గా కె.బి. సుందరాంబాల్ కు ఎంత పెద్దపేరు వచ్చిందో ప్రాయంలో ఉన్న అవ్వయార్‌గా నాకూ అంతే పేరు వచ్చింది.
ఇక ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో సుమారు పదేళ్లు నా నృత్యం లేకుండా ఉండేది కాదు. తమిళంలో బాగా పేరు వచ్చిన తర్వాత బి.ఏ. సుబ్బారావు గారు “రాజు పేద” (1954) చిత్రంలో మొట్టమొదటి సారిగా అవకాశమిచ్చారు. అందులో ‘కళ్లు తెరచి కనరా’ అన్న పాటకు నేను చేసిన నృత్యం ఆంధ్రదేశాన్ని మారుమ్రోగించింది. సినిమాలో కథకు అన్వయిస్తూ చేసిన నృత్యమది. ఆ పాట విజయవంతం కావడంతో తెలుగులో కూడా నర్తకిగా వెంటవెంటనే బుక్ అయిపోయాను. 1954 నుండి 1965 వరకూ మాగ్జిమమ్ నా డాన్స్ లేకుండా తెలుగు, తమిళ చిత్రాలు ఉండేవి కావు. ప్రేక్షకులు నా పాట, నృత్యం లేకుంటే చాలా నిరాశపడుతూ ఉత్తరాలు రాసేవారు. అదో స్వర్ణయుగం.
ముఖ్యంగా ఎన్.టి.రామారావుగారి సొంత చిత్రాల్లో నాకు చాలా అవకాశాలు కల్పించారు. ఎన్.ఏ.టి. బానర్ అంటే నా డాన్సు ఉండాల్సిందే. “జయసింహ” (1955) లో ‘నెలనడిమి వెన్నెలరేయి...’, “పాండురంగ మహాత్మ్యం” (1957) లో ‘ఎక్కడోయి ముద్దుల బావ...’, “సీతారామకల్యాణం” (1961) లో ‘సరసాల జవరాలను...’ నాకు బాగా పేరు తెచ్చిన నృత్యాలు. ఎన్.టి. రామారావు గారికి నేనంటే చాలా ఇష్టం. నేను చాలా చిన్నదాన్నే అయినా “ఏమండీ! కుచలకుమారి గారూ!” అని చాలా గౌరవంగా సెట్స్ మీద సంబోధించే వారు నా నృత్యాలంటే మక్కువ ఎక్కువ. అందుకే నా డాన్స్‌లు షూటింగ్ జరుగుతున్నంత సేపు ఆయనే ట్రాలీ స్వయంగా తోసేవారు. ఆయన సోదరుడు త్రివిక్రమరావు గారు షూటింగ్ రోజుల్లో ఇంటికి వచ్చి స్వయంగా కారులో తీసుకువెళ్లే వారు. పారితోషికాలు చాలా ఖచ్చితంగా ఉండేవి ఎన్.ఏ.టి.లో.
ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు, గుమ్మడి, నేను “జయసింహ”, శత దినోత్సవాలకు ఆదోని, కడప, నంద్యాల, కర్నూలుకు వెళ్లాం. కర్నూలు అయితే వేలాదిమంది ప్రేక్షకులు మాకు నీరాజనాలు పట్టారు. వాళ్ల అభ్యర్థన మేరకు బహిరంగ వేదికపై నేను మళ్లీ ‘నెల నడిమి వెన్నెల రేయి...’ అనే పాటను అభినయించాను. అప్పటికి సంతృప్తి పడ్డారు అభిమానులు.
నాకు తెలుగులో మంచిపేరు తెచ్చిన మరో నృత్యం “దొంగరాముడు” (1955) లో ‘లేవోయి చిన్నవాడ...’ కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆ పాటను ఆంధ్ర ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. ఇక్కడ చెప్ప్పుకోవాల్సింది నా నృత్యదర్శకుల గురించి. శర్మ, వెంపటి పెదసత్యం, చిన సత్యం, పసుమర్తి కృష్ణమÖర్తి, కె.ఎస్.రెడ్డి... మొదలైన పెద్ద నృత్యదర్శకుల దగ్గర నేను పనిచేశాను. అయితే పసుమర్తి కృష్ణమÖర్తి గారి దగ్గర పనిచేయడాన్ని నేను చాలా కంఫర్టుగా ఫీలయ్యేదాన్ని. ఆయన ఆర్టిస్టులకు పూర్తి స్వేచ్ఛ నిచ్చేవారు. నాట్యంతో పాటు ఎక్స్‌ప్రెషన్‌కు చాలా ప్రాధాన్యత నిచ్చేవారు. కూచిపూడి మీద ఎక్కువ శ్రద్ధ ఆయనకు.
ఆయన నృత్య దర్శకత్వంలో “భట్టి విక్రమార్క”, “భార్యాభర్తలు” చిత్రాల్లో చాలా మంచి నృత్యాలు చేశాను. ‘కన్నెపిల్ల సొగసు చూడు మహారాజా’ అనే పాట ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపేసింది. భార్యాభర్తల్లో పసుమర్తి నా చేత చాలా నృత్య ప్రయోగాలు చేయించారు. నాదేమో ఓ సాధారణ నర్తకి పాత్ర నేనాడుతుంటే కథానాయకుడికి నాముఖంలో నాయిక (కృష్ణకుమారి) కన్పిస్తుంది. ఆమేనని నాయకుడు భ్రమించి సంతోషపడుతూంటాడు. ఆ మాయ అంతరించి పోతుంటే కలవరపడుతుంటాడు. ఆ రెండు అభినయాలు నా చేత ఏకకాలంలో పసుమర్తి గారు అభినయింపజేసేవారు.
ఇక దర్శకుల విషయానికొస్తే తమిళంలో ఎం.వి. రామన్, తెలుగులో ఎల్.వి. ప్రసాద్ గారు నాకు నచ్చిన దర్శకులు. వారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు నాకు నర్తకిగా మంచిపేరు తెచ్చిపెట్టాయి. తెలుగులో “కనకతార”, “గౌరీ మహాత్మ్యం”, “కాళహస్తి మహాత్మ్యం”, “భలేబావ”, “శ్రీకృష్ణలీలలు”, “మహాకవి కాళిదాసు” మొ॥ చిత్రాల్లో చక్కటి నృత్యాలు చేశాను. తమిళంలో జి.వరలక్ష్మి నిర్మించిన “హరిశ్చంద్ర”, కన్నాంబ గారి “దక్ష యజ్ఞం” నన్ను టాప్ డాన్సర్‌గా పరిశ్రమలో నిలబెట్టాయి.
ఇక్కడొక మాట చెప్ప్పుకోవాలి. ఎందుకనో తెలుగులో నేను ఒక నర్తకిగానే గుర్తించబడ్డాను. అయితే తమిళ నిర్మాతలు, దర్శకులు నన్ను నటిగా ప్రోత్సహించారు. ముఖ్యంగా సి.ఎస్. రావు దర్శకత్వం వహించిన “పోనమచ్చాన్ తిరుంబివందాన” అనే తమిళ చిత్రంలో శివాజీ గణేషన్ ప్రక్కన హీరోయిన్‌గా వేశాను. అలాగే మలయాళంలో ప్రేమనజీర్, నేను సీతారాములుగా “సీత” అనే చిత్రంలో నటించాం. నాకు ఆ పిక్చర్ చాలా బాగా పేరు తెచ్చింది. ప్రసిద్ధ తమిళ రచయిత ‘కల్కి’ రాసిన నవల “కళ్వనిన్ కాదలి” చిత్రంలో శివాజీగణేషన్ చెల్లెలుగా, “గూండుక్కిలి” అనే చిత్రంలో శివాజీగణేషన్ ప్రేయసిగా ముఖ్యపాత్రలు ధరించాను. “కొంజుం సలైంగై” అనే చిత్రంలో నేను సావిత్రి, కుమారి కమల ముగ్గురం కలసి హీరోయిన్‌లుగా నటించాం. అందులోనే నాకు, కమలకు చాలా మంచి పోటీ డాన్సు ఒకటుంది. ఆ నృత్యం మా ఇద్దరికీ మంచి గుర్తింపును తీసుకువచ్చింది.
నేను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మొత్తం 200 చిత్రాల్లో నృత్యాలు, పాత్రలు ధరించాను. ఆ రోజుల్లో నేను, ఇ.వి.సరోజ, రాజసులోచన, రీటా, ఎల్. విజయలక్ష్మి... ఇలా చెలా మంది నర్తకీమణులుగా ఉండేవాళ్లం. మాలో ఈర్ష్యాసూయలు ఉండేవి కావు. ఎవరి చిత్రాలు వాళ్లవి, ఎవరి డాన్సులు వాళ్లవి. ఒక్కోసారి ఇద్దరు, ముగ్గరం కలసి కూడా నృత్యాలు చేసేవాళ్లం. అలా పద్మినితో కలసి “మరుమగళ”, “కావేరి”, రాగిణితో కలసి “మాంగల్యభాగ్యం”... ఇంకా చాలా చేశాను. ఎం.జి.ఆర్.గారు నన్ను బాగా అభిమానించేవారు. “మధురై వీరన’ అనే చిత్రంలో ఆయన హీరో. అందులో నా నృత్యానికి మంచి ఆదరణ లభించింది. దాంతో ఆయన మద్రాసు నుండి మధురై వరకూ ఆ చిత్ర విజయోత్సవాలకు తీసుకువెళ్లారు. కన్నడంలో ఉదయకుమార్ గారు రెండు మÖడు అవకాశాలు ఇచ్చారు. మలయాళంలో ఊర్వశి శారదతో కలిసి “మరియ కుట్టి”, “మాణిక్య కొట్టారం”చిత్రాల్లో నటించాను. ఏ భాషలోనైనా నా మాటలు నేనే చెప్ప్పుకునే దాన్ని. నాకుర డబ్బింగ్ లేదు. నాకే కాదు ఏ నటీనటులూ డబ్బింగును ఆశ్రయించే వారు కాదు. ఏ భాషలోని డైలాగులనైనా నేను తమిళంలో రాసుకుని ఉచ్ఛరించే దాన్ని. దాని వల్ల లిప్ మÖవ్‌మెంటు కరెక్టుగా వచ్చేది.
సినిమా రంగంలో ఎంత పేరు తెచ్చుకున్నా నేను నృత్య ప్రదర్శన లివ్వడం మానలేదు. నా తొలి నృత్యప్రదర్శన తిరుపప్ప్పు±రులో ఒక వివాహ సందర్భంలో 1954 జూన్ నెలలో జరిగింది. ఆ తర్వాత నేనే సొంతంగా ఒక డాన్స్ ట్రూపు నడిపాను. అందులోనే సుకుమారి ఒక నర్తకి (‘మురారి’ చిత్రంలో మహేష్ బాబు బామ్మ). ఆమె తర్వాత్తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో పెద్ద నర్తకిగా పేరు తెచ్చుకుంది. ఆమె సినిమాల్లోకి రాకముందు నా ట్రూపులోనే డాన్సులు చేసేది. అలా నేను నా ట్రూపులో ఆంధ్ర, తమిళ ప్రాంతాల్లో సుమారు 500 నృత్యప్రదర్శనలు ఇచ్చి ఉంటాను. కర్నూలు, ఒంగోలు, నర్సరావుపేట, రాజమండ్రి మొదలైన ప్రాంతాల్లో నాకు సినిమా నర్తకిగానే గాక సంప్రదాయ నర్తకిగా చాలామంచి పేరు ఉండేది. కర్నూలులో అయితే ఒకసారి నా నృత్య ప్రదర్శనలో ప్రజల్ని నియంత్రించడం చాలా కష్టమైపోయి ఆ జిల్లా కలెక్టరు, పోలీసు అధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఈ సినిమాలు, డాన్సు ప్రోగ్రామ్స్ వల్ల నేను పెళ్లి కూడా చేసుకోలేదు. కళారంగంలోనే ఉండిపోవాలనుకున్నాం. వివాహం వల్ల ఇంట్లో పురుషాధిక్యత ఎక్కువై నా నాట్యానికి ఎక్కడ అవాంతరం ఏర్పడుతుందోననే భయంతోనే పెళ్లి చేసుకోలేదు. అయినా నాకేం చింతలేదు. అయితే మధ్యలో ఆర్థికంగా చాలా చిక్కుల్లో పడ్డాను. బంధువులందరికీ అప్ప్పులపై హామీలిచ్చి వాళ్లు కట్టకుంటే నేను కట్టాల్సి వచ్చింది. అందువల్ల శరవణ్ మొదలియార్ వీధిలో ఉన్న పెద్ద ఇల్లు చాలా చౌకగా అమ్మేయాల్సి వచ్చింది. దాంతో నిలువ నీడ కోల్పోయాను. ఆ సమయంలో కరుణానిధి గారు ఒక ప్రభుత్వం వారి ఇల్లును నాకు చాలా చౌకగా అద్దెకు ఇప్పించి ఆదుకున్నారు. ఇప్ప్పుడు అదే ఇంట్లో నా తమ్ముడి కుటుంబాన్ని నా దగ్గరే పెట్టుకొని ఉంటున్నాను.
ఆ తర్వాత ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి డా॥ జె. జయలలిత నన్ను ఆర్థికంగా ఆదుకున్నారు. ప్రతినెలా ఐదు వేల రూపాయలు పెన్షన్ అందజేస్తున్నారు. ఆ డబ్బుతో నా శేష జీవితం ప్రశాంతంగా గడిచిపోతోంది. జీవితంలో ఎన్నడూ ఎవరూ పూర్తి సంతోషంగా ఉండలేరు. కేవలం సాధు పుంగవులు మాత్రమే పూర్తి సంతోషంగా ఉండగలరు. నేను కూడా మానసికంగా సాధు జీవితానికి అలవాటు పడ్డాను. దైవ చింతన తప్ప నేను మరొక పని ప్రస్తుతం చేయడం లేదు. అయితే అప్ప్పుడప్ప్పుడు పాతవాళ్లు, స్నేహితులు గుర్తుకు వచ్చినప్ప్పుడు నాలో నేనే ఏడ్చుకుంటాను. అప్పట్లో గిరిజ (హాస్యనటి), ప్రముఖ నటి ఎస్.వరలక్ష్మి నాకు మంచి స్నేహితురాళ్లు. వారిద్దరూ పోయారు. ఆ ఆవేదన నన్ను కలచి వేస్తుంటుంది. ప్రస్తుతం సచ్చు (“మాయాబజార” లో చిన్న శశిరేఖ, తర్వాత్తర్వాత తమిళంలో పెద్ద హాస్యనటి) కాంచనల లతో నా కష్టసుఖాలు చెప్ప్పుకుంటుంటాను. జయలలిత గారిని అప్ప్పుడప్ప్పుడూ కలిసి మాట్లాడి వస్తుంటాను. జయలలిత తల్లి సంధ్య నన్ను బాగా అభిమానించేవారు. ఆ అభిమానమే జయలలిత కూడా నాపై చూపిస్తుంటుంది.
తెలుగులో నర్తకిగా నా చివరి చిత్రం రామానాయుడు గారి మొదటి చిత్రం “రాముడు భీముడు”, ఆ తర్వాత కె. బాలచందర్ తీసిన “మన్మథలీల” చిత్రంలో హలం ఆంటీగా క్యారెక్టర్ వేశాను. అవే నా చివరి చిత్రాలు. రామానాయుడు గారు ఆర్టిస్టులను గౌరవించే నిర్మాత. చాలా గొప్ప హృదయం ఉన్నవారు. “రాముడు భీముడు” శత దినోత్సవాల్లో బంగారంతో తయారుచేసిన రింగ్ వాచీ బహూకరించారు. “సురేష్ ప్రొడక్షన” విలువలతో కూడిన సంస్థ. ఆ మధ్య తమిళంలో “జానకి” అనే టెలీ సీరియల్ లో నటించాను. ప్రస్తుతం ఏవైనా కార్యక్రమాలకు పిలిస్తే వెళుతుంటాను. నాకు కలై సెల్వం, మా గురువు గారు రామయ్య పిళ్లెí పేరుతో ఒక అవార్డు వచ్చాయి. తెలుగు ప్రాంతాల్లో నాకేమీ అవార్డులు రాలేదు. అయినా బాధ లేదు. అరవై సంవత్సరాలుగా నన్ను, నా నృత్యాల్ని అభిమానిస్తున్న వారికి నేనెప్పటికీ ఋణపడి ఉంటాను. ప్రేక్షకులకీ, పరిశ్రమకీ ధన్యవాదాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి