తెలంగాణా జిల్లాలలో పాలమూరు జిల్లాకు సంస్థానాలజిల్లా అని వ్యవహారం. ఈ జిల్లాలలో గద్వాల, ఆత్మకూరు, జటప్రోలు, వనపర్తి, అలంపూరు అని ఐదు వ్రధాన సంస్థానాలున్నవి. వానిలో వనపర్తి, గోపాల పేటగా, అలంపూరు, ప్రాగటూరు, రాజోలు, బోరవెల్లిగా చీలిపోయినవి. ఈ జిల్లా సాహిత్య చరిత్రలో రాజకవులు, సంస్కృతకవులు, ఆంధ్రకవులు, కావ్యకవులు, శతకకవులు, యక్షగానకవులు, నాటకకవులు, సంకీర్తనా చార్యులున్నారు.
గద్వాల సంస్థానాధీశులు పాకనాటిరెడ్లు. వారి ఇంటి పేరు ముష్టిపల్లివారు. వారు మిడివిళ్ళగోత్రులు. ఈ సంస్థానం క్రీ.శ. 1290 లో ప్రారంభమయింది. వీరి మొదటి రాజధాని బోరవెల్లి. వీరి కులదైవం ప్రోలుగంటి చెన్నకేశవుడు. తరువాత అతడు పూడూరి చెన్నకేశవుడైనాడు. వీరి మÖలపురుషుడు బుద్ధారెడ్డి. అతని నుండి సంస్థానం ఐక్యభార తంలో విలీనం అయ్యేవరకు 18 మంది ప్రభువులు పాలించినారు.
గద్వాల సంస్థానం తర్వాత చెప్పదగింది. ఆత్మకూరు. వీరి యింటి పేరు ముక్కరవారు. వీరు గద్వాల ప్రభువుల సగోత్రులు. గద్వాలకంటే ఈ సంస్థానం ఎంతో చిన్నదైనా సాహిత్యపోషణలో మాత్రం దాని కే మాత్రం తీసిపోలేదు. ఈ సంస్థానం క్రీ.శ. 1292 లో ప్రారంభమయింది. వీరి కులదైవం కురుమతి వెంకటేశ్వరుడు. ఈ సంస్థాన మÖలపురుషుడు గోపాల రెడ్డి. వీరి తొలి రాజధాని తిప్పడం. గోపాలరెడ్డి నుండి ఈ సంస్థానాన్ని 10 మంది ప్రభువులు పాలించినారు.
ఆంధ్రదేశంలో తిరుపతి వెంకటకవుల పేరు వినని వారు ఉండరు. ఆ జంట నీజంట సంస్థానాలొక ఊపు ఊపి విడిచినవి. తిరుపతికవులు కవిత్వంలో ఎంత ఉద్దండులైనా శాస్త్రచర్చలలో ఇక్కడి పండితుల ధాటికి తట్టుకో లేకపోయినారు. గద్వాలలో పురాణం దీక్షాచార్యులు, ఆత్మ కూరులో బాలసరస్వతి బుక్కపట్టణం శ్రీనివాసాచారి గారు మేరుమంధర సదృశులై వారినడ్డుకొన్నారు.
ఈ కాలంలో గద్వాలలో వర్ధిల్లిన చెన్నకేశవ సాహిత్యం, ఆత్మకూరులో వచ్చిన కురుమతి సాహిత్యం ఈనాడు ప్రత్యేక పరిశోధనాంశాలకు సరిపోగలవు.
గద్వాల సంస్థానానికి పిశుపాటి చిదంబరశాస్త్రి గారు రెండవసారి వచ్చినపుడు వారి శతావధానం ఏర్పాటు చేయబడింది. అపుడు రాజా రామభూపాలరావుగారికి ఆదిపూడి ప్రభాకరరావుగారు అంతరంగికులుగా
ఉన్నారు. ఆదిపూడివారు కూడా మంచికవి. ఎదుటి వారిని ఏవిధంగా నైనా పడగొట్టజూచేవాడు. శతావధానం మÖడు దినాల కార్యక్రమం. దాన్ని ప్రభాకరరావు దినం వరకు కుదించి అవధానం ప్రారంభమైన పిమ్మట దాన్ని అత్యవసర కార్యాలని మళ్ళీ ఒక్కనాటికే పరిమితం చేసినారు. అవధాని అది ఒక్కనాటితో పూర్తికాదని ఎంత చెప్పినా వినక తుదకు దాన్ని బుద్ధిపూర్వకంగా విఫలముచేసి అవధానిగారు అన్న సమయంలో అవధానం పూర్తిచేయలేక పోయినాడని ప్రకటించినాడు.
అది కవిగారికి చాలా బాధ కలిగించింది. రాజా వారికి న్యాయం విచారించవలసిందని ఆర్జీ పంపుకున్నాడు . ఈ లోపల ప్రభాకరరావుగారు లేనిపోనివి చెప్పి రాజా వారికి కోపం కలిగించినాడు. కవిగారు వారం దినాలు నిరీక్షించినా సమాధానం రాకపోగా ఆప్తులెవరో వెళ్ళి మహారాజుగారికి నీపై చాలా కోపంగా ఉంది. నీవిక్కడ ఉండటం మంచిది కాదని చెప్పినారు. అది విని ఆయన హృదయం దహించుకపోయింది. చెన్న కేశవస్వామి గుడికి వెళ్ళి మిగిలిపోయిన అవధానం అప్పజెప్పి తన ఆవేదనను పద్యాల రూపంలో కాగితాలపై వ్రాసి కర్పూరం బిళ్ళలు కొని ఒక్కొక్క పద్యం చదువుతూ ఆ కాగి తంపై కర్పూరాన్ని ఉంచి స్వామికి హారతి యిచ్చి వెళ్ళి పోయినాడు.
ఆ విధంగా కవిగారు వెళ్ళిననాటి రాత్రే రాజు గారికి సన్నిపాతం సంభవించింది. చివరకాయన ఆ కవి గారినే కలవరిస్తూ శాస్త్రిగా రెన్ని కర్పూరం బిళ్ళలు వెలిగించినారో అన్నవనాడు పరలోక గతుడైనాడు. రాజు గారా విధంగా మరణించడం చిదంబరశాస్త్రి గారు తన శాపంతో మరణించినట్లు ‘యాత్రా చరిత్ర’ అనే తన కృతిలో గూడ సూచించినారు.
అయితే కవిగారి శాపం ఒక్క రాజుగారికే గాదు అనంతరం ప్రభాకరరావుగారికి గూడా తగిలినట్టే ఉంది. అంతవరకు గద్వాలలో మరో మహారాజుగా ఉన్నవాడు రాజుగారి మరణంతో ఆ పదని విడిచి వెళ్ళవలసి వచ్చింది. చివరి దినాలలో సికింద్రాబాదులో దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తూ మరణించినాడట. అందుకే భర్తృహరి ప్రభువులకు కవుల యెడ గర్వం కూడదన్నాడు.
ఇక ఆత్మకూరు బాలసరస్వతిగారి ముందు తిరుపతి కవులు నిలువలేకపోయినా, వారి ఓటమి స్పష్టంగా కనిపించినా యింటికి వచ్చిన అతిథిని అగౌరవించడం మన సంప్రదాయం కాదని మహారాజు గారు ఆస్థాన పండితుడైన బాలసరస్వతిగారిని ప్రార్థనతో ప్రసన్నుని చేసికుని తిరుపతి కపులను ఏనుగునెక్కించి పంపినాడు. ఈ విషయం వారు “ఏనుగునెక్కినాము - ధరణీంద్రుడు మొక్కగ నిక్కినాము” నీవలనన్ “సరస్వతీ” అని సరస్వతీ మిషతో బాలసరస్వతిగారిని స్తుతించినారు.
సాహిత్య పోషణలో తరువాత స్థానాలను వనపర్తి, అలంపూరు సంస్థానాలు పొందినవి. గద్వాల ఆత్మకూరు ప్రభువులు పాకనాటి రెడ్లు కాగా వీరు మోటాటివారు. ఈ రెండు తెగల రెడ్ల నడుమ నిలిచింది జటప్రోలు సంస్థానం. ఈ సంస్థాన ప్రభువులు వెలమలు. వీరు రేచర్ల గోతులు. వీరి కులదైవం మదనగోపాలుడు. వీరి మÖల పురుషుడు మాదానాయుడు. అతని మొదటి రాజధాని గోదలు. అక్కడి నుండి జటప్రోలుకు వచ్చినాడు. ఈ సంస్థానం క్రీ.శ. 1508లో ప్రారంభమయింది. సంస్థానం భారత ప్రభుత్వంలో లీనమయ్యే వరకు 15 మంది రాజులు పాలించినారు.
ఈ సంస్థానానికి చెందిన ఆయ్యవారిపల్లె, మంచాలకట్ట పండిత నిలయాలుగా ఉన్నవి. వనపర్తి సంస్థానం క్రీ.శ. 1517 లో ప్రారంభమయింది. దాని మÖలపురుషుడు వీరకృష్ణారెడ్డి. కడప జిల్లాలోని జనుంపల్లె నుండి వచ్చినవాడు. అతని మొదటి రాజధాని సూగూరు.
శ్రీరంగాపురంలోని రంగనాయక స్వామి వీరి కులదైవం. ఈ సంస్థానాన్ని మొత్తం 11 మంది రాజులు పాలించినారు. గద్వాల ఆత్మకూరుల వలె వీరుగూడ పండిత సభలు జరిపి కవులను సత్కరించినారు.
ఈ సంస్థానం క్రీ. శ. 1593 లో రెండుగా చీలిపోయింది. గోపాలపేట సంస్థానం ఏర్పడినది. దాని మÖలపురుషుడు రంగారెడ్డిగారు. ఈ వంశీయులు వెనుబాల గోత్రీకులు. గోపాలపేట వారి కులదైవం కేశంపేట చెన్నకేశవ స్వామి. వీరి మొదటి రాజధాని ల్యాటవెల్లి. రంగారెడ్డి మొదలుకొని దీన్ని పదముగ్గురుమంది రాజులు పాలించినారు.
వనపర్తి ప్రభువులు నూతన గ్రామాలెక్కువగా సాపించినారు. ఆలయాలు గూడ మిక్కిలిగానే కట్టించి నారు. అంతేగాక సప్తసాగరాల పేర వీరు పెద్ద పెద్ద చెరువులు వేయించినారు.
అలంపూరు సంస్థానం క్రీ.శ. 1570లో ప్రారంభ మయింది. దాని మÖల పురుషుడు దాదరెడ్డి బిజ్జల వంశీయుడు. వీరి కులదైవం ప్రాగటూరి రామేశ్వరుడు. ఈ సంస్థానాన్ని మొత్తం 14 మంది రాజులు పాలించినారు.
ఈ సంస్థానం కాలాంతరంలో అలంవురం, ప్రాగటూరు, బోరవెల్లి, రాజోలు అనే నాలుగుగా చీలిపోయి వానిలో బోరవెల్లి, రాజోలు గద్వాలలో కలిసిపోయినవి. అలంపూరు, ప్రాగటూరు మాత్రం స్వతంత్రంగా మిగిలినవి.
అలంపురం సిద్ధ క్షేత్రం భారతదేశంలో ఎక్కడా లేని నవబ్రహ్మాలయాలక్కడ ఉన్నవి. పూర్వం అదొక పెద్ద విద్యాకేంద్రం కాబట్టి సంస్థానం చిన్నదైనా సాహిత్య పోషణలో వానికి తీసిపోలేదు. ఈ సంస్థానాలలో గద్వాల సంస్థానం చేసిన కవి పండితాదరణ, వనపర్తి ప్రభువుల కాలంలో చేసిన ప్రాచీన గ్రంథ ముద్రణ ఈ రెండు చెప్పదగినవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి