తెలుగువారి భారతమున నిదిమరియొక గిరివ్రజ పట్టణము. దీనికి తూర్పున మానాజీ పేట దారిని అడ్డగట్టు, ఆగ్నేయమున చీకటిగుట్ట, కాకుల గుట్ట, పశ్చిమమున బాలపీర్ల గుట్ట, మారెళ్ళగట్టు, ఈశాన్యమున రంకులగట్టు, మల్కాపురము దారిని భైరవుని గుట్ట, గ్రామమునందు దక్షిణమున రామస్వామి గట్టులున్నవి. వానిపై గల శిలలన్ని గండశిలలు. నేను జూచినంత వరకింతింతటి గండ శిలలీప్రాంతమున మరేగట్లపై లేవు. ఆ శిలలేటవాలుగా ఒకదాని కొకటి యానుకొని, లేదా మరియొక దానిపై సాగి నిలిచి యిక్కడి గట్లపై పెక్కు గుహ లేర్పడినవి. వానియందు కొన్ని సువిశాలమై మానవ నివాసయోగ్యముగా గూడ నున్నవి. ఇది వాని ప్రత్యేకత. ఇదిగాక కొన్ని పర్వతముల మేఖల చక్కగా రాతితెట్టెను మలిచి కట్టినట్లే యున్నది కనుక పర్వత దుర్గముతో ప్రకృతి రక్షణలోనున్న ఈ ప్రదేశము యొక్క విశిష్టత జూచియే పూర్వపు రాజులు దీనిని రాజధానిగా యెన్ను కొనినట్లు దోచును.
కంద G ఊరు, కంది G ఊరు. కందు G ఊరు ఆను వానిలో నేరూపమైనను కందూరగుటకు వీలున్నది. “కందు” “అనగా మొరముగాబట్టి అట్టి నేలపై sTÖ గ్రామము వెలసి యుండవచ్చును. గొంది G ఊరు గూడ కాలక్రమమున కందూరగు నవకాశమున్నది. గొందియనగా పర్వతములయొక్క కోణ భాగము.
పూర్వమిచటి గుట్టలలో సిద్ధులుండెడివారట. ఈ గుట్టలపైగల గుహలను జూచినది నిజమేననిపించును. సిద్ధులుండుటచే మొదట దీనిని సిద్ధుల రామేశ్వరమని పిలుచుచుండిరట. పిమ్మట దీనికి కందూరను పేరేర్పడెను. ఈ గ్రామ ప్రసక్తి మన కేఱువ చోళుల శాసనŸములందు గనిపించును. వారిలో నొక శాఖవారు తాము కందూరు చోళులమని చెప్పుకొనిరి. శాసనస్థముగా మొదట దీని పేరు ఏఱువతొండయ రాజు కాలమున గనిపించును. దీనిని మొదట నతడే రాజధానిగా జేసెను.
చోళులు మొదట కోడూరివారు. దానిని చాళుక్యులాక్రమించుకొని వారిని కొలనుపాకకు బంపిరి. దానిని తొండయ రాజు పాలించుచుండగా సోమేశ్వ రుడు తన కుమారుడగు కుమారతైలపు నచటికి రాజ ప్రతినిధిగా బంపి తొండయరాజును కందూరికి బంపించెను. అచట నేడు గనిపించు కోట ఆ మహారాజే గట్టించియుండును. అంతవరకిది వంగూరు వాటికి ప్రక్క రాజ్యముగా నుండెను.
సత్యాశ్రయ పృధివీవల్లభ బిరుదాంచితుడైన రెండవ పులకేశి యొక్క తుమ్మెయనూరి శాసనమున “చాళుక్య విషయము” పేర్కొన బడినది. దానిని పరిష్కరించిన డా. రామేశంగారు చాళుక్యవిషయము నేటి రాయలసీమ, కర్నూలు, పాలమÖరు జిల్లాలకు పరిమితమై యుండెనని యభిప్రాయపడిరి. ఆలపాటి తామ్రశాసనము వర్థమానపురము వరాహ విషయము లోనిదని జెప్పినది. అది నేడు నాగర్‌కర్నూలు తాలూకాలో నున్నది గనుక చాళుక్యులకంటె మొదలీ భూభాగమునకు వరాహ విషయమని వ్యవహారముండి వారి పుట్టువుచేత చాళుక్య విషయముగా నోపును. అందువలన వారు తమ జన్మభూమిపై గల యభిమానముననేమి, భూమి నుద్ధరించినందువలన నేమి వరాహమును తమ లాంఛనముగా స్వీకరించి యుందురు.
పాలమÖరు మండలము చాళుక్య విషయములోనిది గనుకనే పులకేశి పౌత్రుడు వినయాదిత్యుడు ఈ పంకల్లు దానశానసమున వంగూరువాటి తమ పిత్రీయ రాజ్యమని దానిని శత్రువు లాక్రమించుకొనగా తాను జయించితినని ప్రత్యేకతగా జెప్పుకొనెను. అతడు పేర్కొనిన వంగూరు పాలమÖరు మండలమున నేడు కలువకుర్తి తాలూకా యందున్నది.
నేడు వంగూరులో ప్రాచీన శిధిల దుర్గమున్నది. అంతేగాక నచట ‘గెలువలమ్మ’ యను పురాతన దేవత యున్నది. ఇది ‘విజయ దుర్గ’ అనుదానికి “గెలుపులమ్మ” అను తెలుగు పేరు. గెలిచి గెలువలమ్మ పేరు పెట్టుకొనవలెనని యక్కడిసామెత. ఆ దేవతకచట ఏటేటా శ్రావణమున “తిరునాళ్ళు” సాగును.
ఈ దేవత బహుశః ఆనాడు వినయాదిత్యుడు శత్రువులను గెలిచి వంగూరు వాటికి కేంద్రమగు నా గ్రామమున ప్రతిష్టించిన “విజయదుర్గ” యన వచ్చును.
కందూరికీ మున్నూటియని, పదకొన్నూటియని రెండు వ్యవహారములున్నవి. నాడులకు చేర్చబడు నీ సంఖ్య లానాటి వాటి ‘రెవిన్యూ సిస్తు’ వంటివి గావచ్చును. ఈ ప్రాంతమున నింకను వడ్డవాని యేన్నూటి గాక కంపణ నూటిరుపై, ఎత్తపి తొంబది, కూళకిళయ పదమÖడు. రేబళియ పది, సర్వ తొమ్మిది మొదలైన చిన్ననాడులున్నవి. కనుక కందూరిని రాజధానిగా చేసిన పిమ్మట వడ్డవానితో పాటివన్నీ దానిలో గలిపి, పదకొన్నూటిజేసి, దానిస్థాయిని బెంచి యుందురు. అటుల దీనిస్థాయి పెరిగిన పిమ్మటనే వడ్డవాని, వంగూరు వాటి విషయములు వాడుకతగ్గి మాసి పోవచ్చును.
ఏఱువ తొండయరాజు గూడ యెంత కాలము కందూరిని పాలించెనో తెలియదు. ఆనాటి నాయకులలో ఆరెవెల్లివారు, కొమరెల్లివారు, ‘పెంపాలవారు, పైడిపాలవారు ఏఱువ సింహాసనముపై నభిమానము గలిగి తొండయ రాజునకు కుడి భుజమై యుండిరి. గాని యితడొక యుద్ధమున మరణించినట్లు దోచును. నిడమాని వారికి ఏఱువ తొండ భూపతి తలగుండు గండయని, కోగంటివారికి ఏఱువతొండ రాజు నెత్తిపిడుగయని బిరుదులున్నవి. దానితో పాటు వారికి
“ఉదయరాజు స్థాపనాచార్య” అను బిరుదు గూడ నున్నది కనుక నీ యుదయ రాజెవ్వరో?
నేడు కందూరొక క్షేత్రము. పూర్వమచట నేకోత్తర శతలింగ ప్రతిష్టలుండెనట. నేడాగ్రామమున నెచట ద్రవ్వినను లింగములు బయటబడు చుండునట. ఈనాడటగల ప్రధానదైవము రామలింగేశ్వరుడు. అతని యాలయము రామస్వామి గుట్ట క్రింద నున్నది.
రామస్వామి గుట్టపై యొక పెద్దగుండు సగమువరకడ్డముగా మరియు నిలువుగా బగిలి శేషుని పడగవలె నిలిచినది. దానికి “పడగగుండు” అని పేరు. దాని క్రింద నొక గుహయున్నది. తొలుత స్వామి యాగుహయందుండెనట. అతనిని దినదినమొక తమ్మళిభక్తురాలు పూజించుచు నొకప్పుడు గర్భవతియై గుట్ట నెక్కలేక యెటులో గుడికి వెళ్ళి “స్వామీ! నేనిక నీ సన్నిధికి దినదినము రాలేను నన్ను మన్నించవలసినద” ని మ్రొక్కెనట. అపుడామె భక్తికి మెచ్చి శివుడు నీవు నా సమీపమునకు రాలేని పక్షమున నేనే నీ చెంతకు వత్తును. నేనెచ్చట నిలువవలెనో నీవు వెనుదిరిగి జూడకుండ నచటికి వెళ్లుమని జెప్పెనట. అందులకామె యంగీకరించి గుట్టదిగనారంభించెను. స్వామి యామె వెనుక రథముపై బయలు దేరెను. ఆ ధ్వని విని యామె తన వెనుక నేమి జరుగుచున్నదో చూచుటకు కుతూహల మాపలేకపోయెను. ఆందులకు స్వామి కొపించెనేమో? ఆమె వెనుదిరిగి జూడగనే కన్నులుదిరిగి పడిపోయెను. రథము విరిగి పెద్దధ్వనితో దాని చక్రములు దొరలుకొని వచ్చి యొకటి గుట్టక్రింద నున్న కోనేట, మరియొకటి నేడున్న రామలింగేశ్వరునిచోట బడెను. అనంతరము భక్తులాసంఘటన కాశ్చర్యపడి స్వామి నటులే యాచక్రమున ప్రతిష్టించి యాలయము గట్టిరి. ఆ ఆలయమున నేడు స్వామి సమీపమున ఆ తమ్మళివనిత ప్రతిమ యొక పసిపాపకు పాలిచ్చుచున్నట్లు జెక్కి నిలుపబడినది.
కందూరి కధలో కన్నులు దిరిగి పడిపోయిన పిమ్మట తమ్మళి యే మైనది తెలియదుకాని కోటప్ప కొండలో గొల్లత్త కధ యొకటి పూర్తిగా నిటులే యున్నది. ఆ కధలో నామె యట్లు మÖర్ఛితురాలై పడిన పిమ్మట మొగపిల్లవాడుగూడ కలిగినట్లు జెప్పబడినది. అరవపల్లెలో గూడ నిట్టి కధనే మరియొకటి వ్యాప్తిలో నున్నది. కధకు కండ్లులేవు ముంతకు చెవులు లేవని మనవారందురుగాని మనకధలు కండ్లు లేకున్నా కాళ్ళతో చాలాదూరము ప్రయాణము జేసినవి.
శైవయుగమున శివ మాహాత్మ్యములకు సంబంధించిన యట్టి జానపద గాధల నేకము వెలసినవి గాబట్టి యందు సత్యాసత్యము లెట్లున్నను నేడు రామస్వామి గుట్టపై రధము దొరలుకొని వచ్చిన జాడ పేర రెండు దారులున్నవి. ఆలయమున నిక శివునకు ప్రత్యేక సోమసూత్రము లేదు. ఆతడు చక్రముననే ప్రతిష్టితుడై యున్నాడు. ఇది ఆ స్వామి ప్రత్యేకత.
ఈ ఆలయము పశ్చిమాభిముఖముగా నున్నది. ప్రసిద్ధమైన ఆలంపురము, కాళేశ్వరము నందుగూడ ప్రధానాలయములు పశ్చిమాభిముఖములే. కనుక నిది పశ్చిమ చాళుక్యుల సŸంకేతమో లేక మరేదైన ఆగమ పద్ధతియో, స్థాపత్యవేత్తలు వివరింపవలె.
ఇచట నాలయమువలెనే దేవతామÖర్తులలో గూడ నొక ప్రత్యేకత యున్నది. ప్రధానాలయమునకు దక్షిణమున పంచగౌరి యాలయమున్నది. అందలి మÖర్తి దేవీరూపమున గాక స్త్రీలు నోముల సమయములందు పసుపుతో జేసికోను గౌరినిబోలి త్రిశూలాకృతిగా నున్నది.
ఈ ఆలయముననే నావరణయందు రెండు హనుమన్మూర్తులున్నవి. ఇచటి హనుమంతు డన్ని స్థలము లందువలె గాక శిఖాయజ్ఞోపవత కౌపీనధారి. కలువకుర్తి తాలూకాయందలి యÖరికొండ పేటలో నిట్టి మÖర్తియే గలదని మా పాలెం ప్రాచ్యకళాశాల ప్రిన్సిపాలు శ్రీ టి. విశ్వనాథశర్మగారు జెప్పిరి.
గ్రామమునగల వీరభద్రాలయమున మరియు సిద్దిరామేశ్వరమున మహిషమర్దనీ మÖర్తులున్నవి. ఈ ప్రాంతమున నా మÖర్తులలో పెక్కు స్థలము లందు దేవికి సింహవాహనము చూపబడలేదు. అంతేగాక మహిషుడర్ధ మహిషాకారముతో లేక మహిషముఖముతో నున్నాడు. ఇచటి మహిషమర్దనీ మÖర్తి యన్ని చోటులవలె గాక సింహవాహనయై యున్నది. మహిషుడు పశ్వాకారమునగాక కిరీటమునకే రెండువైపుల కొమ్ములు చూపబడినవి.
రామేశ్వరాలయమున ప్రస్తుతము స్వామి కెదురుగా మÖడు, మరియు కుడివైపు మÖడుగదులున్నవి. పూర్వ మా యారింటియందు లింగ ప్రతిష్ఠలుండెనట. ఒకేపానవట్టముపై రెండు శివలింగములున్నప్పుడు యమేశ్వరమని, అయిదున్నప్పుడు పంచభూత లింగములని లేదా ‘సద్యోజాతాదిభేదములని జెప్పుదురుగాని ఈషల్లింగ ప్రతిష్టనేమందురో ! శైవులు షట్కాల శివపూజా దురంథరులుగనుక నివి యామలింగములగునో ? మరేమో? ఇటులిచటి శిల్పమంతయు నేదో రహస్య సంకేతముగా దోచును గనుక ఇచటి రహస్యములు స్థపతులు వివరించవలెను.
ఈ ఆలయ ప్రాకారమున లోపలి మంటపములందొక దానియందు శివలింగము పానవట్టముతో గూడ నేకాండీ శిలయందు మలచబడినది. అదిబాగా పెద్దదిగూడ. సోమసూత్రముపై శివలింగము అన్నిటివలెగాక నిచ్చటొక ప్రత్యేకపద్ధతిగా ఉపరితలము బండి చక్రముయొక్క కుండవలెనున్నది. గర్భాలయమందలి శివలింగముగూడ నటులే యున్నది. ఇదిగూడ యిచటి ప్రత్యేకతనే.
పై శివలింగమునకు ప్రక్కనగల మరొక మండపమున స్థానికుడగు వైశ్యుడు బిల్లకంటి రామయ్యగారు కాశీయాత్ర జేసి యచటినుండి శివలింగమును దెచ్చి ప్రతిష్టించగా దానిని రజాకారుల కాలమున నొక పఠాను పెరికి యాలయము ముందున్న కోనేటిన పారవేసెనట. కొన్ని దినములకు వైశ్యులా కోనేటిలో బడ వేసిన లింగముయొక్క జాడదెలిసి దానిని దీయించునాటి కచటరిత్తగానున్న సోమసూత్రమును తాటికొండవారు గొనివెళ్ళిరట. ప్రస్తుతమా కాశీలింగ మాలయమున స్వామి ప్రక్కన నుంచబడినది. ఈ ఆలయమున నొక ప్రాచీన శాసనముగూడ నున్నదిగాని యెప్పటిదో తెలియలేదు.
ఇవిగాక నిచట గ్రామమున నొక చెన్నకేశవాలయము, ఒక ‘వీరభద్రాలయము, మరియొకాంజనేయాలయమున్నవి. వానిలో చెన్న కేశవాలయము ప్రాచీనము. దాని విమానము ద్రావిడపద్ధతిలో గట్ట బడినది. ఆలయ ద్వారముల ముందేనుగుల జత నిలుపబడినది. అట్టివి ఆవŸంచయందు పూర్వము రాజ భవనములముందుండెను. ఇంద్రకల్లులో నేడింద్రేశ్వ రాలయమున కున్నవి. ఆలయమున చెన్న కేశవ మÖర్తి మిక్కిలి సుందరముగా నున్నది కాని ప్రస్తుత మొక చేయి విరిగినది. ఈ గ్రామమున గత శతాబ్ది యందు చింతకుంట పెద్దబుచ్చారెడ్డి యనువ్యక్తి యుండెనట. ఆయన మంచి కవియని చెప్పుదురు. కవులు రసపిపాసులు గనుక నతడు రసపిపాసిగా గూడ నుండెనట. అందువలన నొకనాడా మైకమున నాలయమునకు వెళ్ళి స్వామిని పిలిచెను. అతడు బలుక లేదు. కవులు నిరంకుశులు గదా ! కోపమున నొక రాయియెత్తి వేయ స్వామివారి చేయి విరిగెనట.
ఇక వీరభద్రాలయము ప్రస్తుత మాలయముగా లేదు. ఒకగది మాత్రముగా నుండి స్వామి మÖర్తి యున్నది, ఆంజనేయాలయము క్రొత్తగా గట్టినారు.
ఇవిగాక ఈ గ్రామమునకు చుట్టుగల గుట్టలపై యింకను పెక్కు ప్రతిష్టలున్నవి. ఊరికి పడమటగల బాలపీర్లగుట్టపై ఒక దర్గా యున్నది. అచట మాతృకామÖర్తులుగూడ పడియున్నవి. ఈ గుట్ట గ్రామమున గల భైరవుని చెఱువుకొమ్ము నానుకొని యున్నది. దాని ప్రక్కనగల మారిళ్ళగట్టుపై చిన్న శివప్రతిష్ట యున్నది. ఆ శివుని కెదురుగా భైరవుని చెఱువులో నŸందిమిట్టపై నంది అదే వరుసన చెఱువు చివరన ధ్వజస్తంభమున్నవి. రంకులగుట్టపై నొక విశాలమైన దరిక్రింద ఒక గుండున కస్పష్టముగా నొక చతుర్భుజమÖర్తి మలువబడినది. గ్రామస్తులది బాల బ్రహ్మమÖర్తియని కొలుచుచున్నారు గానీ - బాలభైరవమÖర్తి గావచ్చును. సుమారు పద్దెనిమిదేండ్ల క్రింద ఈ గుట్టపైనుండి యొక పెద్దగుండు దొరలి దాని క్రిందనచ్చట జొన్నలెండబోసికొని కావలి యున్న యొక బాలుడు పచ్చడి యయ్యెనట. అపుడది దొరలివచ్చి క్రిందనున్న మరియొక గుండునకు ఢీకొట్టుకొనగా నాధ్వనికి చుట్టుప్రక్కల పల్లెల ఊరందరు భూకంపము వచ్చెనని భయపడిరట.
ప్రస్తుతమీగుట్ట పూర్వము ప్రణయజీవులకు విహారముగా నుండెను గనుక “రంకులగుట్ట” యని పిలిచిరని భావించుచున్నారు కాని ‘రంకువు’ అనగా ఒక విధమైన జింక. ప్రకృతిలో ఒక్కొక్కచోట నొక్కొక్క జంతువెక్కువనే నెరిగినంతవరకు ఏదులగట్టున ఏదులెక్కువ, గుడిపల్లె గట్టుననే గోలము లెక్కువ. ఇచటిగట్లలో చిత్తఱుతలెక్కువని వింటిని కనుక నటులే నొకప్పుడిచట రంకులుగూడ నెక్కువగా నుండవచ్చును.
భైరవుని గుట్ట దిగువ నొక బైరవమÖర్తి యున్నది. ఆ మÖర్తి యొకచేత కత్తిని మరొక చేత నెమలివంటి పక్షిని ధరించినది. బైరి నేడొక డేగవిశేషము. పూర్వము కొన్ని తెగలవారు వివాహ సందర్బములందు “డేగవేట” యను నొక ఖడ్గనృత్యము ప్రదర్శించెడువారు. అప్పుడతడొకచేత క త్తిని మరొకచేత దీమమును ధరించెడి వాడట. కనుక బైరిని ధరించిన నీ భైరవుడేసంప్రదాయమునకు చెందినవాడో! ఈ గుట్టకు తూర్పున కొంత దూరమున సిద్ధిరామేశ్వర మున్నది. ఇది ఇక్కడ జూడ దగిన స్థలము ఈ దారిని పచ్చని పూవుల బోడతరమున్నది. అది అపురూపమైన యౌషది.
సిద్ధిరామేశ్వరమున విశాల మైన యొకదరి క్రింద శివప్రతిష్టయున్నది. ఆ దరి మొత్త మొకే రాతిది. గ్రామస్తులు తరువాత నాదరిచుట్టు గోడకట్టి లోపల గర్భాలయమేర్పరచినారు. ఈ ఆలయమున శివునితో పాటొక సూర్యమÖర్తి ఒక మహిషమర్దని మరియు మాతృకామÖర్తులున్నవి. ఇచట గల సూర్యమÖర్తిని జనులు వీరభద్రుడని కొలుచుచున్నారు.
ఇక గ్రామమున గల రామస్వామి గుట్టపై మందడి ‘కాంతిరెడ్డి’ యను భక్తుడు గోసాయి గుహలో హనుమత్ప్రతిష్టజేసి దానికొక యాలయ రూపమిచ్చుచున్నాడు. ఈ గుహగూడ ప్రాచీనమైనది. దీని కెగువభాగమున కొంతదూరమున ప్రాచీనమైన నిలువెత్తు భైరవమÖర్తి యొకటి బడియున్నది. అది మిక్కిలి సుందరముగా నున్నది. దానికి కొంత దూరమున మరల నొక పెద్ద రాతిదరి క్రింద ప్రాచీనాలయపు పాదున్నది. బహుశః ఆ మÖర్తి మొదటనట నుండవచ్చును. ఆ యాలయ సమీపమున వెలుపలి వైపున నొక పెద్ద గుండు యున్నది. దానికి “భేరిగుండు” అని పేరు. అ గుండును రాతితో గొట్టినయెడల భేరీనాదము వెలువŸడును. ఇదిచిత్రము. దానిపై నేడు రాతితో మ్రోగించిన గుంతలున్నవి గాబట్టి యేకాలమందైన నచట యా భైరవుని వేడుకల సందర్భమున నా గుండును మ్రోగించుచుండిరేమో!
ప్రస్తుత మీగ్రామమున ప్రతియేట ఫాల్గుణమున రామలింగేశ్వరుని యుత్సవము జరుగును. అది పాడ్యమితో నారంభమగును. పున్నమనాడు తేరు జరుగును, అమావాస్య నాటికి ఆఖరగును. రథోత్సవŸమునాడు గుట్టపై పడగగుండు క్రింద దీపము ముట్టింతురట. అచట దీపము వెలిగించువరకు తేమ కదలదట.
నేటికి sTÖ గ్రామమున శిల్పసంపదకు కొదువ లేదు గాని పŸల్లవులే యిక్కడ నుండిన యెడల sTÖ పర్వతములెంత పల్లవించెడివో. నేడీగ్రామ విశిష్టత కదంబ వృక్షములు. అవి నేడు దక్షిణమున మధురలో దప్ప మరెచ్చటను లేవట. పూర్వమిచటనవి మిక్కిలిగనే యుండెనట గాని నేడు మÖడు నాలుగు మాత్రమే మిగిలినవి. అవి శ్రావణ భాద్రపదములందు పూయును. పూర్వమీ ప్రాంతమునకు కదంబ వాడియని వ్యవహారముండెను గాని యది యెంత వరకు జెల్లుచుండెనో తెలియదు.
పూర్వ మిచ్చట నేఱువ చోళులు గట్టిన దుర్గావశేషములు నేడు రంకుల గుట్టపైనుండి గనిపించును. వారచటిగండ శిలలటులే చౌకముగా బగుల గొట్టించి కోటను గట్టిరి. ప్రస్తుత గ్రామమాప్రాకారమందే యున్నది. గ్రామమున చోళులనాటి బావి యొకటి చెకు£్కచెదరక సువ్యవస్థితముగా నుండి జనుల కుపయోగపడుచున్నది.
కోటలోని రాజభవన ప్రాసాదము నేడు గ్రామము లోనికి వెళ్ళు దారి ప్రక్కనే యున్నది. అందొక శివాలయపుటడుగు గూడ నున్నది. అచటనొక నల్ల రాతి వీరగల్లు పడియున్నది. దానిపై గరుడాసమున నొక పురుషుడు చేతులు జోడించుకొనియున్నాడు. అతని ముఖలక్షణములు, కిరీటహారాదులు జూడగా నతడొక రాజపురుషుడు. ఏఱువవంశమున గోకర్ణుడు పరమభక్తుడు గనుక నీప్రతిమ యతనిదిగా నేను భావించుచున్నాను. అది చూచుటకు మిక్కిలి సుందరముగా నున్నది.
ఏఱువ చోళుల పిమ్మట నిచట యెవరెవరి చేతులు మారెనో గాని చివరి దినములలో వనపర్తిరాణి శంకరమ్మ గారి తల్లివారి యాధీనమున నుండెనట. నేడు వారి కోటయడుగు మరియు దాని మోసల భాగము నిలిచియున్నవి. కందూరునకు తూర్పున నడ్డగట్టు వెనుక మద్దిగట్లయను గ్రామమున్నది. ఆ గ్రామమున పూర్వము సంజీవరాయడను కరణముండెనట. అతనికి కందూరి దొరలకు వైరముండగా వారొకప్పుడు తమ చేతి క్రింది బోయలకు ఒకనాడు గుఱ్ఱము దిరిగినంత భూమిని ఇచ్చెదమని జెప్పి యతనిని జంపుమనిరట. అపుడు వారు వెళ్ళి యడ్డగట్టున నొకచోట గుండ్లమాటున గాచి సంజీవరాయడు కందూరికి వచ్చు సమయమున నతనిని గొంతుగోసి చంపిరట. అతనిని చంపిన గుండ్లను నేడతని పేర సంజీవరాయని గుండ్లు అని పిలుచు చున్నారు. బోయలు సంజీవ రాయని జంపినది రాత్రి వేళయట. ఆతని శాపమో లేక చంపించిన వారి పాపమో గాని యతని నచట జంపగనే యిచట కోటపై నొక గుడ్ల గూబ వ్రాలి కూసెనట. అనాటినుండియే యిక కోటపని గూడ గూసెనందురు. సంజీవరాయని చంపినబోయల వంశమున మÖడుతరములవరకు మÖగవారు బుట్టిరట. ఇది గ్రామస్తులా కోటను గుఱించి చెప్పుకధనము.
మరియొకటి, ఈ గ్రామమునగల కడిమిచెట్లు మరొకచోట మొలువవని యందురు గాని యచటనే కాంతిరెడ్డి గారు తాను స్థాపించిన హనుమదాలయము ముందొక చెట్టును మొలిపించి పెంచినాడు గాబట్టి యటవీ శాఖవారా విత్తనము లేస్థితిలో మొలకెత్తునో పరీక్షించి వాని నితరస్థలములందు తోటలో గాని, అలంపురము, ఉమామహేశ్వరమువంటి ప్రసిద్ధ క్షేత్రము లందుగాని వేయించి పెంచుట మంచిది.
ఇతర దేశములందిట్టి చారిత్రక స్థలము లున్నయెడల వానిని ప్రతిదిన ప్రాతర్దర్శన స్థలములుగా రూపొందించుకుందురుగాని మనవారట్టి స్థలములను ప్రాతఃకార్యముల కుపయోగింతురు. గనుక పురాతత్వ శాఖవారుగాని, దేవాదాయ శాఖవారుగాని యిట్టి స్థలములకొక తగుపాటి రక్షణ యేర్పరచి దర్శనీయస్థలములుగా కాపాడుట మంచిది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి