యింటిలో ధర్మరాజు వంటివాడు. మృదుభాషి, హాస్యప్రియుడు, వైద్యనిపుణుడు మరియు ఒక మంచి ఆధ్యాత్మికవేత్త. అతనికి చిన్నప్పటి నుండి తెలుగు భాష అంటే అమితమైన ప్రేమ. మంచి పఠనాసక్తితో అనేక పుస్తకాలను చదువుతూ, వాటిలో గల ధర్మ సూక్ష్మాలను అందరికి అర్ధం చేయించడంలో ప్రథముడని తెలుపవచ్చు.
మా నాన్నగారి కోరిక మేరకు అన్నయ్య కష్టపడి ఎంబిబియస్ సీటు సంపాదించాడు. మా బాల్యంలో అన్నయ్య పెద్ద చదువు చదువుతున్నాడని, అతడిని మనం ఏ విధంగాను ఆటంక పరచవద్దని మేము చాలా భక్తి భావనతోను, భయంతోను ఉండేవాళ్ళం. ఆయన చదువు పూర్తి చేయడానికి తమ్ముళ్ళు కూడా చాలా తోడ్పడ్డారు.
అమ్మనాన్నలు ఆయన చదువుకు పడిన కష్టాన్ని చూసి, నాన్నగారి ధర్మప్రవర్తన వలన, అమ్మ ప్రేమ వలన అతడిలో నిస్వార్థ సేవ చేయాలనే సంకల్పం దృఢపడింది అనుకుంటాను. ఎవరి నుండి ఎలాంటి సహాయాన్ని ఆశించకుండా పిలవగానే అందుబాటులో ఉన్న ఏకైక వైద్యుడు మా అన్నయ్య. ఏరోజు కూడా ఆయన విసుగుపొందడు. నిరంతరం ‘మానవ సేవయే మాధవసేవ’ అని నమ్ముతూ మా బంధువర్గాని కంతటికి సేవలు అందిస్తున్న మహామనిషి మా అన్నయ్య.
మా ఆడపిల్లలందరికి ప్రసవ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆపరేషన్ థియేటర్‌లో తానే ముందు ఉండేవాడు. ఆయన థియేటర్‌లో ఉంటే దేవుడు మాతోనే ఉన్నాడన్న భరోసా మా అందరిలో ఉండేది.
మా అన్నయ్యకు డబ్బు సంపాదించాలన్న కోరిక ఏనాడు లేదు. ఎప్పుడు నిస్వార్థంగా తన వృత్తిధర్మాన్ని నెరవేర్చాలనే సంకల్పం ఉన్నందున ఇప్పుడు కూడా వయసును లెక్కించక విశ్వబ్రాహ్మణ వైద్య సంఘంలో ఉచిత సేవలందిస్తున్నారు.
ప్రతిరోజు నారాయణగుడా నుండి మెహిదిపట్నానికి (గుడిమల్కాపూర్) వచ్చి తన అమÖల్యమైన సమయాన్ని వైద్య సేవ కొరకు వినియోగిస్తున్న గొప్ప మనిషి మా అన్నయ్య.
ఇంతకు పూర్వం అన్నయ్య కార్వాన్‌లో ఒక క్లినిక్‌లో సేవలు అందించేవారు. ప్రతిరోజు ఇంటికి వస్తూ ఆగ్రా స్వీటు షాప్ నుండి మంచి స్వీట్స్ తెచ్చేవాడు. ఆయన ఇంటికి వచ్చేసరికి రాత్రి 11 గంటలయ్యేది. ఆ సమయంలో నిదుర పోతున్న మా అందరిని లేపి మాచే ఆస్వీట్స్ తినిపించేవాడు. ఆ రోజులు మరువలేము అన్నయ్య.
మా నాన్నగారికి అన్నయ్యపై అమితమైన ప్రేమ. అన్నయ్య తండ్రికి పెద్ద కొడుకుగా అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉంటూ, మా అందరిని జీవితంలో స్థిరపడేటట్టు చేసారు. నాన్నగారి అభీష్టమే నా అభీష్టమని నమ్మిన శ్రీరామచంద్రుడు మా అన్నయ్య.
మా అన్నయ్య నాన్నగారి అడుగు జాడలలో నూటికి నూరు శాతం నడిచారు. వీరిద్దరిని చూస్తూంటే భగవద్గీతలోని ఒక శ్లోకం గుర్తుకు వస్తుంది. అది,
“యద్యదాచరతి శ్రేష్టః, తత్తదేవేతరో జనః
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే”
మా నాన్నగారు చీఫ్ అకౌంట్ ఆఫీసర్‌గా ఉండి, ఎట్టి క్లిష్ట పరిస్థితులలోను ధర్మాన్ని విడువకుండా నిజాయితీగా ఉండి తన సర్వీసును పూర్తి చేసారు. పెద్దన్నయ్య కూడా అడిషినల్ డైరక్టరుగా (ఎయిడ్స్ ప్రాజెక్ట్) ఉండి ఎలాంటి ప్రలోభాలకు తలవొగ్గక చాలా నిజాయితీగా తన ధర్మాన్ని నిర్వర్తించారు. ఇంటి పెద్దలు, శ్రేష్టులు ఏది ఆచరిస్తారో అదే అందరు ఆచరిస్తారనడానికి ఇదే నిదర్శనం.
ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలని అదే జీవిత పరమార్ధమని తాను ఆచరిస్తూ, అందరిని ఆచరింపజేసాడు. మా అందరిని విష్ణు, లలితా సహస్రనామాలను పారాయణం చేయడంలో నిరంతరం ప్రోత్సహిస్తూ తన వంతు సహకారాన్ని అందించారు. ఆయనలో గల ఆధ్యాత్మిక తపన, నిస్వార్థ సేవను చూసిన శ్రీశ్రీ రామేశ్వరానందస్వామి ఆయనను గొల్లపల్లిలోగల లలితాంబిక తపోవనానికి ట్రస్టీగా నియమించారు.
విద్యను అభ్యసించడానికి వయసుతో పనిలేదని తెలుపుతూ రిటైర్ అయిన తర్వాత మొబైల్ ఫోన్ ద్వారా జ్యోతిష్యశాస్త్రాన్ని నేర్చుకుని మా యింటిలో జరిగే ప్రతి కార్యక్రమానికి ముహుర్తాలను తానే పెట్టి ఒక మంచి జ్యోతిషశాస్త్రవేత్తగా మారారు మా అన్నయ్య.
అతడి పేరు కాళిదాస్ అని పెట్టడంలో ఆంతర్యం ఏమిటో గాని తనదైన శైలిలో పెళ్ళి పత్రికలను వ్రాయడంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. అందరికి జన్మదిన శుభాకాంక్షలను తనదైన శైలిలో, చక్కటి బావ జాలంతో వ్రాస్తారు.
అన్నయ్యకు తన కుటుంబం అంటే అమితమైన ప్రేమ. ఎన్ని పనులున్నా కుటుంబానికి, కుటుంబ సభ్యులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే తన కుటుంబమే తన బలం మరియు బలహీనత కూడా.
ఈ రోజుకు కూడా రాఖీ పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే మొదటి వ్యక్తి. ఆ రోజు తమ్ముళ్ళందరితో యజ్ఞోపవీతాన్ని మార్పించే కార్యక్రమం చేస్తాడు. మేము మొదట ఆయన చేతికి రాఖీ కట్టాకే బయటికి వెడతారు.
మా అక్కాచెల్లెళ్ళను సొంత బిడ్డలుగా చూసుకుంటూ, మా ఇళ్ళలో జరిగే అన్ని శుభకార్యాలకు తానే ముందుండి కార్యక్రమాలు చేస్తారు. ఒడిబియ్యం కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తారు.
“అన్న” అను పదంలో ‘అ’ అను అక్షరం” అమ్మ” నుండి, ‘న’ “అను అక్షరం “నాన్న” నుండి తీసుకుంటే ఏర్పడిందని నా భావన. అందువలన అమ్మలోని ప్రేమ, మమకారం, నాన్నలోని బాధ్యత, భరోసా అన్నయ్య నుండి పొందుతున్నాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి