ఎనిమిది పదుల జీవితభారం మల్లెపువ్వు బరువుకన్నా తక్కువంటూ తేలికగా నవ్వే టి.ఎల్.కాంతారావు, తెలుగు సినిమా రంగంలో మరుపురాని మహోన్నత నటుడు! ఆయన విశిష్ట నటనకు వచ్చిన విశేష పురస్కారం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ (2000). అవార్డు వస్తేనే నటనకు గౌరవం, గుర్తింపు అనుకుంటే పొరపాటే! కాంతారావుకి ఈ గౌరవం ఆయన నటప్రపూర్ణుడిలా నటనోన్నత శిఖరాలపై చిద్విలాసంగా తేలి యాడినప్పుడు రాలేదు. నట జీవితం, నిజ జీవితం పండుగా మారినప్పుడు దోసిట్లో వాలింది. ఇది కూడా అపూర్వమైన ఆనందాన్ని కలిగించే ఘట్టమే!
ఈ జీవితంలో ఎంత హుషారున్నా, హాయి వున్నా, వుల్లాసం వున్నా, నిరుత్సాహమున్నా...
ఈ అవార్డు పునర్జన్మ నిస్తుంది! మళ్ళీ మళ్ళీ మధుర స్మృతుల్ని బడిచేరుస్తుంది!!
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డు గత స్మృతుల్ని తవ్వితీస్తుంది. జానపదనాయకుడి జ్ఞానకాల శకలాలు శ్రావణ మేఘాల్లా వడివడిగా నడుస్తూ రమ్యానందపు రమణీయలోకంలోకి తోసుకెళ్తాయి!!
నా పూర్తి పేరు తాడేపల్లి లక్క్ష్మీకాంతారావు. నేను నý£్గండజిల్లా గుడిబండ గ్రామంలో 1923 నవంబరు 16న జన్మించాను. నా మÖడోఏటే మా తండ్రి కేశవరావుగారు చనిపోయవడంతో మా అమ్మతో సీతారామమ్మ గారితో పాటు ఖమ్మం మెట్టు చేరుకున్నాను. కోదాడ, ఖమ్మంలోనే హైస్కూలు ఫైనలు వరకూ చదువుకున్నాను. చదువుమీద పెద్ద పెద్ద శ్రద్దా అదీ వుండేది కాదు గాని నాటకాలంటే చాలా ఇష్టంగా వుండేది. అంటే నాటకాలు ఆడాలనే అభిప్రాయం లేకపోయినా నాటకాలంటే తెగ చూసేవాణ్ణి - వేషాలు వేయాలని సరదా పడేవాణ్ణి.
చదువు తర్వాత మా ఊళ్ళో కొంతకాలం మునసబుగా పని చేశాను. అలా మునసబు గిరీ చెలా యిస్తున్న రోజుల్లో సురభి నాటక కంపెనీ వాళ్లు మా వూరొచ్చి ఒక నాటకాన్ని చూడటానికి ఊరి పెద్ద మునసబుగా నన్ను ఆహ్వానించారు. దాంతో నాలో వున్న కళాతృష్ణ విజృంభించింది. నాకా నాటకాల సరదా వున్నది. ఐతే నా సరదా తీరడానికి మార్గమే లేదు. ఇలాంటి సమాజాలలో చేరితే నా కింక అడ్డేమిటి? ఆలోచించాను, సురభి వాళ్ల నాటకం చూశాక, నేను గ్రీన్‌రూపంలోకి వెళ్లి ఆమాటా ఈమాటా మాట్లాడి - నన్ను కూడా వాళ్ల సమాజంలో చేర్చుకోమన్నాను.
అలా ఆరు నెలల పాటు నేను సురభి నాటకాల్లో వేషాలు వేసి ఊరూరా తిరిగినాను. సురభి కంపెనీలో అన్ని వేషాలూ అందరూ వెయ్యగలిగి వుండాలి కాబట్టి - నాకు అన్ని వేషాలూ వచ్చాయి. ఆ నాటకానుభవమే సనివిÖలలో నాకెంతో తోడ్పడింది. అన్ని రకాల వేషాలు వెయ్యడంవల్ల ‘నటించడం’లోని వైవిధ్యం నాకు క్షుణ్ణంగా అర్థమైంది. సురభి కంపెనీ వారి ‘వైరు వర్కు’ నాటకాల్లో దేవుళ్ల వేషాలు చాలా వేశాను. నా 16వ ఏట అంటే జనవరి 1939లో తొలిసారిగా ముఖానికి రంగు వేసుకుని సురభి వారి కృష్ణలీలలు నాటకంలో బ్రహ్మవేషం వేశాను. ఆ తరువాత అర్జునుడు, శ్రీకృష్ణుడు, నారదుడు మొదలైన పాత్రలన్నీ ఆనాడే అంటే సినిమాల్లోకి రాకముందే వేశాను.
తర్వాత సురభి కంపెనీని విడిచిపెట్టేసి నేనే స్వంతంగా నాటక సమాజాన్ని స్థాపించాను. దాని పేరు బాలమిత్ర సమాజం. మధుసేవ, జయంతీ జయపాల, చింతామణి మొదలైన నాటకాలను ప్రాక్టీసు చేసి పక్కవూళ్లో నాటకాలు ఆడేవాళ్లం.
రజాకార్ల విజృంభణతో గ్రామాలు ఖాళీ కావడంతో నేను జగ్గయ్య పేట కొచ్చేసాను - అయినా అక్కడకూడా నాటకాలు ఆడడం సాగిస్తూనే వుండేవాన్ని.
ఆ సమయంలోనే సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. దానికి కారణాలు రెండు, ఒకటి ఖమ్మంలో మా ఇంటి ఎదురుగుండా మాస్టర్ విశ్వంగారు (జెమినీ బాలనాగమ్మలో బాలవర్ధిరాజు) వుండేవారు. ఆయన సినిమాల్లో నటిస్తుంటే, ఆయన్ను అందరూ ప్రత్యేకంగా చూసేవారు. ఒకరకమైన గౌరవం చూపేవారు. ఆ ప్రభావమÖ నాపై కొంత వుండి, సినిమాల్లో నటించాలని ప్రయత్నాలు సాగించాను. అలాగే రెండోకారణం “బాలరాజు”లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఇన్సిపిరేషన్.
1950 సెప్టెంబరు నెలలో మద్రాసులో అడుగుపెట్టాను. రోహిణి సంస్థలో టి.కృష్ణ అనే మామిత్రుడు ఎడిటర్‌గా పనిచేస్తుండే వాడు. అతన్ని కలుసుకుని, అతని సహాయంతో నేను తెలుగుటాకీ పితామహుడు హెచ్.ఎం.రెడ్డిగారి “నిర్దోషి” సినిమా షూటింగులో కలుసుకున్నాను. ఆ సెట్‌లో ముక్కామల, అంజలి నటిస్తున్నారు. ఆ దృశ్యంలో కొంతమంది గ్రామస్థులు పాý£్గనాల్సి వుంది. మా కృష్ణ నన్నొక పల్లెటూరి వ్యక్తిగా మేకప్ వేయించి గుంపులో ఒకడిగా నిలబట్టాడు. ఒక డైలాగ్ కూడా చెప్పించాడు. మరి నా రూపంలో, డైలాగ్ డెలివరీలో దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి గారికి ఏం కనిపించిందో ఏమో - కాసేపు పరిశీలించి, ఇహ ఇలాంటి వేషాలు ఇతనికి ఇవ్వకండి’ అంటూ బయటకు పంపించేశారు. అయ్యో ఇదేం దురదృష్టం’ అని నేననుకుని, బాధ పడ్డాను. ఆ మరునాడు హెచ్.ఎం.రెడ్డిగారు నన్ను ప్రత్యేకంగా పిలిపించి - నా ‘నెక్ట్స్ ఫిలిమ్‌లో నువ్వే హీరోవి’ అని ప్రకటించారు. నా చెవుల్ని నేనే నమ్మలేక పోయాను. ఆశ్చర్యంతో శరీరంలో వణుకు ప్రారంభమయ్యింది. ఆనందానికి అవధులు లేవు. ఐతే, రెడ్డిగారి ‘నెక్ట్స్‌పిక్చరు’ మరి రెండేళ్లకు గాని ప్రారంభం కాలేదు. ఈ రెండేళ్లూ నేను ఖాళీగానే కూర్చున్నాను. హెచ్.ఎం.రెడ్డిగారు వేషం యిస్తున్నారని, హీరోయే ఇస్తున్నారని నేను ఇంకెక్కడా ప్రయత్నం చెయ్యలేదు.
రెండేళ్ళ ఓర్పు తర్వాత హెచ్.ఎం.రెడ్డి “ప్రతిజ్ఞ” తీసారు. ఆ చిత్రం షూటింగ్ ఒక సంవత్సరం పైగా నడిచింది. ఇందులో సావిత్రి హీరోయిన్. గిరిజ నా చెల్లెలు. రాజనాల విలన్‌గా పరిచయమయ్యారు. ఆ సినిమాకు గాను నాకు నెలకు రెండువందల యాభై రూపాయలు జీతం ఇచ్చేవారు. హీరో (ప్రతాప్)గా నటించిన ఆ చిత్రం జనవరి 1952లో ప్రారంభం అయి 1953 ఆగస్టులో రిలీజయింది. “ప్రతిజ్ఞ” తమిళ వెర్షన్ “వంజమ”లో కూడా నేనే హీరోగా నటించాను.
రాజనాలను చూసినప్పుడల్లా ఓ సంఘటన గుర్తుకొచ్చేది. సాధారణంగా చిత్రం ప్రారంభం టైటిల్స్ చూపించేటప్పుడు ముందు హీరో పేరు, తర్వాత విలన్ పాత్రధారి పేరు వెయ్యడం ఆనవాయితీ. అందుకు భిన్నంగా నా మొదటి చిత్రంలో ఏ కారనం చేతనో ముందు రాజనాల పేరు, తర్వాత నా పేరు ‘టైటిల్సు’లో చూపడం జరిగింది ‘ఆ కారణంగా చాలా కాలం పాటు నన్ను రాజనాల అనీ, రాజనాలని కాంతారావు అనీ చాలా మంది ప్రేక్షకులు పొరబడ్డారు. ఆ తర్వాత మేమిద్దరం తెరపై చాలా చిత్రాలలో నాయక, ప్రతినాయిక పాత్రలు పోషించాం. ఇప్పటికీ చాలామంది ఏ ఫంక్షన్ కెళ్ళినా, సభలకెళ్లినా ‘కాంతారావు - రాజనాలల కలయిక మళ్లీ ఎన్నటికీ రాదు’ అని అనుకుంటూ వుంటే నాలో ఎక్కడ లేని సంతోషం, గర్వం పొంగుకొస్తాయి. అదొక యుగం, జానపద విలన్‌గా తనకు తానే సాటి అనిపించుకున్న ఏకైక విలన్ రాజనాల. సినిమాలలో మేము బద్ధవైరులుగా నటించినా నిజజీవితంలో మాత్రం మంచి మిత్రులం. అప్పట్లో మేమిద్దరం ఏ ఫంక్షన్‌కి వెళ్లినా ఒకే పూలదండతో మా ఇద్దరినీ సత్కరించేవారు. కానీ ఈ రోజున రాజనాల లేడు, మా ఇద్దర్నీ పైకి తెచ్చిన విఠలాచార్యగారు లేరు - నిజానికి నా కొచ్చిన ఈ అవార్డులో సగం వారిద్దరిదీ.
“ప్రతిజ్ఞ”లో హీరో ప్రతాప్‌గా నా సినీజీవితాన్ని ప్రారంభించాను - ఆ సినిమా షూటింగ్ సందర్భంగా గుర్రపు బగ్గీ వేగంగా వెళ్ళడంతో చిన్న ఏక్సిడెంట్ కూడా జరిగింది. ఇటువంటి ఎన్నో ఎక్సిడెంట్లను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాను. “ప్రతిజ్ఞ” విజయవంతమైనా వేషాలు రాలేదు. ఇహ తిరిగి ఇంటికి వెళ్ళిపోదామనుకునే సమయంలో యన్.టి.రామారావు గారు పిలిచి తన సొంతచిత్రం ఎన్.ఏ.టి వారి “జయసింహ” లో తమ్ముడి వేషం ఇచ్చారు.
ఎన్.టి.రామారావుగారితో నా మొదటి పరిచయం హెచ్.ఎం.రెడ్డి గారి ఆఫీసులో జరిగింద. ఆ పరిచయంతోనే వారి “జయసింహ”లో తమ్ముడి పాత్రకు మొదట అక్కినేని నాగేశ్వరరావు గారని, తర్వాత జగ్గయ్యగారనీ అనుకుని చివరకు ఆ అవకాశాన్ని నాకు కల్పించారు. ఆ చిత్రంలో నేను నటిస్తున్నప్పుడు ఆయన నాకెన్నో సలహాలు ఇచ్చి నా భవిష్యత్తుకు కారకులైన వారిలో ఒకరయ్యారు. ఆ చిత్రంలో అన్నదమ్ములుగా నటించిన మేము నిజజీవితంలో కూడా అన్నదమ్ముల్లాగా స్థిరపడిపోయాం. ఆ అభిమానంతోనే “సీతారామ కల్యాణం”లో నారద పాత్రను ఇచ్చి నా చేత ‘కామెడీ’ చేయించిన ఘనత వారికే చెల్లింది.
“సీతారామకల్యాణం”లో నేను నారద పాత్ర ధరించిన తర్వాత నాకు అపరనారదునిగా ఎనలేని కీర్తివచ్చింది. తదాదిగా “శ్రీకృష్ణ పాండవీయం”, “శ్రీకృష్ణ తులాభారం” మొదలైన చిత్రాల్లో నారదునిగా మంచి పేరు వచ్చింది. ఆ నారద పాత్రలో నాపై చిత్రీకరించిన ‘భలే మంచి చౌక బేరము’ వంటి పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. నాకు ఎక్కువగా ఘంటసాల, పి.బి.శ్రీనివాస్ ప్లేబాక్ ఇచ్చారు. ఘంటసాల గారి కంటే కూడా తెరవెనుక పి.బి.శ్రీనివాస్, తెరముందు నేను బాగా పాపులర్ అయ్యాం. అందుకే ఈ మధ్య మా ఇద్దరికి కలిపి కిన్నెర వాళ్లు తిరుపతిలో ఘంటసాల సతీమణి శ్రీమతి సావిత్రిగారి సమక్షంలో ఘనసన్మానం చేశారు. ఘంటసాల గారు సొంతంగా నిర్మించిన ‘భక్తరఘునాధ”లో కూడా నేనే హీరోగా నటించాను. జమున కథా నాయిక.
సరే, అలా “సీతారామ కల్యాణం”లో నన్ను పైకి తెచ్చిన రామారావుగారు మరో సందర్భంలో కూడా నన్ను కాపాడారు- ఎలాగంటే, “లవకుశ” చిత్రంలో మొదట లక్క్ష్మణుడి పాత్రకు నన్ను ఎన్నుకుని, మధ్యలో నన్ను తొలగించే ప్రయత్నాలు జరిగినప్పుడు నిజ సోదరుడుగా చొరవ తీసుకుని ఆ పాత్రను కాంతారావే పోషించాలి. ఆర్టిస్టుని మార్చడానికి వీల్లేదు’ అని నిర్మాత (శంకరరెడ్డి గారికి)కు గట్టిగా చెప్పి, పట్టుబట్టి నాచేత లక్క్ష్మణ పాత్రను ధరింపజేశారు. ఆ లక్క్ష్మణుడి పాత్ర నాకు బాగా నచ్చినపాత్ర. చిరస్మరణీయమైన పాత్ర. దానికి నాటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి జాతీయ బహుమతి అందుకున్నాను. ఆ సభలో నాటి ప్రధాని జవ జవహర్‌లాల్ నెహ్రూ, బెజవాడ గోపాలరెడ్డి తదితరులు వున్నారు.
పౌరాణికాల్లో రామారావు గారు కృష్ణుడి పాత్ర ధరిస్తే నేను నారదుడుగా, ఆయన అర్జునుడుగా నటిస్తే నేను కృష్ణుడుగా (నర్తనశాల, 63) నటించడానికి ముఖ్య కారకులు ఎన్.టి.రామారావు గారే.
“వీరాభిమన్యు”లో నేను అర్జునుడుగా నటించినప్పుడు బృహన్నల పాత్ర ధరించాల్సి వచ్చినపుడు, “నర్తనశాల”లో రామారావుగారు పోషించిన ‘బృహన్నల’ పాత్రను జ్ఞప్తికి తెచ్చుకుని. ఈ పాత్రకి నేను తగుదునా లేదా’ అని సందిగ్థంలో పడ్డాను. అప్పుడే ఎన్.టి.ఆర్.గారు ఇది చిన్న ఇన్సిడెంట్ మాత్రమే. కాబట్టి నాట్యభంగిమ కంటే నడకలో స్త్రీత్వం చూపిస్తేచాలు’. అని సలహా ఇచ్చి కొండంత ధైర్యం ఇచ్చి ఆపాత్ర రాణింపుకు దోహదపడ్డారు. ఆ చిత్రంలోనే అభిమన్యుడు మరణించిన తర్వాత ‘విశ్వరూప సందర్శనం’ సమయంలో మేం గతస్మృతులు చెప్పుకున్నప్ప... ఒక విధమైన వైరాగ్య ధోరణి మాలో కలిగేది. అది దరిమిలా మేమిద్దరం ఎప్పుడు కలుసుకున్నా ఆధ్యాత్మిక విషయాలనే మాట్లాడుకునే వాళ్లం.
సరే, ఎక్కడికో వెళ్లిపోతున్నట్లున్నాం, విషయం దగ్గరికొచ్చేస్తాడు.... అంతకుముందు “తోడుదొంగలు” తీసి నష్టపోయిన రామారావుగారు రూటు మార్చి డి.యోగానంగారి డైరెక్షన్‌లో “జయసింహ” నిర్మించి తమ పతాకాన్ని నిలబెట్టుకున్నారు. ఆ చిత్రం అప్పటికి వున్న అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టింది. టి.వి.రాజు గారి మÖ్యజిక్ బ్రహ్మాండంగా వుండి, ఘనవిజయాన్ని చేకూర్చింది. ఆ సినమాలోనే ఎం.ఎస్.రామారావుగారు పాడిన “జీవితమింతేలే మానవ జీవితమింతేలే’ అనే పాట నాపై చిత్రీకరించిన పాట, బాగా పాపులర్ అయ్యింది. కానీ అదేం దురదృష్టమో అంత విజయవంతమైన ఆ సినిమా తరువాత నాకు ఆరు సంవత్సరాలపాటు ఆఫర్లే లేవు. సరిగ్గా ఆ సమయంలోనే జానపద బ్రహ్మ బి.విఠలాచార్యగారు తొలిసారిగా తెలుగులో నిర్మించిన సాంఘిక చిత్రం “కన్యాదానం”లో హీరో పాత్ర వేయించారు. అందులో షావుకారు జానకి గారు హీరోయిన్. అయినా కొంతకాలం విరామం తప్పలేదు. ఆ సినిమా పెద్ద సక్సెస్ కాలేదు. దాంతో విఠలాచార్య గారు కూడా తన ధోరణి మార్చుకుని నన్ను జానపద హీరోగా తీర్చిదిద్ది “వరలక్క్ష్మివ్రతం”, “జయవిజయ”, “శ్రీకనక దుర్గ పూజా మహిమ” నిర్మించారు. ఈ మÖడు ఘనవిజయం సాధించి, కనక వర్షం కురిపించాయి. ఇహ అప్పటినుంచి నేను జానపద నాయకునిగా పేరు తెచ్చుకుని, లక్షలాది ప్రేక్షకులకు దగ్గరయ్యాను. ఎంతోపేరు ప్రఖ్యాతులు సంపాదించాను. మాది ఒక యÖనిట్‌గా వుండేది. నేను, కృష్ణకుమారి, రాజశ్రీ, రాజనాల-ఇలా. “గురువును మించిన శిష్యుడు”, “నువ్వానేనా”, “చిన్నడు-దొరకడు”, “తోటలో పిల్ల కోటలో రాణి”, “దేవుడి గెలిచిన మానవుడు”, “కంచుకోట”, “ఆకాశరామన్న” మొదలైన చిత్రాలన్ని నాకు మంచిపేరు తెచ్చినవే. అయితే వీటిలో ఇంకా బాగా పేరు తెచ్చిన చిత్రం “ఆకాశరామన్న”. ఆ చిత్రంలో వివిధ పాత్రలూ ధరించి, ప్రతి పాత్రలోనూ జీవించాలని అందరి మెప్పూ పొందాను. అలాగే మరో చిత్రం “అగ్గిదొర”. నా శక్తికి, యుక్తినీ సమస్థాయిలో ఇమిడ్చి, బిగువుగా సృష్టింపబడిన పాత్ర కావడం వల్ల నాకు బాగా పేరు వచ్చింది. “అగ్గిదొర”లో నాయికగా భారతి నటించింది. ఆమె అంతకుముందు నేను నటించిన “విజయభేరి”లో ఒక చిన్న పాత్రను పోషించింది. ఆ చిత్రంలో ఆమెను చూసినప్పుడే ఎందుకో, భారతికి గొప్ప భవిష్యత్తు వుందనిపించింది. ఆ తర్వాత నేను నటించిన చాలా చిత్రాలలో ఆమెకు మంచి పాత్రలు ఇమ్మని నిర్మాతలకు - దర్శకులకు చెప్పడం జరిగింది. అలా “అగ్గిదొర” చిత్రంలో నా సరసన నాయికగా భారతికి తొలిసారిగా హీరోయిన్ వేషం లభించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో మా జంట కొంతకాలం హిట్‌పెయిర్‌గా చెలామణి అయ్యింది. “అందుకోసం పందెం”, “ఉక్కుపిడుగు” లాంటి చిత్రాలు మా కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు.
అలాగే వాణిశ్రీ, నేను హీరోగా నటిస్తున్నప్పుడు వాణిశ్రీ కామెడీపాత్రలు పోషించేది. ప్రతీ చిత్రంలోనూ కామెడీ పాత్రలు పోషించే వాణిశ్రీని చూసినప్పుడల్లా ‘ఈ అమ్మాయికి ఉజ్వల భవిష్యత్తు వుంది’ అని అనుకొనేవాడిని. 1962లో “సోమవారవ్రత మహాత్మ్యం” చిత్రం షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు నేనూ, రాజనాల కలసి వెయ్యబోతున్న ‘అలెగ్జాండరు’ నాటకం కోసం ‘స్టిల్స’ తియ్యటానికి అప్పటి రత్నకుమారి (ఇప్పటికి వాణిశ్రీ) మేకప్ వేయించి సెట్స్‌కి, తీసుకెళ్లాం. చిత్ర దర్శకుడు కృష్ణస్వామి సహకారంతో మÖవీకెమెరాతో కొన్ని భంగిమలు చిత్రీకరించి, ఆ తర్వాత ‘స్టిల్స’ నాగరాజారావు గారితో కొన్ని ‘స్టిల్స’ తీయించాం. కృష్ణస్వామి, నాగరాజారావు వాణిశ్రీని చూడగానే ‘ఈ అమ్మాయి సినిమాలకి పనికి రాదు’ అని తేల్చేసారు. అప్పుడు నేను వారిని ప్రతిఘటించి, ‘వాణిశ్రీ’కి ఎప్పుడు హీరోయిన్ ఛాన్సువస్తుందా? ఎప్పుడు వారిని దెప్పిపొడుద్దామా అని అనుకునే వాడిని మనసులో.
ఆ తర్వాత కొద్దికాలానికే “రణభేరి” చిత్రంలో వాణిశ్రీని హీరోయిన్‌గా, రాజశ్రీని వాంప్‌గా ఎన్నుకున్నారు నిర్మాతలు. వాంప్ పాత్ర రాణిస్తేనే చిత్రం రాణిస్తుంది. అంచేత నిర్మాతలతో చెప్పి రాజశ్రీని హీరోయిన్‌గా చేసి వాణిశ్రీకి వాంప్ పాత్రను ఇప్పించాను. అప్పుడు అందరూ నా మీద అభాండాలు వేశారు. చిత్రం విడుదలైన తర్వాత నా జడ్జిమెంట్ కరెక్టని ఒప్పుకున్నారు. “ఆకాశరామన్న” చిత్రంలో కూడా ఆమె వాంప్ పాత్రని పోషించింది, ఎప్పుడూ వాంప్ పాత్రలేనా’ అని ఆమె విచారించేది. ‘వాంప్ పాత్రల్లో కూడా నీకు నువ్వే సాటి. మనం హీరోహీరోయిన్లుగా కలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది” అని ఓదార్చేవాడిని. ‘అలాగే, “దేవుని గెలిచిన మానవుడు” చిత్రంలో వాణిశ్రీ నా సరసన కథానాయికగా నటించింది. ఆ తర్వాత “మరపురాని కథ”తో తారాస్థాయి నందుకుంది. ఆమె హీరోయిన్ అయిందని తెలియగానే... మాట నెగ్గించుకున్నందుకు నేనెంతో గర్వపడ్డాను. ఇలా ఆరోజుల్లో నటీనటుల మధ్య పరస్పర సహకారం, ఆరోగ్యవంతమైన పోటీ ధోరణి వుండేవి.
ఇలా ఎంతమంది హీరోయిన్లతో పని చేసినా నాకు పేరొచ్చింది రాజశ్రీ, కృష్ణకుమారిల సరసనే. ఆ ఇద్దరూ కూడా కాంతారావు మా హీరో అని చెప్పుకుంటారు.
నేను ఈ రోజు ఇంకా పరిశ్రమలో కొనసాగుతూ, పట్టెడన్నం తింటున్నానంటే అదంతా విఠలాచార్యగారి ధర్మమే ఎన్నో సినిమాల్లో నాకు వేషాలిచ్చి, జానపద హీరోగా, పరిశ్రమలో ఒక రాజకుమారుడిగా అఖండగౌరవాన్ని సంపాదించి పెట్టారు. దానికి వారికి సర్వదా కృతజ్ఞున్ని. కానీ మరో కోణంలో ఆలోచిస్తే నా అభివృద్ధిని కొంత నిరోధించిందీ ఆయనే. ఎలాగంటే ఆయన నాకు బయట ఆఫర్లు రాకుండానూ, వచ్చినా నేను చేయకుండానూ వుండేటట్టు ప్లాన్‌చేసుకునేవారు. ఆయన ఎంత రెమÖ్యనరేషన్ ఇస్తే అంతే తీసుకునేవాడిని. ఆయన చాలా పకడ్బందీ గల నిర్మాత. తన చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకోకుండా జాగ్రత్త పడేవాడు. శతదినోత్సవం వల్ల వచ్చేపేరు ప్రఖ్యాతలు, ఉత్పాహ పోత్సాహాల కన్నా, ఆయనకు ఆ కారణంగా అయ్యే ఖర్చు గురించి మాత్రమే ఆలోచించేవారు. ఏ చిత్రం అయినా శతదినోత్సవం చేసుకుంటే ఆ యÖనిట్‌కు, థియేటర్ల వారికి అదనపు బోనస్‌లివ్వాలి. మెమొంటోలివ్వాలి. ఆయా పట్టణాలకు వెళ్లాలి. నటీనటులు, సాంకేతిక నిపుణులు వీళ్ళందర్నీ తీసుకువెళ్లాలి. ఈ విషయాలకంతా ఎంతో కొంత డబ్బు ఖర్చు అవుతుంది కదా - అదంతా వారికి నచ్చేది కాదు. ఒక వేళ నేను, ఎన్టీఆర్ కలసి నటించిన విఠలాచార్యగారి సినిమాలు ఏవైనా శతదినోత్సవాలు చేసుకోకుండా ఆపితే - ఆయనకు ప్రత్యేకంగా ఓ బంగారు గొలుసో, చేతికి కంకణమో - తానే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అందజేసేవారు. దాంతో ఆ కథకు తెరపడేది. అలా నన్ను ఎదగనివ్వనిదీ. విఠలాచార్యగారే.
కాని ఒక్కటి - ఎవరికి ఎంత ప్రాప్తమో అంత. నేనేమీ దానికి చింతించేవాడిని కాదు. ఒక్క విఠలాచార్య గారి వద్దే గాక ఎస్.భావనారాయణ, పింజల సుబ్బారావు గార్లు తీసిన పలు జానపదాల్లో కూడా నేను హీరోగా విజయదందుభి మ్రోగించాయి. అవి తమిళంలోకి డబ్ అయి విజయం సాధించాయి కూడా. అరవంలో నా మార్కట్ ఒక దశలో తమిళహీరోలకి పోటీగా వుండేది. అప్పట్లో నా అరవ చిత్రాలు చూసి పత్రికలూ, ప్రజలూ ఆంధ్రా ఎం.జి.ఆర్. అని సరదాగా ఆయనతో పోల్చేవారు.
ఆ పగలల్లా కష్టపడి శ్రమించిన శ్రామిక హృదయాలను మత్తెక్కించడానికి, వాస్తవ జగత్తునుంచి ఊహాప్రపంచానికి తీసుకువెళ్ళి వాళ్ళను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తటానికీ మనం చూడనివి, చూడలేనివీ చూపించగలగడానికే - ఎక్కువ అవకాశం జానపదాల్లోనే వుంది. సాధారణ ప్రేక్షకులు తమ కష్టాలు మరచి, ఎక్కువగా ఆనందించాలటే జానపద చిత్రాలను మించిన మత్తుమందు ఇంకొకటి లేదు గనుక, జానపద చిత్రం విడుదల చేసిన తర్వాత తన పెట్టుబడికి భంగం లేదని నిర్మాత సుఖంగా నిద్రపోవటానికి జానపదచిత్రాలు ఎంతో సహకరిస్తాయి కనుక, అటు ప్రేక్షకుల కోరికా, ఇటు నిర్మాతల కోరికా కాదనలేక జానపదాల్లోనే ఎక్కువగా నటించేవాడిని. ఎంతో రిస్క్‌ఫేస్ చేసేవాటిని. “గురువును మించిన శిష్యుడు” చిత్రంలో నోరు కుట్టేసిన సింహంతో పోరాడినప్పుడు ఆకట్లు తెగిపోగా అదృష్టవశాత్తు బయటపడ్డాను. అలాగే “శ్రీ గౌరీ మహాత్య్మం”లో నిజమైన సర్పాల్ని మెడలో ధరించాను. ఇవన్నీ ఈరోజున గుర్తుకొస్తే కూడా ఒళ్లు జలదరిస్తుంది.
జానపద చిత్రాల హీరోగా ముద్రపడిన నన్ను “శభాష్ రాముడు” సాంఘిక చిత్రంలో ఒక చిన్న పాత్రను, ఆ తర్వాత “శాంతినివాసం”లో అక్కినేని నాగేశ్వరరావుగారితో సరిసమానమైన పాత్రను ఇచ్చి కాంతారావు జానపద చిత్రాýకే పరిమితం కాదు. సాంఘిక చిత్రాలలోనూ నటించడానికి పనికి వస్తాడు’ అని నిరూపించిన దర్శకుడు సి.ఎస్.రావుగారు. “శాంతినివాసం”లోని రఘు పాత్ర నాకు మంచి పేరు తెచ్చింది. ఆరితేరిన అష్టదిగ్గరజాల మధ్యలో (సూర్యకాంతం, చిత్తూరు నాగయ్య, పి.హేమలత, కె.వి.ఎస్.శర్మ ఇత్యాదులు) జంకులేకుండా నించోగలిగాను. ఆ పాత్ర ప్రజా హృదయాలలో మాయని ముద్రగా నిలిచిపోయింది. “శాంతినివాసం” చిత్రానికి సంబంధించ చిన్న జ్ఞాపకమొక్కటి చెప్తాను-
“శాంతినివాసం” నిర్మించే కాలంలో నాకు, దేవికకూ ఒక మంచి రొమాన్సు సీను వచ్చింది. అయితే సోషల్ చిత్రాలలో - అందులోనూ అంతటా కత్తిమీద సాములాంటి వేషం వేయడం అప్పటికి కాస్త కొత్త కావడం వల్ల నేను మొదట్లో కాస్త బెదిరిపోయేవాడ్ని.
డైరెక్టరు సి.ఎస్.రావు ఇది గమనించి, “కాంతయ్యా! (ముద్దుపిలుపు) ఏంటయ్యా! రొమాన్సు సీను అనే సరికి అలా బెదరిపోతావు! స్టేజ్ మీద చంద్రగుప్త అలెగ్జాండర్ వంటి హిమాలయన్ మౌండెన్సు లాంటి వేషాలు అవలీలగా వేసే నీకు ఇలాంటి రొమాన్సు ఓ లెక్కా!” అని ఎంకరేజ్ చేశాడు.
దానికి నేను “అది కాదండీ - అసలు రొమాన్సు అనే ఘట్టం వచ్చినపుడు ‘ప్రేమ’ అనే భావాన్ని ఎఆల చూపించాలో - ఎతా నటించాలో సరిగ్గా అర్థం కావడం లేదు,” అన్నాను.
సి.ఎస్.రావు గారు కాస్సేపు ఆలోచించి, “చూడు, కాంతయ్యా! నీకు చాలా ఇష్టమైన తిండి ఏమిటి?” అని అడిగాడు.
దానికి నేను సిగ్గుపడుతూ, “ఉల్లిపాయల పెసరట్టు అంటే నాకు నోరూరిపోతుంది, డైరెక్టర్ గారూ!” అని చెప్పాను.
దానికి రావుగారు సమాదానంగా “చూడు... ఇకముందు ఎప్పుడు రొమాన్సు సీను వచ్చినా - ఆ ఎదుట ఉన్న హీరోయిన్ ఎవరయినా సరే - దేవిక కాని, సావిత్రి కాని, అంజలి కాని - మరెవరైనా కాని, నీ మనస్సులో మట్టుకు గట్టిగా ఉల్లిపాయల పెసరట్టు జ్ఞాపకం తెచ్చుకో. అంతే! ఎక్స్‌ప్రెషన్ అదిరిపోతుంది. ఇదే బైరాగి చిట్కా!” అన్నాడు. ఆ తరువాత చూడండి - ఎంతో పకడ్బందీగా ప్రణయసన్నివేశాల్లో నటించేవాణ్ణి.
ఈ విధంగా “కంచుకోట”, “ఏకవీర” వంటి చిత్రాల్లో ఎన్.టి.రామారావు గారితో సరిసమానమైన పాత్రను ఇచ్చి ‘నువ్వు నాగేశ్వరరావు, రామారావులతో సమానమైన వాడివే’ అంటూ ఎంతో ప్రోత్సహించేవారు. నేను సాంఘిక చిత్రాలలో కూడా నటించి ‘సోషల హీరో’గా కూడా రాణించటానికి కారణం సి.ఎస్.రావు గారే! అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవడం నా ధర్మం.
సాంఘిక చిత్రాల ప్రసక్తి వస్తే కథానాయకునిగా నటించినవి, “ఖైదికన్నయ్య”, “శ్రీమతి”, “ఆనందనిలయం” “ఎదురీత” వంటి కొద్దిచిత్రాలే అయినా సహకథానాయకునిగా యన్.టి.ఆర్. సరసన “రక్తసంబంధం”, “ఆప్తమిత్రులు”, “ఆడబ్రతుకు”, “స్త్రీజన్మ” వంటి చిత్రాల్లోనూ, విలన్ తరహా పాత్రల్ని “దేవుడు చేసిన మనుషులు”, “ఒకే కుటుంబం” వంటి చిత్రాల్లోనూ పోషించాను. అక్కినేని సరసన “శభాష్ రాజా”, “బంగారు గాజులు” చిత్రాల్లో విలనిక్ టచ్ వున్న పాత్రల్ని పోషించారు.
జీవితం ఒక చదరంగం అన్నట్లు సినిమా జీవితం కూడా ఒక చదరంగమే. అలా ఆ సినిమా జీవిత చదరంగపు ఆటలో - మంత్రిలా సాగాను నేను! ఆటలో మంత్రి ఏ ఎత్తయినా వెయ్యగలిగినట్టు నేను ఏ పాత్రనైనా వెయ్యగలిగాను. వెయ్యగలుగుతున్నాను. అందుకే ఒక చిత్రంలో హీరో, ఇంకో దాంట్లో విలన్ ఒక దాంటో కృష్ణుడు - ఇంకోదాంట్లో అర్జునుడు, ఇంకోదాంట్లో విష్ణువు - మరొకదాంట్లో శివుడు, ఒక సాంఘికంలో డాక్టరు - ఇంకో సాంఘికంలో లాయరు. ఇలా ప్రతి పాత్రనూ పోషించాను. నాపై నమ్మకముంచి ఆ పాత్రలిచ్చిన నిర్మాతల నమ్మకాన్ని వమ్ము చేయలేదనే అనుకుంటూ వుంటాను.
“సతీసుమతి”, “భక్త అంబరీష”, “ఉషాపరిణయం” వంటి పౌరాణికాలు, “పల్నాటి యుద్ధం”, “అల్లూరి సీతారామరాజు” వంటి చారిత్రకాలు, “బంగారు కలలు” వంటి సాంఘికాలు ఇవన్నీ కలిపి ఇప్పటికి సుమారు 450 చిత్రాల్లో వివిధ భాషల్లో కలిపి నటించి వుంటాను.
నటుడు ఎం.బాలయ్య నిర్మించిన “నేరము-శిక్ష”లో నేను మొట్టమొదటి సారిగా తండ్రి పాత్రను పోషించాను. ఇక అప్పటినుంచి ‘ఓ సీతకథ”, “అందమె ఆనందం”, “గుణవంతుడు”, “సుజాత”, “ముత్యాలముగ్గు” మొదలైన చిత్రాల్లో గుణచిత్ర నటుడు కారక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగాను - కొనసాగుతున్నాను.
ఇక నా వ్యక్తిగత వివరాలంటారా... నా భార్య పేరు హైమావతి. మాది పెద్దల అంగీకారంతో అయిన ప్రేమ, పెళ్లి, మా బ్రాహ్మణుల పిల్లే. నేను బహు కుటుంబిని. మాకు నలుగురు మగపిల్లలు, ఒక అమ్మాయి. వాళ్లందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి. మనవలూ, మనవరాళ్లూ మాది చాలా పెద్ద కుటుంబం. నా ముగ్గురు కొడుకులు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మÖడో వాడు రాజా మాత్రం టి.వీ సీరియల్స్‌ను పని చేసాడు. అతడు చిన్నప్పటి నుండీ నటుడే. అక్కినేని, ఆదుర్తి గార్లు నిర్మించిన “సుడిగుండాలు”లో నటించాడు. నిర్మాతలెవరైనా చేయÖతనిస్తే తన ప్రతిభ నిరూపించుకుంటాడు.
ఇలా ఎన్నో అనుభూతులు పొందిన నేను పరిశ్రమలోనే చేదు అనుభవాలు రుచిచూశాను. దానికి కారణం నేను నిర్మాతగా మారి చిత్రాలు నిర్మించడమే. కొన్ని చిత్రాలు బాగానే పోయాయి. “సప్తస్వరాలు”, “గండరగండడు”, “గుండెలు తీసిన మొనగాడు”, “ప్రేమజీవులు”, “స్వాతిచినుకులు” నిర్మించాను. వీటిల్లో నాకు బాగా పేరు తెచ్చిన చిత్రం “సప్తస్వరాలు”. వేదాంతం రాఘవయ్యను దర్శకునిగా పెట్టుకుని నిర్మించిన చిత్రమది. అది జానపదమే అయినా నా అభిరుచి మేరకు నిర్మించాను. సంగీతంలో సరస్వతిని మెప్పించి, నారదుని కోపానికి గురియై, అయోనిజుడిగా భూలోకంలో ఒక నిస్వార్థ జీవికి దొరికి, ఇటు సంగీతంతో పాటు, కావలసిన సాము గరిడీలు నేర్చి, ప్రాణాలను సైతం లెక్కచేయని సాహసవంతుడిగా రూపొంది, భగ్న ప్రేమికుడై, ప్రేమించిన రాకుమారికి దూరమై, తన సంగీతంతో భగవంతుని మెప్పించి, తనను పెంచిన తండ్రి కోరిక ప్రకారం అనేక కష్టాలను ఎదిర్చి, అనేక త్యాగాలు చేసి, మోక్షగంధర్వ రాక్షసమాయల నెదిరించి, పాతాళంలో నిక్షిప్తమైన శారదాపీఠాన్ని తెచ్చి, కళానిలయమైన ఆ పీఠాన్ని భూలోకంలో ప్రతిష్ఠింపజేసే నవరసాలతో కూడిన పాత్ర “సప్తస్వరాలు”లో హీరో సారంగుని పాత్ర. అది నేనే ధరించాను. మంచి ఫలితమే సాధించాను.
అలాగే మరోచిత్రం “ప్రేమజీవులు”. నేను హీరోగా నటిస్తున్న రోజుల్లో నేను హరోగా నటించకుండా కృష్ణని హీరోగా పెట్టి, సైడుహీరో పాత్రను నేను పోషించి నా వయసుతో పాటు పాత్రకి న్యాయం చేకూర్చాలని మొట్టమొదటి సారిగా నేను ప్రయత్నించింది నా సొంత చిత్రం “ప్రేమజీవులు” ద్వారానే. ఇక కృష్ణ గురించి వేరే చెప్పక్కర్లేదు. చాలా చక్కని నటుడు. సహృదయుడు. ఆ అభిమానంతోటేనేమో ఆయన నిర్మించిన ప్రతిచిత్రంలోనూ దాదాపు నాకు వేషాలిచ్చాడు. కురుక్షేత్రం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, భోగభాగ్యాలు ఇలాంఇ సినిమాలన్నీ ఆయన వల్లే చేయగలిగాను.
గుమ్నామ్ ఆధారంగా తీసిన “గుండెలు తీసిన మొనగాడు”, మరికొన్ని చిత్రాలు చాలా ఘోరంగా పరాజయం పాలయ్యాయి. నాకు తీవ్రమైన నష్టాన్ని మిలిల్చాయి. ఆదశలోనే మళ్లీ సాహసానికి దిగాను. “స్వాతి చినుకులు” (1989) చిత్రం ప్రారంభించడమే పెద్ద తప్పు.
అప్పటికే పూర్తిగా మునిగిపోయాను. పెద్దతారలతో నిర్మించిన ఆ చిత్రం భారీ బెడ్జెట్‌గా తయారై 28 లక్షల రూపాయలు ఖర్చు చేయించింది. అంతా జేసి కొనడానికి బయ్యర్లు అంత సుముఖంగా లేరు. అయినా కొందరి ఒత్తిడివల్ల దాన్ని విడుదల చేయతప్పలేదు. ఆ చిత్రం ఎంత వేదన మిగిల్చినదంటే నా మిగిలిన ఆస్తి అంతా అమ్మి అప్పులు తీర్చాను. రాజభవనం లాంటి స్వంత ఇంటిని ఆ సందర్భంలో 13 లక్షలకు అమ్మేశాను. దాన్ని వీరయ్య చౌదరిగారనే భూస్వామి కొనుక్కున్నారు. అంతా కోల్పోయాను. నా యావదాస్తిని కళారంగానికే కర్పూర హారతిగా సమర్పించాను. నిర్మాతగా నేను చాలా నష్టపోయాను. దీనికంతా ఒకరు దోషులు, మరొకరు నిర్దోషులు అని మనం వేలెత్తి చూపాల్సిన అవసరం లేదు. నా కళాకాంతులన్నీ హరించుకుపోవటాన్ని నేను కాలపురుషుడిలీలగానే భావిస్తున్నాను. నా అదృష్టం వక్రించి, నాజాతకం బాగాలేదు అంతేగానీ మరొకరు కారకులు కాదు.
సరే ఇలా సర్వం పోగొట్టుకుని ఏమీ లేని వాడిలా పూలమ్మినచోటే కట్టెలమ్మ లేక మద్రాసులో వుండలేక 1990లో హైదరాబాద్ వచ్చేసాను. ఆర్థికంగా చితికి పోయాను. ఒకే భోజనాన్ని పదిమందితో పంచుకున్నరోజులున్నాయి, ఒకే నెలలో ప్రతి రోజు సన్మానాలు, అవార్డులూ అందుకున్నరోజులూ వున్నాయి. అయితే తృప్తిని మించిన ఆనందం లేదు. తృష్ణను మించిన కష్టం లేదని తెలుసుకున్నాను. ఆర్థిక పరిస్థితి బాగుందీ అని చెప్పలేను, అంతబాగాలేదు అని చెప్పలేను. బాబా దయ వల్ల ఏదో జరిగిపోతోంది. ఆధ్యాత్మిక చింతనము మించినది ఈ ప్రపంచంలో మరొకటి లేదు.
తమిళనటుడు రజనీకాంత్‌గారు ప్రతినెలా నాకు కొంత ఆర్థిక సహాయం అందిస్తున్నారు అందుకు వారికి కృతజ్ఞతలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి