మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, అక్టోబర్ 2026, సోమవారం

ముసాఫరులు ... గుర్రం జాషువ

ఆధునీకాంధ్ర సాహిత్యంలో వెలిగిన దృవతార గుర్రం జాషువ. సామాజిక రుగ్మతల్ని ఖండిస్తూ దేశభక్తి జాతీయతా భావాల్ని ప్రేరేపిస్తూ కవితా విన్యాసం చేసిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా. అతి సహజంగా సుందరంగా సామాన్యుని జీవిత నేపధ్యంగా సాగిపోయే కవిత్వం రాయటం జాషువ తత్వం. అనుభూతి ఆవేదనల వ్యక్తీకరనే జాషువ కవిత్వం. సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంటరాని తనమనే చీకట్లను చీల్చుకుంటు వచ్చిన వెలుగురేఖ జాషువ. ఈయన జీవితాన్ని కవిత్వాన్ని విడదీసి చూడలేము. బాధామయ జీవితాన్ని గడిపిన ఈయన గుండెలోతుల్లోంచి భావం పొంగి పొర్లుతుంది. అస్పృశ్యతా నిరసనం, మÖఢాచార గర్హణం, పీడుతుల పట్ల సానుభూతి, జాతీయ దృష్టి జాషువ కవిత్వంలో ప్రధానంగా కనిపించే అంశాలు. 

వినుకొండలో పుట్టి విశ్వనరునిగా ఎదిగిన గుర్రం జాషువా తన వ్యక్తిత్వాన్ని తన కావ్యాల్లో స్పష్టం చేశాడు. జాషువ స్వప్నకథ, అనాధ, గబ్బిలము, కాందిశీకుడు, స్వయం వరము, కొత్తలోకము, ముసాఫిరులు, బాపూజీ, నేతాజీ, రాష్ట్రపూజ, నాగార్జునసాగర్, ముంతాజమహల్, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర మొదలైన ఖండ కావ్యాలు ఆధునీకాంధ్ర సాహిత్యాకాశంలో కాంతివంతంగా వెలిగిన తారలు. కళాప్రపూర్ణ, పద్మభూషణ్ కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి, మధురశ్రీనాథ మొదలైన బిరుదులు ఈయన ప్రతిభకు పురస్కారాలు. గండపెండేరం, కనకాభిషేకం, గజారోహణం మొదలైనవి ఈయన సత్కారాలు. క్రీస్తు చరిత్రము కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి ఈయన విద్వత్తుకు తార్కాణం. ఉభయ భాషా ప్రవీణుడిగా, ఉపధ్యాయునిగా, ఆకాశవాణిలో ప్రయోక్తగా ఈయన ప్రజ్ఞ అసాధారణం. సహజసిద్ధమైన ప్రతిభలో ఆనాటి సమాజంలో అనేకమైన ఒడిదుడుకుల్ని ఎదర్కొని కవిగా తనకొక ప్రత్యేకతను నిలుపుకున్నాడు. అరబ్బీ, పారశీక, ఆంగ్ల పదాలను తన కవిత్వంలో అలవోకగా ప్రయోగించి తన దక్షతను ప్రకటించుకున్నాడు. కులమతాలతో కుళ్ళి కంపు కొడుతున్న సమాజంలోని అస్తవ్యస్త పరిస్థితులు తొలగిపోయి సమసమాజం అనే నూతన జగత్తును ఆశించాడు. జాషువ కవిత్వంలో జీవితం ఉంటుంది. తన కవిత్వానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. జాషువ రాసిన కావ్యాఖండికల్లో ఒక విలక్షణమైన నడకుంటుంది. ఈయన స్వీకరించని కవితా వస్తువులేదు. ప్రతి ఖండికలో తన వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే భావాలు, ఆలోచనలు పదప్రయోగాలు ఉంటాయి. ఏ పద్యాన్ని చదివినా అది గుండె లోతుల్లోంచి పొంగి పొర్లిన ప్రవాహంలా ఉంటుంది. ఆయన నాస్తికుడు కాదు ఆస్తికుడు కాదు ఒక పక్కా మానవతావాది. 

జాషువ రాసిన గొప్ప రచనల్లో ముసాఫరులు ఒకటి. 1963లో ఈ రచన వెలువడ్డది. హైకోర్టు న్యాయవాది, అప్పటి శాసనమండలి సభ్యులు మాలకొండారెడ్డికి అభిమానంతో అంకిత మీయబడ్డది. ఒకరోజు జాషువ తన సహచరుడైన ఆంజనేయులుగారితో జరిపిన సంభాషణ ఈ కావ్య సృష్టికి కారణం. జాషువ వయసు మీరిన తర్వాత రాసిన కావ్యం ముసాఫరులు. ముషాఫిర్ అంటే బాటసారి, యాత్రికుడు అనే 

అర్థాలున్నాయి. ఈ కావ్యం రెండు ఆత్మల సంభాషణం. ఇది జాషువ అద్భుతమైన కల్పితం. ఇహానికీ, పరానికీ ప్రయాణించే రెండాత్మల సమావేశమే ముసాఫరులు కావ్యంలోని కథావస్తువు. ఈ కావ్యం రాసే సమయానికి భారత, చైనాల మధ్య సరిహద్దుకు సంబంధించి యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో ఒక భారతీయ వీరుడు ప్రాణాలు కోల్పోయి వీరమరణం పొందాడు. దేహాన్ని కోల్పోయి ఆత్మ చంద్రమండల సమీపంలోని ఒక సత్రంలో సేదతీర్చుకుంటుంది. స్వర్గం నుండి భూలోకానికి వస్తున్న ఒక ఆత్మ అదే సత్రంలో సేద తీర్చుకొనటానికి వచ్చింది. ఈ రెండు ఆత్మల సంవాదమే ఇందులోని కథా. 

ముసాఫరులు అనేక సామాజిక అంశాలపై జాషువ అభిమతానికి అద్దం పడుతుంది. సామాజిక రాజకీయ, మత, వైజ్ఞానిక రంగాలలో జరుగుతున్న మార్పులను అవాంఛనీయ సంఘటనలను ఎత్తిచూపటం గమనించాలి. అరిషడ్వర్గ వ్యాకులమైన ఈ లోకంలోకి కొత్తగా వస్తున్న వాళ్ళు, ఖాలీ చేసిపోతున్న వాళ్ళు అసంఖ్యాక ప్రాణికోటికి గమ్యం ఏది? జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి మార్గమేది? అన్న తత్వవివేచన జాషువ ముసాఫరులలో కనిపిస్తుంది. 

జన్మసార్థకతకు సల్పు కార్యము లేమి? 

పాపపుణ్యములకు ఫలితమేమి? 

అన్న ప్రశ్నలు భూమిమీదికి అవతరిస్తున్న చిరుప్రాణితో పలికించిన తీరు మానవజీవిత పరమార్థాన్ని గూర్చి జాషువ చేసిన వివేచనను సూచిస్తుంది. మానవ జన్మసార్థకతకు కావాల్సిన దారులు వెతకకుండ మనిషి స్వార్థచింతనతో లోక విరోధిగా అశాంతితో జీవించటం జాషువకు మింగుడుపడలేదు. ఉన్నతమైన జీవితానికి కావాల్సిన మెలుకువలు తెలుసుకోలేక, తెలుసుకున్న సత్యాన్ని ఆచరించక, మనిషి తనను తానే మోసం చేసుకుంటున్నాడని జాషువ బాధపడ్డాడు. 

విశ్వమానవులైన కవులకు కూడా కులం మతం రంగు పూయకూడదన్నది జాషువ నిశ్చితాభిప్రాయం. కులమతాలకు, వర్ణ వర్గాలకు, ప్రాంత భాషలకు అతీతమైనవాడు కవి అని జాషువ నమ్మకం. ముసాఫరులు కావ్యంలో ఈ విషయం స్పష్టం చేశాడు జాషువ. 

విశ్వమానవ గోత్రేయ వీరులైన 

కవులకున్ కర్మబంధము కట్టబెట్టి 

పులుముచుందురు తలమీద కులమురంగు 

ఈ లోకంలోని ప్రజలు కవులకు బేధ భావాలు కట్టబెట్టి కులం రంగు పులుముతున్నారు. తక్కువ కులంలో పుట్టిన గొప్ప కవినైనా కులం ప్రాతిపదికగా గుణ గణాలను నిర్దేశించటం శోచనీయం అని వాపోవటం గమనించాలి. ఒక వ్యక్తిని ఆ వ్యక్తికున్న ప్రతిభతో, గుణంతో లేక శ్రమించే తత్వంతో గౌరవించాలని ఆశించాడు. కవుల కులగోత్రాల ద్వారా ప్రతిభను అంచన వేయకూడదని కవులంత విశ్వమానవ గొత్రేయులని కులం రంగు అంటించవద్దని వేడుకున్నాడు. 

ఆధునిక యుగంలో మనిషి భౌతికమైన పురోభివృద్ధిని సాధిస్తున్నాడు. మానవతకు ఊపిరిపోసే మనసును పెంపొందించుకోవటంలో తిరోగమిస్తున్నాడు. మానవుని మేధాశక్తి గ్రహాల గతులను లెక్కకట్టె పనిలో ఉన్నా మనిషి మాత్రం తన మనస్సును జయించలేక పోతున్నాడు. బుద్ధికి మనసుకు అంతరం పెరిగింది. మానవతను మరిచి దయా హీనుడై ధరిత్రినంతా నాశనం చేస్తున్నాడు. ఈ విచిత్ర పరిస్థితిని గూర్చే జాషువ ముసాఫరులు క్యావంలో వెల్లడించాడు. 

అరయన్ రోదసిలో మనుష్యుడు సునాయాసంబుగా జొచ్చిదు

స్తరవేధోండ రహస్యముల్ తెలుపు ప్రజ్ఞాశాలియయ్యున్ పర

స్పర విద్వేషవిషాద చండళిఖి నార్పంజాల డింకెన్నడీ 

ధరణీసుందరి మోము శాంతిదళపద్మంబై వికాసించునో 

ఈ మాటలు జాషువ చెదిరిన తన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి. జాతి మత కుల విద్వేషాలు లోకకళ్యాణానికి ప్రతిబంధకాలుగా పరిణమించాయని తెలుసుకున్నాడు. మనిషి మనస్సులో నుండి భేదభావం తొలగినప్పుడే మరో మంచి ప్రపంచం సాకారం అవుతుంది. విశ్వశ్రేయస్సుకు ప్రతిబంధకంగా మారిన రాగద్వేషాలు, సంకుచిత తలంపులు తొలగనంతవరకు పురోగభివృద్ధి జరగదని విశ్వశ్రేయోవాదాన్ని నమ్మినవాడు జాషువ 

సత్యం, ధర్మం తెలుసుకొని వాటిని పాటించినప్పుడే మనిషి ఆనందమయ జీవితం గడుపుతాడు. సత్యం ధర్మం అనే విషయాలు బయటదొరికే పదార్థాలు కావు. మనిషి తన గుణశీలాల ద్వారా వాటిని అనుసరించి పెంపొందించుకోవాలి. మనిషి సత్యము తెలుసుకొని ధర్మబద్ధమైన జీవితం గడిపిన నాడే ప్రశాంత జీవితం సమకూరుతుందని జాషువ సత్యధర్మ మార్గాలను నమ్మాడు. మనిషి అసత్యం ద్వారా అధర్మం ద్వారా సంపాదించిన సంపద చనిపోతే మనిషితో పాటు రాదని జాషువ ప్రబోధిస్తున్నాడు. భౌతిక పదార్థం ద్వారా శాశ్వత ఆనందం లభించదని కేవలం సత్యమార్గంలో ధర్మబద్ధమైన జీవితంతోనే మనిషికి సుఖశాంతులు సిద్ధిస్తాయని నమ్మాడు. జాషువ ముసాఫరులు కావ్యంలో 

ధర్మమును సత్యమను పదార్థములు రెండు

కలవు దొరకవు నీకు నంగళ్ళ యందు

నిత్యము లభించు రత్న మాణిక్యమణులు

అనుగమింపవు నిన్ను దేహంతరమున 

ఈ మాటలు ప్రాపంచిక విషయాల మీద మక్కువ వదిలి ధర్మమార్గంలో పయనించమని సూచిస్తున్నాయి. శాశ్వతమైన కీర్తికి అశాశ్వతమైన వస్తువులు ఏవి ఉపకరించవని జాషువ తెలియజేశాడు. మనిషి జీవించినంత కాలం సత్యమార్గంలో ధర్మనియమాలతో ఉండాలని సూచించాడు. 

జాషువ కావ్యాల్లో దేశభక్తి, జాతీయభావాలు ఎక్కువగా కనిపిస్తాయి. ముసాఫరులు కావ్య ఖండికల్లో కూడ జాతీయభావం కనిపిస్తుంది. భారతదేశం చైనాతో యుద్ధం జరుగుతున్న సందర్భంలో వచ్చిన ముసాఫరులు కావ్యంలో 

కొమరుల కోసమై భరతగోరమణీమణి పిండుచున్న క్షీ

రము పరరాజధూర్తులకు ప్రాప్త ముగాదిక చీని రాజ్య మే 

ఘము హిమశైల భూముల నకారణగర్జలు సల్పసాగె ద 

ర్పముగల భారతప్రళయ వాయుహితం దుమురై నశించెడిన్ 

భారతదేశమనే గోవుకు పిండుతున్న పాలు ఇకమీద కేవలం భరత పుత్రులకే గాని నీచులైన విదేశీ రాజులకు ప్రాప్తించవు. చైనా రాజ్యమనే మేఘం మంచుకొండ ప్రాంతంలో అకారణంగా గర్జిస్తున్నది. శక్తితో కూడిన గర్వంతో వీచే భారతీయ ప్రళయవాయువు యొక్క దెబ్బకు చైనా రాజ్యమేఘం చెల్లాచదురై పోతుంది. అన్నది ఈ పద్య తాత్పర్యం. జాషువ దేశభక్తి పూరితమైన మాటలు ఆయనలోని జాతీయ భావానికి నిదర్శనం. శత్రువుల గుండెల్ని చీల్చి వారి నులివెచ్చని రక్తాన్ని ఆపోసన పట్టగలిగిన వీరశ్రేష్ఠులు ఈ భారతభూమిలో ఎంతోమంది ఉన్నారని భారతీయుల వీరత్వాన్ని కొనియాడినాడు. జాషువ ఖండికల్లో దేశభక్తి పరమైన భావాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. 

తన రచనల్లో దేశ భక్తులను, త్యాగమÖర్తులను, మహాత్ములను జాషువ వెలుగెత్తిచాటాడు. ముసాఫరులు కావ్యంలో 

ఒక త్యాగమÖర్తి ప్రేమకు పాదు లొనరించి 

స్వీయ రక్తమును వర్షించినాడు 

ఒక మహాత్ముండు స్వేచ్ఛకు ప్రాణ మర్పించి 

మైమీద బట్టతో బ్రతికినాడు 

ఒక రాచవా డహింసకు సర్వరాజ్యంబు 

విడనాడి భిక్షకు నడిచినాడు 

ఒకడు ఖొరాను వ్యాప్తికి దేశదేశాల 

తలదాచుకొని దీక్ష నిలిపినాడు 

త్యాగానికి ప్రతీక అయిన ఏసుక్రీస్తు తన రక్తాన్ని వర్షించి ప్రేమకు మార్గం చూపాడు. ఒక మహాత్ముడు స్వేచ్ఛ కోసం భారత స్వాతంత్రం కోసం ప్రాణాన్ని అర్పించి ఒంటిమీది బట్టతోనే బతికాడు. ఒక రాజకుమారుడు అహింసకోసం సమస్త రాజ్యాన్ని వదిలిపెట్టి భిక్షకోసం నడిచాడు. దుఃఖవిముక్తికి అష్టాంగ మార్గాన్ని ఉపదేశించి హింసను విడనాడమన్నాడు. ఒక మహానుభావుడు ఖురాను వ్యాప్తికి దేశదేశాల్లో తలదాచుకొని దీక్షతో జీవితాన్ని గడిపాడు. ఈ మహనీయుల దివ్యాత్మలు ఇహ పరలోకాల్లో శాశ్వత జ్యోతులై ప్రకాశిస్తుంటాయి. వారిని కాదన్నవారు తులనాడినవారు నామరూపాలు లేకుండ పోయారని జాషువ అంటాడు. జాతీయ నాయకుల పట్ల, మహాత్ముల పట్ల, త్యాగమÖర్తుల పట్ల జాషువకున్న అభిమానం ఆయనకున్న జాతీయ భావాన్నే కాదు ఆ త్యాగమÖర్తుల పట్ల ప్రగాఢమైన గౌరవ విశ్వాసాలు కలిగున్నట్లు తెలుస్తుంది. జాషువ జాతీయ కవి అనడానికి ఇది చక్కని ఉదాహరణ. నిస్వార్థానికీ, త్యాగానికీ, ప్రేమకు విలువ ఉంటుందనే సత్యాన్ని జాషువా నమ్మాడు. 

పశు లక్షణాలకు వివేకవంతులు దూరంగా ఉండాలని అంటాడు జాషువా. ద్రోహచింతన, కోపం చెడు ఫలితాల్ని ఇస్తాయనీ దుఃఖానికి కారణమౌతాయనీ అంటాడు. మనిషి మానవతకు దర్పణం పట్టే విధంగ నడుచుకోవాలంటాడు. 

అలుకయు రోషంబును దు 

ష్పలితంబులు గలుగజేయు బహువిధ దుఃఖం 

బుల కాటపట్టులగు వి 

జ్ఞుల దారిజీర వీ పశూత్కర ప్రకృతుల్ 

ఈ పద్యంలో మనిషి కోపాన్ని జయించాలంటాడు. ఇతరులకు నష్టం కలిగించే రీతిలో మనిషి ప్రవర్తణ, ఆలోచనలు ఉండకూడదని మనిషి మనిషిగా ఎదగాలంటాడు, ఎవరికైతే ఇతరుల పట్ల గౌరవభావం, ప్రేమ ఉంటుందో అట్లాంటి వాళ్లే ఆనందంతో జీవిస్తారని ముసాఫరులులో జాషువ అంటాడు. మితిమీరిన ధనం సంపాదించటం మంచిది కాదంటాడు జాషువ. కొంతమంది ధనవంతులు ధనాన్ని సంపాదిస్తారు దాచిపెడతారు. దాచి పెట్టడానికి సంపాదించటానికే వాళ్ళ జీవితం మొత్తం గడిపేస్తారు. కానీ ఎవరికీ బిచ్చమైనా వెయ్యరు. తాను తినకా ఇతరులకు పెట్టకా అట్లాగే బ్రతికేస్తారు. వారిని చూస్తూ వారి ప్రక్కనే చేరి మృత్యువు నవ్వుతూ ఉంటుందనే సత్యం తెలుసుకోరు. ఈ పద్యంలో జాషువ పిసినారి గుణాన్ని, విపరీత ధన సంపాదన వ్యామోహం ఉన్నవారిని హెచ్చరించాడు. చావునుండి ఎవరు తప్పించుకోలేరని బ్రతికినన్నినాళ్ళు ఇతరులకు సహాయం అందిస్తూ ఇతరుల మేలు కోరుకోవాలని అంటాడు జాషువ. ఈ క్రింది పద్యం అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. 

ధనమార్జింతురు దాతురు 

తిన రేరికి బెట్టరింత తిరిపంబు మహా 

ధనికులు కొందరు వారిం 

గనుగొనుచున్ మృత్యు వంతికంబున నవ్వున్ 

అంతేకాదు ఇంట్లో ఉన్న ధనం ఎరువు కుప్పలాంటిదంటాడు జాషువ. అది వ్యాప్తి చెందితేనే ఫలితం ఉంటుంది. ప్రవహించే నీరే పంటలు పండిస్తుంది ఆ నీరు కదలకపోతే పాచిపడుతుందంటాడు జాషువ. మానవవిలువల్ని మరిచి సంపాదించే ధనం నిరర్ధకం అని అట్లాంటి డబ్బు మనిషి ఆనందానికో అభ్యున్నతికో ఉపయోగపడదని జాషువ అభిప్రాయం. 

జాషువ మతాచారాల్లోని అంధ విశ్వాసాలను ఖండించాడు. ఆయనకు పేదరికం సహనాన్ని నేర్పితే కులతత్వం ఎదిరించే లక్షణాన్ని నేర్పింది. అందుకే కులమతాలు గీసుకున్న గీతలనడుమ కట్టుబడకుండా విశ్వనరుడిగా మానవతా ప్రబోధాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. అందుకే ఆయన రచనలు సంస్కృత, ఆంగ్ల, హిందీ, కన్నడ, జర్మన్ భాషల్లోకి అనువాదమయ్యాయి. సుకవి జీవించు ప్రజల నాల్కల యందు అన్నట్టు జాషువ తెలుగుభాష ఉన్నంత వరకూ జాషువ ప్రజల నాల్కలయందే కాదు ప్రజల మధ్య కూడా జీవించే ఉంటాడు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి