మనదేశంలోని ఆలయాలలో ఒక్కొక్కదానికి ఒక్కొక్కవిధమైన చరిత్ర, ఒక్కొక్క విధమైనకథ ఉన్నవి. అట్టివానిలో ఇదొకటి. ఈ గ్రామం ఇపుడు కొల్లాపురం తాలూకా లోని పెద్దకొత్తపల్లెకు మÖడు కిలోమీటర్లదూరంలో ఉంది. ఒకనాడిది పేరొందిన తిరునాళ్ళు. “తీరితే తిరుపతివెళ్ళు తీరకుంటే తిరుమలాపురమైన వెళ్ళు” అని యిక్కడి సామెత.
ఈ గ్రామం పూర్వం పానుగల్లు హవేలీలోనిది. దీన్ని 14-15 శతాబ్దాలలో బ్రాహ్మణప్రభువులు పాలించినారు. అక్కడి ప్రభువులదగ్గర కొప్పురాతిపల్లెకుచెందిన దేశపాండ్యాలు ఉండేవారు. ఆ కుటుంబంలో ఒకప్పుడు అంతమరాయడు, చిలుకల రాయుడు, తిరుమలరాయడు అనే సోదరులున్నారు. వారిది గంపెడుబలగం. ఇల్లు దోసపాదువలె ఉండేది. ఏ పండుగ, పబ్బమైనా ఘనంగాచేసేవారు.
అంతమరాయనిభార్య ఇంటికి యజమానురాలు. ఆమెకు విలువైన చంద్ర హారముండేది. దాన్ని ఆమె ప్రతిదినం స్నానంచేసేటపుడు వంటయింటిలో ఒక ఉట్టికి తగిలించి స్నానానంతరం మళ్ళీవేసుకునేది. ఆ ఉట్టిక్రిందనే ఊరగాయ జాడీ లుండేవి.
ఒకప్పుడామె దీపావళిపండుగ సందర్భాన తెల్లవారుజామున స్నానం చేసే టపుడది ఉట్టికి తగిలించి మళ్ళీ వేసికోవటంమరిచి ఏ సాయంత్రానికో స్ఫురణకువచ్చి చూసుకున్నది. అదిలేదు. ఆమె ఎవరికీ చెప్పలేదు. అయినా విచారం దాగదుగదా !
మÖడుదినాలు గడిచినవి. ఇంకా పండుగసందడి తగ్గనేలేదు. యింటి ముందరి పనిపాటులవారి కందరికి పెట్టవలసినవన్నిపెట్టి ఆమె విచారంగా గద్దెపీటపై కూర్చున్నది. అదిచూచి ఇంటిముందలి తలారులు ఎన్నడూలేనిది ఏదో విచారంలో ఉన్నారని అడిగినారు. ఆమె ఏమీలేదని తప్పించుకున్నది. కాని వారు కుచ్చికుచ్చి అడిగినారు. చివరకామెకు విషయం చెప్పకతప్పలేదు.
అది లంకంతయిల్లు. అందునా వంటయింటిలోనికి ఎవరూ వెళ్ళే మగ్దూరు లేదు. కనుక ఇది ఆ గదిలో పనిచేసేవారిపనే కావలెనని తలారులు నిర్ణయం తీసుకున్నారు. వారింటిలో ఇద్దరు వంటబ్రాహ్మణులుండేవారు. వారు స్మార్తులు. మంచి ఆచారపరులు, నిష్ఠావంతులు. కాని తలారులకు వారిపైనే అనుమానం కలి గింది. ఆనాటి సాయంకాలం వారిని ఏదో పనివున్నట్టు బయటకు పిలుచుకొని కొంతదూరం తీసుకొని వెళ్ళి గొలుసువిషయంచెప్పి, వంటయింటిలోనికి యితరులు రాలేరుకనుక ఇది మీపనేకావలె. దాన్ని మీరు తెల్లవారేవరకు ఏదోవిధంగా బయట పెట్టితిరా సరే ! మీతప్పుకాస్తాము. లేకుంటే ఈ చింతచెట్లకు వేలాడదీస్తాం అని బెదిరించి పంపినారు.
పాపం ! వారికి చేయని అపరాధం పైనబడింది. రాజు తలచితె దెబ్బలకు కొదువేమని వారికి తెలుసు.
రాత్రికి అందరూ మామÖలుగానే తినిపండుకున్నారు. తెల్లవారుజామున యజమానురాలు మామÖలుగానే వంటయింటిలోనికి వచ్చింది. అక్కడ ఒక్కడే పడుకొని ఉన్నాడు. తక్కినవాడెక్కడ అని ఆమె అటుయిటు చూచి అతనిని పిలిచింది. ఎంత పిలిచినా పలుకలేదు. ఆమె అనుమానంగా భర్తదగ్గరకు వెళ్ళి విషయంచెప్పింది. అతడులేచి గబగబావచ్చి చూచినాడు. అక్కడ నిద్రించినతడు ఎప్పుడో పెద్ద నిద్రలోకి వెళ్ళినాడు.
అంతవరకతనికి భార్యగారి చంద్రహారవృత్తాంతంగాని దానివెనుక యింటిలో ఏం జరుగుతున్నదిగాని తెలియదు. కనుక అతడెందుకు మరణించినాడో, రెండవవ్యక్తి ఏమైనాడో ఊహించలేకపోయినాడు. వెళ్ళినవానికొరకు కొంతసేపు వెదకించి మరణించినవ్యక్తికి యథావిధిగా దహనసంస్కారం నెరవేర్చి ఇంటికివచ్చిన పిదవ ఆ చావువిషయమై ఒక్కొక్కరిని నిగ్గదీసినాడు. అపుడింటిముందున్న తలారులు నిన్నటి సాయంకాలం వారిని జతాయించిన సంగతిచెప్పి పాదాలపైబడినారు. దాసుని తప్పులు దండంతో సరి.
ఇక చంద్రహారం ఎవరి చేతిలోనికి పోయిందో తేలలేదు. ఆనాడతనిని దహనం చేసి బావిదగ్గర స్నానంముగించుకొని వచ్చేవరకు బాగా పొద్దుపోయింది. వంటకుగూడ ఎవరూలేక ఆ పని అంతమరాయని భార్య మెడకేపడింది. ఆమె అన్నంమాత్రం వండి ఈ పూటకెలాగో పచ్చడితో దాటింతామని గరిటతీసికొని జాడిదగ్గరకువెళ్ళి యింత మామిడికాయ బయటకితీసింది .
అట్లా అమె గరిటతో పచ్చడితీసేవరకు దానితో పోయిందనుకున్న చంద్రహారం లేచివచ్చింది. అది చూడగానే ఆమెకు పరిస్థితిబోధపడింది. ఆమె “అయ్యో! ఈ జాడి పాడుగాను అన్యాయంగా మాకు బ్రాహ్మణహత్యను తెచ్చిపెట్టిందిగదా !” అని తిట్టుకుంటు భర్తదగ్గరకువచ్చి దాన్నిచూపి, “ఇదుగో చూచినారండీ దీన్ని నేను దినం ప్రకారంగా స్నానంవేళ ఉదయం ఉట్టికి తగిలించినానా ! ఆ ఉదయం ఎవరో పిల్లల చద్దిలోనికి ఊరగాయ తీసినట్లున్నారు. వారికి ఉట్టి తగిలి ఇది అందులో జారిపడింది. వారు కానలేదు. ఇపుడింతపని జరిగింది.” అని వివరించింది. దానితో అందరి సందేహంతీరి జరిగినదానికి మిక్కిలి విచారించినారు.
అప్పటినుండి యిక వారిల్లు కళతప్పింది. ఇంటికి పశువులదొడ్డికి ఏవేవో అరిష్టాలు చుట్టుముట్టినవి. దానితో వారికి ఆ గ్రామంవిడిచి మరోచోటికి వెళ్లాలని తలచి సెలవుకొరకు తమ గురువుగారిదగ్గరకు వెళ్ళినారు.
ఆయన భువనగిరిలో ఉండేవాడు. అంతమరాయసోదరులు తన దగ్గరకు వచ్చి జరిగినవిషయమంతా వివరించగా విని మీరు స్థలంమారినా “ఇది బ్రహ్మహత్య గాబట్టి దోషంపోదు. సకుటుంబంగా ఒకయేడు తీర్థయాత్రచేయండి!” అని చెప్పి నాడు. దానితో వారిల్లువిడిచి యాత్రలుచేస్తు తిరుగుముఖంపట్టిన తరువాత తిరుపతికిచేరి గోగర్భందగ్గర నిద్రించినారు. అపుడంతమరాయనికి చనిపోయిన వ్యక్తి కలలోకనిపించి “మీ రెక్కడికివెళ్ళినా నేను మిమ్ములనే కనిపెట్టుకొని ఉంటాను కనుక మీరు నా పేర దేవప్రతిష్టచేసి నిత్యారాధన నడిచేటట్లుచూడండి ! దానితో నాకు మీకు శుభంకలుగుతుంది” అని చెప్పినాడు.
అదివిని మరునాడు ఆంతమరాయడు తన కలను సోదరులకుచెప్పి ప్రస్తుతం తిరుమలాపురంలో ఉండే స్వామిని అక్కడనే తీసుకొని నిత్యోత్సవంతో బయలుదేరి భువనగిరిమీదుగావచ్చి తమ గురువుగారికి స్వప్నవృత్తాంతంచెప్పి ఆ స్వామిగారికొక అర్చకునీయవలసిందని అంతేగాక వారినిగూడ తమ వెంటనేవచ్చి తాము నివసించిన గ్రామంలోనే నివసించవలసిందని కోరినారు. అదివిని ఆయన వారివెంట స్వామివారి పూజకై ఆగమంవారనే ఒక పాంచరాత్రుని, కందాళవంశానికిచెందిన బంగారు భావనాచార్యుడనే పురుషుని పంపుతూ, ఇప్పటినుండి నేనిక మీగ్రామానికి రాలేను. మీరితనినే ఆచార్యునిగా భావించండి అని సెలవిచ్చినాడు. జనుంపల్లి వల్లభరావుగారి కాలంలో ఒక బంగారుభావనాచార్యులున్నాడు. అతడు ఫస్లీ.1078 ప్రాంతంవాడు.
వారు గురువులవారు పంపినవారిని తోడుకొని తమ పూర్వగ్రామ సమీపానికి వచ్చి ఒక చిలకలతోటలో విడిసినారు. వారు తమ నివాసం విడువవలె ననుకున్నారు కాబట్టి నేటి అచ్చంపేటతాలూకాప్రాంతానికి తమ బంధువర్గం కొందరంతవరకు వెళ్ళి ఉండటంవల్ల స్వామిని తీసికొని బలుమÖరికివెళ్ళి స్థిరపడవలెననుకొన్నారు గాని దైవసంకల్పం వేరుగానున్నది.
భోజనానంతరం బండ్లుకట్టగా అవి ఎంతకూ కదలలేదు. ఇదేమిటని విస్మయ పడుతుండగా స్వామి ఒకరికావేశమై “నే నిక్కడనే నిలుస్తాను. మీరూ ఇక్కడే ఉండండి” అని పలికించినాడు. తిరుపతిలోగూడ స్వామి మొదట ఒక చింతక్రిందనే ఉండెనట కనుక వారికి అక్కడొక పెద్ద చింతక్రింద ఒక చిన్న గుడికట్టి స్వామిని ప్రతిష్ఠించినారు. ఆ ప్రదేశం పెద్దచింతలతోట. దానికి తూర్పుగా నేటి నక్కలపల్లినుండి పసుపులవరకు నల్లరాళ్ళపనే. దక్షిణంగా ఎత్తంగట్టు, పడమరగా బిరుదువానిగుట్ట ఉండి వాని నడుమ ఆ ప్రదేశం ఒక ప్రత్యేకతగా ఉంది. స్వామివారి ఆజ్ఞమేరకు అంతమరాయ సోదరు లక్కడనిలిచి ఆ స్థలానికి “తిరుమలపురి” అవి పేరుపెట్టుకున్నారు.
ఆ విధంగా వారక్కడ నిలిచి మళ్ళీ తమ ప్రభువులైన పానుగంటివారి దగ్గరకు వెళ్ళగా వారు తమ దేశపాండ్యాలు తెచ్చినిలిపిన స్వామినంగీకరించి ఆ ప్రదేశమంతా నిధినిక్షేపాలతోసహా చెల్లేటట్లు వ్రాసియిచ్చి స్వామివారికి మండపప్రాకారాదులు కట్టించి దాని నిర్వహణభారాన్ని గోపాలపేట ప్రభువులకు అప్పజెప్పినారు. పిమ్మట క్రమంగా కొప్పురాతిపల్లె లేచివచ్చి అక్కడనిలిచి నేటి గ్రామంగా అయింది.
ఈ తరువాత ఒకప్పుడు కుతుబ్‌షాహీలకాలంలో వారు పానుగంటిపై దండెత్తి అక్కడి ప్రభువులను చెఱపట్టుకొని వెళ్ళినట్లు స్థానిక కైఫీయతులు చెబుతవి. కాబట్టి ఆ విధంగా ప్రభువులుపోగా దేశపాండ్యాలు మామÖలువారై పోయినారు. ఇపుడక్కడ స్వామివారినితెచ్చిన సోదరులలో తిరుమలరాయనివంశం ఉంది. ఆ వంశంలోని కొండలరావుగారు నాకీవృత్తాంతంచెప్పి ఆనాడు అంతమరాయనిగారి యిల్లాలు ఊరగాయజాడీ నేమన్నదో ! ఆ మాట అలాగే నిలిచింది. ఇప్పటికి మా యింటిలో ఊరగాయ నిలువదుకాబట్టి మేమది పెట్టము.” అని దాఖలా చెప్పినాడు.
ఆనాడు స్వామివారివెంట వచ్చిన ఆగమవంశంగూడా ఉంది. వారిదగ్గర ఇప్పుడు పూర్వపుజాస్తాప్రకారం సన్ 1297 లో పునరుద్ధరించబడిన సన్నదు
ఉంది. అది మళ్ళీ నడుమ సన్ 1357లో ఒకసారి “రెన్యువల” ఆయింది. దాన్నిబట్టి నైజాంప్రభువులు తమకాలంలో ఈ స్వామి ఉత్సవానికి ఏటా 180/- హాలీలుగూడా ఇచ్చేవారని తెలుస్తుంది.
స్వామివారివెంట వచ్చిన ఆచార్యకుటుంబంగూడా ఉంది. ఆ వంశంలో బంగారుభావనాచార్యులపేర పెక్కు పురుషులు గడిచినారు. వారు ఈ ప్రాంతంలోÁ సురభిప్రభువులకు ఇంకా ఇతరగురువులై అగ్రహారాలుగూడ పొందినారు. ఆ పరం పరలోని చివరిభావనాచార్యులు కొఠారివెంకటరాయుడు. ఆయన గోపాలపేట ప్రభువులకు గురువు. అందుచేత అతని ప్రేరణతో బహరీసవై వెంకటగోపాలరాయని పత్ని రాణీనరసమాంబగారీ స్వామిపై వట్టెంనివాసియైన తిరునగరిసింహయ్యతో తిరుమంగళయాళ్వారుచరిత్ర అనే యక్షగానం చెప్పించింది. అది సరసంగా ఉంది.
ఈ స్వామివారికి 900 ఎకరాలభూమి ఉంది. దానిలో 500 పనులవారికి 400 ఎకరాలు ముతవల్లీలకు మరియు ఉత్సవకైంకర్యాదులకు ఏర్పాటుండేది.
స్వామివారికి ప్రస్తుతం కందాళవారు ధర్మకర్తలుగా, ఆగమంవారు అర్చకులుగా, నర్లావారు వేదపండితులుగా, గొల్లూరువారు తమిళవేదపారాయణకర్తలుగా, ఉలుగొండవారు పురుషసూక్తంచెప్పేవారుగా దేశిరాజువారు కాయికోలాపరిచార కులుగా దేశపాండ్యాలు, చామరసేవకులుగా నియమితులై ఉన్నారు. వీరుగాక ఇంకా మంగళ్ళు, బోయలు మొదలైన పనివారందరూ ఉన్నారు.
ఈ స్వామికి ఒకప్పుడు కొంతకాలం వనపర్తి అప్పలాచార్యులవారు ధర్మకర్తగా వ్యవహరించినారు. ఆయనకాలంలో ఆలయాదాయంనుండి యాగశాల ఒక హనుమ దాలయం కట్టించినాడు. హనుమదాలయంలోని మÖర్తి కొప్పురాతిపల్లెలో ఉండగా తెచ్చినిలిపినారట.
ఈ స్వామికి ఈడిగ ఈరన్న హనుమంత-గరుత్మంత వాహనాలు, కట్లబాలయ్య అనే వైశ్యుడు అశ్వవాహనం, హరిజనకిష్ణన్న ఇత్తడితో చప్పం మొక్కుబడులక్రింద చేయించి అర్పించినారు. గ్రామస్థులు చందాలతో మంచిరథం చేయించినారు. ఇక్కడ మాఘమాసంలో బ్రీVA్మత్సవం జరుగుతుంది. మఖానక్షత్రంనాడు తేరులాగుతారు.
నైజాంకాలంలో ఈ ఆలయానికి ప్రభుత్వసహాయం ఉండేది. ఇపుడది లేదు. భూములున్నవిగాని అవి చేసికొనేవారి ఆధీనంలో ఉండి ఆదాయం లేకుండాపోయింది. అందువల్ల ఇపుడుత్సవం సన్నగిల్లింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి