మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, అక్టోబర్ 2026, శనివారం

జొనాధన్ స్విఫ్ట్‌ ఇతివృత్తాల నిర్వహణ తులనాత్మక పరిశీలన

ఆంగ్లంలో జొనాధన్ స్విఫ్ట్‌చే విరచితమైన ‘గలివరు ట్రావెల్స’ అను గద్యరచనను కందుకూరి వీరేశలింగంగారి ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ రచనకు పోలిన రచనగా చెప్పుకుంటారు. ఈ రెండు రచనలను పరిశీలిస్తే ఇతివృత్తాల నిర్వహణలో సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. తులనాత్మకంగా అధ్యయనం చేయటానికి ఈ రెండు రచనలలో ఉన్నటువంటి కథాసంవిధానం, ఇతివృత్తాల నిర్వహణ, దాని నేపథ్యం దాదాపు ఒకటిగానే ఉన్నాయి. ఈ ఇద్దరి రచయతల మనోసంకల్పము ఒక్కటేనని ప్రతి సన్నివేశ కల్పనలో స్పష్టంగా తెలుస్తుంది. 

ఇంగ్లాండు దేశంలో పెల్లుబికిన అన్యాయాలు, అక్రమాలు జోనాథన్ స్విఫ్ట్ రచనకు ప్రేరణ. ప్రజలందరిని మేల్కొలిపి సరియైన మార్గాన్ని నిర్దేశించటమే లక్ష్యంగా తను ఈ రచనకు పూనుకున్నాడు. అట్లాగే ఆంధ్రదేశంలో స్త్రీలపట్ల జరుగుతున్న అన్యాయాలను జ్యోతిశ్శాస్త్రం పేరుమీద జరుగుతున్న మోసాలను ప్రజలకు తెలియజేసి వాటిని రూపుమాపటమే లక్ష్యంగా కందుకూరి వీరేశలింగంగారు ‘సత్యరాజా పూర్వ దేశ యాత్రలు” అను రచన చేశారు. 

ఈ ఇద్దరి రచయితల లక్ష్యం సంఘసంస్కరణ. అందుకోసం వీరిద్దరు తీసుకున్న సాహిత్య ప్రక్రియ ‘యాత్ర చరిత్ర’. ఈ రెండు రచనల ద్వారా మనకు మొదటినుండి చివరివరకు రచయితల అంతరార్థం ఒక్కటిగానే కనిపిస్తుంది. అన్యాయాలను ఎదురించే విధానం ఆయా దేశాలకు అనుగుణంగానే వీరు ఈ రచనలను చేశారు. 

ఆంధ్రదేశంలో మితిమిరిన దురాచారాల నిర్మూలననే తన ధ్యేయమని కందుకూరి వీరేశలింగం తన స్వీయచరిత్రలో చెప్పుకున్నారు. కందుకూరి వీరేశలింగంగారికి నవలా రచయితగా, కథారచయితగా, గద్యరచయితగానే కాకుండా హాస్య కథారచయితగా, వ్యంగంగా రచన చేయగల రచయితగా పేరుంది. అట్లాగే ఆంగ్లసాహిత్యంలో కూడా జోనాథన్ స్విఫ్ట్ మంచి రచయితగా పేరుంది. 

వీరిద్దరు వారివారి సాహిత్యాల్లో ఎన్నో రచనలు చేశారు. ఇంగ్లాండు దేశములోని సాంఘిక దురాచారాలకు సరియయినట్లుగా ‘జొనాధొన్ స్విఫ్ట’ ‘గలివరు ట్రావెల్స’ అను కల్పిత రచనను ‘యాత్రచరిత్ర’ అనే ప్రక్రియలో రచించారు. అట్లాగే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలకు సరిపోయేటట్లుగా కందుకూరి వారి ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు” అను ఊహా రచనను ‘యాత్ర చరిత్ర’ ప్రక్రియలో రచించారు. ఈ ఇద్దరు రచయితలు వ్యంగ్యంగానే తమ తమ రచనలను కాస్త హాస్యాన్ని కాస్త ఎగతాళిని ఇందులో రంగరించి రచించారు. 

తులనాత్మక పరిశీలన ద్వారా కందుకూరి విరేశలింగం గారి ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ మొదటి భాగములో చెప్పబడిన ‘అడు మళయాళం’ కథకు ‘జోనాథన్ స్విఫ్ట్ ‘గారి ‘గలివరు ట్రావెల్స’ మొదటిభాగం లో చెప్పిన లిల్లిపుట్  కథకు తగుమాత్రం సామ్యం కనిపించదు. కాని ఇతివృత్తాల నిర్వహణలో మాత్రం వారు పాటించిన విధానాలుకాని, పద్ధతులు కాని నిర్మాణాలు కాని ఏకత్వంతో కనిపిస్తాయి. సమస్యలు ఆయాదేశాలలో భిన్నంగా ఉన్నా వాటిని నిర్వహించిన తీరు వేరైనా ఇద్దరి రచయితల లక్ష్యం మాత్రం ఒక్కటే.

‘అడుమళయాళం’ కథలో కథానాయకుడు సత్యరాజా. అట్లాగే లిల్లిపుట్ కథలో కథానాయకుడు గలివరు. ఈ రెండు కథల్లో కూడా వీరిద్దరి చుట్టే మొత్తం కథ ఆధారపడి నడుస్తుంది. పద్ధతులు వేరైనా నిర్వహణ మాత్రం ఒక్కటిగానే నడుస్తుంది. తులనాత్మకంగా పరిశీలిస్తే పాత్రల ఇతివృత్తం మాత్రం రెండింటిలో ఒకటిగానే ఉంది. 

‘గలివరు ట్రావెల్స’ లోని మొదటి కథకు ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ లోని మొదటికథకు వస్తువుపరంగా సామ్యం కనిపించదు. కాని ఈ రెండింటికి ఆయా దేశంలో ఉంటున్న సమస్యలు కారణం. ఆంధ్రదేశానికి స్త్రీల సమస్య ప్రధానం అయితే ఇంగ్లాండు దేశానికి రాజకీయం ప్రధాన సమస్య. సమాజంలో స్త్రీకి జరుగుతున్న అన్యాయాన్ని తుదముట్టించాలని కందుకూరి వారు, రాజకీయంలో జరుగుతున్న కుట్రలను కుతంత్రాలను తుదిముట్టించాలని జోనాథన్ స్విప్ట్ ఈ ఇద్దరు ప్రజాసంక్షేమమే ప్రధానంగా ఆయా కథలను కల్పించారు. 

ఒక వ్యక్తి తన దేశంలోని పరిస్థితులకు సరిగ్గా విరుద్ధంగా నున్న పరిస్థితులుగల దేశాలలో తను ఎట్లుండునో చూపి తనదేశంలోని పరిస్థితులలో గల చెడును నిర్మూలించుటకు ప్రయత్నించాలని తమల్ని తాము సంస్కరించుకోవాలని చెప్పడమే కందుకూరి వీరేశలింగం ముఖ్యోద్దేశం. ఇట్లాంటి భావమే జోనాథన్ స్విఫ్ట్ వారి ‘గలివరు ట్రావెల్స’ లో కనిపిస్తుంది. ఈ భావమును గ్రహించే కందుకూరి సత్యరాజా అను వ్యక్తి ఆయా యాత్రలు చేసినట్లుగా కల్పించి ఉత్తమ పురుషలో ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ రచించారు. ‘గలివరు ట్రావెల్స’ లో ఉన్నటువంటి నాలుగు కథలు కూడా తమ దేశంలోని పరిస్థితులకు సరిగ్గా అట్లాంటి పరిస్థితులను కల్పించి పరోక్షంగా ప్రజలందరికి తెలియునట్లుగా జొనాథన్ స్విఫ్ట్ మంచి చెడులను విశ్లేషించి వివరించారు. 

ఈ ఇద్దరి రచయితల కథా కథనంలో కేవలం ప్రజాశ్రేయస్సును ఆదించిన దృష్టే మనకు అంతటా కనిపిస్తుంది. కథల నిర్మాణంలో నిర్వహణలో వీరిద్దరు పాటించిన ఏకసూత్రత మనకు తెలుస్తుంది. “గలివరు ట్రావెల్స” లోని మొదటికథ ‘లిల్లిపుట’, ‘సత్యరాతా పూర్వదేశ యాత్రలు” లోని మొదటి కథ ‘అడుమళయాళ’. ఈ రెండు కథల మధ్య పోలిక లేదనే చెప్పవచ్చు. కానీ గలివరు, సత్యరాజా పాత్రల మధ్య పోలికుంది. ఇద్దరు కూడా ఆయా కథల్లో కథానాయకులు. ఈ రెండు పాత్రలు వారి వారి దేశంలోని సమస్యలు తెలియజేస్తారు. ఆయా దేశాల్లో ఆయాకాలాల్లో, ఆయా సమాజంలోని సంఘ సంస్కర్తలను పోలి కల్పించినవి. ఈ రెండు పాత్రల చేత రచయితలిద్దరు హాస్యాన్ని పండించారు. 

చమత్కారమైన మాటలతో ఆనాటి ఆయా సమాజంలోని పెద్దమనుషులకు చురకలంటించారు. మరికొన్నిచోట్ల ఎగతాళిచేశారు. ఇంకొన్నిచోట్ల హేళనచేశారు. రచయితలిద్దరు ఈ పాత్రల నిర్వహణలో మాత్రం అంతటా ఒకే రకమైన పోలికల్ని చూయించారు. ఈ పాత్రల లక్ష్యం, మార్గం ఒక్కటేనని పద్ధతులు మాత్రం ఆయా సమాజాలకు అనుకూలంగా ఉన్నాయని తెలుస్తుంది.

‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ రెండవ భాగంలో చెప్పిన ‘లంకాద్వీపయాత్ర’ కథకు ‘గలివర్స్ టవెల్స’ లోని ‘బ్రాబ్డింగ్‌నాగు’ యాత్రా కథకును చెప్పుకోదగ్గ పోలికలున్నాయి. కందుకూరి వీరేశ లింగం పంతులుగారి, జొనాథన్ స్విఫ్ట్ గారి రచనలకు ఇతివృత్తాలు ఒక్కటేకాని వాటిని నిర్వహించుటలో వారివారి దేశకాలపరిస్థితులకు అనుకూలంగా పద్ధతులను మార్చుకొని ఈ రెండవభాగాన్ని రచించారు. 

‘బ్రాబ్డింగ్ నాగ’ లోని ప్రజలందరు మహా స్థూలకాయులు. వీరి చేతులలో గలివరు ఎట్లాగైతే ఇబ్బందులకు గురి అవుతాడో అట్లాగే లంకాద్వీపప్రజల చేతుల్లో సత్యరాజా కూడా అనేక ఇబ్బందులకు గురి అవుతాడు. లంకాద్వీపŸప్రజలు రాక్షసులుగా సత్యరాజ చెప్పటంతో స్థూలకాయులైనటువంటి వికృత రూపం గలవారు ఎవరినైనా మనం రాక్షసు లుగా తలుస్తాము. ఇది మనదేశ పద్ధతి. 

‘బ్రాబ్డింగ్‌నాగ’ చేరుకున్న తరవాత గలివరును ఒక స్థూలకాయుడు చేతిలోకి తీసుకొని తదేకంగా పరిశీలిస్తాడు. తరువాత ఇంటికి తీసుకొని వస్తాడు. గలివరు చుట్టూ కొందరు గుమిగూడి చేతులతో ఆడిస్తూ వింతగా చూస్తారు. ఇట్లాంటి సన్నివేశం లంకాద్వీపములో కూడా అట్లాగే కందుకూరి చిత్రీకరించారు. ఒక పిల్ల రాక్షసి సత్యరాజను చేతుల్లోకి తీసుకొని పరిశీలించి ఇంటికి తీసుకొని వస్తుంది. ఒక బల్లపై వదిలిపెట్టడంతో సత్యరాజు అటూయిటూ కాస్త నడవటం చూసి రాక్షసులందరు వింతగా చూడటంతో గలివరుకు సత్యరాజకు ఒకే విధంగా పోలికలు కనిపిస్తాయి. ఈ రెండు సన్నివేశాలు కూడా హాస్య ప్రధానంగా చిత్రీకరించినవే. 

‘గ£లివరు ట్రావెల్స’ లోని, బ్రాబ్డింగ్‌నాగ’ కథలోని కొన్ని సన్నివేశాలు యధాతధంగా మనకు లంకా ద్వీప కథలో కనిపిస్తాయి. ‘బ్రాబ్డింగ్‌నాగ’ లో గలివరు రక్షణార్థం అతని యజమాని కూతురు నియమింపబడుతుంది. ఆమె పేరు ‘గ్లండల్‌క్లిచ’. ఆమె గలివరును అపాయకర జంతువులనుండి కాపాడుతుంది. అట్లాగే లంకాద్వీపములో సత్యరాజ యజమాని తన ఎనిమిది సంవత్సరాల కూతురికి సత్యరాజను అప్పగిస్తాడు. ఆమె సత్యరాజను యితర జంతువులనుండి రాక్షసులనుండి రక్షిస్తూ సత్యరాజకు భాషకూడా నేర్పిస్తుంది. ఈమె పేరు మండోదరి. అట్లాగే గలివరును ‘బ్రాబ్డింగ్ నాగ’ ప్రాంత ప్రజలు గలివరును ‘మేనికిన’ అను పేరుతో విలుస్తారు. దీని అర్థం పొట్టివాడని. లంకాద్వీపవాసులు సత్యరాజను ‘వాలఖిల్యుడు’ అని పిలుస్తారు. ఇది పొట్టి ఋషులకు సంబంధించింది. 

‘లంకాద్వీపము’ కథలో మనకు ఎక్కువగా జ్యోతిశ్శాస్త్ర సంబంధమైన చర్చలు కనిపిస్తాయి. హిందువులలో ప్రబలియున్న మÖఢవిశ్వాసాలను అనాచారాలను ఖండిస్తూ ఈ కథలో అనేక విమర్శలున్నాయి. కాని ‘గలివరు ట్రావెల్స’లో ఆనాటి రాజకీయాలకు సంబంధించిన చర్చలు, వాస్తవాలు, అభిప్రాయాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇద్దరి రచయితల యొక్క ఇతివృత్తాల నిర్వహణ ఆనాటి సంఘంలోని దుష్టశక్తుల నిర్మూలన ఖండన ఇంగ్లాండులో రాజకీయం ఐతే ఆంధ్రదేశంలో జ్యోతిశ్శాస్త్రం. 

గలివరును తన యజమాని సంతకు తీసుకుపోయిన విధానం సత్యరాజను తన యజమాని పండిత సభకు తీసుకపోయిన విధానంతో పోలికలున్నాయి. ఇద్దరి యజమానులు కూడ వీరిద్దరిని బండిలో కూర్చున పెట్టి తీసుకెళ్లారు. గలివరును ఒక పెట్టెలో పెట్టి తీసుకెళ్తారు. సత్యరాజను బండికి ముందుభాగంలో తాళ్ళతో కట్టి తీసుకెళ్ళడం ఇరువురికి బండి యిటూ అటూ కదలటంచేత క్రిందపడిపోతామన్న భయం రెండూ కథలలో ఒకే విధంగా 

ఉన్నాయి.

‘గలివరు ట్రావెల్స’ లో గలివరు యొక్క యజమాని ఇతనిని ఇరుగుపొరుగు వారికి చూపడానికి ఒక ప్రదర్శనశాలను ఏర్పాటు చేసి ధనము సంపాదిస్తాడు. గలివారు చిన్నరూపంలో ఉండటంచేత వింతగా, విచిత్రంగా ఉండటంచేత జనులంతా గుంపులు గుంపులుగా వచ్చి గలివరును దర్శిస్తుంటారు. ‘లంకాద్వీపం’ లో కూడా సత్యరాజ చిరురూపాన్ని చూసి ఇతను వాలఖిల్య మహర్షియని తలచి ఎందరో రాక్షసులు ఇతనిని చూడడానికి వస్తూ ఫలహారాలు కానుకలు తెస్తుంటారు. తద్వారా సత్యరాజ యొక్క యజమాని ధనం సంపాదిస్తాడు. 

లంకాద్వీపకథకు, ‘బ్రాబ్డింగ్‌నాగ’ కథలకు కొన్ని సన్నివేశపరమైన పోలికలున్నాయి. మరికొన్ని సన్నివేశాల కల్పనలో పోలికలు కనబడవు. కందుకూరి ఒక్క రాజకీయాలకు సంబంధించి తప్పా మిగతా సంఘంలోని అన్ని కోణాలలో జరుగుతున్న సాంఘిక దురాగతాలను ఖండించాడు. కాని ‘జొనాథన్ స్విఫ్ట’ ఒక్క రాజకీయాలపై మాత్రమే ఎక్కువ ఖండన చేస్తూ మానవ ఆలోచనా రీతిలో వస్తున్న మార్పులను పరోక్షంగా ఖండిస్తూ అవహేళన చేశాడు. 

‘లంకాద్వీపకథ’ రచనలో విరేశలింగం పంతులు ‘జొనాథన్ స్విఫ్ట’ యొక్క గలివరు ట్రావెల్స్‌ను కొంతవరకు అనుసరించారని తెలుస్తుంది. కేవలం సంఘసంస్కరణ ధ్యేయంగా రచనను ప్రారంభించినా కందుకూరి హిందూ సమాజంలో పేరుకుపోయిన దురాచారాలను ఖండిస్తూ వాటిపైకి ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ అనే ఆయుధంతో తిరుగుబాటు చేశారు. కందుకూరివారే తన స్వీయచరిత్రలో ఇలా చెప్పారు. “వ్యాజ రూపమున మనలోని దురాచారములను మÖఢ విశ్వాసములను పరోక్షంగా ప్రదర్శించునట్టి పుస్తకము చేయవలెనని బుద్ధి పుట్టి’ వ్రాసినట్లు (స్వీయచరిత్ర) ము 1915 రెండవ భాగములో పుట 178) ఉంది. తదనుగుణంగానే ‘అడుమళయాళం’ ‘లంకాద్వీపము” అను రచనలు చేసినట్లుగా తెలుస్తుంది. 

‘స్త్రీల విషయాల్లో మనవారు చేసిన అన్యాయాలు తేటపడునట్లు’ గా ‘అడుమళయాళ’ కథను జ్యోతిశ్శాస్త్రములోని జాతక భాగము, ముహూర్త భాగము యొక్కయు విశ్వసనీయతను పరోక్షంగా తెలుపుటకు గాను ‘లంకాద్వీపం’ కథను రాసినట్లు తెలుస్తుంది. 

‘గలివరు ట్రావెల్స’ లోని నాలుగు కథలను తెలుగులో రచించటానికి సంకల్పించారు. కాని మÖడు నాలుగు కథలు రాసినట్లు లేదు.

సంఘసంస్కరణ లక్ష్యంగాగల కందుకూరికి నాటి సమాజంలోని దురాగతాలకు విసిగిపోయి అపారమైన అనుభవంతో ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ అనే వ్యంగరచన ద్వారా నాటి సమస్యలను అవహేళన చేస్తూ ఎత్తిచూపారు. ‘జొనాథన్ స్విఫ్ట’ ఆంగ్ల సమాజంలోని అక్రమాలకు విసిగిపోయి నాటి అన్ని సమస్యలను అవహేళనచేస్తూ ‘గలివరు ట్రావెల్స’ అనే వ్యంగ రచనను చేశాడు. ఈ రెండు రచనల తులనాత్మక పరిశీలనలో యిరువురి రచయితల సమాజ సంస్కరణ పట్ల తపన కల్పించిన కథలకు వారు ఏర్పర్చిన కథనం అద్భుతం. దేశాలు వేరైనా ప్రజలు వేరైనా సమస్యలంతా ఒక్కటే ఇరువురి రచయితల సంకల్పం ఒక్కటే చెడును తుదముట్టించి మంచికి ప్రాణం పోయటం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి