మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, అక్టోబర్ 2026, శనివారం

పి.హేమలత....... తల్లి, వదిన, అక్క, అమ్మమ్మ

తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఉజ్వల కీర్తితో ప్రకాశించిన తార హేమలత. ఉన్న విలువలతో, ఉత్తమ కుటుంబ కథా చిత్రాలు వచ్చినంత కాలం హేమలత ఖచ్చితంగా ఆ చిత్రాల్లో ఉండేది. ఉమ్మడి కుటుంబం, మంచి కుటుంబం, ఆదర్శ కుటుంబం, రెండు కుటుంబాల కథ వంటి చిత్రాల్లో తల్లి పాత్రలన్నీ ఆమెవే. తెరపై హేమలతను చూస్తున్నంతసేపు ఇంట్లో తల్లి, వదిన, అక్క, అమ్మమ్మ... ఇట్లా మన వాళ్ళను, మన కుటుంబ సభ్యులను చూస్తున్నట్లే అనుభూతికి లోనయ్యే వారు ప్రేక్షకులు. అంత సహజంగా సాత్వికత ఆవిష్కరించి తెరపై రాణించగలిగిన గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టు పి. హేమలత, సుమారు మÖడు దశాబ్దాల తెరపై అక్కినేని, నందమÖరి, గుమ్మడి, కృష్ణ వంటి హేమాహేమీలకంతా తల్లిగా నటించి, సుమారు రెండు వందల పెద్ద తరహా పాత్రల్ని పోషించి మెప్పించిన ఈ గుణచిత్ర నటి అరుదైన జ్ఞాపకాలు...

మా స్వస్థలం కృష్ణాజిల్లా గుడివాడ. 1926లో పుట్టాను. చిన్నప్పటినుంచి నాటకాలంటే పెద్ద అభిలాష లేదు. అనుభవం కూడా అంతంత కెరీర్ ప్రారంభించాను. ఆయన నాటక కళాభిమాని, స్వయంగా నటులు కావడంచేత నన్ను కూడా నాటకాలలో ప్రవేశపెట్టాలని అభిలషిస్తూ వుండేవారు! ఏలూరు నాటక కళాపరిషత్తులో రావురి గారు రచించిన ‘పరితాపం’ అనే నాటకంలో నటించి నందుకు నాకు ఒక ప్రత్యేక బహుమతి కూడా ఇచ్చారు.

ప్రథమ ప్రయత్నంలోనే ప్రత్యేక బహుమానాన్ని పొందగలిగిన నన్ను, నా నటనా కౌశలాన్ని చూసి పాలకొల్లు ఆదర్శమండలి పినిశెట్టి శ్రీరామమÖర్తిగారు తమ నాటకం ‘పల్లెపడుచు’లో నా చేత జమీందారిణి రమాదేవి పాత్ర ధరింపచేశారు. ఆంధ్రదేశమంతటా ప్రదర్శించబడి, పేరు పొందిన ఆ నాటకంలో జమీందారిణి పాత్రలో అందరికీ పరచయమైపోయాను.

మాకు మొదటి నుంచీ కూడా గరికపాటి రాజారావు గారితోను, ప్రజానాట్యమండలితోను బాగా పరిచాయాలుండేవి. ఆ పరిచాయల వల్ల నాకు సినిమాల్లో అవకాశాలు లభించాయి. పీపుల్స్ ప్రొడక్షన్స్ వారు “పల్లెటూరు”(1951)లో చిత్రాన్ని తీస్తున్నప్ప్పుడు అందులో ప్లీడరు భార్య పాత్ర ధరించడానికి తగిన వ్యక్తి కావలివచ్చింది. ఆ సమయంలో చదలవాడ కుటుంబరావుగారు, డైరెక్టరు తాతినేని ప్రకాశరావుగారికి నన్ను సిఫార్స్ చేశారు. ఆయన మాటల్ని తోసిపుచ్చలేక తాతినేని ప్రకాశరావుగారు నన్ను చూడనైన చూడకుండా సాహసించి ‘అనసూయ’ పాత్ర బుక్ చేసుకున్నారు! కొన్నాళ్ళుకు వెంటనే బయల్దేరి రమ్మని మాకు టెలిగ్రాం వచ్చింది. అప్ప్పుడు నేను పది మాసాల పసిపిల్లాడికి తల్లిని. కొడుకు జ్వరం వచ్చి మంచం పట్టాడు. కన్నకడుపు కదండీ! ఆ దిగులలో 

ఇంకా చిక్కి శల్యమై వున్నాను. అయినా ఆ టెలిగ్రాం చూసుకుని హడావుడిగా మద్రాసు చేరుకున్నాం. తీరా మేము మద్రాసు వచ్చాక, శల్యావశిష్టమైనా ఆకారం చూచి కొందరు అనసూయ పాత్రకు నేను ‘అన్‌ఫిట’ అని పెదవి విరిచారు! అయినా తాతినేని ప్రకాశరావుగారు అధైర్యపడక నాతోనే చిత్రం షూటింగ్ జరిపించారు. మొట్టమొదటి సన్నివేశంలో సంభాషణలు ఏ జంకూ గొంకూ లేకుండా పలికి అక్కడి వారిని ఆశ్చర్యచకితుల్ని చేశాను. అప్పటికి ఆకారపుష్టి లేకపోయినా మాటల ఉచ్ఛారణ బాగుందనిపించుకున్నాను. ఎస్.వి. రంగారావు, ఎన్.టి.రామారావు, టి.జి.కమలాదేవి వంటి గొప్ప వారందరి సరసన నటించినా చిత్రంలో సావిత్రి హిరోహిన్‌గా వేసిందేగాని చాలా చిన్న పిల్ల.

ఆ తర్వాత “గుమస్తా” (1953)లో నటించాను. ఆత్రేయగారి ‘ఎన్.జి.ఓ నాటకం ఆధారంగా నిర్మించిన చిత్రమిది. దాని తర్వాత నవయుగ వారు శ్రీధర్ దర్శకత్వంలో నిర్మించిన “జ్యోతి” (1954)లో నటించే అవకాశం లభించింది. ఆ చిత్రంలో కథా నాయకుడి తల్లిపాత్ర ధరించాను. సావిత్రి, జి. వరలక్ష్యి వంటి హేమాహేమీలు నటించినా, ఆ చిత్రం విజయవంతం కాకపోవడంతో మాకు ప్రత్యేకంగా పేరంటూ ఏమీ రాలేదు. “జ్యోతి” చిత్రానికి శ్రీధర్ దర్శకులే అయినా, అసలు దర్శకత్వం వహించినదంతా కె.బి.తిలక్‌గారే. ఈ విషయం ఆ చిత్రంతో పరిచయమున్న వారందరికీ తెలుసు. అప్పటి నుండే కె.బి.తిలక్‌గారికి నేనంటే చాలా అభిమానం. తదుపరి కాలంలో వారి ‘అనుపమ’ పతాకంపై నిర్మించిన చిత్రాల్లో చాలా మంచి పాత్రల్ని ఇచ్చారాయిన. అంతెందుకు వారి ‘అత్త ఒకింటి కోడలే’ (1958) చిత్రంలో అత్త భూమిక నాదే కదా!

“వద్దంటే డబ్బు”లో నటిస్తుండగా ఎన్.టి.రామారావుగారు నాలో నటనాపటిమను గుర్తించి ఆయన సొంతంగా నిర్మించదలచుకున్న “పిచ్చిపుల్లయ్య”లో హీరో తల్లి పాత్ర ధరించడానికి అవకాశమిప్పించారు. ఆ తర్వాత కూడా రామారావుగారే వారి “తోడుదొంగలు” (1954)లో ఆయన భార్య పాత్ర యిచ్చి నా ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశం యిచ్చారు. ఆ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ బహుమతి వచ్చింది. ప్రతిభ కలిగి భవిష్యత్‌లో రాణించగల వారికి అవకాశాలిచ్చి, ప్రోత్సహించే సద్గుణం రామారావుగారిలో ఉండేది.

ఇక నా నటజీవితంలో గొప్ప మలుపు వాహినీ వారి “బంగారు పాప” (1954). వాహినీ సంస్థలో అవకాశం రావడమే గొప్పగా వుండేదా రోజుల్లో స్వాతి వానకు ముత్యపు చిప్పలు ఎదురుచూసినట్లు ఆంధ్రదేశం వాహినీ వారి చిత్రాలకు ఆరోజుల్లో ఎదురు చూస్తూ ఉండేదని చెప్పడంలో తప్పేమీ లేదు. అందులోనూ బి.యన్.రెడ్డి గారి దర్శకత్వంలో అంటే అది ఉత్తమ కళాకండమే నని ఉన్నత కుటుంబాల వాళ్ళు ఎదురుచూసే రోజులవి. అలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో నటించడం పూర్మజన్మ సుకృతమే.

బి.యన్.రెడ్డిగారు “బంగారుపాప” తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తూ రౌడికోటయ్య(యస్.వి.రంగారావు)ను మాటలతో కట్టడి చేసే మంగమ్మ వేషానికి తగిన ఆర్టిస్టు కావాలనీ, కొత్తవారైనా పరవాలేదనీ పినిశెట్టిగారికి ఆ సమయంలో నా పేరు జ్ఞాపకమొచ్చి నన్ను సిఫార్సు చేశారట. ఆ సమయంలోనే విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి గారు కూడా అక్కడే వున్నారట. ఆయన నన్ను అదివరకే “తోడుదొంగలు” సెట్టుమీద చూసి ఉన్నారు. ఆయన కూడా నేనే మంగమ్మ పాత్రకు తగినదాన్నని సిఫార్సు చేశారట. వారిద్దరి సలహా మేరకు బి.యన్.రెడ్డి గారు నన్ను పిలిపించి మాట్లాడారు. నేనూ ఒప్ప్పుకున్నాను.

బి.యన్.రెడ్డి గారు “హేమలత గారూ! మీకు నేను అవకాశం ఇవ్వబోతున్నాను. ఆ పాత్రలో మీరో విశిష్ట స్థానం అందుకోగలరు” అన్నారు. రెడ్డిగారు ఆ రోజు చెప్పిన మాటలు అక్షరాల నిజమయ్యాయి. ఆ మంగమ్మ పాత్ర నన్ను ఒక చక్కటి ఆర్టిస్టుగా చలనచిత్ర రంగంలో నిలబెట్టింది. ఆ తర్వాత పాతికేళ్ళు నేను ఇండస్ట్రీలో అదే రేంజిలో కొనసాగడానికి కారణం “బంగారుపాప” అని చెప్ప్పుకున్నా ఆశ్చర్యంలేదు. అందుకు బి.యన్.రెడ్డి గారి సహకారం ఎంతో వున్నా, ఎస్.వి.రంగారావు గారు ఇచ్చిన ప్రోత్సాహం మరువరానిది.

“బంగారుపాప” అవార్డు సభలో బి.యన్.రెడ్డిగారు మాట్లాడుతూ “బంగారుపాప”లో మంగమ్మ పాత్ర ధరించిన హేమలతగారులో నటనా కౌశలం మరుగునపడి ఉంది. మన నిర్మాతలందరూ అవకాశాలిస్తే బెట్టీ డేవిస్‌లాగా నటించి ప్రజానీకాన్ని మెప్పించగల సామర్థ్యం కలవారని నన్ను ఎంతో మెచ్చుకున్నారు. నాకు బి.యన్.రెడ్డి గారి ప్రశంసే పెద్ద అవార్డు. ఆయన ప్రశంస పొందడమంటే మాటలా?

ఆ తర్వాత దుక్కిపాటి మధుసుదనరావు, అక్కినేని నాగేశ్వరరావుగార్లు అన్నపూర్ణవారి “దొంగరాముడు”(1955)లో దొంగరాముడితల్లి పాత్ర ధరించటానికి అవకాశమిచ్చారు. ఆ చిత్రంతో నాకు ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు. “దొంగరాముడు” విడుదలైన కొత్తలో వారి నుండి ఎన్నో ఉత్తరాలు వచ్చేవి. “మాకు నిజంగా మీ లాంటి అమ్మ ఉంటే ఎంత బావుండేదోనని’, చచ్చిపోయిన మా అమ్మ గుర్తుకోచ్చిందని.... ఇట్లా ఎంతోమంది ఉత్తరాలు రాశారు.

ఈ చిత్రం తర్వాత నాకు మరికొన్ని చిత్రాల్లో నటించడానికి అవకాశాలు లభించాయి. గురజాడ అప్పారావు గారు రాసిన నాటకం కన్యాశుల్కాన్ని డి.ఎల్.నారాయణ గారు తీస్తే అందులో విన్నకోట రామన్న పంతులు గారి సరసన, ‘వెంకమ్మ’ పాత్రలో నటించాను. ఇంకా సి.యస్.ఆర్ గారితో “నిత్యకళ్యాణం - పచ్చతోరణం” (1960), విఠల్ ప్రొడక్షన్ వారి “కన్యాదానం” (1955)లో షావుకారు జానకి తల్లి పాత్రలో, ప్రతిభా వారి “ఏది నిజం’ (1956) కూడా షావుకారు జానకికే తల్లి సీతమ్మ పాత్ర, ఘంటసాల గారి సొంత చిత్రం “సొంతవూరు” (1956)లో ఎన్.టి.రామారావుగారి తల్లి సుబద్రమ్మ పాత్ర  ధరించాను. ఆ తర్వాత తల్లిగా ఎన్నో చిత్రాలు ఇటు చారిత్రకాలు, పౌరాణికాలు, అటు సాంఘీకాలు..... సుమారు రెండు వందల చిత్రాలు చేసి ఉంటాను.

చాలా సినిమాల్లో నా మనసుకు నచ్చిన అమ్మ పాత్రల్నే వెసినా, అప్ప్పుడప్ప్పుడు కొన్ని నా స్వభావానికి విరుద్ధమైన పాత్రలు చేశాను. “ఇల్లరికం”, “తిరపతమ్మకథ”, “మల్లమ్మకథ” చిత్రాల్లో గయ్యాళి పాత్రలు వేశాను. “ఇదేమిటీ! హేమలత ఇలాంటి వేషాలు వేసిందీ?” అని కూడా అనుకున్నారు చాలా మంది. కానీ ఆర్టిస్టులు అనేవాళ్ళు ఏ పాత్రనైనా చేయాలి, చెయ్యగలగాలి, అప్పుడే వాళ్ళు నిజమైన ఆర్టిస్టులు. చిత్రాలలో వచ్చే పాత్రలు, వాటి ఆచార వ్యవహారాలు వేరువేరుగా వుంటాయి. వాటిని గుర్తించి ఆ పాత్రలు మాట్లాడే భాషను, వాటికి అనుగుణంగా చక్కగా మాట్లాడితేగానీ జీవం పోయలేము. “ఏది నిజం?”లో సీతమ్మ పాత్ర మాట్లాడిన భాషలోనూ “బంగారుపాప”లో మంగమ్మ పాత్ర మాట్లాడిన భాషలోనూ, “కన్యాశుల్కం”లో వెంకమ్మ పాత్ర మాట్లాడిన భాషలోనూ ఎంతో వ్యత్యాసం వుందికదా! ఆ పాత్రలకు తగినట్టు భాషను సమర్థవంతంగా మాట్లాడి మెప్పించగలిగాను. నేను సినీరంగంలో షైన్ కావడానికి నేను ఇంప్రూవ్ చేసుకున్న వాయిస్ కల్చర్ కూడా ప్రధాన కారణమని నా నమ్మకం. తమిళంలో కూడా నా డైలాగులు నేనే మాట్లాడుకునే దాన్ని. రామానాయుడుగారి “రాముడు-భీముడు” చిత్రంలో నేను రామారావుగారికి అమ్మమ్మగా నటించాను. ఆ చిత్రాన్ని చూసిన ఎం.జి.ఆర్ దాన్ని తమిళంలో తీసినప్పుడు, అందరు నటీనటుల్ని మార్చినా, నా కారెక్టర్ మాత్రం నన్నే చేయమన్నారు. అంత ఇంప్రెస్ అయ్యారు ఎం.జి.ఆర్.

ఈ రోజుల గురించి నేనేమీ వ్యాఖ్చానించను. అయితే ఆ రోజుల్లో దర్శకులు, నిర్మాతలంటే మాకు భయభక్తులుండేవి. ఆర్టిస్టులలో ప్రేమ, ఆపేక్ష ఉండేవి. సర్దుకుపోయే స్వభావం ఉండేది. ఒక్కోసారి మేం షూటింగ్‌లకి వెళ్ళలేకపోతేనో, ఆలస్యమై పోతేనో కూడా అర్థం చేసుకుని సరదాగానే ఉండేవారు. ఓసారి బాపుగారి “సంపూర్ణ రామాయణం” (1972) షూటింగ్‌కు చాలా ఆలస్యంగా వెళ్ళాను. అందులో కౌసల్య పాత్ర నాది. జమునకైక, సరే నేను వెళ్ళి “నా కోసం ఎదురు చూస్తున్నారా” అన్నాను. “అవునమ్మా - ఈ అడవిలో ఏ లత కదిలినా, హేమలతే అనుకుంటున్నాం” అన్నారు ఆ చిత్ర సహాయ దర్శకులు కె.వి.రావు గారు. అందరూ హాయిగా నవ్వేశారు. షూటింగ్ కంటిన్యూ చేశాం. ఇట్లా వుండేదా రోజుల్లో. అరే! ఈమె లేట్‌గా వస్తే ఎట్లా? అని కోపతాపాలు ప్రదర్శించి, కక్షగట్టేవారు కాదు!

నాకు మొదటినుంచీ కూడా సినిమారంగం అంటే గౌరవమే గానీ, నా కొడుకు మాత్రం “అమ్మా! సినిమాలు మానేయమ్మా” అనేవాడు. నేను “బాబూ! నీవు చదువుకొని ప్రయోజకుడివయ్యాక మానేస్తాను” అని వాగ్థానం చేశాను. అనుకున్నట్టే నా కుమారుడు ప్రయోజకుడై ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత నేనే పరిశ్రమ నుండి విరమించుకున్నాను. దేవీ వరప్రసాద్ గారు ఇంటికొచ్చిఅడిగితే, ఒక నిర్మాతను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక “కథా నాయకుని కథ” (1975) చేశాను. దాంతో మళ్ళీ తల్లి వేషాలేయమని నిర్మాతలు రావడం మొదలుపెట్టారు. ఇట్లా కాదని భీష్మించుకున్నాను. నేను నటించిన చివరి చిత్రం “సీతమ్మ సంతానం” (1976).

తర్వాత సినీరంగానికి దూరంగా మద్రాసులో నాగార్జుననగర్‌లో ఉన్న పెద్ద భవంతిని అమ్మేసి, హైదరాబాదుకు వచ్చేశాను. ఇక్కడ కంప్లీట్‌గా నాకు మరో ప్రపంచం దొరికింది. అది ఆధ్యాత్మిక ప్రపంచం. ప్రజాహిత బ్రహ్మకుమారి శాంతి సమాజంలో నిరంతరం శాంతి మార్గంలో ప్రశాంత జీవనం గడుపుతున్నాను. ఎంతో హాయిగా ఉన్నాను.

పరిశ్రమలో ఉన్నప్పుడు కూడా నా గౌరవం నేనెప్పుడూ పోగొట్టుకోలేదు. కన్నాంబ, శాంతకుమారి, టి.జి.కమలాదేవి వంటి సాత్విక నటీమణుల మధ్య నేనూ తల్లి పాత్రలలో రాణించగలిగాను. పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ నన్ను ‘అమ్మ’ అనే పిలిచేవారు. కన్న కొడుకు నాకు ఒక్కడే అయినా, సినిమా రంగంలో మాత్రం ఎంతో మంది హీరోలకు తల్లినయ్యాను. ఆ అనుభూతి మరిచిపోలేనిది.

నేను హైదరాబాద్‌లో ఉన్నానని కూడా చాలామందికి తెలియదు. నేను పబ్లిసిటీకి మొదటి నుంచి దూరం. పైగా ఈ అధ్యాత్మిక ప్రపంచంలో పడ్డాక, వాటన్నిటి మీద ఆసక్తి ఉండకూడదు. అప్పుడప్పుడూ ఆదోని లక్క్ష్మి వస్తూ వుంటుంది. కానీ ఆ మధ్య నేను ఇక్కడే ఉన్నానని తెలుసుకున్నారట - అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి, కె.బి.తిలక్‌గార్లు. వచ్చి పలకరించి వెళ్ళారు. దీన్నిబట్టి అర్థం చేసుకోండి - నేను ఎంత దూరంగా ఉన్నానో! నిజానికి మీరు ఇలా రాయడం కూడా నాకిష్టం లేదు. నన్ను ఒదిలేస్తే మంచిది. మీరు పదే పదే అడిగితే కాదనలేకపోయాను. నాకు అచ్చయ్యాక కాపీ కూడా పంపక్కనరలేదు! ఇది గర్వం కాదు సుమా! ప్రస్తుతం నేనýవాటు చేసుకున్న జీవితం అలాంటిది.  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి