మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, అక్టోబర్ 2026, శనివారం

షావుకారు జానకి.....

‘కథానాయికగా ప్రేక్షకుల నీరాజనాలు పొందడానికి ఆకాశం నుంచి దిగిరావాల్సిన అవసరం లేదు. అప్సరసల్లాంటి అందం లేకపోయినా అభినయచాతుర్యం, పాత్రౌచిత్యం ఉంటే కథానాయికగా రాణించవచ్చని నిరూపించిన ఏకైక నటీమణి జానకి, యాభై ఆరు సంవత్సరాల క్రితం విడుదలైన ‘షావుకారు’ చిత్రం శంకరమంచి జానకిని ‘షావుకారు జానకి’ని చేసింది. ఎన్నో రకాల పాత్రలు ధరించినా ఏ ఇమేజ్‌కూ, ఏ మÖసకూ పరిమితం కాకుండా తనదైన ప్రత్యేకబాణీని సంతరించుకున్న విలక్షణ నటి ఆమె. ఆనాటి ముగ్ధ జానకికి ఈనాటి బామ్మ జానకికి మధ్య కాలంలో తన అనుభవాలను, అనుభూతులను జ్ఞాపకాల పుటల్లోంచి ఏరి మనకందిస్తున్నారు....

‘తెలుగుటాకీ పుట్టిన సంవత్సరంలోనే నేను పుట్టాను. అంటే నా వయసు ఎంతో మన తెలుగు సినిమా వయసూ అంతే (12.12.1931). మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. సనాతన బ్రాహ్మణ కుటుంబం. శచీదేవి, టేకుమళ్ల వెంకోజీరావుగార్లు నా తల్లిదండ్రులు. నాన్న రాజమండ్రిలో గవర్నమెంట్ పేపరు ఎక్స్‌పర్టు అండ్ కెమికల్ ఇంజనీరుగా పనిచేసేవారు. నాకు ముగ్గు అన్నదమ్ములు. ఇద్దరు చెల్లెళ్లు.

మా నాన్న ఉద్యోగరీత్యా అనేక ఊర్లూ మారుతూ వుండేవారు. అలా కలకత్తా, బీహారు, అస్సాం, అన్నీ తిరిగేశాం. మేము కలకత్తాలో ఉండగానే నా చెల్లెలు కృష్ణకుమారి పుట్టింది. కృష్ణ ఎంతో అందంగా, ముచ్చటగా ఉండేది. నేను అందంగా ఉన్నట్టు నాకెవ్వరూ చెప్పేవారు కాదు. అయితే నేను u£ద్దుగా ఉటానని మాత్రం అనేవారు. మా నాన్న నా చలాకీతనాన్ని, మాటకారితనాన్ని ఎంతో మెచ్చుకునే వారు. నాకు మొండితనం, మంకుపట్టు బాగా ఉండేవి. నేను అన్నకున్నది ఏదైనా సరే జరిగి తీరాల్సిందే.

మేము 1944లో మద్రాసు వచ్చేశాం. అవి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. యుద్ధానికి భయపడి అందరూ మద్రాసు ఖాళీ చేసి వెళ్లిపోతున్న సమయంలో మేం మద్రాసులో దిగాం. బోగ్ రోడ్డులో ఇప్పుడు శివాజీగణేశన్ ఇంటికి నాలుగు ఇళ్లకు అవతలగాఉన్న ఇంట్లో కాపురం ఉండేవాళ్లం. మద్రాసు వచ్చిన మొదట్లో ఓ సంవత్సరం పాటు హైస్కూలులో చదివాను. తర్వాత మెట్రిక్ పరీక్షకు చదువుదామని ఆంధ్రమహిళాసభలో చేరాను. అక్కడ దుర్గాబాయిగారు ఉండేవారు. నా మీద ఆవిడకు మంచి అభిమానం ఉండేది. శ్రద్ధగా చదువుతాననీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాý£్గంటానని నన్ను మెచ్చుకునేవారు.

1945లో మద్రాసు ఆలిండియా రేడియో చిన్నపిల్లల కార్యక్రమంలో పాý£్గనేందుకు మా చెల్లెలు కృష్ణ, నేనూ వెళ్లాం. మా ఇద్దర్నీ ఓ పాట పాడమన్నారు. “ఊగాలి ఉయ్యాల.... తాటి రెమ్మలపై నిలవాలి, తారల తలపై తన్నాలి” అనే పాట పాడినట్టు గుర్తు. పాట పాడి ప్రోగ్రాం ముగిసింతర్వాత బయటకి వచ్చాం. “ఇప్పుడు పాడింది మీ యిద్దరేనా” అంటూ ఇద్దరు పెద్దవారు మా దగ్గరకు వచ్చారు. ఔనన్నాం. రేడియో నాటికల్లో పాý£్గనమని అడిగారు. నేను సరేనన్నాను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ జనమంచి రామకృష్ణ. బుచ్చిబాబుగార్లని తెలిసింది. నాలుగైదు రోజుల్లోనే డా.రాజమన్నార్ ‘పంజరంలో చిలుక’ నాటకంలో నటించడానికి కాంట్రాక్టు పంపారు.

ఆ నాటకానికి పాతికరూపాయల చెక్కు తీసుకున్నాను. నా తొలి సంపాదన అది. దాన్ని చూస్తూ గర్వంతో పొంగిపోయాను. ఆ తర్వాత పాలగుమ్మి పద్మరాజు ‘పట్నవాసం’ ధారావాహిక నాటకంలో మంచి పాత్ర ఇచ్చారు. తక్కువ కాలంలోనే నా బాంకు బేలన్స్ అరువందల రూపాయలకు వచ్చింది. అందులోంచి నా మొదటి పారితోషికం జ్ఞాపకంగా పాతిక రూపాయలుత ఈసి బంగారు ఉంగరం కొనుకున్నాను.

మద్రాసు ఆకాశవాణిలో రేడియో అన్నయ్య, అక్కయ్య, వింజమÖరి సీతాదేవి, టి.జి.కమలాదేవి, తెన్నేటి హేమలత, ఎ.పి.కోమల, కొంగర జగ్గయ్య, సిహెచ్.నారాయణరావు, ఎస్వీరంగారావు, గుమ్మడి.... మొదలైన వారందరితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాý£్గన్నాను. నాకు మొదటినుండీ నా వాచకమే ప్లస్ పాయింట్. ఓ సారి రేడియోలో నా వాయిస్ విని సరాసరి రేడియో స్టేషన్‌కే వచ్చారు. బి.ఎన్.రెడ్డి గారు. అంత పెద్దాయన రేడియోలో నా వాచకం వినడం, అది గుర్తుంచుకుని ప్రశంసించడం మరవలేను.

ఒకసారి బుచ్చిబాబుగారింటికి వెళ్లాను. అక్కడ బి.ఎన్.రెడ్డి గారు ఉన్నారు. “నువ్వెవరి పిల్లవమ్మాయ్?” అని ప్రశ్నించారు. ‘టేకుమళ్ల వారమ్మాయిని” అన్నాను నేను.

“సినిమాల్లో వేషం వేస్తావూ?” అన్నారాయన.

“మా నాన్నగారు పళ్లు రాలగొడ్తారు” అన్నాను.

అప్పుడు కె.వి.రెడ్డిగారి దర్శకత్వంలో ‘గుణసుందరి కథ’ నిర్మిస్తున్నారు. నాయికగా వేయమన్నారు. నేను ఇంట్లో భయపడి వద్దన్నాను. అప్పుడు నాకు నిండా పదిహేనేళ్లు లేవు. తెల్లగా బక్కపలచగా వాల్జడ వేసుకుని తిరుగుతుండేదాన్ని. ఈ రోజున అన్పిస్తుంది ‘ఎందుకు ఆ పాత్ర ఒద్దన్నానా?’ అని.

నాకు 5.11.1947న శంకరమంచి శ్రీనివాసరావు గారితో వివాహమయ్యింది. మా వారు రేడియో ఇంజనీరుగా పినిచేసేవారు. వాళ్లింట్లో ఆయనే చిన్నవాడు. ఆస్తిపంపకాల్లో వారికి అన్యాయం జరిగింది. అప్పట్నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. పట్టెడన్నం కోసం పాట్లు పడడం అంటే అప్పుడె తెలిసొచ్చింది. నా భర్త సంపాదన కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. ఆ పరిస్థితుల్లో నేను కూడా సంపాదిస్తే అనే ఆలోచన మెదిలింది.

ఆ ఆలోచన రాగానే కొడవటిగంటి కుటుంబరావు, కొమÖ్మరి పద్మావతి గార్ల ప్రోత్సాహంతో బి.ఎన్.రెడ్డి గార్ని కలిశాను. ఒకనాడు ఆయనే వేషం వెయ్యమంటే ‘అమ్మో’ అన్న నేను మÖడేళ్ళ తర్వాత ఆయన దగ్గరకి వెళ్ళి ‘నేను సినిమాల్లో వేషం వేస్తాను’ అని చెబితే ఆశ్చర్యపోయారాయన. ‘ఉన్నట్టుండి వచ్చి సినిమాల్లో వేషం కావాలంటే నేనెక్కడ తేనూ” అన్నారు బి.ఎన్.గారు’ ‘అప్పుడడిగారుగా’ అన్నాను.

‘ఐతే ఉండు. మావాళ్లు ‘విజయా ప్రొడక్షన్స’ అనే సంస్థ స్థాపించి పిక్చరు తీయబోతున్నారు. అందులో ఏమన్నా ప్రయత్నిస్తాను” అని నన్ను నాగిరెడ్డిగారి దగ్గరకు పంపించారు. అప్ప్పుడు వారు “షావుకారు తీసే ప్రయత్నంలో ఉన్నారు.

చక్రపాణి, ఎల్.వి.ప్రసాద్‌గార్లు నాకు మేకప్ టెస్ట్ చేయించి తర్వాత కబురు పంపుతాం వెళ్ళమన్నారు. కొన్నాళ్ళ తర్వాత పిలుపొచ్చింది. ఏదో చిన్న వేషం ఇస్తారని అనుకున్నాను. ‘నువ్వే మా కథానాయికవి’ అని చెప్పడంతో ఆనందంతో నోట మాట రాలేదు. అలా విజయాసంస్థలో హిరోహిన్‌గా అడుగుపెట్టాను. నా తొలి సినిమాకు గాను అందుకున్న పారితోషకం రెండువేల ఐదువందలు.

ఆనాటి సినిమా ధోరణుల ప్రకారం నాకు చెప్ప్పుకోదగ్గ గ్లామర్ లేదు. పీలగా, పొట్టిగా ఉంటానని అనేవారు. నా తల్లిదండ్రులు నాకు నేర్పిన సంస్కారం, నటనపట్ల, సినిమాకళపట్ల నాకున్న గౌరవభావం ఇలాంటి అంశాలేవో నిర్మాతలకు నన్ను కథానాయకిగా ఎన్నుకోవడానికి దోహదంచేసి ఉండాలి. ‘షావుకారు’ తర్వాత విజయావారి మరే చిత్రంలోనూ నాకు నటించే అవకాశం లభించకపోయినా, ఆ చిత్ర నిర్మాణంలో నేర్చుకున్న పాఠాలే నా చలనచిత్ర జీవితానికి మంచి పునాది ఏర్పడటానికి దోహపడ్డాయని ఇప్పటికి భావిస్తాను.

‘షావుకారు’ గురించి అప్పటి ‘తెలుగుస్వతంత్ర’ పత్రికలో సంపాదక భీష్మలైన ఖాసా సుబ్బారావుగారు ‘కుటుంబస్త్రీల సినీ రంగప్రవేశం’ అని రాస్తూ అందులో నా నటన గురించి గొప్పగా రాశారు. ఆ విషయాలు నాకిప్పటికీ ఆనందాన్ని కల్గిస్తుంటాయి.

‘షావుకారు’ తర్వాత నటిగా ఇంకా నేను నిలదొక్కకముందే మా రెండో  అబ్బాయి వెంకటరమణ పుట్టాడు. పచ్చి బాలింతరాల్ని. సరైన ఆహారంలేక బలహీనంగా ఉండేదాన్ని. ఐనా బ్రతుకు తెరువుకోసం సినిమాల్లో వేషాలకు అవకాశం కోసం ప్రయత్నించడం మానలేదు. ఆ రోజుల్లో జెమినీగణేశన్‌గారు జెమినీ సంస్థల్లో ఆర్టిస్టులను ఎంపిక చేసే ‘కేస్టింగ్ మేనేజర’గా ఉండేవారు. నేను జెమినీ సంస్థల్లో నటించడానికి అవకాశాలకోసం ప్రయత్నించినప్ప్పుడు తప్పక కబురుపెడతానన్నారు. ఆర్. నాగేంద్రరావు దర్శకత్వంలో ‘ముగ్గురు కొడుకులు’ ప్రారంభిస్తుండగా కబురు పంపారు. జెమినీ వాసన్‌గారు నన్ను చూడగానే కోడలి పాత్రకు ఎంపిక చేశారు.

ఆ తర్వాత ఆదర్శం (1952), ప్రపంచం (1953) చిత్రాల్లో నటించాను.

నేను ఆలిండియా రేడియోలో బాలానందం కార్యక్రమంలో పాý£్గనే రోజుల్లో కొంగర జగ్గయ్యగారు అక్కడి వార్తలు చదువుతూ ఉండేవారు. ఆయన కంఠస్వరం, ఉచ్ఛారణా విధానం విని ఆయన అభిమానంగా మారిపోయాను. అలా నేను అభిమానించే  జగ్గయ్యగారితో కలిసి సినిమాల్లో నటిస్తానని కలలో కూడా అనుకోలేదు. ఆయనతో ముందడగు, అన్నతమ్ముడు (1958), రెండు కుటుంబాల కథ(1970) వంటి ఎన్నో చిత్రాల్లో కలిసి నటించాను. మా కాంబినేషన్‌లో వచ్చిన ‘కోడెకారు చిన్నవాడా’, ‘మ్రోయించవే హృదయవీణ....’ పాటలు ఆ రోజుల్లో చాలా పాపులర్ అయ్యాయి.

నేను చలనచిత్ర రంగంలో నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్న రోజుల నాటి సంగతి. ఒక అద్దె ఇంటికోసం వెదుకుతూ... థౌజండ్‌లైట్స్ ప్రాంతంలోని షఫీమహ్మద్ రోడ్డులో మేడమీద ఒక పోర్షన్ ఖాళీగా ఉందంటే జెమినీగణేశ్‌గారితో కలిసి వెళ్లాను. ఆ మేడ కింద పోర్షన్‌లో ఒక అందమైన యువతి గౌనులాంటిది వేసుకుని చలాకీగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది.

“ఈ అమ్మాయి పేరు సావిత్రి. సినిమా ఆర్టిస్టే” అని పరిచయం చేశారు. జెమినీగణేశన్. ఆరోజు నా కంటిముందు మెరుపుల మెరిసిన సావిత్రి ఈ తర్వాత ఎంతో సన్నిహితురాలైంది. మేమిద్దరం కలసి నటించిన తొలిచిత్రం ‘ఆదర్శం’.

తర్వాత కన్యాశుల్కం(1955)లో తను మధురవాణిగా వేస్తే నేను బుచ్చమ్మగా నటించాను. చరణదాసి (1956), మంచిమనసులు(1962), డాక్టర్ చక్రవర్తి(1964) లాంటివి మేం కలిసి నటించిన మరికొన్ని చిత్రాలు.

సావిత్రిలో నన్ను విశేషంగా ఆకర్షించిం ఆమె నటిగా రాణించడానికి చేసిన కృషి. ఆమె తన వ్యక్తిగత విషయాలు తరచుగా నాతో చెబుతుండేవారు. ఆమె శ్రేయోభిలాషిగా - సన్నిహితులు సైతం చెప్పడానికి సాహసించని సలహాలు, మందలింపులు నా ధోరణిలో నేను చెప్పేదాన్ని. నాపట్ల ఎంతో గౌరవంతో అన్నీ ఓపికతో వినేది. అంతా విన్నాక “మీకున్నంత ధైర్యం, ఆత్మవిశ్వాసం నాలో లేవండీ!” అనేది బేలగా....

సావిత్రికి మంచిపేరు తెచ్చిన వినోదావారి ‘దేవదాసు’(1953) చిత్రంలో పార్వతి పాత్రకు మొదట నన్ను అనుకున్నారు. రిహార్సల్సు జరిగాయికూడా. అయితే కారణాంతరాల వల్ల ఆ పాత్ర నేను మిస్సయ్యాను. అది నిజంగా నా దురదృష్టమే.ఎందుకంటే ‘ఓ దేవదా’ పాట రిహార్సల్స్ ఎంతో బాగా వచ్చిందో... కారణం లేకుండా తీసేయటం.... ఆవేషం పోయినందుకు పదిరోజులు ఏడ్చాను. ఆ తర్వాత ఎప్ప్పుడో గోగినేని వెంకటేశ్వరరావు నన్ను తీసేయడానికి కారణాల్ని వివరించినట్టు జ్ఞాపకం. ఒక వేళ నేను దేవదాసులో నటించి ఉంటేనా నా నటజీవితం ఏ మలుపు తిరిగి ఉండేదో!


అక్కినేని నాగేశ్వరరావుగారితో కలిసి నటించిన తొలిచిత్రం ‘రోజులు మారాయి’ (1954). అందులో నాది గడుసైన పల్లెటూరి పాత్ర. ‘పిల్ల’ అంటే జ్ఞాపకమొస్తోంది. ఆ చిత్ర నిర్మాణ సమయంలో తాపీ చాణక్యగారు నన్ను అప్యాయంగా ‘పిల్లా’ అని పిలుస్తూ ఉండేవారు. పాత్రలకు తగిన పాత్రధారులిన ఎంపిక చేయడంలో ఆయన చాలా సమర్థులు. ‘రోజులుమారాయి’లోని రాధ పాత్రకు నన్ను ఎన్నుకోవడం గురించి చెప్పినప్పుడు - నా కళ్లు, కంఠస్వరం ప్రత్యేక ఆకర్సణులుగా చెప్పేవారు. ‘నీ ముఖకవళికల్లో అనేక భావాలు పలుకుతాయి. నీ చుబుకం కూడా మాట్లాడుతుంది’ అనేవారు.

ఆ చిత్రంలోని ‘ఏరువాకా సాగారో’ పాటకు వహీదారెహమాన్ డాన్స్ చేసింది. ఆమె డాన్స్ చేస్తున్న తీరు చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడే అక్కినేనిగారితో ‘ఈ అమ్మాయికి మంచి భవిష్యత్ ఉంటుందని’ అన్నాను. ‘రోజులు మారాయి’ విజయోత్సవం హైదరాబాదులో జరిగినప్పుడు అక్కడి ‘రిట్జ’ హోటల్‌లో మా అందరినీ సారథి అధినేత రామకృష్ణప్రసాద్ గారు గురుదత్‌గారికి పరిచయం చేసారు. అలా పరిచయమైన వహీదాను చూసి, మాట్లాడి హిందీలో అవకాశం కల్పించారు ఆయన. ఆ తర్వాత ఆమె ఎంత ఎత్తుకు ఎదిగారో అందరికీ తెలిసిందే. అలా వహీదారెహమాన్ గురించి నా అంచనా నిజమైనందుకు ఆనందింస్తుంటాను. తర్వాత ఎన్.టి.రామారావుగారితో జోడిగా ‘జయసింహ’లో నటిస్తే వహీదాకు డబ్బింగ్ చెప్పాను కూడా.

‘రోజులుమారాయి’ని తమిళంలో ‘కాలం మారిపోచ్చి’ పేరుతో నిర్మించినప్పుడు నా పాత్రను అంజలీదేవిగారు వేశారు. చిత్రం ఏమంటే ఇతర భాషల్లో నిర్మించినప్పుడు మాతృకలోని నా పాత్ర మరెవరినో వరించేది.

నాకు తెలుగులో కంటే తమిళంలో మంచి పేరొచ్చింది. ఎంజిఆర్, శివాజీ, జెమిని మొదలైన వాళ్లందరితోనూ కథానాయికగా చేశాను. ఎంజిఆర్‌తో నేను నటించిన చిత్రాలు కొన్నే అయినా అన్నీ పూరు తెచ్చుకున్నవే. ఆయన నటించిన నూరో చిత్రం ‘ఒళి విళక్కు’లో నేను ప్రధాన పాత్ర ధరించాను. ఆ చిత్రంలో కథానాయకుడు చావు బతుకుల్లో ఉన్నప్పుడు భగవంతుడ్ని ప్రార్థిస్తు ఒక పాట పాడే సన్నివేశం ఉంది. ‘నా ప్రాణాలు తీసుకుని ఆయనకు జీవం పోయమని’ ఆ పాట అర్థం. ఎంజిఆర్ వైద్యం కోసం అమెరికా వెళ్లినప్పుడు ఆ చిత్రానికి, అందులోని ఆ సన్నివేశానికి విశేషమైన ప్రాధాన్యం ఏర్పడింది. ‘ఒళి విళక్కు’ విడుదలైన తర్వాత ఒకరోజు ఆయనే స్వయంగా తన కారులోని ‘ఎమర్జెన్సీ లాంప’ను నాకు బహూకరిస్తూ ‘పన్బట్ట గుణ చిత్రనటిగై’ అని పొగిడి ‘మీ ఇంట్లో ఎప్పుడూ దీపం వెలుగుతూ, నలుదిశలా కాంతులు ప్రసరిస్తూ ఉండాలి’ అని దీవించారు.

శివాజీగణేషన్ గారితో మొట్టమొదటిగా నేను ‘పావై విళక్కు’ అనే చిత్రంలో నటించగా, ముందుగా విడుదలైన చిత్రం మాత్రం ‘పడిక్కాద మేదై’. ఈ చిత్రమే తెలుగులో ‘ఆత్మబంధువు’గా వచ్చింది. తెలుగులో ఆ పాత్ర సావిత్రి వేసింది. అలాగే తమిళంలో నాకు విశేషమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన చిత్రం ‘ఇరుకోడు గళ’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘కలెక్టర్ జానకి’ పేరుతో నిర్మించారు. అందులో నటించమని కె.బాలంచందర్ అడిగినా తమిళంలో నా బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోయాను. వారు శారదగారిని కూడా అడిగారు. ఆమె కూడా ఎందుకనో నటించలేదు. చివరకు జమున ఎంత మహోన్నతంగా ఆ పాత్రను చేశారో మీరంతా ఎరిగిందే. ‘కలెక్టర్ జానకి’ తమిళ చిత్రానికి 12 అవార్డులు వచ్చాయంటే దాని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఆరుద్రగారు ‘మంచికుటుంబం’ (1968) శతదినోత్సవ సభలో ‘జానకి త్యాగరాజకీర్తన’ లాంటిది. ఎలాగంటే త్యాగరాజస్వామి తెలుగువాడైనా, ఆయన కీర్తనలకు తమిళులే ఎక్కువ ప్రాచుర్యం కల్పించారు. అలాగే జానకి ప్రతిభకు ఎక్కువ గుర్తింపు తమిళ చిత్రాల ద్వారానే లభించిందని’ ప్రశంసించారు.

శివాజీగణేషన్ తమ సొంత చిత్రం ‘పుదియపరవై’ (సింగపూర్ సి.ఐ.డి)లో ఓ వినూత్నమైన పాత్రను ధరించే అవకాశం కల్పించారు. అత్యాధునికంగా కన్పించే గాయని పాత్ర అది. ఆ చిత్రం నాకు స్వదేశంలోనే గాక సింగపూర్, హాంకాంగ్, టోక్యో మొదలైన దేశాల్లో కూడా గుర్తింపు తెచ్చింది. ఆయా దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి తమిళ ప్రేక్షకులు ఆ పాత్రను గుర్తుచేస్తూ అభినందించేవారు.

ప్రముఖ వీణా విద్వాంసులు ఎన్.బాలచందర్ గారి దర్శకత్వంలో నేను నటించిన ‘ఏది నిజం?’ (1956) చిత్రానికి రాష్ట్రపతి అవార్డు వచ్చింది. చరణదాసి (1956), భాగ్యరేఖ (1957) లాంటి చిత్రాల్లో హాస్యపాత్రల్ని కూడా ధరించాను. భాగ్యరేఖలో నటిస్తుండగా ఒక సంఘటన జరిగింది. నిజానికి నేను షూటింగ్‌కు హాజరు కావడంలో ఎప్పుడూ ‘పంక్చుయాలిటీ’ పాటిస్తాను. కానీ ఒకరోజు కాస్త ఆలస్యయంగా వెళ్లాను. అప్పటికే ఎవరేం చెప్పారో.... బి.ఎన్.రెడ్డిగారు విపరీతంగా కోప్పడ్డారు. నాకు ఏడుపొచ్చేసింది. షూటింగ్ పూర్తయ్యాక ‘మా అబ్బాయికి బుజ్జగించి స్కూల్‌కు పంపేసరికి ఆలస్యమైందని’ వివరించాను. ఆయన విషయం అర్థం చేసుకుని ‘ఐయామ్ సారీ జానకీ’ అన్నారు.

కొన్నిసార్లు పిల్లలకు అన్నం పెట్టడానికి కూడా తీరిక ఉండేది కాదు. గుర్తొచ్చినప్పుడల్లా తల్లడిల్లి పోయేదాన్ని. అయితే అలాంటి కొన్ని విషయాలు జీవితంలో రాజీ పడటాన్ని నేర్పాయి. ఇంట్లోకి అడుగుపెట్టగానే నేను నటినన్న సంగతి మర్చిపోయేదాన్ని. గృహిణి బాధ్యతలు నెత్తిన వేసుకునేదాన్ని.

నేను నిర్మాతగా రెండు సినిమాలు నిర్మించాను. బెంగాల్‌లో ఉత్తర్ ఫల్గుణి నిర్మించిన ‘మమ్‌త’ ఆధారంగా తమిళంలో కె.బాలచందర్ దర్శకత్వంలో ‘కావియతలైవి’ తీశాను. బెంగాల్‌లో సుచిత్రాసేన్ తల్లీ కూతుళ్లుగా నటించిన ఆ పాత్రల్ని నేనే ధరించాను. కానీ ఆ చిత్రం ఆర్థికంగా విజయం సాధించలేదు. రెండవది కూడా ‘రంగరాట్టనమ’ అనే తమిళ చిత్రమే.

ఇక నా పాత్రల పరంగా వివరించాల్సి వస్తే ఎన్నో విభిన్న పాత్రలు నన్ను వరించాయి. అక్కినేనితో నటించిన బాటసారి (1961). మంచిమనసులు (1962) డాక్టర్ చక్రవర్తి (1964), అక్కాచెల్లెళ్లు (1970), మంచికుటుంబం (1968) చిత్రాల్లో నేను వేసినవన్నీ డిఫరెంట్ కారెక్టర్స్. ఒక స్త్రీ వివిధ కోణాల్లో ఏ విధంగా సంఘర్షణ పడుతుందో, ఆ కోణాలన్నీ ఆయా పాత్రల్లో ప్రదర్శించి గుర్తింపు పొందగలిగాను.

కేరక్టర్ ఆర్టిస్టుగా నాకు మొదటి చిత్రం ‘ఉండమ్మా u£ట్టుపెడతా’ (1968). ఆ తర్వాత వేములవాడ భీమకవి (1976), ఖైదీబాబాయ్ (1974), యవ్వనం కాటేసింది, తాయారమ్మ-బంగారయ్య (1979) లాంటివి చాలానే ఉన్నాయి.

ఎన్.టి.రామారావుగారు నన్ను ఎంతో గౌరవించే వారు. అంతెందుకు వారి ‘ఎన్.ఏ.టి’ ఎంబ్లెమ్‌లో వంఎకటేశ్వరస్వామి పక్కన శ్రీదేవిగా ఉన్నది నేనే. ఆయనకు గౌరవ డాక్టరేట్ వచ్చినప్పుడు మద్రాసు సెంటినరీ హాలులో ఏర్పాటు చేసిన సభలో ఆయన గురించి ప్రధానోపన్యాసం చేసిందీ నేనే. ‘సంసారం ఒక చదరంగం’ చిత్రంలో నేను చేసిన ‘చిలకమ్మ’ పాత్రకు ఉత్తమ సహాయనటిగా నంది అవార్డును కూడా ఆయన చేతుల మీదుగానే అందుకున్నాను.

నిజానికి ‘షావుకారు’ తర్వాత కె.వి.రెడ్డిగారు నన్ను పిలిచి ‘నువ్వు సినిమాలకు పనికిరావు. గ్లామరు, పర్సనాలిటీ ఇవేవీ లేవు. వచ్చిన దారినే వెళ్లిపో’ అన్నారు. ఆ రోజు నుండి నాలో నాకే ఓ తెలియని పట్టుదల పెరిగింది. నటిగా రాణించాలని ఎంతో శ్రమించాను. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాను.

‘సినిమాలకు పనికిరానంటూ’ తేల్చేసిన కె.వి.రెడ్డిగారే 1961లో విడుదలైన శ్రీవేంకటేశ్వర మహాత్మం’లో నేను పోషించిన ఎరుకల సాని పాత్రని చూసి నా నటనను మెచ్చుకొని, ఆయన అన్న మాటల్ని వెనక్కి తీసుకున్నారు. ఆ సోది పాత్రను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు చూసి, ముచ్చటపడి రెండుసార్లు రిపీట్ చేసి మరీ వేయించుకుని చూశారట. పి.పుల్లయ్యగారు అది ఎంతో గొప్పగా చెప్పేవారు. జవహర్‌లాల్ నెహ్రూ, రాధాకృష్ణన్ వంటి జాతీయ నాయకుల చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం మరిచిపోలేని అనుభూతిగా నేను భావిస్తుంటాను. 1946లో ఆంధ్ర మహిళా సభలో చదువుకునే రోజుల్లో గాంధిగారు అక్కడికి వచ్చినప్పుడు దుర్గాబాయి దేశ్‌ముఖ్ నన్ను, నా స్నేహితురాల్ని వారికి వలంటీర్లుగా నియమించారు. మహాత్మాగాంధికి నేను సేవ చేయగలిగానని ఇప్పటికీ గర్వపడుతుంటాను.

సినిమా పరిశ్రమలో ఉన్నా నేను రంగస్థలాన్ని మరవలేదు. కె.బాలచందర్ ఆధ్వర్యంలో రాగిణి క్రియేషన్స్ తరఫున ‘నీర్‌కుమిళి’ (నీటిబుడగ), ‘మెళగువత్తి’ (కొవ్వొత్తి), ‘ఎదిర్ నీచ్చల’ (ఎదురీత), అనే తమిళ నాటకాల్లో నటించాను. తానా సభల్లో భమిడిపాటి వారి ‘తరం అంతరం’ ప్రదర్శించాను.

తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషలన్నిటిలోనూ కలిపి మొత్తం 380 చిత్రాలు చేశాను. అన్ని పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. మన వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని నిలబెట్టే అంశాల్లో వాయిస్ ఒకటి అని నేను విశ్వసిస్తుంటాను. ‘మంచి కుటుంబం’లో నేను మాట్లాడిన ఇంగ్లీషు, ‘సంసారం ఒక చదరంగం’లో చిలకమ్మ పాత్రలో యాస, ‘గాంధీపుట్టినదేశం’, ‘మనుషులు మారాలి’లోని ఆ హూందాతనం.... ఇవన్నీ నన్ను ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా చేశాయి. ఈ రోజుల్లో అన్నీ అరువు తెచ్చుకునేవే అని నా అభిప్రాయం.

మంచి భోజనం చేస్తూ సన్నిహితులతో గడపడమంటే నాకు చాలా ఇష్టం. మేము బ్రాహ్మణుల మైన ఒకప్పుడు నేను మాంసాహారినే! అయితే 1995లో పుట్టపర్తి వెÞ£్ళచ్చాక పూర్తి శాఖాహారిగా మారిపోయాను. సత్యసాయిబాబా నా ఇష్టదైవం. వారే నాకు గ్రేట్ ఫిలాసఫర్, అవసరమైన సమయంలో నా జీవితంలోకి ప్రవేశించి మానసిక ప్రశాంతతను ప్రసాదించారు. ఒకసారి బాబా సమక్షంలో వేలాది మంది భక్తుల ముందర ప్రసంగించాల్సి వచ్చింది. అప్పుడు అంతమందిలో బాబా నన్ను ఉద్దేశించి “జానకి ఒక విచిత్రమైన వ్యక్తి. అనుకున్నదే అంటుంది. అన్నదే చేస్తుంది. జీవితంలో ఎన్నో దాటుకుని నా చెంతకు వచ్చింది’ అన్నారు. ఇంతకంటే నాకేం కావాలి? అంతా వారి దయ. నటిగా నిర్మాతలను గానీ, దర్శకులను గానీ సెట్స్ మీద ఏనాడూ నేను బాధ పెట్టలేదు. డి.ఎల్.నారాయణగారు ‘దేవదాసు’లో నన్ను నిష్కారణంగా తొలగించినా అవేవీ మనసులో పెట్టుకోకుండా మళ్లీ ఆయనకే ‘కన్యాశుల్కం’లో బుచ్చమ్మ పాత్రను చేశాను కదా! ఆ బుచ్చమ్మ పాత్రకు ఈ మధ్యే నేను గురజాడ స్మారక అవార్డు అందుకున్నాను.

నాకు ముగ్గురు పిల్లలు. యజ్ఞప్రభ, కృష్ణశచి, అబ్బాయి వెంకటరమణ. యజ్ఞప్రభ కూతురే వైష్ణవి. కొన్ని సినిమాల్లో నటించి పెళ్ళి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లయి సంతోషంగా ఉంది. రెండో అమ్మాయిని రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి గారి అబ్బాయికి ఇచ్చి చేశాం. కాని పెళ్ళయిన ఆరేళ్లకే గుండెపోటుతో మా అల్లుడు పోయాడు. అదో దురదృష్టకరమైన సంఘటన. మా కూతురు తన కొడుకుతో విదేశాల్లో ఉంటోంది. మా అబ్బాయి ఇండస్ట్రీయల్ ఇంజనీర్‌గా అమెరికాలో స్థిరపడ్డాడు. మనవళ్లూ మనవరాళ్లందరూ జీవితంలో సెటిలైపోయారు. నా పిల్లలు సినిమాల్లోకి రావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అలాగా వెండి తెరకు దూరంగా పెంచాను కూడా. నేను ఏ పని చేసినా దానికో బలమైన కారణం ఉంటుంది. ఎవరిదగ్గరా ఏమీ ఆశించే తత్వం కాదు కాబట్టి ఎక్కడా అవమానం పొందలేదు.

నేను ప్రస్తుతం బెంగళూరుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గబ్బలాల గ్రామంలో మా చెల్లెలు కృష్ణకుమారి ఎస్టేట్‌లో ఉంటున్నాను. ఆ ఎస్టేట్‌లోనే 800 చదరపు అడుగులు కొనుక్కుని మంచి ఇల్లు కట్టుకుని దానికి ‘సాయికుటీర’ అని పేరు పెట్టుకున్నాను. నేను పెంచిన తోటలో, నేను పెంచిన కూరగాయలు తింటూ హాయిగా ఉన్నాను. తీరిక సమయాల్లో కృష్ణకుమారితో కలిసి పాతజ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఉంటాను. మా అమ్మ చనిపోయి పదేళ్లయింది. ఆమె చివరి కోరిక నేను, చెల్లీ కలిసి ఉండాలని. నాకిప్పుడు 75 ఏళ్లు వచ్చేశాయి. ఈ మధ్య కన్నడ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి గాని మోకాలు చిప్ప అరిగిపోవడం వల్ల గబగబా నడవలేక పోతున్నాను. అదొక్కటే అసంతృప్తి. అవసరం మేరకు సంపాదించాను. అపాత్ర దానం చేయకుండా అవసరమైన వారికి గుప్తంగా సాయం చేస్తుంటాను.

ఎన్ని సాధించినా, ఎన్నేÞ£్ళచ్చినా ఇంట్లో వాళ్లకు నేను ఇప్పటికీ ‘జానూ’నే. అభిమానులకు ‘షావుకారు అమ్మాయి’నే. తెలుగు సినిమా వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సంవత్సరంలోనే నా జీవిత వజ్రోత్సవం జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను పెంచి పెద్ద చేసిన పరిశ్రమకు, పరిశ్రమను పోషిస్తున్న లక్షలాది ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి