చాలారోజుల కిందట దర్శక మాంత్రికుడు విఠలాచార్యను ఒక ఇంటర్వ్యూలో అడిగారు - ఏమండీ. మీ సినిమాల్లో రాజశ్రీగారే ఎక్కువగా ఉంటారు ఎందుకని? అని. దానికి విఠలాచార్య - అవును. ఆమెనే నేను ఎక్కువగా బుక్ చేశాను. ఎందుకంటే ఆమె మంచినటి. కోఆపరేటివ్. బడ్జెట్‌కు అందుబాటులో ఉండేది. స్టార్ అయినా పారితోషికాన్ని డిమాండ్ చేసేది కాదు. ఒక్కోసారి ఆమెకు సినిమాకు పదహారు వందలు మాత్రమే యిచ్చిన సందర్భాలు వున్నాయి అని మెచ్చుకున్నారు. ఈ మాటలు చాలు రాజశ్రీ అంటే ఏమిటో తెలియచేయడానికి, కాంతరావు సరసన హిట్ పెయిర్‌గా ఆంధ్రుల హృదయాలను కొల్లగొట్టిన అలనాటి ఆ తార జ్ఞాపకాలను ఈ వారం అందిస్తున్నాం.
“సినిమారంగంలోకి అడిగిడినప్పుడు నా వయసు పదమÖడేళ్లు. నిజంగా అప్పటి వరకు అసలు నేను నటించాలని కూడా అనుకోలేదు. మద్రాసులోనే మా వీధిలో వుంటున్న దండాయుధపాణి అనే నాట్యాచార్యుని దగ్గర క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటూ వుండేదాన్ని. ఓసారి మా బంధువులతో కలసి ఎవిఎం స్టూడియో చూడ్డానికి వెళ్ళాను. అక్కడ డాన్సింగ్ హాలులో ఎవిఎం చెట్టియర్, దండాయుధపాణి గార్లున్నారు. మా మాష్టరుగారు చెట్టియార్‌కు నన్ను పరిచయం చేశారు. ఆయన వెంటనే డాన్స్ చేయమని అడిగారు. నేను ఏమీ ఆలోచించకుండా అడిగిందే తడవుగా డాన్స్ చేశాను. ఆయన ఆనందించి సినిమాల్లో నటిస్తావా అని అడిగారు. నేను తలూపాను. కానీ, ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోలేదు. చివరకు పాణిగారు బలవంతంగా ఒప్పించి ‘నాగులచవితి’ (1956) చిత్రంలో బాలనటిగా తొలిసారి అవకాశం ఇప్పించారు. అందులో హీరోయిన్ జమున. ఆమె చిన్నప్పటి వేషం నాది. ఆ తర్వాత కాంట్రాక్ట్ బేసిస్‌మీద మÖడేళ్లు ఎవిఎంలో ఆర్టిస్ట్‌గా కొనసాగాను.”
“ఆ సమయంలోనే సినిమాకు అవసరమైన అభినయం, నాట్యం, డైలాగ్ డెలివరీ అన్నిట్లోనూ శిక్షణ పొందాను. ఆ తర్వాత ‘మాంగల్యం’ (1959), ‘భక్త శబరి’ (1960), ‘నిత్యకల్యాణం-పచ్చతోరణం’ (1960) వంటి చిత్రాల్లో సహాయనటిగా నటించాను. అసలు పేరు కుసుమ కుమారి. సినిమాల్లో నటించడానికి వచ్చాక చెట్టియార్‌గారే నాపేరు చివర శ్రీ వస్తే బాగుటుందని రాజశ్రీ అని మార్చారు. ఆయనే వాణిశ్రీకి కూడా పేరు మార్చింది. ఆయన పేరు మార్చిన విశేషమో లేక నా అదృష్టమో ఏమో గానీ, నా దశ తిరిగి పెద్ద స్టార్‌నయ్యాను. నేను హీరోయిన్‌గా నటించిన మొదటి చిత్రం ‘తోటలో పిల్ల కోటలో రాణి’ (1964). నేను తొలిసారిగా కాంతరావుగారి సరసన హీరోయిన్‌గా నటించాను. ఆ చిత్రం సక్సెస్ అయిన వెంటనే సువర్ణావకాశం ఒకటి దర్శకుడు శ్రీధర్ రూపంలో నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ‘కాదలిక్క నేరమిల్లై’ (1965) చిత్రం ద్వారా నేను తమిళ రంగానికి పరిచయమయ్యాను. దీనినే హిందీలో ‘ప్యార్‌కియాజాయ’ అనే పేరుతో శ్రీధర్ నిర్మించాడు. ఈ చిత్రంలో నేను శశికపూర్ సరసన నటించాను. అరవం, హిందీ భాషల్లో విజయవంతమైన ఈ చిత్రాన్ని ‘పద్మశ్రీ’ పతాకంపై పి.పుల్లయ్య గారు ‘ప్రేమించి చూడు’ (1965)గా నిర్మించాను. ఈ చిత్రం చాలా పెద్ద హిట్టయ్యింది. అలా ఒకే చిత్రం మÖడు భాషల్లో అఖండ విజయం సాధించడమే విశేషమనిపిస్తే, ఆ మÖడిట్లోనూ నేనే కథానాయికగా నటించడం మరీ విశేషమనిపిస్తుంటుంది నాకు.”
“నన్ను ఆశ్చర్యపరిచే చిత్రాలు, నాకు మంచి పేరు తెచ్చి పెట్టిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. నా సినీ జీవితంలో ‘భలే కోడళ్ళు’ (1968) మరపురాని చిత్రంగా చెప్పుకోవచ్చు. నిజజీవితంలో హీరోయిన్ అయిన నేను ఆ సినిమాలోనూ హీరోయిన్‌గా నటించాను. అదే సినిమా అరవంలో ‘భామా విజయం’గా వచ్చింది. ఆ సినిమా నాకు ఫాన్స్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. అందులో షావుకారు జానకి, జయంతి, నగేష్ వంటి గొప్ప ఆర్టిస్టులతో పరిచయం, స్నేహం కలిగాయి. ఎన్‌టిఆర్, ఎఎనఆర్, ఎంజిఆర్, శివాజీగణేశన్, కృష్ణ, శోభన్‌బాబు, హరనాథ్‌లాంటి అగ్రనటులందరి సరసన ఎన్నో వందల చిత్రాల్లో నటించాను.”
“ఎంతో మంది హీరోలతో నటించినా జానపద హీరో కాంతారావు పక్కనే నాకు మంచి పేరొచ్చింది. అసలు ఆ టీమే వేరు. విఠలాచార్య, రాజనాల, కృష్ణకుమారి, కాంతారావు, నేను... మా ఐదుగురిదే ఒక బ్రాండ్. బి.విఠలాచార్య సారధ్యంలో ‘గురువును మించిన శిష్యుడు’ (1963), ‘అగ్గిబరాఠా’ (1966), ‘అగ్గిపిడుగు’, ‘మదన కామరాజు కథ’ (1962), ‘రణభేరి’ ఇలా నటించిన వన్నీ నాకు మంచి పేరు తెచ్చినవే. ఒక విధంగా చెప్పాలంటే నాకు నటిగా జీవితాన్ని ఇచ్చింది విఠాలాచార్యే. ఇక ఎన్‌టిఆర్ గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. మంగమ్మ శపథం, సత్యహరిశ్చంద్ర చిత్రాల్లో ఆయనతో చిన్న నృత్యసన్నివేశాల్లో పాý£్గన్న నాకు, త్వరలోనే హీరోయిన్ ఛాన్సు వచ్చింది. పిడుగురాముడు, గోపాలుడు భూపాలుడు వంటి జానపదాలు, దానవీర శూరకర్ణ వంటి పౌరాణికాలు, మహామంత్రి తిమ్మరుసు లాంటి చారిత్రకాలు, చిట్టిచెల్లెలు, ఒకే కుటుంబం, దొరికితే దొంగలు వంటి సాంఘికాలు ఎన్‌టిఆర్ గారి కాంబినేషన్‌లో నాకు మంచి పేరు తెచ్చిన చిత్రాలు. అలాగే అక్కినేని నాగేశ్వరరావుగారితో నేను తక్కువ చిత్రాల్లో నటించినా అన్నీ నాకు పేరు తెచ్చినవే. గోవులగోపన్న, ఆత్మగౌరవం, ఆరాధన ముఖ్యమైనవి. ఆ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం నాగేశ్వరరావు పక్కన నటించిన హీరోయిన్లందరినీ పిలిపించి పెద్ద ఎత్తున ఫంక్షన్ చేశారు టి.సుబ్బరామిరెడ్డిగారు. ఆ సభకు నాకు ఆహ్వానం రావడం నేను వెళ్ళడం, మా తరం హీరోయిన్లందరినీ కలుసుకోవడం నాకు చాలా మధురమైన జ్ఞాపకాల్లో ఒకటి.”
“హిందీలో నసీయత్, పాయల్‌కీ ఝంకార్ వంటి చిత్రాలు, కలైయరసి వంటి తమిళ చిత్రాల్లో నటించాను. ముఖ్యంగా సినీ నటులు ఎంత మంచి పాత్రలు ధరించినా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యేది, గుర్తుండేది వారిపై చిత్రీకరించిన పాటలతోనే. అదృవశాత్తు నాపై చిత్రీకరించిన పాటలూ అలాంటివే. చరిత్ర ఎరుగని మహాపతకం, ఏమో ఏమో ఇది, పూవులు పూయును పదివేలు, ఆకాశంలో హంసలమై, పలుకవే నా రామచిలుక వంటి పాటలన్నీ నన్ను ప్రేక్షకుల స్మృతిపథంలో చెరిగఇ పోనీయనివే. ఆనాటి సంగీత సాహిత్యాలు అంత గొప్పవి కావడం కూడా యిందుకు కారణం. నటుడు పద్మనాభం నిర్మించిన మర్యాదరామన్న చిత్రంలో ‘ఏమి ఈ వింత మోహం’ పాట నాకు చాలా మంచి పేరు తెచ్చింది. ఐదుగురు హీరోల మధ్య నేను నాయికగా చిత్రీకరించిన పాట అది. పి.సుశీలగారు నాకు ప్లేబాక్ పాడారు. అదే తొలిపాట. ఆ పాటలో రామకృష్ణ, కృష్ణ, హరనాథ్ వంటి వారితో నటించాను.”
“నేను నటిగా ఉజ్వల స్థాయిలో వుండే సమయంలో పరిశ్రమ నుంచి తప్పుకున్నాను. నేను నటించినకూడదన్న షరతు మీదే నా వివాహం జరిగింది. మావారు పాంచజన్యం కాంగ్రెస్ పార్టీ డిప్యూడీ చైర్మన్‌గా (జలగం వెంగళరావు హయాంలో) పని చేశారు. పెళ్ళి అవగానే ఆయనతో పాటు హైదరాబాదు వెళ్ళాను. దాంతో నటజీవితానికి తెరపడింది. ఆయన ఎక్కువగా ఎలక్షన్లు, పార్టీలు, గొడవలతో బిజీగా ఉండేవారు. పెళ్ళి తర్వాత కుటుంబ బాధ్యతలతో పాటు వచ్చిపోయే అతిథులతో సరిపోయేది. మాకు బాబు పుట్టాక 1983లో ఆయన పోయారు. ఆ తర్వాత హైదారాబాద్, వైజాగ్ కొంతకాలం గడిపి 1991లో చెన్నై వచ్చేశాను.”
“నాతో పాటు పనిచేసిన వారందరూ ఇంకా నటిస్తున్నారు. నేను మాత్రం మావారికిచ్చిన మాట మీద గౌరవంతో నటించే ఆలోచనను విరమించుకున్నాను. కానీ, సినిమా రంగం అంటే ఇప్పటికీ ఎంతో గౌరవం భక్తి ఉన్నాయి. ఇటీవల ఎన్‌టిఆర్ బంగారు పతకం అందుకోవడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు, ఆ సందర్భంగా జరిగిన సభలో నటుడు మురళీమోహన్ “రాజశ్రీ గారు నటిస్తానంటే నిర్మాతలు అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా వున్నారు” అని అన్నారు. నేను నటించడం మాట ఎలా ఉన్నా ఆయన అలా అనడం చాలా ఆనందం వేసింది. నాపట్ల ఉన్న అభిమానం ఇంకా చెక్కు చెదరలేదనిపించింది.”
“సావిత్రి, బి.సరోజాదేవి, పి.భానుమతి, రాజ్‌కపూర్ నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్టులు. ఒక వైజయంతి మాల అంటే నాకు చిన్నప్పటినుంచే చెప్పలేని అభిమానం ఆరాధన. డ్రెస్సింగ్, హెయిర్‌స్టయిల్స్ అన్నీ ఆమెనే అనుకరించేదాన్ని. నేను సినిమా రంగం నుండి విరమించే ముందు మళయాళ నటీనటులతో కలసి అనేక డాన్స్ ప్రోగ్రామ్స్ విదేశాల్లో ఇచ్చాను. 1976లో న్యూయార్క్, వాషింగ్టన్, బోస్టన్, శ్రీలంక, సింగపూర్ మొదలైన దేశాల్లో నా ప్రదర్శనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఎన్ని చెప్పినా, ఎంత చేసినా మేము రుణపడి ఉండాల్సింది ఇద్దరికి. ఒకరు మాకు ఇన్ని పాత్రలిచ్చి ప్రోత్సహించిన నిర్మాతలు, దర్శకులు, మరొకరు ప్రేక్షకులు. వీరిని మేము మరచిపోతే కళాకారులకు (నటీనటులకు) మనుగడ లేదు.”
“నాకు తెలుగులో ‘అందమే ఆనందం’ చివరి చిత్రం. తమాషా ఏమిటంటే నా తొలి హీరో అయిన కాంతారావే తుది చిత్రంలో హీరో కావడం. పరిశ్రమ ఇప్పుడెలా ఉందో తెలీదుగానీ మా రోజుల్లో సినిమా స్టూడియోలు పూజామందిరాలు. అంజలీదేవి, భానుమతి, సావిత్రి, జయంతి, కాంచన వంటి అంకితభావంగల ఆర్టిస్టులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఆ రోజుల్లో అందరం కుటుంబ సభ్యుల్లా కలిసి పోయేవాళ్ళం. ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకునే వాళ్ళం, కలసి చర్చించుకునే వాళ్ళం. ఒక్కొక్కప్పుడు ఎదుటివారి ఓదార్పులే మనకు కొండంత అండనిస్తాయి. అలాంటి జ్ఞాపకమే నాకు ఒకటుంది. పి.భానుమతిగారు, నేను ‘పత్తుమాద బంధం’ అనే తమిళ చిత్రంలో కలసి నటించాం. అప్పటికే భానుమతిగారు పెద్ద హీరోయిన్. సెట్లో ఆమె ఉంటే అందరం ఎంతో భయంగా నడచుకునే వాళ్ళం. ఆవిడా ఎవ్వరితోనూ క్లోజ్‌గా మÖవ్ అయ్యేది కాదు. కానీ, ఆ చిత్రం ముగిసిన ఆఖరిరోజు మా అమ్మ చనిపోయింది. ఆ సందర్భంలో ఆవిడ నన్ను ఓదార్చిన సంఘటన ఎన్నటికీ మరచిపోలేను. ఇలా ఎన్నో జ్ఞాపకాలను నాకు కలిగించిన సినిమా పరిశ్రమకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. చిన్న వయసులోనే నా భర్త మరణం నాకు పెద్దషాక్. ఆ షాక్ నుంచి నేను కోలుకోవడానికి ఇంత కాలం పట్టింది. నా భర్త జ్ఞాపకాల్లో జీవిస్తూ, నా ఏకైక కుమారున్ని బాగా చదివించి, అభివృద్ధిలోకి తేవాలన్నదే నా అభిమతం. నా కొడుకు శ్రీనివాస్ ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నాడు.”
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి