‘రత్నమాల’ - భరణీ పిక్చర్స్ వారి తొలిచిత్రం. భానుమతి, రామకృష్ణ దంపతుల కుమారుని పేరు భరణి. స్వర్గసీమ చిత్రం తరువాత సినిమారంగం నుంచి విరమించుకోవాలనుకొన్న భానుమతి కొడుకుపుట్టగానే, చిత్రనిర్మాణ రంగంవైపు దృష్టి పెట్టి, తొలి ప్రయత్నంగా ‘రత్నమాల’ చిత్రాన్ని తీశారు.
తొలుత రత్నావళి కథ తీద్దామనుకొని సముద్రాల వారితో కథాచర్చలు జరిపారు. కానీ అది అచ్చివచ్చిన కథ కాదని, నలుగురు అనగానే మళ్ళీ కథ కోసం అన్వేషణ జరిపారు. అప్పుడు భానుమతికి వాళ్ళమ్మగారు చెప్పిన వ్రతకథల్లో ‘రత్నమాల’ కథ గుర్తొచ్చింది. దానిని సముద్రాల వారితో కలిసి సినిమా కనుగుణంగా మలచారు.
ఆ రోజుల్లో జానపదకథలు, ముఖ్యంగా మహిళలను ఆకర్షించేకథలకు మంచి ఆదరణ ఉండేది. రత్నమాల జానపదకథ అందరినీ ఆకట్టుకుంది. సముద్రాల వారు మాటలు, పాటలు రాయగా, భానుమతి భర్త రామకృష్ణ స్క్రీన్‌ప్లే రాసి దర్శకత్వం వహించారు.
అలా భానుమతి రచయితగా, నిర్మాత్రిగా పనిచేసిన తొలి సినిమా ‘రత్నమాల’.
పూర్తిస్థాయిలో సి.ఆర్.సుబ్బురామన్ సంగీతదర్శకత్వం వహించిన మొదటి తెలుగుచిత్రం - ‘రత్నమాల’. అంతకుముందు హిజ్ మాష్టర్ వాయిస్ కంపెనీ ఆర్కెస్ట్రాలో హార్మోనిస్టుగా పనిచేసే సుబ్బురామన్, ‘చెంచులక్క్ష్మి’ చిత్రంలో, కొన్ని పాటలను స్వరపరచారు.
ఇంకో విశేషమేమిటంటే, తెలుగులో ఎక్కువమంది సంగీత దర్శకులు పనిచేసింది కూడా ‘రత్నమాల’ చిత్రమే. (వాలి - సుగ్రీవ కూడా వుంది) ఎస్.రాజేశ్వరరావు బాలాంత్రపు రజనీకాంతరావు, భానుమతి - ఇలా తలోస్వరం వేశారు. అయితే సుబ్బురామన్‌గారే మొత్తం సంగీతాన్ని నిర్వహించారు.
భానుమతితో కలిసి తొలిపాట పాడిన ఘంటసాల, మళ్ళీ భానుమతి మొదటి చిత్రానికే సహాయ సంగీతదర్శకునిగా తొలిసారి sTÖ చిత్రం ద్వారా పరిచయం కావటం మరో విశేషం.
‘దేవదాసు’ చిత్రానికి దర్శకత్వం వహించి పేరుప్రఖ్యాతులు తెచ్చుకొన్న వేదాంతం రాఘవయ్య తొలిసారి సహాయదర్శకునిగా పనిచేసిన చిత్రం ‘రత్నమాల’.
డి.ఎల్.నారాయణ చొరవతీసికొని అక్కినేని నాగేశ్వరరావుకు యిందులో నాయకుని లాంటి పాత్ర యిప్పించారు. ‘లాంటి’ ఎందుకంటే ఈ చిత్రంలో హీరో వుండడు - హీరోయిన్ ఓరియెంటెడ్ కథ.
‘రత్నమాల’ చిత్రానికి, జితిన్ బెనర్జి ఛాయాగ్రహణ దర్శకత్వం వహించారు. ప్రముఖ కెమెరా డైరెక్టర్ పి.ఎస్.సెల్వరాజ్ తొలిసారిగా ఈ సినిమాలో అసిస్టెంట్ కెమెరా డైరెక్టర్‌గా స్టిల్స్ కూడా వేస్తూ పనిచేశారు. దిన్షా కె. టెహరాని శబ్దగ్రహణాన్ని, ఎఫ్.నాగూర్ కళను నిర్వహించారు. డి.ఎల్.నారాయణ ఛీఫ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు.
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, గోవిందరాజుల సుబ్బారావు, సూర్యనారాయణ (హీరో) సీతారాం, రామనాథశాస్త్రి, హేమలత, ఆరణి, వెంకుమాంబ, బేబి సుమిత్ర మొ॥వారు నటీనటవర్గం.
కథాసంగ్రహం :
కాంచీపురం రాజైన సింహకేతునికి చాలాకాలం తర్వాత పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం వల్ల రత్నమాల జన్మిస్తుంది. పసితనంలోనే తల్లిని పోగొట్టుకున్న రత్నమాలను కొడుకువలె పెంచుకుంటాడా రాజు. యుక్తవయస్సులో ప్రవేశించిన ఆమెకు సంబంధాలు చూస్తుంటాడు.
శోణపురాధీశుడు చంద్రచూడునికి కొడుకు పుడ్తాడు. పదహారు రోజులు వెళ్ళేలోగా పదహారేళ్ళ పడుచును తెచ్చి పెళ్ళి చేయకుంటే అబ్బాయి యమగండం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతారు. చంద్రచూడుని మంత్రి బుద్ధి సాగరుడు, తన కొడుకు చిత్రపటాన్ని రత్నమాలకు పంపిస్తాడు. పెళ్ళి నిశ్చయమవుతుంది.
పెళ్ళి సమయంలో కత్తికి బాసికం కట్టి, పెళ్ళి చేయాలని అది వంశాచారమని మభ్యపెట్టి మోసంతో వివాహం జరిపిస్తాడు. వివాహమైన తర్వాత శోభనంగదిలో ఊయలలో ఉన్న బిడ్డే భర్త అని మంత్రికుమారుడు జరిగినదంతా చెప్తాడు.
రత్నమాల ఆరాత్రే, పసివాడిని భర్తగా భావించి, అంత్ణపురం వదలి అడవి దారిపడుతుంది. ఎన్నో అపనిందలకు గురవుతుంది. రత్నమాల శీలాన్ని సహనాన్ని మెచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆమెకు ప్రత్యక్షమై ఆ బిడ్డను యువకుడిగా మార్చి పెళ్ళి జరిపించి దీవిస్తారు.
- ఇలాంటి వింతైన కథ ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ రాలేదు.
ఈ చిత్రంలో మంత్రికుమారుడిగా అక్కినేని నటించారు. శిశువు యువకుడిగా మారినపుడు కనిపించే రాకుమారుడిగా అతిథి పాత్రలో సూర్యనారాయణ నటించారు.
సాహితీ విశేషాలు :
‘రత్నమాల’ చిత్రానికి మొత్తం (పదిహేను) పాటలు రాశారు సముద్రాల. ఇందులో ఒక పద్యం కూడా వుంది.
వనవిహార గీతం, వసంతగీతం, భక్తిగీతం, అత్తారింటికి అమ్మాయిని పంపేగీతం, స్వగతగీతాలు, రాయబారగీతాలు, ప్రణయగీతాలు మొ॥నవి సందర్భోచితంగా రాశారు.
అయితే sTÖ చిత్రం తాలూకు వీడియో మార్కెట్‌లో లభ్యం కాకపోవటం ఓ లోటు.
ఇక పాటల విషయానికొస్తే....
సముద్రాలవారు ఎక్కడెక్కడి వో అందమైన తేనెలూరు తెలుగు పదాలను మనకళ్ళముందుంచి, “ప్రబంధకవి” అనిపించుకొన్నారు. కారణం “మదనా, నవమదనా... స్వాగతమోsTÖ” పాటలో వాడిన శబ్దపల్లవాలే!
‘చిలుకహుమాయి వజీరా’ (చిలుక అనే గుర్రం వాహనం చేసుకొన్న మంత్రివర్యుడు) అని మన్మథుని సంబోధించినారు. మనకు చేమకూర ‘విజయవిలాసం’ ప్రబంధం చటుక్కున గుర్తొస్తుంది. మన్మథుని సంపూర్ణ రసస్వరూపాన్ని చేమకూర వారు చిత్రించారు. సముద్రాలవారు కూడా. ప్రాబంధిక సుగంధాల నద్ది రాశారు. ‘ఝుమఝుమ’ అనే పాటలో కమ్మవిలుతు (మన్మథుడు) మనసిజ (మనస్సులో స్మరించగానే పుట్టే వాడు - మన్మథుడు) మొ॥ పర్యాయపదాలతో పరిమళింపజేశారు.
మరోపాటలో అమ్మవారిని “పరిమళచూర్ణకుంతలా” (సువాసన కలిగిన దట్టమైన కేశసంపద) అని సంబోధించారు. వెంటనేమనకు పాండ్యరాజు కొలువులోని నత్కీరుని గాథ గుర్తుకువస్తుంది. (ఓ బీదపండితుని దారిద్య్రం పోగొట్టడానికి శివుడు శ్లోకం రాసిచ్చి పాండ్యరాజుకు వినిపించమంటాడు. పాండ్యరాజు, కొలువులో వున్న సత్కీరుడు అహంకారంతో, శ్లోకంలో కురులు పరిమళాలు వెదజల్లే భావాన్ని తప్పుపడ్తాడు. దానికి శివుడు ఆగ్రహించి పాండ్యరాజు కొలువులోకి వచ్చి పార్వతికురులు సువాసనతో ఉంటాయని, అంటాడు. దేవతాస్త్రీలకు చెల్లుతుంది. మానవస్త్రీలకు చెల్లదని శివుడినే ఎదిరించి శపింపబడతాడు) ఒక్క పదాన్ని ప్రయోగించి ప్రబంధమే గుర్తుకు తెప్పించారు. దటీజ్ సముద్రాల....
నాట్యగీతంగా తీర్చిదిద్దిన “వగలాడి నిను జేరురా” పాట జావళి వంటిది. ఈ గీతంలో వేనలి (వెంట్రుకలు) బాళి (అనురాగము) వంటి జానుపదాలు మైమరపింపజేస్తాయి. (బాళీ - అన్నపదం పట్ల సముద్రాల వారి ప్రీతి సువర్ణసుందరి చిత్రంలోని పిలువకురా అలుగకురా గీతంలో కనిపిస్తుంది కూడా)
“నిలువనీడలేని బ్రతుకు” - అన్న పాట నాయిక విషాదాన్ని సూచిస్తుంది. ఈ గీతంలో మేరుపర్వాతాల వంటి ఆశలు అణగారిపోయి ‘ఎడారి’ అయిందన్న అభివ్యక్తి గమనించదగ్గది.
‘ఓరందకాడా ఓబిలేశా’ పాట జానపదశైలిలో రాసిన శృంగార గీతం.
‘ఓహో నా ప్రేమధారా - జీవనతారా’ - అన్న యుగళ గీతం ‘ఆశానందనములో విరబూసిన ప్రియురాలి వలపుగీతం! ఇందులో నాయకుడు తన ప్రేయసిని “వెన్నెల దీవి, వన్నెల క్రోవీ” అని సంబోధిస్తాడు.
క్రోవి = అంటే ఎర్రగోరింట! లేదా కురవక మనేజాతికి చెందిన ఎర్రచామంతి! నాయిక సౌందర్యాన్ని వెన్నెలదీవిగా పోల్చటం ఎంత రమణీయ భావచిత్రమో. వన్నెల క్రోవీ అని పేర్కొనటం అంతే అందమైన అరుదైన పదచిత్రం! ఈ గీతాన్ని చూడగానే జూనియర్ సముద్రాలగారి కోమలకవితాసారా ప్రేమసితారా! “రావేనా చెలియా” (మంచి మనసుకు మంచిరోజులు) గుర్తొస్తుంది.
‘రత్నమాల’ - నిజంగా పాటల రత్నమాల! ఆడియో లభించకున్నను కనీసం, సాహిత్యాన్ని ఆస్వాదించండి! అందుకే పాటల మధుశాలలోకి వెళ్ళండి! అక్కడ వ్యాఖ్యానాల వడ్డింపు లేవీ అడ్డంగా వేయదలచుకోలేదు. భ.రా.గో. వంటి పుణ్యాత్ముల వల్ల నూటపదార్లలో ‘రత్నమాల’ కూడా చేరింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి