తెలుగు చలనచిత్ర సీమలో సుపరిచితమైన పేరు అంజలీదేవి. ఆమె పేరు గుర్తుకు వస్తే సువర్ణ సుందరి, అనార్కలి, బాలనాగమ్మ, సతీ అనసూయ, సతీ సుమతి, సతీ సక్కుబాయి, శ్రీలక్క్ష్మమ్మ అన్నిటినీ మించి సీతాదేవి వంటి పవిత్రమైన పాత్రలు మన కళ్ల ముందు మెదులుతాయి. చక్కని తెలుగింటి ఆడపడుచు రూపతో, అరువు అవసరం లేని గొంతుకతో వెండి తెరపై జిగేల్మన్న తార అంజలి. నటిగా అశేష ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన అంజలీదేవి వివిధ భాషల్లో నాలుగొందలకు పైగా చిత్రాలు పూర్తి చేసి ఈనాటికీ నటిమణిగా కొనసాగుతూనే ఉన్నారు. ఏడు పదులు పైబడిన వయస్సులో కూడా ఆమెలో వెల్లివిరుస్తున్న ఉత్సాహం, పట్టుదల, ఆరోగ్య జీవిత విధానం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిని కలిగిస్తాయి. చెన్నైలోని రాజా అన్నామలై పురంలో ‘సుందరం’ (సాయి బాబా మందిరం) పక్కనే ఉన్న తన నివాసంలో ప్రశాంత జీవనాన్ని గడుపుతున్న అంజలీదేవి దగ్గరకు వెళ్ళి కాసేపు మాట్లాడితే దొర్లిన జ్ఞాపకాలివి.
నేను తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో (1927) జన్మించాను. అమ్మా నాన్నలు పెట్టిన పేరు అంజలీ కుమారి. మా నాన్న సూకయ్య గారు నాటక పిపాసి కావడంవల్ల నాకూ చిన్నప్పటి నుంచి స్టేజ్‌పట్ల ఆసక్తి కలిగింది. నాటకాలాడే భద్రాచార్యులు గారితో మా నాన్నకు మంచి పరిచయం. ఆయన దగ్గరకు మా నాన్న వెళ్ళేటప్పుడల్లా నేనూ వెళ్ళేదాన్ని. అలా ఆయన నన్ను చూసి చూసి తమ ‘హరిశ్చంద్ర’లో పట్టుబట్టి లోహితాస్యుడి వేషం వేయించారు. అదే నా తొలి నాటకానుభవం. ఆ నాటకంలోనే అక్కినేని నాగేశ్వరరావు గారు చంద్రమతిగా వేసినట్టు గుర్తు.
మా కాకినాడలో యంగ్‌మెన్స్ హ్యాపీ క్లబ్ అని ఉండేది (ఇప్పటికీ ఉంది). అందులో నన్ను చేర్పించారు. ఆ క్లబ్‌లో పిల్లలకు నటన, నాట్యంతో పాటు చదువు సంధ్యలు కూడా చెప్పించేవారు. పెద్దయ్యాక కూడా చాలా కాలంపాటు ఆ క్లబ్ శాశ్వత ఆర్టిస్టుగా కొనసాగాను. ఆ క్లబ్‌లో ఆదినారాయణగారు కీలక వ్యక్తి. ఆయన మా నాన్నగారికి ఆప్తమిత్రుడు కావడంతో నన్ను నటిగా తీర్చిదిద్దమని మా నాన్న నన్ను వారికి అప్పగించారు. చివరకు వారే నా జీవిత భాగస్వామి అయ్యారు. అలా నా నాటకానుభవానికే గాక జీవితానికే పునాది ఏర్పడింది.
ఆ రోజుల్లో నాటక రంగాన్ని గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పటికీ ఏవో మధురానుభూతులు చుట్టుముడతాయి. ఆ రోజులు మళ్ళీ వస్తే బావుండనిపిస్తుంది. బాల్యంలోవేసిన లోహితాస్యుడి పాత్ర తర్వాత రెండేళ్ళకు మా మాస్టారు (ఆదినారాయణరావు) ఆధీనంలో ఎదిఇ అమెచ్చూర్ నాటక సంఘంలో పాత్రలు ధరించాను. ఆ దశలోనే బర్మాషెల్ మేనేజర్ వాట్స్ దొరగారి అభిమానాన్నీ, అసిస్టెంటు మేనేజరు మాక్లాడ్ దొరగారి అభిమానాన్నీ చూరగొన్నాను. బర్మాషెల్ కంపెనీకి అప్పట్లో వక్కలంక కామరాజుగారు (ప్రసిద్ధ ప్లేబాకు పాఠకురాలైన వక్కలంక సరళ మామగారు) డాక్టరుగా ఉండేవారు. ఆయన “గాఖో” అనే నాటకం రాశారు. అందులో నాకోసమే ఒక పాత్రను కూడా సృష్టించారు. ఆ నాటకంలో వాట్సు దొరగారు జడ్జీ వేషం వేసేవారు. అందులో నా నటన చూసి దొరలు నన్ను “షర్లీ టెంపిల” అని పిలిచేవారు.
అవి నా జీవితంలో నిజంగా మరుపురాని దినాలు. అసలే అల్లరి పిల్లను. దానికి తోడు స్వగ్రామాన్ని, స్వజనాన్నీ విడిచి కాకినాడ వచ్చేసి ఆదినారాయణరావుగారి దగ్గరే ఉంటున్నాను గదా, ఆ సమయంలో ఆయన తప్ప నాకు మరెవరూ లేరు. ఉదయమే నన్ను సైకిల్‌మీద ముందు కూచోబెట్టుకుని కాఫీకి బయలుదేరే వారు. చిన్న చిన్న కజ్జాలు, కోపం వచ్చి పిన్నుతో సైకిల్ టైరుకు తిరిగి పంక్చర్ పెట్టేసిదాన్ని. తర్వాత ఇద్దరం సైకిల్‌తో సహా కాళ్థీడ్చుకుంటూ వచ్చేవాళ్ళం.
సామర్లకోటలో డాక్టర్ సన్యాసిరాజు గారి “వాణీ నాట్య మండలి”లో ప్రముఖ పాత్రలు ధరించాను. 1941లో మద్రాసులో జరిగిన 11వ ఆంధ్ర నాటక కళాపరిషత్తులో ‘ఆంధ్రశ్రీ’ నాటకలో ‘మాంచాల’ పాత్రకు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నాను. తరువాత ‘రాజనర్తకి అనే నాటకంలో రాజనర్తకి’ పాత్ర ధరించాను. (కాకినాడలో మెడికల్ కాన్ఫరెన్స్ జరిగిన సందర్భంలో ఈ నాటకం ప్రదర్శిస్తే, అందులో నా నటనను అప్పటి డి.ఎం.ఓ అయిన లెఫ్టినెంట్ కల్నల్ శంకరశాస్త్రి గారు ఎంతో ప్రశంసించారు. విశ్వనాథ వారి ‘వేనరాజు’ నాటకంలో ‘స్థానం’ గారితో పాటు ప్రముఖ పాత్ర పోషించాను.
ఇంతలో నాకొక సినిమా ఛాన్స్ వచ్చింది. ఏలూరుకు చెందిన తాండ్ర సుబ్రహ్మణ్యంగారు తాను u£ంబాయిలో తీయాలనుకున్న “మేనరికం” చిత్రంలో నటించమని నన్ను u£ంబాయి రమ్మన్నారు. “అంతకంటేనా?” అనుకుని నేను, మా నాన్న ఇద్దరం u£ంబాయి వెళ్ళాం. తీరా వెళ్తే ఎంతకీ ఆ పిక్చరు ప్రారంభం కాలేదు. ఇంతలో మతకలహాల్లాంటివేవో వచ్చాయి. మా దగ్గర తెచ్చుకున్న డబ్బు కాస్తా అయిపోయి, అగచాట్లు మొదలయ్యాయి. మంగళగిరి తిరణాలలా తయారైంది మా పరిస్థితి. సరే అని తెగించి ఎలాగో చేతిలోనున్న బంగారు గాజులు అమ్మేసి బ్రతుకు జీవుడా అని ఇంటికొచ్చేశాం. ఈ తొలి సినిమా అనుభవంతో నాకు సినిమా అంటేనే భయమొచ్చింది.
ఆ తరువాత నేనే సొంతంగా ఒక ట్రూప్ ఏర్పరచుకుని నాట్య ప్రదర్శనలు ఇచ్చాను. 09.12.1943న విశాఖ పట్టణంలో అప్పటి మద్రాసు గవర్నర్ సర్ ఆర్థర్ హోప్ ఎదుట నాట్య ప్రదర్శన చేసి యోగ్యతా పత్రాన్ని పొందాను. ఆ దంపతులిద్దరూ ‘నీకు మంచి భవిష్యత్తు ఉంది’ అని దీవించారు. ఆ దీవనలు నాకు అంతులేని ప్రోత్సాహాన్నిచ్చాయి.
ఆదినారాయణరావుగారు యంగ్ మెన్స్ హాపీ క్లబ్‌కు సారథ్యం వహించి నాటకాలు రాస్తూ ప్రదర్శనలిచ్చేవారు. ఆయన రచించిన ‘వసంతసేన’లో నాయికగా నటించమని ఆ సంస్థ అధినేతి శ్రీ దంటు సూర్యారావుగారు నన్ను కోరారు. నేను ఒప్పుకుని కాకినాడలో స్థిరపడిపోయి యంగ్‌మెన్స్ వారి ‘నాల్గో పెళ్ళి’, ‘లోభి’, ‘వీధి గాయకులు’ మొదలైన నాటకాలలో నటించ సాగాను.
మొదటి సినిమా ప్రయత్నం అలాకావడంతో నేను మళ్ళీ సినిమాల గురించి ఆలోచించలేదు. వాటికోసం ఎన్నడూ ఎదురు చూడలేదు. ఆ ఛాన్స్ దానంతటదే వెతుక్కుంటూ వచ్చింది. ఒకసారి మేం ‘స్ట్రీట్ సింగర్స’ నాటకం వేస్తున్నాం. అందులో నేను, ఎస్.వి.రంగారావు గారు నటిస్తున్నాం. నా నాట్యాన్ని సి.పుల్లయ్యగారు చూడటం జరిగింది. అసలు ఆయన చూస్తున్నారన్న విషయం కూడా మాకు తెలీదు. ఆ మరుసటి రోజే ఆయన తీస్తున్న ‘గొల్లభామ’ సినిమాలో మోహిని వేషం నాకు ఆఫర్ చేశారు. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కురుమద్దాల రామచంద్రరావును నా కోసం కాకినాడకు పంపించారు. అయితే నేను, మా వారు ససేమిరా కుదరదని చెప్పాం. ఎందుకంటే అప్పటికి నేను ఏడు మాసాల గర్భిణీని. ఆయన వెళుతూ నా ఫోటోలు రెండు తీసుకెళ్ళారు. తరువాత ఆ విషయమే మరచిపోయాం. రెండు నెలలు గడచిపోయాయి. మా సంస్థలోని ఎస్వీరంగారావుగారు- “మా మామగారు ‘వరూధిని’ సినిమా తీస్తున్నారు. మీరు దానికి మÖ్యజిక్ చేయాలి” అంటూ ఆదినారాయణరావుగారిని పట్టుబట్టి ఒప్పించారు. సేలంలో రికార్డింగ్. చూసినట్టు ఉంటుందని అందరం కలిసివెళ్ళాం. నేను సేలం వెళ్ళానని తెలిసి ‘వరూధిని’ సినిమా నటించడానికి వెళ్ళాననుకుని సి.పుల్లయ్య మద్రాసు నుంచి నా కోసం రేలంగి (హాస్య నటుడు) అన్నయ్యను పంపారు. “బావగారూ బావగారూ చెల్లెమ్మను తీసుకు రమ్మన్నారు” అంటూ హడావుడిగా వచ్చారు రేలంగి. ఇద్దరు పిల్లల్ని వదలి మద్రాసుకు ఒక్కదాన్ని ఎలా వెళతాను? నా వల్ల కాదన్నాను. కానీ రేలంగి మా వారిని వదల్లేదు. ఇక వెళ్ళక తప్పింది కాదు. ఈ విషయం తెలిసి ‘వరూధిని’ దర్శక నిర్మాత బి.వి.రామానందం ‘గొల్లభామ’ షూటింగ్‌కు నేను వెళ్ళడానికి వీల్లేదంటూ పెద్ద గొడవ మొదలెట్టారు. చేస్తే ముందు నేను ఆయన సినిమాలోనే చేయాలట! ఇతరుల సినిమాలలో చేయడానికి వీల్లేదట. ఈ గొడవ పెద్ద తగువుగా మారి నేను, మా వారు ఇద్దరం ‘వరూధిని’ వదిలి బయటికొచ్చేశాం.
సరిగ్గా భోగి పండుగ రోజున (1945) నేను మద్రాసు సెంట్రల్ స్టేషన్‌లో దిగాను. ముందు ఈలపాట రఘురామయ్య గారింట్లో ఉంచారు. రఘురామయ్య, సి.కృష్ణవేణి నాయికా నాయకులు. నేను మోహిని. ఆ సినిమాకు బి.ఏ.సుబ్బారావు ప్రొడక్షన్. ఆయనే ధైర్యం చెప్పారు. ఆ మోహిని పాత్రకు సుమారు ఇరవై ఒకటో దాన్ని నేను. వెళ్ళాక అక్కడ ఉన్న చాలా మంది “ఇదేమిట్రా పొట్టిదాన్ని తీసుకొచ్చారు” అనీ - “ఏమీ యాక్టివ్‌గా ఉన్నట్టు కనబడదే, ఎలా వేస్తుందబ్బా ఆ వేషం” అనీ విమర్శలూ, విసుర్లూ చెలరేగాయి. వాటన్నిటినీ భరించాను. ఒక నెల రిహార్సల్స్ తరువాత షూటింగ్‌కు తీసెకెళ్ళారు. యక్షలోకం నుంచి మోహిని భూలోకానికి వచ్చింది. యువరాజును ఉద్యానవనంలో చూసి మోహిస్తుంది. అక్కడ డైలాగ్ కూడా ఉంది. ఫస్ట్ డైలాగ్ ‘ఓకే’ అయ్యింది. నాటకానుభవం నాకెంతో ఉపకరించింది. రెండో షాట్‌లో హీరో నన్ను గట్టిగా కౌగిలించుకుంటాడు. ఏమిటో కొంచెం గట్టిగా కౌగిలించుకున్నట్టనిపించింది. దానికి నాకు ఏడుపొచ్చేసింది. తరువాత సి.పుల్లయ్య గారిని “ఏమిటి నాన్నగారూ అంత దగ్గరగా తీసుకోవాలా?” అన్నాను. నాది ‘వాంప’ క్యారెక్టర్ అట. కనుక ఆ మాత్రం ఉండాలన్నారు. అలా నా చలనచిత్ర జీవితం వాంప్ క్యారెక్టర్‌తో ప్రారంభమైంది. ఇంకా ‘గొల్లభామ’ విడుదల కాలేదు. ఈలోగా నాలుగు పిక్చర్లకు సంతకం చేశాను. అవి దయాళ్ ప్రొడక్షన్స్ “శివగంగ” (9.5.46), వెరైటీ పిక్చర్స్ “మాయారంభ” తెలుగు, అరవం (30.5.46), శోభనాచల ‘మదాలస’ (20.5.46), ప్రతిభా ‘బాలరాజు’. కానీ అవన్నీ వాంప్ క్యారెక్టర్లే. కొంత కాలానికి మంచి పాత్రలు రావడం లేదనే బాధ అంతరంగంలో చెలరేగింది. అప్పటికే నన్కొక సెక్సీ తారగా, ఆశ్లీల నాట్యాల నర్తకిగా పత్రికలు రాసేశాయి. దీంతో ఏడుపు రాని క్షణం లేదనే చెప్పాలి. కంటికి నిద్రవచ్చేదికాదు. మరీ కొన్ని పత్రికలైతే వ్యక్తిగత జీవితంలోకి ్పు£రబడేవి.
1948 ఫిబ్రవరి 26న “బాలరాజు” విడుదలైంది. ఎస్.వరలక్క్ష్మిగారి పాటలవల్ల అది రికార్డ్ సృష్టించింది. నిజానికి అందులో నాది చిన్న పాత్ర. మొదటి అరగంటలోనే వస్తుంది. అయినా “తీయని వెన్నెల రేయి” అనే పాటకు నేను చేసిన డ్యాన్స్‌లు నాకు ఎంతో పేరు తెచ్చాయి. వక్కలంక సరళ ఆ పాట పాడింది. అంత మంచి పాట నా కోసం పాడిందని ఆమెకు నేను ప్రత్యేకంగా ఒక వజ్రపు టుంగరాన్ని కూడా గిఫ్ట్‌గా ఇచ్చాను. ఆ అభిమానంతోనే సరళ కూతురు స్వప్న (నేటి ప్రముఖ నర్తకి స్వప్న సుందరి)కు క్షేత్రయ్యలో అవకాశం ఇచ్చాను. కానీ ఈవేళ సరళ లేదని తలుచుకుంటే బాధేస్తుంది. మీరు చెప్తేనే తెలుస్తోంది. ఏమిటో! పరిశ్రమ ఇఆల అయిపోయింది. ఎవరెవరు ఎక్కడున్నారో, కనీసం ఇలాంటి విషయాలైనా ఇన్‌ఫాం చేయకపోతే ఎలా? మహానటి సావిత్రికి కూడా ఆ ‘తీయని వెన్నెల రేయి’ చాలా ఇష్టమట. “అక్కా! నేను ఆ పాట కోసమే నీ ఫాన్ అయ్యాను. ఎక్కడ స్టేజి డాన్స్ చేసినా ఆ పాటనే చేస్తాను” అని చెప్పేది. ఇంతగా పేరు తెచ్చింది బాలరాజు. కానీ ఏం లాభం. అదీ అలాంటి పాత్రే కదా! ఇలా బాధపడుతున్న రోజుల్లోనే మరో అవకాశం వచ్చింది. ఆ అవకాశం “కీలుగుర్రం”లో రాక్షసి వేషం. నేను వేయనని మొండికేశాను. మా వారు నన్ను ఒప్పించడానికి నెల రోజులు పట్టింది. మీర్జాపురం రాజావారు ఆ వేసానికి నేనే తగినదాన్నని మరీ బలవంతం చేశారు. ఆఖరికి నా పారితోషికం బాగా పెంచి ఒప్పించారు. అప్పట్లో “కీలుగుర్రం” (19.2.49)లో నటించినందుకు 30 వేల రూపాయలు ఇచ్చారు. ఆ చిత్రంలో నాకు ఇంకా మంచి పేరు లభించింది. ఆ వెంటనే “రక్షరేఖ” మళ్ళీ వాంప్ క్యారెక్టరే. పి.భానుమతి హీరోయిన్.
ఇంతలో ఘంటసాల బలరామయ్య గారు “శ్రీలక్క్ష్మమ్మ కథ” ప్రారంభిస్తూ నన్ను హీరోయిన్ వేషానికి ఎన్నుకున్నారు. అంతవరకు వాంప్ క్యారెక్టర్స్ చేసిన నన్ను ఒక పవిత్రమైన పాత్ర ద్వారా హీరోయిన్‌గా చేయడాన్ని చాలా మంది విమర్శించారు. అవే విమర్శలు బలరామయ్య గారూ విన్నారు. కానీ ఆయన మార్చుకోలేదు. అదే సమయంలో సి.కృష్ణవేణి నాయికగా గోపీచంద్ దర్శకత్వంలో మరో లక్క్ష్మమ్మ తయారవుతోంది. పరిశ్రమలో దీని గురించి ఒకటే రభస, ఉద్రిక్తత. ఈ పోటీలో మా “శ్రీలక్క్ష్మమ్మ కథ”ను 45 రోజుల్లో పూర్తి చేశాం. కానీ బూతు పాటలున్న ఆ చిత్రం జనం రిసీవ్ చేసుకోకపోయినా నాకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఇంతలో బి.ఏ.సుబ్బారావు “పల్లెటూరి పిల్ల”లో హీరోయిన్‌గా నటించాను. ఇక అన్నీ హీరోయిన్ పాత్రలే.
ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి సుమారు 60 ఏళ్ళు కావస్తోంది. ఈ 60 ఏళ్ళ విజయవంతమైన జీవితానికి ఆ “పల్లెటూరిపిల్ల”, “శ్రీలక్క్ష్మమ్మకథ”లు నాంది పలికాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి