ఈయన కందూరులోని దొరలకుటుంబానికి చెందినవాడు. వారు సింగిరెడ్డివారు, కొమ్మునూళ్లగోత్రులు. వెంకమ్మ కొండారెడ్డిగార్లతని తల్లిదండ్రులు, వారికేడుగురు మగ సంతానం, కాని వారిలో ఇతడెన్నవవాడో తెలియదు. తల్లిదండ్రులు యితనికిపెట్టిన పేరు వెంకటరెడ్డి. ఈయన పుట్టుకచేతనే అజగరుడు, జడభరతులవంటివాడు. బాల్యంనుండే వైరాగ్యంకలిగి వివాహంచేసికోలేదు. కందూరువాడుకనుక ప్రజల్లో ఇతనికి ‘కందూరప్ప’ అనేపేరు నిలచిపోయింది.
వ్యక్తి స్ఫురద్రూపి, కండపుష్టిగాకూడ ఉండేవాడుకాని కొంచెంపొట్టి, పైరెప్పలు విశాలంగావుండి కన్నులెపుడూ మÖసికొన్నట్లుగా కనిపించేవి. కుడిభుజం వెనుకవైపు కోడి గుడ్డంత నల్లనిపుట్టుమచ్చ ఉండేది. మోకాటిపైకి పంచె, చేతిలో తనకంటే మÖరెడెత్త యిన కఱ్ఱ. చంకలో ఒక పిచ్చిమÖట, ఇది అతనివేషం. వీథులలో పిల్లలు వెంటవస్తుం డగా పిచ్చిగాతిరుగుతూ ఉండేవాడు. వారతనిని పట్టించుకునేవారుగాదు.
నవ్వు కందూరప్పా అన్నా, అలాగే ఏడువు కందూరప్పా అన్నా, ఎవరైనా, చాలు అన్నంతవరకు అదేపని. గంతువేయి కందూరప్పా అంటే, చంకమÖటనటుబెట్టి మనిషి కొంత స్థూలమనిపించినా అతి లాఘవంగా దొమ్మరిగంతులు వేస్తూనేవుండేవాడు. పంచె విడువు కందూరప్పా అంటే మళ్ళీ ఎవరైనా కట్టుకో మనవలసిందే. పూర్తిగా పసిపిల్లవాని తత్త్వం, ఇదీ ఈతని ప్రకృతి.
ఆయనెపుడూ పండ్లుతోమి ఎరుగడుకాని, నోరెపుడూ శుభ్రంగావుండేది. స్నానం గూడ ఎవరైనా చేయిస్తేతప్ప చేసేవాడుకాదు. కాని జలస్తంభనవిద్య వచ్చేది. నీటిలో అనేక మైన విన్యాసాలుచేసేవాడు. నీళ్లపై చొప్పకట్టెవలెతేలి అటుయిటు పొర్లేవాడు. పద్మాసనం వేసికొని కూర్చునేవాడు. నీటిలోమునిగి గంటలతరబడి ఉండేవాడు. మరొకపుడు పద్మా సనంవేసికొని నీటిలో తలక్రిందులుగా తేలేవాడు. ఇట్లా దినంలో ఎక్కువభాగం నీటిలోనే గడిపేవాడు.
అతనికి గంజాయి అలవాటుండేది. దాన్నాయన వస్తువనేవాడు. ఎవరైనా గంజాయి త్రాగరాదంటే కోపంవచ్చేది. దానిసంగతి మీకేం తెలుసు, దానిని త్రాగితే లోపలవానిని చూడవచ్చుననేవాడు. భిక్షకు వెళ్లితే ఎవరినైనా నేరుగా అడుగక, అన్నంతింటావా కందూ రప్పా అనేవాడు. ఆయనమాటవిని ఎవరైనా అన్నంపెట్టి చాలా అని అడుగకుంటే ఆనాడిక ఆ యింటిలో అన్నం మిగలకపోయేది. అందువల్ల అయనస్వభావం తెలిసినవారు తగుమా త్రంగా యింతపెట్టి చాలా కందూరప్పా ! అనేవారు. ఆయన చాలు అని లేచివెళ్లేవాడు.
ఈయన ఏదుల, గోపాలపేట, గోపాలపురం, రేముద్దుల అనే గ్రామాలలో చాలా కాలంగడిపాడు. మొదటిసారిగా ఆయన ఏదులలో కనిపించాడు. అక్కడ కందికొండ నారాయణ అనే వైశ్యుడుండేవాడు. అధ్యాత్మికచింతనాపరుడు. సాధుసన్యాసులపట్ల భక్తి తాత్పర్యాలుండేవి. కందూరప్పను తనయింటిలో దినాలతరబడి ఉంచుకునేవాడు. అది భార్యకు నచ్చకపోయేది.
ఏదులకువచ్చిన కందూరప్పను నారాయణ తన యింటికికొనివెళ్లి రెండుమÖడు నెలలుంచుకున్నాడు. ఆహారంవిషయంలో ఆయన కొంతతిండిపోతు. నారాయణయింటిలో మÖడునెలలు గడిచింది. అతడుమాత్రం పొమ్మనలేదు. అదిచూచి దినదినం భార్య అతనికి వండిపెట్టలేక కలహించి పిల్లలను తోడ్కొని తల్లివారింటికివెళ్లింది. అయినా నారాయణ అది లెక్కచేయక దినదినం అతని సేవచేస్తూనేవున్నాడు. ఆయన దిట్టంగాతిని గ్రామం వెలుపల బోకులగద్దనగల బాపనివారిబావికివెళ్లి దానిలో జలస్తంభనలో తనసాధనేదో తాను చేసుకుంటూ ఉండేవాడు. అట్లా మరో రెండునెలలు గడిచింది. నారాయణ, కందూ రప్ప తనసేవననుగ్రహించి ఏదైనాచెప్పడా అనుకున్నాడుకాని, అట్టిదేదీ అతనిలో కని పించలేదు. నారాయణలో ఎప్పుడీ ఆలోచనవచ్చిందో, అపుడే అది కందూరప్పకు తెలిసి పోయింది. అతడొకనాటిరాత్రి తనమÖటతో ఆ యింటినుండి మాయమయ్యాడు.
తెల్లవారిచూస్తే యింటిలో కందూరప్పలేడు. అతనికి కందూరప్ప వెళ్లిపోవటం, భార్య కలహించిపోవటంకంటేకూడా చాలా దుఃఖంకలిగించింది. అతనికొఱకు నిద్రాహా రాలుమాని వారంపదిదినాలు ఆ చుట్టుప్రక్కలంతా గాలించి కృశించిపోయాడుకాని అతని జాడ తెలియలేదు.
ఈ కాలంలో గోపాలపేటలో రాజాజగపాలరావుగారున్నారు. ఆయన తత్త్వచింత కుడు. తమతోటలో ఒక కుటీరంనిర్మించుకొని ఏకాంతంగా ఉండసాగాడు. అక్కడికి ఎక్క డెక్కడి సాధువులో రాసాగారు. ఏదులలో మాయమైన కందూరప్ప ఉన్నట్టుండి ఒకనాడు జగపాలరావుగారి తోటలో ప్రత్యక్షమయ్యాడు.
అప్పటికి జగపాలరావుగారికి అతడెవరో తెలియదుకాని, రాణీరంగనాయకమ్మ గారతనినిగురించి విన్నది. వనపర్తివారు, ఆదిగోపాలపేటవారు జ్ఞాతులు. వనపర్తిరాణి శంకరమ్మగారు కందూరువారింటి ఆడపడుచు. కందూరప్ప అదే యింటివాడు. అతడు తమతోటలోకి వచ్చాడని విన్నతరువాత, ఒక పర్యాయం అతనినిచూచి తమవాడేనని గుర్తిం చింది. దానితో అతనికక్కడ కోటలోగూడ ప్రవేశంకలిగింది. నాటినుండి రంగనాయకమ్మ గారే స్వయంగా అతని భోజనాదికం మొదలైనవి పట్టించుకోవటం ప్రారంభించింది. దానితో ఆయన ఆ కోటలో పదిహేనుసంవత్సరాలు ఆవిచ్ఛిన్నంగా ఉన్నాడు. ఆయన అక్కడున్నంతకాలం వారిసంస్థానంలో కాలంగూడ సుభిక్షంగావుంది.
కందూరప్పను గోపాలపేటలో నారాయణవలెనే ఎందరో ఆశ్రయించారుగాని ఆయన ఎవరికీ ఏదీ చెప్పలేదు. దేనికైనా ఆయన, లోపలివాడు పలకడంలేదప్పా అనేవాడు. అది ఆయనకు ఒక ఊతపదంగాకూడా ఉండేది. లోపలివాడు అనగా ఆత్మ. అతడు పలుక లేదనగా, తన ఆత్మ ఆ దానికి ఒప్పుకోవడంలేదని తాత్పర్యం.
ఒకసంవత్సరం అక్కడ కాలం వెనుకకులాగింది. అపుడు రాణిగారతనితో, ‘కందూ రప్పా ! ఈ యేడు వానలింకా కురవకపోయే రైతులంతా ఎదురుచూస్తున్నారు. పంటలెట్లా’ అన్నది. అదివిని ఆయన, అయితేవుండు, వానలెందుకు కురిపించటంలేదో నేను లోపలి వానితో కొట్లాడతాను అని కోటదాటి బయటికివచ్చి గవినిముందు తిష్టవేసికుని కూర్చు న్నాడు.
ఆయన అట్లా కూర్చోగానే అరగంటలో కుంభవర్షంకురిసి మంచి అదునయింది. రాణిగారు మరియు ప్రజలంతా సంతోషించారు. రాణిగారు కందూరప్పను ఎవరేమన్నా సహించేదికాదు. గోపాలపేటసంస్థానంలో కేశంపేటజాతర చాలాపెద్దది. అది చైత్రంలో జరిగేది. అది వ్యవసాయదారులకు ఆయిటికాలం, గృహస్తులకు వివాహాలకాలం. స్త్రీలకు పచ్చళ్ళకాలం. కాబట్టి ఆ జాతరలో వ్యవసాయదారులు కఱ్ఱుకొండి మొదలైన కాపుధనం సామాను, గృహస్థులు వివాహాలబట్టలు మరియు పప్పు, పిండిసామాను, స్త్రీలు పచ్చళ్ళ కొరకు మిరప మొదలైనవి కొంటుండేవారు. కందూరప్ప ఆ జాతరలో స్వేచ్ఛగా తిరిగే వాడు. ఆయన ఏ దుకాణంలో ఏది తీసుకున్నా ఎవరూ ఆక్షేపించేవారుకాదు. ఆయన వాని లోకివెళ్ళి పప్పులో, పుట్నాలో, ఏవో కొన్ని పోసుకుని, ఒడిలోపోసుకునితింటూ జాతరలో తిరిగేవాడు. ఆ జాతరలో వనపర్తిబాలయ్యగారి బట్టలదుకాణం చాలాపెద్దది. ఆయన విశ్వకర్మ. అయినా బట్టలవ్యాపారం చేసేవాడు. ఒకనాడు కందూరప్ప ఆయన దుకాణంలోకి వెళ్ళి ఒకబట్ట ఈయప్పా అని, ఏదో తీసికోబోగా, బాలయ్యగారికి కోపంవచ్చి గుమాస్తా లతో అతనిని బయటికి త్రోయించాడు. అపుడక్కడ. డేరాలకొరకుపాతిన ఒక ఇనుపగూటం ఆయనకాలికి గుచ్చుకుపోయి నెత్తురుకారింది. ఆ విషయం కోటలోరాణిగారికెవరో తెలి పారు. అదివిని ఆమె ఆగ్రీVAదగ్రురాలై అప్పటికప్పుడా జాతరకువచ్చి ఆ యేడు ఆయన దుకాణాన్నితీయించింది.
తీరికవేళల్లో కందూరప్ప కుమ్మరింటికివెళ్ళి మన్నుతెచ్చి పిసికి దానితో సొంగలు చేసి ఎండబెట్టి తరువాత పుల్లలుబూచికలు ఎదిరి వానినికాల్చి సిద్ధంచేసేవాడు. ఆయన - సొంగ (చిలుము) చాలాపెద్దగా సుమారు జానడుండేది. దానినిండుగ గంజాయి నింపు కున్నాడంటే ఒకేసారి అదంతా బూడిదయ్యేది. ఎంత గంజాయిత్రాగినా పిసరంతపొగ కూడా ఆయన బయటికివిడిచేవాడుకాదు.
సాధువుల్లో ఈ జ్ఞానపత్రికి దూరంగా ఉన్నవారు చాలాతక్కువ. వారి బృందంలో సొంగ తయారుచేసినారంటే దాన్ని ఒక్కొక్కరు ఒకబుక్కపీల్చుతూ ఉంటారు. అపుడు కందూరప్ప ఆ బృందంలో ఉంటే చిలుము అందరితరువాతనే తనకిమ్మనేవాడు. ఎందు కంటే ఆయనచేతికి తీసుకుంటే తరువాత ఇంక దానిలో ఏమీ మిగలకపోయేది.
కందూరప్పకు గంజాయి అలవాటుండేది కనుక, రంగనాయకమ్మగా రతనికొరకు దాన్ని తెప్పించి ఎపుడూ కొంత నిలువుంచుతూవుండేది. ఒకసారి ఆమెదగ్గర అది అయి పోయింది. కందూరప్పదగ్గర అతని మÖటలోగూడ ఒడిసింది. అపుడాయన నేరుగా ఆమె దగ్గరకువచ్చాడు. ఆమె కొలువుతీరివుంది. అతడు ఎదురుగా నిలిచి, “ఏమే ! నేను రాణినని గర్వపడుతున్నావా ! వస్తువు అయిపోయింది తెలియదా ! ఈ గుతుపతో ఒకటిపెట్టేదా !” అన్నాడు. అదివిని ఆమె అప్పటికపుడు దివాన్జీదశరథరామయ్యను ఉరికించి అది వన పర్తినుండి తెప్పించియిచ్చింది.
ఈ విధంగా రంగనాయకమ్మగారున్నంతకాలం అతనికి కోటలో సకలసౌకర్యాలు నడిచాయి. ఆయనను వీథిóలో పిల్లలు చాలా అల్లరిపెట్టేవారు, ఏడిపించేవారు. రాణిగారు ఇది తెలిసి ఆ పిల్లల తల్లిదండ్రులనుపిలిచి హెచ్చరించింది. అంతేకాక ఆయన నపుడపుడు ఆ చుట్టుప్రక్కలగ్రామాలవారు కొన్నిదినాలు పిలుచుకొనివెళ్ళేవారు. అపుడామె అతనిని తోడ్కొనివెళ్లేవారు ఎటువంటివారో, వారినిగురించికూడా విచారించేది. కాని ఆమె మరణా నంతరం కోటలోని కోడండ్రు ఆయనను పట్టించుకోకుండా అయ్యారు. అందువల్ల ఆయన కోటనువిడిచి అక్కడేవున్న చంద్రగుండమఠంలో తొమ్మిదేళ్ళున్నారు.
కందూరప్పమహిమలు :
ఆయనను ఏదులనారాయణవలె ఆశ్రయించినవారు చాలామంది ఉన్నారు. ఆయన గోపాలపురంలో ఉన్నపుడే పానుగంటిపట్వారి తెలుగులక్ష్మయ్య తోడ్కొనివెళ్ళి తనయింటిలో ఆరునెలలుంచుకున్నాడు. అతడప్పుడు ముఖంకడిగిస్తూ, స్నానంచేయిస్తూ సకలోపచారాలుచేశాడు. కాని, ఆయన అతనికేదీ చెప్పలేదు.
ఆయన అక్కడున్నకాలంలోనే లక్ష్మయ్యగారి ఆముదంచేనుకు దాసర్లుతగిలి ముదిగిపోయింది. ఆ విషయం లక్ష్మయ్యగారు కందూరప్పతో చెప్పుకోగా, ఒకనాడు నీవీ రాత్రికివెళ్ళి ఆ చేనులో ఒక దీపంముట్టించిరా అన్నారు. ఆయన వెళ్ళి అది ముట్టించిరాగా కందూరప్పవెళ్ళి ఆ దీపాన్నిచూచి పొలంచుట్టూ ఒకసారి తిరిగివచ్చాడు. తెల్లవారిన పిమ్మట లక్ష్మయ్య వెళ్ళిచూస్తే ఎక్కడి దాసర్లు అక్కడ చచ్చిపడి ఉన్నాయి. తరువాత చేను తిరుగబారి ఆ పర్యాయం రెండింతలు పంటపండింది. కాని, ఆయన కందూరప్పను మెల్లగా తనకే దైనా చెప్పమని అడగటం ప్రారంభించాడు. అదిచూచి ఆయన ఒకనాటిరాత్రి తన మÖటతో మాయమై మళ్ళీ గోపాలపేటచేరాడు. ఆరునెలల సేవఫలితంగా ఆ యేడు లక్ష్మయ్యకు ఆముదంపంటమాత్రం దక్కింది.
ఆయన చంద్రగుండమఠంలోకివచ్చి ఒకనాడు పార్వతమ్మతో, నేనిప్పటినుండి ఇక్కడే ఉంటాను, ఇక్కడే పడుకుంటాను అన్నాడు. అప్పటికామఠపతి చంద్రశేఖరయ్యగారు గతించి పార్వతమ్మ ఒక్కత్తే పిల్లలతో ఉంటున్నది. అందువల్ల ఆమె అతనిని ఉండు అని రాత్రికి పడుకోవడానికి ఒక చాపయిచ్చింది.
ఆ మఠం ఆవరణ చాలాపెద్దది. దానిలో సాధుసన్యాసులు ఉండేసత్రం వేరుగా, చంద్రశేఖరయ్యగారిల్లు వేరుగా ఉన్నది. ఆమె, కందూరప్ప సత్రంలో ఉంటాడుగదా ! అను కున్నదిగాని, చీకటిపడినపిమ్మట ఆయన పార్వతమ్మగారింటిలోనికి వచ్చి నేనిక్కడే పడుకుంటానన్నాడు. అది సాధువులకాశ్రయమిచ్చే స్థలం. అందువల్ల పార్వతమ్మగారు అతనిని వద్దనలేకపోయింది, కాని, తను స్త్రీ, ఒంటరిగా ఉన్నది. కందూరప్ప క్రొత్తగా వచ్చిన సాధువు. ఎవరిస్వభావం ఎట్లావుంటుందోనని భయంవేసి అతనికొక గదిచూపి తాను తెల్లవార్లు అతనినొక కంట కనిపెడుతూనే ఉన్నది.
కందూరప్ప పడుకోలేదు. రాత్రంతా ముడుచుకొని అట్లాగే ఏదో సాధనతోనో నిష్ట తోనో కూర్చున్నాడు. ఆమె తెల్లవారినపిమ్మట అతనితో, ఏమప్పా ! నీవు రాత్రంతా పడు కోకనేపోతివి అన్నది. ఆయన అదివిని, అమ్మా లోపలివాడు రాత్రిని పగలు, పగటిని రాత్రిచేయమంటాడు అనిచెప్పి, ఈనాటినుండి నేను నిన్ను అమ్మా అనే పిలుస్తాను అన్నాడు. ఆమె అదేమప్పా, నేను నీకంటే చాలాచిన్నదాన్ని అనగా, అయితేనేం నీవు నాకు అమ్మవే. ఇప్పటినుండి నాకెవరేపదార్థం ఇచ్చినా నీకుపెట్టకుండా నేనుతినను అని చెప్పాడు.
తినడానికి ఎవరు, ఎపుడు వచ్చినా ఏదో పండో, కాయో, ఏదో ఒకటి పట్టుకొచ్చి కందూరప్ప కిచ్చిపోతుండేవారు. ఆయన పార్వతమ్మగారితో చెప్పినట్లు, తనకెవరేమిచ్చినా ఆమెకీయకుండా తాను తినకపోయేవాడు. ఒకనాడు వనపర్తికి వెళ్ళగా, ఆయనకెవరో ఒక కర్బూజాపండు సమర్పించారు. అది ఎండాకాలమైనా ఆనాడెందుకో బాగా వానపడింది. ఆయన ఆ వానలో పండును నెత్తిమీదపెట్టుకొని అలాగే నడచివచ్చాడు. అదిచూచి ఆమె ఏమప్పా యింతవానలో యిట్లావచ్చావు అంటే, అక్కడనాకు ఒక పండిచ్చారు, ఇది నీకీయ కుండా మరి నేనొక్కడినే ఎట్లాతినాలి అన్నాడు.
కందూరప్ప గంజాయితోపాటు అపుడపుడు కల్లు, సారాయిగూడా దుకాణందగ్గ రకుపోయి త్రాగేవాడు. ఆయన తాగిననాడు వారికి గిరాకి బాగా అయ్యేదట. అందువల్ల కొన్నిసార్లు వారే ఆయనను పిలిచి కల్లు, సారాయి పోసేవారు. ఒకనాడాయన పూటుగా త్రాగి మఠంలోకివచ్చాడు. అదిచూచి పార్వతమ్మగారు, అప్పా ! నీవు త్రాగుతావుకాబట్టి మా మఠంలోనికి రావద్దు అంది. అపుడాయన, నేను త్రాగానా ! నా నోరుచూడు అని దాన్ని వాసనచూపగా, అతని దగ్గరగాని నోట్లోగాని ఏమాత్రం కల్లుసారాయి వాసనలేదు.
ఆయనను శీతవాతాతపాలేవీ బాధించకపోయేవి. అట్లాగే ఆహారంలో రంగు, రుచి, వాసనకూడా ఆయనకు తెలియకపోయేవి. ఎవరేదియిస్తే అది అట్లాగేతినేవాడు. పానుగంటిలో ఉండగానే ఒకనాడు విశ్వబ్రాహ్మణ భగవంతాచారింటికి వెళ్ళాడు. ఆయన వేడివేడి టీ ఈయగా దాన్ని మంచినీళ్ళవలెనే త్రాగి వాకిట్లో కూర్చున్నాడు. అపుడు ఆక స్మికంగా పెద్ద వర్షంవచ్చింది. ఆయన, అతడిని లేచి లోపలికిరమ్మంటే రాలేదు. ఆ వర్షంలో ఆలాగే కూర్చున్నాడు. అపుడదిచూచి అందరూ ఆశ్చర్యపోయారు.
గోపాలపేటలో ఉండగా, ఆయనను అడవిబసవలింగప్ప అనే బలిజ, ధర్మపురి అనే ఈడిగ, ఇంకా ఎందరో ఆశ్రయించారు. బసవలింగప్ప అతనికెప్పుడూ బిస్కట్లుతెచ్చి యిచ్చేవాడు. వస్తువుగూడ తెచ్చియిచ్చేవాడు. ఒకనాడాయన తనకేదైనా చెప్పమని బలవంత పెట్టగా, తప్పించుకొని పార్వతమ్మయింటికి వచ్చి ఆమెకావిషయం తెలిపాడు.
ఆయనకు, ఎవరినైనా చూడగానే, వారి పూర్వజన్మలు తెలుస్తుండేవి. పార్వతమ్మగారు, బసవలింగప్ప మంచివాడుగదా, అతనికెందుకు చెప్పలేదప్పా అనంటే, నేను చెబుదామనే అనుకున్నాను కాని లోపలివాడు, “వీడు కుక్క, కాబట్టి ఏదీ చెప్పవద్దు” అని నా గొంతు పట్టుకున్నాడు అన్నాడు. అదివిని ఆమె, అయితే పట్వారీలక్ష్మయ్యకు ఎందుకు చెప్పలేదని అనగా, లోపలివాడు వీనిది “ఎఱుకలిగద్దె” అన్నాడు అనిచెప్పాడు. ధర్మపురికైనా మరి ఎందుకు చెప్పలేదని అడుగగా, లోపలివాడు, “వీడు యమధర్మరాజు. ఏదీ చెప్పవద్దు” అన్నాడని తెలిపాడు. ఇట్లా ఆయన తనకు ఉల్లాసమున్నప్పుడు పార్వతమ్మగారికి ఎందరినో గురించి తెలుపుతూ ఎన్నో ఆధ్యాత్మికవిషయాలు అడగకుండానే చెబుతూవుండేవాడు. కందూరప్ప మÖడ్ బాగావున్నపుడు, పార్వతమ్మకు ధాన్యందంచడంలోను, పిండి విసర టంలోను, ఇంటిపనుల్లోకూడా సహాయంచేసేవాడు.
ఆ కాలంలో ఆయనను గట్టిగా ఆశ్రయించినవారిలో కాళప్ప ఒకడు. ఆయన విశ్వకర్మ, మనుబ్రహ్మ. అతనికి మున్ననూరు, కేశంపేట, రేముద్దులలో వతన్లుండేవి. రేముద్దులలో ఉండేవాడు. మొదటిసారిగా కేశంపేటజాతరలో చూచాడు. అతనికికూడా ఆధ్యాత్మికచింతన ఉండేది. అందువల్ల ఆశ్రయించి ఎన్నోసార్లు తనింటికి తీసుకువెళ్ళాడు.
ఒక పర్యాయం, రాత్రివేళ ఆయన, కందూరప్ప ఇద్దరుమాత్రమే గదిలోవున్నారు. అప్పుడు కాళప్ప, నాకీనాడు మీరు తప్పకుండా ఏదైనాయిచ్చితీరవలెనని పట్టుబట్టగా, ఆయన దోసిలిపట్టుకొని నోటిదగ్గరుంచుకొని వమనం చేయగా, దానిలోకి పాలువచ్చాయి. అవి వేడివేడిగా ఉన్నాయి. కందూరప్ప, “యింద, పట్టురా !” అన్నాడు. కాళప్ప అదిచూచి దిగాలుపడిపోయాడు. ఆయన తనకేదో మంత్రమిస్తాడని, అనుకొన్నాడుకాని, అట్లా ఉచ్చిష్ట మిస్తాడనుకోలేదు. కందూరప్ప రెండవసారికూడా పట్టమన్నాడు. అయినా ఆయనలో ఏ స్పందనా కన్పించలేదు. కందూరప్ప అప్పుడు ఆ పాలు మళ్ళీ లోపలికి పీల్చేసుకున్నాడు. చేతులకు కనీసం తడికూడా మిగలలేదు, అవి పొడిగానే కనిపించాయి. ఆయన అక్కడి నుండి లేచివెళ్ళాడు.
అతడు వెళ్ళినతరువాత కాళప్పకు తాను ఒక మహదవకాశాన్ని పోగొట్టుకున్నాననే పశ్చాత్తాపంకలిగింది. ఆ తరువాత అతడు, కందూరప్పకు తనపై మళ్ళీ దయకలుగక పోతుందా అని ఎన్నోతడవలు బండికట్టుకుని గోపాలపేటకువచ్చి, ఆయనను తనయింటికి తీసికొనివెళ్ళి సేవలుచేసేవాడు. కానీ రెండుదినాలుకాగానే ఆయన మళ్ళీ అమ్మదగ్గరకు పోతానని చిన్నపిల్లవాడివలె లేచిపరుగెత్తి గోపాలపేటకు వచ్చేవాడు. అప్పుడొకనాడు కాళప్ప పార్వతమ్మదగ్గరకు వచ్చి, “నీవు చాలా అదృష్టవంతురాలవు తల్లీ ! ఈ మహానుభావుని సేవిస్తున్నావు. నేను నాలుగుదినాలుంచుకొని సేవిద్దామంటే నాకా అదృష్టంలేదు” అన్నాడు.
కాళప్పకు నష్టసంతానం అనగా పుట్టిన ఏడాదిలోపే వారు గతిస్తుండేవారు. అపుడొక సారి ఆయన కందూరప్పతో ఆ విషయం చెప్పుకోగా యిక ఇప్పటినుండి బ్రతుకుతారులే ‘ అన్నాడు. కాబట్టి కాళప్పకు చివరకు ఈ సంతానఫలంమాత్రం ఒకటిదక్కింది. కాళప్ప వెళ్ళినపిమ్మట ఆమె ఒకనాటిరాత్రి కందూరప్పను, “ఏమప్పా ! నీవు కాళప్పయింటిలో నాల్గుదినాలుండరాదా ! ఎప్పుడూ ఈ మఠంలోనే ఎందుకుంటున్నావు?” అని అడిగింది. అదివిని ఆయన, “నీవు నాకు అమ్మవు ఇపుడుగాదు. మొదటిజన్మలో నేను నీకు కొడు కును. అందుకే ఇప్పుడిక్కడుంటున్నాను” అన్నాడు.
ఆయనకు, తననుగురించి ఎవరేమనుకునేదీ తెలుస్తుండేది. ఒకనాడు పార్వతమ్మ వంటకు బియ్యంచూచుకున్నది. అవి దినంకంటే తక్కువగా ఉన్నవి. ఆమె మనస్సులో, “అప్ప బాగాతింటాడు. ఈనాడెట్లబ్బా?” అనుకొంది. అపుడాయన ఆమె వంటింటిదగ్గ రకువెళ్ళి, బాజు పట్టుకొని నిలిచి, లోపలివాడు ఎంతపెడితే అంతే తినమన్నాడని చెప్పాడు.
ఆయన అట్లా దినదినం మఠంలోతింటున్నా, మళ్ళీ చిప్పతీసుకుని భిక్షానికివెళ్ళే వాడు. చిప్పలోవేసిన అన్నం, రొట్టెముక్కలుతెచ్చి కాకులకువేసేవాడు. అదిచూచి ఒక నాడు పార్వతమ్మ “ఏమప్పా నువ్వు భిక్షానికెందుకు వెళతావు? తినేటపుడు నన్నే మళ్ళీ మారు అడగరాదా?” అనగా, నేను వెళ్ళగూడదనే అనుకుంటానుగాని, లోపలివాడు ఊరు కోడు, భిక్షానికిపోపో అంటాడు. పోతే, తీరా వాడు నా చిప్పలో వేసేవన్నీ తేళ్ళు, జెర్రులు. వాటిని నేనెట్లాతినేదిచెప్పు? అందుకే కుక్కలకువేస్తాను” అనేవాడు. దీన్నిబట్టి పవిత్ర మనస్కులుగానివారి చేతివంటలు ఎటువంటివో ఊహించవచ్చు. అందుచేతనే యతులు, సన్యాసులు అందరిచేతివంటా తినరు.
కందూరప్పకు గోపాలపేటలో, కోటనుండి వెళ్ళినపిమ్మట, వీథిలో బాలురహింస మళ్ళీ ప్రారంభమైంది. పార్వతమ్మగారు వద్దనిచెప్పినా, ఆయన పిల్లలతో ఆటకువెళ్ళటం మానలేదు. అప్పుడొకనాడు ఒక తుంటరిపిల్లవాడు దుడ్డుకర్రతో ఆయన మోకాటిపై బలంగాకొట్టగా, అది విరిగింది. పార్వతమ్మగారు, వైద్యునిదగ్గరకువెళ్ళి కట్టుకట్టించు కొమ్మన్నా ఆయన వినలేదు. ఆయన, “లోపలివాని కాలు బాగానే ఉందికదా ! బయటి వాని కాలువిరిగితేమాత్రమేమి?” అని అలాగే ఉన్నాడు. అందువల్ల చివరిదశలో కొంచెం కుంటి నడిచేవాడు.
ఆయన కనురెప్పలు విశాలంగా ఉండి కనులెప్పుడూ మÖసినట్లే ఉండేవి అని మొదట తెలుపబడింది. ఒకనాడు ఎవరో తుంటరిపిల్లలు, “అప్పా ! కన్నుల్లో జిల్లేడు పాలు పోసుకుంటే అవి బాగా తెరుచుకుంటాయి” అని చెప్పారు. అదివిని ఆయన, అయితే అవితెచ్చి పోయండిరా అన్నాడు. అపుడా పోరలు కౌచిప్పలు తీసుకువెళ్ళి జిల్లేడుపాలు కొట్టుకొనివచ్చి, ఆయనను పడుకోబెట్టి కళ్ళలోపోశారు. దాంతో తెల్లారేసరికి ఆయన కన్నులు బాగావాచిపోయాయి. అదిచూచి పార్వతమ్మగారు ఏమయిందని అడిగితే, ఆ వృత్తాంతం చెప్పారు. ఆమె, “ఏమప్పా ! జిల్లేడు పాలుపోసుకొంటే కళ్ళుపోవా? నీకు ఇది తెలియదా?” అనగా, “బయటివాని కళ్ళుపోతే ఏమవుతుంది? లోపలివాని కళ్ళు బాగానే ఉన్నాయికదా !” అన్నాడు.
ఆయనకు చావుమాటవింటే చాలా కోపంవచ్చేది. ఆయన కొంచెం స్థూలమైన మనిషికాబట్టి ఆటపట్టించడానికి ఎవరైనా, “ఏమప్పా ! నీవీ మఠంలో లోపల ఎక్కడోచస్తే నిన్ను బయటివరకు ఎవరు ఎట్లా మోసుకువస్తారు?” అని పరిహాసమాడేవారు. అదివిని ఆయన వారిపై కోపించి, “మేం చస్తామా? చావం ! సమాధి అవుతాం !”
ఆయన భూసమాధికంటే జలసమాధి గొప్పదని చెప్పేవాడు. ఇంకో ఏడాదిన్నరకు పోతాడనగా తన మకాం గోపాలపేటనుండి రేముద్దులకు మార్చినాడు. అక్కడతనిని కాళప్పాచారి, తారకరాములు, సర్పంచ్‌బాల్‌రెడ్డి ఎపుడూ కనిపెట్టుకొని ఉండేవారు. వారితో ఆయన తరచుగా, రెండును ఒకటి చేయండప్పా అని చెప్పేవాడు. దానితోపాటు ఒక తిథి, నక్షత్రాన్నితెలిపి ఆనాడు పాము కుబుసంవిడుస్తుందనికూడా అనేవాడు.
రేముద్దులకు వచ్చిననాటికి ఆయన బాగా మెత్తబడిపోయాడు. అక్కడ చివరిదశలో ఆయనకు విశ్వకర్మ రామచంద్రమ్మ సేవచేసింది. ఆమె అతనిముఖం కడిగించి, అన్నం తినిపించి మÖతి, ముక్కు అన్నీ తుడిచేది.
అది చైత్రమాసం. వరికల్లాలవుతున్నవి. వరికల్లంతీర్పంటే, ఆనాడు చాలాచికా కుగా ఉండేది. ఇది ‘లాలుకోటరఘునాయకశతకం’ లో పెన్గలూరి వెంకటాద్రిచెప్పాడు. అందువల్ల కొందరు తమ కళ్లం, పగలుగాక రాత్రివేళలో కట్టుకునేవారు. గోపాలపేటలో పార్వతమ్మగారి కళ్ళం అట్లాగే ఒకనాడు రాత్రి అవుతుండగా అక్కడికి కందూరప్ప అనుకో కుండా వచ్చి తనకు భిక్షపెట్టమని అడిగాడు. అది రాత్రికనుక పార్వతమ్మ తెల్లవారిన తరువాత పెడతానన్నది. కాదు, నాకిపుడేకావాలన్నాడు ఆయన. ఆమెకు బలిజవీరప్పదక్షిణ తెలుసుకనుక, అయితే అప్పా ! భిక్ష నీకెంతకావలెనో నీవే తీసుకో అంది. ఆయన, ఆహా ! నీచేతనేపెట్టాలే, నేనుతీసికోను అన్నాడు.
ఆమె మనస్సులో భయంభయంగానే మÖడుదోసిళ్ళు అతని వడిలోపోసింది. ఆయన యికచాలు అని అక్కడినుండి వెళ్ళాడు. ఇది పార్వతమ్మగారు ఆయనకు పెట్టిన తొలిభిక్ష మరియు ఆఖరిభిక్షగూడ. ఆనాడు కేశంపేట తేరున్నది. కందూరప్ప అక్కడికివెళ్ళి తేరుచూచి అదేరాత్రి మళ్ళీ రేముద్దులచేరాడు.
ఆయనకు తమిదంబలి చాలా యిష్టముండేది. రెండవనాడు కాళప్ప అది కాయించి ఆయనను తన ఇంటికి తీసుకొనివెళ్ళి అతనికింతతాపి తాను కొంతత్రాగాడు. అనంతరం కందూరప్ప స్నానానికి వెళ్ళుతాననిలేవగా అతనితోపాటే తానూ బయటికివచ్చి పొలం దిక్కువెళ్ళాడు. కందూరప్ప బావికివెళ్ళి నీళ్ళపై పద్మాసనంవేసికొని, కూర్చున్నవాడల్లా అట్లాగే వెల్లకిలబడిపోయాడు.
అపుడక్కడికి వెళ్ళిన పశువులు మేపుకునేపిల్లలు చూచి కందూరప్ప మరణించాడని గ్రామంలోచెప్పగా, ఆ వార్త తెలిసి కాళప్పవచ్చాడు. కందూరప్ప నీళ్ళలో తేలుతున్నాడుకాని అతడు యోగంలో ఉన్నాడో, లేదా మరణించాడో ఎవరికీ అర్ధంకాలేదు. కాళప్ప యింటికి వెళ్ళి పంచాంగంచూడగా, ఆయన పాము కుబుసంవిడుస్తుందన్న తిథిóనక్షత్రాలు కలి శాయి. అది చైత్రబహుళవిదియ. అపుడుగాని వారికి పాము కుబుసంవిడిచే విషయమర్ధం కాలేదు. ఆయనను నీటినుండితీసి గడ్డపై కూర్చోబెట్టారు. అప్పటికింకా సమాధియోచన లేదుకాబట్టి వారు దాన్ని శివాలయంముందుగల దేవకాంచనవృక్షంక్రింద త్రవ్వి సిమెంటుతో కట్టేసరికి రెండుదినాలయింది. ఆ రెండుదినాలూ ఆయన దేహం ఏ మార్పూ లేకుండా అట్లాగే ఉంది.
మÖడవనాడు వారు ఒక పూలరథంకట్టి ఆయనను ఊరేగించారు. అపుడు ఆరు సంచుల టెంకాయలు పగిలాయి. ఆయనపై పిల్లలువేసిన పావలా అర్ధరూపాయి బిళ్ళలు అన్నీ ఆరువందలయ్యాయి.
ఆయనను కొనివెళ్ళి సమాధిలో కూర్చోబెట్టగా, ఆయన శరీరంనుండి ధారాపాతంగా చెమటకారింది. అపుడు, దాన్ని అక్కడకు వచ్చినవారు తలాయింత తమ శరీరాలకు రాచుకుని కృతార్ధులయ్యారు. అనంతరం ఆయన సమాధిపై మÖత బిగించబడింది.
మÖతబిగించినపిమ్మట దానిపై అతని విగ్రహప్రతిష్ట చేయదలచి కోడేరునుండి ఒక విశ్వకర్మనుపిలిచి అతని సిమెంటుబొమ్మను చేయమన్నారు. కాని అతడు కందూరప్పను చూడలేదు. కాబట్టి నేనెట్లా చేయగలననగా ఆయనకు క్షణకాలం మైకంకమ్మి, కందూరప్ప స్వయంగా సమాధిపైకి వచ్చికూర్చొని, నేనిట్లా ఉన్నానని నిదర్శనమిచ్చారు. ఇపుడాయన ప్రతిమ రేముద్దులలో శివాలయందగ్గర ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి