మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, అక్టోబర్ 2026, సోమవారం

కాళోజీ నారాయణరావు జీవితం - సాహిత్యం

కాళోజీ కవిత్వం కవిత్వం కోసం కాదు అది జనం కోసం. జన చైతన్యం కోసం. నిర్ధిష్టమైన ఆలోచనతో ఒకానొక ఆదర్శంతో ఈయన కవిత్వం సాగింది. ఈయనకు కవిత్వం ఒక భావ వ్యాపకసాధనం మాత్రమే. ఈయన కవిత్వమంతా నిరంతరం తన చుట్టూ జరుగుతున్న సామాజిక సంఘటనల్ని ఆశ్రయించి ఉంటుంది. కాళోజీ జీవితాన్ని కవిత్వాన్ని వేరు వేరుగా చూడలేం. ఆయన జీవితంలో ప్రతి సంఘటనని తన కవిత్వంలో చూడవచ్చు. వైయుక్తిక జీవితానికి కవిత్వానికి మధ్య ఏ విధమైన వైరుధ్యం కాళోజీ కవిత్వంలో కనిపించదు. తన భావాల్ని వీలున్నంత సులువుగా వ్యక్తం చేయటమే కాళోజి లక్ష్యం. తన కవిత్వంలో ప్రజా జీవితాన్ని చిత్రించిన ప్రజాకవి కాళోజీ. 

ఆరుద్ర తన సమగ్ర ఆంధ్ర సాహిత్యం (సంపుటి ఎనిమిది, పేజి 44) లో వేమన గురించి ఇలా అంటాడు “ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్టు చేయటమే కవిత్వ లక్షణం. దీనికి భావనా శక్తి కావాలి. అందులోనూ స్వతంత్ర భావనా శక్తి అవసరం. ఈ సుగుణం తెలుగు కవులందరిలో ఒక్క వేమన గారిలోనే కొట్టవచ్చినట్టు కనబడుతుంది. ఆయన తమ సమకాలీన జీవితాన్ని, సాంఘిక న్యాయాలను, మతాలను, అభిమతాలను అంచెలంచెలుగా అయినప్పటికీ- సంపూర్ణంగా పరిశీలించారు. సమగ్ర అవగాహన ఏర్పరుచుకున్నారు. తాము తెలుసుకున్న సత్యాన్ని ప్రజలందరికీ ప్రబోధించారు” అన్న ఆరుద్ర అభిప్రాయం వేమన గురించి కానీ ఇదే అభిప్రాయం కాళోజీకి కూడ వర్తిస్తుందని చెప్పక తప్పదు. కాళోజీ కవిత్వంలో కూడా స్వతంత్ర భావనాశక్తి ఉంటుంది. సమకాలీన జీవితాన్ని సంపూర్ణంగా పరిశీలించిన విధానం కనిపిస్తుంది. తను తెలుసుకున్న సత్యాన్ని నిర్భయంగా ప్రజలందరికీ తెలియచెప్పాడు. కవిత్వం కవిత్వం కోసం కాదని అది ప్రజల కోసమని నమ్మాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విశ్లేషించటమే కాదు దాన్ని వివేచించి సమగ్ర అవగాహనతో కవిత్వకరించాడు. ప్రజా జీవితానికి అద్దం పట్టిన కవిత్వాన్నే రసాడు. అందుకే తెలుగ సాహిత్య చరిత్రలో ప్రజాకవిగా వేమనకు ఎంత స్థానం ఉందో కాళోజీ నారాయణరావు కూడా అంతే స్థానం ఉందని చెప్పాలి. 

కాలప్రవాహంలో వచ్చిన ప్రతి మార్పును ఆహ్వానించి తనలో ఇమిడ్చుకునే లక్షణం కాళోజీ సొంతం. అందుకే ఈయన కవిత్వం విలక్షణమైన శైలిని సంతరించుకున్నది. ఈయన తెలంగాణ నేలపై కదలాడిన తెలంగాణ కవి. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించిన కవి. తెలంగాణ ప్రజాజీవితాన్ని కవిత్వకరించి తెలంగాణ సాహిత్య పునర్వికాసానికి పూనుకున్న కవి. తెలంగాణలో సామాన్య జనాభిప్రాయానికి అనుగుణంగా కవిత్వం శ్రామిక వర్గాల నుండి పుట్టింది. అట్టి శ్రామిక వర్గాల సాంఘిక, రాజకీయ జీవితాల నేపధ్యంగా కాళోజీ కవిత్వం ఉంటుంది. ఈయన కవిత్వంలో సమాజానికి అద్దంపట్టి ఎన్నో అంశాలు దర్శనమిస్తాయి. 

కాళోజీ నా గొడవ పుస్తకంలో ఉన్న ప్రతీ కవితలో సమాజాన్ని అనేక కోణాల్లో పరిశీలించిన తీరు కనిపిస్తుంది. కాళోజీ స్పృశించని అంశం అంటూ ఏదీ లేదనే చెప్పాలి. 

కాళోజీ కవిత్వంలో స్పష్టత ఉంటుంది. విషయం సరళంగా సూటిగా ఉంటుంది. 

నీవు పూసిన పూతలందున / నీవు గీసిన గీతలందున-నీ 

ఊహకందిన బొమ్మ వెలసిందా? /నీవు కలలు గాంచిన అందమొలకిందా? 

నీవు కూర్చిన మాట సూటిగా / నీవు పాడిన పాట నీటుగా - నీ 

వెతలు మలచిన కతను చెప్పిందా? నీ మనసు యెరిగిన చిక్కు విప్పిందా? 

అంటూ ‘గీటురాయి’ లోని కవిత్వం ఆయనలో ఉన్న సూటిదనాన్ని, విషయం పట్ల స్పష్టతను తెలుపుతుంది. 

కాళోజీకీ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఎక్కువ. ప్రతిదీ ప్రజాస్వామ్య బద్దంగానే జరగాలని ప్రజాస్వామ్యాన్ని కాంక్షించిన కవి ఈయన. ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తూ తనతో వస్తున్న మిత్రునితో టికెట్టు గురించి పేచి పడ్డాట. మహాకవిగా కళోజీని గుర్తించి కాస్తదూరానికే టికెట్ ఎందుకులే అని కండక్టర్ అంటే లేదు లేదు మీరు టికెట్ కొట్టాల్సిందే అని టికెట్ తీసుకున్న గొప్ప ప్రజాస్వామిక వాది కాళోజీ. తన ప్రజాస్వామ్యమంటే కవితలో ప్రజాస్వామ్యమంటే మానవత్వానికి మనుగడ అని అనామకుల సంరక్షణ అని నమ్మాడు. గుండాతనానికి, గూడుపుఠానికి, కుట్రదారులకు చోటులేనిదే ప్రజాస్వామ్యం అని ఇతని నమ్మకం. 

ప్రజాస్వామ్యంటే ఏమిటి? 

ప్రజారాజ్యం మంటేఏమిటి? 

సౌజన్యాలకు రక్ష/ సామరస్యాలకు రక్ష 

సహకారాలకు రక్ష/ సహజీవననానికి రక్ష 

ప్రజాస్వామ్యమంటే అది/ ప్రజా రాజ్యమంటే అది! 

అని చెప్పటంలో ప్రజాస్వామ్యం పట్ల కాళోజీకి ఉన్న అభిప్రాయం గౌరవం ఎట్లాంటిదో తెలుస్తుంది. 

కాళోజీకి ప్రాపంచిక దృక్పథం అంటే జీవన దృక్పథం నుంచి వచ్చిందే. గొప్ప మానవతా వాదం ఈయన కవితల్లో కనిపిస్తుంది. అంతేకాదు ప్రతీ అన్యాయాన్ని ఎండగట్టడం కాళోజీ తన ధర్మంగా భావించాడు. సమాజంలో సుస్పష్టంగా ఉన్న వ్యత్యాసాలను తన కవితల్లో ఆవిష్కరించాడు. సమాజంలో తరతరాలుగా వస్తున్న దోపిడి వ్యవస్థను నిలదీసి ప్రశ్నించాడు. తన ‘వ్యత్యాసాలు’ అన్న కవితలో 

అన్నపురాసులు ఒకచోట/ ఆకలి మంటలు ఒకచోట

హంసతూలిక లొకచోట/ అలసిన దేహ లొకచోట

సంపదలన్నీ యొకచోట/ గంపెడు బలగం ఒకచోట

పెత్తనమంతా ఒకచోట/ సత్తువ యంతింతొక చోట 

అనుభవమంతా ఒకచోట/ అధికారంబది యొక చోట 

ఉన్నత వర్గం నిమ్న వర్గం అన్నది మానవ సమాజాన్ని రెండుగా వేరుచేస్తున్న వర్గాలుగా భావించాడు. సమసమాజస్థాపన కొరకు కలలు కనే కాళోజీకి వ్యత్యాసాలు మింగుడు పడలేదు. చివరి పాదాల్లో అనుభవ మంతా ఒకచోట అధికారంబది యొక చోట, అనే మాటల్లో అనుభవం అన్నది ఎవరిదైనా కావచ్చు. అనుభవాలకూ, అధికారానికి సంబంధం లేదని కాళోజీ భావన. కాళోజీ కవిత్వంలో జీవితం ముసుగుల్లేకుండా ఉంటుంది. అస్పష్టతకూ, సంక్లిష్టతకూ ఆయన కవిత్వంలో తావులేదు. 

కాళోజీ కవిత్వంలో విశాల దృక్పధం కనిపిస్తుంది. మంచితనం ఎక్కడున్న అది ఎవరిదైనా తప్పకుండా స్వీకరించాలని అంటాడు. విశాల ప్రపంచంలో ఉన్నదంతా మనిషి కోసమని మనిషి మంచిని పెంచుకొని ప్రయోజనం పొందాలని అంటాడు. ఉదాహరణకు ‘మావోడు చెప్పినా మావో చెప్పినా అన్న కవితలో విశ్వ శ్రేయోవాదం సార్వజనీనత కనిపిస్తుంది. అందులో ఉన్న భావం గొప్పది, ఆలోచన గొప్పది. 

మంచి మాట మావోడు చెప్పినా / మావో’ చెప్పినా ఒక్కటే

ప్రాచీనమైనా అర్వాచీనమైనా - మంచి మంచే చెడ్డ చెడ్డ 

ఎవరి మాటైతేమి/ ఏమాటకు ఆమాటే 

మాట ఎవరిదని కాదు / మాటేమిటని చూడు 

కాళోజీకి మొత్తంగా సమాజమే వస్తువు. ఆయన అన్యాయానికీ, స్వార్థానికీ బలైపోతున్న జీవితాల్ని 

పలకరించాడు. 

కాళోజీది మెత్తని హృదయం. కవిత్వం రాస్తు కన్నీళ్ళు పెట్టేవాడు. సమాజంలోని బాధను చూసి బాధపడేవాడు. లోకం కన్నీళ్ళు తన కన్నీళ్ళుగా భావించాడు. ఎన్నో సందర్భాలలో తను కంటతడి పెట్టేవాడని విన్నాం. ఆయన గొప్ప మావతావాది. మనస్సున్న మనిషి ‘ఎందుకు నా హృదిని ఇన్ని ఆవేదనలు?’ అన్న కవిత ద్వారా ఆయన సున్నిత మనుసును తెలుసుకోవచ్చు. 

అవనిపై జరిగేటి అవకతవకలు జూచి

ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు? 

పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె

మాయ మోసము జూచి మండిపోవును ఒళ్ళు 

పతిత మానవజూచి చితికి పోవును మనసు

ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?

తప్పు దిద్దగలేను దారి జూపగ లేను

తప్పు చేసిన వాని దండింపగా లేను 

కష్టపడువారులను కాపాడగా లేను

ఎందుకో నాహృదిని ఇన్ని వేదనలు? 

ఇలా చెప్పటంలో కవి సమాజంలో జరిగే అవకతవకలను చూసి తట్టుకోలేకపోయాడని తెలుస్తుంది. ఎదుటివారి కష్టాలను తన కష్టాలుగా భావించాడు. ఇతరుల కష్టాలు చూసి కరిగిపోయాను అని చెప్తూనే మాయమోసాలు చూసి మండిపోవును ఒళ్ళు అని చెప్పటంలో తన ఆక్రోశం వెల్లబుచ్చాడు. కాళోజీ. చివరి పాదాల్లో కరిగిపోయే గుండె మాత్రమే కాదు, మండిపోయే ఒళ్లు కూడా ఉంది. అని చెప్పటం కవి తన సంస్కరణాభిలాష పట్ల దృఢమైన చిత్తాన్ని వెలిబుచ్చాడు. ఇందులో తనకున్న కరిగిపోయే, మండిపోయే అనే రెండు గుణాల్ని తెలియజెప్పాడు. 

కాళోజీ కవిత్వంలో శ్రామిక వర్గం మీద మక్కువ కనిపిస్తుంది. రైతేరాజు అన్న సిద్ధాంతం నమ్మినవాడు దేశానికి వెన్నుముక రైతు అని తెలిసినవాడు. వ్యవస్థ మొత్తంగా రైతుమీదనే ఆధారపడ్డదని తెలియజెప్పిండు రైతును గురించి ‘కర్షకా’ అన్న కవితలో. 

నర్తకుని నాట్యాలు గాయకుని గానాలు

వాదితృని వాద్యాలు శిల్పకుని శిల్పాలు 

చిత్రకుని చిత్రాలు అంగనల అందాలు

కందర్పు కయ్యాలు కవిరాజు కావ్యాలు

కర్షకా ! నీ కఱ్ఱు కదలినన్నాళ్ళే

ధార్మికుని దానాలు పండితుని భాష్యాలు 

వర్తకుని శౌర్యాలు యాంత్రికుని యంత్రాలు

యోధుల యుద్ధాలు రాజుల రాజ్యాలు కర్షకా

నీ కఱ్ఱు కదిలినన్నాళ్లే... 

సామాజిక, ఆర్ధిక ప్రగతికి మÖలధారం రైతు. అట్టి రైతు దేశ అభివృద్ధికి ప్రధాన. రైతును విస్మరించటం తగదని చెప్పాడు. 

కాళోజీ కవిత్వంలో నాస్తిక వాదం కనిపిస్తుంది. కాళోజీ ఎక్కడా తను నాస్తికునని చెప్పుకోలేదు. కానీ భగవంతుని పేరుమీద జరుగుతున్న ఆర్భాటాలను ఖండించాడు. మనిషి ఆలోచనాశక్తిని బట్టే ఏదైనా ఉంటుందంటాడు. కర్తవ్యహీనులై పరాన్నభుక్తులై ఉండకూడదనే కాళోజీ ఉద్దేశం. మనిషి తన శక్తిని నమ్ముకొని ముందుకు సాగాలి. ఆ సాగే క్రమంలోనే భగవంతుని రూపం అనుభవంలోకి వస్తుందంటాడు. తన ‘చాదస్తం’ కవితలో ఇదే విషయం చెప్పాడు. 

ప్రతీ చాదస్తం దేవుడే / ఏదో ఒక రూపంలో గోకుడే 

పుట్టుకతోనే పుట్టునీపుండు / అగపడక అంతరంగాననుండ 

భావాను గుణ్యం రూపం / శక్తిని బట్టి సాక్షాత్కారం 

నామ రూపాలు అనంతం / ఎవనిది వానికే వసంతం 

దరిదాపున చేరిన మౌఢ్యం / వ్యాపింపజేయునీ జాఢ్యం

ప్రబోధ నినాదాల పొరలు / గాలాలను దాచే ఎరలు 

ఈ కవితలో మతాల ముసుగున జరుగుతున్న బ్రతుకుల పోరును మానవ వికాసానికి అవరోధంగా నిలిచిన మనుషుల విధి విధానాలు తేటతెల్లం అవుతున్నాయి. 

కాళోజీ వ్యవహారిక భాషాభిమాని. భాష విషయంలోను కాళోజీ వాదం వ్యవహరికం వైపే. 

తెలుగు బాస ఎన్ని తీర్లు / తెలుగు యాస ఎన్ని తీర్లు 

వాడుకలున్నన్ని తీర్లు/ ‘వాడుక’ ఏ తీరుగున్న 

తెలుగు బాస వాడుకయే/ అన్ని తీర్ల వాడుకను 

ఒకే తీరుగా చూచుట/ ఎవరి వాడ వారిది 

అని ఎవరి వేడ్క వారిది అని/ ఎవరిదైనా వాడుకె అని 

అన్ని మాండలికాల పట్ల గౌరవంతో, గుర్తింపుగా కాళోజీ పుట్టిన రోజు- సెప్టెంబర్ 9న మాండలిక భాషాదినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది తెలంగాణ ప్రాంతంలో వున్న మాండలికాలకే పరిమితమైంది కాదు. ‘బడిపలుకల’ కన్నా పలుకుబడులే’ కాళోజీ కోరుకున్నాడు. ప్రజల పలుకుబడిని ఎక్కడ వీలైతే అక్కడ వాడాలని ఆశించాడు. రెండున్నర జిల్లాల చదువుకున్న కుటుంబాల రెండు మÖడు తెగలోళ్ళ ‘ప్రామాణిక భాష’ అని శిష్టుల వ్యవహారికమని అది అందరి తలపై రుద్దితే ఎక్కడి న్యాయం అని ప్రశ్నించాడు కాళోజీ. ఏ ప్రాంతం వాడు ఏ మాండలికంలో రాసాడనే దాని కన్నా ఏమి రాసాడనే దాని మీద, ఎవరి పక్షాన నిల్చి రాసాడనే దాని మీద ధ్యాస పెట్టాడు కాళోజీ. 

కాళోజీ తెలుగుభాషా విషయం పట్ల నిబద్ధతగల వ్యక్తి. నిజాం రాష్ట్రంలో తెలుగు ప్రజలు తెలుగుబాష పట్ల చూపే నిరాదరణను సహించలేక పోయాడు. మాతృభాష తెలుగును విస్మరించి అన్యభాషల మీద పెంచుకుంటున్న మమకారాన్ని నిరసించాడు. తెలుగు ప్రజల వేషభాషల్ని చూసి తెలుగు వాడిగా సిగ్గు పడుతున్నానని చెప్తూ ‘ఆంధ్రుడా’ అన్న కవితలో. 

ఏ భాషరా నీది యేమి వేషమురా?/ ఈ భాష ఈవేష మెవరి కోసమురా? ఆంగ్లమందున మాటలాడ గలుగగనే / ఇంతగా గుల్కెదవు ఎందుకోసమురా? తెలుగు బిడ్డడవయÖ్య తెలుగు రాదంచును/ సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా? తెలుగు బిడ్డవు రోరి తెలుగు మాట్లాడుటకు / సంకోచపడియెదవు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు/ సకలించు ఆంధ్రుడా! చావవెందుకురా? 

ఈ మాటల్లో కాళోజీకి తెలుగు భాషపట్ల ఉన్న మామకారం వ్యక్తమవుతుంది. తెలుగునేలపై పుట్టి తెలుగును మాతృభాషగా పట్టి తెలుగు రాదనే చవటలను ‘ఆంధ్రుడా’ కవితలో ఎద్దేవ చేసాడు. 

కాళోజీ కవిత్వంలో వ్యంగం అధికం. తనకు నచ్చని విషయం ఏదైనా ఉంటే వెంబడే తన భావాన్ని ప్రకటించటం కనిపిస్తుంది. చెప్పేది సూటిగా చెప్పటం ఎదుటి వారు ఏమనుకుంటారనే విషయం ఆలోచించక పోవటం కాళోజీ నైజం. ఉదాహరణకు 1943 సంవత్సరంలో వరంగల్లులో శబ్దాను శాసన గ్రంథాలయ వార్షికోత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా జరిగిన కవి సమ్మేళనానికి రాయప్రోలు సుబ్బారావు అధ్యక్షులు. నిజాం వ్యతిరేకోద్యమం ముమ్మరంగా సాగుతున్న ఆ రోజుల్లో తెలంగాణా ప్రాంతంలో ఉంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధిపతిగా పనిచేస్తూ తెలంగాణా ప్రజల పోరాటంలో పాలు పంచుకోలేదనే విమర్శ రాయప్రోలోపై ఉండేది. ఆ సందర్భంగా రాయప్రోలును ఉద్దేశిస్తూ కాళోజీ చెప్పిన కవిత్వం ‘కోకిలా’ 

లేమావి చివురులను లెస్సగా వేసేవు

ఋతురాజు వచ్చెనని అతి సంభ్రమముతోడ 

మావి కొమ్మల మీద మైమరచి పాడేవు

తిన్న తిండివ్వారిదే కోకిలా! 

పాడు పాటెవ్వారిదే కోకిలా!

ఏనాటి సుకృతమొ? ఏ విశ్వకవి చలువొ?

ఈనాడు నిన్నింతదానిగా చేసినది

అంతకే నీవేడ ఆగలేకున్నావు? 

లేకున్న నీలెక్క యెందులో కోకిలా!

లేకున్న నీవేడ నుందువో కోకిలా? 

ఈ కవిత్వంలో రెండు విషయాలున్నాయి. ఒకటి తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని పొందలేక దానిని అందుకోలేక రాయప్రోలు మాట్లాడకపోవటం, ఈ నేలపై ఉంటూ ఈ నేల విముక్తి పోరాటంలో భాగస్వామి కాకపోవటం. రెండవ అంశం రవీంద్రనాథ్ టాగూర్ చలువ వల్ల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖకు అధ్యక్షులుకావటం. ఈ రెండు అంశాలు కాళోజీ తన కవిత్వంలో నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పాడు. 

1975 జూన్లో దేశంలో ఎమర్జన్సీని ప్రకటించినప్పుడు కాళోజి తీవ్రంగా స్పందించాడు. ప్రజా జీవితానికి ఆటంకం కలిగినప్పుడల్లా ఈయన ఆక్రోశంతో కవితలు రాసాడు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా కలాన్ని గళాన్ని సందించినవాడు కాళోజి. ఎమర్జన్సీకీ వ్యతిరేకంగా రాష్ట్రపతిని నిలదీస్తు ఇలా అంటాడు. 

పౌర జీవితమ్ము కాలి/ కమురుకంపు కొడుతుంటే 

ఎమర్జన్సీ అత్తరుతో/ ఏమాత్రం ఆపగలవు 

రాష్ట్రపతి ఏ మంటావు. 

ఇలా సూటిగా రాష్ట్రపతిని ప్రశ్నిస్తూ అనేక సందర్భాలలో కవితలు రాసాడు. వ్యక్తులను భజన చేసే సంస్కృతిని ఎండగట్టాడు. ఎమర్జన్సీ వాతావరణంలో ఫాసిజమే వుంది తప్ప ప్రజాస్వామ్యం లేదన్నాడు. ఎమర్జన్సీలో అవినీతికి చోటు లేదన్న విషయాన్ని ఖండించాడు. ఎమర్జెన్సీ సందర్భంలో కాళోజీ 

సర్కారీ గోదాముల/ సరుకు బైటికొస్తాందట 

ఇన్నాళ్ళు ఎవరి హుకుం/ చేత సరుకు దాగున్నది 

ఇన్నాళ్ళు ఎందుచేత/ సరుకు బయటపడుత లేదు. 

అంటూ, ఎమర్జన్సీకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల్నీ, వాదాలను వ్యతిరేకించాడు. పౌరునిగా పలుక వీలు లేనప్పుడు బ్రతికెందుకు? ఇంత కన్న చావునయం అనుకున్నాడు కాళోజి. 

కాళోజి స్వేచ్ఛను కోరుకుంటాడు. స్వేచ్ఛలేని జీవితం మరణంతో సమానమంటాడు. పెత్తనాన్ని ధిక్కరిస్తాడు. ఒకరిమీద మరొకరి అధికారాన్ని అణచివేతను ఒప్పుకోడు. మనిషి స్వేచ్ఛజీవి అందుకే స్వేచ్ఛను కోరే ప్రపంచం వైపు పయనించాలంటాడు. కాళోజీ భాగవతంలోని ప్రహ్లాద చరిత్రను ఇష్టపడతాడు. హింసకు ప్రతీక హిరణ్యకశిపుడు. స్వేచ్ఛకు ప్రతినిధి ప్రహ్లాదుడు. 

నాడు ముల్లోకాలకు

హిరణ్యకశిపుడొకడైతే 

నేడొక్కొక్క ప్రాంతానికి

ఒక్కొక్క హిరణ్యకశిపుడు 

ఈనాడు నరవృక, నరజంబుకాల

సమÖహాల, ముఠాబంది బలగాల 

బానిసలై అమాయకులు పడుచుండిన అగచాట్లు

ఆనాడు ప్రహ్లాదుడు చేరి మ్రొక్క కోపమంత

చల్లారిన నరసింహా! ఎరుగ వీవు

నాకేమో మళ్ళీ మళ్ళొక్కసారి 

ఆనాటి నీ రూపము ప్రళయభీకరాకారము

చూడవలెను అనెడు బులుపు 

ఇలా కాళోజి పురాణాల్ని వర్తమానానికి అన్వయిస్తాడు. 

కాళోజీ ఏ ఒక్క పార్టీని తనతో తీసుకు రాలేదు. రాజకీయాలు, నడుస్తున్న చరిత్ర ఆయన కవితల్లో కనిపిస్తుంది. గల్లీ నుండి ఢిల్లీ దాకా జరిగే పరిణామాలు కాళోజీకి తెలుసు. చివరి వరకు కాళోజీ మనిషినే నమ్మాడు మనిషి వెంటే ఉన్నాడు. తన కవితల్లో ‘పార్టీవ్రత్యాన్ని’ చూపించాడు. 

అభ్యర్థి ఏపార్టీవాడని కాదు/ ఏ పాటి వాడో చూడు 

ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు. ఇందాక ఏం చేసిండో 

చూడు ఇప్పుడు కట్టే ముడుపులు కాదు. ఇందాక చెల్లించింది చూడు 

పెట్టుకునే టోపికాదు. పెట్టిన టోపి చూడు 

ఎగరేసిన జెండా కాదు చాటున ఆడించిన దండా చూడు 

మనిషిని చూడు, చరిత్రను చూడు/ నుడుపులు కాదు, నడవడి చూడు 

ఈ కవిత ఆయన సూటిదనానికీ, విసురుకూ, అరమరికలు లేని తనానికి నిదర్శనం. 

కాళోజీ గొప్ప అనువాదకుడు కూడా. ఉర్దూ కవితలనే కాక ఆంగ్లరచనల్ని కూడ అనువాదం చేసాడు. కాళోజీ ప్రసిద్ధమైన ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక’ అన్నది ఆంగ్లంలోని A sఱఅస్త్రశ్రీవ dతీశీజూ ఱఅk tష్ట్రat ఎakవ tష్ట్రవ ఎఱశ్రీశ్రీఱశీఅs tశీ tష్ట్రఱఅk అన్న మాటల్ని ‘సిరాచుక్క’లో 

ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక 

అన్నాడు బైరన్ / నిజమేనా అది? 

మరి నేను ఒలక బోసిన /సీరా సీసాల కొద్ది గాదు

పిపాల కొద్ది / ఏ ఒక్క మెదడు కదిలినట్టు లేదు 

మొదట నా మెదడులో ఉంటేగా కదలిక/ మరొడ్ని కదిలించ 

ఈ వాక్యాన్ని అనువదించటంలో క్లుప్తతను, గాఢతను సాధించి ఆ భావానికి విస్తృత ప్రాచుర్యం ఇచ్చాడు ఖలీల్ జీబ్రాన్ రాసిన ‘ది ప్రొఫెట’ ను ‘జీవనగీత’గా అనువదించాడు. అట్లాగే ఠాగూర్ రాసిన 

wష్ట్రవతీవ ఎఱఅd ఱs wఱtష్ట్రశీut fవaతీ Aఅd ష్ట్రవad ఱs ష్ట్రవశ్రీd ష్ట్రఱస్త్రష్ట్ర అన్న మాటలని ‘దేశానికి మేలుకొలుపు ఎప్పుడు?’ అన్న కవితలో అనువాదం చేసాడు. 

ప్రభూ! 

మనసు నీచే పురోగమింప బడినప్పుడు కద 

విశాలమగు చిత్తవృత్తికి / ఉదారమగు కృతికి ఆస్కారం 

అంటూ అనువదిస్తాడు కాళోజీ. అలాగే భీలాల్ జిబ్రాన్ రాసిన I aఎ dతీవaఎ శీf yవstవతీday aఅd ఎవఎశీతీy శీf tశీఎశీతీతీశీw అన్న మాటల్ని ‘నేను ప్రస్తుతాన్ని” అనే కవితలో.. 

నేను ప్రస్తుతాన్ని/గతానికి శిఖరాన్ని 

వర్తమానాన్ని / భావికి ఆధారాన్ని 

నేను నేడనెడు దాన్ని/ “నిన్నటి స్వపాన్ని 

రేపటి జ్ఞాపకాన్ని” / నేను ప్రస్తుతాన్ని / ఇప్పటి క్షణాన్ని అంటూ సాగుతుంది. ఈ అనువాదంలో శబ్దలయకూ, ప్రకటనలో స్పష్టత ప్రాధాన్యమిచ్చాడు కాళోజి. ఖలీల్ జిబ్రాన్ను రాసిన వాటినే అనువాదానికి ఎంచుకోవటంలోనే కాళోజీ జీవన చింతన అర్ధమవుతుంది. లోతైన జీవన తాత్త్వికత ఉన్న కావ్యాన్ని అనువదించి తెలుగు వారికి ఎంతో మేలు చేసాడు కాళోజి. 

స్మృతిగీతాలు రాయటంలో కాళోజీ తన ప్రతిభను చాటుకున్నాడు. ఈయన రాసిన స్మృతి గీతాల్లో క్లుప్తమైనది, బలమైనదీ, విశిష్టమైనదీ ‘జయప్రకాశ్ నారాయణ’ పై రాసింది. దీని శీర్షిక ‘లోకానాయక’ మÖడే మÖడు పంక్తులు కానీ ఒక జీవన సత్యాన్ని అన్వేషించగల భావాన్ని అందులో చూడొచ్చు 

‘పుటకనీది /చావునీది/ బ్రతుకంతా దేశానిది” 

మొదటి రెండు పంక్తులు సాధారణ వ్యక్తీకరణ. కానీ మÖడవ పంక్తి శిఖరాయమానమైనది. జీవన సార్ధకతను తెలియజేసింది. కాళోజీ బాలగంగాధర్ తిలక్ మరణించినప్పుడు ‘తమ్ముడూ’ అని దుఃఖ స్వరంతో స్మరించాడు. “నీ ఎదలో అతినాజూకైన ఒక మÖల నాకు విడిదిగా ఉండేది” అని తన ఆత్మీయతను నెమరేసుకున్నాడు. స్మృతిగీతాల్లో కాళోజీలో ఉన్న ఆత్మీయ భావాన్ని చూడొచ్చు. సున్నిత హృదయం గల వాళ్ళే ఎదుటి వారి కష్టాల్నీ కన్నీళ్ళను అర్థం చేసుకుంటారు. సున్నిత మనస్కుడుగా కాళోజీ చాలా కవితల్లో కనిపిస్తాడు. 

కాళోజీ మొదట విశాలాంధ్రను సమర్ధించాడు రెండు ప్రాంతాలు కలిసుంటే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నమ్మాడు. కానీ ఎక్కడా, ఎప్పుడూ కాళోజీ ఆశించినట్లు జరగలేదు. సీమాంధ్రుల కుటిల రాజకీయాలను అంచనా వేయలేక కాళోజితో పాటు చాలా మంది బాధపడ్డారు. కాళోజీ జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక పోయాడు. సీమాంధ్రుల మోసపూరిత విధానాలను ఖండిస్తూ తన కవిత్వంలో తూర్పారబట్టాడు. ‘ఎవరనుకొన్నారు? ఇట్లానని ఎవరనుకొన్నారు?” అనే కవితలో తెలంగాణకు జరిగిన అన్యాయాల్నీ ఆంధ్ర ప్రభుత్వ పరిపాలనతో సాగుతున్న పక్షపాత వైఖరిని తేటతెల్లం చేసాడు. 

ఎవరనుకున్నారు ఇట్లానని ఎవరనుకున్నారు

ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని

హామీలిచ్చినవారే అంత స్వాహా చేస్తారని

తప్పుడు లెక్కతో తమ్ముల నెప్పుడు ఒప్పిస్తారని

అంకెల గారడి చేస్తూ చంకలు ఎగిరేస్తారని

ప్రాంతాన్ని పాడుచేసి శాంతిశాంతి అంటారని

కడుపుల్లో చిచ్చుపెట్టి కళ్ళు తుడవ వస్తారని

అభయమిచ్చి కత్తుకనే అదిమి అదిమి పడతారని

ఆక్రోశిస్తే శాంతికి అంతరాయమంటారని

తెలంగాణ వేరంటె తెలివి లెక్క పెడతారని

ఆత్మహత్య ధోరణలను హంగామా చేస్తాడని

ఎవరనుకున్నారు ఇట్లానని ఎవరనుకున్నారు 

1969లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం సాగుతున్నప్పుడు కాళోజీ తెలంగాణ రాష్ట్రం కాంక్షిస్తూ ఎంతో కవిత్వం రాసాడు. అందులో తెలంగాణ వేరైతే’ అన్న కవితలో.. 

తెలంగాణ వేరైతే / దేశానికి ఆపత్తా 

తెలంగాణ వేరైతే / తెలుగు బాస మారుస్తారా? 

తెలంగాణ వేరైతే / కిలోగ్రాము మారుతుందా? 

తెలంగాణ వేరైతే/ తెలివి తగ్గిపోతుందా? 

తెలంగాణ వేరైతే / చెలిమితుట్టి పడుతుందా? 

వానపడక వుంటుందా చెలిమలెండి పోతాయా? 

తెలంగాణ ప్రత్యేకత/ తొలి సంజల పూస్తున్నది 

ప్రజల శక్తి ప్రజ్వలించి/ ప్రభల ప్రసారిస్తుంన్నది

ప్రజలరాజ్య ప్రాభవమును ప్రదర్శింపజేస్తున్నది. 

కాళోజీ కవితల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష ప్రజల్లో ఎంత బలంగా ఉన్నదో తెలుస్తుంది. 

ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సందర్భంగా మే నెల ఒకటి 1969లో వరంగల్లులో జరిగిన ప్రజాసమితి సదస్సులో తెలంగాణ ప్రాంతంలో ఉంటూ తెలంగాణకు ద్రోహం చేసే నాయకుల్ని గుర్తించాడు. ఆంధ్ర ప్రాంత నాయకులకు అమ్ముడు పోతున్న తెలంగాణ నాయకుల్ని హెచ్చరించాడు. ప్రాంతం వాడే దోపిడి చేస్తే అన్న కవితలో దోపిడిదారుడు ఎవరైనా సరే తన్ని తరమాలన్నాడు. 

దోపిడి చేసే ప్రాంతేతరులను/ దూరం దాకా తన్ని తరుముతం 

ప్రాంతం వాడే దోపిడీ చేస్తే / ప్రాణంతోనే పాతర వేస్తం 

ప్రాంతేతరుని దోపిడి కన్నా ప్రాంతం వాడి దోపిడిని తీవ్రమైనదిగా కాళోజీ పరిగణించడాన్ని గమనించాలి. ఇదే కవితలో ‘దోస్తుగా ఉండేవారితో మేమును దుస్తీ చేస్తం - ప్రాణమిస్తం” అన్న మాటల్ని కూడ తెలంగానేతరులు గమనించాలి. 

ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రజా నాయకులు ప్రజల క్షేమం మరిచి ప్రవర్తిస్తే ప్రజల్నే కాదని లెక్కచేయక తిరుగుతుంటే కడుపుమండిన ప్రజల మనోభావాలు ఎట్లా ఉంటాయో కాళోజీ ఈ కవితలో కనిపిస్తుంది. ‘నన్నే కాదంటే ఎట్ల?’ 

నా ఓటుకు పుట్టినన్నె / కాదంటే ఎట్ల కొడక? 

మా ఓట్లకు పుట్టిమమ్మె /కాదంటే ఎట్ల కొడక? 

రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు జనం ఓట్లకు పుట్టినవారని చెప్పడం కాళోజీ పరిశీలనా శక్తికి నిదర్శనం. 

ఉద్యమానికి అడ్డుపడ్డ రాజకీయ వేత్తలను పేరు పేరునా నిలదీసాడు. కాళోజీ నాటి ప్రధాన మంత్రి ఇందిరమ్మను ఉద్దేశిస్తూ తేటతెల్లమయే వ్యక్తీ కరణలో తెలంగాణ వేరుపడాలన్నాడు. 

ఒప్పందాలను నమ్మి/ ఒప్పుకుంది చాలమ్మా 

ఎవరి ప్రాంతమును వారిని / ఎలనియ్యి ఇందిరమ్మ 

వేరు వేరుగ వుంటే/పోరు వుండబొదమ్మా 

మరో రాజ్యమొకటి భారత / మాతకు బరువానమ్మ?

తేగెదాక బిగియిస్తే / తెగును తాడు గదనమ్మ 

అన్న మాటల్లో తెలంగాణ ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం తప్పక ఏర్పడుతుందనే విశ్వాసం కాళోజీలో కనిపిస్తాయి. తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న ప్రతి మార్పును ప్రతి పరిణామాన్ని కాళోజీ అంచనా వేయగలిగాడు. తెలంగాణ ఉద్యమ తొలితరం నుంచి మలితరం ఉద్యమం దాకా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకోవలన్న ప్రగాఢమైన కాంక్షను కాళోజీ తెలంగాణ ఉద్యమ కవిత్వంలో చూడొచ్చు. 

ప్రజాకవి కాళోజీని ఏ ఒక్కకోణం లోంచి చూసి అంచనా వేయటం కుదరదు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న ఆర్ద్రతను, ఆకలిని అంచనా వేసి ప్రజాజీవితాన్ని కవిత్వకరించాడు కాళోజీ. ఈయన కవిత్వంలో ఉన్న విభిన్నమైన కోణాలు మొతాన్ని పరిశీలించటం అన్నది అవసరం. కాళోజీ చూడని మార్గం లేదు. ఆయన తిరగని దిక్కూ లేదు. అందరి జీవితాల్లో ఉన్న సమస్యలను సాధక బాధలు తన కవిత్వంలో కనిపిస్తాయి. కాళోజీ అందరి వాడు. 

కాళోజీ 1958 నుండి 1960 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా ఉన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు సభ్యుడిగా పనిచేసాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యునిగా ఉన్నాడు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడుగా ఉన్నాడు. ఈయన పొందిన పురస్కారాలు ఈయన బహుముఖ ప్రజ్ఞకు అద్దం పడతాయి. 

1972లో భారత ప్రభుత్వం నుంచి స్వాతంత్య్ర సమరయోధునిగా సన్మానం. 

1968లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ‘జీవనగీత’ కు ఉత్తమ అనువాద రచన అవార్డు. 

1992లో భారత ప్రభుత్వ పద్మవిభూషణ్ పురస్కారం. 

1992లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్. 

1996లో కళాసాగర్ మద్రాస్వరి విశిష్ట పురస్కారం 1996లో సృదయ సాహితి, విశాఖవారి గురజాడ అవార్డు. 1997లో ఉండేల మాలకొండారెడ్డి విజ్ఞానపీఠం అవార్డు 

1996లో నాగపూర్ యÖనివర్సిటీ వారి సన్మానం 

2000లో రామినేని పౌండేషన్ వారి అవార్డు 

ఇవేకాక అనేక సాహిత్య సాంఘీక సంస్థలచే సన్మానాలు గౌరవాలు దక్కించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కాళోజీ. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి