మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

9, అక్టోబర్ 2026, శుక్రవారం

పంతులమ్మ (1943)

అభ్యుదయ భావాలు, ఆదర్శాలున్న గూడవల్లి రామబ్రహ్మం గారు సారథి ఫిలింస్ పతాకాన స్వీయదర్శకత్వంలో నిర్మించిన సాంఘిక చిత్రం ‘పంతులమ్మ’. ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’, ‘ఇల్లాలు’, ‘అపవాదు’, ‘పత్ని’ మొదలైన విజయవంతమైన చిత్రాలు గూడవల్లివారి ఖాతాలో ఉన్నాయి. 1943లో పురపాలక సంఘ అధ్యక్షుల బండారం బట్టబయలు చేస్తూ, ఓ సాంఘిక ప్రయోజనం ఆశించి ‘పంతులమ్మ’ చిత్రం తీశారు.

‘పంతులమ్మ’ చిత్రానికి పి.పి.కృష్ణయ్యర్ ఫొటోగ్రఫి, వి.ఎస్.రాఘవన్ ఆడియోగ్రఫి నిర్వహించారు. మల్లాది విశ్వనాధ కవిరాజు కథను అందించగా సముద్రాల వారు మాటలు, పాటలు రాశారు. స్క్రీన్‌ప్లేకు ఇంటూరి వెంకటేశ్వర్రావు సహకరించారు. ఈ చిత్రానికి గాలి పెంచల నరసింహారావు సంగీతదర్శకత్వం వహించారు.

ఈ చిత్రం ద్వారానే ప్రముఖ నేపథ్యగాయని జిక్కి (పి.జి.కృష్ణవేణి) బాలిక పాత్రలో బాలగాయనిగా పరిచయమయ్యారు.

‘పంతులమ్మ’ చిత్రంలో లక్క్ష్మీరాజ్యం (ఈ లక్క్ష్మీరాజ్యంగారు 1935 నుండి తొలిటాకీ చిత్రాల్లో నటిస్తూ ‘ఇల్లాలు’లో హీరోయిన్‌గా మారింది. రాజ్యం పిక్చర్స్ పేరిట ‘దాసి’, ‘నర్తనశాల’ వంటి చిత్రాలు నిర్మించింది) ఉమామహేశ్వరరావు హీరోహీరోయిన్లు. ఇంకా ముదిగొండ లింగమÖర్తి, గిడుగు వెంకట సీతాపతి, వంగర వెంకట సుబ్బయ్య, పార్వతీబాయి, కమలాకుమారి, హేమలత, సామ్రాజ్యం తదితరులు మిగతా నటీనటులు. 

కథాసంగ్రహం :

రంగాపురం బాలికా పాఠశాలలో నిర్మల అనే యువతి పంతులమ్మగా పని చేస్తుంది. అనాథాశ్రమంలో వున్న ఆమెకు వుద్యోగాన్నిప్పిచ్చింది, రంగాపురం మున్సిపల్ ఛైర్మన్ రావూజీ.

పాఠశాల వార్షికోత్సవంలో పిల్లలతో పాటు నిర్మల కూడా ఆడుతూ పాడుతుంది. ఆమెను అనుభవించాలనే దుర్బుద్ధి రావూజీలో పుట్టుతుంది. పెద్దమనిషిగా ఆమెకు ఎన్నో సాయాలు చేస్తూ, ఆమె దృష్టిని ఆకట్టుకొంటాడు. ఆమెకు సంగీతం చెప్పడానికి సూరిశాస్త్రిని నియమిస్తాడు. సూరిశాస్త్రి మాత్రం రావూజీ మంచివాడు కాదని నిర్మలను హెచ్చరిస్తాడు.

ఓ రోజు రావూజీ బంగారుపతకాన్ని బహూకరించే మిషతో నిర్మల ఇంటికి, డిన్నర్‌కు వస్తాడు. అతని దుష్ట ఆలోచనలకు రాజయ్య వత్తాసు పలుకుతుంటాడు. ఆ రాత్రి రావూజీ త్రాగి, నిర్మలపై అత్యాచారం చేయబోగా, ఆమె తప్పించుకుని సూరిశాస్త్రి ఆశ్రయంలోకి వస్తుంది.

రావూజీ కుతకుతలాడి సూరిశాస్త్రి తండ్రి చెన్నయ్య వద్దకు వెళ్ళి నిర్మల సూరిశాస్త్రిల మధ్య అక్రమసంబంధం ఉందని చెప్పి అతని మనసు విరుస్తాడు. నిర్మల వుద్యోగం వూడబెరికిస్తాడు. అనాధాశ్రమానికి వెళ్ళి ఆ యజమాని మనసును మారుస్తాడు.

సూరిశాస్త్రి నిర్మల విధిలేక రంగాపురం వదలి జీవనోపాధి కోసం మరో వూరు వెళ్తుంటే దొంగలు అటకాయించి వున్న సొమ్ము దోచుకుంటారు. వారిని రామావధాని అనే బ్రాహ్మణుడు తన కొడుకు కోడలుగా భావించి ఆశ్రయమిస్తాడు.

సూరిశాస్త్రి నిర్మలను భార్యగా భావించడు. మానవతా ధర్మంగా సాయం చేస్తుంటాడు. ఇద్దరికీ నిర్బంధ దాంపత్యం ప్రాణాంతకమవుతుంది. ఎలాగోలా సంగీతం బోధిస్తూ కాలం గడుపుతుంటారు. నిర్మల క్రమంగా సూరిశాస్త్రిని ప్రేమిస్తుంది. ఓ రోజు మనసులో మాట చెబుతుంది. సూరిశాస్త్రి నివ్వెరపోయి తనకు అలాంటి ఉద్దేశ్యమే లేదని చీటి వ్రాసి, అనారోగ్యంగా ఉన్న తల్లిని చూడ్డానికి వూరెళ్ళుతాడు.

ఈలోగా రావూజీ దూరాగతాలన్ని బయటపడటంతో, ప్రజలు నిరసిస్తారు. అధికారపార్టీ సభ్యులు అతన్ని పదవీచ్యుతుణ్ణి చేస్తారు. సూరిశాస్త్రిని తండ్రి ప్రాయశ్చిత్తం చేసుకొమ్మంటాడు. తన వల్ల కాదని సూరిశాస్త్రి ఇంటిని వదలి వెళ్ళబోతుంటే, అదే సమయంలో నిర్మల వస్తుంది. ఆమెను కోడలుగా ఆహ్వానించబోతుంది సూరిశాస్త్రి తల్లి. కానీ తండ్రి నిరాకరిస్తాడు.

చివరికి జాతిమతాలకతీతమైన ప్రేమ జీవనం సాగించమని ఆ యిద్దరిని సూరిశాస్త్రి తండ్రి దీవిస్తాడే కాని తన యింట్లోకి రావద్దని శాసిస్తాడు.

నిర్మల, శాస్త్రి వేరు కాపురం పెడ్తారు. సంగీత ప్రపంచంలో కొత్త జీవితం ప్రారంభిస్తారు.

‘పంతులమ్మ’ చిత్రం తాలూకు వీడియో గానీ ఆడియోగానీ ప్రస్తుతం అలభ్యం. కాబట్టి సముద్రాలవారి సంభాషణల తీరు పరిశీలించే అవకాశం లేదు. ఆడియో లేకపోవటం వల్ల స్వరకల్పన విధానం తెలియడం కష్టం. 

సాహితీ విశేషాలు:

‘పంతులమ్మ’ చిత్రంలో (లభించిన సమాచారం బట్టి). సముద్రాలవారివి 11 పాటలున్నట్లు తెలుస్తుంది. గూడవల్లి రామబ్రహ్మంగారు తమ అభిరుచికి తగినట్లు రాయించుకున్నట్లు sTÖ పాటలు చెప్పకనే చెబుతున్నాయి.

భాషా ప్రయోగాల రీత్యా, ఆలంకారిక సౌందర్యం దృష్ట్యా చూస్తే సముద్రాలవారు ఉరుదు భాష సమ్మిళితమైన పాటలు మణిప్రవాళశైలిలో రాశారు.

కత్తిగీతం, బండిగీతం, భావగీతం, విరహగీతం, ప్రేమగీతంతో పాటు ‘జయమహాంధ్ర జననీ’ వంటి దేశభక్తిగీతం కూడా రాసారు సముద్రాల. అన్ని పాటలనూ వాడుకభాషలోనే రాయడం సాహితీ విశేషం. పాటలలో యతి, ప్రాసలు కన్పించడం, పూర్వ సంప్రదాయ వాసనలు వదలలేదని తెలుస్తుంటాయి. ‘పదము’ పేరిట పచ్చిశృంగారగీతాన్ని చేర్చి కావ్యవిలువలున్న కలానికి కమర్షియల్ విలువలను చేర్చారు నిర్మాత దర్శకులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి