ఇరవై ఏళ్ల క్రితమే సినిమాల్లో నటించాలనే కోరికతో కడప నుండి మద్రాసు పారిపోయి ‘కల నిజమాయెగా... కోరిక తీరెగా’ అంటూ వెండితెరపై అభినయించిన నటి పుష్పలత. కథానాయికగా అంతగా ప్రాచుర్యం పొందలేకపోయినా ‘సంసారం’ చిత్రంలో ‘మహానటి సావిత్రి’ స్థానంలో అక్కినేనికి జోడీగా నటించి అందరి దృష్టిలో పడ్డారు. పెళ్లి చేసిచూడు, చంద్రహారం, ఆడబిడ్డ, చెరపకురా చెడేవు లాంటి మరికొన్ని చిత్రాల్లో నటించారు. కలకాలం నటించాలనే కల నిజం కాకుండానే సంసార సాగరంలో మునిగి ‘సంసారం పుష్పలత’ గా మిగిలిపోయారు. ఆమె తలపోతలే ఈ వారం జ్ఞాపకాలు....
మాది ద్రోణాచలం. మా ఇంట్లో మా బంధువులెవ్వరికీ సినిమా వాళ్లతో పరిచయాలు గాని, సంబంధాలు గాని ఏవీ లేవు. మేము రాయలసీమలోని కడపలో ఉండేవాళ్లం. నాకు చిన్నతనం నుంచీ సినిమాలో నటించాలని చాలా కుతూహలంగా ఉండేది. ఆ రోజుల్లో ‘బాలరాజు’ సినిమాలో అంజలీదేవి నాట్యం చేసిన ‘తీయని వెన్నెల రేయి... ఎడబాయని చిన్నెల హాయి...’ అన్న పాట అంటే నాకు ఎంతో ఇష్టం. ఇంట్లో చీటికి మాటికి నేను ఆ పాడుతూ డాన్స్ చేస్తుంటే మా వాళ్లందరూ తిట్టేవాళ్లు. కాని ఆ పాటే నన్ను మద్రాసు లాక్కెళ్లింది. నటిగా నాకు ప్రేరణ కూడా ఆ పాటే.
అదెలాగంటే, కడపలో నా స్నేహితురాý£కామె సినిమాల్లో వేషాలు వేస్తుండేది. ఆమె పేరు లీల. నా నృత్యాన్ని గమనించి ఆమె నన్ను కూడా సినిమాల్లో చేరమనేది. ఈ సంగతి మా అమ్మకు చెబితే “ఛీ... ఛీ... మన మరాఠీవాళ్లు సినిమాలో వేషాలెయ్యడం గౌరవం కాదు” అని మందలించింది. సరేనని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను (తాత్కాలికంగా).
ఒకనాడు నా స్నేహితురాలికి తంతి (టెలిగ్రాం) వచ్చింది. ఒక పిక్చరులో నటించడానికి బయలుదేరి మద్రాసు రమ్మని ఆమె నన్ను కూడా వెంట తీసుకుపోయి సినిమాల్లో చేర్చుతానంది. ఈ సంగతి ఇంట్లో చెప్పేసరికి చాలా గొడవైపోయింది. మా అమ్మ అరచిన అరుపులకు నాకు జ్వరమొచ్చేసింది. ఒకనెల షూటింగ్ జరిగాక నా స్నేహితురాలు కడపకు తిరిగి వచ్చింది. మా ఇంట్లో వాళ్లకు భయపడి, ఆమె నన్ను స్వయంగా కలుసుకోకుండా వాళ్ల పనిమనిషి చేత కబురు పంపుతూ వుండేది. మేము రహస్యంగా కలుసుకునే వాళ్లం.
ఒక పౌర్ణమి రోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగింది. మా అమ్మ నన్ను బీరువా సొరుగు లోంచి వెండి సామాను తీయమంది. నేను ఆ సామానుతో పాటు రెండు వేల రూపాయలు కూడా తీసి రహస్యంగా నా దగ్గరే పెట్టుకున్నాను. ఆ మరుసటి రోజే నా స్నేహితురాలు తిరిగి మద్రాసు వెళుతోంది. నేను మా వాళ్లకెవరికీ తెలీకుండా ఆమె వెంట మద్రాసు కొచ్చేశాను. అమ్మో...ఆ సంఘటనను ఇప్ప్పుడు గుర్తుచేసుకున్నా గుండె ఝల్లుమంటుంది. అప్ప్పుడు అదెంత పెద్ద నిర్ణయమో తెలీలేదు.
నా దగ్గర ఉన్న డబ్బుతో నేనూ, నా స్నేహితురాలూ మంచి మంచి చీరెలూ, అవీ కొన్నాం. ఆ సమయంలో హాస్యనటుడు కస్తూరి శివరావు ‘పరమానందయ్య శిష్యులు’ (1950) తీస్తున్నారు. నా స్నేహితురాల్లు నన్ను శివరావు గారి ఆఫీసుకు తీసుకువెళ్లి నాకేదైనా వేషం ఇవ్వమని ఆయన్ను అడిగింది. నాకప్ప్పుడు పదమÖడేళ్లు. అంచేత నాకు తగిన వేషం ఏదీ లేదని శివరావు గారు చెప్పారు. కానీ నా స్నేహితురాలు ఏ చిన్న వేషమైనా ఇవ్వమని, డబ్బు కూడా అవసరం లేదని చెప్పింది. ‘పరమానందయ్య శిష్యులు’ లో ఆ విధంగా అతి చిన్న వేషమొకటి చేశాను. అదే నా మొదటి చిత్రం. ఆ పిక్చరు పూర్తి కాక మునుపే నేను తెచ్చిన డబ్బంతా అయిపోయింది. ఏం చెయ్యాలో తోచక ఇంటికి జాబు రాశాను. జవాబు రాలేదు. టెలిగ్రాం ఇచ్చాను. మా వాళ్లు ఇంటిల్లిపాదీ మద్రాసు వచ్చి వాలారు. వచ్చేటప్ప్పుడు తల తాకట్టు పెట్టి నాలుగువేల రూపాయలు వెంట తెచ్చారు కూడా.
నేను ప్రపంచ జ్ఞానం లేక బుద్ధిమాలిన పని చేసినప్పటికీ నాకు సినిమాల పట్ల ఉన్న ఆసక్తిని అర్థం చేసుకుని మా అమ్మ సమాధానపడింది. మా వాళ్లంతా నాతో పాటే ఉండిపోయారు. ‘పరమానందయ్య శిష్యులు’ తర్వాత ప్రతిభావారి ‘స్వప్నసుందరి’ లో ఒక దేవకన్య వేషం వేశాను. నామమాత్రపు వేషమే అయినా ఆ నాటికి అదే గొప్పగా అనిపించింది. పైపెచ్చు నన్ను విపరీతంగా ఆకర్షించిన ‘తీయని వెన్నెల రేయి...’ పాట తార అంజలీదేవిని దగ్గరగా చూసే అవకాశం కలిగిందని పరమానంద పడిపోయాను.
అప్ప్పుడే అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి హీరోహీరోయిన్లుగా లక్ష్మీరాజ్యం గారు ‘సంసారం’ సినిమా ప్రారంభించారు. ఎల్.వి.ప్రసాద్ గారు దర్శకులు. అందులో కొంతమంది కాలేజీ అమ్మాయిలలో నన్నూ ఒకరుగా బుక్ చేసుకున్నారు. మేమంతా కథానాయిక సావిత్రితో కలిపి అక్కినేని గారిని టీజ్ చేస్తూ పాడే పాట ఒకటుంది. నేను చేసిన ఆ పాట రషెస్ చూశాక ఎల్.వి.ప్రసాద్ గారు అప్ప్పుడు అడయార్‌లో ఉంటున్న మాకు కబురు పంపించారు. వెళ్లాను, కొన్ని డైలాగ్స్ చెప్పించి డాన్స్ చేయమన్నారు. చేశాను. నాగేశ్వరరావు గారితో ప్రేమగా మాట్లాడుతున్నట్టు యాక్షన్ చేయమన్నారు. నాకు సిగ్గు, భయం అన్నీ ఒకేసారి వచ్చేశాయి. చెయ్యలేనని ఖచ్చితంగా చెప్పేశాను. అయినా లక్ష్మీరాజ్యం గారు ఒప్పించి, బుజ్జగించి మరీ చేయించారు.
ఇంకేముంది? అంతకుముందు సావిత్రి చేస్తున్న కథానాయిక వేషానికి నన్ను, నేను చేస్తున్న కాలేజ్ అమ్మాయి పాత్రకు సావిత్రిని మార్చేశారు. అప్పటివరకూ పావడా పరికిణీలో ఉన్న నాకు గబగబా చీరకట్టేశారు. హీరోయిన్‌వి అన్నారు. ఆ తర్వాత అక్కినేని గారిని ఉడికిస్తూ మేమందరం పాడే ‘టక్కుటక్కు టమకులబండి...’ అన్న పాటను నేను హీరోయిన్‌గా, సావిత్రి కాలేజీ గర్ల్‌గా షూట్ చేశారు.
‘సంసారం’ బ్రహ్మాండంగా హిట్టయంది. అంతవరకూ జానపద హీరోగా పేరుపొందిన అక్కినేని గారికి అదే తొలి సాంఘిక చిత్రం. అలా అక్కినేనికి మొదటి సోషల్ పిక్చర్ హీరోయిన్ నేను కావడం నా అదృష్టం. ఆ సినిమా ప్రింటు ఎక్కడా లభ్యం కాకపోవడం నా దురదృష్టం. ఆనాటి ప్రేక్షక హృదయాల్లో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది ‘సంసారం’. అదే చిత్రం నా ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. సుసర్ల దక్షిణామÖర్తిగారి స్వరసారథ్యంలో జిక్కీ పాడిన ‘కల నిజమాయెగా...’ అన్న హుషారు పాట నాకు చాలా మంచిపేరు తెచ్చిపెట్టింది.
ఆ చిత్రం తర్వాత ఎల్వీ ప్రసాద్ గారే నన్ను ‘విజయా’ లో పర్మనెంటు ఆర్టిస్టుగా చేర్చారు. మÖడేళ్లు అగ్రిమెంటు. ఆ రోజుల్లో రూ.2500/-లు జీతం. సంవత్సరానికి 250 రూపాయలు ఇంక్రిమెంటు అలా ‘విజయా’ లో నేను ‘పెళ్లిచేసి చూడు’ (1952), ‘చంద్రహారం’ (1954) చిత్రాలు చేశాను. ‘పెళ్లిచేసి చూడు’ చిత్రంలో మహంకాళి వెంకయ్య సరసన నటఙంచాను. సూర్యకాంతం కూతురు వేషం. నేనంటే చాలా కోపంగా ఉండేది ఆమె. ఎందుకంటే ‘సంసారం’ చిత్రంలో నేనేదో సావిత్రిని తీయించేసి, కథానాయిక వేషం పొందానని ఆవిడ అనుకునేది. ‘సంసారం’ సమయం లోనే ఎల్.వి.ప్రసాద్ గారితో ఆ విషయంగా పోట్లాడింది కూడా. ‘పెళ్లిచేసిచూడు’ లో ‘భయమెందుకే చిట్టి భయమెందుకే...’, ‘ఎవడొస్తాడో చూస్తాగా...’ అన్న రెండు పాటలు బాగ పాపులరై నాకు మంచిపేరు సంపాదించి పెట్టాయి. ‘చంద్రహారం’ చిత్రంలో ఋష్యేంద్రమణి కూతురుగా వెర్రిబాగుల దానిగా చేశాను. ఆ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా టిపికల్ రోల్ అది. ఆ తర్వాత ‘ఆడబిడ్డ’, ‘చెరపకురా చెడేవు’ (1955) తదితర సినిమాల్లో చేశాను. ‘చెరపకురా చెడేవు’ చిత్రంలో రేలంగి గారి సరసన నటించాను. అందులో ‘ప్రేమో ప్రేమ...’ అన్న త్రీ స్టేజస్ సాంగ్ బాగా హిట్టయ్యింది. లైలా మజ్ను, పార్వతీ దేవదాసు, అనార్కలి సలీం.. ఈ మÖడు జంటల ప్రేమ. ఆ ఒక్కపాటలోనే వస్తుంది. కాస్టూమ్స్‌లో నేను, రేలంగి గారు కన్పించినట్టు గుర్తు.
ఆనాడు ఇన్‌కంటాక్స్ కట్టిన ఆర్టిస్టులలో నేనొకదాన్ని. షావుకారు జానకి, పద్మనాభం, జోగారావు... ఇన్‌కంటాక్స్ కట్టిన మిగతా ఆర్టిస్టులు. ‘సంసారం’ సినిమాను ‘జెమినీ’ అధినేత ఎస్.ఎస్.వాసన్ గారు తమిళ, హిందీ భాషల్లో తీస్తూ నన్ను హీరోయిన్‌గా వెయ్యమని ఆడిగారు. అప్పటికే విజయాతో అగ్రిమెంట్స్‌పై సంతకం చేసేశాను. దానితో వాసన్ గారు చక్రపాణి గారిని అడిగారు. ఆయన ఒప్ప్పుకుని రద్దుకు ఏర్పాట్లు కూడా చేసేశారు. అయితే ఎల్.వి.ప్రసాద్ గారు మా ఇంటి కొచ్చి “నిన్ను విజయాలో చేర్చింది నేను, ఇప్ప్పుడు అగ్రిమెంట్ రద్దుచేసుకుంటే నా మాట పోతుంది” అని పేచి పెట్టడంతో వాసన్ గారి ‘సంసారం’ మానుకున్నాను. ఎందుకంటే ఎల్.వి.ప్రసాద్ గారు నాకు దైవంతో సమానం.
ఆ తర్వాతే ‘చంద్రహారం’ చేశాను. విజయాలో ఉండగానే హిందుస్థాన్ పిక్చర్స్ అధినేత సి.బి.రాజరత్నం గారితో పెళ్లి అయింది. ‘చంద్రహారం’ టైమ్‌కి గర్భవతిగా ఉన్నాను. అదే సమయంలో డి.ఎల్.గారి ‘దేవదాసు’ లో పార్వతి పాత్రకు నన్ను అనుకున్నారు. అయితే ఆ పాత్ర సావిత్రికి దక్కింది. ఆ సినిమాతో సావిత్రి తారాపథంలోకి దూసుకుపోయింది. ఆ తర్వాత మా వారు సినిమాలు వద్దనడంతో మానేసి నిజం సంసారంలో పడిపోయాను. నాకు ముగ్గురమ్మాయిలు, ఒక అబ్బాయి. వాళ్లని పెంచడమే సరిపోయింది. ఇప్ప్పుడు అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. మనవళ్లు, మనవరాళ్లతో చెన్నెíలో ప్రశాంతం జీవిస్తున్నాను.
సావిత్రి మహానటిగా తారాస్థాయిలో వుండే రోజుల్లో ఓసారి ‘విజయా’ లో జరిగిన కార్నివాల్‌లో కన్పించి “నటిగా నువ్వే నాకు స్ఫూర్తి. ఒకప్ప్పుడు నన్ను హీరోయిన్‌గా తీసేసి ఆ స్థానంలో నిన్ను పెట్టడం నాకు ఉక్రోషం తెప్పించింది. ఎన్ని రోజులు ఒంటరిగా ఏడ్చానో నాకే తెలీదు. నీలాగ చలాకీగా ఎందుకుండలేకపోయానని అద్దం ముందు కూర్చుని గంటల తరబడి ప్రాక్టీసు చేశాను” అంది. సావిత్రిని తలచకున్నప్ప్పుడల్లా నాకు ఆ విషయం గుర్తుకొస్తూ వుంటుంది. సావిత్రి చాలా గొప్ప నటి. ఆవిడ స్థానంలో నేనెలా హీరోయిన్‌నయ్యానో నాకే తెలీదు. ఏదైతేనేం ‘సంసారం’ పుష్పలతగా పేరు దక్కించుకున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి