‘తెలంగాణలో కవులు లేరు. ఉన్నవారికి కవితాశక్తి లేదు’ అంటూ ఓ పత్రికలో వచ్చిన వ్యాసాన్ని చదివి తెలంగాణ కవుల సత్తా ఏమిటో లోకానికి నిరూపించాలన్న లక్ష్యంతో పట్టణాల నుండి పల్లెటూర్ల వరకు ఉన్న కవులను వెదికి పట్టుకొని 183 పూర్వ కవుల కవితలను, 334 ఆధునిక కవుల కవితలను ‘గోలకొండ కవుల సంచిక’ అనే పత్రికలో వెలువరించి, తెలంగాణ సాహిత్య సత్తాను సాక్ష్యాధారాలతో నిరూపించిన సాహితీ స్రష్ట, ద్రష్ట సురవరం ప్రతాపరెడ్డి గారు. పత్రికా సంపాదకుడుగా, కథా రచయితగా, చరిత్రకారుడుగా వందలాది సంపాదకీయాలు వెలువరించి తెలంగాణ సాహిత్యానికి ఎనలేని సేవలు చేశారు. బ్రతికింది 57 సంవత్సరాలే (1896 - 1953) అయినా తెలంగాణ సాహిత్యానికి విశేషమైన కృషి చేశారు. అంతటి ప్రతిభ పాటవాలు కలిగిన సాహితీమÖర్తి జన్మించిన మహబూబ్ నగర్ జిల్లా నేలపై 1928 మార్చి 31న జన్మించిన మరొక సాహితీ కెరటం కపిలవాయి లింగమÖర్తి.
మరుగున పడిన అనేక శాసనాలను పరిశీలించి, తెలంగాణ (తెలుగు) చరిత్రను గ్రంథస్థం చేసి, జానపదుల నోళ్ళలో కదలాడే మౌఖిక సాహిత్యాన్ని రికార్డు చేసి, 100కు పైగా రచనలు చేసిన అవిరళ జపహౌమ తత్పరుడు కపిలవాయి లింగమÖర్తి. తెలంగాణ రాష్ట్రం (2014 జూన్ 2) ఏర్పడిన తరువాత తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్న మొట్టమొదటి వ్యక్తి లింగమÖర్తి గారు. ఇంతటి విశిష్టత కలిగిన కపిలవాయి లింగమÖర్తి ముద్రణకు నోచుకోని 40 ప్రతులను సేకరించి, ఆ ప్రతులలో ఉన్న విషయాలను తనదైన శైలిలో పరిష్కరించారు. ఆ వ్యాసాలు ఎక్కడి నుంచి సేకరించారు?, ఆ వ్యాసాల్లో ఉన్న విషయాలు ఏమిటి?, ఆ వ్యాసాలను పరిష్కరించే క్రమంలో లింగమÖర్తి గారు ఏయే విధానాలను అనుసరించారు? అనే అంశాలను పరిశోధనాత్మకంగా పరిశీలించడం ఈ వ్యాసం యొక్క ముఖ్యోద్దేశం. దానికంటే ముందు తెలుగు సాహిత్యంలో వ్యాసం విశిష్టత, కపిలవాయి లింగమÖర్తి సాహిత్య సేవ గురించి సంక్షిప్తంగా పరిచయం చేసి, మÖడు వ్యాసాలను పరిశీలించే ప్రయత్నం చేస్తాను.
1. తెలుగు సాహిత్యంలో వ్యాసం విశిష్టత:
ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆధునిక తెలుగు సాహిత్యంలో వెలువడిన ప్రక్రియల్లో వ్యాసం ఒకటి. ఇది వచన రూపంలో ఉండే సాహిత్య ప్రక్రియ. ఆంగ్లంలో (జుSSAY) అంటారు. తొలి రోజుల్లో ఈ ప్రక్రియను వివిధ పేర్లతో ఉచ్ఛరించినప్పటికి ఈనాడు ‘వ్యాసం’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వ్యాసం అంటే ‘ఏదైనా ఒక విషయాన్ని విరివిరిగా వ్రాయడం’ అని లేదా ‘ఏదేని ఒక చరిత్రాంశం’ అని నైఘంటికార్థాలు ఉన్నాయి. కాని వ్యాసం అంటే- ‘ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకుని, దానిలోని అంశాలను శీర్షికలుగా విభజించుకొని, విభజించుకున్న ఆ శీర్షికల్లోని విషయాలను వివరించి చెప్పే ప్రక్రియనే ‘వ్యాసం’ అంటారు!. వ్యాసం విషయాన్ని విభజిస్తుంది, వివరిస్తుంది, విశ్లేషిస్తుంది, సమీక్షిస్తుంది, విమర్శిస్తుంది, అనుశీలిస్తుంది.
సి.పి.బ్రౌన్ (తెలుగు భాషా సారస్వతాలకు రాసిన మొదటి ఆంగ్ల వ్యాసం) గారితో ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈనాడు మÖడు పువ్వులు ఆరుకాయలుగా ముందుకు సాగుతోంది. ఇంతటి విశిష్టత కలిగిన ఈ వ్యాస ప్రక్రియలో తనదైన శైలితో, సరళమైన పదాలతో అద్భుతమైన వ్యాసాలు రాశారు కపిలవాయి లింగమÖర్తి. పురాణేతిహాసాల్లోని కథలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఆ కథల్లో మహబూబ్నగరు ప్రాంతంలో ఉన్న స్థల పురాణాల చరిత్రలను వెలికితీశారు. అతి దీర్ఘం, అతి విపులం కాకుండా సంగ్రహంగా వ్యాసాన్ని రూపొందించి మరుగునపడిన అనేక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కరించారు.
2. కపిలవాయి లింగమÖర్తి సాహిత్య సేవ:
ఒక మహాపురుషుని ప్రతిభ నానా ముఖాలుగా విచ్చుకున్నప్పుడు, అతని సేవలు పలు రంగాల్లో విస్తరించినప్పుడు ఆ వ్యక్తి బహుముఖీనతను అంచనా వేయాలంటే ఆ ప్రయత్నం కూడా వివిధ ముఖాలుగా సాగాలి. అప్పుడే ఆ వ్యక్తి యొక్క సాహిత్య కోణం అవగతమవుతుంది. కపిలవాయి లింగమÖర్తి గారు ప్రాచీన, ఆధునిక సాహిత్యాల్లో ప్రసిద్ధిగాంచిన శతకం, సంకీర్తనలు, ఉదాహరణలు, పద్య, గద్య, గేయ, కావ్యం, ఆధ్యాత్మిక, నవల, కథా, సంకలనాలు, వ్యాఖ్యానాలు, జీవిత చరిత్ర, నాటకం, నిఘంటువులు, అనువాదం, వ్యాసం, పీఠిక వంటి ప్రక్రియలను వదిలిపెట్టకుండా అన్ని ప్రక్రియల్లో రచనలు చేశారంటే వీరి ప్రతిభ ఎంతటి విశిష్టమైనదో ఇట్టే అర్థమైపోతుంది. ఇంతటి సాహిత్య జిజ్ఞాస కలిగిన లింగమÖర్తి గారు 1928లో మాణిక్యమ్మ, వెంకటాచలం పుణ్య దంపతులకు జన్మించారు. లింగమÖర్తి జన్మించిన రెండు సంవత్సరాలకే (1930- 31) తండ్రి మరణించడంతో మేనమామ పెద లక్ష్మయ్య సమక్షంలో పెరిగి పెద్దయ్యారు.
ప్రాథమిక స్థాయిలో ఉర్దూ మాధ్యమంలో విద్యను అభ్యసించిన కపిలవాయి ఒక వయసు, ఆలోచన వచ్చాక తెలుగు భాషమీద ఉన్న అభిమానంతో సారస్వత పరిషత్ పరీక్షలు రాసి ఉత్తర్ణులయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఏ. పట్టా పొంది సంస్కృతాంధ్ర నిఘంటువులు, పురాణేతిహాసాలు, కావ్య నాటకాలు, జ్యోతిష్య శాస్త్రాల్లో మంచి పట్టు సాధించారు. ఉద్యోగరీత్యా నాగర్కర్నూల్లో ఉన్న జాతీయోన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా చేరి పదవీ విరమణ సమయానికి అనేక పదవులను అలంకరించారు. ఒకవైపు తెలుగు భాషను, తెలుగు ప్రజలను ప్రేమిస్తూనే, మరొకవైపు తెలంగాణ భాష, యాస, ప్రాంతాన్ని తన గుండెకాయగా జీవించిన సాహితీ దిగ్గజం లింగమÖర్తి.
రచనల విషయానికొస్తే- పద్య రచనతో తన సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించిన కపిలవాయి లింగమÖర్తి- వచన సాహిత్యం, కావ్యాలు, గీతాలు, శతకాలు, బాల సాహిత్యం, స్థల చరిత్రలు, దేవాలయ చరిత్రలు, విమర్శ, జనపదం వంటి ప్రక్రియల్లో 100కు పైగా పుస్తకాలు వెలువరించారు. అందులో ప్రధానంగా పాలమÖరు జిల్లా పుట్టుక, అచ్చంపేట, అమరాబాదు, ఆలంపురం, కల్వకుర్తి, వెలిదండ, కొల్లాపురం, కొడంగల్, నాగర్ కర్నూలు, వడ్డవాని, పాలమÖరు, మక్తల్ వంటి తాలూకాల్లో ఉన్న ఆలయాల చరిత్ర, అరణ్యకాలు, జాతరలు, మఠాలు, దర్శనీయ స్థలాలకు సంబంధించి అనేక పరిశోధనాత్మకమైన రచనలు వెలువరించారు. వీరి సాహిత్య సేవకు గాను విశ్వవిద్యాలయాలు, సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పురస్కారాలతో సత్కరించాయి.
3.కపిలవాయి లింగమÖర్తి వ్యాసాలు - విభిన్న కోణాలు:
‘ఎవరికీలేని ఘన చరిత్ర మన తెలుగు (తెలంగాణ) సాహిత్యానికి ఉంది!. ఋగ్వేదం మÖడవ మండలంలో ఉన్న గాయత్రీ మంత్రాన్ని ఈనాటికి ఉచ్ఛరిస్తున్నాం. రెండు వేల ఏళ్లనాటి మహాకావ్యాలు, పురాణాల విశేషాలను ఇప్పటికి వింటున్నాం. శతాబ్దాల క్రితమే సంస్కృతం అంతరించినప్పటికి దాని పదాలను నేటికి వాడుకుంటున్నాం. ఎప్పుడో పుట్టిన జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతూనే జాతక చక్రాన్ని బట్టి లెక్కలు వేసుకుంటున్నాం. కాల క్రమంలో అనేక మార్పులు వచ్చినా ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా కవితలు, నవలలు, కథలు, చరిత్రలు, అక్కడక్కడ శాసనాలను వెలికితీసి పరిష్కరిస్తున్నాం. గతాన్ని ఇంత గట్టిగా పాటించే మనం కళ్లముందు జరిగిన ఒకనాటి పరిణామాలను అక్షరబద్ధం చేయటంలో మాత్రం చాలా వెనుకబడే ఉన్నాం.’ అటువంటి పరిణామాలను, చరిత్రను, ప్రబంధ కావ్యాలను, ముద్రితం కాని స్థల పురాణాల ప్రతులను సేకరించి తన వ్యాసాల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు కపిలవాయి లింగమÖర్తి. వివిధ దిన, వార పత్రికల్లో విభిన్న కోణాల్లో రాసిన 40 వ్యాసాలను ‘కపిలవాయి పుస్తక పరిచయాలు’ అనే పేరుతో 2000 సంవత్సరంలో పుస్తకంగా వెలువరించారు. ఇందులో క్రీ.శ. 16వ శబ్దానికి చెందిన మరింగంటి కవులుగా ప్రసిద్ధి చెందిన వేంకట నరసింహాచార్యులు (ప్రథమ) రాసిన మÖడు ప్రబంధ కావ్యాలపై లింగమÖర్తి గారు విలువైన వ్యాసాలు రాశారు. ఆ మÖడు వ్యాసాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
1. తెలుగు సాహిత్యంలో మరింగంటి కవుల ప్రస్తావన:
తెలుగు సాహిత్యం రాజరాజనరేంద్రుడు, రెడ్డి రాజులు, శ్రీకృష్ణదేవరాయలు, నాయక రాజుల వంటి కాలాల్లో మÖడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లింది. ఆ తరువాత సాహిత్యానికి రాజుల ఆశ్రయం కరువైపోయింది. దాంతో చిన్న చిన్న సంస్థానాలు సాహిత్యానికి ఆశ్రయం కల్పించాయి. ఆంధ్రలో- నూజివీడు, బొబ్బిలి, విజయనగరం, పిఠాపురం ప్రాంతాలైతే, తెలంగాణలో- గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, జటప్రోలు, దోమకొండ, రాచకొండ, సంస్థాన్ నారాయణపురం, నడిగూడెం, బేతవోలు వంటి ప్రాంతాల్లో సాహిత్యం పోషించబడింది. తెలంగాణలో సంస్థానాధిపతుల కాలంలో అలంకారప్రాయమైన ప్రబంధ కావ్యాలు రాసి ప్రసిద్ధికెక్కిన కవులు మరింగంటి కవులు.
మరింగంటి కవులు క్రీ.శ.16వ శతాబ్దానికి చెందినవారు. సంస్కృతాంధ్రంలో లబ్ధప్రతిష్టులు. వీరు నల్లగొండ జిల్లా, కనగల్ మండలంలో జన్మించారు. ఆ తరువాత మిర్యాలగూడ, సూర్యాపేట, భీమునిపట్ణణం, కృష్ణ జిల్లాలోని మొఖాసాకలువపూడి వంటి ప్రాంతాలకు వలసపోయి అక్కడే స్థిరపడ్డారు (ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్యుల (చతుర్థి) రచనల సమగ్ర పరిశీలన. పుట.3). మరింగంటి కవులలో వేంకట నరసింహాచార్యులు అనే పేరుతో నలుగురు కవులు ఉన్నారు. వీరిలో వేంకట నరసింహాచార్యులు ప్రథములు. వీరు ‘విదేహరాజకన్యకాభ్యుదయం మొదలుకొని శ్రీకృష్ణతులాభారము వరకు మొత్తం 14 రచనలు చేశారు. లింగమÖర్తి గారు వేంకట నరసింహాచార్యుల రాసిన నృకంఠీరవాభ్యుదయం, శ్రీకృష్ణశతానందీయం, చిలువపడిగరేని పేరణం అనే మÖడు ప్రబంధ కావ్యాలపై వ్యాసాలు రాశారు.
1.1. నృకంఠీరవాభ్యుదయం:
‘నృకంఠీరవాభ్యుదయం’ పేరుతో ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్యులు (ప్రథములు) రచించిన ప్రబంధ కావ్యంపై కపిలవాయి లింగమÖర్తి 1990, జూన్లో నృసింహప్రియ పత్రికలో చక్కటి వ్యాసం రాశారు. ఇది నాలుగు ఆశ్వాసాల ప్రబంధం అని, ఇందులో 998 గద్య పద్యాలున్నట్లు కపిలవాయి పేర్కొన్నారు. నృకంఠీరవాభ్యుదయంలోని కథను భాగవతం (మÖల) కథతో సరిపోల్చుతూ విలువైన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారు.
నృకంఠీరవాభ్యుదయం మొదటి ఆశ్వాసంలోని కథ ఏమిటంటే-“జయ విజయులు అనేవారు శ్రీమహావిష్ణువు యొక్క వైకుంఠ ద్వారాన్ని రక్షిస్తుంటారు. ఒకరోజు శ్రీహరి దర్శనం కోసం సనాదులు వస్తారు. కాని ద్వారపాలుకులు ‘మీరు ఈ లోకంలో ఉండటానికి అర్హులు కారు. దనుజ యోనిలో పుట్టండి’ అని శపిస్తారు. అపుడు వారు దితిగర్భంలో హిరాణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మిస్తారు. పెరుగుతున్న క్రమంలో ఇద్దరు పెడుతున్న బాధలు తట్టుకోలేక భూదేవి శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకుంది. దాంతో శ్రీహరి వరాహరూపం ధరించి హిరణ్యాక్షుని వధిస్తాడు. అది చూసి హిరణ్యకశిపుడు మందరాద్రికి వెళ్లి బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేసి అజేయమైన వరాలు పొంది, ఇంటికెళ్లి జంభాసురుని కూతురును వివాహం చేసుకుంటాడు. వీరికి ఐదుగురు కుమారులు జన్మిస్తారు. అందులో ప్రహ్లాదుడు చిన్నవాడు. ఇతనికి 5వ ఏటనే హరి భక్తి ఒంటబడుతుంది.
ఒకరోజు తండ్రికి (హిరణ్యకశిపుడు) కుమారుని (ప్రహ్లాదుడు) భక్తి సరిపడకపోవడంతో ‘ఇతడు నా కొడుకు కాదు. ఇతన్ని వధించి శిక్ష విధించండి’ అని దానవులకు అప్పగిస్తాడు. కాని ప్రహ్లాదుడిని శిక్షించటం వారివల్ల కాలేకపోతుంది. దాంతో తండ్రి తనవద్ద ఉన్న కత్తిని తీసి కుమారుని శిరస్సును ఖండించే క్రమంలో ‘నీ హరిని ఈ కంబంలో చూపించగలవా’ అని ప్రశ్నిస్తాడు. దానికి ప్రహ్లాదుడు ‘హరి అంతటా వ్యాపించి ఉన్నాడు’ అంటూ సమాధానం చెప్తాడు. కోపంతో రగిలిపోయిన హిరణ్యకశిపుడు తన ఎడమ చేతితో కంబాన్ని చరుచుతాడు. అందరూ చూస్తుండగానే అతని కన్నులు చీకట్లు కమ్మి నృసింహుడుగా ఆవిర్భిస్తాడు. సభలోని దానవులంతా భయపడి నృసింహుడిపై బాణాలు సంధిస్తారు. దానికి నృసింహుడు తొమ్మిది రూపాలు ధరించి వారందరిని సంహరిస్తాడు. ఆ తరువాత హిరణ్యకశిపుని పట్టుకొని సభమంటపం గడపపై కూర్చొని అతని పొట్టను చీరి ప్రేగులను మెడలో వేసుకుంటాడు నృసింహుడు. అప్పుడు హిరణ్యకశిపుడి రక్తంలోంచి కాలుడు మÖషక రూపం ధరించి నేలను కత్తిరించుకొని పాతాళానికి వెళ్తాడు. నృసింహుడు అది గమనించి బిడాల రూపం ధరించి మÖషకుని తల పగులకొరుకుతాడు.
ఆ తరువాత సభలోని దానవులంతా శ్రీదేవి (నృసింహుడి భార్య) దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటారు. ఆమె బ్రహ్మ దగ్గరికి వెళ్లి విన్నవించుకుంటుంది. దానికి బ్రహ్మ ‘ఇదంతా నేను హిరణ్యకశిపుడికిచ్చిన వరం మÖలంగా జరిగింది. నృసింహుడిని శాంతింపజేయాలంటే శివుడే సమర్థుడు’ అని చెప్తాడు. చివరగా శివుడు నృసింహుడిని శాంతింపజేయడానికి వెళ్లి శరభసాళ్వ రూపం ధరించి నృసింహుడితో (గండభేరుండ రూపం) భీకర యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో శివుడు మరణిస్తాడు. ఆఖరికి ప్రహ్లాదుడు నృసింహుడికి దగ్గరికి వెళ్లి చేతులు జోడించి శివుడిని బతికించమని ప్రార్థిస్తాడు. దాంతో శివుని దేహాన్ని తన చేతితో నిమిరి శివుడిని బతికిస్తాడు. శివుడు శరభసాళువ రూపం విడిచి నృసింహుడిని స్తుతిస్తాడు.” ఇది మొదటి ఆశ్వాసంలోని కథ.
ఇక రెండవ ఆశ్వాసంలోని కథ విషయానికొస్తే- “యుద్ధాన్ని శాంతింపజేసిన ప్రహ్లాదునికి దైత్య దానవ రాజ్యానికి పట్టంకడతారు. నృసింహుని ఆజ్ఞ మేరకు బ్రహ్మ తన కుమార్తె దేవిని ప్రహ్లాదునికిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తరువాత నృసింహుడు వారిని దీవించి తమకు ఒక పట్టణం నిర్మించమని ప్రహ్లాదునికి చెప్తాడు. నృసింహుని ఆజ్ఞ మేరకు ప్రహ్లాదుడు ఒక పట్టణం నిర్మించి దానికి అహూబిలం అని పేరు పెడ్తాడు. ఆ తరువాత లక్ష్మీదేవితో కలిసి నృసింహుడు అహూబిలంలో నివసిస్తాడు.
అలా కొన్ని రోజులు గడిచిన తరువాత అక్కడికి కొంతమంది చెంచు వనితలు వన విహారానికి వస్తారు. అప్పుడు వారికి జలదేవత ప్రత్యక్షమై, ఒక బంగారు రంగు తామరలో ఉన్న బాలికను వారికి ఇస్తుంది. వారు ఆ బాలికను తీసుకెళ్లి గూడెం పెద్దమనిషికి అప్పగిస్తే ఆయన వాసంతి అనే పేరుపెట్టి విద్యలన్ని నేర్పిస్తాడు. ఒకరోజు రాత్రి నృసింహుడు ఆమె కలలో పలు రకాల రతులలో కన్పిస్తాడు. ఆ మరుసటి రోజు నృసింహుడు చెంచు కన్య వేటకు వెళ్లిన విషయం తెలుసుకొని లక్ష్మీదేవికి తెలియకుండా ఆ కన్యను కలుసుకునేందుకు వెళ్తాడు. మొదట్లో బెట్టు కనపరిచిన చివరికి నృసింహునితో స్నేహం చేస్తుంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఓ పొదరింటిలో గడుపుతారు. ఆ తరువాత దేవలోకం ఉన్న నారదుడికి ఈ విషయం తెలిసి చెంచు కన్యను, నృసింహున్ని దర్శిస్తాడు. ఈ విషయం లక్ష్మీదేవికి చెప్పి ఆమెను ఒప్పించమని నారదుడిని నృసింహుడు వేడుకుంటాడు. నారదుడు అహూబిలం వెళ్లి ‘నృసింహుడు చెంచు కన్యను నీకు సవితిగా తీసుకొస్తున్నాడు’ అంటూ లక్ష్మీదేవికి జరిగిన విషయం చెప్తాడు. ఆమె ఆగ్రహంతో రగిలిపోయి నృసింహుని, ఆ చెంచు కన్యను ద్వారంలోపలికి రానివ్వదు. చివరికి నారదుడు లక్ష్మీదేవికి నచ్చజెప్పి ఆమె సమక్షంలోనే నృసింహునికి చెంచుకన్యకు శాస్త్రీయంగా వివాహం జరిపిస్తాడు.”
ఈ రెండు ఆశ్వాసాల ద్వారా కపిలవాయి లింగమÖర్తి ఈ క్రింది అంశాలను వెలుగులోకి తెచ్చారు.
1. 1.1. మొదటి ఆశ్వాసంలో కవి హిరణ్యకశిపుడు జంభాసురుని కూతురిని వివాహం చేసుకున్నాడని రాశారు. కాని ఆమె పేరు చెప్పలేదు. ఆమెకు మÖడు పేర్లున్నాయి ‘దత్త, కయాధువు, లీలావతి’ అని తెలియజేశారు.
1.1.2. హిరణ్యకశిపుడు- లీలావతికి అయిదుగురు కుమారులు పుట్టారని కవి చెప్పారు. కాని భాగవతంలో వీరికి నలుగురే పుత్రులు పుట్టినట్లు ఉందని మÖల కథలోని అంశాన్ని ప్రస్తావించారు.
1.1.3. నృసింహుడు తొమ్మది రూపాలు ధరించి దానవులను సంహరించినాడు అని కవి చెప్పాడు. కాని ఆ తొమ్మది రూపాలు ఏవేవో చెప్పలేదు అనే అంశాన్ని గుర్తు చేశారు.
1.1.4. నృసింహుని ముప్పది రెండు రూపాలలో బిడాల రూపం కూడ ఒకటి. ఇపుడు ఇది మహబూబ్నగర్ జిల్లాలోని బెక్కెంలో మార్జాలముఖి దేవత ఉంది. ఇదే మహబూబ్నగర్లోని సింగపట్నంలో బెక్కెశ్వేరుడు రూపంలో బిడాల సింహరూపుడు ఉన్నాడు. ఇది నృసింహుని రూపమేనా? అనుకునే ఆస్కారం కూడా ఉంది అని కపిలవాయి వెల్లడించారు.
1.1.5. నృసింహుడు- లక్ష్మీదేవి నివసించిన ఆలయం అహూబిలంలో ఉందో లేదో తెలియదు కాని అమరాబాద్ లక్ష్మీపురంలో ఉందని, అక్కడ కూడా నవనారసింహ ప్రతిష్ట కూడా ఉందని లింగమÖర్తి ప్రస్తావించారు.
1.1.6. ఈ ప్రబంధ కావ్యంలో పురాణాన్ని, జానపదాన్ని రెండింటిని చక్కగా జోడించి మొదటి ఆశ్వాసంలో నృసింహుని ప్రాధాన్యాన్ని, రెsండవ ఆశ్వాసంలో లక్ష్మీదేవి ప్రాముఖ్యాన్ని నిరూపించారని లింగమÖర్తి కవి నిర్మించిన కథ నైపుణ్యాన్ని ప్రశంసించారు.
1.2. శ్రీకృష్ణశతానందీయం:
‘శ్రీకృష్ణశతానందీయం’ పేరుతో ఆసూరి వేంకట నరసింహాచార్యులు (ప్రథములు) చక్కటి ప్రబంధ కావ్యాన్ని రాశారు. ఇది మÖడు ఆశ్వాసాల ప్రబంధం. ఈ కావ్యంపై 1991, అక్టోబర్లో నృసింహప్రియ అనే పత్రికలో లింగమÖర్తి గారు భాగవతంలోని మÖల కథను ముందుగా ఉటంకించి ఆ తరువాత శ్రీకృష్ణశతానందీయంలోని కథపై చక్కటి విశ్లేషణ చేశారు. శ్రీకృష్ణుని లీలా మహత్త్వాలను తెలిపే వాటిలో ‘గోపబాల గోవత్సాపహరణం’ ఒకటి. ఇది భాగవతంలో దశమ స్కంధంలో 490 నుండి 590 గద్య పద్యాల్లో ఉందని లింగమÖర్తి వెల్లడించారు.
ముందుగా పోతన రాసిన భాగవతం 10వ స్కంధంలో ఉన్న మÖల కథను తెలుసుకుందాం- “శుకమహర్షి పరీక్షిత్తునికి శ్రీకృష్ణుని లీలలు చెబుతూ- శ్రీకృష్ణుని చేతిలో తన అన్న బకాసురుడు మరణించాడని అజగరాసురుడు (బకాసురిడి తమ్ముడు) శ్రీకృష్ణున్ని చంపడానికి వచ్చాడు. బలరాముడు, శ్రీకృష్ణుడు, గోపబాలురు ఆడుకునే చోటకు వచ్చి కొండ చిలువ రూపం ధరించి నోరు పెద్దగా తెరిచి ఉంచాడు. అది ఎవరు గమనించలేదు. కృష్ణుడు, గోపాలురు ఎవరూ దాన్ని చూడలేదు. పొరపాటున అందరూ అది కొండ గుహగా భావించి ఆ అజగరాసురుడు నోటిలోకి వెళ్ళిపోయారు. కొండ చిలువ నోరు మÖసింది. ఇదేదో రాక్షస మాయ అని శ్రీకృష్ణుడు నిజం తెలుసుకుని, ఆ క్షణమే దాని పొట్టను చీల్చుకుని బయటకు వచ్చేశాడు. వస్తూ వస్తూ తనతోపాటు గోపబాలురను కూడా బయటికి తీసుకొచ్చాడు.
ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ ‘అజగరాసురుడు మింగిన బాలురను శ్రీకృష్ణుడు ఎట్లా బతికించగలిగాడు, ఇది విచిత్రంగా ఉందే’ అని వెంటనే హంసవాహనంపై భూలోకానికి వచ్చాడు. ఈ లోపల శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి లేగలను (పశువులు) పచ్చిక బయలులో నిలిపి చల్దులారగించటం (భోజనం చేయటం) ప్రారంభించారు. అంతలోనే మేత మేస్తున్న లేగలు కనుచూపు మేర దాటిపోయాయి. అది గమనించిన శ్రీకృష్ణుడు పెరుగన్నం ముద్ద చేత పట్టుకొని లేగల కోసం బయలుదేరాడు. శ్రీకృష్ణుడిని చూసేందుకు వస్తున్న బ్రహ్మకు ఆ లేగలు ఎదురుపడతాయి. దాంతో శ్రీకృష్ణుని మహిమను పరిక్షిద్దామని బ్రహ్మ ఆ లేగలను ఒక కొండగుహలో దాచాడు. శ్రీకృష్ణుడు ఎంత వెతికిన లేగలు దొరకకపోవడంతో గోపబాలురున్న చోటికి వస్తాడు. కాని అక్కడ గోపబాలురు ఉండరు. బ్రహ్మ వారిని కూడా గుహలో దాస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దివ్వదృష్టితో చూచి, ఇది బ్రహ్మ చేసిన పనేనని తెలుసుకుంటాడు. చేసేదేమి లేక శ్రీకృష్ణుడే బాలుర రూపం, లేగల రూపం రెండు తానే ధరించి వారి వారి ఇండ్లలోకి, దొడ్లలోకి వెళ్లిపోతాడు. ఒక సంవత్సరం తరువాత బ్రహ్మ తన తప్పును తెలుసుకుని శ్రీకృష్ణునికి క్షమాపణలు చెప్పి, తాను బంధించిన లేగలను, గోపబాలురను వదిలేస్తాడు. పెరుగన్నం ముద్దతో వెళ్లిన శ్రీకృష్ణుడు తిరిగొచ్చి గోపబాలురతో కలిసి చద్దిని తిని, సాయంకాలానికి ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోతారు. అజగరాసురుడి నోటిలోంచి శ్రీకృష్ణుడు కాపాడిన తీరును గోపబాలుర్లు వాళ్ల తల్లిదండ్రులకు తెలియజేస్తారు.”
ఇపుడు ‘శ్రీకృష్ణశతానందీయం’లోని కథను పరిశీలిద్దాం- “మిథిలానగరంలో శుకమహర్షి జనక చక్రవర్తికి శ్రీకృష్ణుని లీలలు చెప్తూ- ఒకనాడు బ్రహ్మ నిండుసభలో కొలువుదీరి ఉండగా నారదుడు అక్కడికి వస్తాడు. అపుడు బ్రహ్మ లోకంలో జరుగుతున్న వింతల గురించి నారదుడిని అడుగుతాడు. నారదుడు ‘శూరసేన దేశంలో బకాసురుడిని చంపగా, వాని తమ్ముడు అఘుడు అజగర రూపం ధరించి దారికి అడ్డంగా నిలిచి, గోపబాలకులందరిని మ్రింగేసాడు. శ్రీకృష్ణుడు వాని పొట్టను చీల్చి ఆ బాలకులందరిని బయటికి తీసి బతికించినాడు’ అని చెప్తాడు. బ్రహ్మ తన అతఃపురంలో నారదుడు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తుండగా సరస్వతి వచ్చి ప్రశ్నిస్తుంది. నారదుడు చెప్పిన విషయాన్ని సరస్వతికి తెలియజేసి ‘నేను భూలోకానికి వెళ్లి ఆ బాలుడుని చూసి వస్తాను’ అంటాడు. అందుకు సరస్వతి తాను కూడా వస్తానంటుంది. స్త్రీలు పతుల వెంట ఎక్కడికి పడితే అక్కడికి రాకూడదంటూ వారించాడు” అని ప్రథమాశ్వాసంలో చెప్పబడింది.
ద్వితీయాశ్వాసంలో-“శ్రీకృష్ణుడు తనను బ్రహ్మ ఎలా అయితే వంచించాడో, తాను కూడా సరస్వతిని వంచించాలని తలిచి బ్రహ్మ రూపం ధరించి సత్యలోకంలో ఉన్న సరస్వతి వద్దకు వెళ్తాడు. అపుడామె భూలోకంలో ఏమేమి చూశారని బ్రహ్మను (బ్రహ్మ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడిని) అడుగుతుంది. దానికి ఆయన శ్రీకృష్ణుని గురించి వర్ణిస్తూ ‘భూలోకంలో అతడు అచ్చం నాలాగే నా రూపాన్నే ధరించి విహరిస్తున్నాడు. త్రాసులో పెట్టి చూచినా అతనికి నాకు ఎటువంటి భేదం కనిపించదు. కాబట్టి అతడు ఇక్కడికి వచ్చి మన మర్మాలన్ని చెప్పి నిన్ను మోసం చేయొచ్చు జాగ్రత్తగా ఉండు’ అని హెచ్చరిస్తాడు. దాంతో సరస్వతి జాంబవంతుని పిలిచి భూలోకం నుంచి ఎవరొచ్చిన లోపలికి రానివ్వొద్దు అని నిబంధన విధిస్తుంది” అని చెప్పబడింది.
ఇక మÖడవ ఆశ్వాసంలో- “భూలోకానికి వచ్చిన బ్రహ్మ శ్రీకృష్ణుని శక్తిని పరీక్షిద్దామని గోపగోవత్సాలను దాని సత్యలోకం వస్తాడు. కాని ద్వారపాలకులు అతనిని లోపలికి వెళ్లనివ్వరు. సరస్వతి తనపై ఉన్న కోపంతో అలిగి ఇలా నిబంధన విధించిందేమోనని లోపలికి వెళ్లేందుకు బ్రహ్మ ప్రయత్నిస్తాడు. కాని ద్వారపాలకులు అడ్డుపడి ‘ఇదివరకే మా బ్రహ్మ భూలోకం నుంచి మాయ రూపంతో ఒకరు వస్తారు. అతణ్ణి లోపలికి రానివ్వొద్దు అని చెప్పి సరస్వతితో కొలువుదీరాడు’ అని చెప్తారు. ఆ మాటతో బ్రహ్మ దిగులుపడి ద్వారపాలకులను ఒప్పించి లోపలికి వెళతాడు. సరస్వతి అతన్ని చూచి నివ్వెరపోతుంది. ఇద్దరిలో ఆమె పతి ఎవరో తెలుసుకునేందుకు హజారానికి పిలుపిస్తుంది. ఆ సభలో సరస్వతి ‘ఒక మగవానికి అనేక పత్నులు ఉండవచ్చు గాని ఒక పత్నికి అనేకులైన పతులేంటి’ అని నివ్వెరపోయి మనసులో జనార్ధనుని పాదాలను స్మరించుకుంటుంది. అప్పుడు మాయ (బ్రహ్మ) రూపంలో శ్రీకృష్ణుడు ఆమె భక్తిని మెచ్చి నిజ బ్రహ్మను ఆమె ముందు నిలుపుతాడు. కాసేటికి యమునా తీరంలో లేగలను వెదుకుతున్న శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. బ్రహ్మకు విషయమంత అర్థమయ్యి శ్రీకృష్ణుడు చేసిన మాయ గురించి సరస్వతికి వివరిస్తాడు. చివరికి బ్రహ్మ తాను చేసిన తప్పును తెలుసుకొని శ్రీకృష్ణుడిని క్షమించమని వేడుకుంటాడు. శ్రీకృష్ణుడు సరస్వతికి నచ్చజెప్పి పాతివ్రత్య ధర్మాన్ని బోధిస్తాడు.” అని కపిలవాయి లింగమÖర్తి భాగవతంలో ఉన్న మÖల కథతో ‘శ్రీకృష్ణశతానందీయం’లో ఉన్న కథను సరిపోల్చుతూ ఈ క్రింది అంశాలను చర్చించారు.
1.2.1. పోతన రాసిన భాగవతంలో శుకమహర్షి పరీక్షిత్తునికి శ్రీకృష్ణుని లీలలు చెబితే, శ్రీకృష్ణశతానందీయంలో శుకమహర్షి జనక చక్రవర్తికి చెప్పాడు అనే విషయాన్ని లింగమÖర్తి గుర్తు చేశారు.
1.2.2. వెంకట నరసింహాచార్యులు వటబీజమంత ఆధారాన్ని తీసుకుని వట వృక్షమంత కథగా మలిచారని ప్రశంసించారు.
1.2.3. కథ నిర్మాణం రాను రాను నాటకంలోని నిర్వహణ సంధివలె అద్భుతమైన సన్నివేశాలతో పాఠకులను ఓీVA అనిపిస్తుందని పేర్కొన్నారు.
1.2.4. ఈ కథ ఇతివృత్తాన్ని వెలుపలికి తీసుకొచ్చి స్వతంత్ర ప్రబంధంగా మలిచిన ప్రథములు మరిగంటి కవులేనని లింగమÖర్తి వెల్లడించారు.
1.2.5. పోతన రాసిన భాగవతంలో ఈ కథ ప్రస్తకి రాలేదని శ్రీ విక్రాల శేషాచార్యులవారు (భారతి 1975, మార్చ్) చెప్పిన విషయాన్ని లింగమÖర్తి గుర్తు చేశారు.
1.2.6. ఇంతటి మనోహరమైన కథభాగం పోయిందేనని పాఠకులు ఖేదిల్లకుండా సంస్కృతం భాగవతంలోని ఏకశ్లోకాత్మకమైన ఈ కథను స్వీకరించి మరిగంటి వేంకట నరసింహాచార్యులు (ద్వితీయ) అందమైన కల్పనలు జోడించి 550 గద్య పద్యాలలో మÖడు ఆశ్వాసాల ప్రబంధంగా తీర్చిదిద్దాడు అని లింగమÖర్తి కొనియాడారు.
1.3. చిలువపడిగె ఱేని పేరణము:
మొదటి వేంకట నరసింహాచార్యులు రచించిన ప్రబంధాలలో ‘చిలువపడిగె ఱేని పేరణం’ అనే ప్రబంధం అచ్చ తెనుగు కావ్యము. ఈ ప్రబంధ కావ్యానికి ‘చిలువపడిగె ఱేని పేరణం, చిలువపడి గెరాఱేని చరిత్రం’ అనే పేర్లున్నట్లు కపిలవాయి లింగమÖర్తి 1996, ఆగస్ట్‌లో తెలుగు పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. చిలువపడిగె అంటే- సర్భధ్వజం అని, అది కలవాడు దుర్యోధనుడు అని, రాఱేడు అతని వివాహ కథ అని రాసుకొచ్చారు.
చిలువపడిగె ఱేని పేరణము మÖడు ఆశ్వాసాల ప్రబంధం. ఇందులో 1140 గద్యపద్యాలున్నాయి. ఈ కావ్యాన్ని వేంకట నరసింహాచార్యులు పన్నెండు రోజుల్లో పూర్తి చేశారని లింగమÖర్తి తెలియజేశారు. చిలువపడిగె ఱేని పేరణం అచ్చ తెనుగుకృతి అని, ఈ కృతులు రాసేవారు నామవాచకాలను అనువదించడానికి పూనుకోలేదనే విషయాన్ని గుర్తు చేస్తూ- వేంకట నరసింహాచార్యులు అనువాదంలో విచిత్రమైన ప్రయోగాలు చేశారని లింగమÖర్తి వివరించారు.
ఇక ఈ కావ్యంలోని కథ విషయానికొస్తే- “కళింగదేశంరాజు చిత్రాంగునికి శుభాంగి అనే కుమార్తె ఉంటుంది. ఆమెకు పెళ్లి చేయాలని, తగిన వరుడిని వెదకటానికి బ్రాహ్మణులను పంపిస్తాడు. వారు హస్తినాపురం చేరి దుర్యోధనునికి ఆమె సౌందర్యం గురించి చెప్తారు. దాంతో కర్ణుని వెంటబెట్టుకొని కళింగపట్టణానికి వస్తాడు దుర్యోధనుడు. ఒక తోటలో వన విహారానికి వచ్చినపుడు దుర్యోధనుని చూసి వలపులో పడుతుంది శుభాంగి. ఆ తరువాత రాజు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఆ స్వయంవరానికి శిశుపాల జరాసంధాదులు కూడా వస్తారు. దుర్యోధనుడు శుభాంగిని పెళ్లి చేసుకుని రథంపై తీసుకెళ్తుండగా జరాసంధుడు అడ్డుపడి శుభాంగి తనను వరించలేదంటూ యుద్ధానికి సిద్ధపడతాడు. అపుడు దుర్యోధనుని అనుమతితో కర్ణుడు అతని ఓడిస్తాడు. ఆ తరువాత దుర్యోధనునికి శుభాంగికి లక్ష్మణ కుమారుడు కలుగుతాడు.” పుత్రోత్సవంతో ఈ కథ ముగుస్తుంది అని తెలియజేస్తూ లింగమÖర్తి ఈ క్రింది విషయాలను లేవనెత్తారు.
1.3.1. మÖల కథలో- శుభాంగి స్వయంవర మంటపంలో దుర్యోధనుని దాటి వెళుతుండగా అతడామెను బలవంతంగా పట్టుకొని రథంపై పెట్టుకుంటాడు. ఆ తరువాత శిశుపాలజరాసంధులు తలపడతారు. కాని కవి తన కావ్యంలో రసాభాసం కాకుండా కొంచెం మార్చి శుభాంగితో దుర్యోధనుని మెడలో వరమాల వేయించి కథను ముగించాడు అని తెలియజేశారు.
1.3.2. ఈ కావ్యం అచ్చతెనుగైనా కవి చేసిన ప్రయోగాలు తత్సమ మిశ్రసమాసలే ఎక్కువగా వాడారని పేర్కొన్నారు.
1.3.4. కవి తీసుకున్న ఇతివృత్తాలన్నీ కావ్యాలకు ఎక్కలేదని తెలియజేస్తూ.. తన కావ్యాలకు పేర్లు పెట్టడంలో కొత్త పంథాను అవలంభించాడని కపిలవాయి రాసుకొచ్చారు.
1.3.5. ఈ కావ్యంలో కవి ప్రయోగించిన కొన్ని విచిత్రమైన ప్రయోగాలను కపిలవాయి నిఘంటువు రూపంలో అర్థాలు చెప్పారు. మచ్చుకు కొన్నింటిని ఈ క్రింద ప్రస్తావిస్తున్నాను.
1. అత్తిరాఱేనిపేరుగల వీడు = హస్తినాపురము 2. అఱ్ఱుదిరుగని మెకము = వరాహము
3. కడలివొడము బిడ్డ = లక్ష్మీదేవి, చంద్రుడు 4. గంగకుఱుడు = భీష్ముడు
5. చలువలఱేని కొమరుడు = బుధుడు 6. జక్కులఱే కొమరుడు = నలకూబరుడు
ముగింపు:
తెలుగు (తెలంగాణ) సాహిత్యానికి విశేషమైన కృషి చేసి, వెలకట్టలేని పుస్తకాలు వెలువరించిన రచయితల్లో కపిలవాయి లింగమÖర్తి ఒకరు. వీరు ముద్రితం కాని ఎన్నో ప్రతులను సేకరించి వివిధ దిన, వార పత్రికల్లో అద్భుతమైన వ్యాసాలు రాశారు. 16వ శతాబ్దానికి చెందిన మరింగంటి కవుల విశిష్టతను, వారు రాసిన ప్రబంధ కావ్యాల్లోని కథలను చక్కగా విశ్లేషించారు. ముద్రణకు నోచుకొని అనేక విషయాలను చర్చకు తీసుకువచ్చి, మరుగునపడిన తెలంగాణ సాహిత్య చరిత్రకు జీవం పోశారు. మÖల కథలను ఉటంకిస్తూ మరింగంటి కవుల కావ్యాల్లోని ఎన్నో అంశాలను వెలికితీశారు. కపిలవాయి రాసిన ఈ వ్యాసాలు తెలంగాణ సాహిత్య చరిత్ర సత్తాకు సాక్ష్యాధారాలు. ఈ వ్యాసాలను పరిశోధనకు స్వీకరించి మరిన్ని విషయాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కపిలవాయి లింగమÖర్తిలాగా తెలంగాణలో ఉన్న కవులు, రచయితలు, పరిశోధకులు లోతైన పరిశోధనలు చేసి మరుగునపడిన తెలంగాణ సాహిత్య చరిత్రను వెలుగులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పదేళ్ళక్రితం శ్రీరంగాచార్యగారు ముద్రితం కాని ప్రతులను సేకరించి కపిలవాయి లింగమÖర్తికి ఇచ్చారట. అపుడా కృతులలో వీరికి నచ్చిన కథాసంవిధానాలు, పదప్రయోగాలను నోటుచేసుకున్నారట. ఇటీవల వ్రాత చిత్తులో బయటపడగా ఈనాటి పరిశోధకులకు ఇవి ఉపయోగపడతాయన్న దృష్టితో పుస్తకంగా వెలురించేందుకు ప్రయత్నించారని లింగమÖర్తి గారే స్వయంగా వెల్లడించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి