అసలైన మానవ ధర్మం అంటే ఏమిటన్నది చాలా మందికి అంతుచిక్కని ప్రశ్న. ఎవరైనా అడగ్గానే వెంటనే సమాధానం చెప్పడానికి ఇది అంత సులువైన ప్రశ్న ఏమాత్రం కాదు. చక్కగా వివరించి చెప్పటానికి వీలుపడని అతి గంభీరమైన ప్రశ్న ఇది.
ధర్మం అనే విలక్షణ మైన శబ్దానికి ఎంతో లోతైన అర్దం వుంది. చాలా సముద్రమంత సంక్లిష్టత కూడా ఉంది. ఈ మాటకు చాలా లోతైన నిగూఢత ఉంది. ఆకాశమంత అంతులేని విశాలత ఉంది. దేవుడి యొక్క అనంత స్వరూపమే ధర్మమని చెప్పవచ్చు. మానవ ధర్మాలన్నియు సాక్షాత్ పరమాత్ముని నుండి లభించాయని విజ్ఞులు చెబుతారు.
మనిషి ఎండ, వాన, చలి వంటి వాటి నుండి తన్ను తాను రక్షించుకోవడానికి బట్టలని వెసుకుంటాడు. అలాగే ఈ ధర్మం కూడా మనం ధరించే వస్త్రం లాంటిదే! మనిషి దీన్ని ధరిస్తున్నాడు కాబట్టి ధర్మము మనిషి ధరించునదిగా చెప్పబడుతుంది. ధర్మము ఎండకు కందిపోదు. వానకు తడిసి పోదు. చలికి వణికి పోదు. వేడికి ఉడికిపోదు. అది నిత్యసత్యమై ఉంటూ దేశకాల పరిస్తితులని బట్టి , వివిధ ప్రదేశాల ననుసరించి కాలానుగుణంగా మార్పు చెందు తుంటుంది.
ధర్మ మంటే ఒక విశిష్ట విధానం. ఒక శాసనం. అదొక ఉన్నత మానవతా సంస్క్రుతి, మనిషి ఏం చేయకూడదో చెబుతుంది. అలాగే ఏం చేయాలో కూడా తెలియ చెబుతుంది. మనిషి మనిషికీ అది రూప బేదాల్లో మారినా మూల సూత్రం మాత్రం అందరికీ ఒకటిగానే ఉంటుంది.
తన సుఖాలని అందరికీ పంచాలి .... దు:ఖాలని మాత్రం అందరివీ పంచుకోవాలి...సినిమా చక్కగా ఆడాలంటే పదునైన కథ కావలసిందే అలాగే...మనిషి జీవితం విజయవంతం కావడానికి, జీవనం సాఫీగా సజావుగా నడవడానికి ధర్మమనే సాధనం తప్పక కావాలి.
మనం మొదలుపెట్టిన ఏదైనా ప్రాయోజిత పనికి మధ్యలో ఏవైనా అడ్డంకులు ఎదురుపడితే బెదరి పోకుండా నేర్పుగా వాటిని మెల్లిగా తొలగించుకుంటూ ముందుకు వెళ్ళడమే బుద్ది జీవుల పని. నడిచే మార్గంలో అడ్డంకులు కలిగితే నిరాశ చెంది వెనుదిరగలేము కదా! ఏదైనా ఉపాయం ఆలోచించి ఆ అడ్డంకులని ఆత్మబలంతో, అకుంటిత దీక్షతో ఎదుర్కొని మనసు చెడకుండా ముందుకి సాగిపోవాలన్నదే తెలివైన మానవీయ ధర్మం.
తలపెట్టిన పనేదయినా సంపూర్తిగా నెరవేరాలంటే ప్రతి మనిషికి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు మరియు క్షమాగుణం అనేవి తప్పని సరి. ఊరికే కోపగించుకోవడం, ఇతరులపై కసురుకోవడం, మాటిమాటికీ విసుక్కోవడం, అసహనాన్ని ప్రదర్షించడం వంటి రాక్షస గుణాలని శక్తివంతంగా ఎదుర్కోనాలి.
తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్న ధర్మ సూత్రాన్ని విస్మరించరాదు. కోపాన్ని జయించి ప్రేమని పంచ గలిగితే ఎలాంటి వారినయినా జయించవచ్చు. వివేకంతో - సమయస్పూర్తిగా ఆలోచిస్తే అన్ని సమస్యల్ని సునాయాసంగా అధిగమించవచ్చు. కోపం అనేది మనిషి ఆరోగ్యాన్ని, మనసును చెడ గొడుతుంది. బంగారు భవిష్యత్తును ఛిన్నభిన్నం చేస్తుంది. కోపం ఎదుటివారిని మరియు ఆత్మీయుల్ని దూరం చేస్తుంది. చివరకు వంటరి తనాన్ని మిగిలిస్తుంది.
మనం ఎంచుకునే లక్ష్యం ఎంత ప్రయోజన కరంగా ఉంటుందో , ఆ పని పైన మనం చూపించే శ్రద్ద అంత ఖచ్చితంగా ఉండాలి. చేసే పనీ మీదే మన మనస్సు సంపూర్ణంగా లగ్నం కావాలి. ఒక పనిచేస్తూ మరొక పని గురించి ఆలోచించకూడదు. ఒక పని ముగిసాక మరో పనికి వెళ్ళాలి.
తనకు తెలియని విషయాలను తాను పూర్తిగా తెలిసికొనక, పెద్దలు,
చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం సరిగ్గా తీసికోనలేక,
నిస్తేజంగా నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా,
నియమరాహితుడుగా, ఉండకూడదు.
మనిషి ఎల్లపుడూ మనస్సునూ, శరీరాన్నీ, మాటనూ
ఆలోచననూ, సంసారన్నీ, ఇంటినీ, పరిసరాన్నీ, ధరించే
వస్త్రాలనూ పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. మనసు, మనిషి పరిశుభ్రంగా ఉండాలి.
చదువున్నా, సంస్కారమున్నా, సంపదలున్నా, కీర్తివున్నా, బలంవున్నా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. మనస్సును దాని ఇష్టానికి దాని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. మనస్సును గెలిచినవాడు ఎవరినైనా గెలుస్తాడు. మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయడమే ధర్మం. ప్రతి విషయానికీ సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం కూడదు
మనిషి సత్యవ్రతం పాటించాలి. అకారణంగా, అనవసరంగా, ఒకరి మెప్పుకోసం, ఒకరిని మెప్పించటంకోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం. తనవారిని తృప్తిపెట్టట్టంకోసం అసత్యాలు చెప్పకూడదు. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరో అబద్దానికి దారితీస్తుంది. అవమానం పాలు చేస్తుంది. మనిషి విలువను తగ్గిస్తుంది. మన శక్తినీ, మనకీర్తినీ, మన గోప్పదనాన్నీ పాతాళానికి త్రోక్కివేస్తుంది. సత్యధర్మాన్ని ఏనాటికీ వదలకూడదు.
మనిషికి తిండి ఎంత ముఖ్యమో, వివేకం కూడ అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి లోకవిద్య కావాలి.
‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవిత గడపకూడదు. స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా, అడుక్కునైనా చదువుకోవాలి అని ఋషివాక్యం. విద్య అనేది ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని పతనావస్థకు చేరువచేస్తాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. తనను కన్నవారికీ, తాను జన్మనిచ్చిన వారికీ, తనను నమ్మి బ్రతికేవారికీ తీవ్ర అన్యాయం కల్గుతుంది. అకారణంగా తోటి ప్రాణుల్ని హింసించట, ఆహారం మేత మేస్తున్న ప్రాణుల్ని, నీరు త్రాగుతున్న ప్రాణుల్ని, ఆడమగ కలుస్తున్న జంటల్ని హింసించటం, భయపెట్టటం, రాళ్ళతో కర్రతో హింసించతం, తన దారిన తాను వెళుతున్న ప్రాణుల్ని భయపెట్టి పరుగెత్తించటం ధర్మం కాదు.
సామాన్య ధర్మాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. సామాన్య ధర్మాల గురించి ఏ శాస్త్రాలు చెప్పవు. విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం గురుధర్మం! భయభక్తులతో విద్యను నేర్చుకోవటం శిష్యధర్మం! న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించటం యజమాని ధర్మం! భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్నీ నడపటం ధర్మం! సైనికుడుగా వుండి దేశాన్ని ప్రజలను కాపాడటం సైనిక ధర్మం! వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించటం పుత్రధర్మం! తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయటం తండ్రి ధర్మం! తన ఇంటికీ, తనను కున్నవారికీ పేరు ప్రతిష్ఠలు తేవటం బిడ్డలందరి ధర్మం! తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించటం ప్రతివాని ధర్మం! తాను సంపాదించినదాన్ని తనవారితో పంచుకొని తినటం సంసార ధర్మం!అసహాయులను కాపాడటం మానవతా ధర్మం! చెప్పిన మాటను నిలుపుకోవటం సత్య ధర్మం!ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా వుండటం వివాహ ధర్మం తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడుకాకున్నా, నమ్మివుండటం భార్య ధర్మం! నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండటం మిత్ర ధర్మం! సోమరితనం లేకుండటం పురుష ధర్మం!
‘ధర్మం చేయండి’ అని యాచించటంలో ఒక ధార్మిక విషయం దాగి ఉంది. మనిషి సంఘజీవి. సంఘశ్రేయస్సే మనిషికి శ్రేయస్సు! సంఘ సుఖమే మనిషికి సుఖం! సంఘం ఆరోగ్యంగా వుంటేనే మన ఆరోగ్యంగా ఉంటాం! ధర్మాన్ని చేయమని చెప్పి యాచించటం ఎందుకంటే మనిషి సంఘజీవి కాబట్టి మనకు ఉన్నదాన్ని ఎంతో కోంత లేనివారికి దానం చేయటం సామాజిక ధర్మంగా పూర్వ కాలం నునీ మన ఆచారంగా వస్తోంది. బహుజన సుఖం, బహుజనహితం భారతీయ ధర్మంగా అనాదికాలంనుండి ఋషులు మనకు బోధించారు.
నీవద్ద ఉన్నదాన్ని నీవొక్కడవే తినటం ధర్మంకాదు. నీవు నివసిస్తున్న సమాజంతో సమానంగా పంచుకోవాలి. ఆహారం అందరికీ అందాలి. ఏ ఒక్కరూ పస్తులతో ఉండకూడదు. సమాజంలో ఆకలి బాధలు, ఆకలిచావులు ఉంటే అరాచకత పుడుతుంది. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు తయారై సమాజాన్ని కలుషితం చేస్తాయి.
ఆర్యులు ‘అతిథి దేవోభవ’ అని చెప్పారు. అందువల్ల ‘దానం చేయటం కూడా ఒక ధర్మం. ఆకలిబాధ ఎంతటి దుర్మార్గాన్ని అయినా చేయిస్తుంది. తనకు తోచినంతలో శక్తి మేర ఎంతో కొంత తోటివాడికి సాయం చేయటం మానవ కనీస ధర్మం. మనిషికి ఏం లేకపోయినా పర్వాలేదు. ఆకలిబాధ ఉండకూడదు.
“స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం
న్యాయ్యేవ మార్గేణ మహిం మహీశాః
గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు
నిత్యం లోకాః సమస్తాః సుఖినోభవంతు
అపుత్రాః పుత్రిణః పంతు
పుత్రిణ స్సంతుపౌత్రిణః
లోకావుయం క్షోభారహితః
అధనాః సాధనాః సంతు
జీవస్తు శరీదశ్శతమ్
“పాలకులు ప్రజలను న్యాయమార్గమున ధర్మబద్ధంగా పరిపాలించుగాక! గోసంతతికి పండితులకు శుభం కలుగుగాక! సంతతి లేనివారికి సంతతి కల్గుగాక! సంతతి వున్నవారికి మానుమ సంతతి కల్గుగాక! ప్రపంచం శాంతితో నిండియుండుగాక! దరిద్రులు ధనమూ పొందుదురుగాక! అందరూ ఏ ఆపదలు కల్గియుండక నూరు సంవత్సరాలు జీవించుదురు గాక!” అని చెబుతుంది వేదం.
పూర్వకాలం ‘దానధర్మం’ ఒక ప్రధాన కర్తవ్యంగా ఉండేది. బ్రాహ్మణ వర్ణం వారికి ఇల్లు తప్ప, స్థిరాస్థులు ఉండేవికాదు. విద్యార్జన చేయటం సమాజానికి హితాన్ని బోధించటం, ప్రజలకు విద్య బోధించటం వారి పని. బ్రాహ్మణ బ్రహ్మచారులు ఇంటింటికీ భిక్షమెత్తుకొని వచ్చి గురువుకి సమర్పించేవారు. ఆలా యాచకం చేస్తూ చదువుకోవాలి. విద్య నేర్పుతున్నందుకు గురువు ఏ విధమైన ప్రతిఫలం ఆశించటం తప్పుగా ఉండేది. అప్పటి ఆ కాలంలో ఆయుర్వేద వైద్యం అందరికీ ఉచితంగా అందుతుండేది. బ్రాహ్మణులే ఈ పనిని చేస్తూ ఉండాలి. విద్య, వైద్యం, జ్ఞానం ఎవరూ అమ్మకూడదు. ఎవరూ కొనకూడదు. పొరపాటు జరిగితే శిక్షకు గురికావలసిందే!బౌద్ధమత ప్రచారకులు “దానధర్మం”తో జీవిస్తూ ధర్మప్రచారం చేస్తున్నారు.
“ధర్మం శరణం గచ్ఛామి !
సంఘం శరణం గచ్ఛామి!
బుద్ధం శరణం గచ్ఛామి!”
ధర్మాన్ని శరణు పొందుతున్నాను! సంఘాన్ని శరణు పొందుతున్నాను.బుద్ధుని (జ్ఞానాన్ని) శరణు పొందుతున్నాను. అంటూ ‘ధర్మయానం’ చేస్తుంటారు. ‘ధర్మోరక్షతి రక్షితః’ “ధర్మాన్ని నీవు రక్షించితే ధర్మం నిన్ను సర్వదా రక్షిస్తూ వుంటుంది.” నీవు ఎపుడు ధర్మాన్ని నిర్లక్షం చేస్తావో ధర్మం నిన్నేపుడూ రక్షించదు.”
వింటే భారతమే వినాలి.... నమ్మితే ధర్మాన్నే నమ్మాలి – విధిగా అందరమూ ధర్మాన్నే నియమంగా ఆచరించాలి.సర్వ కాలావస్తలయందు ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించాలి – ఏ కాలమైనా సరే ధర్మమార్గాననే నడవాలి. పూజనీయమైన ధర్మాన్ని గౌరవించాలి.
రాముడు ప్రభుధర్మం కోసమే సీతా పరిత్యాగం చేసాడు. పాండవులు ధర్మ మార్గాన నడవటం వల్లనే యుధిష్ఠిరుని సారధ్యంలో విజయం వారిని వరించింది. పాండవులు ధర్మపరాయణులు కాబట్టే కృష్ణుడు వారి పక్షాన నిలిచి వారికి సహకరించాడు.
అధర్మపరులను అధర్మంతో ఎదుర్కొనవచ్చు. ధర్మపరులను అధర్మంతో దెబ్బతీయకూడదు. ఋతుధర్మంవల్లనే వర్షాలు వస్తున్నాయి. చెట్లు పండ్లు ఫలాలను ఇస్తున్నాయి. కాలధర్మం వల్లనే మనిషి మరణిస్తున్నాడు. సంయోగ ధర్మంవల్లనే మళ్ళీ జన్మిస్తున్నాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి