మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

22, అక్టోబర్ 2026, గురువారం

చిన్నకోడలు (1952) మల్లాది పాటలు......

మల్లాది రామకృష్ణశాస్తి గురించి నాకు (వి.ఎ.కె.రంగారావు) స్పష్టంగా తెలిసింది “చిన్నకోడలు” (1952) తోనే. సినిమా అంతంత మాత్రమే కాని పాటలు భలేగా వున్నవి. మా బాగా నచ్చాయి. అప్పటికి నా (వి.ఎ.కె.రంగారావు) వయసు పదమÖడే అయినా పుట్టినప్పటి నుంచి గ్రామఫోనూ, రికార్డులూ నేస్తాలు గనుక అంతకు ముందటి పాటలకూ వీటికీ ఏదో తెలియని తేడా కనిపించింది. దాంతో ఆగలేదు, ‘సై’ అనిపించింది.

అప్పటికే నాకు కొన్ని సినిమా పాటలంటే మహా యిష్టం. రచయితల పేర్లూ, సంగీత దర్శకుల వివరాలూ తెలియవు. చదవ వచ్చినా అన్ని రికార్డులపై వారి పేర్లుండేవి కావు. “భూకైలాస”(1940)లో మండోదరిగా కన్నడ కౌముది లక్క్ష్మీబాయి వెలిగించిన ‘సుమడోలి’, మాండ్ రాగానికి ముగ్ధ మోహనరూపం “దేవత” (1941)లో టంగుటూరి సూర్యకుమారి ‘వెండికంచాలలో’ పాట (అందులో మాటలు యిప్పటికీ కంఠోపాటమే!). ఎవరు చూడని “విశ్వమోహిని”(1940)లో బెజవాడ రాజరత్నం అలరులు కురిసేలా పాడిన ‘ఈ పూపొదరింట’ అంటే తగని మక్కువ. ఆ మాటలర్థమయి కాదు, వాటిలో తూగు, వరసలో, వాద్యగోష్ఠిలో ఒక విధమైన మంత్రం... వీటికి. వయసూ, బుద్ధీ పెరిగినాక, ఆ సాహిత్యంలో వున్న స్వారస్యం బోధపడ్డాక, ఆ సంగీతంలోని మెలకువలు తెలిసిన తరువాత వాటిపై అభిలాష, అనురాగం పెరిగాయే గాని తరగలేదు.

వీటితో sTÖ మాత్రం పరిచయం వుండబట్టే “చిన్నకోడలు” పాటలు అలా నెత్తికెక్కాయి. మల్లాది కథలు అంతకు ముందే చదివి వుంటాను కానీ 1960లలోనే అవంటే ఒక గురి ఏర్పడింది. ఆంధ్రపత్రికలో నా శీర్షికకు ‘సరాగమాల’ అని నామకరణం చేసింది వారే. వారున్నంత కాలం వారు పెట్టినపేర్లే నాకు ఆశీర్వాదాలు, జ్యోతి మాసపత్రికలో ‘మానసోల్లాసమ’, నా ప్రచురణలకు ‘ఆనందమోహన కావ్యమాల’. వారు గోలోక ప్రాప్తి చెందిన తరువాత వారి కథలపేర్లే మకుటాలుగా తలపెట్టాను, ‘శివరంజని’, ‘ఆనందలహరి’, ‘హంసధ్వని’ ‘డుమువులు’ యిత్యాది.

‘సరాగమాల’ ప్రారంభానికి కారకులూ, మల్లాదివారిని పరిచయం చేసిందీ బాపు, ముళ్లపూడి వెంకటరమణ. ఆ రోజుల్లో వారి కథల పుస్తకమొకటి చదవమని నాకిచ్చారు  ‘కాముని పున్నమి’ అనుకుంటాను. చదివి ‘అదోలా వున్న’ వంటే నా జ్ఞానాన్ని పరిగణించి నవ్వుకొన్నారు వారిద్దరు.

ఆ సమయంలో ఒక ఉగాదికి రెండు వారపత్రికలలోను (ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక) వారి కథలు పడ్డాయి, ‘గంగాలహరి’, ‘ఏలేలో’ కాబోలు. పదిపంక్తుల వారి పాటలలో నాకు పుప్పొడీ మకరందం రుచులు మాత్రం తెలిస్తే ఆ కథలలో నా చదువుల పొలిమేరల్లో ఎక్కడా కనబడని వసంతం కనిపించింది. ఏదో తెలియని మోహానిలం వీచింది. మళ్లీ మళ్లీ చదివితే వాటిలో నా చేతికందీ అందని  మిఠాయిపొట్లాలేవో ఉన్నవని తెలిసింది.

శాస్తిగారు మొదటి రోజుల్లో వ్రాసిన కథలు ‘ప్రైవేట్ జోక్స’ లాంటివి. అందరికీ ఒక పట్టాన, ఒక విధంగా అర్థం కావు. ఒకటో రెండో, ‘దోదమ్మి’ లాంటివి నాబోంట్ల ఊహకందనివి, శీర్షిక అర్థంతోసహా. ‘దోదుమ్మి’ అంటే ఆయుధ విశేషమని శబ్దరత్నాకరం. ప్రయోజనం సాధించిన తరువాత ప్రయోక్త చేతికి తిరిగి వచ్చే ఆస్ట్రేలియా వాసుల ‘బూమెరాంగ’ లాంటిదని ఆరుద్ర నాతో అన్నారు.

ఇలాంటివి వ్రాసినవారికీ, ఆ ఫాయాలో ఉన్నవారికే ఆనందం కలిగిస్తాయి. వారి చివరి కథలు అందరినీ, అంటే రసానికి స్పందించగల స్తోమత ఉన్న వారందరినీ, రంజిస్తాయి.

అలాంటి కథ — పేరూ ఊరూ నన్నడక్కండి — దేవాలయంలో నివసిస్తున్న ఒక సుందరుడైన యతి, యువకుడు. మంచి వయసులో ఉన్న రూపాజీవ ఆయన్ను కన్నారా చూసి, సమీపించి ‘స్వామీ! పుత్రభిక్ష!’ అని అడుగుతుంది. ఆ యతి ‘అమ్మా’! అంటాడు. ‘ధన్యురాలను స్వామీ! అడిగిన తక్షణం నా కోరిక తీర్చా’రని ప్రణమిల్లుతుందా వారాంగన. ఏదో వూహించుకొన్న చదువరిని ఎంతో ఎత్తుకి తీసుకువెళ్తుందా ముగింపు.

ఆయన కథల్లో ఉన్న వారాంగనలందరూ దివ్యులు కాకపోయినా భవ్యులు. మనుషులకి మంచి తలపెట్టేవారు.

ఒక పెద్దమనిషి నా స్నేహితునితో అన్నాడట ‘ఏమిటీ sTÖ రంగారావు ఆయన్ను తలకెత్తుకొంటాడు! ఆయన సానివాడలో తిరిగేవాడని తెలుసా?’ అని.

ఒక సానివాడలో (ఆ రోజుల్లో వీథుల విభజన కులాలవారీగా వుండేది మరి) ఒక సానింటికి వెళ్లి, హార్మోనియం ముందు పెట్టుకొని ఆమె దగ్గర జావళీలు నేర్చారనీ నాకు తెలుసు. అంతేకాదు ‘ఆ బొడ్డ్డు కోసిన కొడవలి’, ఆనాడు ఆయన వ్రాసుకొన్న చిన్నపుస్తకం నా దగ్గరున్నది. (ఈ పెన్నిధిని నాకిచ్చినది వారి ప్రథమ పుత్రులు శ్రీనరసింహశాస్తిగారు  శాస్తిగారి సంతానంలో ప్రతి ఒక్కరికి ఋణపడి వుండటం నా భాగ్యం).

జావళీలు నేర్చుకొనడంతో ఆగిందా అని అడిగే కౌతుక దేహాలకు నా సమాధానం: నాకు తెలియదు. వారిని నేనడిగే ప్రశ్న  కామశాస్తంలో మండనమిశ్రునితో జరుగుతున్న వాదంలో గెలవటానికని ఒక రాజు మృతశరీరంలో పరకాయ ప్రవేశం చేసి, అతని రాణితో సుఖించి, ఆ జ్ఞానంతో గెలిచిన శంకరాచార్యుల సంగతి నాకు తెలుసు. ఆ వాసన వారికంటినదా?

సాహిత్య లోకంలో ఒక పెద్దకుర్చీ ‘ఒక కథలో మనవడిని సానిదానితో సాంగత్యం పెట్టుకొమ్మని ఫ్రోత్సహిస్తాడు తాత!’ అది బహిరంగంగా పెదవి విరిచారు.

ఒకదానిని విమర్శించే ముందు సమయం సందర్భం దృష్టిలో పెట్టుకోవాలి. బహుపత్నీవ్రతులని sTÖనాడు దశరథుని ఉత్తానపాదుని నిందించ వచ్చునా? ఆ కథ సమయానికి లైంగిక విజ్ఞానం బోధించే సమరాలూ పుస్తకాలూ - ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని — లేవు. సంఘంలో ఒక తరగతి వారి మగపిల్లలకు అలాంటి తర్ఫీదు యిప్పించేవారు. 16 యేళ్ల పడుచులతో కాదు. ఏది ఎలా ఎందుకు చేయాలో చేయకూడదో చెప్పే నేర్పూ ఓర్పుగల ఫ్రౌఢలతో.

కథలెంత గొప్పవైనా, ఆ వస్తువు మనకెంత నచ్చినా, కథంతా నోటికిరాదు. ఆ విషయంలో పాటలదే గెలుపు.

“చిన్నకోడలు”లోని ‘పిల్లనగ్రోవి పాటకాడ, పిలిచిన పలికే దాననోయ్, తలచిన వలచే జాణనోయ’ అరవై అయిదు సంవత్సరాల తరువాత చెక్కుచెదరకుండా నా జిహ్వాగ్రాన నిలచి వున్నది. అలాంటివే ‘చెంగున ఎగిరే లేడి కూనను’ (రాజనందిని, 1958), ‘కొమ్మలమీద కోతి కొమ్మచ్చులాడింది తెల్ల తెల్లని ఓ బుల్లి  యెండ, నేలమీద వాలింది వాలు మొగ్గలేసింది నల్లానల్లని ఓ బుచ్చి నీడ! (కలిమిలేములు, 1962).

ఇవి యింత స్ఫుటంగా యిన్నేళ్ల తరువాత కూడా వాటి పచ్చదనం వెచ్చదనం తగ్గకుండా ఉన్నవంటే దానికి కారణం రచయితే కాదు సంగీత దర్శకుడూ, పాడినవారూ కూడా! అయితే బంగారంతో చేస్తే నగ, యినుముతోనైతే మేకు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి