స్వర్ణం అంటే బంగారం. బంగారం పనిచేసేవారిని స్వర్ణకారులని పిలుస్తారు. ఈ స్వర్ణకారులు మనిషి అలంకారంగా ధరించేందుకు కావలసిన అనేక రకాలైన ఆభరణాలని తయారు చేస్తారు. కేవలం బంగారు ఆభరణాలే కాకుండా వెండి, రాగి లోహంతో వివిధ ఆకారాలతో ఆభరణాలు చేస్తారు.
స్వర్ణకారవృత్తి పురాణకాలం నుంచీ ఉన్నదే. పండుగలకు, శుభకార్యాలకు ఆభరణాలు తయారు చేయించుకోవడం సమాజానికి ఒక అవసరంగా ఉండేది. ముఖ్యంగా పెళ్ళిళ్లకు తాళి, చెవికమ్మలు, కమ్మలబుట్టాలు, పుస్తెలు, చంద్రహారం లాంటివి, నక్లెసులు, ఉంగరాలు, ముక్కుపుడకలు, వడ్డానము, చేతి కంకణాలు, కడియాలు, బంగారు పూసలు, కాళ్ళ గొలుసులు, కడియాలు, మెట్టెలు స్వర్ణకారులు తయారు చేస్తారు.
ధనవంతులైతే అన్నిరకాల ఆభరణాలు తయారు చేయించుకునేవారు. బీదవారు మాత్రం రెండవ రకం బంగారం, లేదా ఇత్తడి వాటితో తాళి బొట్టులను, కల్తీవెండితో మెట్టెలను తయారు చేయించుకునేవారు.
సమాజంలో ఆచారవ్యవహారాలను ప్రజలు ఆచరిస్తున్నపుడు వృత్తి కులాలపై ఆధార పడేవారు. వారి స్థాయికి తగినట్టుగా ఆభరణాలను తయారు చేసుకునేవారు. కానీ ఆచారాలను, సంప్రదాయాలను విస్మరించేవారుకాదు. లగ్నపత్రిక రాసుకునే సందర్భంలో ఉంగరం, పెళ్ళికి కావలిసిన పూర్తి ఆభరణాలను తయారు చేసి ఇచ్చేవారు. ఆ సందర్భములో ప్రజలు స్వర్ణకారులను గౌరవించేవారు. వేదసమానమైన, పవిత్రమైన తాళిబొట్టు, మెట్టెలు, వెండి, బంగారపు గాయిత్రులను ఉంగరాలను, గొలుసులను తీసుకెళ్ళేటపుడు బాజాభజంత్రీలతో వచ్చి ఆభరణాలను తయారుచేసి ఇచ్చినందుకు స్వర్ణవృత్తికారునికి కొంత నగదును, వాటితో పాటు బియ్యాన్ని, ధాన్యాలను సంభావనగా ఇచ్చేవారు. అప్పటికీ ఇప్పటికీ తాళిబొట్టు చాలా ప్రత్యేకమైనది.
భారతీయ సంప్రదాయంలో విశ్వకర్మలు చాలా ప్రత్యేకమైన వారు. ఆచారాలు, కట్టుబాట్లు ఆచరిస్తున్నపుడు విశ్వకర్మలు వారి వృత్తులవారిగా విలక్షణమైన పాత్రను పోషించవలసి వస్తుంది. పంచాదులుగా పిలవబడుతున్నా వారు వృత్తులవారిగా సమాజానికి విశిష్టమైన సేవలను అందిస్తున్నారు.
స్వర్ణÁకారులు ` చారిత్రక నేపథ్యం
నేడు విశ్వకర్మలుగా, విశ్వబ్రాహ్మణులుగా పిలవబడుతున్నవారు విరాట్ విశ్వకర్మ సంతతివారు విరాట్ విశ్వకర్మ భగవానుడు స్వయంభురూపుడైనాడు. పంచభూతముల పుట్టకముందే ఈ భగవానుడు అవతరించాడని వైదిక వా్మఙయం వల్ల తెలుస్తుంది. మÖలస్తంభ పురాణంలో ఇలా చెప్పబడింది.
శ్లో. “న భూమి న జలం చైవ న తేజో నచ వాయవః
నచ బ్రహ్మ నచ విష్ణుం నచ రుద్రస్యతారకః
సర్వశూన్య నిరాలంబో స్వయం భూ విశ్వకర్మణ”
అలాగే ఋగ్వేదంలోని పదవ మండలం 81, 82 సూక్తాలు విశ్వకర్మ సృష్టిని తెలుపుతున్నాయి. అంతేకాదు ఋగ్వేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదంలో సృష్టిరక్తగా పేర్కొనబడినాడు. అన్నివేదాలననుసరించి విశ్వకర్మయే సృష్టికర్తయని చెప్పబడింది.
శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు పంచముఖుడు. ఆయన ఐదు ముఖాలనుండి ఐదుగురు బ్రహ్మలు జన్మించారు. వారు మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ. విశ్వకర్మ ఆజ్ఞప్రకారం ‘మనువు’ లోహవృత్తిని అంటే ఇనుప పనిని, ‘మయుడు’ దారు శిల్పవృత్తిని అంటే వడ్రంగి పనిని, ‘త్వష్ట’ కాంస్య శిల్పవృత్తిని, అంటే కంచరిపనిని. ‘శిల్పి’ శిల్పవృత్తిని అంటే రాతిని తొలిచే పనిని, విశ్వజ్ఞుడు కంసాలి అంటే స్వర్ణకార పనిని స్వీకరించారు. వీరు ఐదుగురు సమాజానికి కావల్సిన పరికరాలను, వస్తువులను సిద్ధం చేసారు. అంటే మనిషి బ్రతకడానికి సమగ్ర పరికరాలను తయారు చేసారు.
సమాజంలో విశ్వకర్మలు రెండు రకాలుగా కనిపిస్తారు. 1. వృత్తికారులు, 2 వైదిక కారులు. వృత్తికారులు శ్రమజీవన కర్తలు. వైదికులు వేదమంత్ర ఉపాసకులుగా ఉంటారు. వీరు పూజలు, వివాహం, మొదలైన
శుభ కార్యాలు చేస్తారు. గాయిత్రి మంత్రోపాసకులు కూడా.
స్వర్ణకారవృత్తి సూక్ష్మమైనపని. స్వర్ణకారుడు ఒక ఇంజనీరుగా చెప్పబడతాడు. సమాజంలో ఎంతో గౌరవం పొందినవాడు స్వర్ణకారుడు.
స్వర్ణకార వృత్తి, సాహిత్యం:
ఇక్కడ ముందుగా సాహిత్యం గురించి చెప్పుకోవాలి. ‘సాహిత్యం’ అంటే వివిధ ప్రక్రియల మÖలరూపం. ఇందులో కవిత్వం, పాటలు, కథలు, నవలలు, నాటకం, వంటివి ఉంటాయి. కవి లేదా రచయిత భావన తరంగలో ఏది మెదిలితే ఆ ప్రక్రియలో సాహిత్యం సృష్టించడుతుంది. అందుకే ఈ ప్రక్రియల మొత్తాన్ని సాహిత్యం అంటాం. సాహిత్యం ‘హితాన్ని’ కల్గిస్తుందని, మేలును చేస్తుందని, శుభాన్ని కోరుతుందని, ఆనందం లేదా వినోదం కలిగిస్తుందని చెబుతాం. ఇప్పటివాళ్లైతే చైతన్యాన్ని కలిగిస్తుందని కూడా అంటారు. అందుకే ఏ సామాజిక ప్రయోజనాన్ని ఆశించినా సాహిత్యం పాత్ర గొప్పగానే ఉంటుంది. ఎన్నోరకాల ఉద్యమాలకు, కార్యాలకు మÖలమైన సాహిత్యం, చైతన్యానికి, మానవ వికాసానికి మÖలమైందిగా చెప్పుకోవాలి. మనిషి జీవిత దృశ్యాలను, స్థితిగతులను వాస్తవికంగా వర్ణించే ఒక సాధనంగా రాజ్యాంగ బద్ధంగా హక్కులను తమ హక్కులను ఆశిస్తున్న సమాజం. ఆ సమాజంలోనే జీవిస్తున్న వృత్తికారులు, తమ జీవనోపాధి గురించి, బ్రతుకు గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. సమాజంలో వస్తున్న మార్పులవల్ల ఒకప్పటి సంప్రదాయ చేతివృత్తులు మటుమాయమౌతున్న సందర్భం కనిపించింది. ముఖ్యంగా ప్రపంచీకరణ ప్రభావం, సమాజంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం అన్ని కలసి సంప్రదాయ జీవనాన్ని తలక్రిందులుగా చేసింది.
కులవృత్తులు గ్రామాలలో నిర్వీర్యమవుతున్న సందర్భంలో కవులు వాటిపై దృష్టి సారించారు. ముందుగా కవిత్వంలో విధ్వంసమైన వృత్తులను వర్ణించారు కవులు. అనంతరం కథలు, నవలలు కులవృత్తుల ఆకలి వేదనల జీవితాన్ని విస్తృతంగా వర్ణించారు. స్వర్ణకారవృత్తిపై కవిత్వం పాటలు వచ్చాయి.
పద్యకవిత్వంలోను మనకు స్వర్ణకార వృత్తి జీవనం దృశ్యమానం చేయడం కనిపిస్తుంది.
వంచిన మేని నెత్తక సువర్ణపు ముద్దను వేడిచేసి గా
వించెద వీవు మెత్తగ ప్రణీత మీరగ దాని ఆకృతిన్
వంచెదవెîట్లు గావలెనొ వస్తువు రూపము నొందించారు
చెల్లించెడి కూలిలో మిగులు లెక్క అదెంతగా తెల్పు మిత్రమా!
స్వర్ణం, సువర్ణం అంటే బంగారు. బంగారుపని చేసేవాళ్ళనే స్వర్ణకారులని, కంసాలివారని, అవుసలివారని అంటారు. ముద్దుగా ఉన్న ముడి లోహాన్ని మÖసలో పోసి విపరీతమైన ఉష్ణోగ్రత వుండే కుంపటిలో కరిగిస్తారు. ఆ తర్వాత దాన్ని ఒక కడ్డీగా తయారుచేస్తారు. దాన్ని స్వర్ణకారుడు అత్యంత నైపుణ్యంతో వివిధ ఆకృతులతో తీర్చిదిద్దుతాడు. దానికి వచ్చే ప్రతిఫలం తక్కువే!
చూసి చూసి కనులు చూపులు గోల్పోవ
కాక తగిలి మేను కమిలి పోవ
శ్రమకు తడిసి తడిసి చమట ముద్దగ మారు
స్వర్ణకార! నీవు శ్రమ ప్రతీక!
స్వర్ణకారుడికి “కుంపటి” ఒక అగ్నిగుండం. ఒకయజ్ఞం. పటవముతో కుంపటిని తయారు చేస్తాడు. దానికి తగినట్లు బొగ్గులు పోస్తాడు. నిప్పు అంటించి ఊదుడు గొట్టాన్ని తీసుకుని ఊదుతుంటాడు. అపుడే విపరీతంగా వచ్చే ఊష్ణం వల్ల కళ్లు దెబ్బతింటాయి. చూపుపోతుంది. శరీరం ఆ ఊష్ణోగ్రతకు కమిలిపోతుంది. నిప్పురవ్వలు ఎగసిపడతాయి. చాలా ఓపిక, సహనం, నేర్పు, ఓర్పు, కల్గిన పని యిది. స్వర్ణకారుడు సున్నిత శ్రమజీవి. అందుకే ‘స్వర్ణకార నీవు శ్రమ ప్రతీక’ అని కవి పద్యంలో వర్ణించాడు.
స్వర్ణకారుడు ‘కుంపటి మంట’ ను రగిలించేటపుడు తన శరీర సత్తువను ఒకదగ్గరికి చేర్చి ఊపిరి తిత్తుల ద్వారా గొట్టంలోకి గాలిని ఊది పంపిస్తాడు. ఇలా చేయడం అందరికీ రాదు. అది ఒక నైపుణ్యం.
ఆ నైపుణ్యాన్ని ఇలా వర్ణిస్తాడు కవి.
గాలి ఊది దేహమును గల్గెను ఊపిరితిత్తి బాధ; నే
త్రాలను ధూళి జేరి కలతన్ కనుచూపున నింపె; కాళ్ళపై
నేలను గూరుచుండి కడు నిశ్చలమాయెను వెన్నుపూస; యో
కాలికి బాధ లెక్కువయి కండరముల్ సహకారమీయవే!
గొట్టంద్వారా గాలి ఊదడం, ఊపిరితిత్తులను బిగబట్టడం చాలా కష్టం. ఎర్రని నిప్పులనుంచి గొట్టంలోకి మంట వస్తుంటుంది. అది గమనించి గొట్టం ద్వారా గాలిని వదలాలి. ఏ మోతాదులో గాలి వదలాలి అనే స్పష్టమైన అవగాహన స్వర్ణకారునికి ఉంటుంది. ఇది స్వర్ణకారుని నైపుణ్యం. కవి జాషువా లాగా ఆలోచించాడు. ఆయన గబ్బిలం నైపుణ్యాన్ని వర్ణిస్త్తే ఇక్కడ స్వరకారుడి నైపుణ్యాన్ని వర్ణించాడు. స్వర్ణకారుడు బంగారు, వెండి లోహాలతో ఎన్నోరకాల ఆభరణాలు సుందరంగా తయారు చేస్తాడో వివరిస్తాడు.
స్వర్ణకార వృత్తి గురించి సూటిగ స్వచ్ఛమైన వచనంలో వర్ణించారు కవులు. కుంపటి మంటల రవ్వలే అక్షరాలై మొలకెత్తాయి. కవుల భావనా వీచికలతో శ్రమ చైతన్యం, ప్రవాహంలా సాగింది.
బాణాల శ్రీనివాస్ తనకలం లోంచి ‘కుంపటి’ ని ఆవిష్కరించాడు.
‘కుంపటి మా ఇంటి తోటలో పూసే సూర్యపుష్పం
అందులో మేం మెరుపుల్ని చూస్తాం
మేఘాల్ని చూస్తాం ఉరుముల్ని వింటాం
రకరకాల రంగుల్ని చూస్తాం
ఈ సమస్త విశ్వం తిరిగేది
మా కంసాలోల్ల కుంపటి చుట్టే
అది నిరంతరం మండే ‘అగ్నిగోళం’
శ్రీనివాస్ కుంపటిని సూర్యపుష్పంగా, అగ్నిగోళంగా చెప్పుకొచ్చాడు. నిజంగా ‘కుంపటి ఒక బతుకు విశ్వం’ అది ఒక కులవృత్తికారుడి చిరునామానే కాదు. మనిషి సౌందర్య ప్రతీక కూడా.
ఆభరణాల సొగసు కుంపటి మంటల్లో సృష్టంచబడింది.శరీరశ్రమను, అవయవాల సత్తువను ఒదిగిపట్టి బంగారుకు వన్నెతెచ్చేవాడే స్వర్ణకారుడు.
స్వర్ణకార వృత్తిని, వారి బతుకుచిత్రాన్ని, దృశ్యమానం చేసిన కవులు ఉన్నారు. శ్రీమతి జ్వలిత రచయిత్రి తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. వీరి సంపాదకత్వంలో ‘రుంజ’ కవితా సంకలనం వచ్చింది. ఇందులో విశ్వకర్మవృత్తుల గురించి ఆ వృత్తులలో ఉన్న సాధక బాధకాలు గురించిన వర్ణనల కవిత్వం ఉంది.
నేను సువర్ణ కారుణ్ణి
నేడు బతుకు వివరణమైన వాణ్ణి
పెట్టుబడి లేక
సుట్టా అద్దాలపెట్టలు పెట్టుకోలేక
మెట్టల కాన్నుండి ముండ గాజుల దాక
మక్మల్ బట్ట అట్టపెట్టెల్లో
అలంకరించుడు చేతగాక
శిలుం బట్టిన పనిముట్ల ప్రదర్శకున్నయిన
స్వర్ణకార వృత్తిలో చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు స్వర్ణకారునిపై ఆధారపడిన గ్రామాలు, పట్టణాల వైపు మల్లారు. పట్టణాలలో విశ్వకర్మేతరులు స్వర్ణకార వృత్తిని వ్యాపారీకరణ చేయడం ప్రారంభమైంది. దానిలో భాగంగా జ్యూయలరీ షాపులు ఏర్పాటయ్యాయి. డబ్బుగల సేటుల మాటలు నమ్మకాలు పెరిగి ప్రజలు రెడీమేడ్ ఆభరణాలపై ఆసక్తిని పెంచుకున్నారు. దాంతో గ్రామాల్లో ఉండే స్వర్ణకారులే కాకుండా పట్టణాలలో ఉండే స్వర్ణకారులకు వృత్తి భారమైపోయింది. పని దొరక్క పస్తులు ప్రారంభమైనాయి. పదోపరకో సంపాదించుకుని అరకొర బ్రతుకీడ్చే స్వర్ణకారుల దుస్థితి అధ్వాన్నమైపోయింది. అందుకే ‘నేను సువర్ణ కారున్ని, నేడు బతుకు వివర్ణమైన వాణ్ణి !’ అంటున్నాడు కవి దాసోజు జ్ఞానేశ్వర్. స్వర్ణకారుల పనిముట్లు శిలుంబట్టి పోయాయి. కొందరైతే వాటిని మÖటగట్టి అటకలపై పేర్చారు. ఇప్పటి పిల్లలకు ఆ వృత్తి గురించిగాని, పనిముట్ల గురించి గానీ తెలియదు. ‘స్వర్ణకారవృత్తి’ ని వ్యాపారంగా మార్చింది విశ్వకర్మేతరులైన ముస్లింలు, మార్వాడీలు. వారితో తొంబై శాతం విశ్వకర్మలు పోటీపడలేక అవస్తలు పడుతున్నవారే కేవలం పదిశాతం విశ్వకర్మలు బంగారు వ్యాపారంలో రాణిస్తున్నారు.
బంగారు వ్యాపారం చేయాలంటే లక్షల మాట. అందరూ అంత సాహసం చేయలేరు. స్వర్ణకారవృత్తిలో రెండురకాల పని ఉంటుంది. 1. నైస్‌పని 2. మోటుపని. మోటుపని గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా చేస్తారు. ‘నైస్‌పని’ పట్టణాలలోనివారు చేస్తారు. 1990 తర్వాత నుంచి ‘స్వర్ణకారవృత్తి’ వ్యాపారంగా, మారిపోయి, ధనవంతుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల జ్యూయలరీ (రెడ్మేడ్) షాపులు పుట్టుకొచ్చాయి. రోల్డ్‌గోల్డ్ నగలు వచ్చాయి. ప్రజలకు పెద్ద పెద్ద షాపులను చూసి నమ్మకం కుదిరింది. ఆభరణాలు వెంటనే కొనవచ్చు. అందులోనూ నాణ్యత వస్తుందనే ఆలోచన కలిగింది.
జ్యూయలరీ షాపులు రావడంవల్ల కొత్త, కొత్త ఆకారాల్లో పనిచేసేవారికి పని చేసుకునే దీనస్థితి వచ్చింది. స్వంతంగా దుకాణం పెట్టుకొని పనిచేసుకునే స్థితి లేకుండా పోయింది. అందుకే జ్ఞానశ్వర్ ఇలా అంటాడు.
షోరూం పెట్టుకున్నానికే మార్కెట్ సొంతమయినంక
కాల్జేతులు, ఊపిరి తిత్తులను
నమ్ముకున్న నా బతుకు
మొద్దుకు దిగేసిన ఢాకలైపోయింది.
‘జ్యూయలరీ షాపుల’ అందాల వ్యాపారాన్ని అంచనా వేస్తూ, స్వర్ణకారవృత్తి వారి జీవితాలను, ఆవిష్కరించిన కవయిత్రి మందరపు హైమవతి, తన ‘నిషిద్దాక్షరి’ కవితా సంకలనం 2004 లో తీసుకొచ్చారు. అందులోనే స్వర్ణకారుల బ్రతుకు చిద్రమైన స్థితిని ‘జ్యూయలరీషాపు’ కవితలో ఇలా వర్ణించింది.
వందల చందమామలు
ఒక్క సారే విరిసిన
దీపాల వెలుగుల్లో
ధగ ధగ మెరిసే షాపు
పాదచారుల కనుల విందు....
కృత్రిమమైన జ్యూయలరీ షాపులు, అద్దాల మేడల్లో ఉంటాయి. విద్యుత్తు కాంతులతో చమక్ చమక్ మంటు వినియోగదారులను ఆకర్షిస్తాయి.
అద్దాల తలపుల్లో
ఆధునాతన డిజైన్ల
రకరకాల ఫాషన్ల
ముద్దొచ్చే ఉంగరాలు
మురిపించే గాజులు
నగలంటే మోజులేని వారిని సైతం
ఒక్క క్షణం ప్రలోభపరిచే అందాల పనితనాలు
జ్యూయలరీ షాపుల్లో అందమైన ఆభరణాలుంటాయి. అందమైన ఆ షాపులు అవసరం లేనివారిని కూడా రప్పించుకుంటాయి.
ఇప్పుడు ఇక్కడ
నగల తయారి కోసం
రోజుల తరబడి
నిరీక్షణ లేదు
నిర్ణీత ధర చెల్లిస్తే
ముంజేతిపై వాలే చిలుకలు నగలు.
వినియోగదారులైన ప్రజలకు వెనుకటిలా ఓపిక ఉండటం లేదు. ఇలా డబ్బులిస్తే అలా ఆభరణాలు చేతిలోకి రావాలి. అందుకే జ్యూయలరీ షాపులకు అంతగా క్రేజ్ పెరిగింది.
స్వర్ణకారుల వృత్తి ఎలా విధ్వంసమై వారి బ్రతుకులు చిద్రమైనవో చెప్పింది హైమవతి.
మార్కెట్లో ప్రవేశించిన
కొత్త కొత్త యంత్రాలు
పనివాళ్ళ చేతి వేళ్ల కత్తెరలు
కప్పను మింగే సర్పంలా
కాలం పరిణమించిన వేళ
ప్రపంచీకరణ నేపథ్యంలో
కులవృత్తుల కోట గోడలు
కుప్పకూలుతున్న విషాద దృశ్యం
సమాజంలో మార్పులు అనివార్యం. సమాజం ఎలా దూసుకుపోతుంతో ఎలాంటి పరిణామాలు వస్తాయో తెలియదు. సాంకేతికత స్వర్ణకారుల వృత్తిలోకి ప్రవేశించింది కేవలం స్వర్ణకార వృత్తియే కాదు యాంత్రికత మొత్తం చేతివృత్తులపైనే దాడి చేసింది.
1990 లో సంభవించిన ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) ప్రభావం అన్నివర్గాలు వారిపై, అన్ని వృత్తుల వారిపై చూపింది. దానివల్ల సంప్రదాయ కళలు, వృత్తులు కనుమరుగైనాయి. ప్రపంచీకరణ వల్లే, కులవృత్తుల కోట గోడలు బీటలువారి కుప్పకూలాయని కవయిత్రి చెప్పింది.
ఆనాటి సంప్రదాయంలో వివాహం జరుగుతుందంటే స్వర్ణకారుడు చేసిన తాళిబొట్టు, ఉంగరాలు, చెవికమ్మలు, గొలుసులు, మెట్టెలు, కడాలు అన్నీ తీసుకుపోయేటప్పుడు చాలా హంగామా ఉండేది.
మేళతాళాలతో
ఊరేగింపుగా వచ్చి
సంభావనలిచ్చి
మంగళసూత్రాలు తీసికెళ్ళే
ఒక నాటి సాంప్రదాయం - ఈనాటి వినిమయ సంబంధం
అద్దాల్లో మాంగళ్యాలు
ఇక్కడ అందమైన నగల వెనక
పనివాళ్ళ హస్తకళా కౌశలాలు
యజమానులకు పెట్టుబడులు
పంచాదులను దైవికంగా భావించేవారు. అందులో స్వర్ణకారుడు సాక్షాత్ దైవసమానుడే, ఇప్పుడు ‘ స్వర్ణకారునితో పనిలేదు, సంభావన లేదు, మేళతాళాలు లేవు.
కవయిత్రి ఉరిమళ్ళ సునంద ‘ఒలికిన వైభవం’ కవితలో స్వర్ణకారుని స్థితి వర్ణిస్తుంది.
ఊపిరి తిత్తుల ఒత్తిళ్ళలో
ఉచ్వాస నిశ్వాసాల నడుము
ఉబికి వచ్చే గాలి అలలు అలలుగా
కుంపట్లో నిప్పుకణికలను శాసిస్తుంటే
........................
విరుచుకుపడిన ప్రపంచీకరణ సునామిలో
రెక్కలు విరిగి వెలుగులు మలిగిన లోగిళ్ళు
విస్తరించిన అధునాతన షోకేసులలో
ఉరితీయబడిన వారసత్వ మÖలాలు
ఆకురాల్లో ఒరిపిడిలో ఆకలి దేహాల నుంచి
రాలిన జీవన శకలాలను
ఆశల వెలిగారంలో అతుక్కుంటుంటే
అలవిగాని శ్రమ ఒడలంతా స్వేదజలమై
పేదరికం సిరాకు మంటల్లో
దగ్ధమవుతున్న బతుకు చిత్రాలు
ఒక ఆభరణం తయారీ వెనుక స్వర్ణకారుని శ్రమ చెప్పేది కాదు. ఎంతో సునిశితదృష్టి ఉండాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఊపిరి బిగబట్టి గాలిని వదలి కుంపటి మంటల్లో స్వర్ణరూపాలను తీర్చుతాడు స్వర్ణకారుడు. ఇప్పుడు ఈ వృత్తి ప్రపంచీకరణ వల్లే విధ్వంసమై®ందని, దానివల్లే స్వర్ణకారుల బ్రతుకులు విచ్ఛిన్నమై®నాయని కవయిత్రి వేదన. స్వర్ణకారుని శ్రమ విలువకట్టలేనిది. తోలు తిత్తులాగా ఊపిరి తిత్తులను మార్చి కుంపటి మంటలను రగిలిస్తాడు. రఘుశ్రీరామోజు ‘తుదిశ్వాసలు’ కవితలో స్వర్ణకారుని బతుకుదృశ్యాన్ని జీవన పోరాటాన్ని వర్ణించాడు.
ఊపిరితిత్తుల్లోని శక్తినంతా కూడ దీసుకొని
కుంపటి ఊదావు
బతుకు రాజేసుకోలేక
తుది శ్వాసను ఊదేసావు !
నగల మాలిన్యాల్ని తొలగించే
తేజాబ్ గుక్కెడు మింగి
కష్టాల మాలిన్యాల్ని వదిలించుకున్నావు!
కడుపునిండా తిని
హాయిగా నిద్ర పోయారు
తెల్లారాక తెలిసింది
పోలీసుల దొంగకేసులకు
కుటుంబమంతా శాశ్వతంగా నిద్రపోయిందని,
తన కండరాల సత్తువను, ఊపిరితిత్తుల సత్తువను బిగబట్టి బ్రతుకు కుంపటి వెలిగిస్తాడు, తేజాబ్‌తో వ్యర్థాన్ని తొలిగించి స్వచ్ఛమైన బంగారాన్ని సిద్ధం చేస్తాడు. తేజాబ్ బంగారు శుద్ధికోసమే కానీ! ‘కష్టాలను కన్నీళ్లను’ తనలో నింపుకుని బ్రతుకును మోయలేక కష్టాల మాలిన్యాన్ని తీర్చేక్రమంలో ‘తేజాబ్‌ను” తాగుతాడు స్వర్ణకారుడు. తెల్లవారితే తెలిసేది అతని కుటుంబ మరణవార్తే, ఇప్పటికీ అప్పులతో, కుటుంబ భారంతో, పనిలేక, తినడానికి తిండిలేక, అవమానంతో, ఆకలి చావులు దిక్కవుతున్న స్వర్ణకారుని బ్రతుకును వాస్తవంగా వర్ణించాడు కవి శ్రీరామోజు రఘు.
ఏదోవిధంగా కష్టపడుతూ బ్రతుకుతున్న స్వర్ణకారుడికి దొంగకేసులు, వాటి వల్ల లాఠీదెబ్బలు, జైలుశిక్షలు, పరువు ప్రతిష్టలు అన్నీ పోయి అవమాన భారం, కొన్ని సార్లు లాకప్‌డెత్‌కేసులు ఇలాంటి భయంకరమైన పరిస్థితులను కూడా స్వర్ణకారుడు భరిస్తున్నాడు.
అన్ని చేతివృత్తుల వారి కష్టాలు ఇలాగే ఉన్న ‘స్వర్ణకారుని మనస్తత్వం’ స్వర్ణం లాగే సున్నితమైంది. అందుకే ఆత్మహత్యలను కోరుకుంటాడేమో! పంచాదులవారిలో ‘ఆత్మహత్య’ లను చేసుకునేది స్వర్ణకారుల కుటుంబమే. ఎలాంటి పరిస్థితులున్న ‘ఆత్మహత్య, తేజాబ్, సైనైడ్ చావులు’ పరిష్కారంగాదు.
దెంచనాల శ్రీనివాస్ ‘వృధా’ శీర్షికతో చేతివృత్తులపై కవిత్వం రాసాడు. పంచాదుల వృత్తులు తీరుతెన్నులను వర్ణించాడు. తన తండ్రి వృత్తి ద్వారా పడిన అవస్థలను ఆయన దృశ్యమానం చేసాడు.
స్వర్ణకారుని వృత్తిని, బ్రతుకును పదకవిత్వంలోను, వచన కవిత్వంలోను చిత్రించిన కవుల భావనను చూసాం. కొందరు కవులు పాటలు కూడా రాసి ఆ పాటల్లో స్వర్ణకారుని బ్రతుకు దెరువును వర్ణించిన తీరును చూద్దాం.
పాటలలో- స్వర్ణకారుని బ్రతుకుచిత్రం
స్వర్ణకారవృత్తి గురించి ప్రతేకంగా పాటలు లేవనే చెప్పాలి. విశ్వకర్మ వృత్తులన్నింటిపై పాటలు వచ్చాయి.
మిత్ర విశ్వకర్మల వృత్తుల గురించి వాటి విశిష్టతను వర్ణిస్తూ పాట రాసాడు ‘విమలక్క’ అందమైన శృతిలో ఆ పాటను పాడారు.
సృష్టికి ప్రతి సృష్టిరా
విశ్వకర్మ దృష్టిరా
పంచకర్మ పాఠమై
ప్రపంచగతిని చాటెరా!
పంచ లోహ ధాతువుల మిశ్రమాలయుగం
చేతివృత్తి రూపు దాల్చె పరిశ్రమల క్రమం
చెట్టునీడ నిల్సె మనిషికావాసము కరువురా
ఆభరణం ఆయుధాల దేవతలకు నెలవురా!
................................................
యంత్రాలతో ధ్వంసమైన వృత్తులన్ని మోసము
గోల్డు నగల తయారీలో బతుకులన్ని ధ్వంసము
...................................................
సృష్టికి ప్రతిసృష్టి చేసే విశ్వకర్మ లెమ్మురా
రాజ్యాధికారానికి ‘రుంజను’ మోగించరా!
స్వర్ణకారునికి బ్రతుకుదెరువు లేకుండా చేసినవి ‘గిల్టీ నగలు’ రోల్డ్‌గోల్డ్‌నగలు. ఇవి ఇనుము మొదలైన లోహంతో చేసి బంగారు, వెండి పోత పోయబడి అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. అందులోను ధర తక్కువ. పేదవారు, మధ్యతరగతి ప్రజలు పూర్తిగా గిల్టీనగలపై ఆధారపడటం వల్ల స్వర్ణకారులకు బ్రతుకు దెరువు లేకుండా పోయింది. మిత్ర ‘విశ్వకర్మల’ గొప్పదనం గురించి చెప్పాడు. ప్రపంచంలో విశ్వకర్మలు ఎంత నైపుణ్యవంతులో ప్రపంచానికి విశ్వకర్మలు చేసిన సేవల వల్లే ప్రపంచగతి మారిందని చెప్పారు.
యంత్రాలు రావడం వల్లే విశ్వకర్మ చేతివృత్తులు విధ్వంసమైనవని చెప్పాడు. విశ్వకర్మలకు వృత్తిలేదు, ఉపాధిలేదు. అందుకోసం రాజ్యాధికారాన్ని సాధించాలి. అందుకు ‘రుంజ’ వాయిద్యాన్ని మోగించి విశ్వకర్మలు ఐక్యంగా పోరాడాలని సందేశమిచ్చారు మిత్ర.
విశ్వకర్మల వృత్తులు విధ్వంసమైన తీరును, పల్లెలు విధ్వంసమైన తీరును వర్ణించిన కవి గోరటి వెంకన్న. ఆయన రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో‘ పాట మొత్తం దేశంలో వున్న గ్రామీణ సంస్కృతిని, చేతివృత్తుల విధ్వంసాన్ని తెల్పుతుంది.
పల్లె కన్నీరుపెడుతుందో
కనిపించని కుట్రల
నా తల్లీ! బందీయై పోతుందో
కనిపించని కుట్రల.............
నారా కెంపు తెల్లలు జెల్లలు
పరులకు తెలియని మరుగు భాషతో
బ్యారం చేసేకంసలి వీధులు
వన్నె తగ్గినవి చిన్న బోయినవి
చెనై బాంబె కంపని నగలొచ్చీ
మన స్వర్ణకారుల
అరె చెరŠ్నకోలలై తరుమున్నైరా
నా పల్లెల నుంచి.
చాలా తాత్వికంగా, లోతుగా, సహజంగా ఉండే చేతివృత్తుల వారిపై రాసిన పాట ఇది. స్వర్ణకారులకు ఒక రకమైన ప్రత్యేక భాష ఉంటుంది. అది విశ్వకర్మలందరికీ తెలియదు. ‘కంసాలి’ అంటే స్వర్ణకారవృత్తిపని చేసేవారి వీధులు. అవి వన్నె తగ్గినవి. అంటే దీనంగా మారిపోయినవి. దానికి కారణం చెన్నై, బాంబేలనుంచి వచ్చి న జ్యూయలరీ, రెడీమేడ్ నగల వ్యాపారమే. పల్లెల్లో ఉపాధిలేక, పట్నంబాట పడుతున్నారు స్వర్ణ కారులు. ఈ పాట ‘కుబుసం’ సినిమాలో వచ్చింది. కవి గోరటి వెంకన్నకు మంచి పేరు తెచ్చిపెట్టిన పాట యిది.
వీరాచారి అనే కవి విశ్వకర్మ పంచాదివృత్తులపై పాటలు రాసి వీడియో క్యాసెట్సు తయారు చేసి విశ్వకర్మలను చైతన్యం చేసే ప్రయత్నం చేసారు.
బ్రహ్మరాతాలెట్ల రాసెనురా
మన విశ్వబ్రహ్మల
బ్రతుకులెందుకు
హీనంగున్నయ్‌రా!
అంటూ ఒక విశ్వకర్మ కుటుంబం కులవృత్తిపై ఆధారపడి మోసపోయిన స్థితిలోని కష్టాలను ఈ పాటలో వర్ణించాడు కవి. అలాగే బ్రతుకు దెరువు కోసం పట్నం పోయి ఆటోలు తోలడం, కూలి పనులు చేస్తున్నారని వాపోయాడు. విశ్వకర్మల బ్రతుకులు బాగుపడాలంటే కలిసి ఐక్యంగా పోరాడాలనే పిలుపునిచ్చాడు.
వీరాచారి రాసిన చాలా పాటలు విశ్వకర్మల చైతన్యాన్ని ఆహ్వానిస్తాయి.
పద్యకవిత్వం, వచన కవిత్వం, పాటలతో వచ్చినట్టుగా స్వర్ణకారులపై నవలలు, కథలు రాలేదు. మిగతా వడ్రంగి, కమ్మరి, కంచరి, శిల్ప వృత్తులపై కథలు వచ్చాయి. కంచరి వృత్తి జీవనంపై శీరంశెట్టి కాంతారావు పరంపర నవలను రచించారు.
ముగింపు:
విశ్వకర్మల వృత్తులన్నీ వారసత్వంగా వచ్చినవే. అవన్నీ విధ్వంసమైనాయి. అలాగే ఇప్పుడు స్వర్ణకారవృత్తి, విధ్వంసం కావడానికి ప్రపంచీకరణ ప్రభావం, ఆ కారణంగా వచ్చిన జ్యూయలరీ షాపుల కార్పొరేట్ వ్యాపారమని తెలుస్తుంది. ప్రస్తుతం వందలకొద్దీ జ్యూయలరీ షాపులు మార్కెట్‌లో పోటీపడుతున్నాయి. బంగారం ధర అరవై వేలకు తులంగా పెరిగింది. రోజురోజుకు బంగారం ధరను చూసి ఆశ్చర్యపోతున్న మధ్య తరగతి కుటుంబాలవారు ఒకగ్రామ్ బంగారు నగలపై మక్కువని చూపిస్తున్నారు. రోల్డ్‌గోల్డ్ నగలు, ఒకగ్రామ్ గోల్డ్‌నగలు ఆకర్షణీయంగా ఉండి తక్కువధరలో ఉండడంవల్ల మధ్యతరగతి కుటుంబాలవారు స్వర్ణకారుల దగ్గర పని చేయించుకోవడంలేదు. ఇలా చాలా కారణాలు స్వర్ణకారవృత్తి అంతరించిపోవడానికి కారణాలు. కాలప్రవాహంలో ఎన్నోమార్పులు వస్తుంటాయి. అవి అనివార్యం. ఏది ఏమైనా పల్లెల్లో, పట్టణాలలో మునపటి స్వర్ణకారవృత్తి హల్‌చల్ ఇపుడు లేకుండాపోయింది. ప్రభుత్వం స్వర్ణకారులకు అండగా ఉండాలి. వారిచేత ఆభరణాలని చేయించి ప్రభుత్వ జ్యూయలరీ షాపులని ఏర్పాటు చేయించి వారికి తగిన ఉపాధిని కల్పించాలి.
పల్లె అందచందాలకు చేతివృత్తులే కారణం. కేవలం పంచాదుల వృత్తులే కాదు రజక, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగం, మేదరి, బెస్త, గొల్ల, చెప్పుల వృత్తులన్నీ మటుమాయమైనాయి. యంత్ర వినియోగం, సులువుతనం, మనిషి ప్రమేయంలేని పనులు కూడా కారణంగా చెప్పాలి.
కాలప్రవాహం, కాల పరిణామాలు పల్లె సంస్కృతులపై, వృత్తి జీవనకారులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. నీళ్ళు లేకపోవడం, చెరువులు, బావులు అడుగంటడం, వ్యవసాయం మరుగున పడటం, తీవ్ర కరవు కాటకాలు అన్ని కలిసి పల్లెలు, పట్టణాలకు వలసలు కట్టడం ఈ గ్రామాలను ఒంటరిగా చేసాయి.
యువత సంప్రదాయ వృత్తులపై, వ్యవసాయంపై మక్కువ చూపక పోవడం, టెక్నాలజీ వల్ల విద్యారంగంలో వచ్చిన మార్పులు, ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి పెరిగింది. డబ్బు సంపాదన పెరిగింది. వివిధ వ్యాపారాలు ఊపందుకొన్నాయి. కనుక చాలా రకాల కారణాలు ఈ సంప్రదాయ వృత్తుల విధ్వంసానికి కారకాలు. అలా ఛిద్రమైన వృత్తిగా స్వర్ణకార వృత్తిని చెప్పుకోవాలి. సామాజిక బాధ్యతగా కవులు తమ దృష్టిని సంస్కృతీ సంప్రదాయాలపై, కళలపై పెట్టినట్లుగానే సంప్రదాయ కులవృత్తులపై కూడా పెట్టి వాస్తవికమైన సాహిత్యాన్ని వెలువరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి