21వ శతాబ్దంలో మహిళలు సమాజంలో తల ఎత్తుకొని జీవిస్తున్నారు. మగవాళ్లతో సమానంగా, మగవాళ్లకి తీసిపోకుండా స్త్రీలు అడుగుపెట్టని రంగమంటూ ఏదిలేదు. ఆకాశంలో, అవనిలో స్త్రీల చతురత గొప్పదే. అంతేకాదు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగొచ్చి తన పరిశోధనలను ప్రపంచానికి అందిస్తుంది. కర్షకురాలిగా, శ్రామికురాలిగా, వైద్యురాలిగా, న్యాయ కోవిదురాలిగా, దర్శకురాలిగా, రక్షణకారిణిగా, అధ్యాపకురాలిగా, అధ్యయనశీలిగా, కళాకారిణిగా, కర్తవ్యురాలిగా, కరుణామయిగా, ప్రభుత్వ అధికారిణి గా, రాజకీయాలలో రాణిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులుగా రాణిస్తున్నారు. కేంద్రంలో మంత్రులుగా రాణిస్తున్నారు. రాష్ట్రపతులుగా అవుతున్నారు. ఆర్థిక, సామాజిక, విజ్ఞాన, మనస్తత్వ, రసాయన, తత్త్వ, న్యాయ, శాస్త్రాలలో అనంతమైన జ్ఞానాన్ని సంపాదించింది. సాత్యకళారంగాలలో ప్రతిభ కనబరుస్తున్నారు.
అతిభయంకరమైన సర్కస్ రంగలోను రాణిస్తుంది. స్త్రీపాదం మోపని పరిశ్రమలేదు, చేయి తాకని శాస్త్రంలేదు, నడపని యంత్రం లేదు. ఇన్ని రంగాలను అధిగమించినా స్త్రీ అన్యాయమై పోని రోజు లేదు. ఇదొక వెలితి స్త్రీ జీవితంలో.
అన్ని శాస్త్రాలు గొప్పవే, అన్నికళలు గొప్పవే అయినా లలితకళల్లో కవిత్వం గొప్పదే. అలాంటి కవిత్వాన్ని ప్రవృత్తిగా చేసుకొని సమాజంలో నిలదొక్కుకున్న రచయిత్రులు కోకొల్లలు... వర్తమాన కాలంలో సాహిత్యరంగంలోకి అడుగుపెట్టినవారు అధిక సంఖ్యలోనే ఉన్నారు.
కొందరు కాలక్షేాపానికి వివిధ రంగాలను ఎంచుకోవచ్చు. అలాగే సాహిత్యరంగం కూడా అయి ఉండచ్చు. వివిధ రకాల ఉద్యోగాలలో, వ్యాపార రంగాలలో ఉన్నతÁమైన పదవులలో ఉండి రాజకీయాలలో ఉండి కూడా ప్రవృత్తిగా కళారంగాలను సాహిత్య, సామాజిక రంగాలను ప్రవృత్తులుగా ఎంచుకొని గొప్ప ప్రతిభా పాటవాలను ప్రదరించిన స్త్రీలు సమాజంలో దర్శనం ఇస్తారు.
స్త్రీలు సాహిత్య రంగంలోకి రావడానికి చారిత్రక నేపథ్యం చాలావుంది. స్త్రీల చరిత్ర అనుభవాలకు ఆది కావ్యం. అన్ని నిజాలు, చరిత్రలో అణగారిన బ్రతుకులు, ఆవేదన, వీటి నడుమ సంఘర్షణలో వెనుకటి శతాబ్దం ఎన్నో చేదు నిజాల నందించింది. కుటుంబం తాలుకు సంఘర్షణ వ్యక్తిగతంగానూ, వర్గజాతి వైషమ్య సంఘర్షణ సామాజికంగానూ, స్త్రీల జీవితాలలో చోటుచేసుకుని అటు ఆలోచనను, ఇంటి ఆవేశాన్ని కలిగించి వారిని కర్తవ్యోస్ముఖలను చేశాయి (శ్రీమతి వాసంతి, రచయిత్రి)
యుగాల తరబడి స్త్రీ అన్ని రకాలుగా అణచివేతకు, దోపిడికి గురవుతూ ఆత్మగౌరవం కోల్పోయి పరాధీనతగా బ్రతకడాన్ని ఆమె నిరసించింది. (ఆచార్య బన్న అయిలయ్య)
స్త్రీలకు సాహిత్యరంగం ఒక అవనిక. సమాజాన్ని అర్థం చేûసుకోవడం, సమాజంలో ఉన్న లోపాలను ఎత్తిచూపడం, ప్రశ్నించడం, వర్ణించడం, రచించడం సృజనకారుల బాధ్యత. అలా రచనారంగంలోకి అడుగుపెట్టిన వర్తమాన రచయిత్రి గట్టు రాధికామోహన్.
ఆమె వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచనారంగాన్ని ఎంచుకుంది. వివిధ పత్రికలకు వ్యాసాలు రాయడం, కథలు రాయడం, నచ్చినపుస్తకాలను సమీక్షించడం, పాటలు రాయటంతోపాటు, కొత్త పొద్దుకోసం, ఆమె తప్పిపోయింది కవితా సంపుటాలను వెలువరించింది.
వరంగల్ ప్రాంతానికి చెందిన ఈమె తన సాహిత్యాన్ని ఉత్తర తెలంగాణ మాండలికంలోనే రాయడం వల్ల భాషకు సొగసు అబ్బింది.
వృత్తి రీత్యా ఆమె ఉపాధ్యాయురాలు. తరగతిగదిలో పాఠం చెప్పడం పిల్ల్లలను సంస్కరించటం బాధ్యత. అది ఉద్యోగ బాధ్యత. రెండవది ప్రవృత్తి. ఇది కళారంగాలకు చెందినది అంటే కవిత్వం చెప్పటం ఇది సామాజిక బాధ్యత.
చాలా మందికి వృత్తి, ప్రవృత్తి ఈ రెండు ఉండకపోవచ్చు. వృత్తికే పరిమితమై ఉంటారు కొందరు. మరికొందరు రెండిటిలో సమపాళ్లలో రాణిస్తారు. అలా రెండు నావలపై నడుస్తుంది గట్టు రాధికామోహన్.
గట్టు రాధికమోహన్ గత ఎనిమిదేళ్ల నుంచి కవిత్వ రచనలోకి అడుగు పెట్టింది. సమాజాన్ని ఆకళింపుచేసుకుంది. అనుబంధాలను, కుటుంబ బంధాలను తెలుసుకుంది. సమాజం ఎంత వెనకబడిందో ముందుకెలా వెళ్తుందో అన్న ప్రశ్నకు సమాధానం కూడా తానే చెప్పుకుంది.
ఇప్పటివరకు ఆమె ప్రచురించిన కవితా సంపుటాలు రెండూ 2018లో ‘ఆమెతప్పి పోయింది’, 2024లో ‘కొత్త పొద్దు కోసం’. ఈ రెండు కవితా సంపుటాలలో మనుషుల మధ్య ఉండే ప్రేమ సంబంధాలు. కుటుంబ సంబంధాలు ముఖ్యంగా మనిషికి మరో మనిషితో ఉండే అవిభాజ్యమైన ప్రేమను చెప్పడం కనిపిస్తుంది.
‘కొత్త పొద్దుకోసం’ సంపుటిలో 111 కవితలు ఉన్నాయి. నో ఎంట్రీ నుంచి ‘మళ్లీ నాలోకి’ వరకు, ‘కొత్తపొద్దు’ కవితలో నూతన సమాజ ఆకాంక్ష కనిపిస్తుంది. కులమతాలు లేని సమసమాజ నిర్మాణం కావాలన్న తపన కనిపిస్తుంది.
అమ్మ పంచిన రక్తమాంసాలను మాత్రమే నింపుకొని
బొడ్డుపేగు తెంచుకొని
ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు
నాకు నాలాంటు
అందమైన ఓ పసితనపు
వాతావరణమే కనిపించింది.
రోజులు నెలలు
సంవత్సరాల వేలుపట్టుకొని
రోజు రోజు నేను నడుస్తుంటే
ఊడలు పరుచుకున్న మత జాడల నీడలు
నెమ్మది నెమ్మదిగా ఎదురుపడ్డాయి.
అమ్మకడుపులో మాంసపు ముద్దలుగా తయారైన వారందరు మనుషులే. వయసు పెరుగుతున్న కొద్ది బుద్ధి వికాసస్థాయిని పొంది, సమాజాన్ని అర్థంచేసుకోవడం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో కొందరిలో మంచి సమాజ నిర్మాణం కొందరిలో మత సమాజం, ఇంకొందరికి విధ్వంసకర సమాజ నిర్మాణం, ఇంకొందరికి అవినీతి సమాజ నిర్మాణం ఇలా వారి మనస్తత్వాలు విభజించుకొని పోయి వాటికి కట్టుబడి అదేనిజమని భ్రమిస్తారు. మంచి సమాజంతో వచ్చిన నష్టమేమి లేదు గాని, మతద్వేషం, విధ్వంసం, అవినీతి ఈ మÖడింటితో ఏ సమాజమైనా నష్టపోవాల్సివస్తుంది. అభివృద్ధి ఆటంకమై, శూన్యమై వెనకకు వెళ్తుంది. ఈ అభిప్రాయాన్నే కవితా పంక్తులలో చూస్తాం.
తూకం వేయలేనంత విధ్వంసక ఆలోచనలను వెంటేసుకొని మత కాలుష్యంతో నిండిపోయిన ఈ సమాజంలో
ఉఛ్వాస నిశ్వాసలిప్పుడు బరువైపోయి
నిర్యాణం చేస్తున్నాయి.
మతం ఎప్పటికీ విధ్వంసకర ఆలోచనతోనే ఉంటుంది. అది ఏమతమైనా, అయితే మన దేశంలో మతపిచ్చి ఎక్కువ. ఇది ప్రజాస్వామ్య దేశం కనుక ఇక్కడ మత వైరుధ్యాలు, మతఘర్షణలు, సంఘర్షణలే ఓట్లు గుమ్మరిస్తాయి. ప్రభుత్వాలను నిలబెడతాయి.
వీటివల్ల సామాన్య ప్రజలకు ప్రాణ సంకటం, ఊపిరి పీల్చుకోలేనంతగా ఆధునిక కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి విశ్వాసాలు ఉండటం చూస్తాం. అయితే ఎవరిమతంపై వారికి ప్రేమ, నమ్మకం, ఉండటం మంచిదేకానీ, పరమతద్వేషమే అన్ని విధ్వంసాలకు మÖలమైతుంది.
చివరి పంక్తులలో
ఇప్పుడొక
కొత్త ఉదయం పుట్టాలి
ఆ ఉదయలో మతంలేని, కులంలేని
ఆలోచనలు, భావాలు,
తెల్లటి రెక్కలను తొడిగి
ఊపిరిలను ఎగరేయాలి
మానవత్వపు వెలుగులని నింపాలి
సమాజంలో మానవత్వపు ఛాయలు అల్ల్లుకోవడమే అందరికీ కావల్సింది. ముఖ్యంగా రచయితలకు, కవులకు ఉండాల్సిన బాధ్యత అదే. కులనిర్మూలన జరగాలనే అంబేద్కర్ ఆశయం అదేకదా! మనదేశంలో కుల, మతాల సంఘర్షణలు మనిషి మనస్తత్వాన్ని అస్థిరంగా మారుస్తున్నాయి.
మనిషి ఆలోచనలు, భావాలు సూక్ష్మమైనవిగా ఉండాలి. తెలుపు శాంతికి చిహ్నం కనుక శాంతితో కొత్త నమాజాన్ని నిర్మించాలనే భావన రచయిత్రిలో ఉంది.
‘ఎల్లిపాయెతొక్కు’ కవిత గత ఆహార సంప్రదాయాలను దృశ్యమానం చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ బతుకును వెల్లడిస్తుంది. ఆధునిక కాలంలో అనేక ఆహారపదార్థాలు పుట్టుకొచ్చాయి. వాటివల్ల ఆరోగ్యం సమతుల్యం తప్పింది. రోగాలు వాటిని నివారించడానికి దవాఖానలకు తిరగాల్సిన స్థితి ఏర్పడింది.
నన్నయ్య చెప్పినట్టు ‘గతకాలము మేలు వచ్చుకాలముకంటెన’ అనే దాంట్లో కొన్ని విషయాలలో వాస్తవమే ఉందనిపిస్తుంది.
కొన్ని పొద్దూకులలో
కటోర మొఖమున్న రోట్లో
ఓ దొశెడన్ని గల్లర గల్లర నవ్వెటి ఎర్రమిరపకాయలు
అరశేతినిండ ఎండోలె మెరిశేటి దొడ్లుప్పు రాళ్లు
శిటికెడంత జిలకర
ఓ ఎలిగడ్డ
అన్ని కలిసిపోయి
అక్క శేతిలోకి రోకలు బండకింద ఆడుకునేయి.
ఎల్లిపాయెకారం కొన్ని చిన్నచిన్న రోగాలకు ‘మందు’ వెనకటికి దగ్గు, జ్వరం, జలుబు లాంటివి వస్తే ఇదే మందు. పశిరికలువచ్చినా ఇదే మందు, బాలెంతలకు ఇదే మందు. రోజు కూరగాయలు చేసుకొని తినటం ఎనకటికి ఎక్కడిది? చింతకాయ తొక్కు పేదోళ్లది, ఉన్నోళ్ల ఇండ్లల్ల మామిడికాయ తొక్కులు ఉండేవి.
బువ్వ గిన్నెలోని ఉడుకుడుకు బువ్వంత
నాలుగు తల్లెల్లోకి
శిటికెడు తొక్కు వేసుకొని
ఎర్రగా నిగనిగలాడుకుంట
కమ్మని వాసనతో
ముద్దలు ముద్దలుగ మారేది.
ఇప్పుడు
పూటకు మÖడు కూరలతో
వీలైనప్పుడు బిర్యానీలు, సలాడ్లతో
లైట్లకింద భోజనమైనప్పటికీ
అప్పటి ఆ ఎర్రటి ఎలిపాయే తొక్కు ముద్ద
మాత్రం గొంతులోనే ఆడుతుంటది.
నాలుక ఎన్నో రుచులను కోరుకుంటుంది (బుర్రకో బుద్ది, జిహ్వకో రుచి) అన్నట్టు కాల ప్రవాహంలో ఎన్నో సంప్రదాయక, ఆచారాలు మారినట్టు కట్టుబొట్టు, వస్త్రధారణ, అలంకరణ, అవసరాల వినియోగం మారుతున్నట్టే ఆహారపు అలవాట్లు మారుతున్నాయి.
ఉడుకు (బువ్వ) అన్నం లోనికి ఎల్లిపాయ తొక్కు , నెయ్యి కొంచెం వేసుకుని తింటే ఆ మజాయేవేరు.... ఇప్పటివారికి రకరకాల కూరలు, బిర్యానీలు అలవాటై తొక్కులు చేయడం, తినడం మోటయిపోయింది. ఏమైనా సంప్రదాయక వంటకాలు, రుచులు వేరు. అవి కేవలం తినడానికే కాదు ఆరోగ్యప్రయోజనాన్ని ఆశించేవి. అవి పాతతరం వారికి గొంతులోనే ఉంటాయి.
గత ఆహారనియమాలు, రుచులు, నెమరువేసుకొనే సందర్భం ఈ కవితలో కనిపిస్తుంది.
‘తొక్కు - పచ్చడి’ ఆహార పదార్థాల పేర్లలోనే రెండు రాష్ట్రాల అస్తిత్వ జీవన స్థితి ఉంది, ‘తొక్కు’ పై పచ్చడి చేసిన ఆధిపత్యాన్ని ధ్వంసం చేసిన చరిత్ర ఉంది. ‘తొక్కు’ అనేది తెలంగాణ పదం. ‘పచ్చడి’ అనిపిలవడం సీమాంధ్రలో కనిపిస్తుంది.
‘పెత్రమాస బతుకమ్మ’ కవిత నేటి సమాజంలో అనేక కారణాలతో ఉన్నతంగా ఎదుగుతారనుకున్న ఆడపిల్లలు - అర్ధాంతరంగా రాలిపోతున్న స్థితిని చెబుతుంది.
ఆడపిల్ల పుడితే ‘అరిష్టం’ అనుకునే రోజులు, పెళ్లిళ్లు చేయడం చాలా కష్టం, వరకట్నాలు ఇచ్చుకోలేక తల్లిదండ్రులు అవస్థలు పడేవాళ్ళు.
ఇప్పుడు ఆడపిల్లలే బాగా చదువుతున్నారు. కుటుంబానికి ఆసరవుతున్నారు. పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, స్వంతంగా వ్యాపారాలు చేస్తున్నారు. ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. స్త్రీలు లేని రంగమే లేదు ఇప్పుడు.
ఎంత గొప్పగా ఆడపిల్లలు ఎదుగుతున్నారోఈ ప్రపంచంలో ఆడవాళ్ల స్థానం ఎంతగొప్పగా ఉందో మనందరికి తెలుసు. కష్టపడి చదివి, గొప్పస్థానాలలో నిలుస్తున్నారు.
అయితే కొందరు పరిపక్వతలేక, మానసిక వత్తిడి, చదువుల వత్తిడి వల్ల అర్థాంతరంగా రాలిపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సహజంలో పేరుకుపోయిన అవినీతి, దానివల్ల అభివృద్ధిలోపం ముఖ్యంగా తెలంగాణాలో 2014 నుంచి 2023 వరకు ఉన్న సామాజిక ఆర్థిక, పరిస్థితులు నిరుద్యోగులకు శాపంగా మారాయి.
‘నీళ్లు నిధులు, ఉద్యోగాలు’ అనే శిర్షికతో రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెలంగాణాతో ఆత్మహత్యలు ఆగలేదు. రాష్ట్రంకోసం ‘సువర్ణ’ లాంటి వాళ్లు ఆత్మహత్య చేసుకుంటే, రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రవళిక ఉద్యోగం కోసం ఆత్మహత్య చేసుకుంది.
‘సువర్ణ - ప్రవళిక’ ల ఆత్మహత్యలు చారిత్రకమైన స్థితిగతులను తెలుపుతున్నాయి.
సువర్ణ అరవైఏళ్ల సీమాంద్ర దోపిడికి చనిపోతే, ప్రవళిక తొమ్మిదేళ్ళ బి.ఆర్.ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వ దోపిడికి బలయ్యింది. ఈ ఇద్దరు పాలకుల పాలన లోపాలకు మనస్తాపం చెందినవారే.
సువర్ణ తల్లిదండ్రులు ఆమె మరణం చూసి ఎలా కుమిలిపోయారో, ప్రవళిక తల్లిదండ్రులు కూడా అలాగే కుమిలిపోయారు. ఆ తల్లిదండ్రుల ఆత్మఘోష ఎలా ఉంటుందో రచయిత్రి దృశ్యమానం చేసింది.
నువ్వు పుట్టగానే ఆడపిల్లవని మురిసిపోయి
మా ఇంట్లకు లచ్చిమొచ్చిందనుకున్నం
నీ లచ్చింగల్ల మొఖం సూడందె
మీ నాయిన పక్క దిగేటోడే గాదు.
......................................
ఈ ఇంటికి దీపమనుకుంటే
నీ తలాపున దీపం బెట్టించుకుంటావా
పెండ్లి కొడుకును ద్యావులాడొద్దని
జిల్లేడు శెట్టుని అల్లుడని సూపిత్తివా
అత్తగారింటికి పోతవనుకుంటె
కాష్టానికి పోతివా
మహాలక్ష్మి పుట్టిందని తల్లి దండ్రుల ఆనందం. ఆడపిల్లపుడితె వడ్లగింజలతో చంపే కాలం పోయింది, కాల్వలో పడేసే కాలం పోయింది.
“నిండు అమాసనాడు
ఆడబిడ్డ బుట్టిందనీ ఓ లచ్చ గుమ్మడి
అత్త తొంగి సూడలేదు
మగడూ ముద్దాడలేదు ఓలచ్చ గుమ్మడీ....” అంటూ గద్దరన్న చెèప్పాడు. ఆనాటి కాలం ఎట్ల ఉండెనో....
ప్రస్తుతం ఆడపిల్ల నిజంగా మహాలక్ష్మియే కాదు ధనలక్ష్మి, వరలక్ష్మి కూడా. అంతేకాదు సమాజాన్ని మార్చాలన్న తపన కల్గిన ప్రగతిశీలభావాలు నిండిన ఉద్యమకర్త ఇవ్వాలిటి ఆడబిడ్డ.
పుట్టిన దగ్గరనుంచి పెంచి పెద్దచేసి చదివించి,పెళ్లి చేసి అత్తవారింటికి పంపించి ఏడ్చి కన్నీరు తుడుచుకొని కొన్నాళ్లకు మనవల్లతో, మనుమరాళ్లతో ఆడుకునే ఆనందం తల్లిదండ్రులది.. అంత సుదీర్ఘమైన కలలపై నిప్పులు పోసిందెవరు? ఆ తల్లిదండ్రుల ఉసురు తీసిందెవరు? అనే ప్రశ్నలు వస్తుంటాయి.
కానరాని లోకాలకు పోయినవని
మాడెండెలవిశి శెరువైతాంటె
ఊరడించేది బోయి
ఊక£దంపుడు మాటలూదబట్టె
కారు కూతలు కూయబట్టె
వయసు మీదున్న బిడ్డ సత్తె
అడ్డగోలు నిందలను మోపుకట్టె లోకమని తెల్వకపోయె
మమ్ముల్ని బతికున్న శవాలను జేసిపోతివి.
ప్రవళిక గ్రూపులకు ప్రిపేరవుతున్న నిరుద్యోగి. నోటిఫికేషన్స్ వస్తలేవు. వచ్చినవి ఆగిపోతున్నాయి. ఉద్యోగాలు ఇస్తరో ఇయ్యరో అని మనస్తాపంతో ఆత్మహత్య చేస్తుంది. ఆమె మరణం తర్వాత పాలకులు ప్రసారమాధ్యమాలను వేదికగా చేసుకు ఆమె గ్రూప్స్‌కు అప్లై చేయలేదు, అసలు కాంపిటీటివ్ ఎక్సామ్స్‌కు ప్రిపేరు అవుతలేదు. ప్రేమ ఫెయిల్యూర్‌తో చనిపోయిందని అబద్దాలు ప్రచారం చేసారు. నిందలు వేసారు.
తల్లిదండ్రుల గోసను కళ్లకు కట్టిన దృశ్యమానం చేస్తూ ‘వయసు మీదున్న బిడ్డనత్తె అడ్డగోలు నిందలను మోపులను మోపుకట్టె లోకమని తెలవకపోయే’ అంటూ.. మమ్మల్ని బతికున్న శవాలను చేసితివనే ఆవేధనను చాలా లోతుగా ఆవిష్కరించింది. అందులో తల్లిదండ్రుల దుఃఖం కనిపిస్తుంది. ప్రవళిక చేసుకుంది ఆత్మహత్యే అయినా అది ఆనాటి ప్రభుత్వహత్యకగనే చూడవల్సి ఉంది.
‘గ్లోబెరీనా’ కవితలో గ్లోబరీనా ఒకసాఫ్ట్‌వేరు సంస్థ గత బి.ఆర్.ఎస్ ప్రŸభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, పరీక్షల దిద్దకం పేపర్ వాల్యుయేషన్ గ్లోబరీనా సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ పరీక్షల అనంతరం పేపర్ వాల్యూయేషన్ ప్రకటించింది. అందులో వచ్చిన రిజల్ట్ తప్పుల తడకగా ఉండటం. చాలామంది పాస్ అయ్యేవారు ఫెయిల్ కావడం... ఇలా సాంకేతిక సమస్యవల్ల జరిగిన తప్పిదం వందలాది పసిమొగ్గల ప్రాణాలు బలితీసుకుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గతంలో జరిగిన అత్యంత విషాదకరమైన సంఘటన ఇది. పిల్లలు పక్షుల్లా రాలిపోయారు.
గొంగళి పురుగులా మారి
మÖడు గంటలు మెదళ్లను తొలుచుకుంటూ
సరితూగే సమాధానాలను గుమ్మరించి
ముందే ఊహించిన ఫలితంతో
తమ మనో ప్రపంచంలో
సీతాకోక చిలుకలై పోయారు
కానీ
ఊహించని సాంకేతికం
గ్లోబరీనా సంకేతాలను తలక్రిందులుగా చేసి
రెక్కల్ని విరిచి శూన్యంలోకి నెట్టిస్తే
ఇదంతా చూస్తూ కుడా ఏమి పట్టని
ఈ రాజ్యం
ఊపిరులకు సెలవిచ్చి
ఊరవతల సమాధులుగ మారిపోయుండ్రు.
ఇది 2019 వార్షిక పరీక్ష ఫలితాలను చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారంతా పరీక్షలు బాగా రాయలేక కాదు. ‘గ్లోబరినా’ సాంకేతిక తప్పిదం వల్ల అలాంటి నిర్ణయాన్ని ఎంచుకున్నారు. ఇది రాజ్యం పనే అంటూ సీతాకోకచిలకలై పోయారంటు వర్ణించింది రచయిత్రి. అంతేకాదు ఊపిరులకు సెలవిచ్చి ఊరవతల సమాధులుగ మిగిలిపోయిండ్రు అంటూ ఒక విషాద వదనంతో చిత్రించిన కవిత ఇది. రచయిత్రి, ప్రగతిశీల దృక్పథం కలిగిన వ్యక్తి. అందుకే సామాజిక సమస్యలను స్వీకరించింది.
తెలంగాణ ప్రాంతం గొలుసుకట్టు చెరువులకు మÖలం. కాకతీయుల కాలంనుంచి చెరువులు పురుడుపోసుకున్నాయి. ఆకాలం నాటి చెరువులు ఇప్పటికీ ఉన్నాయి.
అయితే వాటి మీద రియల్ ఎస్టేట్ వ్యాపారుల, రాజకీయ నాయకుల కన్నులు పడ్డాయి. ఇప్పుడు చెరువులు కనిపించవు. చెరువులను సమాధి చేసి వాటిమీద అందమైన బిల్డింగులు కట్టారు, కడుతున్నారు
కాకతీయ రాజ్యాం గన్న ఏడుగురిలో
ఒక బిడ్డపేరే శెరువు
సముద్రపు అందాన్ని తోడుకోదని
కొత్త సముద్రమోలె
ఊరిలో ఆటాడుతుండేవి
...........................
మారిన వ్యవస్థలలో
ఒళ్ళంత కబ్జా పోటులకు గురై
కొన ఊపిరితో కొట్టుకుంట
చావు బతుకుల మధ్య ఉన్నది.
గ్రామాలు చెరువుల మీద ఆధారపడి జీవిస్తుంటాయి. భూగర్భజలాలకు కారణం చెరువులే. అవి వర్షా కాలమంతా నీటిని నింపుకొని సముద్రాలవలె ఉంటాయని మారిన వ్యవస్థలో ఒళ్లంతా కబ్జా పోటుకు గురై కొన ఊపిరితో కొట్టుకుంటున్నాయని చావు బతుకుల మధ్య ఉన్నాయని వర్ణించడం సామాజిక స్పృహకు నిదర్శనం.
గ్రామాల నుంచి పట్టణాల వరకు ఇదే తంతూ. చెరువులు కబ్జాకు గురై రియలెస్టేట్ వ్యాపారంగా మారి, దుర్మార్గుల అంతస్తులు పెంచుతున్నాయి.
‘కొత్తపొద్దుకోసం’ కవితలు విలక్షణమైన సామాజిక సమస్యలు స్పృశించబడినాయి.
రాధిక రెండవ కవితా సంపుటి ‘ఆమెతప్పిపోయింది’ ఇందులో 48 కవితలు ఉన్నాయి. ఈసంపుటిలో అత్యంత సామాజిక సమస్య ‘ఆత్యాచారం’ ఆసిఫాబాను అనే ఎనిమిదేళ్ల బాలికను అపహరించి ఒక గుహలో బంధించి ఎనిమిదిరోజులు అత్యాచారం చేసారు దుండగులు. ఈ సంఘటనను కవితా వస్తువుకు స్వీకరించడం రచయిత్రి సామాజిక స్పృహకు నిదర్శనం.
ఆసిఫాబాను అనుభవించిన గోసను కవీత్కరించడం కనిపిస్తుంది.
నాన్న నన్నెత్తుకెళ్తూ...
గులాబీ కిందున్న ముళ్లు గుచ్చుకుంటనే తట్టుకోలేడు
వీడుగోర్లతో గిచ్చుతున్నాడు
పళ్లు కొరుకుతున్నాడు
నా బట్టలన్నీ చింపేసిండు
ఎక్కడెక్కడో ఒత్తుతున్నాడు
ఏమర్థం కావట్లేదమ్మా...
నేనాడపిల్లనట
వీడేమో మగాడట
మొనగాడట
ఇదేదో వాని మగతనమట
ఇది సమాజంలో ఉన్న ఆడ జాతి ఎదుర్కొంటున్న సమస్య. రాక్షసుల్లా, మృగాల్లా ప్రవర్తించే కొందరి మగాళ్ల కొందరి ప్రవర్తనలో నలిగిపోయే హృదయాల ఘోష..
మగాళ్లుగా చలామని అవుతున్న రాక్షసుల మధ్య నలిగిపోయిన మనుషుల ఆత్మగోసను ఈ కవితలో చెప్పబడింది.
దినపత్రికలో చూస్తే ఇవే సంఘటనలు, టీవీలల్లో ఇవే సంఘటనలు. స్త్రీలపై రోజు రోజుకు పెరుగుతున్న అకృత్యాలు ఇవి.
తెలంగాణా జాతిపిత అరవై ఏళ్లకు పైగా నడిచిన రాష్ట్రోద్యమానికి ఊపిరిపోస్తూ, సీమాంద్ర పాలకులను నిలదిస్తూ ఉద్యమ కాగడాను మండిస్తూ 2011 జూన్ 21 అనారోగ్యంతో అమారుడైన ప్రొ. కొత్తపల్లి జయశంకర్ సార్ ను గుర్తుచేస్తూ స్మృతి కవిత్వం రాయడం రచయిత్రి అస్తిత్వానికి గుర్తుగా నిలుస్తుంది.
అతని మాటలు - మిసైల్ తూటాలు
అతని రాతలు - శిలా శాసనాలు
తొలి తరానికొక ఉద్యమ జ్వాల
మలితరానికి ఒడవని ముచ్చట
...................................
కలం కత్తులతో ఆధిపత్యశక్తులపై
బ్రహ్మస్త్రంనే ఎక్కుపెట్టి
తెలంగాణ తల్లికి పుట్టకనిచ్చిన
ఆజన్మబ్రహ్మచారి....
అని జయశంకర్ సార్ మీద కవిత్వం రాయడమంటే అరవైయేళ్ల తెలంగాణ బతుకుమీద రాయడమే.
ఆయన నిస్వార్థమైన త్యాగాన్ని వర్ణించటమే. ఈనాటి పాలకులు ఆయన చేసిన త్యాగాన్ని మరిచి తెలంగాణాలో ఆయనస్థానాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకనాడు దొంగదీక్ష చేసినవారు తెలంగాణా జాతిపితగా మారాలనుకుంటన్నారు.
దోపిడి దారులు. ‘రైతేరాజీనామా చేస్తే’ కవిత£లో రైతులేకుంటే సమాజం ఎలా ఉంటుందో ఊహించుకోమంటుంది రచయిత్రి
గడుస్తున్న కాలం
కాలనాగై కాటేస్తున్నా
రాజ్యం అంతా నీచ రాజకీయమై
దిగజారిపోతున్నా
మానవత్వానికి చోటేలేని
ఈ కుతంత్ర సామ్రాజ్యంలో
ఇంకా ఎక్కడో దూరంగా వినబడుతూనే ఉన్నాయి
పంజరంలోని చిలుక పలుకుల్లా
రైతే రాజని..!
రైతే రారాజని...
పాలకులు రైతును ఉబ్బిస్తారు, రైతును వర్ణిస్తారు, పొగుడుతారు. రైతుకు కావల్సిన అవసరాలు తీర్చరు. రైతులు బ్యాంకులలో తీసుకున్న వ్యవసాయ ‘రుణం’ మాఫిచేయరు కానీ ఒక బడా వ్యాపారి వేయికోట్లు రుణాలు మాఫీ చేస్తారు. వాళ్లకు రక్షణ కవచకులై ఉంటారు.
రచయిత్రి రైతుగామారి పాలకులను ప్రశ్నిస్తుంది.
వదిలేయమంటావా నా చేతిలో నాగలిని
నారైతు పదవికి
రాజీనామా ఆలోచన పాఠకముందే
నిన్ను నీవు తరిమేయ్..
నీ కుటిల బుద్ధి కాల్చేయ్
లేదనుకో
నీ కడుపు నీవేకాల్చుకుంటావు..
నా ఆశలను నీవేî రాల్చుకుంటావు.
రైతు నిజంగా నాగలి పట్టకపోతే ఏమవుతుందో పాలకులకు తెలును, మనుషులకు తెలుసు. అన్నీ తెలిసి రైతులను, శ్రామికులను అవస్థలో పెట్టేవాడే పాలకుడు.
పదవులకే రాజీనామా చేయని పాలకులు, రైతు రాజీనామా చేస్తే ఎలా ఉంటుందో వారికి తెలుసు. అయినా తరతరాలుగా పాలకుల బుజ్జగింపులకు తీపి మాటలకు రైతులు లొంగిపోతుంటారు. ఈ కవిత నాసిక్ రైతుల నిరసనకు మద్దతుగా రాసింది రచయిత్రి.
I aఎ అశీt aశ్రీశీఅవ కవితలో స్త్రీలకు దక్కవల్సిన హక్కులను అడుగుతుంది.
నేనొకరికి అక్కనో... చెల్లెనో
అమ్మనో... బిడ్డనో
మరొకరికి ఫ్రెండ్‌నో....కావాలె
నాకిప్పుడు ఆ భరోసా కావాలె
I aఎ అశీt a aశ్రీశీఅవ
I aఎ అశీt a aశ్రీశీఅవ
I aఎ wఱtష్ట్ర tష్ట్రy వీy fatష్ట్రవతీ
bతీశీtష్ట్రవతీ aఅd fతీఱవఅd.. అని
అక్కడ కర్ర పట్టుకొని
అద్దాలను సవరించుకుంటున్న
గాంధీ కొక మాట చెప్పాలి
నువ్వన్నమాటను వెనక్కితీసుకోమ్మని
చేతిలో పుస్తకాన్ని మోస్తున్న
అంబేద్కర్‌ని అడగాలి....
రాజ్యాంగంలో నాకొకభాగమియ్యమని
గాంధీ ఆడవాళ్ళు స్వతంత్రంగా తిరిగే రోజులు రావాలన్నాడు అంబేద్కర్. రాజ్యాంగంలో మహిళలగురించి ప్రత్యేకంగా చెప్పకపోవడం శాపంగా ఆడవాళ్లు భావిస్తున్నారు. కనుక గొంతెత్తి స్త్రీల పక్షాాన మాట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది రచయిత్రి...
ఈ సంపుటిలో స్త్రీల మీద సమస్యల మీద, హక్కుల మీద కవిత్వం రాయడం వల్ల రచయిత్రి ‘స్త్రీవాద’ కవిత్వాన్ని కొత్తకోణంలో ఆవిష్కరించనట్లు కనిపిస్తుంది. రాసిన రెండు కవితా సంపుటలలో సామాజిక సమస్యలు స్పృశించబడినవి, తరతరాలుగా మారని బతుకుల సమస్యలు చిత్రించబడినవి...
రచయిత్రి సామాజిక స్పృహకు నిదర్శనంగా కవిత్వం నిలుస్తుంది. సమాజంతో పెనవేసుకున్న బంధం కనిపిస్తుంది. ముఖ్యంగా సృజనాత్మకత దృష్టి కవిత్వంలో నిండివుంది. కాలప్రవాహాన్ని గుర్తించడం, పసిగట్టడం, రచయితలపని గట్టు రాధిక రచనాదృష్టిలో ఇవి కనిపిస్తాయి. అయితే కేవలం కవిత్వీకరించడంతోనే రచనాకారుల పని ముగిసినట్టుకాదు. వాటి సాధన కోసం పోరాటం చేయడం రచనాకారులపనే.
తెలంగాణ సాహిత్యం సామాజిక అస్తిత్వ పోరాటాలకు నిలయం. ఇక్కడి బౌగోళిక స్థితిగతులు ప్రజలను ఉద్యమకారులను చేసాయి. అలాగే రచనాకారులను చేసాయి. నైజాం కాలం నుంచి ప్రజలు పడుతున్న అవస్థలు, పీడన, బానిసత్వం లాంటివి ప్రజలకు తిరుగుబాటు మనస్తత్వాన్ని ప్రేరేపించాయి. ఆ ప్రభావం గత సాహిత్యకారులపైనే కాకుండా వర్తమాన సాహిత్యకారులపైన కూడా పడింది. ప్రతి సమస్యకు స్పందించడం, ప్రశ్నించడం ఇక్కడి సాహిత్యకారుల ప్రథమకర్తవ్యం. వర్తమాన రచయితలు వాస్తవిక ప్రగతిశీల భావాలవైపు అడుగులు వేయాలి. ప్రజలవైపు నిలబడాలి. సుద్దాల హనుమంతు, దాశరథి, కాళోజి, నందిని సిదారెడ్డి, గద్దర్, గూడ అంజయ్య లాంటి మహాకవుల అడుగుజాడల్లో నడుస్తున్నారు.
21 వ శతాబ్దంలో మంచి ప్రతిభతో నిలబడాలన్న ఆశ వర్థమాన రచనాకారులలో ఉంది. అలాంటివారిని ప్రోత్సహించాలనే దృక్పథంతో గట్టు రాధికామోహన్ కవిత్వాన్ని రేఖామాత్ర పరిశోధన చేశాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి