ఓం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
ఈ రోజు నుంచి మనం మన హిందూ మత వైశిష్ట్యాన్ని, మన విద్యుక్త ధర్మాని గురించి తెలుసుకుందాం. మన మతాన్ని ఎందరో దౌర్భాగ్యులు, కుహనా మేధావులు, వామపక్ష భావ జాల కుత్సితులు, నాశనం చేయాలని ప్రతి క్షణం ప్రయత్నిస్తున్నారు.
కాబట్టి మనం మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి సంప్రదాయ సజీవ నదిని కాపాడుకోవాలి. మరి కాపాడుకోవాలంటే ఆ హిందూ ధర్మమంటే ఏమిటో ముందు తెలుసుకోవాలికదా.! తెలుసుకొని ఆచరించాలి. అందుకే ఈ చిరు ప్రయత్నం.
హిందూ మతం గురించి మనం ఈ క్రింది శీర్షికలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
1. హిందు మతం - నిర్వచనం, పదోత్పత్తి
2. విశ్వాసాలు
3. చరిత్ర
4. ఉనికి
5. వేదాలు ఇతర శృతులు స్మృతులు
6. భగవంతుని ఆరాధన
7. ధర్మ కర్మ విధులు
8. వ్యక్తి సమాజం
9. చాతుర్వర్ణ వ్యవస్థ
10. చతురాశ్రమ ధర్మాలు షోడశ కర్మలు
11. కర్మ సిద్ధాంతం ` పునర్జన్మ ` ఇత్యాది వివరణ
1. హిందూ మత పద నిర్వచనం పదోత్పత్తి
హిందూ అంటే హింసాం దూషయతి ఖండయతి ఇతి హిందుః. హింస మరియు పాప కర్మలను ఖండించు వాడే హిందువు. ఏ జీవికీ కూడా మనో వాక్కాయ కర్మలచేత హింసను కలిగింపనివాడు, పాపకార్యములను చేయనివాడు, వాటిని నిర్ద్వంద్వంగా ఖండించువాడే హిందువు. ఆ హిందువు ఆచరించే ఈ జీవన విధానమే హిందూ మతం.
ఇది మన పావన అవనిలో ఉద్భవించిన ఒక నిత్య జీవన విధానం.అమరత్వాన్ని ప్రసాదించే ఆధ్యాత్మిక సాంప్రదాయం. పురాతనమైనను ఎప్పుడూ నవ్యమేఐన విచారధార. దీనినే సనాతన ధర్మం అని కూడా అంటారు, దేనిని ధర్మనామంతో వ్యవహరించే వారో దానిని మతమని కూడా అనేవారు.
ధర్మమనగా ఆచరణీయకార్యం. మతమనగా అభిమతం. అదొక అభిప్రాయం, ప్రగాఢవిశ్వాసం. వివిధ రకాలైన భిన్న విశ్వాసాల కలయికే హిందూ మతం. ఇది ఏ ఒక వ్యక్తి వల్ల ఏర్పడలేదు. హిందువులు నివసించే ప్రాంతమే హిందూ స్థానము. “బృహస్పతి ఆగమంలో” హిందువులు ఉండే ఈ హిందుస్థానము ఎక్కడ ఉందో సవివరంగా విశదీకరించారు.
శ్లో: హిమాలయాత్ సమారభ్య యావత్ ఇందు సరోవరం
తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే
హిందువులు నివసించే ఈ పరమ పవిత్ర హిందుస్థానము దేవ నిర్మితమే దక్షిణమున ఇందు సరోవరం (నేటి మన హిందూ మహా సముద్రం) నుండి
ఉత్తరమున హిమాలయాల వరకూ వ్యాపించి ఉన్నది. ఇప్పుడు అమరత్వాన్ని ప్రసాదించే నవ జీవన విధానమైన ఆ హిందూ మతం గురించి మరింత తెలుసుకుందాం...
ముందే చెప్పినట్టు మన హిందూ మతం ఒక వ్యక్తి వల్లనో లేక ఒక సమÖహం వల్లనో ఏర్పడ లేదు. విభిన్న రకాలైన విశ్వాసాల సుందర సత్యాన్వేషణ సమాహారమే హిందూ మతం. ఇతర మతాల లాగా మా మతాన్ని నమ్మండి నమ్మితే స్వర్గం లేకపోతే నరకం అనే మÖఢ విశ్వాసం మీద ఆధారపడిలేదు. వాస్తవానికి మÖఢ, అంధ విశ్వాసాలనాధారంగా గుడ్డిగా విశ్వసించమని హిందూమతం అసలే చెప్పదు. ప్రతీది శాస్త్రీయంగా పరీక్షించమని, జ్ఞాన దృష్టి తో సత్యాన్వేషణ చేయుమని ఆ పిదప ఆచరించుమని చెబుతుంది.
2 విశ్వాసం (ఱ) ఓంకారము
హిందూ మతం వైవిధ్యమైనది. కొన్ని శాస్త్రీయమైన ప్రామాణికమైన హేతుబద్ధమైన విశ్వాసాల పునాదులపైన వెలుగుతున్నది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఓంకారము. దీనినే ప్రణవ నాదమని సృష్టికి పూర్వమే అంతటా వ్యాపించి వుండేదని ఇదే పరబ్రహ్మ స్వరూపమనీ హిందూ బందువులందరి ప్రగాఢ విశ్వాసం.
విశ్వాసం (1) దైవం -వేదాలు - శృతులు
హిందూ జీవన విధానంలో దైవం అనే అంశం అత్యంత ప్రాధాన్యతాంశము, నిరుణుడు, నిరాకారుడు, నిరంజనుడు నామరహితుడైన పరిపూర్ణ పరబ్రహ్మమే ఈ సృష్టికర్త అనీ, అవసరమైనప్పుడు ధర్మ సంస్థాపనార్థం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి భగవదవతారాల నెత్తుతాడని హిందువులు నమ్మే శృతులు చెబుతాయి. అట్టి భగవంతున్ని విష్ణువుగా వైష్ణువులు, శివుని గా శైవులు, శక్తిగా శాక్తేయులు, గణపతిగా గాణాపత్యులు, ఆరాదిస్తారు. ఐతే ఈ దేవీదేవతలలో అంతర్గతంగా ఉన్న చైతన్యం ఒకటేనని అదియే సత్యము అని శృతులు చెబుతున్నాయి. ఆ సత్యాన్ని ఋగ్వేదం లో ఈ విధంగా చెప్పారు.
ఏకం సత్ విప్రా బహుధా వదంతి .. సత్యం ఒకటే దాన్ని తెలిసికొన్న జ్ఞానులు అనేక విదాలుగా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం.. శృతుల ద్వారా ఈ అవని ఒక అపూర్వ తత్త్వాన్ని రూపొందించుకున్నది. ఆదియే సనాతన ధర్మం అందుకే ముందు మనవి చేసుకున్న విధంగా హిందూ మతం అంటే సనాతన ధర్మం. అదొక జీవన ధర్మ గంగా ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూ మనను తరింపజేస్తుంది. ఐతే ఈ సనాతనధర్మ ప్రమాణం ఏ వ్యక్తి నుండి గాని వ్యవస్థ నుండి గాని ఉత్పన్నం కాలేదు. ఆ వ్యక్తి సిద్ధ పురుషుడు కానీవ్వండి లేదా అవతార పురుషుడు కానివ్వండి. వారి వల్ల ఈ సనాతన ధర్మ ప్రవాహం ఉద్భవించలేదు. ధర్మప్రమాణం దానియొక్క విశ్వజనీన మైన సత్యలక్షణం ద్వారా సంక్రమించింది.
జాతి మత సాంప్రదాయాల ప్రమేయం లేకుండా అన్ని కాలలో అందరికి ఋజువు కాగలిగేటట్లు మనగల అత్యుత్తమ ధర్మమే సనాతన ధర్మం. కానీ మనలోనే కొంతమంది కుహనా మేధావులు, విద్యాధికులమనుకునేవారు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు సైతం ఇప్పటికీ మన మతం పట్ల మన ధర్మం పట్ల నిర్లిప్త వైఖరిని ప్రదర్శిస్తూ ‘ఆ ఏముంది మతాలన్నీ ఒకటే దేవుళ్ళందరూ ఒకటే అన్ని మత గ్రంథాల సారం ఒకటే’ అనే నిర్లక్ష్య ధోరణి తో మాట్లాడుతున్నారు.. ఇది ఒక మానసిక రోగం. దానికి ముఖ్యకారణం మన ధర్మం పట్ల వారికి సరియైన అవగాహన లేకపోవడం లేదా అన్యమత ప్రభావం.
ఇది పరమత నింద కాదు కానీ మతం ఏమిటో మన ధర్మమేమిటో తెలియజెప్పడం. ఇది అవసరమే కదా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి