మనందరం
1. నిత్య
2. నెమిత్తిక,
3. కామ్య కర్మలను
భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ దైవానుగ్రహం పొందడానికి కృషి సలుపు తున్నాము. సంతోషం. ఐతే మనం చేసే నిత్య దైవారాధనాన్ని మన పిల్లలు చూసి వాటిని తాము కూడా అనుసరించాలని, అనుకరించాలని అనుకుంటారు.
“యద్యద్ ఆచరతి శ్రేష్ఠః తత్తదేవే తరో జనః.” అని కదా గీతావచనం. శ్రేష్ఠులైన వారేది చేస్తారో ఇతరులు దానిని ఆచరిస్తారని అర్ధం. కాని ఆ చిన్నవాళ్ళ మనస్సులలో ఎన్నో సందేహాలు, ఎన్నెన్నో సంశయాలు కలుగుతాయి. వాటిని తల్లి దండ్రులు అడగాలంటే భయం. బిడియం. సంకోచం.. మరి ఎట్లా..? వాటి గురించి ఎవరిని అడగాలి? వారికి సరియైన సమాధానాలతో సందేహ నివృత్తి చేయాలి కదా? అందుకే ప్రశ్నోత్తరాల మాలిక అంటూ ఒకటి ఊహించి వ్రాస్తున్నాను.
ఒక తండ్రిని, తల్లిని గౌరవంతో భక్తి పూర్వకంగా తన తనయుడు తనయ అడిగే ప్రశ్నలకు తండ్రి/ తల్లి ఇచ్చే సమాధానాలు పొందుపరిచాను. వీటిని చదవండి. పిల్లలకు వినిపించండి.. క్షీర నీర న్యాయాన్ని అనుసరించి నా దోషాలను క్షమించి పాలలాంటి ఒప్పులను మాత్రమే గ్రహింతురుగాక..
కొడుకు/కూతురు : అమ్మా నాయన గారూ. మీకు పాదనమస్కారం.
తండ్రి/తల్లి : శుభం. ఆశీర్వాదాలు.
1.ప్రశ్న: మిమ్ములను కొన్ని విషయాలను అడగాలనుకుంటున్నాము.
సమాధానం: మంచిది తప్పక అడగండి.
2. ప్రశ్న: మీరు భగవంతుని పూజిస్తారు కదా! అసలు భగవంతుడు ఎవరు? పూజ అనగానేమి? భగవంతుడిని ఎందుకు పూజించాలి?
సమాధానం: భగవంతుడనగా భగములు కలవాడు భగవంతుడనబడును.. సమస్త చరాచర భూత సృష్టి స్థితి లయ విజ్ఞత... సమస్త జన హృదయ సౌఖ్య విధాత... సకల లోక శుభ ప్రదాత...
3. ప్రశ్న భగములననేమి..?
సమాధానం: ఆరు గుణములను భగములందురు. అవి
(1) సమగ్రమగు ఐశ్వర్యము
(2) సమగ్రమగు ధర్మము
(3) సమగ్రమగు కీర్తి
(4). సమగ్రమగు సిరి
(5) సమగ్రమగు జ్ఞానం
(6) సమగ్రమగు వైరాగ్యం...
4.ప్రశ్న. మరి పూజ అననేమి?
పైన ఉదాహరించిన భగములు కలిగిన భగవంతుడిని సేవించడమే” పూజ...
పూ-పూతాత్ములమైన, పవిత్రమైన
జ = జన్మను పొందిన మనం భగవంతుడిని, కృతజ్ఞతా పూర్వకంగా, ప్రేమ తో సేవించడమే పూజ..
5. భగవంతుడి పూజ వల్ల మనకు ప్రయోజనమేమి?
సమాధానం: అనంత కరుణాసముద్రుడైన భగవంతుడు, మనం భక్తి తో చేసే పూజల వల్ల సంతుష్టుడై అనుక్షణం కాపాడుతాడని మన విశ్వాసం, నమ్మకం...
6.ప్రశ్న: అసలు భగవంతుని పూజ యొక్క పరమార్థం ఏమిటి?
సమాధానం: సకల లోకములను, సకల చరాచర ప్రాణికోటిని సృష్టించి పోషించి తుదకు నీయందే లయము చేసుకొనుచున్న ఓ భగవంతుడా! మమ్మలను చీకటినుండి వెలుగులోకి, అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకి, మానవత్వం నుండి దైవత్వం వైపు తీసుకొని పొమ్మని అర్చించడం, ఆర్థించడమే పూజ యొక్క పరమార్ధం.
7. భగవంతుడు మన పూజలను ఆలకించునా?
సమాధానం : ఓ.. తప్పకుండా ఆలకించును.
ప్రహ్లాదుడు, ధ్రువుడు, గజేంద్రుడు, మొదలైన భక్తులెందరో ఇందుకు సాక్ష్యం.
8. ప్రశ్న. భగవంతుని పూజ ఎప్పుడు చేయాలి?
సమాధానం : అన్ని వేళలయందు భగవంతున్ని పూజించవచ్చు... కాని ప్రాతఃకాలంలో, ప్రభాత వేళలో ప్రశాంత వాతావరణంలో చేసే పూజ వల్ల మన మనస్సు నిర్మలమై ప్రశాంతమయమై, ఒక దివ్యమైన అలౌకిక ఆనందం మనకు కలుగుతుంది. అంతే కాదు, ఆ రోజంతా శుభప్రదమై మంగళకరమై మనం నిర్వహించే కార్యక్రమాలన్నీ విజయవంతమై తాయని మన ప్రగాఢ విశ్వాసం.
9.ప్రశ్న: పూజ చేయుటకు అర్హులు ఎవరు?
సమాధానం: పూజ చేయుటకు అందరూ అర్హులే. వయో లింగ కుల మత భేదములేక అందరూ భగవంతుని పూజకు అర్హులే. భర్త భగవంతుని పూజ చేస్తుంటే భార్య ఆయనకు పూజా సామాగ్రిని, పూజా పాత్రలను మాత్రమే అందజేయాలని, భార్య వేరే ప్రత్యేకంగా పూజ చేయవలసిన అవసరం లేదని అనడం పాపం. క్షమార్హం కాని నేరం.. భగవదనుగ్రహం కావాలనుకునే ప్రతి ఒక్కడూ పూజకు అర్హుడే. భగవంతుడి యందు సంపూర్ణమైన భక్తి విశ్వాసం, కలిగిన ప్రతి ఒక్కడూ అర్హుడే.
10. ప్రశ్న. పూజ ఎన్ని విధములు.?
సమాధానం: పూజ ముఖ్యంగా మÖడు విధములు..
1. షోడశోపచార పూజ.
2. పంచ సంఖ్య ఉపచార పూజ.
3. మానసిక పూజ.
షోడశ ఉపచార పూజ :
షోడశ అనగా పదహారు 16 ఉపచారాలు అనగా సేవలు. ఈ క్రింది క్రమంలో భగవంతున్ని అర్చించడమే పొడశోపచార పూజ.
1. ఆవాహనం
2. ఆసనం
3. పాద్యం
4. ఆర్ఘ్యం
5. ఆచమనీయం
6. స్నానం
7. వస్త్రం
8. యజ్ఞోపవీతం
9. గంధం
10. పుష్పం
11. ధూపం
12. దీప
13. నైవేద్యం
14. తాంబూలం
15. నమస్కారం
16. ప్రదక్షిణం
ఈ ఉపచార విధానంలో ఇంటికి వచ్చిన పెద్దలను ఎలా గౌరవిస్తారో అలాగే షోడశోపచారములతో కూడా భగవానుని గౌరవించడం ఒక పూజా పద్ధతి. భగవానుని మర్యాద చేయడం ఈ ఉపచార విధాన ప్రధాన లక్ష్యం
ఆవాహనము ` మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించడం.
ఆసనము `వచ్చిన వారిని కూర్చోబెట్టడం
పాద్యము - కాళ్ళు కడుగుకొనేందుకు నీళ్ళివ్వడం
ఆర్ఘ్యము - చేతులు శుభ్రపరచడం
ఆచమనీయము ` దాహమునకు నీళ్ళివ్వడము.
స్నానము - ప్రయాణ అలసట తొలగుటకు స్నానింపచేయడం
వస్త్రము - స్నానానంతరము పొడి బట్టలివ్వడం
యజ్ఞోపవీతము- మార్గమధ్యలో మైలపడిన యజ్ఞోపవీతమును మార్చడం
11. ప్రశ్న. షోడశోపచార పూజా విధానము నందు ‘అపవిత్ర పవిత్రోవా’ అంటూ నీటిని తలమీద ఎందుకు చల్లుకోవాలి?
2. ఆచమనం - పరమార్థం ఏమిటి?
3. కొబ్బరికాయను ఎందుకు నివేదించాలి?
4. హారతి ఎందుకు భగవంతుడికి?
సమాధానం : చాలా మంచి ప్రశ్నలు. సంతోషం. మొదటి ప్రశ్నకు సమాధానం శ్రద్ధగా ఆలకించు నాయనా!
‘పవిత్రాణాం పవిత్రం యో మంగళానాంచ మంగళమ’ అని కదా విష్ణు సహస్రనామములో భీష్మ పితామహుడు, భగవంతుడైన కృష్ణున్ని కీర్తించాడు. భగవంతుడు పరమపవిత్రుడు, మంగళకరుడు. అట్టి భగవంతున్ని పూజించడం ఒక పరమ పవిత్రమైన దైనందిన కార్యక్రమం. ఆ కార్యక్రమ నిర్వహణలో కొన్ని నిర్దిష్ట నియమాలను పాటించడం ఆవశ్యమన్న సంగతి మరువరాదు.
పూజ చేయుటకు ముందు మనం శుచిగా స్నానాదులు ముగించుకొని శుభ్రమైన వస్త్రములను ధరించి పూజ చేయడానికి ఉపక్రమిస్తాము. ధూళి ధూసరితమైన శరీరాన్ని సబ్బుతోను నీటి తోను శుభ్రం చేసుకొంటాము. కాని పరమ పవిత్ర దివ్య మంగళ విగ్రహ రూపంలో మనకొరకు వేంచేసే భగవంతున్ని పూజ చేసే మనం కూడా పవిత్రులం కావాలి కదా! ఆ పవిత్రతను పొందడానికి మనం అపవిత్ర పవిత్రోవ అనే మంత్రం పఠిస్తూ జలాన్ని, మంత్ర పూరిత మైన గంగా జలాన్ని మన తలపై ప్రోక్షించుకుంటాము. జలస్నానంతో పరిశుభ్రత, మంత్ర జల సంప్రోక్షణతో పవిత్రత ఏర్పడుతుంది. అప్పుడే భక్తుడు పూజ చేయడానికి ఉపక్రమించాలి. ఇది ప్రతి పూజలోను, వ్రతంలోను, నోములోను అవశ్యం గమనించగలరు.
ఆచమనం :
ఇప్పటి వరకు పూజ కార్యక్రమం ముందు బాహ్యంగా శుచిగా
ఉండడం, పవిత్రంగా ఉండడం ఎట్లాగో చూసాము కదా! ఇప్పుడు అంతరింద్రయ శరీరాన్ని పవిత్రము గావించుటకు, అనంత కళ్యాణ గుణ గణ పరిష్టడైన భగవంతుని యొక్క అనేక నామాలలోని కొన్నింటిని కేశవ నామాలుగా ఉచ్చరించుచు, కుడి చేయి అరచేతిని గోకర్ణ ఆకృతిలో పెట్టి అందులో గంగా జలమును కొంచెము తీసుకొని నోటి ద్వారా 3సార్లు తీసుకొన వలెను.
ఈ ప్రక్రియ ద్వారా మన శరీరంలోని అన్ని అవయవాలు పవిత్రమైతాయని మన నమ్మకం. అలాగే ఆ దివ్య నామోచ్ఛరణతో మన కుడి చేయి మధ్యవ్రేలు మరియు ఉంగరపు వ్రేలుతో జ్ఞానేంద్రియములను కర్మేంద్రియాలను హృదయాన్ని స్పృశిస్తాము.
ఈ మొత్తం ప్రక్రియ యొక్క అంతరార్థం ఏమిటంటే, పవిత్రత నొందిన శరీరం బాహ్యేంద్రియ నిగ్రహాన్ని, అంతరేంద్రియ నిగ్రహాన్ని పొందడమే. వీటినే శమము దమములంటారు.
13.ప్రశ్న. పూజా కార్యక్రమాలలో
1. గంట వాయించడం
2. దీపం వెలిగించడం
3. ప్రాణాయామము
4. నారికేళఫల నివేదనం
5. హారతి..
ఆను ముఖ్యమైన ఘట్టాలను వివరించ ప్రార్ధన...
సమాధానం:
1. గంట వాయించడం :
అంటే ఘంటానాదం. ఘంటానాదంలో ఓంకారనాదం మిళితమై వుంటుంది అది శ్రవణా నందకరంగా మనకు వినబడుతుంది. ఓంకారము విధాత తలపున ప్రభావించిన అనాది జీవననాదం. ప్రాణనాడులకు స్పందననొసగే ప్రణవనాదం. ఆ ఘంటానాదంతో మన చుట్టూ ఉన్న పరిసరప్రదేశంలో ఒక ప్రశాంతమైన, ఒక పవిత్రతమైన వాతావరణం నెలకొంటుంది. అంతేకాదు, పూజ ప్రారంభం లోనే గంట నినాదాన్ని ఒక చక్కటి మంత్రంతో ప్రారంభిస్తాం.
శ్లో: ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం
కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం
ఈ శ్లోక భావం ఏమిటంటే... దేవతలంతా విచ్చేయుటకు, రాక్షసులంతా వెళ్ళిపోవుటకు ఈ దేవత ఆహ్వాన లాంఛన ప్రాయమైన ఘంటా రవాన్ని చేస్తున్నాను.
ఎంత చక్కని భావన—— మన మనస్సుల్లోకి దేవతా గుణాలు రావాలని, రాక్షస గుణాలన్నీ వెళ్ళి పోవాలని ఓంకార నాదంతో మనం కోరుకోవడం నిజంగా ఒక అత్యద్భుతమైన ప్రక్రియ అవునా?
2. దీపారాధన:
పూజా కార్యక్రమంలో ముఖ్యమైన ప్రక్రియ దీపారాధన.. ఇక్కడ ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. దీపప్రజ్వలన అంటే దీపాన్ని వెలిగించడం. దీపారాధన అంటే దీపాన్ని వెలిగించి, దానిని పసుపు కుంకుమలతో అలంకరించి పుష్పాలతో ఆరాధించడం మనం ప్రతి రోజు దీపారాధన తప్పక చేయాలి. రోజుకి ఒక్కసారైనా దీపారాధనతో భగవంతుడికి సభక్తికంగా నమస్కారం చేస్తే సర్వ శుభములు కలుగుతాయని శాస్త్ర వచనం. దీపం వెలిగిస్తూ ఈ క్రింది మంత్రమును పఠించి పసుపు కుంకుమలను పుష్పాక్షితలను సమర్పించి నమస్కరించాలి.
శ్లో: దీపం జ్యోతి పరం బ్రహ్మ
దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపం నమోస్తుతే
భావం: చీకటిని తొలగించి వెలుగుని ప్రసాదిస్తూ, సర్వ కార్యములను సుసాధ్యం చేసే ఈ పరబ్రహ్మ స్వరూపమైన సంధ్యా దీపానికి నమస్కరిస్తున్నాను.
ప్రాణాయామం :
ప్రాణాయామమనగా ప్రాణశక్తిని శరీరమంతా విస్తరింపజేసే శ్వాస క్రియ ను నియంత్రించడం..
ప్రాణ = జీవనం
యామము=పొడిగించడం..
అనగా ప్రాణాయామ ప్రక్రియ ద్వారా జీవనమును పొడిగించుట. పతంజలి యోగ శాస్త్రంలో ఈ ప్రాణాయామం గురించి చాలా వివరంగా వివరించారు. ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను చక్కగా నియంత్రించడమనే ఈ ప్రాణాయామ ప్రక్రియ వల్ల మానవుని ఆయురారోగ్యాలు క్రమంగా వర్ధిల్లుతాయని, చపలత్వము, చంచలత్వమునకు ఆలవాలమైన మనస్సు ఏకాగ్రతను పొందుతుందనీ పతంజలి మహర్షి ఉవాచ,
ఇది 3 భాగాలుగా ఉంటుంది..
1. పూరకము: కుడి ముక్కును కుడిచేతి బ్రొటనవేలు తో మÖసి ఎడమ ముక్కు ద్వారా గాలి ని సాధ్యమైనంత ఎక్కువగా పీ¾ల్చడం.
2. కుంభకము: అలా పీల్చిన గాలిని బయటకు పోకుండా ఎడమ ముక్కు ను కూడా మధ్య వేలు అనామిక వేలుతో మÖసి నోటిని కూడా మÖసి సాధ్యమైనంత సేపు గాలిని ఛాతిలోనే బంధించి ఉంచడం..
3. రేచకము: ఇప్పుడు అలా బంధించిన గాలి ని కుడివైపు ముక్కు తో మెల్లగా వదలడం. ఇప్పుడు మళ్లీ ఎడమవైపు ముక్కును మÖసి కుడి ముక్కుతో గాలిని పీల్చి పిదప బందించి ఎడమ ముక్కుతో వదలడం. ఇలా కనీసం 3 సార్లైనా చేయాలి..
ప్రారంభంలో 10 సెకండ్లు పూరకానికి, కుంభకానికి 40సెకండ్లను, రేచకానికి 20 సెకన్లను తీసుకోవాలి. అనగా 1:4:2పద్ధతిలో శ్వాస క్రియ ను నియంత్రించడం సుళువు. దీన్ని మళ్ళీ కుడి వైపు ముక్కుతో పూరకము చేసి కుంభక రేచకాలను ఆదే విధంగా చేయడంతో ఒక ఆవృతం పూర్తి అవుతుంది.. ఇలా 3 ఆవృతాలు కనీసం చేయాలి..
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది... ఈ ప్రక్రియ చేస్తున్నంత సేపు గాయత్రి మంత్రాన్ని
ఓం భూః ఓం భువః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్ ! ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భవస్సువరోమ్
అంటూ జపించాలి. గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ గాలిని పీల్చడం నింపడం, వదలడం వల్ల మనం పీల్చే గాలి కూడా పవిత్రమై పోతున్న విషయం మనకు అవగతమౌతుంది కదా !!....
గాయత్రీ మంత్ర పఠనంతో చేసే ప్రాణాయామం, గాయత్రీమంత్రపూరిత వాయువు ద్వారా ప్రాణమయకోశాన్ని పవిత్రం చేసి తద్వారా మనసుని నియంత్రించి దాన్ని కేవలం భగవంతుని మీద నిలపడానికి దోహదం చేస్తుంది. భగవత్పూజకి మనసు ఏకాగ్రత ముఖ్యం కదా.! ఆ ఏకాగ్రతకి దోహదం చేసేదే ఈ లఘు ప్రాణాయామ క్రియ.
అంటే పవిత్రులలో కెల్లా పవిత్రుడు సర్వమంగళకరుడూ అయిన భగవంతున్ని పూజించడానికీ మనం బాహ్యంగాను అంతరంగంగాను మంత్రపూరిత జలంతోను వాయువు తోను పవిత్రులమవ్వాలని శాస్త్రవచనం.. మీరు గమనించే వుంటారు.
పూజా ప్రారంభంలో ‘ అపవిత్ర: పవిత్రోవ’ అంటూ భగవంతుని నామమైన పుండరీకాక్షున్ని స్మరిస్తూ మన తల మీద జలం చల్లుకొని బాహ్య దేహాన్ని పవిత్రం చేసుకున్నాం.
తరువాత కేశవ నామాలను పఠిస్తూ జలాన్ని నోటి ద్వారా స్వీకరించి అన్నమయ కోశాన్ని పవిత్రం చేసాము. గాయత్రీ మంత్ర జపంతో మనం పీల్చే గాలినీ తద్వార ప్రాణమయ కోశాన్ని పవిత్రం చేసాము. చూసారా ఎంత గొప్ప మహత్తర విషయం? పూజా ప్రారంభంలోనే దేహమును బాహ్య అంతర శుచిగా చేసి మనసుని భగవంతుని పై నిలపడానికి, చేసే ఈ ప్రక్రియ నిజంగా అద్భుతమైనదే కదా!
నారికేళ నివేదనము :
హిందుమతంలో నారికేళ ఫలము అంటే కొబ్బరికాయ లేదా టెంకాయ కుఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా దేవాలయాలకు వెళ్లినప్పుడు టెంకాయ కొట్టకుండా ఇంటికి రారు. అదే విధంగా భక్తితో ఇంట్లో కూడా కొబ్బరి కాయని నివేదించడం ఒక సదాచారం.
అయితే అసలు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, దాని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి?
నిజానికి టెంకాయను మనిషి శరీరంతో పోలుస్తారు. కొబ్బరి కాయ మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు. టెంకను ఎముకలతోను పోలుస్తారు. కొబ్బరిని మనసుగా భావిస్తారు. కొబ్బరికాయలో ఉన్న పరమ పవిత్ర జలాన్ని మన శరీరంలో ఉన్న ఆత్మకి ప్రతీకగా భావిస్తారు.
మంత్ర పుష్పంలో ఆత్మని వర్ణిస్తూ “అధో నిష్ణా వితస్యాంతి నాభ్యా ముపరితిష్ఠతి జ్వాలమాలా కులంభాతి” అని కదా శృతి..
నాభికి అభిముఖంగా తలక్రిందులుగా వ్రేలాడుతున్న హృదయ కమలంలోని నా ఆత్మని ఈకొబ్బరినీళ్లను సమర్పించిన విధంగా నీకు సమర్పిస్తున్నాను అని భావం. టెంకాయను కొట్టిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని మనస్సుగా భావిస్తారు.
అట్లా మనం కొబ్బరి కాయను కొట్టి దానిలో ఉన్న పరమ పవిత్ర జలాన్ని భగవంతుడికి ఆర్పిస్తూ స్వామి నా హృదయంలో వున్న ఆత్మకి మనసుకీ కూడా ప్రతీకలైన ఈ నారికేళ జలాన్ని, కొబ్బరిని సమర్పిస్తున్నాను. దయతో స్వీకరించు స్వామి. అనే దివ్యమైన సమర్పణ భావంతోనే కొబ్బరికాయను నివేదించాలి. కొబ్బరిని దేవుడికి కొట్టినప్పుడు మనసులో వున్న కల్మషం, అహంకారం, ఈర్ష్యాద్వేషాలు అన్ని తొలగుతాయని కొందరు పండితులు చెబుతున్నారు.
కొబ్బరికాయ కొడితే అది కుళ్లితే కంగారు పడాల్సిన పనిలేదు. అంతేకాకుండా టెంకాయను కొట్టినప్పుడు కొంతమందికి పువ్వు వస్తుంది. మరి కొంతమంది కొట్టినప్పుడు లోపల పెరుగుగా కనిపిస్తుంది. అయితే దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోతే మంచిదా లేక అపచారమా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. కొంత మంది కాయ కుళ్లితే కీడు సంభవిస్తుందని, చెడు జరుగుతుందని ఆందోళన చెందుతారు. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. సానుకూల దృక్పథంతో ఆలోచించి మనసులోని కుళ్లు ఈ రూపంలో వెళ్లిందని భావించాలి. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా, అందులో పువ్వు వచ్చినా చాలా సంతోష పడతారు.
కొత్తగా పెళ్ళైన వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతానప్రాప్తి లభిస్తుందని నమ్ముతారు. కాయ కొట్టినప్పుడు అది పగిలే విధానం కూడా కొంతమందిని తృప్తి పరుస్తుంది. కాయ సమానంగా పగిలితే మనసులోని కోరిక నెరవేరుతుందని భావిస్తారు. నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురుకి గానీ, కొడుకుకి గానీ సంతానం లభిస్తుందని భావిస్తారు.
హారతి :
చాలామంది దేవునికి దృష్టి తీయడం కొరకు హారతిని ఇస్తారని చెబుతారు. ఇది సహేతుకం కాదు. శాస్త్రీయం అసలే కాదు. జగత్ ప్రభువు, దేవదేవుడు, దేవతా సార్వభౌముడు. పురుషోత్తముడు, సర్వ మంగళకరుడూ అయిన భగవంతునికి, మాయా శక్తి విలాస కల్పిత మహా వ్యామోహ జనిత అజ్ఞానంతో అలమటించే మానవుని దృష్టి దోషం తగులుతుందని అనడం మహా అపరాధం. భగవంతుని యొక్క అపార శక్తిని అనుమానించినట్లే. హారతి అనేది ఒక సమర్పణా భావంతో భగవంతునికి చేసే ఉపచార ప్రక్రియ.
హారతిని సాధారణంగా హారతి కర్పూరం తో ఇస్తారు. అట్టి కర్పూరానికి ఒక నామం, ఒక ఆకారం, ఒక గుణం, ఒక రుచి ఉన్నాయి కదా.! హారతిని వెలిగించిన పిదప అక్కడ ఏమీ మిగలదు. నామ రూప గుణములు కలిగిన వస్తువు భగవంతునిలో లీనమై శూన్యం మిగులుతుంది. అలాగే నామ రూప గుణ ములు కలిగిన నన్ను నీలో ఐక్యం చేసుకో స్వామి అంటూ నివేదించడమే హారతి ముఖ్యోద్దేశం.
పూజలోని ముఖ్య ఘట్టాలను వివరించే ప్రయత్నం చేసాను.
పూజల పరమార్థాలు :
1.మనం భగవంతుని సృష్టి అయిన ప్రకృతి నుండి అనేక ఐశ్వర్యాలను సంపదలను పొందుతున్నాము. దానికి కృతజ్ఞతా భావంతో చేసే వందనం పూజ.
2.పూజ వల్ల చిత్తశుద్ధి కలిగి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి.
3. ప్రారu్ధ కర్మల తీవ్రత తగ్గి సుఖ మయ సంతోష జీవనం గడపడానికి పూజలు దోహదం చేస్తాయి.
4. దైవగుణాలైన సత్యం ధర్మం అహింస మన నిత్యజీవితంలో స్థిరప్రతిష్ఠను పొందుతాయి.
చివరిగా ఈ శ్లోకంతో ఈ పూజా వ్యాస పరంపరకు శుభం పలుకుతాను.
శ్లో: యస్య స్మృత్యాచ నామోక్త్యా
తప: పూజా క్రియాదిషు:
న్యూనం సంపూర్ణతాం యాతి
సద్యో వందే తమచ్యుతమ్.
భావం: ఎవరి స్వరూపాన్ని నామాన్ని స్మరించినంత మాత్రాన్నే తపస్సులో ను యజ్ఞంలోను అనుష్టానంలోను గల లోపం తీరిపోయి అప్పటికప్పుడు పరిపూర్ణత్వాన్ని కలిగింపజేసే ఆ నామ రూప స్వరూపుడైన అచ్యుతునికి నమస్కారం..
పుష్పాలతో దేవతాపూజ
దేవతలంటే దివ్య మంగళ స్వరూపులు, అనంత కళ్యాణ గుణ సంపన్నులు, అనంత ఐశ్వర్య బల జ్ఞాన శక్తి సంపన్నులూ అయిన శివ, కేశవ, అంబికా, ఆదిత్య, గణేశాది మÖర్తులు.. వారిని వివిధ పుష్పాలతో పూజించడం ఒక సత్సాంప్రదాయము.
ఈ భూమిమీద ఓషధులు అత్యత్తమ మైనవి. ఓషధీవృక్షాలలో పూలుపూసే చెట్లు ఇంకా ఉత్తమమైనవి. ఆ పుష్పములతో దేవతలను అర్చించిన మానవులకు శుభములు, మనస్సు వర్థిల్లుతాయి. అందు వలన పూలను సుమమనస్సులు అని అంటారు. పూలతో దేవతలను అర్చించిన దేవతలు హర్షించి మన కోరికలు తీరుస్తారని మన విశ్వాసం. మంచిసువాసన కలిగి, మంచి రూపము కలిగి, తెలుపువర్ణము గల పూలు దేవతారాధనకు మేలైనవి. అటువంటి పూలను దేవతలు ప్రీతితో స్వీకరిస్తారు. తామరలు, సన్నజాజులు, తులసీదళాలు, కూడా దేవతలకు మిక్కిలి ఆనందాన్ని ఇస్తాయి.
పుష్పాలతో పూజ చేసేటప్పుడు అష్టోత్తర శత నామాలను లేదా సహస్ర నామాలను గాని పఠించటం ఉత్తమం. పుష్పములతో సమానమైన నా ఈ నిర్మలమైన మనసును నీకు అర్పణ చేస్తున్నాను అని భగవంతున్ని వేడుకోవడమే పుష్పార్చన. పుష్పార్చనయే పుష్పాంజలి.
ధూపము :
ఇక ధూపము గురించి చెప్తాను. సల్లకీ అనే చెట్టునుండి తీసినపొడితో వచ్చే ధూపము దేవతలకు ప్రీతికరమైనది. అగరు ధూపము కూడా ప్రీతికరమైనది. అన్నింటి కంటే శ్రేష్టమైనది. కర్పూరముతో వేసే ధూపము. మంచి వాసన వచ్చే ధూపము దేవతలకు ప్రీతికరం. కనుక ప్రీతికరమైన ధూపము వేసినచో మానవులకు పరమపుష్టి ఆయుష్షు పెరుగుతుంది అలాగే మంచి గంధము, అగరు ధూపములు మానవుల మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి ఆహ్లాదమైన మనసుతో దేవతార్చన చేస్తే ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత వల్ల దైవానుగ్రహం కలుగుతుంది.
దీపారాధన :
దెవ పూజ చేసే ముందు దీపారాధన చేయాలి. దాని వలన అక్కడ ఉన్న భూతములు, రాక్షసులు మొదలైన కుత్సిత గుణ గణాలు వెళ్లి పోతాయి. బాహ్య అంతర అజ్ఞాన అంధకారాలు తొలగిపోయి జ్ఞానజ్యోతి వెలుగాలని దీపం వెలిగిస్తాము. అప్పుడు మన మనసు ధర్మచింతన వైపు మరలుతుంది. ప్రమిదలో నెయ్యి తక్కువ ఉండకూడదు. వత్తి సన్నగా ఉండకూడదు. సగం సగం వెలిగించ కూడదు. దీపారాధన చేసిన చక్కటి వెలుగు రావాలి. చీకట్లు పూర్తిగా తొలగి పోవాలి.
దేవుడికి ఆవునెయ్యి దీపము ఆత్యంత శ్రేష్టం. దీపములను దానం చేసిన వాడికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి... మాలోని అజ్ఞానాంధకారం తొలగిపోవాలని జ్ఞానజ్యోతి వెలగాలని సంకల్పిస్తూ పరబ్రహ్మ స్వరూపమైన ఈ సంధ్యా దీపాన్ని వెలిగిస్తున్నాను. ఓ పరంజ్యోతి నీకు నమస్కారము! అంటూ దీపాన్ని వెలిగించి పుష్పాక్షి తలను సమర్పించవలెను.
నైవేద్యము :
మనం తయారుచేసిన ఆహారం ముందుగా దేవతలకు నివేదన చేసి తరువాత భుజించాలి. నివేదన చెయ్యక తిన్న ఆహారం రాక్షసాహారం అవుతుంది. అందు వలన మానవుడు తన ఇంట తయారు చేసుకున్న ఆహారమును ముందుగా దేవుడికి నివేదించి తరువాత భుజించాలి. నువ్వులపిండి, పాలు, పెరుగు, నెయ్యి, సువాసన ద్రవ్యములు వేసి కమ్మటి వాసన వచ్చే పదార్దములు దేవతలకు ప్రియము చేకూరుస్తాయి. ప్రతిరోజు దేవతలకు నివేదన చేయు వ్యక్తికి సకల విధ శుభములు కలుగగలవు.
నెవైద్య పాత్రను నేలమీద అట్లాగే ఉంచరాదు. ముగ్గు వేసి దాని మీద పాత్రనుంచవలెను. ముగ్గు శ్రీచక్రానికి ప్రతీకగా గమనించగలరు. నివేదనమప్పుడు గాయత్రీ మంత్రోచ్చారణ తో బాటు పంచ ప్రాణ వాయు మంత్రాలైన ‘ప్రాణాయ స్వాహా, అపానాయః స్వా హా’ మొదలైన మంత్రాలతో నెవైద్యాన్ని దేవుడికి అర్పించాలి. ఈ ప్రక్రియను పెద్దవాళ్ళు చేస్తుంటే చిన్నవాళ్ళు చూసి నేర్చుకోవాలి. మనం అర్పించే నైవేద్యం పంచ ప్రాణాది వాయువుల ద్వారా గాయత్రీ మంత్ర శక్తి తో భగవంతున్ని చేరుతుందని మన నమ్మకం.
మంగళ హారతి :
మంగళప్రద జీవనాభిలాషులమైన మనం దివ్య మంగళ స్వరూపడైన భగవంతున్ని పూజించిన పిదప ఆ దేవదేవున్ని ఒక జ్యోతి రూపంలో ఆవాహన చేస్తూ దేవుని గుణములను ఒక చక్కని గానంతో వర్ణిస్తూ ధన్యవాదాలు తెలుపుతారు. మనం పూజించిన దేవుణ్ణి ఇంట్లో అయినా గుళ్ళో అయినా అందరూ సృశించలేరుకదా! ఆ దేవుణ్ణి ఈ మంగళ హారతి జ్యోతి లో దర్శించుకుని కళ్ళకద్దుకుంటాము. జన్మ ధన్యమైందని భావిస్తాము.. ఇదే మంగళ హారతి ఉద్దేశం.
ఈ క్రింది శ్లోకం తో విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం ముగిస్తారు.
శ్లో: ఆర్తా విషాణ్ణః శిథిలాశ్చ భీతాః
ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః
సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం
విముక్త దుఃఖాః సుఖినో భవంతి.
భావం: ఆర్తా= పూర్వ జన్మలలో చేసిన పాపాల ఫలితంగా, ఈ జన్మలో వచ్చిన కష్టాలను ఆర్తి అంటారు... ఆర్తి తో బాధ పడేవారు ఆర్తులు..
విషణ్ణ = ఈ జన్మలో చేసిన పాప ఫలితంగా కలిగే కష్టాలను అనుభవించే వారు విషణులు.
శిథిల= పాప ఫలితాన్ని అనుభవిస్తూ జీవితంలో శిధిలమై శల్యమై పోయిన వారు.
భీతా = జన్మంలోను మృత్యువులోను జరా అంటే వృద్ధాప్యం లోను భీతిని పొందేవారు. ఇలా జీవితంలో బాధ పడేవారేకాక ఘోరమైన వ్యాధులతో భయం పడేవారందరూ కూడా నారాయణ సంకీర్తన శబ్దాన్ని వినినంత మాత్రాననే అన్ని బాధలనుండి కష్టాలనుండి దుఃఖాల నుండి విముక్తిని పొంది సుఖశాంతులతో వర్ధిల్లగలరు. చివర ఈ మంత్రం చదవగలరు.
శ్లో: నాహం కర్తాః హరిః కర్తా తత్ పూజా కర్మ చాఖిలం
తదాపి మత్ కృతా పూజా తత్ ప్రసాదేన అన్యధా
భావం : నేను చేయువాడు కాను, హరి యే చేయువాడు. చేయించువాడు. నాచే నిర్వహింపబడు పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆ హరి యొక్క దివ్య ఆశీర్వాద ప్రసాదమే తప్ప అన్యము కాదు.
శుభం భూయాత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి