మొత్తం పేజీ వీక్షణలు

7, జూన్ 2022, మంగళవారం

అప్పులైనను నిప్పులైనను....telugu padhyam ramayanam and meaning

     అప్పులైనను నిప్పులైనను

      నాంజనేయుని కేమిలే!

     పప్పు లుప్పుల చింతపండుల

        పాడు సంసృతి లేదులే!

     తుప్పు బట్టని యాయుధం బది..

        తోడు.. రాముని నామమే!

     తప్పు జేయగనీదు.. గెల్పును

        దప్పకుండ నొసంగులే!

 లంకకు వెళ్ళి జానకీ మాతను దర్శించి తిరిగి వచ్చిన హనుమ జరిగిన వృత్తాంత మంతా వివరించి చెప్పాడు. అప్పుడు జాంబవంతుడు సంతోషించి వానరులతో యిలా అన్నాడు.

   "అప్పు లంటే నీళ్ళు.. నీళ్ళైనా నిప్పులైనా ఆంజనేయుని కేమీ ప్రమాదం లేదు. శతయోజన విస్తీర్ణమైన లవణ సముద్రాన్నే లంఘించి వెళ్ళడమే కాదు. క్షేమంగా తిరిగి వచ్చినాడు. అంతేకాదు. లంకలో తోకకు నిప్పంటించినా ఏ ప్రమాదమూ కానేలేదు. ఆయనే లంకను దహించివేసినాడు.

   సంసృతి అంటే సంసారం. ఎంతసేపూ పప్పులూ, ఉప్పులూ, చింతపండూ లాంటి సరుకుల

ఆలోచనతో ముడివడి వున్నది. అది మనకే గాని ఆంజనేయునికి లేదు కదా!

   తుప్పుపట్టని ఆయుధమైన రామనామం ఆయన కెప్పుడూ తోడుగా వుంటుంది. (ఆయన ఆలోచన అంతా రామనామంతోనే ముడివడి వున్నది.) ఆ రామ నామం తప్పు చేయనీయదు. తప్పకుండా గెలుపే ఇస్తుంది. చూశారా! మన ఆంజనేయుడు కార్యం సాధించుకొనే వచ్చాడు."


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి