భావన శుద్ధమౌ శబరి
పల్కెను "మద్గురు నాజ్ఞ నిన్ని నా
ళ్ళీ వరుదెంతు వంచును ని
రీక్షణ సల్పితిఁ.. బూజ లందుకో!
పావన మాయె జీవనము
భద్రద! రాఘవ! నీవు దక్క నే
దేవుడు లేనె లే డని మ
దిన్ కడు నమ్ముచు గొల్తు భక్తితోన్."
సీతారామ లక్ష్మణులు పంపా సరస్సు పశ్చిమ తీరంలోని శబరి ఆశ్రమానికి చేరుకున్నారు. సేవాభావం, వ్రతాచరణ, ధర్మనిష్ఠ కల శబరి రాముని పట్ల శరణాగతి భావంతో పెద్దకాలం నిరీక్షించింది. రాగానే పూజించింది. మధుర ఫలాలు సమర్పించింది. రాము డెంతో ప్రేమతో స్వీకరించాడు.
"అద్య మే సఫలం జన్మ స్వర్గశ్చైవ భవిష్యతి
త్వయి దేవవరే రామ! పూజితే భరతర్షభ!
దేవ శ్రేష్ఠుడవైన నీవు పూజితుడ వౌటచే నా జన్మ సఫల మయింది. నాకు పరమపదం సిద్ధిస్తుంది.
మా గురువులు మతంగ మహర్షి దివ్య లోకాలకు వెళుతూ రాముడు వస్తా డని, చూడగానే నీకు ముక్తి లభిస్తుం దని చెప్పారు."
అని వనమంతా చూపించి గురువుగారి పావన జీవనాన్ని కొనియాడింది. ఆమె గురుసేవను మెచ్చుకొని రాముడు అర్చితోఽ హం త్వయా భక్త్యా గచ్ఛ కామం యథా సుఖమ్.. (నన్ను భక్తితో పూజించినావు. కోరిన పుణ్య లోకానికి సుఖంగా పొమ్ము.) అన్నాడు.
శబరి రామునితో పలికిన పలుకు లివి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి