హిందూ పండుగ నాగ పంచమి విశేషాలు
***********************************
శ్రావణ మాసంలో ముందుగా వచ్చే పంచమిని నాగపంచమి లేదా గరుడ పంచమిగా వ్యవహరిస్తారు.
సనాతన భారతీయ సంప్రదాయంలో నాగారాధనకు, నాగరాజు పూజకు ఎంతో సముచిత స్థానం ఉంది.
శ్రావణ శుద్ధపంచమిని గరుడ పంచమిగా / నాగపంచమిగా ... అలాగే కార్తిక శుద్ధచవితిని నాగులచవితిగా పరిగణిస్తారు.
గరుడ పంచమీవ్రతాన్ని సోదరులు కలిగిన స్త్రీలు ఆచరిస్తుంటారు
మానవ సమాజంలో ఈ నాగపూజ అనే ఆచారం వేదకాలం నుంచీ ఉంది.
కేవలం హైందవ సంప్రదాయంలోనేగాక జైన, బౌద్ధ ధర్మాల్లోనూ నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది.
నాగరాజు పరమ శివుడికి అలంకారంగా హారమైతే, కేశవుడికి శయనానికి తల్పమయ్యాడు.
మన పురాణేతిహాసాల్లో అనేక సందర్భాల్లో ఈ నాగుల ప్రస్తావన కనిపిస్తుంది.
భవిష్య పురాణంలో నాగపంచమి ప్రస్తావన, నాగద్రష్ట, గరుడ పంచమీవ్రతాల కనిపిస్తుంది
ధ్యానముద్రలో ఉన్న జినుడు, బుద్ధుల శీర్షాలపై ఫణీంద్రుడు పడగవిప్పి ఉన్న శిలా ప్రతిమలు లభించాయి.
మొహంజొదారో శిథిలాల్లో అధఃకాయం నాగం, ఊర్ధ్వకాయం మానవుడుగల చిత్రాల ముద్రలు, యోగి పక్కనే పడగఎత్తి ఆడుతున్న సర్పాల ముద్రలు లభ్యమైనాయి
మహా భారతంలో మనకు అసంఖ్యాకంగా నాగుల పేర్లు కనిపిస్తాయి.
నాగుల్ని పూజిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకం మానవుల్లో ఉంది
నాగదోష పరిహారార్థం చాలామంది ఎన్నో పూజలు చేస్తారు.
పాములు పంటలను అభివృద్ధి చేస్తాయనీ కొందరు నమ్ముతారు.
గరుడ పంచమి రోజున చతురస్రాకార మండపంలో బియ్యంపోసి సర్పప్రతిమను ఉంచుతారు
దాని పడగకింద గౌరీదేవిని పెట్టి గౌరీదేవిని, నాగదేవతను భక్తితో పూజించి నైవేద్యం సమర్పించి కథ చెప్పుకుంటారు
గరుడ పంచమీవ్రతాన్ని 10 సంవత్సరాలు ఆచరించి ఉద్యాపన చేస్తే మంచిదంటారు
చతుర్థినాడు ఉపవాసం చేసి పంచమినాడు పంచముఖ సర్ప ప్రతిమను పూజిస్తే మంచిదని స్కంద పురాణం చెబుతోంది.
వినత, కద్రువ నాగపంచమి పౌరాణిక నేపథ్యం
****************************************
కశ్యపప్రజాపతి సతీమణుల్లోని వినత, కద్రువలు అక్కాచెల్లెళ్లు.
ఉచ్చైశ్రవమనే శ్వేతవర్ణం గల అశ్వం పాలసముద్ర మథనంలో జనించింది
కశ్యపుడి భార్యలైన కద్రువ, వినతలు సముద్ర తీరాన విహరిస్తూ దూరంనుంచి గుర్రాన్ని చూశారు.
కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్నా తోకమాత్రం నల్లగా ఉందని పలికింది.
వినత దానికి అంగీకరించక దేహమంతా తెల్లగానే ఉందని చెప్పింది.
కద్రువ నలుపు చూపితే వినత ఆమెకు దాసి అయ్యేటట్లు, చూపలేకపోతే కద్రువే దాసి అయ్యేట్లు పందెం కుదిరింది.
ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వద్దామని వెళ్లిపోయారు.
కద్రువ కపటబుద్ధితో తన సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వేలాడమని కోరింది.
అయితే నాగులు అలా పాపం చేయడం తగదని హితవు పలికాయి.
వారు దానికి ఒప్పుకోలేదు.
దీంతో కోపించిన ఆమె భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో నాగులు పడి జాతి అంతమవుతుందని శాపం పెడుతుంది.
దీంతో భీతిల్లిన కర్కోటకుడనే కుమారుడు తల్లి శాపానికి వెరచి అశ్వరాజంపై వేలాడాడు.
మర్నాడు దూరంనుంచి గుర్రం తోక నల్లగా కనిపించగానే వినత ఓటమిని అంగీకరించి కద్రువకు దాసి అయింది.
ఆమె కుమారుడైన గరుత్మంతుడు తల్లికి శాపవిముక్తి కలిగించాడు.
నాగులపై ద్వేషంతో వినత కుమారుడు గరుత్మంతుడు నాగులను హింసించి భక్షిస్తుంటాడు.
పాముల ప్రాణభయాన్ని తగ్గించడంకోసం వాసుకి రోజుకు ఒక్కొక్క సర్పాన్ని ఆహారంగా పంపడానికి గరుడుడితో ఒప్పందం చేసుకుంటాడు.
నాగుల పంచమి - జీమూతవాహనుడు
********************************
జీమూతవాహనుడు విద్యాధర యువకుడు. అతను పర్వత ప్రాంతంలో తిరుగుతూ సర్పాల మృత అవశేషాలను చూస్తాడు
ఒక రోజు ఖగరాజుకు ఆహారంగా శంఖచూడుడనే పన్నగ కుమారుడు వస్తాడు
దయామయుడైన జీమూతవాహనుడు తానే గరుడుడికి ఆహారమై శంఖచూడుడి ప్రాణాలు కాపాడదలచి ఎర్రటి వస్త్రం ధరించి వధ్యశిలపైకి ఎక్కుతాడు
గరుత్మంతుడు అతణ్ని భక్షించబోయే సమయానికి జీమూతవాహనుడి తల్లిదండ్రులు, భార్య వచ్చి అతణ్ని బతికించమని అడుగుతారు గరుత్మంతుడు తప్పు గ్రహించి అతణ్ని వదిలిపెట్టి జీమూతవాహనుడి కోరికపై ఇకముందు సర్పజాతిని హింసించనని మాట ఇచ్చిన రోజున గరుడ పంచమిగా జరుపుకొంటారు.
ఆదిశేషువు - నాగ పంచమి
**********************
యావత్ భారాన్ని మోస్తున్న ఆదిశేషువును ఒకసారి ఏదైన వరం కోరుకోమంటాడు విష్ణుమూర్తి.
ప్రతి మాసం శుక్ల పంచమి నాడు లేదా ప్రతి ఏడాది శ్రావణ శుక్ల, మార్గశిర పంచమి నాడు నాగులను అందరూ పూజించాలని ఆదిశేషువు కోరుకున్నాడు.
ఆ వరాన్ని విష్ణుమూర్తి ఇవ్వడంతో శ్రావణశుక్ల పంచమి పర్వదినాన్ని నాగపంచమిగా జరుపుకొంటూ నాగులకు పూజలు చేయడం సంప్రదాయంగా మారింది.
జనమే జయుడు - సర్పయాగం
***************************
ద్వాపర యుగంలో పరిక్షిత్తు మహారాజును తక్షకుడు కాటు వేయడంతో మరణిస్తాడు.
తండ్రి మరణానికి నాగులే కారణమన్న కోపంతో జనమజేయుడు సర్పయాగం నిర్వహిస్తాడు.
ఈ సర్ప యాగంలో లక్షలాది సర్పాలు పడి మృతిచెందాయి.
వాసుకి సోదరి మాతా మానసదేవి తన కుమారుడైన అస్తీకున్ని యాగప్రదేశానికి పంపడంతో అతను యాగాన్ని నిలిపివేయమని జనమేజయుడిని ప్రార్థిస్తాడు. ఆ విధముగా దీంతో సర్ప యాగం నిలిచిపోతుంది.
శ్రావణ శుక్ల పంచమి నాడు నాగజాతిని సంరక్షించిన దినం కావడంతో ఆ రోజును నాగపంచమిగా జరుపుకొంటారు.
గరుత్మంతుడు - నాగ పంచమి కథనం
********************************
అక్కాచెల్లెళ్ల బిడ్డలైన గరుత్మంతునికి, నాగులకు మధ్య వున్న ఘర్షణను నివారించేందుకు విష్ణుమూర్తి ఇరువర్గాల మధ్య సంధి కుదర్చుతాడు. ఈ ఒప్పందం శ్రావణమాసం శుక్లపంచమినాడు జరిగింది. అందుకే గరుడ పంచమి అని కూడా వ్యవహరిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి