మొత్తం పేజీ వీక్షణలు

18, జూన్ 2022, శనివారం

palamuru labour troubles

 పాలమూరు కూలీల బతుకులు

పాలమూరు కూలీలు భారత దేశమంతా పేరు గాంచినారు. దేశంలో ఏ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టినా, కాలువలు త్రవ్వినా, కొండల్ని పిండిచేసి కోనల్ని నరికి రహదార్లు వేసినా అక్కడ పాలమూరు కూలీల చెమట బొట్లు పునాదిరాల్లుగా మారిపోకుండా ఉండవు.

ఈ జిల్లాలో ముఖ్యంగా కొల్లాపూర్‌, నాగర్‌ కర్నూల్‌, అచ్చంపేట, గద్వాల, వనపర్తి ఆత్మకూరు తాలూకాలలో నుండి లక్షల సంఖ్యల్లో దినసరి కూలీలు తను జానెడు పొట్ట నింపుకోవడం కోసం దేశంలోని అన్ని మిగతా రాష్ట్రాలకు వెళ్తుంటారు. అయితే అక్కడ వీళ్ళు తమ అమాయకత్వం వల్ల అనాదిగా విపరీతమైన శ్రమ దోపిడికి గురవుతున్నారు. కొంత డబ్బు వీళ్ళకు అడ్వాన్సుగా యిచ్చి వీళ్ళని దూర తీరాలకు కంట్రాక్టర్లు తమ వెంట తీసుకుని వెళ్తారు. అక్కడ వీళ్ళు నిర్భంధంగా వెట్టిచాకిరి చేయవలసి వస్తుంది. మూడు నెలల జీతం అడ్వాన్సుగా పొందిన వీళ్ళు మూడు సంవత్సరాలైనా కూలీ చేస్తూనే ఉంటారు. భార్యా పిల్లలకు దూరమై కొండలలో కోనలలో దిక్కూ దివాణం లేకుండా దారి తెన్నూ తెలియకుండా  మేస్త్రీలు చెప్పిందల్లా బానిసల్లా తలవంచి రెక్కలను ముక్కలను చేసుకోవడమే వీళ్ళ పని.

ఈ నిర్బంధ దాస్యాన్ని ఎంతో కష్టం మీద తప్పించుకొని బయటపడిన వాళ్ళూ ఊరూరా వీధి వీధినా బిచ్చమెత్తుకుంటూ రెండు మూడు సంవత్సరాలకు కానీ ఇల్లు చేరని వాళ్ళు కోకొల్లలు. దిక్కూ దివానం లేకుండి అక్కడే చచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలాగోలా తిరిగి వచ్చిన వాళ్ళలో ఎంతో మంది చావు తప్పి కన్నులొట్టపోయిన చందాన తయారవుతారు.

ఇన్ని ఘోరాలు జరుగుతున్నా వీళ్ళు ఇంకా ఎందుకు వెళ్తున్నారు? తింటనికి రొట్టె లేక కట్టడానికి బట్ట లేక తలదాచు కోవడానికి నీడలేక యిక్కడ కూడా వాళ్ళకు అంతకంటే మంచి బతుకులు లేక వెళ్తున్నారనే చెప్పుకోవాలి.

ఏళ్ల తరబడిగా వస్తున్న ఈ సమస్య గతంలో పాలమూరునుంచి ఢల్లీి పార్లమెంటు దాక వెళ్ళింది. అయినా సమస్య సమస్యగానే వుంది తప్ప పెద్దగా వారికి లాభించినట్టు లేదు. దీనికి పరిష్కార మార్గం ఏమిటి?

ఈ జిల్లాలో ఏ ఏ ప్రాంతాలనుంచి ఎక్కువగా యీ రకపు కూలీలు వెళ్తున్నారో ఆ ప్రాంతాలలోకి లేబర్‌ డిపార్టుమెంటు వాళ్ళు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలు వెళ్ళి సమగ్ర సర్వే జరపాలి. వాళ్ళకందరికీ వెంటనే భూములు, ఇళ్ళు ఉచితంగా సమకూర్చి తగిన జీవనోపాధికై తక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. రాష్ట్ర నిర్మాణాల సంస్థ ద్వారా వీరికి తగినన్ని పనులు కల్పించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి