మొత్తం పేజీ వీక్షణలు

20, జూన్ 2022, సోమవారం

స్త్రీలు ధరించే వివిధ ఆభరణములు - వాటి విశిష్టతలు

 స్త్రీలు ధరించే వివిధ ఆభరణములు - వాటి విశిష్టతలు 


మన పూర్వీకులు వారు వదిన ఆభరణా లందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో ముఖ్యమనే తలచారు. 

పురాణాల్లో మణిమహత్వాలకు సంబంధించిన కథలు ఎన్నో ఉన్నాయి 

వారికి మణిమంత్రౌషధాలారోగ్యదాయకాలు. 

నాడు ఆరోగ్యసాధనాల్లో మణులదే మొదటిస్థానంగా ఉండేది . 

మణులు ధరించటంవల్ల వ్యాధులు గూడా శమిస్తాయి. 


మణిధారణం వ్యక్తికి నక్షత్రాన్ని మరియు రాశినిబట్టి ఉంటుంది. 

బంగారంవిషయంలో స్త్రీలది సహజంగా ఉష్ణతత్వం గాబట్టి వారిలోని నిసర్గ మైన ఉష్ణాన్ని క్రమబద్ధం చేసేందు కుష్ణవాహక మైన స్వర్ణధారణ ఒప్పింది 

ఆరోగ్యాని కవసరమైన రత్నస్వర్ణాలు రెండూ కలసి హిందువుల్లో భూషణకల్పనకు దారితీశాయి.

భారతస్త్రీకి ఆభరణదీక్ష వివాహకాలంలో విధింపబడుతుంది. 

అగ్రవర్ణుల్లో తలంబ్రాల పిమ్మట స్థాలీపాకం, ప్రధానం, సదస్యం, నాకబలి అనేవరుసలో వివాహక్రియలు జరుగుతాయి. 

స్థాలీపాకంలో వధూవరులకు గృహస్థదీక్ష యివ్వబడుతుంది. 

సదస్యంలో సభాపూజ ఉంటుంది. గృహస్థదీక్షను పొందినవధూవరులు అలంకారయుక్తులై సభ నర్చింపవలసి ఉంటుంది. 

దానికి పూర్వరంగంగా వివాహవిధుల్లో ప్రధానం జరుపుతారు. 

ప్రధానమనేది వధువుకి భూషణారోపణక్రియ లాంటిది .

ప్రధానంలో వధువుకి అత్తవారు కొనితెచ్చిన నగలన్నీ అలంకరిస్తారు. 

అది ఒకరకంగా సువాసినీదీక్ష. 

సువాసిని యెల్లపుడు నగలు అలంకరించుకోవలసినట్లు, అది ఆమె భర్తకు క్షేమదాయక మైనట్లు, మనకు సుగాత్రి కథ చెబుతుంది. 

ప్రతిక్షేమానికి ప్రధానకారణం కనుక భూషణారోపణక్రియను వివాహంలో ‘‘ప్రధాన’’ మని పిలిచారు. 

శూద్రుల్లో ప్రధానం జరిగేంతవరకు వధువును తలంబ్రాలకే పంపరు.


ఆదిలో కేవలం స్త్రీలేగాదు పురుషులుగూడా నగలు ధరించేవారు. 

గోపాలచూడామణి నాసాగ్రంలో నవమౌక్తితం ధరించాడు. 

అతడు కేళిచలన్మణికుండలుడు. 

యజ్ఞశ్రీశాతకర్ణికి లలాటపట్టిక, తిక్కనగారి కీచకునికి మెట్టెలు ఉండేవి. 

పురాకాలంలో కంకణాలు, కుండలాలు, హారాలు కటిసూత్రాలు, స్త్రీపురుషులిద్దరికీ సమానంగా ఉండేవి 


పూర్వం ధనవంతులు తమజడను బంగారంతో చేయించుకొనేవారు. దాన్ని పడగలు విచ్చుకొన్న పెద్దనాగరాని కిరవయ్యేడుసైజువారీ అర్థచంద్రాకారపు పాళెలు గ్రుచ్చి తయారుచేసేవారు. 

దానిచివర ఓగంటల గుత్తి ఉండేది. దానిలో ఓ పెద్దగంటనుండి చిన్నచిన్నవి తొమ్మిదిగంటలు గుత్తిగా వ్రేలాడుతూ ఉండేవి.

ఈ జడలో ఉండే తొమ్మిదిగంటలు నవగ్రహాలు. 

వాని మేరువుగంట బ్రహ్మాండకర్పరం. 

ఇరవయ్యేడు అర్ధచంద్రాకారపుపాళెలు అశ్విన్యాది నక్షత్రాలు, అన్నిటికి పైనుండే నాగరం ఈసృష్టినంతా భరించే శేషుడు. 

ఆ జడను విశ్వకర్మ తన సృష్టికి సంకేతంగా రూపొందించినట్లు భామాకలాపంవల్ల తెలుస్తుంది.

కలాపమంటే శిరోభూషణం. 

ఇది స్త్రీల వేణీప్రదర్శనంతో ఆరంభ మౌతుంది కాబట్టి దీన్ని ‘‘భామాకలాప’’ మని పిలిచారు. 

దేశీసాహిత్యంలో కలాపాలు తెలుగువారి సొంత ఆస్తి.


జడపిమ్మట శిరోభూషణాల్లో చెప్పదగినవి పింపిణీ కేతకి ` రాగిడీ చంద్రవంకలు లేదా నాగరం. 

వీటిని పాపిట చివరనుండి నడినెత్తిపై వరకు వరుసగా గ్రుచ్చుకొంటారు.

పాపిడికి సీమంతమని పేరు. 

అది నడినెత్తిపైనుండి కపాలంవరకు వెళ్ళుతుంది. 

దానిచివరలో కొన్ని వెంట్రుకలు పట్టి, సన్నని జడ అల్లి , వాటికి పింపిణీ మొదలైనవి గ్రుచ్చుకొంటారు.

యోగశాస్త్రప్రకారం మన కపాలంలో సహస్రారచక్రం, 

దానిలో సూర్యచంద్రులున్నారు. 

ఆ చక్రాన్ని- మూలాధారంనుండి మొదలైన సుషుమ్నానాడి వెన్నుపాము క్రిందినుండివెళ్లి కలుసుకొంటుంది. 

దానికి ఇడా - పింగళానాడులు రెండు వైపులనుండి సర్పాలక్రమంలో పెనవైచుకొని ఉంటాయి.

మూలాధారంలో కుండలినీశక్తి నిద్రించి ఉంటుంది. 

యోగులు దాన్ని తమ సాధనద్వారా మేలుకొలుపుతారు. 

అప్పుడది సుషుమ్నానాడిద్వారా పయనించి సహస్రారాన్ని చేరుతుంది. 

అక్కడుండే చంద్రబింబంనుండి యోగిశరీరంలోకి అమృతవర్షం కురియ నారంభిస్తుంది. 

దానితో అతడజరామరుడౌతాడు. 


పింపిణి అంటే వేణిక. 

ఈ వేణిక ఇడా ` పింగళా - సుషుమ్నలకు చిహ్నం.

అందుకే దీన్ని త్రిముఖాకృతిగా చేస్తారు. 

పింపిణి పిమ్మట కేదకి ఉంటుంది. 

అది కేతకి రూపాంతరం. 

దానికి మొగిలిరేకని మరోపేరు. 

రాంబస్‌ ఆకారంలో ఉండే ఈ నగ కుండలినీనాడుల్ని సహస్రారానికి కలిపే సంధానదళానికి చిహ్నం. 

దీని వెనుక దాగిడీ చంద్రవంకలుంటాయి. 

అవి సూర్యచంద్రమండలాలకు ప్రతీకలు. 

తలలో ఇంచుమించు అదేస్థానంలో ఆ మండలాలుంటాయి.

రాగిడీచంద్రవంకల స్థానంలో పూర్వం కొందరు నాగరం వేసేవారు. అది చుట్టలు చుట్టుకొన్న సర్పాకారభూషణం. 

రాగిడీస్థానంలో ధరింపబడే ఈ భూషణం కుండలిని సహస్రారానికి చేర్చవలసినవిషయాన్ని తెలుపు తుంది.


నెత్తి తరువాత ఎక్కువ భూషణాలు చెవులకు ధరించేవారు. పంచీకరణంలో శ్రోత్రం ఆకాశతత్వం, కర్ణాభరణాల్లో ముత్యాలో మణులో ఉపయోగించనివంటూ ఉండవు. 

ముత్యాలను మణులను చుక్కలతో పోలుస్తారు. 

చెపుల సామాను నక్షత్రాలకు సంకేతంగా ఏర్పడిరదని చెప్పవలసి ఉంటుంది.

కర్ణాభరణాల్లో ముఖ్యమైనవి తాటంకాలు. 

అవి సూర్యచంద్రబింబాలకు చిహ్నాలు. 

పురుషులు చెవులకు నవగ్రహకర్ణ వేష్టనాలు ధరించేవారు. నిగమశర్మ, బావగారికవి ఉండేవి. 

చెవులను గుఱించి పూర్వులకు ఆకాశతత్వ భావన లేకుంటే కర్ణవేష్టనాలకు నవగ్రహాలపేర నామకరణం చేయవలసిన అవసరం కనిపించదు.


పూర్వం నాసాభరణం లేని పుణ్యస్త్రీ ఉండేదికాదు. 

మన ముక్కులోని ఎడమశ్వాసకు చంద్రస్వరమనీ, కుడిశ్వాసకు సూర్యస్వరమనీ పేర్లు. 

ఎడమముక్కుకి అర్ధచంద్రాకారమైన బేసరి, కుడిముక్కుకి మండలాకారమైన వొంటిరాయిపుడక విధించారు. 

మన శ్వాసకు ‘‘హంస’’ అని మరోపేరు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముక్కుకి ‘‘హంసనత్తు’’ రూపొందించారు.

ముత్తయిదువు ముక్కుకి ముత్యాన్ని తప్పక ధరించాలని పూర్వుల మతం. 

శంకరాచార్యులు శ్రీదేవి తన ముక్కుకి ముత్యాన్ని ధరించి ఉన్నట్లు వర్ణించాడు. 

స్త్రీ శ్వాస దుష్టమయిందనీ, అది పురుషులపై పొలయరాదనీ పూర్వుల నమ్మకం. 

వాయుశుద్ధిద్రవ్యమైన ముత్యాన్ని ముంగరకు విధించి వారిశ్వాసకు శుద్ధిమత్తను కల్పించారు.

ముంగర ముక్కుకి ధరించినా దాని శోభ మాత్రం అధరబింబానికే చెందుతుంది. 


కర్ణాభరణాల్లో మరో ముఖ్య భూషణం కుండలాలు. 

శ్రీమహావిష్ణువు మకరకుండలమండితుడు. 

ఈ కుండలాలుగూడ మనకు శ్రవోతత్వాన్ని నిరూపిస్తాయి.

ఆకాశంలో సమస్త గ్రహనక్షత్రాల్ని గర్భీకరించుకొన్న శింశుమార చక్రం దక్షిణావర్తమైన మకరాకారంలో తలక్రిందుగా వ్రేలుతూ, పుచ్ఛబలంపై నిలిచి, ధ్రువునిచుట్టు తాను తిరుగుతూ కాలచక్రాన్ని నడుపుతుంది. 

ఆకాశతత్వమైన చెవులకు` వ్రేలాడే కుండలాలకు` పూర్వు లావర్తమైన మకరాకారాన్ని రూపొందించారు.


వాగింద్రియమైన వదనానికి జలాధిపతిjైున వరుణుడధిదేవత. 

ముత్యాలు రత్నాలు నిజాని కతనిసొమ్మే కాబట్టి రదనచ్ఛదమైన అధరాలపై అధరచ్ఛదమైన ముంగరలోఉండే దానిమ్మ గింజల్లాంటి మణులు, మిలమిలలాడే ముత్యాలు, వరుణ దేవుని కెత్తిన మణినీరాజనంలా ముఖాని కెంతో నిండుదనాన్నిస్తాయి.


స్త్రీ కుండవలసిన భూషణాల్లో అతి ప్రధానమయింది మాంగల్యం. 

స్త్రీ ప్రకృతి స్వరూపిణిగాబట్టి ఆమె ఓ పురుషుని కంకితమైపోయి, మరోపురుషుని కనటంతోనే తనజీవితం చరితార్థమైనట్లు భావించటంలో వింతలేదు.

భారతీయ దాంపత్యం ప్రకృతి పురుష సంయోగానికి ప్రతిరూపం. పురుషునికి కలుగవలసిన మాంగల్యపరంపర స్త్రీ హృదయమూలంగా కలుగవలసిఉంది. 

కల్యాణసమయంలో మాంగల్యధారణం స్త్రీకి ఆమెకు శరీరంలో ఏ హస్తాదులకోగాక హ ృదయ స్థానంలో విధించబడింది.

వివాహసమయంలో కన్యకు తల్లివారు, అత్తవారు ఇద్దరు చెరో మాంగల్యం చేయిస్తారు. 

వాని ఆకారాలు వేరు వేరుగా ఉంటాయి 

తల్లివారు గిన్నెపుస్తె- అత్తవారు ఆకుపుస్తె చేయిస్తారు. 

పుస్తెలు గౌరీ శంకరులకు ప్రతిరూపాలు. 

గౌరి మాంగల్య దేవత కాబట్టి ఆమె ముత్తయిదువులకు నిత్యపూజనీయ. 

ఆమె గిరిరాజపుత్రి కాబట్టి స్త్రీలామెను గౌరవర్ణంగల పసుపుతో గిరి ఆకారంగా చేసి పూజిస్తారు. 

వధువుకి తల్లివారు స్త్రీపక్షంవారు కాబట్టి వారు చేయించే పుస్తె గౌరీ ఆకారంలో ఉంటే అత్తగారు వరపక్షంవారు కాబట్టి వారు చేయించే ఆకుపుస్తె, పానవట్టంపై శివలింగం నిలిపినట్లు పురుషారంగా ఉంటుంది. 

కాబట్టి కన్యకు వధూపక్షంవారు చేయించేపుస్తె గౌరీ ఆకారంలోనూ, వరపక్షంవారు చేయించే పుస్తె శివాకారంలోనూ ఏర్పరచటం తత్వమెరిగి చేసిన నిర్ణయమనక తప్పదు. 

గౌరీశంకరుల ప్రతిరూపాలైన మాంగల్యద్వయం వధువుగళాన్ని అలంకరించి ఆమెకు మాంగల్యాన్ని ప్రసాదిస్తాయి.

పుణ్యస్త్రీకి ప్రతిదినం నిద్రలేవగానే తనపుస్తెలను కళ్ళకద్దుకోవలసిన నియమం ఉంది. 

ఆమె వాని నావిధంగా దర్శించటంలో నిద్రలేవగానే ఆదిదంపతులై న గౌరీశంకరులను దర్శించిన ఫలితం దక్కుతుంది. 

వివాహానంతరం కొందరీ మాంగల్యాలకు తాలిసామాను చేయించుకొంటారు. 

దానిలో ముప్పది మూడుజతల బిళ్ళలుంటాయి. 

వాని పై మత్స్య, కూర్మ వరాహాలు-స్వస్తిక, భేరీ మొదలైన మంగళచిహ్నాలు ముప్పదిమూడుకోట్ల దేవతలకు ప్రతీకలు. 

స్త్రీలు వాటిని మాంగల్యాని కిరువైపులా గ్రుచ్చుకొంటారు. 

వాటిని వారలా గ్రుచ్చుకోవటమంటే తమ రక్షణకు వా రాయా దేవతల నాశ్రయించి సేవించటమన్న మాట. 


ఆభరణాల్లో వజ్రాన్ని దేనిలో పొదిగినా పొదగకున్నా ఉంగరంలో పొదగటం పరిపాటి. 

పురుషుడు హిరణ్యగర్భుడుగాబట్టి మానవులు తమ ఊర్ధ్వకాయాన్ని హిరణ్యంతో అలంకరించుకోవలసినట్లు శాస్త్రం చెబుతుంది.

మన దేహమొక దేవాలయం. 

‘‘దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవో సనాతనః’’ అని శాస్త్రం చెబుతుంది. 

ఆదిశంకరులు నిర్వాణషట్కంలో ‘‘చిదానందరూపః శివోహం శివోహం’’ అని చెప్పినాడు 

శివుని జడముడికి సర్పం

స్త్రీలకు తలపై నాగరం

శివుని చెవులకు సర్పాలు

స్త్రీల చెవులకు సర్పిణీలు

శివుని మెడలో పన్నగహారం

 స్త్రీల మెడలో బన్న సరం (పన్నగసరం)

శివుని దండ చేతులకు సర్పాలు

స్త్రీల చేతికి నావంకు (నాగవంకు)


ఈ విధంగా శివుడేయే స్థానాల్లో సర్పాలు ధరించాడో మనస్త్రీల కాయా స్థానాల్లో ధరించే భూషణాలు సర్పవాచకాలలో రూపొందించి, ఈ జీవునియందలి శివత్వాన్ని విశ్వకర్మలు తమ శిల్పంలో నిలిపారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి