మొత్తం పేజీ వీక్షణలు

8, జూన్ 2022, బుధవారం

ప్రల్లదములు పలికి భయపెట్టకుము నన్ను,....ramayanam - telugu padhyam with meaning

     ప్రల్లదములు పలికి భయపెట్టకుము నన్ను,

     హ్లాద మిదె యటంచు వాద మేల?

     దురిత మంటు గాక! దురపిల్లబోను, వే

     డుకొనలేను, రామునికి బెదరను


 "సీత నపహరించి తేవటం దురితం (పాపం). ఆమెను రాముని కప్పగించి వేడుకో. అదే హ్లాదం (సంతోషం)."  అని హితవు చెప్పిన తమ్ముడైన విభీషణునితో రావణు డన్న మాటలు..

    ప్రల్లదములు= దుర్భాషణములు

    దురపిల్లు= దుఃఖించు


ప్రకటి తాంగీకృతియె సుమ్ము రాము సొమ్ము.....ramayanam-telugu padhyam & meaning

ప్రకటి తాంగీకృతియె సుమ్ము రాము సొమ్ము..

హ్లాదమే గాని వేదన లేదు సుమ్ము..

దుర్గ మాటవిన్ ధైర్యమే తోడు, బెదర

డు, పురమున ధర్మ మౌను తోడు,మొనగాడు.


 శ్రీ రాముడు రావణ సంహారానంతరం అయోధ్యకు తిరిగి వచ్చాక ఆతని గుణగణాలను పౌరు లిలా ముచ్చటించుకుంటున్నారు...

     "అరణ్యమైనా అయోధ్యయైనా రామునికి అంగీకారమే! ఆ భావనే ఆయనకు సొమ్ము (ఆభరణం). ఎందుకంటే దుర్గమమైన (చొరరాని) అరణ్యంలో అతనికి  ధైర్యం తో డుంటుంది. అట్లే అయోధ్యలో (రాజ్యంలో) ధర్మం తో డుంటుంది. రామో విగ్రహవాన్ ధర్మః..అని కదా! (ఎక్కడైనా మనగలడు.) అట్లాంటి రాముడే నిజంగా మొనగాడు. ఎవరికీ బెదరడు."


అబ్ధి లంఘించి వచ్చినా డబ్బురముగ......ramayanam - telugu padhyam

     అబ్ధి లంఘించి వచ్చినా డబ్బురముగ

     పట్టి, పొగ రుబ్బు దనుజాళిఁ గొట్టి చంపె,

     నచటి కేగకు, జీవన మబ్బు కొడుక!

     ప్రళయ రుద్రుని మెరు గబ్బు ప్లవగ మద్ది


 అశోక వన విధ్వంసం గావించి ఎందరో రాక్షసులను మట్టి గరపించినాడు ఆంజనేయుడు.

   ఒక రాక్షసవీరుడు ఆ కోతి నిప్పుడే చంపివేస్తా నని ఇంటి నుండి బయలుదేరగా అతని తండ్రి ఇలా వారించినాడు.

     "అబ్ధినే (సముద్రాన్నే) లంఘించి వచ్చినా డబ్బురముగా (ఆశ్చర్యకరంగా). పొగ రుబ్బే గర్వం అతిశయించే (మితిమీరే) రక్కసులను గొట్టి చంపినాడట! అక్కడికి (అశోకవనానికి) మాత్రం వెళ్ళకు కొడుకా! జీవన మబ్బుతుంది. (జీవితం లభిస్తుంది.) వెళ్ళితే మాత్రం తిరిగిరావు. అది ఉట్టుట్టి ప్లవగం (కోతి) కాదు. ప్రళయ కాల రుద్రుని మెరుగు అబ్బు (కాంతితో విజృంభించే) ప్లవగం."


సంయమీంద్రు డస్త్ర సద్విద్య ఘన పుర.....ramayanam - telugu padhyam and menaing

     సంయమీంద్రు డస్త్ర సద్విద్య ఘన పుర

     స్కారముగ నొసంగె గాధి సుతుడు..

     రణ విజేత లైరి రామలక్ష్మణు లహో!

     ముదము కలిగె లోకమునకు మిగుల


 గాధి సుతుడైన విశ్వామిత్రుడు మహాతప స్సంపన్నుడు. సంయమీంద్రుడు. అస్త్రవిద్యా విశారదుడు. యజ్ఞ సంరక్షణార్థ మనే మిషతో రామ లక్ష్మణులను తోడ్కొనిపోయి వివిధములైన అస్త్రములను ప్రయో గోపసంహా రాలతో సహా ఉపదేశించినాడు. అస్త్రవిద్యనే పురస్కారంగా (కానుకగా) వారి కిచ్చినాడు. 

   భవిష్యత్తులో రావణా ద్యనేక రాక్షస వీరులను సంహరించవలసిన అవతార కార్యక్రమానికి వారిని సుశిక్షితులను గావించినాడు. రామ లక్ష్మణులు రణ విజేతలై లోకానికి సంతోషం చేకూర్చినారు.


కరుణను రాముడు " రావణ....ramayanam - telugu padhyam and meaning

    కరుణను రాముడు " రావణ!

    సరిసరి! యలసితివి నేడు

                      చను" మనగానే

    మరి సముచిత మిదె యనిఁ దో

    చ.. రణంబులు లేనివాడు

                       చకచక నడచెన్


 రావణుడు ఆరోజు యుద్ధంలో బాగా అలసిపోయినాడు. కరుణాస్పదుడైన రాముడు  "రావణా! నీవు అలసిపోయినావు. ఇంక ఇవాళ యుద్ధం అక్కర లేదు. వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపు ర" మ్మన్నాడు. ఇదే మంచి దని (సముచిత మని) మదిలో తోచగా యుద్ధములు లేని వాడు (రావణుడు) చకచకా నడచిపోయినాడు.


రవి కుల పావనుం డయిన.....srimadramayanam telugu padhyam and menaing

    రవి కుల పావనుం డయిన

       రామ నరేంద్రుని సచ్చరిత్రమున్

    కవి యను పేరు సార్థకము

       గాగను వాల్మికి కావ్య మల్లగా..

    పవిధరుడున్, మునుల్, జనులు

        భక్తి నిబద్ధతఁ గేలు మోడ్వగా..

    చెవికి పసందుగా వినుచుఁ

        జేష్టలు దక్కెను వాయుపుత్రుడున్

 కవి యనే పేరు సార్థకం అయేటట్టు వాల్మీకి కావ్య మల్లగా... పవిధరుడు (దేవేంద్రుడు), మునులు, జనులు భక్తితో కేలు మోడ్వగా (చేతులు జోడించగా)... వాయుపుత్రుడైన ఆంజనేయుడు సూర్య వంశ పావనుడైన రాముని సచ్చరిత్రను చెవులారా వింటూ (పారవశ్యంతో) చేష్ట లుడిగి అలా వుండిపోయినాడు.


విహతమైన శ్రద్ధ, విగతమౌ నాశ...telugu padhyam of ramayanam with meaning

విహతమైన శ్రద్ధ, విగతమౌ నాశ, వి

ఘ్నయుత కార్య సిద్ధి, కలుష బుద్ధి

రామ వోలె నిలిచె నేమో యనెడు నట్టి

జానకిఁ గని హనుమ చాల వగచె..

   ఆ సీత దెబ్బ తిన్న శ్రద్ధ వలె, అడ్డులు తగిలిన ఆశ వలె, విఘ్నము కలిగిన కార్య సిద్ధి వలె, కాలుష్యముతో కూడిన (నిర్మలముగా లేని) బుద్ధి వలె ఉండెను. (అటువంటి సీతను హనుమ చూచెను. చాలా బాధపడెను). 

రామ రూపము= స్త్రీ రూపం

    విహతా మివ చ శ్రద్ధా  మాశాం ప్రతిహతా మివ

    సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషా మివ    (సుందరకాండ 15 - 33)