తెలుగు సినిమా ఆవిర్భవించి ఇప్పటికి 75 ఏళ్లు పూర్తయింది. ఇటీవలే వజ్రోత్సవాలను కూడా ఘనంగా చేసుకుంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమారంగం జాతీయ, అంతర్జాతీయ విజయాలనెన్నింటినో చవి చూసింది. నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, గీతరచయితలు, ఛాయా గ్రాహకులు, నటీనటులు ... ఇలా ఎందరెందరో తెలుగు సినిమారంగ ప్రతిష్ఠను విను వీధుల్లో ఎగురవేశారు. గత 75 ఏళ్లుగా తెలుగు సినిమా చరిత్రను, సాహితీ మÖల్యాలను, ఎప్పటి కప్పుడు బేరీజు వేస్తూ తెలుగు సినీ పరిశోధకులు మన సినిమాను కొత్తపుంతలు తొక్కించారు.
సినిమా పాట ఆధునిక జీవితమంత వైవిధ్యంతో, సంక్లిష్టతతో శాఖోపశాఖలుగా విస్తరించింది. రసావిష్కరణలో వైవిధ్యం సంగతి అలా ఉండగా, మానవులకు ఉండే సహజగుణాలన్నీ సినిమాపాట, గత డెభ్పై ఏళ్ల కాలంలో కనీసం యాభై ఏళ్ల పాటు అద్భుతంగా ఆవిష్కరించింది. నిజానికి ఏ ఇతర సాహిత్య ప్రక్రియ ఇంతటి వైవిధ్యం, ప్రభావం సమకాలీన ప్రజాహృదయాల మీద ముద్రించలేదు. నేడు సినిమా పాట సామాన్యమానవునికి చేరువై వాళ్లను అమితంగా ఆకర్షిస్తున్న ఏకైక సాహిత్య రూపం. సాహిత్య ప్రక్రియలలో వైదగ్ధ్యం చూపిన రచయితలకు కేవలం సినిమా పాటల వల్ల కీర్తి ప్రతిష్ఠలు గుర్తించి ఇటు జన సామాన్యం, అటు ప్రభుత్వం, సినిమా కవులకిస్తున్న ఆదర సత్కారాలు చూస్తే పాటల కుండే ఆకర్షణ తెలుస్తుంది. ప్రజలు గొప్ప సినీ రచయితలు రాసే పాటలకు బ్రహ్మరధం పట్టడం వల్ల సినిమా పాటకుండే గుర్తింపు తెలుస్తుంది.
సినిమా పాట ప్రాముఖ్యాన్ని గుర్తించిన ఎందరో పరిశోధకులు సినిమా పాటలను, విశ్లేషణాత్మకంగా పరిశోధించారు. భైరవబొట్ల గొప్ప సినిమా పాటల పరిశోధకుడు. తెలుగు సినిమా పాటల పరిశోధన ప్రస్థానంలో భైరవభొట్ల స్థానాన్ని నిర్ధారించే ముందుగా తెలుగు సినిమా పాటల పరిశోధనలో లబ్ధ ప్రతిష్ఠులైన పరిశోధకుల గురించి స్థూలంగా పరిచయం చేసి ఆ తర్వాత భైరవభొట్ల స్థానాన్ని యిందులో విశ్లేషించడం జరిగింది.
అలాంటి సినీ పరిశోధకుల్లో ఇంటూరి వేంకటేశ్వరరావు, వి.ఏ.కె. రంగారావు, రావి కొండలరావు, స్వామి చిత్రానంద, ఇంద్ర గంటి శ్రీకాంత శర్మ, ఇంద్రగంటి జానకీబాల, తుర్లపాటి కుటుంబరావు, భమిడి పాటి రామగోపాలం, నేమాని సీతారాం, కంపల్లె రవిచంద్రన్ వంటి పరిశోధకులు ఎందరో తెలుగు సినిమాను, తెలుగు సినిమా సాహిత్యాన్ని విభిన్న రీతుల్లో విశ్లేషించారు.
6.1. ఇంటూరి వేంకటేశ్వర రావు :
తెలుగు సినిమా రంగానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించాలని కలం పట్టిన తొలి సినీ పాత్రికేయుడు ఇంటూరి వేంకటేశ్వర రావు.
గుంటూరు జిల్లా, సత్తెనపల్లి సమీపంలోని చంద్రరాజు పాలెంలో ఇంటూరి జన్మించాడు. శ్రీమతి లక్ష్మీకాంతమ్మ, నరసింహం ఈయన తల్లిదండ్రులు. 1930 లో గాంధీజీ పిలుపునందుకుని, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడాయన. ఆ సందర్భంగా ఇంటూరి జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలో చేరాడు. బెజవాడ సిటీ కాం గ్రెసు సెక్రటరీగా పనిచేశాడు. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర వహిస్తూనే మరోవైపు జర్నలిస్టుగా ‘ఆంధ్ర’ పత్రిక’, ‘స్వరాజ్య’ మొదలైన పత్రికలకు వార్తలందించేవాడాయన.
1936 లో రాజకీయాలకు స్వస్తి పలికి సామాన్యులు ఇష్టపడే చిత్రరంగంలోకి వచ్చాడు ఇంటూరి. గూడవల్లి రామ బ్రహ్మం సలహా మేరకు ఆయన సినిమా జర్నలిజాన్ని వృత్తిగా చేపట్టి, తొలిసారిగా ‘చిత్రకళ’ అనే పత్రికను 1942 లో ప్రారంభించాడు. 1956 లో ‘సినిమా’ అనే పేరుతో ఒక పక్ష పత్రికను స్థాపించి 1975 వరకు నడిపాడు.
సినిమాలకు సంబంధించి ఆంధ్రా హాలీ ఉడ్, తెలుగు సినిమా వెలుగులు, ఎక్స్‌ట్రా నటి వెంకాయమ్మ, ఎస్వీ విశ్వరూపం మొదలైన రచనలు చేశాడు ఇంటూరి. నటయోగి నాగయ్య పుస్తకా స్వయంగా ముద్రించాడు. రంగస్థలం పై అభిమానంతో ‘నాటక రంగం’ అనే పత్రికను నడిపాడు.
50 ఏళ్లకు పైగా తెలుగు సినిమారంగానికి ఇంటూరి చేసిన సేవకు గుర్తింపుగా 1985 లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నుండి ‘కళాప్రపూర్ణ’ పొందాడు. 1976 లోనే గూడవల్లి రామబ్రహ్మం అవార్డు, 1982 లో వెటరన్ ఫిలిం జర్నలిస్టు బంగారు పతకం, 1996 లో ఆంధ్ర ప్రభుత్వం నుండి ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును ఇంటూరి అందుకున్నాడు.
తెలుగు సినీ జర్నలిజానికి ఓనమాలు దిద్ది దాని పురోగతికి జీవితమంతా కృషి చేసిన ఇంటూరి 07.05.2001 న మృతి చెంది తెలుగు సినీ పరిశోధకుల్లో అగ్రగణ్యుడిగా నిలిచాడు.
6.2. వి.ఏ.కె.రంగారావు :
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లు వి.ఏ.కె. రంగారావు రికార్డుల చుట్టూ తిరిగే నిత్యాన్వేషి. ఆయన ఇప్పటికి సుమారు 45 వేల రికార్డులకు పైగా సేకరించాడు. ఏ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ సంస్థ చేయలేని పనిని ఆయన ఒక్కడే చేయ గలిగాడు. వి.ఏ.కె.రంగారావు 11.06.1935 న జమీందారీ కుటుంబంలో జన్మించాడు. ఆయన చిన్నప్పటి నుండి గ్రాం ఫోను రికార్డులను విపరీతంగా అభిమానిం చేవాడు. చదువుకునే రోజుల్లో, ఇంట్లో వాళ్లు చేతి ఖర్చులకు ఇచ్చే డబ్బును కూడా గ్రాం ఫోను రికార్డులు కొనడానికే వినియోగించేవాడు. అలా ఆయన తన 17వ ఏటనే 20 వేల రికార్డులు పొందుపరచుకోగలిగాడు .
1960లో ‘సినీప్రభ’ అనే పత్రికలో ‘రికార్డు రివ్యూ” అనే శీర్షికతో ప్రారంభమైన వి.ఏ.కె. సాహితీ రచనా వ్యాసంగం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఆయన 1960 లో చెన్నైలో స్థిరపడ్డాడు. బాపు, రమణల ప్రోత్సాహంతో ఆంధ్రపత్రికలో ‘సరాగమాల’, ‘విన వేడుక ‘ సినీ శీర్షికలు నడిపాడు. 1982 లో ‘స్క్రీన’ అనే ఇంగ్లీషు పత్రికలో ‘ది సౌండ్స్ ఆఫ్ ది మÖ్యజిక’ అనే శీర్షిక 112 వారాలు నిర్వహించాడు. ఈయన పర్యవేక్షణలో సుమారు 25 ఎల్.పి. రికార్డులు, క్యాసెట్లు వచ్చాయి. ఈయన ఎన్నో రకాలైన రికార్డులు భద్రపరిచాడు.
6.3. రావి కొండల రావు :
రావి కొండలరావు 1931 లో జన్మించాడు. చిన్నతనం నుండే సోదరుడు ఆర్.వి. చలంతో కలసి నాటకాలాడేవాడు. ‘సుకుమార’ అనే పేరుతో ఆర్కెస్ట్గ్రా నడిపేవాడు. ఈయన సినీ రంగానికి రాకమునుపే కథకుడుగా, నాటక కర్తగా, నాటక నిర్వాహకుడుగా తెలుగువారికి చిరపరిచితుడు.
రావి కొండలరావు సుమారు రెండు దశాబ్దాలపాటు ‘విజయచిత్ర’ కు సంపాదకత్వం వహించాడు. “చల్లని నీడ”, “పెళ్లి పుస్తకం” చిత్రాలకు ఈయనే కథల్ని సమకూర్చడం విశేషం. అలనాటి చిత్రాల విశేషాలను రాసిన రావి కొండలరావు ఉత్తమ సినీ గ్రంథ కర్తగా నంది అవార్డును కూడా అందుకున్నారు.
6.4. పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు :
తుర్లపాటి కుటుంబరావు తన 14 వ యేటనే జర్నలిజంలోకి అడుగిడిన ఘనాపాఠి. 20 వ ఏటనే ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశంకు కార్యదర్శిగా వ్యవహరించి, ఆచార్య ఎన్.జి.రంగా ‘వాహిని’తో జర్నలిజం జీవితాన్ని ప్రారంభించి, ‘ఆంధ్రజ్యోతి’ లో కొన సాగిన వ్యక్తి, తుర్లపాటి.
వేలాది పుస్తకాలు రచించి, ఆనాటి గవర్నర్ డా. శంకర్ దయాళ్ శర్మ నుంచి తెలుగు వర్శిటీ ‘ఉత్తమ జీవిత చరిత్ర కారుడు’ పురస్కారం, ప్రధాని పి.వి. నరసింహారావు నుంచి ‘నేషనల్ సిటిజన్ అవార్డు’, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ’, భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ బిరుదు పొందిన తొలి తెలుగు పాత్రికేయుడు తుర్లపాటి.
ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం ఫాన్స్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శిగా రెండు దశాబ్దాల పాటు వ్యవహరించి, రాష్ట్రప్రభుత్వంచే ఏడు సార్లు నంది ఫిలిం అవార్డుల కమిటీలో సభ్యుడిగా నియమించబడి, అసలు ఆ అవార్డుల రూపకల్పనకే దోహదం చేసిన చలన చిత్ర పరిశ్రమ బంధువు తుర్లపాటి !
6.5. స్వామి చిత్రానంద (కె.వి.రావు) :
తెలుగు సినీ పరిశోధకుల్లో చిరస్మరణీయుడు కె.వి.రావు. ఆయన కలం పేరు స్వామి చిత్రానంద.
పూర్ణా పిక్చర్స్‌లో పబ్లిసిటీ ఇన్ ఛార్జిగా ఉద్యోగం ప్రారంభించిన కె.వి.రావు, అనతి కాలంలోనే ప్రముఖ దర్శక నిర్మాత హెచ్. ఎం. రెడ్డి దగ్గర అసిస్టెంటు స్థాయికి ఎదిగాడు. ఈయన “బీదల ఆస్తి”, “వద్దంటే డబ్బు” చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేశాడు. అక్కడ నుండి అక్కినేని సంజీవి దగ్గర 2 చిత్రాలకు, ప్రత్యగాత్మ, ఆదుర్తి లకు చెరొక చిత్రాన్ని, బాపు దగ్గర 13 చిత్రాలకు సహాయ దర్శకునిగా పని చేశాడు.
సినిమా పరిశ్రమలో తానెంత బిజీగా ఉన్నా, సాహితీ వ్యాసంగం మానలేదు స్వామి చిత్రానంద. ఇప్పటి వరకూ ఆయన 60 కథలు,
3 నవలలు, 2 ధారావాహికలు, ఒక టి.వి. ధారావాహిక, 2 రేడియో నాటికలు రచించాడు. ఇంకా సినిమాలకు సంబంధించిన విషయాలెన్నో ప్రముఖ సినిమా పత్రికైన ‘విజయచిత్ర’, రచన, జ్యోతి మాసపత్రిక), హాసం మొదలైన పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. ఈయన రాసిన సినిమా వ్యంగ్య రచనలు ‘మాయాబజార’ అనే గ్రంథంగా వచ్చాయి. ఈయన 2006లో మరణించి సినీ పరిశోధకుల్లో
చరితార్థుడయ్యాడు.
6.6. కంపల్లె రవిచంద్రన్ :
డెభ్భై ఐదేళ్ల తెలుగు సినీరంగ చరిత్రను, మÖడుపదులు వయసులోనే ఔపోసన పట్టిన ఘనత కంపల్లె రవిచంద్రన్‌కు దక్కుతుంది. 19.03.1979 న చిత్తూరు జిల్లా, పుంగనూరు గ్రామంలో రవిచంద్రన్ జన్మించాడు.
చిన్నప్పటి నుంచి సినిమాలను విపరీతంగా చూసే వాడీయన. దాంతో సినిమాలలోని పాటలను నిశితంగా పరిశీలించడం నేర్చుకున్నాడు. దానికి తోడు సినిమా పత్రికలైన విజయచిత్ర, సితార మొదలైన సినిమా పత్రికలను చదివి, సినిమా వ్యాసాలు రాసేవిధానం తెలుసుకున్నాడు. వి.ఏ.కె. రంగారావు, స్వామి చిత్రానంద, బొమ్మకంటి సుబ్బారావు, ఇంద్ర గంటి శ్రీకాంత శర్మ, ఆరుద్ర వంటి సినీ సాహితీ పరిశోధకులు రాసిన ఎన్నో వ్యాసాలు చదివి చాలా చిన్నతనంలో నుండే వాటిని సేకరించడం ప్రారంభించాడు. పాటల పుస్తకాలు అన్నింటినీ రవిచంద్రన్ ఈ నాటికీ భద్రంగా దాచి ఉంచాడు. “పుట్టింటి పట్టు చీర” చిత్రం పై రవిచంద్రన్ తొలిసారిగా ఆంధ్రప్రభలో సమీక్ష రాశాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి పి. భానుమతి, తొలిసారిగా ఈయనలోని ప్రతిభను గుర్తించి, చాలామంది ప్రముఖులకు పరిచయం చేసింది.
అలా పరిచయం చేసిన ప్రముఖుల్లో కె.వి.రావు ప్రముఖుడు. ఆయన రవిచంద్రన్ ను ఎన్. టి. రామారావు దగ్గరకు తీసుకెళ్లి, పరిచయం చేశాడు. రామారావు తను అప్పట్లో నిర్మిస్తూ ఉండిన “శ్రీనాథ కవి సార్వభౌమ” చిత్రానికి స్వామి చిత్రానందకు అసిస్టెంటుగా పని చేయమన్నాడు. అలా ప్రారంభమైన రవిచంద్రన్ సినీ జీవిత ప్రస్థానం ఎన్నో మలుపులు తిరిగింది.
యువచిత్ర అధినేత డా. కాట్రగడ్డ మురారి పర్యవేక్షణలో తయారైన ‘తెలుగు సినిమా నిర్మాతల చరిత్ర’ గ్రంథాన్ని రవిచంద్రన్ రాసిందే. డా. కొంగర జగ్గయ్య గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించిన ‘మనస్విని’ సంస్థకు రవిచంద్రన్ అనేక సార్లు న్యాయ నిర్ణేతగా, సలహా దారుడు గా వ్యవహరించాడు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడైన ఎం. ఎం. కీరవాణి జీవిత చరిత్రను కూడా రవిచంద్రన్ రచించాడు. ఈయన ఇప్పటికీ వివిధ పత్రికల్లో సుమారు 500 వ్యాసాలను, 25 దాకా కథలను, ఒక నవలికను రచించారు. ఒంగోలు జిల్లా, కనిగిరి నుంచి వెలువడుతున్న ‘ఘంటసాల’ అనే సినీ సంగీత పత్రికకు గౌరవ ఉపసంపాదకులుగా, తి.తి.దేవస్థానం ‘సప్తగిరి’ మాసపత్రిక ఉప సంపాదకులుగా వ్యవహరిస్తున్నాడు.
ఈయన రచించిన ‘జ్ఞాపకాలు’ అనే గ్రంథం ఇప్పటికి అనేక ముద్రణలకు నోచుకుని, రవిచంద్రన్ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేసింది.
పైన పేర్కొన్నవారే కాకుండా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఇంద్రగంటి జానకీబాల, గొల్లపూడి మారుతీరావు, హెచ్.ఎస్. బ్రహ్మానంద, ఎస్.వి.రామారావు, హెచ్. రమేష్ బాబు, హాసం’ రాజా, చల్లా సుబ్బారాయుడు, జె. మధుసూదన శర్మ, డా. కె.వి.రావు, ఆచార్య వి. చంద్రశేఖర్ రెడ్డి, వి. బాబూరావు, యం. సంజయ్ కిషోర్, మరియు డా. మేడిపల్లి రవికుమార్ మొదలైన వారంతా తెలుగు సినీ పరిశోధనలకు విశేషమైన కృషి చేశారు, చేస్తున్నారు. వీరందరితో పాటు స్మరించుకోదగిన విశిష్ట పరిశోధకుడు, పరిశోధకులకే మార్గ దర్శకుడు భైరవభొట్ల.
భైరవభొట్ల నారాయణరావు వృత్తి రీత్యా హిందీ ఉపన్యాసకుడు అయినప్పటికీ, ప్రవృత్తి రీత్యా సినిమా సాహితీ పరిశోధకుడు, తన పరిశోధనల నిమిత్తం కృష్ణాజిల్లా, గుడివాడలో ‘చలన చిత్ర పరిశోధనా కేంద్రాన్ని రెండు దశాబ్దాల క్రితమే ప్రారంభించాడు. ప్రతిపనికీ ఒక ధ్యేయం ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. లక్ష్య శుద్ధిని బట్టి కార్యసిద్ధి, తదనంతరం ప్రతిఫలం సహజంగా ఉంటాయి. కానీ కేవలం పాటలపైన ఇష్టం. అభిమానం, ప్రేమ ఒక తపనగా మారి ఒక వ్యక్తి చేత ఇంత చేయించడం సాధ్యమా అనిపిస్తుంది. ఎందుకంటే భైరవభొట్ల బాల్యంలో స్కూలుకు వెళ్లే రోజుల్లో ఏ చిరుతిండ్లో కొనుక్కోవడానికి ఇచ్చిన చిల్లర డబ్బులతో సినిమా పాటల పుస్తకాలు కొన్నప్పుడు ఆయన కున్నది కేవలం ఆసక్తి మాత్రమే. భైరవభొట్ల 10 వ తరగతికి వచ్చేసరికి వెయ్యి సినిమాపాటల పుస్తకాలు సేకరించాడు. ఆ తర్వాత అవన్నీ పాతబడి చిరిగి పాతబడి చిరిగి పోతున్నాయనే బెంగతో, ప్రతి పాటల పుస్తకాన్ని చేత్తో రాసుకునే వాడు. అలా అప్పటి నుండి ఇప్పటికి 30 వేల పాటల పుస్తకాలు భద్రపరచగలిగాడు.
ఇంకా అనేక, వీడియో క్యాసెట్లు కూడా ఆయన సేకరించ గలిగాడు. అంతేగాకుండా అక్షర క్రమంలో సినిమా పాటల పుస్తకాలు బైండు చేయబడినవి. అనగా సినిమాలలోని దేశభక్తి గీతాలు, లాలిపాటలు, నాయక ప్రేమగీతాలు, యుగళ గీతాలు, భక్తి గీతాలు, భగ్న ప్రేమ గీతాలు వస్తుపరంగా, శ్రీశ్రీ సినీగేయ కోశం, ఆత్రేయ సినీ గీతాలు, సినారె సినీ గేయకోశం మొదలైనవి కవిపరంగా రాత ప్రతులు బైండు చేయబడి ఉన్నాయి. అంతేగాక ప్రముఖ సినీపాటలు కేసెట్ల రూపంలోనూ ఉన్నాయి. ఇవన్నీ కొన్ని సంవత్సరాల కృషికి, శ్రమకు నిదర్శనాలు.
ఈరోజు ఎందరో సినీ పరిశోధకులకు ఒక పెద్ద సినిమా పాటల ఖజానా గా ‘భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రం’(గుడి వాడ) నిలిచిపోయిందంటే దాని వెనక ఆయన చేసిన అపూర్వమైన కృషి, ఎదుర్కొన్న ఇబ్బందులు పడ్డ కష్టాలు ఎన్నో ఉన్నాయి. చిన్నప్పుడు సరదాగా ప్రారంభించిన పాటల పుస్తకాల సేకరణను ముందు ముందు ఒక భాద్యతగా చేపట్టిన కర్మయోగి భైరవభొట్ల.
ఈయన చిన్నప్పటినుంచి వివిధరకాల ఆర్థిక సమస్యలతో, కుటుంబ భాద్యతలతో, మానసిక ఒత్తడులతో సతమతమౌతున్నా సరే, తనకు ఎంతో యిష్టమైన సినిమారంగానికి ఒక పరిశోధనా స్థాయిని కల్పించాలని తపన పడ్డ వ్యక్తి. ఆయన స్థాపించిన పరిశోధనా కేంద్రం కృషి ఫలించింది. ఈ రోజున ఎందరో పరిశో ధకులు, భైరవభొట్ల పరిశోధనా కేంద్రంలోని సినిమా పాటలనే ముడి సరుకుతో ఈరోజున ఎందరో పరిశోధకులు భైరవభొట్ల సహకారాలతో అనేక విశ్వవిద్యాలయాల్లో తెలుగు సినిమా సాహిత్యం, కవుల పైన వివిధ కోణాల్లో పరిశోధన చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
పుస్తకాలను సేకరించడం ఒక ఎత్తు. వాటిని భద్రంగా సంరక్షించి భావితరాలకు అందించడం ఒక ఎత్తు. అందుకోసం భైరవభొట్ల పడరాని పాట్లు పడ్డాడు. చెన్నై మహానగరంలో తన జీవితమే ప్రశ్నార్థకమైన రోజుల్లో కూడా తను కష్టపడి సేకరించిన పాటల పెన్నిధిని అతి భద్రంగా కాపాడి తన స్వస్థలమైన గుడివాడకు తరలించిన వైనం భైరవ భొట్ల కృషికి నిదర్శనం. కేవలం పాట, పాట రచయిత పేరు మాత్రమే కాకుండా ఆ పాట ఉన్న చిత్రం పేరు, సంస్థ పేరు, చిత్ర నిర్మాత, దర్శకుల పేర్లు, సంగీత, నృత్య దర్శకులు, గాయనీ గాయకుల వివరాలతో పాటు, చిత్రం విడుదలైన సంవత్సరం వంటి వివరాలు కూడా ఆయన దగ్గర దొరకడం విశేషం.
మొదటి నుండి తాను సేకరించిన సినిమా పాటల పుస్తకాలను ఆయన జాగ్రత్తగా బైండింగ్ చేయించడమే గాక, ఏ బైండింగ్లో ఏ పాటల పుస్తకం ఉన్నది, ఏ పుస్తకంలో ఏ పాట ఉన్నది తెలుసుకునేందుకు ఆయన ఒక ఇండెక్స్ (విషయ సూచిక)ను కూడా తయారు చేసుకున్నాడు.
ఆ విధంగా ఏ పాట ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేందుకు వీలుగా ఉంచాడాయన. అంతే గాక సినిమా పాటలను వివిధ వర్గాలుగా విభజించి వాటిని వీడియో, ఆ రూపంలో భద్రపరిచాడు. లాలి పాటలు, జావళి పాటలు, యుగళ గీతాలు, ప్రేమ గీతాలు, విరహగీతాలు, మొదలైన విధాలుగా వర్గీకరించి ఏ వర్గానికి ఆ వర్గంగా తన పరిశోధనా కేంద్రంలో భద్రపరిచాడు.
హిందీ చిత్ర గీతాల నిఘంటువు (గీత్ కోష్) ను చూసి స్ఫూర్తిని పొంది తెలుగు సినిమాపాటల నిఘంటువును పుస్తక రూపంలో తయారు చేశాడు భైరవభొట్ల. ఇందులో ఒక పాటకు సంబంధించిన అన్ని వివరాలు, పాట రచయిత, సంగీత దర్శకుడు, నృత్య దర్శకుడు, గాయనీ గాయకులు, చిత్రం విడుదలైన సంవత్సరం తదితరాలన్నీ పొందుపరిచాడు. ఈయన రూపొందించిన అన్ని సినిమా పాటల నిఘంటువులు రాత ప్రతుల్లోనే ఉన్నాయి.
మనసుకవి ఆత్రేయ పాటల్ని భైరవ భొట్ల సహాయ సహకారాలతోనే మనస్విని సంస్థ ముద్రించగలిగింది. భైరవభొట్ల దగ్గర ఉన్నంత సినీ సాహిత్య సామగ్రి పూనాలోని ‘ఫిలిం ఆర్కివ్స’ లో కూడా లభించదంటే అతిశయోక్తి కాదు. ఇంతే గాక చలన చిత్రాలలో వస్తున్న అనూహ్య పరిణామాలను ఎప్పటికప్పుడు బేరీజు వేయడానికి, మార్కెట్టులో విడుదలయ్యే సినీ పత్రికలన్నింటినీ సేకరించి భైరవభొట్ల భద్రపరుస్తున్నాడు. కొత్త సినిమా పాటల సాంకేతిక వివరాలు సేకరించేందుకు గాను వాటిని వి.సి.ఆర్ ద్వారా రికార్డు చేసి క్యాసెట్లలో భద్రపరుస్తున్నాడు. ఇప్పటికే ఈయన, దృశ్యరూపంలో భద్రపరిచిన పాటలు సుమారు 500 వీడియో క్యాసెట్లలో ఉన్నాయి.
ఈ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించి, అభివృద్ధి చేయడానికి ఇప్పటివరకు భైరవభొట్ల సుమారు 10 లక్షల రూపాయలు వెచ్చించాడు. అంత ఆర్థిక స్థోమత లేకపోయినప్పటికీ ఆయన తన పరిశోధనలకు ఖర్చుపెట్టిన ధనం, ఆయనకున్న పరిశోధనాభిలాషకు నిదర్శనం. శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, సినారె, దేవులపల్లి, వేటూరి, సిరివెన్నెల మహాకవుల పాటలెన్నో ఆయన సేకరించి, ఎంతో శ్రమకోర్చి, ఒంటి చేత్తో వాటిని విభజించి విశ్లేషించాడు. అలా విశ్లేషించిన ఘనత ఆయనకే దక్కింది.
ఆత్రేయ, ఆరుద్ర వంటి మహామహులెందరో ఈ పరిశోధనా కేంద్రాన్ని స్వయంగా దర్శించి భైరవభొట్లను ఎంతో ప్రశంసించారు. సినీ సాహిత్యానికి పెట్టని కోట ఆయన. శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి, కొసరాజుల పాటల సంకలనాలు వెలువడడంలో ఈయనదే కీలక పాత్ర. భైరవభొట్ల సహాయ సహకారాలతో ఎందరో పరిశోధక విద్యార్థినీ విద్యార్థులు, వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా గ్రంథాలను సమర్పించి డాక్టరేట్లు పొందారు అనడానికి కింద కనబరచిన జాబితా, భైరవ బొట్ల పరిశోధనా కృషికి నిదర్శనంగా నిలుస్తుంది.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆరు, నాగార్జున విశ్వ విద్యాలయంలో ఒకటి, తెలుగు విశ్వ విద్యాలయంలో నాలుగు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒకటి, మద్రాసు విశ్వవిద్యాలయంలో ఒకటి, బరంపురం విశ్వవిద్యాలయంలో ఒకటి, సెంట్రల్ యÖని వర్సిటీలో ఒకటి, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఒకటి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక్కటి సిద్ధాంత గ్రంథాలు వచ్చాయి. వీటన్నిటికీ పరోక్ష మార్గ దర్శకుడు, మÖల సూత్రధారి భైరవభొట్లే ననడంలో సందేహం లేదు.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
(1) కె.వి. రాఘవాచార్య - కావ్యప్రయోజనములు - మనుచరిత్ర-1988
(2) పి.మౌలానా - తెలుగు సినిమా పాటలలో శృంగార దృష్టి - 1991
(3) డి. మల్లన్న ` నార్ల చిరంజీవి గారి రచనలు - 1995
(4) టి. మునస్వామి ` తెలుగు సినిమా పాటలలో హైందవ - 1999 భక్తి పాటల, వైశిష్ట్యం
(5) యస్. చిన్నవీరయ్య - దాశరథి సినిమాపాటలు - పరిశీలన 2005
(6) పి. గురుప్రసాద్ - తెలుగు సినిమా పాటల పరిశోశోధకుడు - భైరవ భొట్ల నారాయణరావు 2007
తెలుగు విశ్వవిద్యాలయం
(1) ఉయÖ్యరు లక్ష్మీ నరసింహారావు - సినారె సినిమాపాటలు-పరిశీలన - 1994
(2) జయంతి చక్రవర్తి ` వేటూరి సినిమా పాటలు - పరిశీలన
(3) జె. విజయకుమారి ` జాలాది సినిమా పాటలు
(4) దామోదర గణపతిరావు - సిరివెన్నెల సినిమాపాటలు - పరిశీలన
ఆంధ్ర విశ్వ విద్యాలయం
(1) చిట్టిబోయిన కోటేశ్వరరావు - తెలుగు సినిమా పాటలలో సాహిత్యపు విలువలు - 1988
నాగార్జున విశ్వ విద్యాలయం
(1) నల్లూరి రామారావు - కొసరాజు కవితా వైభవం ` 1990
మద్రాసు విశ్వ విద్యాలయం
1) పైడిపాల - తెలుగు సినిమా పాట `1992
బరంపురం విశ్వవిద్యాలయం
(1) పంచాళ్ల భానుశ్రీ - తెలుగు చలన చిత్రాలలో దేశభక్తి గేయాలు-1998
కేంద్రీయ విశ్వవిద్యాలయం
ఏ. మారేశ్వర రావు - తెలుగు సినిమాలలో సామాజిక స్పృహ -1995
కాకతీయ విశ్వవిద్యాలయం
(1) వి. వీరాచారి ` సినీ గేయాలపై ఉద్యమాల ప్రభావం
ఉస్మానియా విశ్వవిద్యాలయం
(1). టి. ఉమా మహేశ్వరరావు - తెలుగు సినిమా పాటలలో రసపోషణ
ఇలా ఎందరో పరిశోధకులు భైరవభొట్ల చలన చిత్ర పరిశోధనా కేంద్రం నుండి సహాయం పొంది పిహెచ్.డి లు పొందారు.
భైరవబొట్ల ఒక విశిష్ట పరిశోధకుడు. కేవలం తన పరిశోధనను తనవరకే పరిమితం చేసుకోకుండా విశ్వవ్యాప్తం చేసిన విశాల పథికుడు. మంగళ హారతి గీతాలు, పద్మశ్రీ ఘంటసాల సుమధుర గానసుధ, తెలుగు సినిమాల్లో భక్తి పారవశ్య గ్రంధాలు, తెలుగు సినిమాల్లో భక్తి రసాత్మక గీతాలు వంటి అనేక గ్రంథాలను తెలుగు సినిమా పరిశ్రమకు అందించిన ఘనత భైరవభొట్లకే దక్కుతుంది. అంతేకాదు, ఎందరో కవులను, కళాకారులను సన్మానించి సత్కరించిన సహృదయుడీయన. ముఖ్యంగా 1994 సెప్టెంబరు నెలలో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావును సినీ కథా నాయిక లందరూ సత్కరించిన సందర్భంలో భైరవభొట్ల వెలువరించిన ‘అక్కినేని కథానాయికలు’ అనే పరిశోధనాత్మక వీడియో క్యాసెట్టు ఇతని పరిశోధనా పటిమకు గీటురాయి.
ఈయన తన విశేష సినీ పరిశోధనకు గానూ అనేక అవార్డులు అందుకున్నాడు. ఇటీవల హైదరాబాదులో అత్యంత వైభవంగా జరిగిన తెలుగు సినీ వబ్రోత్సవాల్లో భైరవభొట్లను సినీ ప్రముఖలందరి సమక్షంలో సముచిత రీతిన సత్కరించడం విశేషం. భైరవభొట్లకు ఎన్ని సన్మానాలు జరిగినా, అవి ఆయన విశేష సేవకు చంద్రునికి నూలుపోగు వంటివనే చెప్పుకోవచ్చు.
ఈరోజున శాఖోపశాఖలుగా విస్తరించిన తెలుగు సినీ పరిశ్రమ గత వైభవమంతా పరిశోధనా గ్రంథాల రూపంలో భైరవభొట్ల నిక్షిప్తం చేశాడు. భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రాన్ని అనేక మంది గొప్పవాళ్లు, ప్రముఖులు సందర్శించినపుడు ఆయనను ప్రశంసించిన తీరు ఆయన బహుముఖ ప్రజ్ఞకు అద్దం పడుతుంది. ఈ వివరాలన్నీ అనుబంధం - 2 లో పొందుపరచడం జరిగింది.
సృష్టిలో మానవ మేధస్సులో జనించే ఆలోచనను సక్రమ మార్గంలో నలుగురికోసం ఉపయోగించాలనే ఆకాంక్ష, ఆదర్శం, అకుంఠిత దీక్ష అమలు చేయడానికి ప్రయత్నిస్తే, ఏ అంశమైనా నిరుపయోగం కాదని తన సినిమా పాటల పరిశోధన ద్వారా నిరూపిస్తున్న పరిశోధకాగ్రేసరుడు భైరవ భొట్ల అన్నది నిజం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి