విజయనగరయుగంలో సరస్వతీదేవి హంసవాహనాన్ని విడిచి యశ్వాన్ని అధిరోహించింది. ఆనాటి కవులు ఇతర శాస్త్రాలపై మక్కువ తగ్గించి సంగీతంపై మోజుచూప ప్రారంభించారు ప్రబంధాలకు శ్రీకారం చుడుతూ మనుచరిత్ర వచ్చింది. దానిలో వరూధిని వీణ వాయించడంలో నేర్పరి. ప్రవరుడామె చెంతకు వెళ్లే వరకు ఆమె దాన్నే వాయిస్తూ కూర్చుని ఉండింది. అతనిని చూడగానే సంగీతం చాలించి వీణనటు పెట్టి అతనిపై పడింది గాని అతడామెను తిరస్కరించి వెళ్లిపోయినాడు ఆ రాత్రంతా ఆమె అతనికై దుఃఖిస్తూ గడిపింది.
చెలులు పూతపసిండివంటి వలపున్ పచరించుకులంబు నీతికిన్
లేతగదమ్మయిత్తెరగు లేమసురాంగన లెల్లయిట్టినీ
చేతకు మెత్తురమ్మ
అని మందలించినారు కానీ ఆమె అది చెవిని పెట్టలేదు. తెల్లవారింది. నిన్న ప్రవరుడు వచ్చిన వేలకు నాటరాగాన్ని ఆలాపిస్తున్నది. దాని కొరకు మేళవించిన వీణ ఒకవైపున అలాగే ఉండి ప్రభాత పాతపోతాలతో ఆ నిన్నటి శృతినే పలుకుతుంది . అపుడు వారామెతో
వాలారున్ కొనగోళ్ళ నీ వలసతన్ వాయించుచు చో నాటకున్
మేళంబైన విపంచి నిన్న మొదలన్ నీవంటమిన్ జేసి యా
యాలాపంబె sTÖవేళ బల్కెడు ప్రభాతా యాత వాతా హతా
లోలత్తంత్రుల వేళవింపగదే లోలాక్షి దేశాక్షికిన్
“నిన్న నీవు నాటరాగం ఆలాపిస్తూ అటుపెట్టిన వీణ గాలి తాకుడుతో ఇంకా అదే శృతి పాడుతుంది .ఇపుడు తెల్లవారింది కదా. దాన్ని దేశాక్షికి మేళవించు” అని చెప్పినారు.
ఇక్కడ మనకు వీణా నిర్మాణం సంగీత సాంప్రదాయం తెలిస్తే గాని ఇక్కడ పెద్దన గారి కవితాప్రవీణత అర్థం కాదు. విజయనగర కాలంనాడు వీణలు ఇప్పుడు మనము చూసిన దాని వలె గాక దాని సారెలు కదులుతూ రాగానుగుణంగా జరుపుకొని బిగించుకునే అట్లుగానే ఉండేవి. గాయకులు సభలలో వేళననుసరించి ఏ వేళకేది తగునో ఆ రాగాల నాలాపించేవారు .ఆ విధంగా ఆలాపించేటప్పుడు వారు రాగానుగుణంగా మెట్లు సవరించుకోవాల్సిన అవసరం ఉండేది.
భట్టుమÖర్తి సంగీత రహస్యజ్ఞుడు గాబట్టి వీణ కోపుపై మెట్లే విధంగా అమరిఉంటే అన్ని రాగాలు పలికించటానికి వీలవుతుందో కనిపెట్టి నేటి వీణను సృజించినాడు.. దీనికి ‘చలసారె’ అని పేరు. పెద్దనగారు వరూధిని చేతిలో ఉంచింది చలసారె.అది ఆమె మనస్సుకు సంకేతం. వేశ్య అనురాగం ఏకత్రనిష్టం కాదు కాబట్టి ఆమె చేతికి చలసారె నిచ్చి పెద్దన పెద్ద ఔచిత్యాన్ని ప్రదర్శించాడు. వీణ నిన్నటి నాట రాగాన్నే పలుకుతుంది. ఇపుడు తెల్లవారింది కాబట్టి దాన్ని రాగాంతరమైన దేశాక్షికి మేళవించవలసిన అవసరం చెలికత్తెలతో చెప్పించడంలో వారా రాత్రంతా జాగారం చేస్తూనే ఉన్నారని మరోసారి జ్ఞాపకం చేసింది.
ప్రభాతవాతహతికి వీణ అదే నాటుపాటనే ఆలాపిస్తుంది అనడంలో రాత్రంతా ఎలాగో గడిచి కాస్త ప్రభాత వాయువులు సోకినా ఇంకా ఆ పాత పాటెనా అంటే ప్రవర స్మరణనేనా .వీణను ప్రభాతానుగుణమైన దేశాక్షికీ వేళవించటమనటంలో అతనిని మరిచి కాలానుగుణంగా మరొకటి ఆలోచించు అని వ్యంగ్యం .చెలులీవిధంగా చెప్పినా ఆమె ఆ వీణను కొత్త రాగానికేం మేళవించినట్లు లేదు. గాలి తాకుడుకి అది పాత పాటనే పాడుతూ నిలిచిపోయింది.
ఇక వసుచరిత్ర ఆంధ్ర కావ్యాలలో ఆపాదమస్తకం సంగీత మర్యాదలను సంతరించుకున్న గ్రంథం. భట్టు మÖర్తి సంగీత రహస్యాలన్నీ పుక్కిట పట్టినవాడు. శిశిరం గడిచి వసంతం వస్తుంది .అప్పుడు ఉద్యానవనాల్లో యువతులు హిందోళాన్ని పాడుతున్నారు. వారి కంఠాలకు కోకిలలు బదులు పలుకుతున్నాయి. ఆ ధ్వని కలిసి వారి పాట వసంతరాగం లాగా నిండుగా వినిపిస్తుంది ఈ సన్నివేశాన్ని అతడు సాధారణంగా స్త్రీలా కంఠాలకు కోకిలలు, నెమళ్లు, చిలుకలు బదులు పలకటం కావ్య సాంప్రదాయం కాబట్టి వారి పాటలకు కోకిలలు బదులు పలుకుతున్నాయి. ఆ సన్నివేశాన్ని అతడు
అరిగా పంచమ మేవగించి నవలాలవ్వేళ హిందోళవై
ఖరి సూపన్ పికజాత మాత్మా రవభంగ వ్యాకులంబై వనీ
ధర నాలంబిత పల్లవ వ్రత విధుల్ దాల్పన్ తదీయ ధ్వనిన్
సరిగా గైకొనియన్ వసంతము మహా సంపూర్ణ భావోన్నతిన్
అని చెప్పినాడు.
ఇందులో కవి హిందోళ, వసంత అనే రెండు రాగాలను పేర్కొన్నాడు. శిశిరంలో నుండి వసంతం పుట్టినట్లు రాగాలలో హిందోళం నుండి వసంతం పుట్టింది. రాగాలలో ఐదు స్వరాల ఉండేవాటికి ఔడవ రాగాలని, ఆరు స్వరాలు ఉండేవానికి షాడవ రాగాలని,ఏడు స్వరాలు ఉండేవానికి పూర్ణ రాగాలని పేరు. హిందోళంలో రిషభ పంచమాలు లేవు కాబట్టి అది ఔడవ రాగం అయినా దానిలో నుంచి పుట్టిన వసంతం ఔడవంగ లేదు. నేటి వసంతంలో పంచమం లేదు కానీ కొన్ని సంగీత మతాలు “స్యాద్వసంతో ల్ప పంచమః” అని దానిలో మృదు పంచమాన్ని అంగీకరించినవి. ఇక విజయనగరం కాలంనాడు అది పూర్ణరాగం గానే అంగీకరింపబడింది. భట్టుమÖర్తి ఈ మతానికి చెందినవాడు.
ఇక ప్రస్తుతం అది శశిర వసంతాల సంధి కాలం కాబట్టి యువతులంతా హిందోళా నాలాపిస్తున్నారు. అది విన్న కోకిలలు ఇందులో తమ స్వరమైన పంచమం లేదని ఖేదపడి అంతవరకు తాము పూని చేస్తున్న పల్లవ వ్రతం ఫలితంగా తమ కంఠాన్ని ఎత్తి అది వసంతకాలం వస్తే గానీ కోకిల కూయదు కాబట్టి అది యెరిగిన యువతులు మనమింకా ఇది శశిర వసంతం అనే బ్రాంతిలోనే ఉన్నాం గానీ వసంతం వచ్చింది సుమీ అని తాము పాడే హిందోళాన్ని వసంతంగా మార్చుకున్నారు. హిందోళం వసంతంగా మారటానికి దానికి రిషభ, పంచమ అనే రెండు స్వరాలు చేరవలసి ఉంది. తమ గానానికి పంచమస్వరాన్ని కోకిల చేరుస్తుంది కాబట్టి తామిక రిషభం చేర్చుకుంటే సరిపోతుంది .దాన్ని చేర్చుకొని తమ రాగాన్ని సరిగా చేసుకున్నారు. దానితో వసంతానికి నిండుదనం వచ్చింది. అంటే వసంతారంభంలో యువతులు లాలాపించె హిందోళం కోకిల స్వరాలతో కలిసి వసంతంలా నిండుగా వినిపించింది అని తాత్పర్యం. ఈ పద్యంలో పల్లవ శబ్దాన్ని పల్G లవ అని విడదీసి వసంతంలో అల్ప పంచమం ఉంది అనే సూచనను శ్రీరాజన్నకవి గారు సాధించారు. ఈ విధంగా కవి ఇందులో స్త్రీల కంఠాలకు కోకిలకంఠాలు ప్రతి పలుకుతాయనే కావ్య సాంప్రదాయాన్ని తీసుకొని వసంతరాగం తజ్జనకరాగం దీనికి దానికి గల తారతమ్యం మనోహరంగా చిత్రించినాడు
ప్రకృతిలోని ఋతు పరిణామం ఇతర జీవ జంతువులంత సులభంగా మానవుడు గ్రహించలేడు. అందువల్ల కోకిలలు వారి ఆలాపనంలో తమ స్వరమైన పంచమం లేదే అని ఖేదపడి వారి భ్రాంతిని వారించటానికి తమ కంఠమెత్తినవి.
ఇదేగాదు భట్టు మÖర్తి ఇందులో ఇంకా చాలా చోట్ల తన సంగీత విజ్ఞతను ప్రదర్శించారు. ఇక్కడ తోటలో యువతుల హిందోళ విని కోకిలలు బదులు పలికితే అక్కడ కోలాహలాద్రిపై గిరిక పాటకు
తన్మృదు పంచమ షడ్జ శయ్యకొ
య్యన వెలుగిచ్చెవింటే ప్రమదాకుల కోకిల కేకి సంఘముల్ అని
“పికః కూజతి పంచమః షడ్జం మయÖరో వదతి” అనే స్వరలక్షణాన్ని జ్ఞాపకం చేసినాడు. గిరిక వెన్నెల కాక కోర్వలేక “కిన్నర వధూరాజత్క కాంబోజకాం, బోజిరాగ విపంచి కారవ సుధాపూరంబు తోరంబుగా” ఏడ్చిందని చెబుతాడు. కాంబోజి రాగం దైైన్యాన్ని ప్రస్ఫుటించే రాగం.
ఇదే గాక ఇతడీ కావ్యంలో గిరిక పాటలోని పంచమ షడ్జ శయ్యలకు కోకిలలు కేకులు బదులు పలికినవని, గిరిక కాంబోజి రాగంలో ఏడ్చినదని, ఆమె పెండ్లి పాటలు ముత్తైదువలు సైంధవీ రాగంలో పాడినారని ఎన్నెన్నో సంగీత మర్మాలు నిక్షేపించినాడు. గిరిక పాటకు కేకులు మారు పలకటం చూచి
పృదుల షడ్జ స్వరోద్గీత భిల్ల వల్ల
వాధ రా గీతి కాకర్ల తి నాతి భీతి
పరవశాత్మపటీర కోటర కుటీర
లీన పణి యగున క్కోన గాననయ్యె
అని అయ్యలరాజు మరో చమత్కారం చేసినాడు. భిల్లవనితలు వాడే షŸడ్జమ స్వరం విని ఆ అడవిలో పాములు గంధపు చెట్ల తొర్రలలో దాగినాయనేది దీనిలోని వస్తువు. భట్టుమÖర్తి ఇది విని సంగీతానికి పాములు ఆడటం ధర్మం కానీ దాగటం ఏటి ధర్మం అన్నాడట. అపుడు కవి అది షడ్జమం కాబట్టి కాబట్టి నెమలి కూత విని పాములు ఆడుతాయా అని అడిగినాడట. అది విని భట్టు మÖర్తి అతనిని మెచ్చుకొని రత్నఖచితమైన తన మస్తకకలాపమిచ్చెనట. తాడెక్కినవారిని తలదన్నే వారుందురు.
ఇలా ప్రాచీన కావ్యాలను నిశితంగా పరిశీలిస్తే కవుల సంగీత పరిజ్ఞానానికి సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి