మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, నవంబర్ 2026, సోమవారం

హిందువుల బ్రతుకమ్మ పండుగ


హిందువులకు వారి సంవత్సరం మొదటి ఆరు నెలలు పురుష రూపంగా చివరి ఆరునెలలు స్త్రీరూపంగా ఉండి అది స్త్రీ పుంసయోగాత్మకుడైన పరమేశ్వరునికి సంకేతంగా ఉంది. ఇందుకు మనకు సంవత్సరాది నుండి ప్రారంభమయ్యే వసంత ఋతువు పుంలింగ శబ్దమై, వసంత నవరాత్రులు పురుషపరమై మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముని ఆరాధనతో ఆశ్వీయుజం నుండి ప్రారంభమయ్యే శరద్రుతువు, స్త్రీలింగశబ్దమై అపుడు జరుపబడే శరన్నవరాత్రులు దేవీ పరంగా ఉండటం ఒక దృష్టాంతంగా ఉంది.

ఈనాడు మనకు పంచాంగంలో బ్రహ్మచైత్ర శుద్ధ పాడ్యమి నుంచి సృష్టికర్మ నారంభించినట్లు చెప్పబడుతుంది. కాని శరద్రుతువు కంటె మొదటిది భాద్రపదం. అది వర్షరుతువు. ఆ నెలలో చివరి దినాలకు మహాలయ పక్షాలని పేరు. మహాలయం అనగా సంపూర్ణమైన ప్రళయమని అర్థం. కనుక ఈ మహాలయం భాద్రపదంలో జరిగినపుడు పునఃస్సృష్టి చైత్రంతో ఎట్లా ప్రారంభం కాగలదు? అందువల్ల ప్రళయానంతర సృష్టి ఆశ్వీయుజంతోనే ప్రారంభం కావలె.  ఇపుడు మనం మన నెలలను చాంద్రమానాన్ని బట్టి వ్యవహరిస్తున్నాం కాబట్టి వాని పేర్లు పూర్ణిమ నాడు చంద్రుని వెంట ఉండే నక్షత్రాలను బట్టి చిత్త - చైత్రం, విశాఖ, వైశాఖం అని ఈ విధంగా ఏర్పడినవి. 

మన నక్షత్రాలలో మొదటిది అశ్విని కనుక అశ్వినిలో ప్రారంభమయ్యేది ఆశ్వయుజం అవుతుంది. అందువల్ల ఆశ్వీయుజమే సృష్ట్యాది అవుతుంది. దేవీ భాగవతంలో ఈ సృష్టికంతా మÖలం దేవియేనని ఆమె చేతనే ఈ జగత్తంతా ఏర్పడిందని చెప్పబడింది. ప్రాకృతికంగా గూడ సృష్టి విస్తరణ కార్యమంతా స్త్రీ చేతనే జరుగుతుంది. సంతానాన్ని కని పెంచి పోషించటంలో పురుషుని కంటే స్త్రీ బాధ్యతనే ఎక్కువ. ఇది ఎవరు కూడ కాదనలేని సత్యం కనుక అది సృష్టి వర్షచక్రంలో స్త్రీ రూపమైన శరద్రుతువు నుండియే అనగా ఆశ్వీయుజ ప్రారంభం నుండియే ప్రారంభమయిందనవలె.

బ్రహ్మ యొక్క సృష్టి తొమ్మిది విధాలని భాగవతంలో చెప్పబడింది. బ్రహ్మలు గూడ తొమ్మండుగురే! ఇప్పటికారుగురు బ్రహ్మలు గడిచినారట. ప్రస్తుతం మనం ఏడవ బ్రహ్మగారి కాలంలో అతని పరార్ధంలో అనగా ఏబది ఒకటవ సంవత్సరంలోని మొదటిదినంలో ఉన్నాం. బ్రహ్మ తన యొక్క నవవిధ సృష్టి దినమొకటిగా తొమ్మిది దినాలలో సృష్టించి నాడట. అందుచేత ఆ చిహ్నంగా పూర్వం మన పల్లెటూళ్లలో ఆశ్వీయుజం ప్రారంభం కాగానే జానపదులు తొమ్మిది దినాలు బ్రతుకమ్మ అనే పండుగను చేసేవారు. బ్రతుకమ్మ (బ్రతుకు G అమ్మ) పండుగ అనగా సృష్టి ప్రథమంలో జీవోత్పత్తి ప్రారంభమైన దినం అని తాత్పర్యం.

 శరద్రుతువు రాగానే ప్రకృతిలో అంతవరకు బాగా కురిసిన వర్షాల వల్ల వాతావరణమంతా శుభ్రంగా కడుగబడి దూళి రహితమై ఉంటుంది. శరద్రుతువులో అగస్త్యోదయం అవుతుంది కాబట్టి అంతవరకు వానలతో వరదలతో జలాశయాలన్ని పొంగి పొరలి రజో భూయిష్టమై ఉండి అగస్త్యోదయంతో వండు పగిలితేట పడుతుంటవి. కాబట్టి అదే విధంగా సృష్టి ప్రథమ దశలోగూడ ఈ భూగోళం పైన గూడ వాతావరణం మరియు స్థలజలాదులు నిర్మలపడిన పిమ్మటనే జీవోత్పత్తి జరిగి వుంటుంది.

శరద్రుతువు కంటె మొదటిది వర్షరుతువు. వర్షం చేత భూమి పై అన్యోత్పత్తి జరుగుతుంది. కనుక సృష్టి మొదటి దశలో గూడ భూమిపై మొదట అన్యోత్పత్తి జరిగిన పిమ్మటనే జీవన సృష్టి ఆరంభమై ఉంటుంది. భాద్రపదంలోని కృష్ణపక్షం హిందువులకు పితృపక్షాలు, అనగా ఆ పదిహేను దినాలు వారు నక్తం పాటిస్తు పితృ దేవతలకు తర్పణాలు విడవవలసిన దినాలు. “పెత్తరమాస” పితృ అమావాస్య, సామాన్య జనానికంతా తమ పెద్దలకు పెట్టుకోవలసిన పెద్ద పండుగ.

ఈ నెలలో యమ ధర్మరాజు పితృలందరిని మీరు భూలోకంలో మీ మీకుటుంబాలకు వెళ్లి వారర్పించే నైవేద్యాలు, జలతర్పణాలు స్వీకరించిరండని పంపుతాడట. అందువల్ల శరద్రుతువులో మానస సరోవరం నుండి దేశంలోని జలాశయాలలోనికి హంసలు వచ్చినట్లు యమలోకం నుండి పితరులంతా భూలోకానికి వస్తారు. అందుచేతనే ఈ నెలంతా హిందువులు తమ పితృదేవతలను పూజిస్తుంటారు. నెలంతా కాకున్నా కృష్ణపక్షంలో విధిగా వారికి తర్పణాలు విడుస్తుంటారు. కనుక వానిని గ్రహించటానికి వచ్చిన ఆయా వంశాలకు సంబంధించిన పితరులు తాము మళ్లీ అవతరించటానికి తమతమ వంశాలలో లేదా యితరస్థలాలలో తమకనువైన క్షేత్రాలు కూడ చూసుకుంటు ఉంటారు. కనుక ఈ విధంగా కూడ ఈ శరదృతువు జీవోత్పత్తికి ఒక సూచకంగా వుంది.

హిందుపురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు అత్తవారింటికి వచ్చి పడకవేస్తాడు. అందుకే దీనికి శయనైకాదశి అని పేరు. పిమ్మట అతడు శరద్రుతువులోనే కార్తీక శుద్ధేకాదశినాడు లేచి వెళ్లుతాడు. ఆనాడతనిని గోపికలు వచ్చి పిలుచుకొని వెళ్లుతారు. ఆయన లేచి వెళ్లుతాడు కాబట్టి దీనికి ఉత్థానైకాదశి అని పేరు. కనుక ఈ శరద్రుతువు ఆషాడంలో శయనించిన విష్ణువు మేల్కోని కన్నులు విచ్చే సమయం అవుతుంది. సృష్టిలో ప్రతి ప్రాణికి గర్భధారణకు ఒక ఋతువు నియమితమై వుంది కనుక దాన్ని అనుసరించి వసంతం మానవులకు అపుడు వృక్ష జాతులన్ని చిగిర్చి పూచి మన్మథునికి బాగా సమృద్ధిని కలిగిస్తవి. కాబట్టి (మాయ విహారాల సమయంగా ఉంది. కనుక చైత్రం నుండి లెక్కించినపుడు ఆశ్వీయుజం ఏడవనెల అవుతుంది. పిండోత్పతి క్రమాన్ననుసరించి సాంఖ్యంలో గర్భస్థజీవుడు మేల్కొని అతనికి పూర్వస్మృతి కలిగే తరుణం. కనుక సముద్రుని యింటికి వచ్చి శయనించిన విష్ణువు శరద్రుతువులో కన్నులు విచ్చటం మనకు గర్భస్థుడైన ఈ జీవుడు కన్నులు విచ్చటానికి అనగా అతనికి పూర్వ స్మృతి కలుగటానికి ఒక సూచనగా ఉంది. ఈ విధంగా యిది గూడ ఒక విధంగా శరద్రుతువులోని జీవోత్పత్తి స్థితినే సూచిస్తుంది. అందువల్ల తెలంగాణంలోని పల్లెటూళ్లలో శరద్రుతువులో స్త్రీలు జరుపుకొనే బ్రతుకమ్మ పండుగ వెనుక ఈ రహస్యాలన్ని తలదాచుకొని ఉన్నవి.

ఈ బ్రతుకమ్మను స్త్రీలు పుష్పరాశిని శిఖరకారంగా పేర్చి దానిలో ఆ దేవిని ఆహ్వానించి ఆరాధిస్తారు. పుష్పం మనకు ఫలోత్పత్తికి సంకేతం. అంతేగాదు, అది సృష్టి ఆరంభానికి కూడా సంకేతమే ఆది సృష్టిలో విష్ణువు నాభినుండి కమలం పుట్టిన పిమ్మటనే దానిలో బ్రహ్మ ఉదయించి ఈ జగత్తునంతా సృష్టించినాడు గదా! అందువల్ల జానపదులు పూలతో బతుకమ్మను తొమ్మిది దినాలు తొమ్మిది రకాలుగా అలంకరించి ఆరాధించి చివరినాడు జలనిమజ్జనం చేస్తారు.

ఈ బ్రతుకమ్మ ఆరాధనలో తంగెడు పూలకు ప్రాముఖ్యమెక్కువ. దేవి రూపం ఏదైనా జానపదులలో ఆమె పార్వతికే సంకేతం. పార్వతి గిరికుమారి కాబట్టి ఆమెకు గౌరి అని పేరు. ఈమెకు మొదటి పేరు కాలి. గౌరి మొదట నల్లగానే ఉండెనట. కాని శివుడామెను వివాహమాడిన పిమ్మట నల్లగా ఉన్నావని హేళన చేయగా ఆమె బ్రహ్మను గురించి తపస్సు చేసిందట. అప్పుడాయన ఆమెకు తన వంటి బంగారు వన్నె కలిగేటట్లు వరమిచ్చినాడని అందువల్ల ఆనాటి నుండి ఆమెకు బంగారు వెన్నె ప్రియమయినదని చెప్పబడుతుంది. కనుక స్త్రీలిపుడు. ఏ పండుగలో గౌరి దేవిని ప్రతిష్ఠించు కోవలసి వచ్చినా ఆమెను పసుపుతోనే చేయటం. ఆమె గిరికుమారి కనుక గౌరి మÖర్తిని శాఖాహారకారంగా చేయటం ఆనవాయితిగా ఏర్పడింది. కందూరులోని ఆలయంలో గౌరి యిపుడు ఈ రూపంలోనే ఉంటుంది కూడ.

పసుపు వన్నె కారణంగా బ్రతుకమ్మలో తంగెడు పూవులకు ప్రాముఖ్యం ఏర్పడింది. అవి ఈ ఋతువులో విరివిగా లభించే పుష్పాలు గూడ. అందువల్ల జానపదులు వానిలో బ్రతుకమ్మను గౌరమ్మ ఆకారంలో పేర్చుకుంటారు. ఈ విధంగా మన పల్లెటూరి బ్రతుకమ్మ వెనుక ప్రాచీనమైన సృష్టి రహస్యం ఎంతో ఇమిడి వుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి