భారతీయ సంస్కృతితో స్త్రీని దైవాంశగా భావించి ఆరాధించడం ఆచారంగా వస్తోంది. వేదకాలానికి పూర్వమే శక్తి పూజ భారతదేశంలో సంప్రదాయంగా ఉండేదని దేవి పురాణం వల్ల తెలుస్తోంది. వేదాలు, ఉపనిషత్తుల్లో సైతం శక్త్వారాధన గురించిన ప్రస్తావనలు ఉన్నాయి. నాగరికత అభివృద్ధి చెందుతున్న తొలినాళ్లలో మన దేశంలో మాతృస్వామ్యం పరిఢవిల్లింది. స్త్రీ కుటుంబానికి నాయకురాలు. బాధ్యతలు వహించి శక్తిని ప్రదర్శిస్తూ నాగరిక సమాజానికి పునాదులు వేసింది. అందుకే ఆమె శక్తి స్వరూపిణి. కాలానుగుణంగా ఎన్ని మార్పులు వచ్చినా స్త్రీ శక్తి ఆరాధనీయంగానే కొనసాగుతోంది. ప్రతిసంవత్సరం స్త్రీని విజయరూపిణిగా పూజించాలన్నదే సమాజిక సంవిధానంగా మారింది.
మౌలికంగా వ్యవసాయ దేశం మనది కనుక, వర్షాన్ని, అందుకు కారణంగా భావిస్తున్న వరుణ దేవుణ్ని పూజించడం సంస్కృతిలోని భాగం. శ్రావణ మాసంలో వచ్చే తొలకరిజల్లులతో ప్రారంభమై ఆశ్వయుజం తొలినాటి వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయి. తటాకాలు, నదులు జలకళతో అలరారుతూ పైరులు చేతికందొచ్చే స్థితి లో ఉంటాయి. ఆకాశంలో మేఘాలు తగ్గుతూ నిర్మలంగా ఉంటుంది. భాధ్రపద అమావాస్య గడచి ఆశ్వయుజ పాడ్యమి మంచి శుక్ల పక్షం ప్రారంభమవుతుంది. వినీల ఆకాశంలో చిరువెన్నెల నిండు వెన్నెలగా మారే పక్షం రోజులను పవిత్రమైనవిగా భావించి ఆశ్వయుజ పాడ్యమి నుంచి శక్తిని ఆరాధించిడం భారతీయుల ఆచారం. ఈ ఆరాధనలు ఆశ్వయుజ దశమి వరకు కొనసాగుతాయి. దేవిత్రిరాత్రి వ్రతం, దుర్గాష్టమి, మహర్నవమి పర్వదినాల పదిరోజులను దశరాత్రులు అంటారు. ఈ దశరాత్రుల పండగే దసరా! ఈ సమయంలో శరత్చంద్రుడు పండు వెన్నెలను వెదజల్లుతూంటాడు. అందుకే ఈ నవరాత్రులను శరత్నవరాత్రులని కూడా అంటారు. ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుంచి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవిని పూజించి శక్తిగా ఆరాధిస్తారు. నవరాత్రుల చివరి రోజు విజయ దశమి పర్వదినాన్ని దసరా అని వ్యవహరిస్తారు.
సామాన్యులు కాక శాక్తేయులు, యోగులు కూడా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని వామాచారా విధానంలో పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కరోజు ఒక్కో అలంకారంగా ఆరాధిస్తారు. తొలిరోజు దుర్గ, విదియరోజు బాలాత్రిపుర సుందరి, అదేరోజు సాయంత్రం గాయత్రి తదియ రోజు అన్నపూర్ణ, చవితిరోజు కాత్యాయనీదేవి, పంచమి రోజు లలిత త్రిపుర సుందరి, షష్టిన మహాలక్ష్మి, సప్తమిరోజు మహిషామర్దిని, దశమిరోజు
శ్రీ రాజ రాజేశ్వరీ దేవి అలంకరణలతో పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇతర రూపాలతో పూజించడం ఆచారంగా వస్తోంది. దశమిరోజే దసరా పండగను ఘనంగా జరుపుకొంటారు.
తెలంగాణ ప్రాంతంలో మహాలయ అమావాస్య నుంచి సప్తమి వరకు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. మహాశక్తిని బతుకమ్మ పేరుతో ప్రకృతిలో వికసించిన గ్రామీణ ప్రాంతపు పూలతో అలంకరించి స్త్రీలు పండుగే చేసుకొంటారు. ఇదొక మహాద్భుతమైన సంస్కృతికి ప్రతి రూపం. ఆశ్వీయుజ శుద్ధ దశమిరోజే శ్రీరామ చంద్రుడు రావణుణ్ని వధించాడన్నది కొందరి అభిప్రాయం. పాండవులు వనవాసం వెళ్తూ జమ్మిచెట్టు పై తమ ఆయుధాలను దాచి అజ్ఞాతవాసం తరవాత విజయదశమి రోజే తిరిగి తమ అస్త్రాలను స్వీకరించారన్నది మహాభారతంలోని విరాటపర్వంలో ఉంది. మహిషాసురుడనే రాక్షసుడితో దుర్గాదేవి తొమ్మిది రోజులు దివారాత్రులు యుద్ధం చేసి విజయదశమి రోజు విజయం సాదించిందని దేవపురాణం చెబుతోంది. ఈ తొమ్మిది రోజుల్లో వివిధ దేవుళ్ల వేషాలు వేస్తూ వీధి బడుల్లో చదువు కొనే విద్యార్థులు అయ్యవారి¿ చాలు అయిదు వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్ప్పు బెల్లాలు అంటూ ఇల్లిల్లూ ఉపాధ్యాయుని యుక్తంగా తిరిగి సందడీ చేస్తారు. నిజానికి ఆధ్యాత్మికంగా, లౌకింగా కూడా సందడి సరదాల పండుగ దసరా.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి