సంస్క ృత భాగవతం ‘జన్మాద్యస్య యతః’ అని బ్రహ్మసూత్రాల్లోని చతు స్సూత్రితో ఆరంభమయింది. దాన్ని బట్టి బ్రహ్మసూత్రాలు ప్రస్థానత్రయంలో ఒకటి గాబట్టి భాగవతంలో పౌరాణికత్వంతోపాటు వేదాంతం కూడా ఉందని తెలుస్తుంది. ఈ గ్రంథాన్ని ఆంధ్రీకరించిన పోతన మహాభక్తుడు, మహాకవి, కాబట్టి అతని కథనంలో గూడా మÖలంలోవలె ఉత్తమ కవిత్వంతో పాటు గహనమైన తత్వం గూడా చోటు చేసుకుంది. అట్టి వానిలో వామనచరిత్ర ఒకటి. మÖలంలో అది రెండువందల గ్రంథం. పోతన గారు దాన్ని బ్రహ్మాండాంత సంవర్థిగా బెంచి ఏడు వందలు చేశాడు. ఇక దానిలోని మన చరిత్ర వినండి.
మానవునికి దేహమనస్సు అనే రెండు సాధనాలున్నాయి. వానిలో దేహానికి సంబంధించింది భుజబలం, మనస్సుకి సంబంధించింది బుద్ధిబలం. ప్రపంచంలో ఆ రెండింటికే ఎప్పుడూ పోటీ నడుస్తుంది. ఒక పర్యాయం ఒకటి గెలిస్తే మరొక పర్యాయం మరొకటి గెలుస్తుంది. వాటి జయాపజయాలే ఈ యితివృత్తం.
మనుష్యునికి బాల్యంలో ఇంద్రియాలు తప్ప ఇంద్రియం ఉండదు. ఇంద్రియాల ధర్మం జ్ఞాన సంగ్రహణం, ఇంద్రియ ధర్మం బల సంగ్రహణం. బాల్యం గడచిపోగానే యౌవనారంభమై శుక్ర గ్రంథులు పనిచేయట మారంభ మవుతుంది. తద్వారా శరీరం బలం పుంజుకుని వికసిస్తుంది. సంపూర్ణంగా వికాసం పొందిన దేహబలం బుద్ధి బలాన్ని సాగనీయదు. దాన్ని తోసిరాజని తానే పెత్తనం వహిస్తుంది. ఈ స్థితిని మనం కండకావరం అంటాం. అది ఉన్నంత సేపు బుద్ధిబలం ఎక్కడో తలదాచుకోక తప్పదు. తిరిగి ఆది యౌవనం ఉడిగే సమయంలో విజృంభించి భుజబలాన్ని ప్రక్కకు నెట్టి మానవుని అన్ని రంగాలను తానే వశపరచుకుంటుంది. ఇక భాగవతకథను చూడండి.
ఈకథలాగే ఇంద్రుడు బుద్ధిస్థానీయుడు, బలిబల స్థానీయుడు. మనుష్యునికి బాల్యంలో బలం లేదు. అందు చేతి మొదట బలి యింద్రునిచే నొచ్చాడు. బలానికీ
శుక్రాశ్రయం లేక శక్తి లేదు గాబట్టి బలిశుక్రు నాశ్రయించి సత్యాన్ని పొందే విజృంభించాడు. దేహబలం విజృంభించినపుడు బుద్ధి బలం పని చేయదు గాబట్టి యింద్రుడు బృహస్పతి యోచనపై కొంత కాలం తల దాచుకున్నాడు. ఆ సమయంలో ఆడవులు పట్టిన బుద్ధిని జ్ఞానంతప్ప మరేదీ ఉద్ధరింపలేదు. అందువల్ల ఇంద్రుని రక్షించటానికి వామను డవతరించాడు.
దీనిలో వామనుడు జ్ఞానానికి ప్రతీక. దానికి తపస్సమాధులు ముఖ్యం. అందుకే ఈకథలో ఆతని తలిదండ్రులైన అదితి కశ్యపులలో అదితి పయోభ క్షణ మంత్రోపదేశ మందిన వ్రతపరురాలుగా, కశ్యపు డచ్యుతుని మనస్సున ధారణ మొనర్చిన సమాధిస్థుడుగా చెప్పబడ్డాడు. ఈ జ్ఞానం త్రsTÖమయం గాబట్టి వామనుడు త్రివిక్రముడై విజృంభించాడు.
సాధారణంగా రాక్షసుల దండయాత్ర దిక్పాలక పట్టణాలతో ఆరంభó„మై స్వర్గ విజయంతో ముగుస్తుంది. హిరణ్యాక్షుల విజయ యాత్ర ఆలాగే సాగింది. కాని బలిది ఆ విధంగా జరుగలేదు. ఒకేసారి స్వర్గం పైనే దండెత్తాడు. ఇది గమనార్హం.
బలి తన బలాన్ని బ్రహ్మవాదులచే పొందాడు. ఇక్కడ బ్రహ్మశబ్దం ధాతు వాచ్యం. తన్మూలకమే బలం. మానవుని కది యౌవనారంభం కనుక కామ వాంఛా ప్రేరితం. అపుడతనికి కావలసింది యువతి. అందువల్ల బలవంతుడైన బలి రంభాదులుగల స్వర్గంతో తన దండయాత్ర నారంభించాడు.
జ్ఞానానికి ప్రథమ సోపానం ఉపనయనం. అందువల్ల పోతనగారు వామనుని జీవితాన్ని చెప్పుతూ పుట్టగానే పురుడుపున్నెం ఏదీ చెప్పక ఉపనయనాన్ని ఎత్తుకొన్నాడు. అయితే ఈలోపలి సంస్కారాలన్నీ ఏమైనట్టు? ఆగ్రజన్ముల కాయా సంస్కారాలన్నీ యధోచిత కాలంలో జరగాలి. లేకుంటే వాటి నన్నిటిని లాంఛనంగా ఉపనయన సందర్భంలో మళ్లీ జరుపుతారు. లేకుంటే ఆ వటు ఉపనయనానికి అర్హుడు గాడు. అందువల్ల పోతన గారిక్కడ ఉపనయనాన్ని ఎత్తుకొవటంలో తక్కినవన్నీ చెప్పకుండానే అవి యథోచిత కాలంలో జరిగాయని తేలిపోయింది. ఇంకొక రైతే ఈ సందర్భంలో జాతకర్మాదులన్నీ పట్టీ వేసికొని చెప్పేవారేమో కాని పోతనగారు వాటిని చెప్పకుండనే చెప్పాడు. అతని కథా నిర్వహణలో యిదొక మెలకువ.
ఇక వామనుడు బలి మఖ వాటికను చేరిన విధం చిత్తగించండి. అప్పుడా వాటికలో ఉన్న వారు భృగ్వాదులు, వారు వామనుని దూరంలో చూడగానే శంభుండో హరియో? పయోజ భవుడో! చండాంశుడో ! వహ్నియో! అని సందేహించారు. వారు మహర్షులు గదా! వారి సందేహం వృథా యెట్ల వుతుంది? వచ్చినవాడా పైవారిలో ఒకడే, ఆంతే గాదు, గీతామతం ప్రకారం ఆ రూపాలన్నీ అతనివే. పోతన గా రిక్కడ ఋషుల ద్రష్టత్వాన్ని ఔచిత£్యవంతంగా కాపాడాడు.
వామను డక్కడికి రాగానే బలి నుద్దేశించి తన వెంటనున్న వారికి, ఇతడే దేవ దానవ చక్రవర్తి అని పరిచయం చేసి స్వస్తి జగత్త్రsTÖ భువన శాసనకర్తకు అని దక్షిణ హస్తాన్నెత్తి దీవించాడు. ఈ రెండు పద్యాల్లో పోతన గారు బలి జీవిత విశేషాన్నంతనూ పొగడడమేకాక భావికథా సూచనగూడా చేశాడు.
కథలో ఏదైనా నూచన చేయవలసినపుడు సాధారణంగా పాత్రల నోట ప్రస్తుతా ప్రస్తుతాలు తోచే మాటలు పŸలికిస్తారు. పోతనగారిక్కడ ఆవిధంగా గాక మరొక ఆపూర్వ శిల్పం చూపాడు. ఈ పద్యాల్లో మొదటి దానిలో ఆరో చోట, రెండోదానిలో మÖడో చోట విష బీజాక్షర ప్రయోగ ముంది. ‘పురాస్త్ర గిరిరుద్రేషు అక చటహమాతృ కానింద్యాః’ అని లక్షణశాస్త్రం చెబుతుంది. అందువల్ల కృత్యాదుల్లో కృతి కర్తలను గుఱించి చెప్పిన పద్యాల్లో అవి దొరల కుండా చూడాలని అక్షరతత్వజ్ఞులు చెబుతారు నన్నయగారి భారతరచన ఆగిపోవటానికి ఆయన కృత్యాదిలోని ‘శ్రీవాణీగిరిజాశ్చిరాయ’ లో ఏడోచోట చకారం నిలువటమే కారణమని వారి మతం. సాధారణంగా కవులు తమ శత్రువులపై నిటువంటి గీర్వాణ ప్రయోగం చేస్తుంటారు.
పోతనగారిక్కడ వామనునితో ఇతడే దానవ చక్రవర్తి అని చెప్పించిన పద్యంలో ఏడోచోట చకారం నిలిపి మహాభారత రచనవలె అతని కార్యానికి జరిగే విఘ్నాన్ని; తరువాత ‘స్వస్తి జగత్రsTÖ భువన శాసనకర్తకు’ అనే పద్యంలో మÖడోచోట జకారాన్ని నిలిపి అతనికి కలిగే కీడును సూచించాడు. ‘హజగడ లిడి మÖడవచో నిజముగ నిందించి చెప్ప నీల్గుట యరుదే!’ అని కవిజనాశ్రయుని వాక్యం. అయితే బలిచక్రవర్తికి మరణం లేదు కాబట్టి పోతన గారీపద్యంలో నిందార్థం రాకుండా జాగ్రత్త వహించాడనుకోవాలి. అంతేకాక నన్నయగారి స్తుతిలో ఆరోచోట చకారం నిలిచినందుకు భారతరచన అతనితో ఆగి అనంతరీయులతో పూర్తయింది. అలాగే యిక్కడగూడ దానవ చక్రవర్తి పద్యంలో ఆరోచోట చకారం నిలిపినందుకు ఆ యజ్ఞం అతనితో ఆగి అనంతరం భృగ్వాదులతో పూర్తి అయ్యే సూచన కూడ వచ్చింది. ఇది ఆయన యిక్కడ చూపిన అపూర్వ శిల్పమర్మాల్లో ఒకటి. కావ్యానికి జీవం ధ్వని. దాన్ని శబ్దం నుండి పిదకటానికి పోతనగారి కబ్బిన నైపుణ్యం అనంత రానువాదకర్తల కెవ్వరికీ అబ్బలేదు. ఈ ఘట్టంలోని బలివామనుల సంభాషణంతా సరసమైన ధ్వని కావ్యాని కుదాహరణం. బలి యొక్క అమాయిక ప్రశ్నలు, వామనుని యొక్క గడుసు సమాధానాలలో ఉత్థితమైన చమత్కారం పాఠకులను కావ్యానంద డోలల్లో ఊపిరి విడుస్తుంది. బలి వామనుని చూడగానే లోక సామాన్య రీతి ననుసరించి
వడుగా యెవ్వరివాడ వెవ్వడవు సంవాసస్థలం బెయ్య, ది
య్యెడకున్ నీవరుదెంచుటన్ సఫల మయ్యెన్ వంశమున్ జన్మమున్
కడు ధన్యాత్ముడ నైతి! నీమఖము యోగ్యంబయ్యె! నాకోరికల్
కడ తేరెన్ ! సుహుతంబులయ్యె శిఖులున్ ! కల్యాణ మిక్కాలమున్.
అని ఆన్నాడు. ఈ పద్యంలోని బలి మాటల్ని ఓపర్యాయం పరిశీలించండి. “నీవు వచ్చుటవల్ల నావంశం జన్మం సఫలమయ్యాయి. నేను ధన్యాత్ముడనైనాను. శిఖులు సుహుతములై ఈ యజ్ఞం యోగ్యమైనదయింది. ఇది కల్యాణ కాలం. నా కోరికలు కడతేరినవి, అని అతడు పలికిన ఒక్కొక్క మాటకూడ వచ్చినవాడు విష్ణు వనేవిషయం మనకు తెలుపుతుంది. అంతే గాక ‘నా కోరికలు కడతేరినవి’ అనటంలో ‘కడ తేరటం’ భావి విఘ్నాన్ని ‘ఇది కల్యాణకాలం’ అడటంలో కల్యాణం అతనికి ముందుకలుగ బోయె రసాతలవాస శుభాన్ని సూచిస్తాయి. ఇక దీనికి వామనుడు చెప్పిన సమాధానం మరీ చిత్రం.
ఇది నాకు నెల వని యేరీతి బల్కుదు
“ఒకచో టనక నెందు నుండ నేర్తు
ఎవ్వరివాడవం చేమని పలుకుదు
నాయంత వాడనై నడువ నేర్తు
నీ నడవడి యని యెట్లు వక్కాణింతు
పూని ముప్పోకల బోవ నేర్తు
అది నేర్తు నిది నేర్తు ననియేల చెప్పంగ
నేరుపు లన్నియు నేన నేర్తు
నొరులు గారు నాకు నొరులకు నే నౌదు
ఒంటి గాడ చుట్ట మొకడు లేడు,
సిరియు తొల్లి గలదు చెప్పెద నా టెంకి
సుజనులందు తఱచు సొచ్చియుందు”
అని చెప్పాడు. దీనిలో తాను విష్ణువు, స్వయంభువు, త్రిమÖర్త్యాత్మకుడు అని చక్కగా ధ్వనింప చేశాడు.
ఈనాటి వారు పోతన శ్రీనాధుల చుట్టరికాన్ని అంగీకరించలేదు. అతని అవసానదశలో పోతన ఉండవచ్చునన్నారు. అది నిజమైతే అతడు శ్రీనాధుని అవసానదశలోని కడగండ్లు కండ్ల చూచాడేమో! ఈ పద్యంలో ఆ శ్రీనాధుడు గూడా కనిపిస్తాడు చూడండి. ఇతడు కవిసార్వభౌముడు గనుక ఒక చోటనక ఉండ నేర్చిన వాడు. తాను ముప్పోకలు అంటే కవిత్రయం పోకలు పోవ నేర్చినవాడు. ఇతనిక్కూడాపాపం! నావారనే వారెవరూ లేరు. ఉంటే అవసానదశలో కష్టాలుండవుగదా! ఒరులు తనకు లేరు, తానే ఒకరి కైనాడు, సిరి కూడా పూర్వం ఉండేది కాని అపుడు లేదు. అతని స్థానం కేవలం సుజనులు అంటే పండితుల్లో మాత్రమే మిగిలింది. ప్రభువుల దగ్గర మిగల లేదు, ఈవిధంగా ఈ పద్యంలో అతని అంత్యదశమ కండ్లకు కడుతుంది. వామనుడు బలితో
ఒంటి వాడ నాకు నొకటి
రెండడుగుల మేర యిమ్ము
సొమ్ము మేర యొల్ల
కోర్కెదీర బ్రహ్మకూకటి ముట్టెద.
అని చెప్పి మÖడడుగుల భూదానం పొందాడు. తరువాత అతని మÖర్తి విక్రమించ సాగింది. అది నభోవీథిలో తోయద మండలం, ప్రభారాశి, చంద్రలోకం ధ్రువపదం దాటి పోతుంది. దాన్ని ఎఱ్ఱన గారు,
ఇనుని తన మౌళి రత్నంబు నిద్దహార
తరళ రత్నంబు కటి సూత్ర పరిధిమధ్య
రత్నమును నూపురాగ్ర విరాజమాన
రత్న మును జేయుచును ప్రవర్థనముబొందె.
అని చెప్పాడు. ఎఱ్ఱన అంటే అరుణుడు కాబట్టి అతడా అంబరమణిని మణి ధర్మం చెడకుండా సానబట్టి మౌళి రత్నం, తరళ రత్నం, కటిసూత్రరత్నం, నూపురరత్నం చేశాడు. ఇక పోతన గారా విధంగా కాదు, ఎఱ్ఱన గారు మణి గారు డైతే పోతన గారు స్వర్ణకారుడు. అతడారత్నాన్ని తీసుకొని, “రవిబింబం బుప మింప’ అని ఆరంభించి, ఛత్రంలో శ్రవణాలంకారంలో, గళాభరణంలో, కేయÖరంలో, కంకణంలో, కటిఘంటికలో, నూపురంలో, పాదపీఠంలో పొది గాడు. అతడా విశ్వరూపుని, ఇంత, ఇంతింత, అంత, అల్లంత అనే సామాన్య విశేషణాలతో నిచ్చెనగట్టి పాఠకుని దృష్టిని దీనిపై నుండి సత్యలోకం వర కెక్కించి చూపించాడు. కాని యే దీర్ఘ సమాసాలూ వాడి అతనికండ్లు బైర్లు కమ్మించలేదు. పోతన గారివలె తెలుగులోని సార్ధకశక్తిని ఇంత బాగా యెరిగిన వారెందరు?
వామనుడు పెరిగి మొదటి పాదంతో ఆకాశాన్ని, రెండోపాదంతో భూమిని అంతనూ కొలిచాడు. అతని కిక మÖడో పాదానికి చోటు మిగుల లేదు. అది చూచి బలి మÖడోపాదం తన తలపై మోపమన్నాడు. దానితో వామనుడు రెండో పాదంతో కొలుచుకున్న భూమినే మొదటి అడుగులో మళ్ళీ కొలుచుకోవలసి వచ్చింది. అపుడింతకు తప్ప గత్యంతరం మిగల లేదు.
వామనుడు జ్ఞానానికి ప్రతీక. జ్ఞానం త్రsTÖమయం. ఆ త్రయి వేదాలు, వానిలో మొదటిది ఋగ్వేదం. అది దేవతాస్తుతిమయం కాబట్టి దివిని, రెండోది యజుర్వేదం, అది యజ్ఞమయం కాబట్టి భూమిని అంతనూ కొలిచాయి, మÖడోదైన సామవేదాని కింక స్థానం మిగుల లేదు. అందువల్ల అది యజ్ఞాంతంలో భూమిపైని ఋగ్వేదం కొలిచిన దేవతలనే మళ్ళీ కొలుస్తుంది. ఇది జ్ఞానరూపుడైన వామనుని మÖడడుగుల తత్వం. ఈలాటి విశేషాలింకా ఈ కథలో చాలా ఉన్నాయి కాబట్టి ఇంకొక్క విశేషంతో దీన్ని ముగిస్తాను.
వైష్ణవతత్వంలో సాధారణంగా లక్ష్మి లేక విష్ణువు లేడు. అందువల్ల అత డెక్కడికి వెళ్ళినా ఆమె ఉండవలసిందే. గజేంద్రుని రక్షించే సమయంలో ఆమె అవసరం లేకున్నా మైమరపున ఆమెను లాక్కు వెళ్ళిన మహానుభావు డాస్వామి కాని యిప్పుడా అవకాశం అతనికి కలుగ లేదు, అయితే మాత్ర మేం? పోతనగా రూరకుంటారా !
ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంసోత్తరీయంబు పై
పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్నమ
ర్యాదన్ జెందుకరంబు క్రిందగుట మీదై నాకరంబుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే?
అని గురువు గారితో చెప్పే బలిచక్రవర్తిమాట ఆయన లక్ష్మీదేవికి జాగ్రత్తగా ప్రవేశం కలిగించాడు. కొందరీ పద్యంలో కొప్పుపై, తనువుపై, పాదాలపై కపోలాలపై, అన్నపుడు ప్రక్రమ భంగ ముందన్నారు. కాని అది సరిగాదు. ఆ చేయి శ్రీసతి పొలయలుక వహించి నపుడు ఆమె నూరార్చటానికి ప్రణయ శాస్త్రా న్ననుసరించి మొదట కచాకర్షణం, తర్వాత బాహ్వాకర్షణం, ఆ మీద చేలాంచలాకర్షణం చేసింది. అప్పటికీ ఆయమ్మ అలుక తీరకపోగా పాదప్రణి పాతం చేసింది. దాసరి తప్పులు దండంతో సరికాబట్టి, అంతటితో ఆ ఘట్టం సమాప్తి. తదనంతరం కపోలస్పర్శ పాలిండ్లపై నూత్న మర్యాద. ఈవిధంగా ఇందులో మొదటి మాన విప్రలంభం, అనంతరం దీనితో పరిపుష్టమైన శృంగారం
ఉన్నాయి.
బలి చక్రవర్తి శుక్రాచార్యునికి తన నిర్ణయం చెప్పి భూమిని ధారవోసే టందుకు విష్ణుని పాదం కడిగాడు, అది అపుడతనికి ‘కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరి కేశారమై’ పూర్వఘట్టానికి బదులు తీర్చుకున్నట్లు కనిపించింది. ఈ విధంగా పోతనగా రిందులో లక్ష్మీప్రసక్తి కలిగించి శృంగగ్రాహిక గానే ఇంతటి శృంగారాన్ని ప్రదర్శించాడు. ఈ విధంగా పోతనగారు భక్తికి శృంగా రాన్ని అంగంగా చేయటం ఆ రెండిటికీ గల సామీప్య సంబంధం ఓ కారణం కావచ్చు. ఆ కారణంగా ఆయన సిరిదప్పిన వెన్నుని మొగాన్నీ మనకెక్కడా చూపించడు.
భాగవతంలోని ఈ వామన చరిత్ర మానవునిలోని దైవాసుర సంపద్వి భాగ యోగానికి వ్యాఖ్యాప్రాయం. అంతే కాక దీనిలో బహ్వ ృచగీత, ఆత్మవ ృక్ష స్వరూప వివరణం, శుక్రనీతి ఉన్నాయి కాబట్టి పురాణకథల్లో దీనికో విశిష్టత ఉంది. అందువల్లనే ఆదర్శగృహస్థుడైన ప్రవరుడు ప్రతిదినం వామన స్తుతి పరతత్వంతో లేచేవాడు. ఎప్పటికైనా మానవ జీవితానికీ వామనావిర్భావంతోనే ముక్తి కాబట్టి పోతనగారీ కథను ఆద్యంతం తత్వగర్భితంగా నిర్వహించాడు. దీనిలో ఆయన కవితా శిల్పం గూడ కథావ్యంజకమై రాణించింది. ఈ కథలో కందాలు సీసాలు, ఎక్కువ. వామనుడు పుట్టుకతో కందువ. ఆక్రమణంలో బ్రహ్మకూకటి ముట్టాడు. కాబట్టి యిందులో ప్రథమస్థానమాక్రమించిన కందాలతని పుట్టుకను, ద్వితీయ స్థాన మాక్రమించిన సీసాలు శీర్షక శబ్దభవాలు కాబట్టి అతడు బ్రహ్మకూకటి ముట్టడాన్ని వ్యంజిస్తాయి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి