మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ.... ఆపేరు వినగానే అందరి హృదయాల్లో ప్రశాంతత, స్వేచ్ఛా భావాలు వికసిస్తాయి. ఎందుకంటే న్యాయం, సహనం, శాంతి, అహింసకు ఆయన ప్రతిరూపం. భారతీయులందరూ ఆయన్ని బాపూ అని గౌరవంగా సంబోధిస్తారు. జాతికంతకూ గాంధీ తండ్రితో సమానం. ఈ కర్మ భూమి పైన అలాంటి మహనీయులు ఇలా అవతరిస్తూనే ఉంటారు. వసుధైక కుటుంబంలో కలతలు, వైరాలు, వివక్షతలు, హింస నెలకొన్నప్ప్పుడు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ లాంటి యుగకర్తలు భారతదేశంలో జన్మిస్తారు. వాళ్లు తమ మాటలతో, చేష్టలతో సిద్ధాంతాలతో మానవుల్లో మంచిని, సహనాన్ని ప్రభవింపజేస్తారు. మతం కన్నా ఆ మహాత్ములకు మానవుల హితమే మిన్న. పూర్వం నుంచీ ఒకర్నొకరు గెలిచేందుకు రకరకాల ఆయుధాలను
ఉపయోగించారు. బుద్ధుడు, గాంధి లాంటి మహానుభావులు ఆయుధాలతో కాక అహింసతో సత్యాన్ని ప్రతిబింబించే ఆగ్రహంతో ఎందరి హృదయాలనో గెలిచారు. అందుకే మోహన్‌దాస్‌కరమ్‌చంద్ గాంధీ జయంతి అక్టోబర2 ను అంతర్జాతీయ అహింసా దినంగా జూన15, 2007న ఐక్యరాజ్య సమితి ప్రకటించి గౌరవించింది.
శ్రీరామచంద్రుడిపై ఆయన తల్లి కౌసల్య ప్రభావం ఉన్నట్లు గానే గాంధీని కూడా చిన్ననాటి నుంచే తల్లి పుత్లీబాయి తన నైతిక మనోభావాలతో తీర్చిదిద్దింది. గుజరాత్‌లోని పోర్బందర్ అనే సంస్థానానికి గాంధీ తండ్రి కరమ్‌చంద్ ప్రధానమంత్రిగా విధులు నిర్వహించినా, ఆ రాచరికపు ఛాయలు గాంధీని ప్రభావితం చేయకుండా తల్లి సామాన్యుడి గానే పెంచింది. ఆధ్యాత్మిక భావాలు గాంధీజీలో వికసించేలా చేసింది. తన చిన్నతనంలో గుజరాత్ ప్రజలు గొప్పగా ఆరాధించే జైన కవి రామచంద్ర ప్రభావం తనపై చాలా ఉండేదని గాంధీ తన ఆత్మ కథలో రాసుకొన్నాడు. మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ పెరిగి పెద్దయ్యే కొద్దీ లౌకిక విద్యలతో పాటు అలౌకిక భావాలు కూడా ఆయనలో విస్తరించసాగాయి. తన పదమÖడో యేట కస్తూరి బాయితో వివాహం, పదిహేడో యేట తండ్రి కరమ్ చంద్ మరణం లాంటి సంఘటనలు చకచకా జరిగిపోయాయి.
గాంధీ తన పంధొమ్మిదో యేట ఉన్నత చదువుల కోసం లండన్ బయలు దేరడం ఒక మహత్తర పరిణామానికి కారణమైందనే చెప్పాలి. గౌతమ బుద్ధుడు తన భార్య యశోధరను, కొడుకు రాహులుణ్ని విడచి సత్యాన్వేషణ కోసం ప్రస్థానం సాగించినట్లే, గాంధీ కూడా తన భార్య కస్తూరిబాయి, ఆరునెలల వయస్సున్న కొడుకు హరిలాల్‌ను విడచి లండన్ వెళ్ళి న్యాయ శాస్త్రాన్ని నేర్చుకొని న్యాయాన్ని, అహింసనూ సాధన చేశాడు. ఆ తరవాత ఆయన ఆలోచనలు సంపదకోసం కాక సమాజం ఔన్నత్యం కోసం సాగాయి. దక్షిణ ఆఫ్రిక డర్బన్‌లో ఉన్నప్ప్పుడు, భగవద్గీతతో సహా క్రైస్తవ గాస్పెల్‌నూ చదివాడు. ఈ రెండు గ్రంథాలు గాంధీకి ఎంతో స్ఫూర్తినిచ్చాయి. శత్రువును ప్రేమించు, ఒక చెంపనే కాక మరో చెంపను చూపించు అనే భావజాలాలు గాంధీకి మార్గాన్ని నిర్దేశించాయి. ‘దేవరాజ్య నీలోనే ఉంది’ అనే టాల్‌స్టాయి రచన, థొరియా అనే సామాజిక శాస్త్రవేత్త రాసిన శాసనోల్లంఘన అనే గ్రంథాలు గాంధీజీ ఆలోచనా సరళిని మార్చి, పరాయి పాలనలో మగ్గుతున్న భారతీయ ప్రజల స్వేచ్ఛ కోసం ఉద్యమించేలా చేశాయి.
మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ చేసిన భారత దేశ స్వాతంత్రోద్యమం గురించి ఈ రోజు చిన్న పిల్లవాణ్ని అడిగిన చెబుతాడు. ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛా వాయువుల కోసం పరితపించే మానవాళికి ఆయన మార్గదర్శి. 1916లో అహ్మదాబాద్‌లోని గంగానదీ తీరాన గాంధీ ప్రారంభించిన సబర్మతీ ఆశ్రమం వార్దాలో నెలకొల్పిన సేవాగ్రామం నేడు దర్శనీయ స్థలాలుగా మారాయి. సత్యాగ్రహం గురించి తెలియని ప్రపంచానికి శాంతియుత ఆవేశం ఎంతటి భీకరమైన ఆయుధమో తెలిపాడు. శ్రీరామ చంద్రుణ్ని మనం మనసులో పెట్టుకొని పూజిస్తాం. శ్రీకృష్ణుడి భగవద్గీతతో స్ఫూర్తి పొందుతున్నాం, మోహన్‌దాస్‌కరమ్ చంద్ గాంధీ కూడా ఇలా తరతరాల వారి హృదయాల్లో పూజనీయుడిగా ఆరాధ్యనీయుడిగా మÖర్తిభవించి ఉంటాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి