మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, నవంబర్ 2026, సోమవారం

అధ్యాత్మ రామాయణము

భారతదేశంలో పుట్టిన బాలబాలికలకు రామాయణ మహాభారత కథలు పాఠం పెట్టి చెప్పనవసరం లేదు. అవి వారికి ఉగ్గుపాలతోనే వంటబట్టి వానిలోని పాత్రల స్వరూప స్వభావాలు గూడ తెలిసిపోతుంటవి.

ఉత్తరభారతంలో రామాయణానికి, దక్షిణ భారతంలో మహాభారతానికి వ్యాప్తి ఎక్కువ. అందుకు ప్రథమంగా వానిని విదేశ భాషలలో వెలయించిన ఆయా కవులే కారణమని పరిశోధకుల మతం.

మÖల రామాయణం ఈ దేశంలో శ్రీరాముని కంటే మొదలే పుట్టింది. ఇపుడు మన ప్రభుత్వాలేదైనా ప్రాజెక్టు తలపెడితే దాని ప్రణాళికా రచన మొదట కాగితం పైననే జరిగి రూపురేఖలు గూడ దాని పైననే ధరిస్తుంది. ఆ తరువాతనే ప్రాజెక్టు స్థలంలో పని మొదలవుతుంది. సరిగా మానవ జననం అందునా మహాత్ముల జననం గూడ పై ప్రాజెక్టువలెనే ఉంటుంది. వారి పుట్టుకకు మొదలే - వారెక్కడ పుట్టవలె, ఎన్నేండ్లు బ్రతుకవలె, ఏయే పనులు చేయవలెననే జీవన ప్రణాళికంతా కర్మదేవతల కార్యాలయంలో మొదటనే సిద్ధమౌతుంది. అపుడు దానికి తగినట్లుగా మాత ృగర్భంలో పిండం ఏర్పడి అది పూర్తికాగానే ఆ జీవి ఏయే విద్యలు నేర్వవలెనో, ఎట్లా సంసారం చేయవలెనో, ఆ భగోటంతా పుట్టుమచ్చల రూపంలో, రోమావర్తాల రూపంలో, హస్తరేఖల రూపంలో, ముఖవైఖరీ రూపంలోను మందుప్యాకెట్టుపై దాని వివరం మరియు గ్యారెంటీ ముద్రించినట్లు కర్మదేవతలా జీవుని దేహంపై ముద్రించి అతనిని ప్రపంచానికి తగిన కాలంలో విడుదల చేస్తారు.

నేటి ప్రపంచంలో మొత్తం పై మహాభారతం కంటే రామాయణ కథలకే వ్యాప్తి ఎక్కువ. వాల్మీకి ఏ ముహూర్తంలో శ్రీకారం చుట్టినాడో కాని ‘చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం’ అనేమాట దానిపట్ల సార్ధకంగా ఉంది. కవియైన వాడు ఎపుడో ఒకపుడు ఏదో ఒక రూపంలో దాన్ని స్ప ృశించకుండ రచించకుండ ఉండడు. 

ప్రస్తుతం మనకు వాల్మీకి రామాయణం ఆదికావ్యం కాగా, అధ్యాత్మ రామాయణం కావ్యంగాకాక ఆత్మవిచారకమైన ఒక శాస్త్రంగా ఉంది. ఇంత వరకు రామాయణాలెన్నివచ్చినా శ్రీరాముని ఒక అవతారపురుషునిగా ఆదర్శవ్యక్తిగానే కాని ఆత్మారామునిగా ఎవరు చూపలేదు. అవతార పురుషుడనగా ఉత్సవబేరం, ఆత్మారాముడనగా మÖలబేరం. మÖలబేరం యొక్క కనుసైగలలోనే అనగా విరాట్పురుషుని సన్నలలోనే వైరాజపురుషుడు ఈ స ృష్టికి కర్త - భర్త - హర్త అన్ని తానేయై పనిచేస్తున్నాడు. కనుక ఈ రామాయణం ఆ మÖలబేరం అనగా ఆదినారాయణుని తత్త్వాన్ని విశ్లేషించి వివరించింది. అది తెలుసుకునే అందుకు యిక మనం కథలోనికి వెళ్లుదాము.

రామాయణంలో నాయక ప్రతినాయకులు రామ రావణులు. రాముడు క్షత్రియవీరుడు - రావణుడు బ్రాహ్మణ వంశీయుడు. రాముడు ధీరోదాత్తుడు, రావణుడు ధీరోద్ధతుడు. శ్రీరాముని తండ్రి తాతలు యజ్ఞయాగాలు చేసిన ధర్మపరులు. రావణుని తండ్రి తాతలు వేదం చదివిన మహనీయులు. శ్రీరాముని తండ్రి దశరధుడు. రావణుని తండ్రి విశ్రవసుడు.

రావణుడు శ్రీరాముని కంటే చాలా మొదలే భూలోకంలో పుట్టి దేవతలందరిపై దండెత్తి త్రాహి త్రాహి’ అనిపించినాడు. అపుడు వారు ఋషులతోకూడి శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్లి మొరపెట్టుకోగా ఆయన వారితో “నేను భూలోకంలో దశరధమహారాజుకు కుమారుడనై పుట్టి, పినతల్లి విషయంలో అరణ్యానికి వెళ్లి, అపుడు రావణుని సంహరిస్తా” నని వారికి అభయమిచ్చినాడు. అపుడు ఆ శ్రీరాముని వెంట ఎవరెవరు ఏయే రూపంలో ఎక్కడ పుట్టవలెనో ఆ పేపర్ వర్క్ అంతా శ్రీరామునితోపాటే జరిగిపోయింది. భూలోకంలోని అయోధ్యాపురంలో సంతానంలేక దశరథమహారాజు పుత్రకామేష్టిచేయగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయసపాత్రనందించినాడు. దశరథుడు దాన్ని అందుకుని కౌసల్య, కైకేయి అనే ఇద్దరు భార్యలకీయగా వారు తమ భాగాలలోనుండి సగం సగం సుమిత్రకిచ్చినారు.

సుమిత్ర ఒక వైశ్యప్రభువు కూతురట. ఇది భట్టికావ్యంలో ఉందట. అందుకే దశరథుడామెకు నేరుగా పాయసం ఈయలేదని తెలకపల్లి రామచంద్రశాస్త్రిగారన్నారు. భార్యలు ముగ్గురు ఆ పాయసాన్ని భక్షించి గర్భం ధరించినారు.

ఇది శాస్త్రకావ్యం కనుక దీనిలో మనకు నేరుగా కావ్యంవలె కథలోనే రసస్ఫూర్తి కలుగదు. అది కవి యొక్క రచనాచమత్క ృతిలో కలుగుతుంది.

శ్రీరాముడవతారపురుషుడు కనుక కవి ఇక్కడ గర్భం ధరించిన కౌసల్యను

సీ. కోరికల్ జలధులై గూడగా విహరించు

నంగ సంకోచంబు నధిగ మించు.

పంటివారుచియంటి మంటగోష్ఠి ఘటించు

సతతంబు ప్రహ్లాద మతి ఘటించు

నొకటి రెండడుగుల నొకదారి వర్తించు

నుర్విదానాదుల కుత్సహించు

బహుముఖ వ్యావృత్తి భంగిపరిహరించు

తనువున పాండురత్వము భరించు

తే.గీ. వలయు బుద్ధిని కలికి భావమున బంచు

తనదు గర్భార్భకు దశావతార కలన

వెలి దెలుపురీతి దౌహృదావిర్భవమున

రమ్యతతగాత్రి కోసలరాజపుత్రి. (బాలకాండం - 241)

 అని దశావతారముద్రలో వర్ణించినాడు. ఈ పద్ధతి పోతనకు చాలా ఇష్టం. కవి ఇక్కడ ఈ దశావతార ప్రసక్తి భార్గవరామునితోనే ఆపవలసింది. కాని ఇపుడు మనం బౌద్ధావతారకాలంలో ఉన్నాం కనుక పద్యంలో ఒకేసారి బుద్ధుని మరియు కల్కిని గూడ స్మరించినాడు.

భాగవతంలో శ్రీక ృష్ణుడు తల్లికి తన పూర్వరూపం చూపినట్లు శ్రీరాముడు పుట్టగానే మొదటి రూపం చూపి ఆ తర్వాత మళ్లీ బాలుడైనాడు. ఇది మనకు మÖలరామాయణంలో ఉండదు. కాని కవి ఇక్కడ ఇది అధ్యాత్మరామాయణం కనుక శ్రీరాముడెవరో కాదు ఆ ఆదినారాయణుడే అనే జ్ఞాపకాన్ని ప్రవేశపెట్టినాడనవలె.

రామాదులు పెరుగుతుండగా ఒకనాడు విశ్వామిత్రుడు వచ్చి దశరథునికి అతనియొక్క మరియు రామాదుల యొక్క పూర్వరూపాలన్ని తెలిపి తాను తలపెట్టిన యాగరక్షణకని రామలక్ష్మణులను తనవెంటకొని వెళ్లినాడు.

దారిలోవారికి ‘తాటక’ ఎదురయింది. విశ్వామిత్రుడు శ్రీరామునితో ‘రామా! ఈమె స్త్రీ అని నీవు సందేహించవద్దు. హతమార్చు’ అనగా శ్రీరాముడు ఈ తాటక సంహారంతో దానవ సంహారానికి శ్రీకారం చుట్టినాడు. భాగవతంలో శ్రీకృష్ణుని దానవ సంహారం కూడా స్త్రీతోనే ప్రారంభమయింది.

ఆ తర్వాత విశ్వామిత్రుడు ఆశ్రమంలో యథావిధిగా యజ్ఞానికి కూర్చోగా మారీచ సుబాహులనే తాటకసుతులు దాన్ని భంగం చేయటానికి వచ్చినారు. శ్రీరాముడపుడు వారిపై రెండస్త్రాలు ప్రయోగించగా ఒకదానితో సుబాహుడు చచ్చి సముద్రంలో పడగా, రెండవ దానితో మారీచుడు సముద్రం అవతల పడినాడు.

విశ్వామిత్రుని యజ్ఞం ముగిసేనాటికి మిథిలానగరంలో జనకుడు తన కూతురి స్వయంవరాన్ని చాటించినాడు. అది తెలిసి విశ్వామిత్రుడు రామలక్ష్మణులనానగరానికి తీసికొని వెళ్లినాడు. అపుడు వారు గౌతమాశ్రమం మీదుగా వెళ్లినారు. ఆ దారిలో పతిశాపంతో శిలయై పడిన అహల్య అతని పాదస్పర్శతో మళ్లీ పూర్వరూపాన్ని ధరించి శ్రీరాముని స్తుతించింది. ఇది అతని స్తుతుల్లో మొదటిది. ఈ తరువాత మరెందరో అతనిని నుతించినారు.

మిథిలా నగరానికి వెళ్లుతు దారిలో కాలక్షేపంగా విశ్వామిత్రుడు శ్రీరామునికి జానకి యొక్క సౌందర్యాన్ని గురించి తెలిపినాడు. కల్యాణ కార్యాలలో వివాహానికి మొదట కన్యాంగ సౌందర్య కథనం ఉండవలె. అందుకై కవిగారిక్కడ అది ప్రవేశపెట్టినాడు. మామÖలు కావ్యాలలోనైతే ఈ పని వసంతకుడు లేదా విదూషకుడు చేస్తారు. కాని ఇక్కడ శ్రీరామునికి అస్త్రవిద్యాగురువు మరియు ఎంతో పెద్దవాడయిన విశ్వామిత్రుడే చేసినాడు. కనుక అతడెంతో సంయమనం వహించవలసి వచ్చింది. జానకి అప్పటికింకా ప్రౌఢకాదు, కన్యనే. కనుక విశ్వామిత్రుడామెను వర్ణించటానికి ప్రౌఢమైన శైలిలో వృత్తాలేమి ఎత్తుకోలేదు. సరళంగా చిన్నచిన్న కందాలలోనే ఆమె అందాన్ని రూపు కట్టించినాడు. ఇది 14 పద్యాలలో సాగింది. వానిలో రెండు వ ృత్తాలుమాత్రం ఆమె ప్రక ృతి స్వరూపిణి మరియు పరాదేవత అని ఆమె వ ృత్తాన్ని తెలుపుతున్నవి. అవి ఇవి -

మ. తనుమధ్యా మణికిన్ బిరుందు రశనాధారంబధిష్ఠాన మొ

య్యన గౌనన్మణి పూరితాకర వరంబౌ నాభి చందోయి మే

లనిశస్ఫూర్తి యనాహతంబగు విశుద్ధాబ్దంబు కంఠంబు జ

య్యన పద్మద్విదళంబు కన్గవ సహస్రారాబ్జమౌమోమిలన్

- బాలకాండము - 393

 అనే ఈ రెండు వృత్తాలపూర్వంగా ఉన్నవి. మొదటి దానితో పంచభూతాలామెకు అంగాలుకాగా - రెండవదానితో ఆమె చిల్లక్ష్మిగాన జానకి 

క. చిల్లక్ష్మిగాన జానకి

పల్లవములచే సరాగ భావముగని కిం

చిల్లక్ష్మి గాంచిమించెడి

పల్లవములకున్ విరాగ భావము గూర్చున్.

- బాలకాండము - 382

లక్ష్మి అనగా పద్మ కనుక ఆమె షట్చక్ర కమలాలతో అంగాలు పోల్చబడి ఆమె చిదగ్నికుండ సంభవ కనుక సాక్షాత్తుగా ఆ పరాదేవతనే అని నిరూపింపబడింది.

అంతేకాక ఈ పద్యం మÖలాధారం నుండి సహస్రాంతమై అంగపూజతో దేవతలను పాదాదిగా స్తుతించవలెననే నియమం కలసివచ్చి వర్ణనా ప్రక్రియలో గూడ దీనిలో సీత మానవ కాంత కాదు అనే విషయం నిరూపితమయి యిట్లా యిది అపూర్వంగా ఉంది.

ఇక్కడ కవి విదూషకుడు చేయవలసిన పని విశ్వామిత్రునితో చేయించినవాడు. అయితే జానకి అంగ వర్ణనకు ఇక్కడ తప్పితే సందర్భం మరొక దగ్గర కలిసిరాదు, కనుక కవిగా రాపని చేయించవలసి వచ్చినది.

రాముడు మిథిలకు చేరిన పిమ్మట జనకుడు దశరధుని అక్కడికే పిలువనంపటం, అతడు సకుటుంబంగా వెళ్లగా జనకుడు తన యిద్దరు బిడ్డలను సోదరుని యిద్దరు బిడ్డలను అతని నలుగురికిచ్చి ఏక ముహూర్తంలోనే వివాహం జరిపించడం జరిగింది.

దశరధుడు నలుగురు కుమారులు కోడండ్రతో అయోధ్యకు బయలుదేరగా దారి మధ్యలో పరశురాము డెదురుపడినాడు. అతడు శ్రీరాముడు తమ గురువుగారైన శివుని విల్లు విరిచినందులకు చాలా కోపంతో ఉన్నాడు. శ్రీరాముని చూచి ‘ఓ రామా! నీవు పాతబడిన శివుని విల్లు విరిచినానని చాలా గర్వంతో ఉన్నావు. ఇదిగో నాచేతిలోని విల్లును చూడు. ఇది నారాయణాస్త్రం, దీన్ని ఎక్కుపెట్టు, నీ సంగతి తెలుస్తుంది’ అని సవాలు చేసినాడు. అది విని రాముడు ‘ఏదీ దాన్నిటివ్వు” అని అతని చేతినుండి తీసికోగానే ఆ విల్లుతో పాటు పరశురాముని శక్తి అంతా శ్రీరామునిలోకి చేరిపోయింది. దానితో అతడు క్షీణసత్త్వుడైపోయి శ్రీరాముని “నీవాదినారాయణుడ’ వని నుతించి తన నివాసానికి వెళ్లిపోయినాడు.

దశరధుడావిధంగా కుమారులతో యిల్లు చేరగానే భరతుడు మేనమామగారి దర్శనార్ధమై కేకయ దేశానికి వెళ్లినాడు. దశరథుని కుమారుల వివాహాలైనాయి. నేనిక వృద్ధుడనైనాను. రాజ్యభారం వహించలేనని కులగురువైన వశిష్టుని పిలుచుకొని ఆ విషయం చెప్పి ‘నేను శ్రీరామునికి ఈ రాజ్యం పట్టం గడుదామనుకుంటున్నాను. అందుకు తగిన ముహూర్తం చూడు’ అన్నాడు.

ముహూర్తం అనే మాట వినేవరకు అతని హృదయంలో గుండు పడినట్లయింది. దేవతలంతా రావణుని బాధలు పడలేక నారాయణుని దగ్గరకు వెళ్లినపుడు వారితోపాటు వెళ్లిన ఋషులలో వశిష్టుడు కూడా ఉన్నాడు. అపుడు నారాయణుడు వారితో ‘నేను దశరథునికి రాముడనై పుట్టి అరణ్యవాసానికి వచ్చినపుడు రావణుని సంహరిస్తానని చెప్పినాడు. కనుక యిపుడిక శ్రీరాముడు రాజ్యాన్నేలుతు సింహాసనంపై కూర్చుంటే రావణ సంహారం ఎట్లా జరుగుతుంది.

అతడు రాత్రి అంతా బాగా ఆలోచించి వెంటనే వాణిని పిలుచుకుని నీ వెట్లాగైనా మందర హృదయంలో దూరి ఆమెతో కైకేయికి దుర్బోధ చేయించి ఏ విధంగానైనా ఈ పట్టాభిషేకాన్ని భంగంచేయించు. లేకుంటే రావణునితో మీ దేవలోకానికంతా బ్రతుకులుండ’ వని చెప్పగా వాణి ‘అలాగే’ నని అంగీకరించి వెళ్లి మందర హృదయంలో ప్రవేశించింది. ఈ రహస్యం మÖల రామాయణంలో ఉండదు. కనుక అంతవరకు శ్రీరాముని ప్రాణ సమానంగా ప్రేమించే కైక అకస్మాత్తుగా అపుడట్లా శ్రీరాముని పట్టాభిషేకానికి ఎందుకు భంగం కలిగించిందో సామాన్యజనం ఎరుగలేక పోయినారు. వనపర్తి నివాసి ఏదులపాపయ్య ‘మందర’ అనే గేయకావ్యం వ్రాసి దానిలో కృష్ణావతారంలో కుబ్జగా అవతరించిందని కూర్చి నా దగ్గరకు వచ్చి ‘నేనిట్లా మందరనే కుబ్జగా అయిందని వ్రాసినాను దీనికేమైనా ఆధారముందా లేకుంటే నేను మళ్లీ మార్తునా దీన్ని’ అని అడిగినాడు. అది విని నాకైతే యిప్పటికి ఏ ఆధారం కనిపించలేదుగాని నీ కల్పన బాగానే ఉంద’ని అన్నాను. దానికి ఉదాహరణం నా కిపుడీ కావ్యంలో కనిపించింది.

వశిష్టుడు తలచినట్లు శ్రీరామపట్టాభిషేకానికి భంగం కలిగి అతడిక అరణ్యవాసానికి సిద్ధంకాగా జానకిగూడ అతనితో పయనమయింది. అది చూచి శ్రీరాముడామెను వద్దనగా ఆమె పతితో -

తే.గీ. గణితశాస్త్ర ప్రవీణు డొక్కరుడు నన్ను

బాల్యమున జూచి యిట్లని పలికె దేవి!

ధవునితో నీకు వనవాస మవునటంచు

నా ద్విజుడు సత్యభాషణుం డగునుగాత!  `అయోధ్యకాండము - 240

అని తెలిపిన దీన్ని బట్టి రామాయణ కాలం నాటికే ఈ సాముద్రిక శకున శాస్త్రాలు బాగా ప్రచారంలో ఉన్నవని తెలుస్తుంది. ఇప్పటికి గూడ అవి ఎన్నో నిజమౌతున్నా అవి మÖఢనమ్మకాలని తప్ప వానిలోని నిజాన్ని పరిశీలింతామని శాస్త్రజ్ఞులకు లేదు.

సీత అట్లా తనకు (హస్తసాముద్రికుడే అయి ఉండవచ్చు) అతని మాటను తెలిపే మనము - 

క. మును బహురామాయణములు 

వినినవెగద యెందునేని విపినంబునకున్,

జనకజను విడిచి రాముడు 

జనియెననుట వినుటగలదె జనముల వలనన్ (అయోధ్యకాండము 242)

అని అతనినడిగింది. దీన్నిబట్టి సీతారాములంతవరకే చాలా రామాయణాలు విన్నారని తెలుస్తుంది. కనుక ఈ రామాయణ కధ ఆదియుగంలోనపుడు మొదటిసారి జరిగిందో! ఈ అధ్యాత్మరామాయణ మవతరించేనాటికది ఎన్నవదో ఎవరెరుగగలరు? దీన్నిబట్టి సీతకు “గుడుగుడుగుంచెం’ ఎపుడున్నదే కదా! ఇపుడీ కొత్తదేమిటి? అనే భావం ఆమె మనసులో ఉదయించిందనిపిస్తుంది.

మందర మాట నెగ్గి కైకేయి ఆజ్ఞతో శ్రీరాముడు వనవాసానికి బయలుదేరినాడు. అప్పుడు రాముడు ముందు దారితీస్తుండగా అతని వెనుక సీత ఆమె వెనుక ధనుర్బాణాలు ధరించి లక్ష్మణుడు నడువసాగినాడు. అప్పుడు రాముడు లక్ష్మణునితో `

చ. ఇక జననౌ బ్రయత్నమున నీవని లక్ష్మణ సజ్యచాప సా

యకములతో నిశాట భయమౌటను మున్నుగనేను వత్తు వె

న్క కడను నీవురమ్ము జనుగావుత భూసుర మధ్యసీమ నా

త్మకు పరమాత్మకున్ దెలియ మధ్యగతిన్ జను మాయ కైవడిన్.

`అరణ్యకాండము - 12

 అని అన్నాడు. ఇక్కడ కవిగారి ఉపమానం గమనించదగింది. రాముడు దేవుడు, లక్ష్మణుడు జీవుడు, సీత వారిద్దరి నడుమగల మహామాయ. ఆమె జీవునికి ముందే దేవుడు కన్పించకుండ అడ్డంగా ఉంటుంది. దేవుడు ముందు దారితీస్తుంటాడు. అతని వెనుక మాయ ఉంది. ఆ మాయ వెనుక జీవుడు కర్మబద్ధుడై నడిచిపోతున్నాడు తప్ప దేవునిగాని ముందేమున్నది ఏమి జరిగేదిగాని చూడలేకపోతున్నాడు. దీన్నిబట్టి ఈ రామాయణం కథాపరంగా శ్రీరామునికి ముందేమి జరుగుతుందో స్పష్టంగా తెలుసు. సీతకు అంత తెలియదుకాని కొంత తెలుసు. లక్ష్మణునికి మాత్రం ఏమీ తెలియదు. అతడమాయకుడు. మాయననుసరించి నడిచే జీవుడు.

వారు అయోధ్యనుండి బయలుదేరిన పిమ్మట మొదటినాటి రాత్రి 

శృంగిబేరపురంలో గుహుని ఆతిథ్యంలో ఉండి అక్కడే నిద్రించినారు. మరునాడక్కడినుండి బయలుదేరి చిత్రకూటం చేరినారు. అపుడు శ్రీరాముడు చిత్రకూటానికి వచ్చే అపుడు గుహునితో మర్రిపాలు తెప్పించుకొని తలకు జడలు అతికించుకున్నాడట.

క. వట విటపిక్షీరంబుల

జటామకుటమున్ ఘటించి సౌమిత్రియుదా

నట రాముడు పూర్వదినము

నటుల జలాశనమొనర్చి నవనిజతోడన్    (అయోధ్యకాండము - 297) 

అట్లా ఎందుకతికించుకున్నాడో! వారెట్లా యిపుడరణ్యవాసంలోనే 

ఉన్నారు కనుక రెండుమÖడు నెలలలో తల గడ్డం పెరిగిపోయి వెంట్రుకలు తైలసంస్కారం లేక జడలు గట్టవా!

శృంగిబేరపురం నుండి బయలుదేరిన పిమ్మట వారి రెండవ మజిలి చిత్రకూటం. అక్కడ కొంతకాలం నివశించినారు. వారక్కడ ఉన్నపుడే భరతుడు రాగా పాదుకలిచ్చి సాగనంపినాడు. వారక్కడ ఉన్నపుడే జయంతుడనే ఇంద్రసుతుడు కాకి రూపంలో వచ్చి సీత యొక్క చంటిని గోటితో చీరగా శ్రీరాముడతనిపై కుశను అస్త్రంగా మార్చి ప్రయోగించగా అది ఆ కాకాసురుని దక్షిణనేత్రాన్ని తీసుకున్నది. ఈనాడేకాదు దుర్మార్గులపట్ల దృష్టి ఆనాటి నుండియే స్త్రీలపట్ల అట్లా ఉంది.

చిత్రకూటం నుండి బయలుదేరి వారు దండకారణ్యం చేరి పంచవటి అనే ప్రాంతంలో నివసించినారు. అపుడు శ్రీరాముని సౌందర్యం చూచి రావణుని సోదరి శూర్పణఖ అతనిని మోహించి వచ్చింది. అపుడు శ్రీరాముడామెను “నేను భార్యతో ఉన్నాను కనుక నీకు సవతితో సుఖముండదు. నా సోదరుడు లక్ష్మణుడు ఒంటరిగా వున్నాడు నీవతని దగ్గరకు వెళ్లు’ అని పంపగా లక్ష్మణుడామె ముక్కు చెవులు కోసి విరూపను చేసినాడు. అపుడామె రావణుని దగ్గరకు వెళ్లి తనను పరాభవించిన వారిని గురించి తన విషయం చెప్పకుండా దాచి సీతను గురించి “అన్నా! అక్కడ రామలక్ష్మణులని యిద్దరు సోదరులున్నారు. వారిలో శ్రీరాముని భార్య చాలా అందగత్తె. ఆమెను చూచి నేనామెను నీకు తెత్తామని పోగా నాకీగతి పట్టింది. నీవెట్లైనా ఆమెను వశపరుచుకో” అని సీతాపహరణానికి ప్రోత్సహించింది. ఇక్కడ కవి - 

తే.గీ. అని యిటు విరూప శూర్పనఖాభిధాన

లక్షితాశుగ వేగమై లంక కరిగి

జానకీ రూప చాంపేయ సూన విభవ

మహిమ లెరిగించె రావణ మధుపమునకు (అరణ్యకాండ - 240)

అని ఒక ధ్వని పూర్వకమైన ఉపమానం వేసినాడు.

అందమనేది స్త్రీకి గాని పురుషునికి గాని ఎప్పుడైనా ప్రమాదమే. దాని వెనుక ఎక్కడనో అంతకుని దూతలు కనిపెట్టుకొనే ఉంటారు. పెద్దన మనుచరిత్రలో - 

తే.గీ. వాని చక్కదనము వైరాగ్యమును జూచి

కాంక్ష జేయు జార కామినులకు

భోగ బాహ్యమయ్యె పూచిన సంపెంగ 

పొలుపు మధుకరాంగనలకు బోలె 

అని అన్నాడు. ఆ పెద్దనగారి ఉపమానాన్నే ఇక్కడ ఈ పెద్దనగారు తీసికున్నాడు. దీనిలో ఇద్దరివీ గీతులే కావడం విశేషం. వరూధిని వేశ్య కనుక పెద్దనది ఆటవెలది కాగ ఇక్కడ సీత శుద్ధసువర్ణం కాబట్టి ఇది తేటగీతి అయింది. ప్రవరుని పద్యంలో మగవాడు సంపెంగ వరూధిని మధుకరాంగన కాగ ఈ పెద్దన సీతనే సంపెంగను చేసి రావణుని మధుపం చేసినాడు. పర్యవసానం ఇటుది అటైనా అటుది ఇటైనా ఒక్కటేకాని రావణుడు మధుకరమేగాని మధుకరాంగన కాలేదు.

తేటికి సంపెంగకు వైరం సాహిత్య ప్రపంచంలో ప్రసిద్ధం. అయితే అది పెంటి తేటికేగాని మగతేటికి కాదని వైరంలోని హాస్యాన్ని శ్రీవల్లపురెడ్డి బుచ్చారెడ్డిగారు ఆవిష్కరించినారుకాని తేటులలో కాని తేనెటీగలలోగాని పోతు పెంటిని జీవశాస్త్రజ్ఞులు గుర్తించగలరేమోకానీ సామాన్య జనం గుర్తించలేరు. స్థూలారుంధతి న్యాయంగ రెంటిని ఒకే పేరుతో పిలుస్తుంటారు. కనుక ఇక్కడ కాణాదంవారు పై స్థూలారుంధతి న్యాయాన్నే అనుసరించినారు.

రావణుడు శ్రీరాముని గురించి అంతవరకే అతడు నరమాత్రుడుగాదు అవతారపురుషుడని విన్న మాటలివి - 

సీ. నరమాత్రుడైన యొక్కరుడు రాముని చేత

బహుదైత్య నేత మద్భ్రాతఖరుడు

బలశౌర్య ధైర్య విభ్రాజులు దనుజుల

నేకులు సమసి ర దేమి యొక్కొ!

యదిగాక మును బరమాత్ముండు మద్వ ధా

ర్థము బ్రార్థితుండయ్యె ధాతచేత

నా విభుండీ రాముడన రఘుకులమున

నీ నరాకృతి జనియింపబోయి

గీ. ఇట్టి హరిచేత నేను వధింపబడితి

నేని వైకుంఠ రాజ్యంబు నెనయ గాంతు

నదియు గాదేని దైత్యరాజ్యము భుజింతు

నగుట రాముని గూడ నేనరుగువాడ. (అరణ్యకాండ - 243)

 అని నిర్ణయించుకున్నాడు. లంకలో రావణుడట్లా నిర్ణయించుకోగానే ఇక్కడ దండకంలో శ్రీరాముడు సీతతో ఒక ఏకాంతంలో ఫలానా నాడు ఫలానా వేళకు అగ్నిదేవుడు వచ్చి మాయాసీతను నీ స్థానంలో నిలిపి  నిన్ను తన లోకానికి తీసుకొని పోతాడు. ఇది రావణునికి తెలియదు. రావణుడు మాయ సీతనే నిజమైన సీతయని ఆమె నెత్తుకపోతాడు. అనంతరం ‘నేను రావణుని సంహరించి మాయసీతను రావణుని చెరనుండి విడిపించుకొని వచ్చేవరకు నీవు అగ్నిదేవుని దగ్గరే ఉండు. నేను మాయసీతను చెరనుండి విడిపించి అగ్నిపరీక్ష యిమ్మని కోరుతాను. అప్పుడు లక్ష్మణుడు అగ్నిని ప్రజ్వలింపజేస్తాడు. మాయసీత అందులో ప్రవేశిస్తుంది. అపుడగ్నిదేవుడు తన సీతను తాను తీసికొని నిన్ను కొనివచ్చి నా కప్పగిస్తాడు’ అని చెప్పినాడు. ఇది ఏకాంతం కాబట్టి ఈ సంగతి లక్ష్మణునికేమాత్రం తెలియదు.

రాముడు మాయామృగం రావటం కూడ సీతకు చెప్పినాడు. వారింత వరకే చాలా రామాయణాలు విన్నారు. కనుక సీతకు జరుగబోయే కథంతా రామునికి వలెనే తెలుసు.

పట్టాభిషేకానంతరం సీతను అడవులకు పంపడం కూడ శ్రీరాముడామెకు తెలిపియే చేసినాడు. ఆమెకు చెప్పకుండ తానేపనీ చేయలేదు. కాని ఇదంతా లక్ష్మణునికి అగ్నిదేవుడు సృష్టించిన మాయాసీతకు మాత్రం తెలియదు. అయితే కథలో ఇట్లా ముందు జరిగేది తెలిసిపోతుంటే పాఠకునికిగాని శ్రోతకుగాని దానిపైన రక్తి ఉత్కంఠ ఉండవు. అవి చల్లారి పోతుంటవి.

అసలు రావణ కుంభకర్ణులెవరు? మొదట జయవిజయులు గదా! సనకాదుల శాపానికి గురియై నారాయణునితో వైరబుద్ధిచేత మÖడు జన్మలలో మళ్లీ అతనిని చేరే అట్లు అతనితో వాగ్దానం తీసికొన్నారుగదా! మొదటవారు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. అపుడు వారు పూర్తిగా దానవులు. రెండవ జన్మలో యిపుడు రావణకుంభకర్ణులు. కైకసి విశ్రవసు కుమారులు. విశ్రవసుడు తల్లి కడుపులోనున్నప్పటినుండియే వేదాన్ని విన్న ధీశాలి. అందుకే అతడు విశ్రవసుడైనాడు. కానీ కైకసి దానవకాంత. మొదటి జన్మలోకూడ అంతే. రావణుడు ఎపుడు హరిచేతనే వధింపబడి స్వర్గసామ్రాజ్యాన్ని పొందవలెననుకున్నాడో అపుడిక అతనికి శ్రీరాముని భయమెందుకు? “నరకే సతికో దోషో మరణే సతి కిం భయం’ అని గదా! శ్రీరామునితో తప్పించుకునే అందుకు పాతాలీVAమం నికుంభిలా యజ్ఞం ఎందుకు చేసినట్లు?

ఈ జీవునికి ప్రాపంచిక వాసన - విషయానందం అనే రెండు బలమైన మోహపాశాలు. కనుక అవి వదలటం దుర్లభం. మరణానంతర జీవునికారెంటి అనుభవముండదు. యాతన దేహంలో ప్రవేశించిన జీవుడు అప్రాక ృతశరీరి. ఆ దేహంలో పాపాత్ముడైనవాడు నరకానికి వెళ్లి దుఃఖాన్ని అనుభవిస్తే పుణ్యాత్ముడైనవాడు స్వర్గానికి వెళ్లి భోగాలనుభవిస్తాడు. అపుడిక ప్రాపంచిక వాసన ఉండదు. అది సుప్తావస్థలో ఉండి పునర్జన్మ సమయంలో మాత్రమే మేల్కొని తనకు తగిన క్షేత్రాన్ని ఎన్నుకుంటుంది. అంతవరకు పుణ్యలోకాలలో ఉన్నవారికి విషయసుఖం అందుతూనే ఉంటుంది. అపుడతనికి యింద్రియాలు కూడ ఉంటవి. అందుకే వైదికులంతా పరమపదం ఈ జీవునికెపుడో! అది ఎలా ఉంటుందో కాని ఇపుడున్న సుఖాన్ని ఎందుకు వదలవలెనని విషయ సుఖాన్నాసించి స్వర్గం కోసం కర్మలంపటులౌతుంటారు కనుక అట్టివారికోసం సామాన్య రామాయణాలు అంతరిస్తుండగా ముక్తి లేదా మోక్షం కోరేవారికి జ్ఞానోదయాన్ని కలిగించి శ్రీరాముని యొక్క నిజతత్వం తెలిపి జ్ఞానోదయం కలిగించటానికి “జ్ఞానీదేవతం కైవల్యం” కనుక పునరావ ృత్తి హితమైన జీవన్ముక్తి కలిగించటానికి ఈ అధ్యాత్మరామాయణం అవతరించింది. ఇది దీని పుట్టుక విశేషం.

ఈ రామాయణం యొక్క ఉత్తరకాండ నుండియే సంస్క ృతంలో ‘పౌలస్త్యహృదయం’ తెలుగులో ‘ఉత్తరరామాయణం’ అవతరించినవి.

కవితావిచారం

తెలుగుసాహిత్యంలో పోతన పిమ్మట అత్యధికమైన శబ్దాలంకారాలు ప్రయోగించిన కవి కాణాదం పెద్దన ఒక్కడే. పోతన కవిత్వంలో అంత్యానుప్రాసలెక్కువగా ఉండగా ఈయన ఆదియమకాలెక్కువ. ఈ రామాయణంలో దాదాపు మÖడవ వంతు వచనాలున్నవి. అవన్ని సాధారణంగా మామÖలు వాక్యాలలో మొదలై శ్లేషానుప్రాణితమైన ఉపమానాలతో ముగుస్తు బాణుని మÖసలో నున్నవి. వానిలోని సుదీర్ఘ వచనాలు ఒక్కొక్కటి ఒక విషయంతో ముగుస్తు దేనికదే స్వతంత్రంగ ఉన్నవి. ఉదాహరణకు అయోధ్యకాండలో విరాడ్రూపం - 381, అరణ్యలో జగద్రచన  - 101- 03, కిష్కింధలో పంపాసరస్సు - 4, పిండోత్పత్తి - 341, సుందర కాండలో అష్టవిధ నాయికలు - వెన్నెల - 39, యుద్ధకాండలో ఉభయ సైన్య సముద్రాలు - 470, ఉత్తరకాండలో కర్మస్వరూపం - 238 వివరించే వానిలో కొన్నిమాత్రమే.

ఆంధ్రసాహిత్యంలో శ్రీనాథపోతనలు, అల్లసాని భట్టుమÖర్తులు కొన్ని సందర్భాలలో ఉపయోగించిన ఛందస్సులు వ్రాసిన పద్యాలు తరువాతి కవులకు తమ కావ్యాలలో వస్తువేదైనా ఆ సందర్భం వచ్చినపుడు మాత్రం ఆ బాణీలే శరణ్యమై మÖసలుగా నిలిచినవి. అటువంటి పద్యాలు దీనిలో బేరీజువేస్తుపోతే చాలానే తేలుతవి. అంటే ఇది వారి అసమర్థత అని కాదు. వారి బహుముఖ గ్రంథ పాండిత్యానికి ఉదాహరణం. వీరి పద్యాలలో పోతనగారి పోతలో ఎక్కువగా నడిచినవి. అవి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి విభక్త్యంతాలు. అవికాక దశావతార శ్లేషలు - 

సీ. భుజశక్తి నాతోడ పోరాడ శంకించి - 7.32 (యు.వి.154)

సీ. మందార మకరంద మాధుర్యమున దేలు - 7.150

సీ. కమలాక్షు నర్చించు కరములు కరములు - 7.169

సీ. కంజాక్షునకుగాని కాయంబు కాయంబే - 7.170

సీ. సంసార జీమÖత సంఘంబు విచ్చునే - 7.171 

అనే భాగవత పద్యచ్ఛాయలుగూడ పద్యాలలో కనిపిస్తవి. పెద్దన గారి వర్ణనలన్నింటిలో మనోహరంగాను మరియు అపూర్వంగాను ఉన్నవి. ఇతని కావ్యవర్ణనల్లో బాలకాండలోని అయోధ్య అరణ్యకాండలోని దండక, కిష్కింధకాండలోని వర్షాగమం, సుందరకాండలోని లంకానగరం, చంద్రోదయం అపూర్వంగా ఉన్నవి. ఉదాహరణకు కిష్కింధలో వర్షాగమం ఉంది. అది విష్ణువు శయనించిన కాలం. సన్యాసులకు చాతుర్మాస్యలు, భర్త నిద్రించినపుడిక స్త్రీకేమి పని ఉండదు. అపుడు వారు వెంట్రుకలు గీరుకొని దులుపుకొని పాపిట సరిచేసుకుని నెత్తి కట్టుకుంటారు. దీనిని కాణాదం పెద్దన -

 తే.గీ. భర్త నిదురించుతరి పనిబాటలేమి

క్షితివధూటి వెన్నెరుల్ సిక్కుదీర్చి

వేళయనుబోటి పాపటల్ విచ్చెననగ

జగతినెల్లెడ హలముల చాళ్లు వెలసె (కిష్కింధకాండ -154)

కశ్యపుడు గొప్ప తపస్వి అయినా దితి మళ్లీ అట్లాకాదు కాగా ఆనాడు ఆ దితిగాని ఈ కైకసిగాని యిద్దరాపతులను అసురసంధ్యావేళలో రతికోసం అర్థించినవారే. అపుడిద్దరి సతులను గూడ పతులు ఇది అసురసంధ్యాకాలం ఇపుడు మనం కలిస్తే జన్మించేవారు రాక్షసులవుతారని ఎంత నివారించినా వారు వినలేదు. కామం ఎసరేగితే అంతే. అది వారం వర్జ్యం చూడదు. ఆ సతులు తమ కామం శాంతించిన పిమ్మట మేం మీవంటి తపస్యులైన పతులను పొందినందు కిదేనా ఫలితం అని అడుగగా కశ్యపుడు దితితో నీ కొడుకు కాదుగాని అతని కొడుకు మంచి భక్తుడౌతాడన్నాడు. అతడే ప్రహ్లాదుడు. విశ్రవసు కైకసితో నీకు ముగ్గురు కుమారులు కలుగుతారు, చివరివాడు మంచి వాడవుతాడన్నాడు. అతడే విభీషణుడు. ఇది విషయాంతరం. మళ్లీ కథ -

రావణుడు మాయలేడి అనంతరం తన ప్లాను ప్రకారం వచ్చి మాయసీతనెత్తుక పోయినాడు. కవి ఈ రామాయణ కాలంలో సీత సంపెంగపూవు రావణుడు మధుకరం అన్నాడు. కాబట్టి ఆ మాట రిత్త గాకుండ అతడు సీతను తాకలేదు. తాకితే భస్మమై పోతానన్న భయంతో తన గోళ్లతో ఆమె నిలిచిన గడ్డనట్లే పెకలించి రథంపై పెట్టుకొని లంకాదారిని పట్టినాడు.

అతడు సీతను కొనివెళ్లిన పిమ్మట రామలక్ష్మణులామెను వెదకుతూ వెళ్లగా వారికి మొదట కన్పించినవాడు రావణునితో దెబ్బతిని పడిన జటాయువు. అతడు శ్రీరామదర్శనం చేసికొని సీతను రావణుడు కొని వెళ్లినాడని తెలిపి ప్రాణాలు విడిచినాడు. శ్రీరాముడతని కంత్యక్రియలు చేసి ముందుకు వెళ్లగా వారికి కబంధుడు కనిపించినాడు. రామలక్ష్మణులతని హస్తాలలో చిక్కినారు. వారు వానితో విడిపించుకోలేక ఆ హస్తాలను నరుకగా దానితో శాపవిముక్తుడై తనను దహించుమని, దహనానంతరం అతడు నిజరూపాన్ని పొంది మీరిక్కడినుండి మతంగాశ్రమం వెళ్లండి. అక్కడ శబరి ఉంది. ఆమె మహాభక్తురాలు. అక్కడ మీకేమైనా సీత సమాచారం దొరుకవచ్చుననగా వారతడు చెప్పిన ప్రకారం మతంగాశ్రమం చేరినారు. అపుడతనిని చూడగానే శబరి ఎంతో పొంగిపోయింది.

శ్రీరాముడు నీలమేఘశ్యాముడు కనుక పెద్దన అతనినిక్కడ వర్షాభ్రం మÖడవ ఋతువు కనుక త ృతీయాంతంగా శ్రీరాముని ఆ మేఘంతో పోల్చి -

సీ. ఇంద్రనీల సమాన నింద్రకాంతులతోడ 

నరుణ జటాతటి ద్భరముతోడ

గంభీర భాషిత గర్జితంబులతొడ 

ఘనచాపమణి చాప కలనతోడ 

కరుణ రసామృత స్ఫురణాను గతితోడ 

వ్యాప్త కటాక్ష ధారాళితోడ

సంశ్రిత సహజ లక్ష్మణ చాతకముతోడ 

భవతాపహరణ వైభవముతోడ 

గీ. శ్రిత మనోరథ సస్య సమృద్దికరము 

సారవిపినాంత రాంతర చరమునగుచు

వచ్చు శ్రీరామ ఘనమÖర్తి నిచ్చగనియె

శబరి హర్షాంబువళితాక్షి శఫరియగుచు     (అరణ్యకాండము - 398)

 అని అన్నాడు. ఈ పద్యంలోని ప్రాణమంతా “శబరిహర్షాంబువళితాక్షి శఫరియగుచు” అనే దానిలో ఉంది.

శఫరం అనగా చేప. అది అనిమిషం. కనురెప్పలు లేవు కనుక నిద్రించినపుడు కూడ కన్నులు మÖయదు కాబట్టి ఇక్కడ శబరి శ్రీరాముని కొరకెదురుచూస్తు ఆమెగూడ రాత్రింబవళ్లు కన్నులు మÖయక నిలువు కన్నులు బడి అనగా దృష్టి ఏకైక లక్ష్యమై తానుగూడ అనిమిషమై పోయింది. అనగా శబరికి తన భక్తిచేతనే దేవతలనిమిషులు కనుక ఆమెకు దైవత్వమబ్బింది. ఈ సూచన మనకు శబరికి శఫరి అని చేర్చటం చేత శబ్దాలంకారంతోపాటు శబరికి శ్రీరాముని నిరీక్షణలో దైవత్వం అబ్బింది అనే ధ్వని తళుక్కున మెరిసింది.

శ్రీరామదర్శనం పిమ్మట శబరి అతనికి తను దాచిన ఫలాలతో ఆతిథ్యం యిచ్చి వారికి ఋష్యమÖక పర్వతంపై సుగ్రీవుడున్నాడు మీరతనిని కలియండి అనే సమాచారమిచ్చింది. అది విని వారు ఋష్యమÖక చేరి సుగ్రీవునితో మైత్రిచేసి అనంతరం రావణవధకు సిద్ధమౌతారు.

హిమాలయంలో దేవకాంతయైన వరూధినికి ప్రవరుని చూడగానే అతని సౌందర్యంపై మనసుపడి అతని భావించటం చేత -

మునుమున్ బుట్టెడు కొంకు లౌల్యము నిడన్ మోదంబు విస్తీర్ణతం

జొనుపన్ గోర్కులు గ్రేళ్లు ద్రిప్పమది మెచ్చున్ ఱెప్పలల్లార్పన 

త్యనుషంగ స్థితి ఱిచ్చపాటొసగ నొయ్యారంబునం జంద్రికల్ 

దనుకం జూచె లతాంగి భూసురు బ్రఫుల్ల న్నేత్ర పద్మంబులన్ 

`మనుచరిత్ర 

చేత మనుష్యభావం వచ్చేసినట్లు యిక్కడ మానవకాంతయైన శబరికి రామదర్శనంతో దైవత్వం కలిగింది అని భావం.

వర్ణనలు

సూర్యుడు మా వంశీయుడైన శ్రీరాముని పత్నిని లంకలో వెదకటానికి వచ్చినాడు. నేనింక వెళ్లి పాతాళ లంకలో వెదకి వస్తానన్నట్లుగా క్రుంకినాడు -

మ. తన వంశోద్భవుడైన రామ విభుకాంతన్ పద్మినిన్ భూమిజన్

గను వాంఛన్ తన పుత్రమంత్రియగు ముఖ్యచ్ఛాత్రు డేతెంచి లం

కను శోధింపగ దత్సహాయకృతి కాంక్షన్ దాను పాతాళ లం

కను శోధింపగ నేగె నా రవిగడంకన్ గృంకెనంభోనిధిన్ 

- సుందరకాండ - 26

సాయంకాలం వేళ సూర్యుడు పశ్చిమంగా ఎర్రగా కనిపిస్తూ నిలిచినాడు. అదిచూచి హనుమంతుడు సీతాన్వేషణకు వచ్చినాడు. కనుక మన ప్రయత్నం ఇక ఫలిస్తుందని సూర్యుడు కుంకుమము అలంకరించిన లేఖ పంపినట్లున్నాడు 

చ. జనక సుతా గవేషణ వశం వదుడయ్యె మరుత్సుతుండికన్

జనుమన కార్యసిద్ధియని జంభవిరోధి సరోధిభర్త క

య్యనిమిష పద్ధతిన్ సమయయామికు చేతను కుంకుమాంక శో

భనముగ కమ్మ బంపెనని భానుడు దోచె ప్రచేతపో దిశన్. 

- సుందరకాండము - 25

సమయమనే కాంత పతి నిద్రిస్తున్నాడు కాబట్టి భూదేవి యొక్క తలను గోళ్లతో గీరి పాపిట తీసినట్లున్నవి వర్షాకాలంలో రైతులు దున్నిన నాగటిచాళ్లు అని అన్నాడు.

సుందరకాండలో నిండువెన్నెల కాస్తున్న చంద్రుని హనుమంతుడు సూర్యుని దగ్గర ఐంద్రవ్యాకరణం నేర్చినాడు కనుక నేనతనికి చాంద్రవ్యాకరణం నేర్పుతానని తన కౌముదిని (వెన్నెలను) వ్యాపింపజేస్తున్నాడు.

శా. ఐంద్రవ్యాకరణంబు నేర్చె మునుప య్యాదిత్యునొద్దన్ విని

స్తంద్రప్రక్రియ తోడ నెంత నివవాంఛ త్కౌముదీ వ్యాప్తిచే

చాంద్రవ్యాకరణంబు నేర్పెదనునే సామీరికంచుంబలెన్

జంద్రుండొప్పె కళాకలాప కలనాసాంద్రుండునై యత్తరిన్ 

- సుందరకాండము - 33

అని సూర్యాస్తమయ చంద్రోదయాల నపూర్వంగా వర్ణించినాడు. ఈ పండు వెన్నెలలో ఆనాడు లంకలో హనుమంతుడు చూచిన -

సీ. కోటలు పేటలు గోడలు మేడలు

కెలకులు కొలకులు గిరులు దరులు

ధనమందిరములు స్యందన మందిరములు

నృప భవనంబులు నుప వనములు

గజరాజ గృహములు ఘనవాజి గృహములు

సచివ గేహములు రాక్షస గృహములు

పాకశాలికలును పానశాలికలును

సత్రశాలలు చిత్రశాలికలును

తే.గీ. నంతిపురములు బందీగృహములు సభలు

సౌధములు నాపణములు బ్రాసాదములును

నాదిగా నొప్పు నప్పురి నన్నియెడల

సీత వెదకెను పవమానసూతి ప్రీతి (సుందరకాండము - 58)

ఇవన్నీ నాటి గద్వాల సంస్థానంలోనివే. అంతేకాదు. అపుడక్కడ పాటలు పాడుతున్న గంధర్వులు, వాద్యకారులు, వార్తాహరులు, ఎవరంతట వారు వచ్చి తమ వేళ ప్రకారం పనిచేసిపోతున్న ఆ సంస్థానంలోని మనుష్యులే అనవలసి ఉంది. 

సీ. కింపురుషుల తోడ కిన్నరుల్ గుమిగూడి

పాటలు బలువక పాడుచుండ

గంధర్వతతి మ ృదంగ ప్రసంగతి నిచ్ఛ

నచ్చరుల్ జెప్పక నాడుచుండ 

సిద్ధులు సాధ్యులు జేరి జీరకమున్న

గల లోకవార్తలు దెలుపుచుండ

యక్షులతో హాస్య దక్షులై గుహ్యకుల్ 

తెచ్చుకోవ ప్రొద్దులు బుచ్చుచుండ 

తే.గీ. నగరి వాకిళ్ళ ముంగిళ్ళ తగిన జోళ్ళ

మనువులకు బొంచి సమయంబు ననుసరించి

యొదిగి దిక్పాలకులుగాంచి యుండనలరు

రావణు గృహాంగణంబు జేరంగ నరిగె

- సుందరకాండము - 59

ఈ విధంగా అతని వర్ణన లెంతో అపురూపంగా ఉన్నవి. 

ఇతరులెవరు చెప్పనివి

బ్రహ్మకిద్దరు భార్యలని కవులెవరు చెప్పలేదు. కొన్ని పురాణాలలో మాత్రముంది కాని కావ్యాలలో లేదు. కాణాదం పెద్దన ఈ విషయం

తే.గీ. భాసురంబైన హేమ పద్మాసనమున

సరస సావిత్రియును సరస్వతి భజింప (బాలకాండ - 66)

అని స్తుతించినాడు.

రామ పట్టాభిషేకానికి భంగం కలిగించుమని వశిష్టుడు వాణికి చెప్పినట్లు ఎవరు ఇంతవరకు చెప్పలేదు. కాని దీనిలో `

తే.గీ. పొమ్మనిన నియ్యకొని వాణి పుడమిలోన 

నమర హజతమౌటగాన కుబ్జాఖ్యయై®న

అఖిల కుమతి ధురంధర నాత్రివక్ర 

బంధురన మందరను జొచ్చి పరుషగతిని  - అయోధ్యకాండము - 64 

అని తెలిపినాడు. ఈ విషయం ఇతర రామాయణకర్త లెవరు చెప్పలేదు. మందర నింతవరకు కుబ్జ అని ఎవరు చెప్పలేదు. ఈ పెద్దనగారే - 

క. కుబ్జయును క్రోధవికచమ

నోబ్జంబు విషాదతమము నలమిన మిగులం

గుబ్జంబుగాగ నపుడ 

య్యబ్జ ముఖింజూచి యిట్టులనియెన్ మరియున్ 

- అయోధ్యకాండము - 78

 అని చెప్పినాడు.

దశరథుని భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి అని వాడుక. కాని పెద్దన 

క. భాసురపతి సౌశీల్యము 

కౌసల్యయు పతిసుఖైక కైకయు సుగుణో

ల్లాస సుమిత్ర సుమిత్రయు 

నా సుదతులు గలరు మువ్వురన్నర పతికిన్

- బాలకాండము - 213

అని సుమిత్రను చిన్న భార్యను చేసినాడు. ఇది పాయసం పంచినపుడు మొదట ఇద్దరికే ప్రాధాన్యమివ్వటంగా ఉంది. ఈ విషయం గూడ ఎవరు చెప్పినట్లు లేదు.

మండోదరికి ముసలితనం, మరణం, వైధవ్యం లేదు.

క. పతితో ననుగమ ముచితము 

సతియు గలుగ దదియు నాకు జనకు వరముచే

మృతి జరయు లేదగుట నా 

గతి యిట్లుండంగ వలసెగా యదిగాకన్ 

- యుద్ధకాండము, ఉత్తరభాగము - 109

మండోదరికి వైధవ్యం లేదు. రావణకాష్ఠం చల్లారితే ఆమెకు వైధవ్యం వస్తుంది. కాబట్టి అది చల్లారదు. ఇప్పటికి రగులుతూనే ఉంటుంది. ఈ విషయం గూడ ఎవరు చెప్పలేదు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి