వెన్నెల ఆ రోజు ఆఫీసుకు వెళ్ళేటప్పటికి`తమ కార్పోరేషన్‌కు కొత్త చైర్మన్ వస్తున్నారన్న విషయం తెల్సింది.
ఒక గంట తరువాత ఆయన గురించిన మరి కొన్ని వివరాలూ మోసుకొచ్చారు స్టాఫ్. కొత్త చైర్మన్ పేరు సూర్యప్రకాష్. యువకుడు. రాజకీయాల్లో పైకి వస్తున్న యువకెరటం. బాగా పలుకుబడి గల వ్యక్తి. మనిషి చాలా మంచివాడు. ఎవరేది అడిగినా ‘కాదు, లేదు’ అనకుండా ఇచ్చేసే దానకర్ణుడు.
వెన్నెల ఆ కార్పోరేషన్లో బాద్యతయుతమైన పదవిలో ఉంది. పరిపాలనా సంబంధమైన విషయాలు చూడవల్సిన డ్యూటీ ఆమెదే. ఆరు నెలల నుంచి చైర్మన్ పదవిలో ఎవరూ లేనందువల్ల ఆ రూం తాళం వేసి ఉంది. ఇప్ప్పుడు రూం తెరిపించి సోఫాలు, కార్పెట్స్, కర్టెన్స్ దగ్గర నుంచీ అన్నీ కొత్తవి తెప్పించి, ఈ గది అందాలను ఇనుమడింప చేసింది. ఇన్డోర్ ప్లాంట్స్ పెట్టించింది. కారు దగ్గర నుంచి కాఫీ కప్పులదాకా సిద్ధంగా ఉంచింది.
సూర్య ప్రకాష్ ఇల్లు ఎక్కడో తెల్సుకుని, పుష్పగుచ్ఛాలతో ఆయన ఇంటి ముందు కారు దిగింది. బయట లాన్లో ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు. వెన్నెల లోపలికి వెళ్లేప్పటికి హాల్లో ప్రముఖులు కూర్చుని తేనీరు సేవిస్తున్నారు. అందరి మధ్యా ఉన్న సూర్యప్రకాష్ ఒక పక్క ఫోన్లో మాట్లాడుతూ, మరో పక్క చిరునవ్వులతోను, క్రీగంటి చూపులతోను అందరినీ పలకరిస్తున్నారు.
వెన్నెల ఆయన దగ్గరకు వెళఙ్ల పూలగుచ్చం ఇచ్చి తనను తాను పరిచయం చేసుకోబోయింది.
“నేను...”
“వెన్నెల... ఈ కార్పోరేషన్‌కే వెన్నెల వెలుగు కావాలి మీరు...” అన్నాడు సూర్యప్రకాష్. ఆది పొగడ్తో, వ్యంగ్య బాణమో తెలియక ఆమె ఇబ్బంది పడుతుంటే పక్కనే ఉన్న మరెవరో అన్నారు.
“మీరు సూర్యప్రకాష్ అయితే, మీ సెక్రటరీ వెన్నెల వెలుగు అన్న మాట... భేష్ బావుంది...”
ఈ మాటలు ఎప్పుడో ఎక్కడో విన్నట్లుగా ఉంది`గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తుండగానే సూర్యప్రకాష్ అన్నాడు.
“నన్ను గుర్తుపట్టలేదా? కాలేజీలో మనం క్లాస్మేట్స్...”
“ అయితే మీరు ఓల్డ్ ఫ్రెండ్స్ అన్నమాట...” అన్నాడు అక్కడున్న మరో వ్యక్తి.
“ఫ్రెండ్స్ అంటే మేం ఫ్రెండ్స్ కాదు... కానీ క్లాస్మేట్స్ అని మాత్రం చెప్పగలను...” అన్నాడు సూర్యప్రకాష్ నవ్వుతూ “మీరు ఏది కాదనీ అనరు... అవుననీ అనరు... అందుకే రాజకీయాల్లో పైకి రాగలుగుతున్నారు...” అన్నారు మరోకరు సూర్యప్రకాష్ వెన్నెల వంక తిరిగి... “మళ్లీ మనం ఇలా కల్సుకోవటం చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది... అన్నాడు. వెన్నెల ముఖం మీద నవ్వు వెలా తెలా పోయింది. ఆయన దగ్గర సెలవు తీసుకుంది.
వెన్నెల రోబోయే చైర్మన్‌కు పాత ఫ్రెండ్ అన్న విషయం అప్పుడే ఆఫీసులో గుప్పుమంది. కొందరు ఆమెను అభినందిస్తుంటే, మరికొందరు ఆరాధనా భావంతో చూస్తున్నారు. మరికొంత మంది చనువుగా వచ్చి తమ కోరికలు వెలిబుచ్చి ఆమె సహాయం కోరుతున్నారు. కొన్నాళ్లుపాటు ఇంక ఆఫీసులో వెన్నెలది ఆడింది ఆట పాడింది పాట అవుతుందని అందరూ అనుకుంటున్నారు కానీ`వెన్నెల మాత్రం అలా అనుకోవడం లేదు. ఆమెకు గతం అంతా కళ్లముందు కదులుతోంది...
కాలేజీలో చదివే రోజుల్లో ఈ సూర్యప్రకాష్ పెద్ద హీరోలా తిరిగేవాడు. చదువు మీద శ్రద్ధ లేదు. పరీక్షలో కాపీ కొట్టి , ఏదోవిధంగా గట్టెక్కడమే ధ్యేయంగా పెట్టుకునేవాడు. అతని దృష్టి వెన్నెలమీద పడింది. ఆమెను ఆకర్షించేందుకు పడరానిపాట్లు పడ్డాడు. ఆమె ఇష్టాయిష్టాలు ఏమిటో కనుక్కుని ఆమేరకు నడుచుకున్నాడు. అయినా ఆమె నుంచి రెస్పాన్స్ లేదు. దారికాచి ఆమెతో మాటలు కలిపాడు. ఆమె పట్టించుకోలేదు. ప్రేమలేఖలు రాశాడు. వాటిని చించిపారేసింది. ఆమెతో అన్నాడు “ ఎవరైనా ప్రేమలేఖ రాశారంటే, అందులో కొత్తగా చేప్పేదేం ఉండదు. అలా ఏమీలేని దాన్ని కొత్తగా చెప్పటంలో ఎంతో ఆనందం ఉంటుంది.”
“ప్రేమ అనేది ఒక మాససిక ఉన్మాదంలాంటిది. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏవో పిచ్చిపనులు చేస్తారు. వాటి గురించి నేను పట్టించుకోను...” అన్నది.
“అతను ఆమెమీద ఆశ వదులుకోలేదు. పదేపదే వెంటపడుతుంటే తనను మర్చిపొమ్మని చెబుతూనే ఉంది. “ఒక మనిషిని ప్రేమించాలంటే అతని గుణగుణాలు నచ్చాలి. అతని నడవడికని మెచ్చాలి. ఇలా వెంటపడి వేధించుకు తింటే ప్రేమ కలగదు` అసహ్యం వేస్తుంది...” అన్నది ఆమె.
“ప్రేమించటం, ప్రేమింప చేసుకోవటం అదొక అందమైన కల. ఆ కల నిజం కావాలని కోరుకోవటం అత్యాశ కాదు...” అన్నాడు. ప్రేమలోను, యుద్ధంలోను విజయం సాధించేందుకు ఎవరి మార్గాలు వారికి ఉంటాయి. అతని మార్గం ఆమెకు నచ్చనంతమాత్రన నిరుత్సాహపడకూడదని అనుకున్నాడు. ఒకసారి అందరిలోనూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అంతటితో ఆగలేదు. “దీన్ని ఏమంటారో తెల్సా? పాణిగ్రహణం అంటారు” అన్నాడు సీరియస్‌గా.
ఆమె అతని చెంప పగలకొట్టింది “దీన్ని ఏమంటారో కూడా తెల్సుకో” అన్నది.
కొద్ది రోజులు ఆమె కాలేజీకి వెళ్లలేదు. ఒక ఆకతాయి వెధవకి భయపడి చదువు మానుకోవటంలో అర్థం లేదని మళ్లి క్లాస్‌కు హాజరుకావటం మొదలెట్టింది. ఇంక వెన్నెల కాలేజీకి రాదేమో అనుకున్న సూర్యప్రకాష్‌కు క్లాస్‌లో ఆమె కనిపించగానే బోలెడంత ధైర్యం వచ్చింది.
“ప్రేమికుల మధ్య వచ్చే కలహం కత్తితో నీటిని నరకటం లాంటిది. ఆ నీరు మళ్లీ ఒకటిగా కల్సిపోతూనే ఉంటుంది. అలాగే మనం కూడా...” అన్నాడు.
“నేను నీ పిచ్చివేషాలకు భయపడి చదువు మానెయ్యదల్చుకోలేదు. ఇంతవరకూ చేసిన తప్పులన్నీ క్షమిస్తూ వచ్చాను. ఇకనైనా బుద్ధి తెచ్చుకోకపోతే, జీవితంలో నువ్వు మర్చిపోలేని శిక్ష పడుతుంది” అన్నది.
“నువ్వు నిజంగా నన్ను శిక్షించాలనుకుంటే, నన్ను పెళ్లి చేసుకో. అటు నువ్వు శిక్షించినట్లూ ఉంటుంది. ఇటు నా కోరిక తీరినట్లూ ఉంటుంది.” అన్నాడు అతని అల్లరి మితిమీరిపోయింది. ఆమెకు సహనం చచ్చిపోయింది.
ఒక బంధువు దగ్గరకెళ్ళి విషయం అంతా చెప్పింది. ఆయన కాలేజీ ప్రిన్సిపాల్‌తో మాట్లాడాడు. ప్రిన్సిపాల్ అతనికి వార్నింగ్ ఇచ్చాడు. ప్రిన్సిపాల్‌కు కంప్లయింట్ ఇచ్చినందుకు అతనికి కోపం వచ్చింది. ఎలా పగతీర్చుకోవాలా అని ఆలోచించి, ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ప్రిన్సిపాల్ డిబార్ చేశాడు. మళ్ళీ ఎక్కడా చదువుకునే వీల్లేకుండా చేశాడు. తరువాత కొద్ది నెలలకే వెన్నెల ఆ ఊరినుంచి బయటపడటంతో ఆ కథ అంతటితో ముగిసింది. క్రమంగా ఆమె స్మృతిపథం నుంచీ అతను చెరిగిపోయాడు.
ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ ఇలా ప్రత్యక్షమయ్యాడు. సూర్యప్రకాష్ ఎలాంటివాడో వెన్నెలకు తెల్సు కక్ష తీర్చుకోకుండా వదిలిపెట్టడు. ఇప్పుడు అతని రూపంలో బలమైన సర్పం కనిపిస్తోంది. ఆ సర్పం తనని మింగేస్తుంది. వెళ్ళిపోవటం నయం`అనుకుంది వెన్నెల.
సూర్యప్రకాష్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు. స్టాఫ్ ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మీటింగ్ పెట్టారు. అయన్ను ఆకాశానికి ఎత్తారు. వేనోళ్ళ పొగిడారు. సూర్యప్రకాష్ ఆఫీసు అంతా తిరిగి అందరి పేర్లూ తెల్సుకున్నాడు. ఆయన సీట్లో కూర్చోని వెన్నెలను పిల్చాడు. ఆమె తన రాజీనామా కాగితాన్ని ఆయన ముందు పెట్టింది.
“ఎందుకు రిజైన్ చేస్తున్నావు” అని అడిగాడు సూర్యప్రకాష్
“వ్యక్తిగత కారణాలవల్ల...”
“ఏమిటవి?”
“అవి మీకు అనవసరం...”
“సరే... ఈ రాజీనామాను డైరెక్టర్సు మీటింగ్‌లో ఆమోదించాలి. నీ స్థానంలో మరొకరిని వేయాల్సి ఉంటుంది. అంతవరకూ నువ్యు కంటిన్యూ కావాలి” అన్నాడు సూర్యప్రకాష్.
ఆమె మాట్లాడలేదు. మర్నాడు ఆఫీసుకు రాగానే సూర్యప్రకాష్ వెన్నెలను పిలిచాడు. “రెండు మÖడు యÖనిట్స్ నష్టాల్లో నడుస్తున్నాయి. అందుకు కారణాలు ఏమిటో గుర్తించి, నష్టాలనుంచి బయటపడటానికి తీసుకోవాల్సిన చర్యల గురించి తగిన సూచనలు ఇస్తూ ఒక రిపోర్ట్ వారంరోజుల్లో తయారుచేసి ఇవ్వు” అన్నాడు.
“అది నా డ్యూటీ కాదు...” అని స్పష్టంగా చెపిం్పందామె.
“నేను ఈ కార్పోరేషన్‌కు చైర్మన్‌ను. ఇందులో ఉన్న వాళ్ళంతా నేను ఏ పనిచెబితే ఆది చేయాలి...” అన్నాడు.
వెన్నెల ఆయన రూం నుంచి బయటకు వచ్చింది. ఆ కార్పొరేషన్లో జరిగే అవకతవకలన్నీ ఆమెకు తెల్సు. వాటిని నివారించాటానికి ఏం చేయాలో కూడా తెల్సు. ఆ రిపోర్టు తయారుచేయటం ఆమెకు కష్టమైన పనేమికాదు. కాకపోతే తనకు సంబంధంలేని పని. తనచేత చేయిస్తున్నాడు. పైవాళ్ళు కిందవాళ్ళను వేధించుకుతినే పద్ధతిలో ఇదోకటి`అనుకుంది వెన్నెల అయినా తనేమిటో తన సామర్థ్యం ఏమిటో అతనికి తెలియజెప్పినట్లూ ఉంటుందని నాలుగురోజుల్లోనే నివేదిక ఆయనకు పంపించింది.
సూర్యప్రకాష్ ఆ నివేదిక చదివిన తరువాత, ఆ కార్పొరేషన్‌కు ఆమె సేవలు ఎంత అవసరమో తెలుసుకున్నాడు. డైరెక్టర్స్ మీటింగ్‌లో ఆ రిపోర్టుపై చర్చించాక ఆమెచేసిన సూచనలు అమలు జరిపేందుకు అంగీకరించారు. వెన్నెలకు అందరిదగ్గర నుంచీ ఊహించని ప్రశంసలు లభించాయి. ఇది ఆమె కలలో కూడా ఊహించని పరిణామం. సూర్యప్రకాష్ వెన్నెలను పిల్చి అభినందనలు తెలిపినపుడు ఆమె అడిగింది “నేను రాజీనామా చేశాను. ఎప్పుడు రిలీవ్ చేస్తున్నారు?” అని
“ఆఫీసులో నీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? నీకు మగవాళ్ళమీద సదభిప్రాయం లేదనుకుంటాను. ఏవైనా సమస్యలుంటే చెప్పు... వాళ్ళను మారుస్తాను...” అన్నాడు.
“మగవాళ్ళతో నెగ్గుకురావటం ఆడవాళ్ళకు ఎప్పుడూ సమస్యకాదు. మగవాడితో`ఒక్క మగవాడితో నెగ్గుకురావాల్సి వచ్చినప్పుడే సమస్యలు ఎదురవుతాయి...” అన్నది వెన్నెల.
“అర్థమైంది. బహుశా నా మీద నీకు ఇంకా కోపం పోలేదనుకుంటాను...” అన్నాడు.
“కాదు, నా మీద మీకు కోపం పోలేదని చెప్పండి. మీరు పగబడితే వదిలిపెట్టరని తెల్సు. కొన్నేళ్ల కిందట`ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలియక దెబ్బకొట్టాను. నా వల్ల మీ చదువు ఆగిపోయింది. అందుకు మీరు నన్ను ఎప్పటీకి క్షమించరని తెల్సు...” అని ఆగిపోయింది.
“నీ వల్ల నా చదువు ఆగిపోయిన మాట నిజమే. కొన్నాళ్లపాటు నీ మీద కోపం ఉన్నమాట నిజమే. చదువుకుని ఉంటే ఒక గుమాస్తాని అయి ఉండేవాడ్ని. మహా అయితే నీలాగా ఒక సెక్రటరీని కాగలిగి ఉండేవాడిని. చదువు అగిపోయినందువల్లనే రాజకీయాల్లో దిగాను. ఒకనాడు నువు అన్న మాటలు నాకు ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటాయి ` ఒక మనిషిని ప్రేమించాలంటే అతని గుణగుణాలు నచ్చాలి. అతని నడవడి కని మెచ్చాలి. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజల ప్రేమను, అభిమానాన్ని పొందాలి. వాళ్లందరూ మెచ్చేలా నా నడతను మార్చుకున్నాను. కనుకనే ఇవాళ ఈ స్థానంలో ఉన్నాను... నువు పనిచేస్తున్న కార్పొరేషన్‌కే నేను రావటం కేవలం కాకతాళీయం. వచ్చీరాగానే నష్టాల్లో ఉన్న యÖనిట్స్ను బాగుచేసేందుకు సాయపడ్డావు. అప్పుడూ ఇప్పుడూ కూడా నువు నా అభ్యున్నతికే తోడ్పడుతున్నావు... అందుకే నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను...” అన్నాడు.
వెన్నెల మౌనం వహించింది.
“నీ అనుమానాలు నాకు తెల్సు. నన్ను ఇంకా ఆనాటి సూర్యప్రకాష్గానే ఊహించుకుని భయపడుతున్నావు. నిన్ను వేధించుకుతిన్న వ్యక్తి ఎప్పుడో అంతరించిపోయాడు. ఇప్పుడు నీ ముందున్నది మరో వ్యక్తి... కొత్త అవతారం ఎత్తిన సూర్యప్రకాష్‌కు నీ మీద ఎనలేని కృతజ్ఞాతాభావం ఉంది. నీ రుణం ఎలా తీర్చుకోవాలా అన్న ఆలోచనలో ఉన్నాను... ఈ ఆఫీసులో నీ పరపతిని పెంచటం కోసమే ఆ రిపోర్టు తయారుచేసే బాధ్యత నీకు అప్పగించాను...అందుకు త్వరలోనే నీకు ప్రమోషన్ వస్తుంది...ఇంత చెప్పినా ఇంకా నువు నన్ను ద్వేషిస్తూ ఉంటే, నా దగ్గర పనిచేయకూడదూ అనుకుంటే, నీ రాజీనామాను ఇప్పుడే ఆమోదిస్తాను” అన్నాడు.
ఆమె తన రాజీనామాను ఆమోదించమని కోరింది.
“ఎవరు ఏది కోరినా నేను కాదనను. అది నా పాలసీ. నాకు ప్రత్యక్ష్యంగా పరోక్షంగా ఎంతో సహాయం చేసిన నువ్వు నా నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకుంటే... నేను నీకు అడ్డు రాను...” అన్నాడు.
ఆ రోజే ఆమె రిలీవ్ అయింది.
ఆ ఆఫీసు నుంచి బయటకొస్తున్నపుడు పడగనీడ నుంచి బయటపడుతున్న ఫీలింగ్ కలిగిందామెకు. ఆ కార్పొరేషన్ డైరెక్టర్లలో ఒకరైన ఫణిభూషణరావు వారం రోజుల తరువాత వెన్నెల ఇంటికి ఫోన్ చేశాడు. వెన్నెల ఒక ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థకు మెంబర్ సెక్రటరీగా నియమితురాలైంది. ఈ ఉద్యోగం ఆమెస్థాయిని పెంచింది. ఇప్పుడామెకు ఎంతో తృప్తిగాను సంతోషంగానూ ఉంది. రెండు నెలల తర్వాత ఒక రోజు హÃటల్లో ప్రభావతి కనపడింది. ఇది వరకు వెన్నెల పనిచేసిన కార్పొరేషన్లో అదే పోస్ట్‌లో ఇప్పుడు ప్రభావతి పనిచేస్తోంది. అందుచేత వాళ్ల సంభాషణ అంతా సూర్యప్రకాష్ గురించే జరిగింది.
“ఆయన చాలా మంచివాడు పర్సనల్ లైఫ్ మాత్రం దారుణం అయనకూ, ఆయన భార్యకూ సరిపడదు. ఆమెకు రేస్‌లు, పేకాటలాంటి వ్యసనాలేవో ఉన్నాయట. ఈయనకు ఆమె వైఖరి నచ్చలేదు. విడిపోయారు. ఒక్కోసారి చాలా దిగాలుగా ఉంటాడు. ‘జీవితంలో కోరుకున్నది లభించలేదు. అదొక ట్రాజెడీ. లభించిన దానితో రాజీపడలేకపోతున్నాను. ఇది అంతకన్నా పెద్ద ట్రాజెడీ...’ అని అంటుంటాడు. ఆయన ఒక భగ్నప్రేమికుడనుకుంటాను. భార్య అయినా అర్థం చేసుకుని ఉంటే బావుండేది. ఎంత మంచి పేరు సంపాందించుకున్నా, ఆయనకు మనశ్శాంతి లేదు పాపం...” అని చెప్పింది ప్రభావతి.
మరో సందర్భంలో ఫణిభూషణరావు వెన్నెలతో చెప్పాడు. “నీకు ఈ కొత్త ఉద్యోగం ఇప్పించడంలో నేను నిమిత్తమాత్రుడ్ని. అసలు నీకు ఈ పోస్టు ఇప్పించింది సూర్యప్రకాష్. నిజానికి ఈ పోస్టుకు చాలా హైలెవెలో రికమండేషన్లు వచ్చాయి. సూర్యప్రకాష్ పట్టుబట్టి, ఎవరెవర్నో కల్సుకుని తన పలుకుబడి అంతా ఉపయోగించి నీకి ఉద్యోగం ఇప్పించాడు. అతని కారణంగానే నువు రిజైన్ చేశావనీ, అందుచేత నీకు అంతకన్నా మంచి ఉద్యోగం ఇప్పించాలని పట్టుబట్టాడు. ఈ రోజుల్లో అంత సున్నితంగా ఆలోచించే వాళ్లున్నారంటే నమ్మలేకపోతున్నాను”.
ఫణిభూషణరావు మాటలు విన్న వెన్నెల కృతజ్ఞాతాభారంతో కుంగిపోయింది.
ఆ రోజు రాత్రి సూర్యప్రకాష్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఆయన బయట లాన్లో కుర్చీలో కూర్చుని ఉన్నాడు. వెన్నెల వెళ్లి ఆయనకు ఎదురుగా నిలబడింది.
‘నమస్కారం’ అన్నది. కళ్లు మÖసుకుని హెడ్‌ఫోన్‌లో పాటలు వింటున్న ఆయనకు ఆమె మాటలు వినిపించలేదు. వెన్నెల ఆయన పాదాలను తాకింది. ఆయన ఉలిక్కిపడి కళ్లు తెరిచి చూశాడు. లేచి నిలబడ్డాడు. ఆమె ఆయనకు ఇదివరలో ఎన్నడూ లేనంత చేరువుగా ఉంది. ఆయన రెండు చేతులూ చాచాడు. వెన్నెల సూర్యప్రకాష్ కౌగిట్లో ఇమిడిపోయింది.
చంద్రుడు మబ్బుల చాటునుంచి బయటకొచ్చాడు.
“వెన్నెలొచ్చింది” అన్నాడు సూర్యప్రకాష్. ఆమె తలొంచుకుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి