చంద్రశేఖర్ చాలా బిజీగా ఉన్నాడు. అర్జంటుగా పూర్తిచేసి పంపించవలసిన ఫైల్సు నాలుగు ఉన్నాయి. పై ఆఫీసర్ దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి. పన్నెండు గంటలకు మీటింగ్ ఉంది. ఈలోగా నోట్ తయారు చేయాలి.
అటెండర్ ఒక కవరు తెచ్చి అతనిముందు పెట్టాడు. అది ఆఫీసుకు సంబంధించినది కాదని దాన్ని చూడగానే తెల్సిపోతోంది. ఆఫీసుకు పర్సనల్ లెటర్స్ రావు. అందుచేత కొంచెం ఆశ్చర్యపోతూ కవరు చించి లోపలి లెటర్ తీసి చూశాడు. గులాబీ రంగు ఉలిపిరి కాగితం మీది పరిమళం గుప్పుమంది. ముత్యాల్లాంటి అక్షరాల వెంట చంద్రశేఖర్ చూపులు పరుగులు తీశాయి.
“ప్రియమైన చంద్రశేఖర్‌గారికి...
మీకు ఎన్నో విషయాలు తెలియజేయాలని కాగితం కలం తీసుకుంటే, ఎందుకనో కలం ముందుకు సాగటంలేదు. కళ్లు మÖసినా, తెరిచినా మీ రూపమే... నా కనుపాపలో మీ రూపమే... ఎప్పుడూ మిమ్మల్ని చూడాలనీ, వెన్నెల రాత్రుల్లో సముద్రపు ఒడ్డున మీతో చెట్టాపట్టాలు వేసుకుని నడవాలనీ, మీ మౌన రాగాలాపనలే విని తరించాలనీ అనుక్షణం అనిపిస్తుంంది. ఈ హృదయ స్పందన మీకు తెలియజేయాలని కాగితం తీసుకుంటే కలం ముందుకు సాగనని మొరాయిస్తుంది... అందుచేత ప్రస్తుతానికి ఇంతటితో సెలవు తీసుకుంటాను...మళ్లీ రేపో, ఎల్లుండో, వారానికో, నెలకో, ఆరునెలలకో... ఎప్పుడో వీలు చిక్కినపుడు హృదయవేదనా నివేదనను చేసుకుంటాను... అక్షర సుమమాలతో... అంతవరకూ ఉండనా మరి...
పాప...మీ కంటిపాప”.
ఆ ఉత్తరం చదివి చంద్రశేఖర్ మెదడు కొద్ది సేపు పనిచేయటం మానేసింది. ఎవరీ పాప? ఈ పేరుగల వాళ్లు ఎవరూ తనకు తెలియదు. తనెవరో తెలియకుండా ఈ ప్రేమలేఖ ఎలా రాస్తుంది? పైగా చాలా సన్నిహితంగా తెల్సిన మనిషిలా రాస్తోంది.
ఫోన్ బజ్జర్ మోగింది. ఆఫీసర్ అడుగుతున్నాడు ఫైలు గురించి. నోట్ రాసి తీసుకెళ్లాడు. ఆయన చదివి విసుక్కున్నాడు.
“ఏమిటయ్యా ఇది? నేను చెప్పిందేమిటి? నువు రాసిందేమిటి?”
“సారీ సర్...మళ్లీ రాసుకొస్తాను...”
“టైం ఎక్కడుంది?” అంటూ చిరాకుపడ్డాడు.
ఆయనే తంటాలు పడి నోట్ తయారుచేసుకున్నాడు. మీటింగ్‌కు తనతో రమ్మన్నాడు. కారులో వెళ్తున్నంతసేపూ అతని దృష్టి అంతా ఆ లెటర్ మీదే ఉంది. చేతితో జేబులోని లెటర్‌ను తడుముకుంటున్నాడు. ఉండబట్టలేక కవరు తీసి మరోసారి చదువుకున్నాడు. “ఏమిటది?” అని అడిగాడు వెనక సీట్లో కూర్చున్న ఆఫీసర్.
“హృదయ వేదనా నివేదన...” అన్నాడు అసంకల్పితంగా.
“ఏమిటి?” అన్నాడయన విస్తుపోతూ.
“పాప... మీ కంటిపాప...” అన్నాడు నిద్రలో కలవరిస్తున్నవాడిలాగా. ఆయనకు అంతా ఆయోమయంగా అనిపించి ఊరుకున్నాడు.
ఒక పక్క మీటింగ్ జరుగుతోంది. అతను చేత్తో ప్రేమగా జేబులోని ఆ లెటర్‌ను తడుముకుంటున్నాడు. మీటింగ్ అయిపోయింది. కారు దగ్గరకొచ్చారు... మళ్లీ లెటర్ తీసి చూసుకున్నాడు.
“వాటీజిట్?” అని అడిగాడాయన.
“ఏం లేదు సర్...” అన్నాడు కవరు జేబులో పెట్టుకుంటూ.
కారులో వస్తున్నంత సేపు ‘ఎవరీ పాప?’ అనే ఆలోచిస్తున్నాడు. కాని ఎవరై ఉంటారో ఎంతకీ తోచటం లేదు. ఆవేళంతా ఊహల పల్లకీ మీద విహరిస్తున్నాడు. కలల అలలమీద తేలియాడుతున్నాడు.
ఇంటికొచ్చాడు. భార్య రోజా కాఫీ అందించింది. ఇవాళ ఎందుకో అతనికి సరదాగా ఉంది.
“ఏదైనా స్టార్ హÃటల్‌లో భోంచేద్దాం. ఇవాళ వంట చేయకు...” అన్నాడు.
“ఆ స్టార్ హÃటల్స్ కన్నా బ్రహ్మాండంగా నేను వంటలు తయారు చేస్తాను. ఏం కావాలో చెప్పండి...” అన్నది రోజా.
“అది కాదు. జస్ట్ అలా సరదాగా తిరిగొద్దామని...” అన్నాడు చంద్రశేఖర్ . ఇంకా ఊహలపల్లకీ మీద నుంచి దిగలేదు.
“ఇవాళ నాని గాడికి హÃమ్ వర్క్ చేసిపెట్టాలి. ఇప్పుడు కుదరదు...” అన్నది రోజా పసిపిల్లకు పాలు ఇస్తూ.
చంద్రశేఖర్ నిట్టూర్చాడు “నానిగాడికి పాఠాలు చెప్పాలి. బుజ్జిముండకు పాలు పట్టాలి. వంట చేయాలి. అంట్ల గిన్నెలు తోముకోవాలి. ఇల్లుకడిగి ముగ్గులు పెట్టుకోవాటం ఇదే దీనిలోకం. ఒక సరదా లేదు. సంతోషం లేదు. అందరూ ఎంచక్కా సినిమాలకూ, షికార్లకూ, పిక్నిక్‌లకు వెళ్తారు. కానీ రోజా మాత్రం పెళ్లి అయిన అయిదేళ్లకే ఇద్దరు పిల్లలు పుట్టేటప్పటికే మానసికంగా ముసలిదైపోయింది. ఇల్లూ, పిల్లలూ, వాళ్ల బాగోగులు... అంతకు మించి ప్రపంచంలో ఇంకేమిలేనట్లు ` అస్తమానం అవే విషయాలు మాట్లాడుతుంది.
చంద్రశేఖర్ నిట్టూర్చాడు. రాత్రి నిద్రపట్టలేదు. జేబులో లెటర్ అలాగే ఉండిపోయింది. రేపు కర్మజాలక అది రోజా కంటపడితే గొడవైపోతుంది. ఆ ఆలోచనరాగానే లేచి లైటువేసి జేబులోని లెటర్ తీసి పుస్తకాల మధ్యలో దాచేశాడు. లైటు వేసినందువల్ల రోజాకు నిద్రాభంగమైంది.
“ఏంటి లేచారు?” అని అడిగింది కళ్లు చికిలించి చూస్తూ.
“పాప.... కంటిపాప... నిద్దర రావటం లేదు... అలా కాసేపు డాబా మీద వెన్నెల్లో కూర్చుందాం...రా...” అన్నాడు.
“మీకేం... పనా పాటా? రోజంతా గొడ్డులా చాకిరీ చేసి అలసిపోయాను. కళ్లు కూరుకుపోతున్నాయి...” అన్నది రోజా పక్కన పడుకున్న పసిపిల్ల ఒంటిమీద గుడ్డ సవరించి, పిల్లమీద చెయ్యివేసి పడుకుంది.
వారం రోజుల తరువాత చంద్రశేఖర్‌కు మరో ఉత్తరం వచ్చింది. ఆత్రంగా విప్పాడు. అదే గులాబిరంగు కాగితం...అదే పరిమళ భరితం...
“ప్రియాతి ప్రియమైన చంద్రానికి...
చంద్రశేఖర్‌గారూ అంటే ఎవరో పరాయివాళ్లను పిల్చినట్లు ఉంటుంది. అందుకని చంద్రం అనే పిలుస్తాను. కిందటి ఉత్తరం రాసి వారం రోజులు అయింది. ఈ వారం రోజుల వ్యవధీ నాకు క్షణమొక యుగంలా అయింది. నాకు సదా నీ ధ్యాసే. నీ గురించి తల్చుకుంటుంటే ఏవో అందమైన ఊహలు కళ్లముందు మెదులుతాయి. నీ కోసం వెతుకుతూ నేను కొండల్లో లోయల్లో తిరుగుతున్నట్లు... తెల్లని మంచుకొండలమీద నీ కాలిగుర్తుల వెంట నడుస్తూ, లోయల్లోనుంచి వినిపించే నీ పిలుపు కోసం పరితపిస్తూ ఎక్కడెక్కడో తిరుగుతున్నట్లు...ఏ నీలి నీటి సరస్సుల ఒడ్డునో, ఏ పారిజాత వృక్షాల నీడల్లోనో నీవు నేనై, నేను నీవై...నెరవేరేనా ఈ ఆశ? నిజమైన ప్రేమ ఎప్పుడూ సుఖాంతమే నంటారు. అసలు అంతమే కాదనీ” అంటారు. ఒక్కోసారి పరిస్థితుల సంకెళ్లు తెంచుకుని పరుగెత్తుకుని నీ దగ్గరకు రావాలని ఉంటుంది. కానీ రాలేను. ఏంచేతనంటే, మనం మన కోసం బతకటంలేదు. చుట్టూ ఉన్నవాళ్ల కోసం బతుకుతున్నాం. ఏమేమో రాస్తున్నాను కదూ. ప్రేమమైకంలోనూ తాగిన మైకంలోనూ ఉన్నవాళ్లు మాట్లాడేది ఆసందర్భపు ప్రేలాపనగానే ఉంటుంది.
త్వరలోనే మనం కల్సుకోబోయే మధురమైన ఘడియల కోసం ఎదురుచూస్తూ... పాప... నీ... కంటిపాప”.
రెండో ఉత్తరం వచ్చినప్పటినుంచీ అతని అన్వేషణ ఎక్కువ అయింది. తనకు ప్రేమలేఖ రాసింది. ఎవరై ఉంటారో ఊహించసాగాడు. బస్ స్టాప్‌లో కనిపించి నవ్వుతుంది. ఆమె... అయి ఉంటుందా? ఆమెకు తన పేరూ, ఆడ్రసూ ఎలా తెలుసు? తన ఆఫీసు బిల్డింగ్‌లో అయిదో అంతస్తులో నుంచి వస్తూ లిఫ్ట్‌లో కనిపించినప్పుడల్లా చొరవగా మాట్లాడుతుంది... ఆమె అయి ఉంటుందా?
స్నేహితుడి ఇంట్లో పార్టీకి వెళ్లినప్పుడు చిన్నప్పటి ఫ్రెండ్ కనిపించి పలకరింపుగా నవ్వింది... ఆమె అయి ఉంటుందా?
రెండు నెలల కిందట తన ఆఫీసులో ఏదోపని ఉందంటూ వచ్చి వారం రోజులు తన చుట్టూ తిరిగి వెళ్లింది... ఆమె అయి ఉంటుందా?
అందరి మీదా అనుమానం... కనిపించిన వాళ్లందరినీ అదే దృష్టితో చూస్తున్నాడు. వాళ్ల దగ్గర నుంచీ వచ్చే రెస్పాన్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు.
బస్టాప్‌లో నిలబడ్డాడు. ఆమె వచ్చింది. దగ్గరగా వెళ్లాడు. పలకరించాలనుకున్నాడు. బస్ వచ్చింది. ఆమె బస్ ఎక్కింది. అతనూ అదే బస్ ఎక్కాడు. అరగంట తరువాత ఆమె దిగిన స్టాప్‌లోనే దిగాడు. ఆమె పక్కనే నడుస్తూ పలకరించాడు.
“ఈ మధ్య కనిపించటం లేదు...”
“రోజూ మీకు కనిపించాలని రూలు ఏమన్నా ఉందా?”
“అది కాదు పాపా. ఇదివరకు రోజూ కనిపించేవారు కదా?”
“నాపేరు పాప కాదు... మేం ఇల్లు మారుతున్నాం. ఫస్టు నుంచీ అసలు కనిపించను” అన్నదామె.
చంద్రశేఖర్ నిట్టూర్చాడు. రూట్ మార్చాడు. కనుక ఆ లెటర్ రాసింది ఈ పాప కాదన్న విషయం రుజువైంది.
ఆఫీసులో లిఫ్ట్ దగ్గర ఆమె కనిపించింది. అతను నవ్వాడు. ఆమె నవ్వింది. “ ఆర్ యÖ లేట్? అని అడిగాడు.
“లేట్... బట్ నాట్ టూలేట్...” అన్నది నవ్వుతూ
“నిన్న కనిపించలేదు?”
“ఇంటి దగ్గర చిన్నపని ఉండి రాలేదు...”
“ అంటే ఇంటి దగ్గర ఏ పనీ లేకపోతే అప్పుడు ఆఫీసుకొస్తారన్నమాట... అంతేనా పాపా?”
“ పోనీ అలాగే అనుకోండి... కాని నా పేరు పాప కాదు. నాకు ఇద్దరు పాపలు...” అని నవ్వింది.
లిఫ్ట్ ఆగింది. ఆమె వెళ్లిపోయింది. పాప కోసం అతని అన్వేషణ పూర్తికాలేదు. కనిపించిన ప్రతి వాళ్లలోనూ ‘పాప’ కనిపిస్తుందేమోనని వెతుకుతున్నాడు.
విసిగిపోయి ఇంటికి వెళ్లాడు. రోజా నవ్వుతూ కాఫీ అందించింది. ఆమె నవ్వు చాలా రోటీన్‌గా ఉంది.
ఒక అరగంట తరువాత బయటకు వెళ్లొస్తానని బయల్దేరాడు.
“నానిగాడికి షూస్ కొనాలి. వాడ్ని తీసుకెళ్లండి” అన్నది రోజా.
“ఇప్పుడు కాదులే...” అన్నాడు ముభావంగా,
“ఎక్కడికి? సినిమాకా?”
“కాదులే... సినిమాలకూ, షికార్లకూ నువు రావుకదా...” అన్నాడు చురక అంటిస్తూ.
“నాకూ సినిమాలు చూడాలనే ఉంటుంది. పసిపిల్లతో వెళ్తే చాలా ఇబ్బంది. అది ఏడుస్తుంది. అందరూ విసుక్కుంటారు...”
చంద్రశేఖర్ నిట్టూర్చాడు. బయటకు వెళ్తుంటే ‘ఎక్కడికి’ అని అడిగింది.
“ఏదైనా పనిమీద వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు” అన్నాడు కటువుగా.
“తెల్సు`కానీ ఇప్పుడు మీరేమన్న పెళ్లిచూపులకు వెళ్తున్నారా?” అని అడిగింది.
“ఆవును పెళ్లిచూపులకే వెళ్లున్నాను...సరేనా?” అన్నాడు కోపంగా.
అరగంట తరువాత చంద్రశేఖర్ స్నేహితుడి ఇంటి తలుపు తట్టాడు. పక్క పోర్షన్‌లోనే తన చిన్నప్పటి ఫ్రెండ్ ఉంటోంది...
అతను వెళ్లిన సమయానికి ఫ్రెండ్ లేడు. పక్క పోర్షన్‌లోని ఆమె కనిపించి పలకరించింది.
“బాగున్నావా చంద్రం?” అన్నది.
“బాగున్నాను. నువ్వు?”
“నేను బాగున్నానో లేదో నువ్వు చెప్పాలి...” అన్నది నవ్వేస్తూ.
“నీలో చిలిపితనం పోలేదు...”
“నిన్ను చూస్తే చిన్నతనం గుర్తొచ్చి చిన్నపిల్లను అయిపోయాను...”
“ఈ మధ్య మన ఊరు వెళ్ళావా, పాపా?”
“వెళ్లలేదు... కానీ ఆ కొత్త పిలుపేమిటి? నేను నీకు పాపలాగా కనిపిస్తున్నానా?”
“పాపగా ఉన్న రోజుల్లో పాపా అని పిలవటానికి నీకు నోరు రాలేదు. ఇప్పుడా అలా పిలవటం?” అన్నది. అందులో మందలింపు ఉంది.
అయితే తను వెతుకుతున్న పాప ఆమె కాదని తెల్సిపోయింది. వారం రోజుల తరువాత మరో ఉత్తరం వచ్చింది.
“డియర్ చంద్రం...
నీ ఆన్వేషణ పూర్తి కాలేదనుకుంటాను. జీవితంలో చాలామంది కనిపిస్తారు. చాలా దగ్గరగా వస్తారు. కానీ వాళ్లెవరూ నీ కంటిపాపలు కాలేరు. మనకు ఎప్పుడు, ఎక్కడ వివాహం అయిందీ గుర్తుంటుంది. ఆల్బమ్ తిరగేసి గుర్తుచేసుకుంటుంటాం. కానీ ఎందుకు వివాహం చేసుకున్నదీ గుర్తుండదు. జీవిత భాగస్వామిగా, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ కల్సి జీవిస్తాం అని పెళ్లినాడు ప్రమాణాలు చేస్తారు. నాలుగయిదేళ్లు గడిచేటప్పటికి, ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టేటప్పటకి, భార్యకు ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం అయిపోతుంది. భార్యగా కన్నా తల్లిగా ఎక్కువ బాధ్యతలు ఆమెను చుట్టుముట్టేస్తాయి. స్త్రీ చేతికి పసిబిడ్డను ఇస్తే చాలు, ఆమె ప్రపంచాన్నే మర్చిపోతుంది. కానీ మగవాడు అలాకాదు. భార్యకు ఇద్దరు ముగ్గురు బిడ్డలను అందించిన తరువాత కూడా తరగని చెరగని అందాలకోసం ఆరాటపడతాడు. భార్య భార్యగా కనిపించదు. తన పిల్లలకు తల్లిగా మాత్రమే కనిపిస్తుంది. ఇంక రోమాంటిక్‌గా కనిపించే మరో హిరోయిన్ కోసం ఆన్వేషణ మొదలు పెడతాడు. నీ ఆన్వేషణ ఇలా ఇంక ఎంతోసేపు కొనసాగదు. త్వరలోనే నీకు కనిపిస్తాను...
పాప... నీ కంటిపాప...”
ఆ ఉత్తరం చదివాక పాలపొంగు మీద నీళ్లు చల్లినట్లు అనిపించింది. ఈ వ్యవహారం ఏమిటో అర్థం కాలేదు.
సాయంత్రం ఇంటికి వెళ్లేప్పటికి అది తన ఇల్లేనా అన్న సందేహం వచ్చింది.
రోజా చాలా అందంగా ముస్తాబైంది. స్లీవ్‌లెస్ జాకెట్‌లో సిల్క్‌చీరలో, బ్యూటీపార్లర్ తెచ్చిన సరికొత్త అందంలో వింతగా కనిపించింది.
“ఇవాళ ఏమిటీ స్పెషల్?”
“మన మేరేజ్ డే...”
“పిల్లలు ఏరి?”
“మా వాళ్లింట్లో వదిలిపెట్టాను. త్వరగా స్నానం చేసి రండి. సినిమాకు వెళ్లి, హÃటల్లో భోంచేసి... డబ్బుంటే హÃటల్లోనే రూం బుక్ చేసి...”
“ఏమిటి చాలా జోరు మీద ఉన్నావు?”
“జోరు నాది కాదు మీది...” అన్నది నవ్వుతూ
చంద్రం రోజా వైపు చూశాడు. అతని కళ్లల్లో ఆమె పాప కనిపించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి