పిల్లనగ్రోవిని బట్టిన
పిల్ల డొకడు రేపుమాపు ప్రేమగ నా యీ
యుల్లమునందున నేదో
యల్లరిఁ గావించుచుండె నది యేమొ కదా!
Useful Guide for Hyderabad Telugu People...General Awareness for All ...Education....Movies.... Politics... Social...Cultural.....Events.....and many more things to know updates......
పిల్లనగ్రోవిని బట్టిన
పిల్ల డొకడు రేపుమాపు ప్రేమగ నా యీ
యుల్లమునందున నేదో
యల్లరిఁ గావించుచుండె నది యేమొ కదా!
వశి.. వనధి దాటెఁ..బనిఁ జేసె..ఫల మడుగడు..
వైనతేయ నిభ వరిష్ఠుడైన హనుమ..
ఎవరు ద్రవిణమునం దాశ యెరుగ? రొకడు
దక్క..నాకలిం గమలాప్తు దాకు హనుమ..
ఆంజనేయుడు వశి. (ఇంద్రియాలను వశమునం దుంచుకున్నవాడు). వైనతేయుని (గరుత్మంతుని) వంటి వరిష్ఠుడు (శ్రేష్ఠుడు). అనంతమైన సముద్రాన్ని లంఘించగలిగినాడు. లంకలో ప్రవేశించ గలిగినాడు. జానకి జాడ కనుక్కో గలిగినాడు. తన ప్రతాపాన్ని చూపగలిగినాడు. తిరిగి రాగలిగినాడు. ఇవన్నీ ఎవ్వడూ చేయలేని పనులే! పైగా నిష్కామంగా చేశాడు.
ద్రవిణము (ధనము)నం దాశ ఎవ రెరుగరు? ఆకలితో కమలాప్తుని (సూర్యుని) తాక బోయే హనుమ ఒక్కడు తప్ప.
బాల్యంలో సూర్యుని పం డనుకొని మింగ బోయాడు హనుమ.
(పదాలు అన్యార్థంలో ప్రయోగించ బడినవి.)
తెలిసినది చెప్పు టది యొప్పు.. తెలుపకున్న
చెరువుకొనుచున్న జడ నున్న విరుల యాన..
ఊరకుంట మ రేలనే! ఓ ప్రియ సఖి!
చెప్పవే! సత్వరం బా విశేష మేమొ!
రామచంద్రాభిషేచనం..
శ్వో భవిష్యతి తే నాద్య సర్వతోఽలంకృతం పురం
(అధ్యాత్మ రామాయణము అయోధ్యా కాండము 2-50,51)
(శ్రీ రాముని పట్టాభిషేకము రేపు జరుగుతుంది. అందుకే నగరమంతా అలంకరించబడింది.) అన్న మాటలు వినగానే మంథర కైకేయి మందిరానికి వెంటనే వెళ్ళింది.
"ఒక గొప్ప విశేషం జరుగబోతోంది." అని ఉపక్రమించింది. ఎలా చెప్పాలో తోచలేదు. నాన్చుతున్నది. అప్పుడు జడలో పూవులు చెరువు (తురుము) కుంటున్న కైక ఉత్సుకతతో ఇలా అడిగింది.
చెరువు = పూలు మొదలైనవి కొప్పున దూర్చు.. గ్రుచ్చు
మౌలిక వర ధర్మ పాలా! విను మొక సూ
క్తి.. దశకంఠు డిటులఁ దీరిపోడు..
కడుపులోని యమృత కలశమ్ము భేదించి,
ముదము నిమ్మ లోకమునకు రామ!
రాముడు రావణునితో యుద్ధం చేస్తున్నాడు. ఖండితములైన రావణుని తలలు మళ్ళీ మొలుస్తున్నాయి. అలసిపోయినాడు. విభీషణు డిలా అన్నాడు.
"రామా! అన్నిటికీ మూలమైన ఉత్తమ ధర్మాన్ని (యద్ధ ధర్మాన్ని కలుపుకొని) పాలించేవాడా! ఒక సూక్తి (మంచిమాట) చెబుతా.. విను. (వినాల్సిందే! తప్పదు.) దశకంఠు డీ విధంగా తీరిపోడు (చనిపోడు). అతని పొట్టలో అమృత కలశం వుంది. దాన్ని భేదించు. లోకానికి సంతోషం ప్రసాదించు."
రాముడు యుద్ధ ధర్మం పాటించేవాడు కాబట్టి నేరుగా రావణుని పొట్టపై అస్త్ర ప్రయోగం చెయ్యడు. చేయకపోతే ఎంతసేపైనా యుద్ధం యిట్లాగే కొనసాగుంది. అన్నిటికీ మూలం, శ్రేష్ఠం ధర్మం కాబట్టి దాన్ని గెలిపించాలని.. "మౌలిక వర ధర్మ పాలా!" అని సంబోధించినాడు విభీషణుడు.
విడిచి రట కల్లు ముంతలు..
ముడిచిరి బొంత లవి.. పట్టు పుట్టము లాయెన్..
వడిఁ జనెఁ గుంతలములు.. వె
ల్వడె నగిషీ పొంతలు రఘు వర రాజ్యమునన్..
రఘువరుని (రాముని) రాజ్యంలో ప్రజలు మద్యపానం వదలివేసినారు. బొంతలు ముడిచినారు. అంటే పేదరికం పోయింది. వాటి స్థానంలో పట్టు వస్త్రాలు వచ్చినవి. (ఆర్థిక స్తోమత పెరిగింది.) కుంతలములు (నాగళ్ళు) వడిగా సాగినవి. అంటే వ్యవసాయం మెరుగుపడింది. పొంతలు (కుండలు) నగిషీలతో వెలువడసాగినవి. (కళా ప్రియత్వం పెరిగింది.)