మొత్తం పేజీ వీక్షణలు

3, జులై 2022, ఆదివారం

పావనీ! వార్ధి లంఘించు వాడ వీవె..

     పావనీ! వార్ధి లంఘించు వాడ వీవె..

     తారకము రామ నామమే!..చేరి కళవ

     ళ పడ నక్కరయే లేదు.. రామ కార్య

     మునకు నవరోధ మున్నదే ముజ్జగముల!


సీతాన్వేషణలో  సాగరతీరం చేరుకున్నారు వానర వీరులు. హనుమతో జాంబవంతు డిలా అన్నాడు.

    రామ కార్యార్థ మేవ త్వం

    జనితోఽసి మహాత్మనా

    రామ కార్యం కోసమే నీవు జన్మించినావు.

    (అధ్యాత్మ రామాయణం.. కి.కాం. 9-18)

     అతస్త్వద్బల మాహాత్మ్యం 

     కో వా శక్నోతి వర్ణితుం

     ఉత్తిష్ఠ కురు రామస్య 

     కార్యం నః పాహి సువ్రత 20

         నీ బలా న్నెవరు వర్ణించగలరు? లే! రామ కార్యం సాధించు. మమ్మల్ని రక్షించు.

    "పవననందనా! సముద్రాన్ని లంఘించ గలవాడవు నీవే!.. తరింపజేసేది.. రామ నామమే! (నీ వెప్పుడూ అదే పలుకుతుంటావు.) కలవరపడ వలసిం దేమీ లేదు. రామ కార్యాన్ని అడ్డుకునేది మూడు లోకాల్లో వున్నదా!"


గంగే చ యమునే చైవ

గంగే చ యమునే చైవ 

గోదావరి సరస్వతి

నర్మదే సిందు కావేరి

జలే-స్మిన్‌ సన్నిధిం కురు

ఒక్కొక్కసారి సదీస్నానానికి నోచుకోక పోయినట్లైతే చదువుకో దగినది పైశ్లోకం. ఆయా పుణ్యనదుల నీరు నేనిప్పుడు స్నానం చేయబోతున్న నీటిలో సన్నిధి చేస్తాయి గాక అని సంకల్పించడం ఇందులోని సారాంశం.

మన ప్రాచీనులు ప్రతినిత్యము, పుణ్యనదీ స్మరణం చేస్తూ, నదీ దర్శనం కోసం, నదీ స్నానం కోసం తహతహలాడేవారు. ఎందుకంటే నిలువున్న నీటికన్న ప్రవాహజలం ఆరోగ్యకరం. నదీజలం ప్రవాహజలం. ఇలాంటి జలంపై సూర్యకిరణాలు ప్రసరించి చెఱుపు చేసే క్రిములను నశింపజేస్తాయి.

పరోపకారాయ ఫలంతి వృక్షాః

పరోపకారాయ ఫలంతి వృక్షాః 

పరోపకారాయ వహంతి నద్యః

పరోపకారాయ దుహంతి గావః

పరోపకారార్థ మిదం శరీరం

పరోపకారం కోసం వృక్షాలు ఫలాలనిస్తున్నాయి. పరోపకారం కోసం నదులు ప్రవహిస్తున్నాయి. పరోపకారం కోసం ఆవులు పాలిస్తున్నాయి. ఈ శరీరం పరోపకారం కోసమే! అని భావం. ఇందులో వృక్షాలు, నదులు, పశువులు (ముఖ్యంగా ఆవులు) చెప్పబడినవి. ఆవన్నీ ప్రకృతిలో భాగాలే! పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడివున్నవి. వీటిని చక్కగా పరిరక్షించుకోలేకపోతే మానవుని మనుగడకే ముప్పు వాటిల్లుతుందనేది నగ్నసత్యం. నదులను వ్యర్థపదార్థాలతో, రసాయనాలతో కలుషితంచేసి, అరణ్యాలను నిర్మూలించి, పశువులను కబేళాలకు తరలించి మాంసాన్ని విదేశీయులకు విక్రయించుకొని ధన మార్జింతామనే దౌష్ట్యానికి మానవుడు పాల్పడితే భగవంతుడిచ్చిన బుద్ధివైభవం దుర్వినియోమవుతుంది కదా! అప్పుడు భగవదనుగ్రహానికి నోచుకోక తన వినాశానికి తానే కారణమవుతాడు మానవుడు.

భాను బింబమ్ము దాక దివానఁ బెరిగె..

భాను బింబమ్ము దాక దివానఁ బెరిగె..

గరుడుడో యన నెగిరెఁ.. గేసరి తనయుడు

వనధి లంఘింపఁ దిలకించు ఘనతర సుకృ

తంబునకు నోచితిమి.. మాదె ధన్యత సుమి!


          సముద్రంలోని సర్పాలు, ఆకాశంలో ఎగురుతున్న హనుమను చూసి, గరుత్మంతు డేమో అనుకొన్నవి. (శ్రీమద్రాయణము. సుందరకాండ 1వ సర్గ 75 శ్లో)

    హనుమంతుడు ఉన్నట్టుండి క్రమక్రమంగా పెరిగిపోయి సముద్రం మీదుగా  ఎగిరిపోతుంటే వానరు లెంతో సంబరంతో ఇలా అనుకున్నారు.

   "సూర్య మండలం తాకుతాడో యేమో అన్నట్టు పెరిగిపోయినాడు. గరుత్మంతు డేమో యనుకునేటట్టు ఎగిరిపోసాగినాడు. కేసరి తనయుడైన ఆంజనేయుడు సముద్రాన్ని లంఘిస్తూ వుంటే తిలకించే గొప్ప పుణ్యానికి నోచుకున్నాము. మాదే ధన్యత సుమా!"


ప్లవమానం సమీక్ష్యాథ భుజఙ్గాః సాగరాలయాః

వ్యోమ్ని తం కపి శార్దూలం సుపర్ణ ఇతి మేనిరే

విభవము లెల్ల వీడి, పతి వెంటనె కారడవుల్ గమించి

    విభవము లెల్ల వీడి, పతి

       వెంటనె కారడవుల్ గమించి, గొ

    ప్ప భయము లొక్కపెట్టునను

        ప్రాణములన్ బెకలింప జూచినన్

    ప్రభు వగు రామునే మదిని

        భద్రముగా నెలకొల్పి మించెనే!

    త్రిభువనముల్ ప్రియంబుగ ను

        తించెనె అగ్ని పునీత జానకిన్!

 రావణవధానంతరం అయోధ్య కేతెంచిన సీతా రామ లక్ష్మణులను దర్శించి సంభాషించి జరిగిన సంఘటనలను ఆనం దాశ్చర్యాలతో విని పులకించి అయోధ్యలోని ముత్తైదువు లిలా సీతాదేవిని కొనియాడినారు.

   "జానకి అయోధ్యా నగర జీవితమూ వదలి పెట్టింది. అంతః పుర కాంతగా పొందే రాజ భాగా లన్నీ విడిచి పెట్టింది. క్రూర మృగాలూ రాక్షసులూ సంచరించే నిర్జ నారణ్యాలలో నివసించడానికి భర్తయైన రాముని వెంట వెళ్లిపోయింది. రామ లక్ష్మణులు తనను వరించకపోతే శూర్పణఖ ప్రాణాలు పెకలింప జూసినా.. తనను వరించకపోతే ప్రాణాలు తీస్తా నని రావణుడు బెదిరించినా.. రాముణ్ణే మనసులో స్థిరంగా నిలుపుకొని సీతమ్మ తొణకలేదు బెణకలేదు. అగ్నిపరీక్ష లోకూడ ఉత్తీర్ణురాలై నిలిచి నారీలోకానికే ఆదర్శప్రాయురా లయింది. మూడులోకాలూ ఆమెను కొనియాడినవి"