మొత్తం పేజీ వీక్షణలు

17, జులై 2021, శనివారం

శ్రీవిష్ణు సహస్రనామస్తోత్ర వైభవము

భీష్మపితా మహుడు లోకానికి ప్రసాదించిన శ్రీవిష్ణు సహస్రనామస్తోత్రము.

భారత సంగ్రామం అనంతరం అంపశయ్యపై పడి యుండిన భీష్మపితామహుని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ఉపదేశం చేయిస్తూ లోకాన్ని తరింపచేసాడు.

భారతీయ సంస్కృతికి  వాల్మీకి రామాయణము, వ్యాస మద్భారతము ఇతిహాసాలు వల్లనే గౌరవం దక్కుతుంది 

భగవద్గీత కంటే శ్రీవిష్ణు సహస్రనామస్తోత్రంవల్లనే సులభంగా తరించవచ్చని అంటారు 

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవము శ్రీకృష్ణుని అభిమతం. 

శ్రీకృష్ణుడు పాండవుల నందరినీ తీసుకొని భారతసంగ్రామా నంతరం అంపశయ్య పైనున్న భీష్మపితామహుని దగ్గరకు వస్తాడు.

ధర్మరాజుకు కలిగిన ధర్మసంశయములను తీర్చమని శ్రీకృష్ణుడు భీష్ముని కోరుతాడు. 

తనకు అవేవీ జ్ఞాపకంలేవు, చెప్పే శక్తిలేదు అంటాడు భీష్ముడు. 

అతనికి తెలిసినవన్నీ జ్ఞాపకం వచ్చేటట్లు పూర్వపు శక్తికలుగు నట్లు, నోటనీరూరునట్లు దేహబాధ తెలియనట్లుగా శ్రీకృష్ణుడు వరాలిస్తాడు. భీష్ముడు "అన్ని వరాలు నాకిచ్చి, నాచే చెప్పించడమెందుకు కృష్ణా! నీవే చెప్పవచ్చు కద!” అని ప్రశ్నిస్తాడు.

లోకంలో ఎవరైనా తనను గూర్చి తనే చెప్పుకుంటే సొంతడబ్బా కొడుతున్నాడని అను కుంటారు. 

ఎదుటివారు గుర్తించి పొగిడితే, లోకం కూడా ఆ గొప్పతనాన్ని అంగీకరిస్తుంది.

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవము తత్వసారం చెప్పానే కాని, తత్వము తనను గూర్చి తాను చెప్పుకోరాదు కద!

భీష్మపితామహా! నీవు తత్త్వదర్శనం చేసిన ఆచార్యుడవు. నీ నుంచి తెలుసుకోవాలని పాండవులు కోరుతున్నారు. వారికి తత్త్వమును, హితమును ఉపదేశముచేయి” అంటాడు శ్రీకృష్ణుడు.

దాహం కలిగిన వానికి సముద్రం తనలో నీరు నిండావున్నా యివ్వటానికి వీలులేదు. 

యిచ్చినా త్రాగడానికి పనికిరావు. 

ఆ నీటినే మేఘము గ్రహించి వర్షంగా కురిపిస్తేనే త్రాగ వీలవుతుంది. 

కృష్ణుడు సముద్రములాంటి వాడు. 

అతని గుణ ప్రవాహాన్ని గ్రహించిన భీష్ముడు మేఘములాంటి వాడు. 

కనుక, శ్రీకృష్ణుడు వరాలిచ్చి ఆతనిని ప్రోత్సహించాడు. 

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవము కల్గించాలన్నది నా అభిప్రాయం అని భీష్ముని ప్రేరేపిస్తాడు. 

భీష్ముడు పాండవులకు ఉపదేశం చేస్తుంటే తాను చేతులు కట్టుకొని విని,  ఆమోదిస్తాడు 

ముందుగ సామాన్య ధర్మాలను గురించి ధర్మరాజు అనేక సమాధాన ములు పొందెను. 

జన్మనెత్తిన ఏ జీవి అయినా ఈ సంసార చక్రము నుండి బయట పడాలంటే తెలియ వలసిన తత్త్వమేది? 

ఈ జీవులపుడు ఎక్కడ చేరుతారు? 

ఆ చేరడానికేమి చేయాలి? 

ఎవరిని స్తుతిస్తే అర్చిస్తే మానవులు కోరిన సుఖాలన్నీ పొందు తారని “భవతః పరమో మతః” తాతా! నీవు భావిస్తున్నావో దానిని అనుగ్రహించు” అని ధర్మరాజు ప్రశ్నిస్తాడు. 

సర్వజగత్కారణమైన సర్వలోకేశ్వరుడయిన శ్రీమన్నారాయణుని స్తుతి చేయుచు 'తమేవ చ అర్చయన్' అతనినే ప్రేమతో పూజిస్తే 'సర్వదుఃఖాతిగో భవేత్' అన్ని దుఃఖములను దాటి పోవచ్చు నయ్యా. 

ఆ పుండరీకాక్షుని అర్చించడమే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవము

'ఏష మే... అధికతమో మతః' అన్ని ధర్మాలలోకి శ్రేష్ఠమైన ధర్మము 

నామములను కీర్తిస్తే నకల పాపాలూపోతాయి. 

పవిత్రులౌతారు. 

ఏ కోరిక కోరినా అవన్నీ లభిస్తాయి. 

దీనిని మించిన గొప్ప మంత్రము మరొకటి లేదు. 

వేయి నామాలు కల మూలమంత్రమీ స్తోత్రము.

వేయిమంత్రాలు గౌణాని విఖ్యాతాని ఋషిభిః పరి గీతాని ఋషులచే గానము చేయబడినవి. 

శ్రీమన్నారాయణుని గుణములననుభవించిన ఋషులు, ఆ అనుభవ సారంగ ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కీర్తించి ఆనందించారు. అక్కడక్కడా గల ఆ ఋషుల వాగమృతం కలిసి పరీవాహమై లోకములో మనం కూడా పాడ గలిగేటట్లు శ్రీవ్యాస భగవానుడు సేకరించి కృప చేయగా నేను దర్శించాను. 

సర్వ జీవులు ఉజ్జీవించ డానికని చెప్పుచున్నాను విను అని భీష్ముడు ఉపదేశిస్తాడు.

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము మహాభారతసారము, పరమ ఋషులచే దర్శితము, శ్రీ భీష్మపితా మహుని అభిమతము, శ్రీ వేదవ్యాస ఉపదేశలబ్దము, భగవద్గీతకంటే శ్రేష్ఠము. 

ఎందరో ఆధునికులు గూడ ఇదే సకల శ్రేయస్సంధాయ కమని స్వీకరించిన ఈ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని మనమూ నిత్యం పాడి కోరినవన్నీ పొందుతారు 

ఇందులో 107 శ్లోకాలున్నాయి. 

వనమాలీ... శ్లోకంతో కలిపి 108 శ్లోకాలు అవుతాయి. 

మనకి ఉన్న నక్షత్రాలు 27. 

ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 

ఒక్కొక్క నక్షత్రానికి 4 శ్లోకాలు చొప్పున కేటాయిస్తే (27x4)108పాదాలకు 108 శ్లోకాలు అవుతాయి. 

ఏ నక్షత్రంలో ఏ పాదానికి 108శ్లోకాలు అవుతాయి. 

ఏనక్షత్రంలో ఏ పాదానికి చెందివవారు ఆయా పాద సంఖ్య శ్లోకాన్ని ఎన్నుకొని పారాయణం చేయవచ్చు. 

ఆ శ్లోకాలలో నామాలకు ముందు 'ఓంకారం' లేదా చివర'నమః పదం చేర్చి పఠించటం ద్వారా తమ అభీష్టాన్ని పొందవచ్చును.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి