మస్తకం బెత్తగా జాల.. మా వదినను
జానకమ్మను జూడగా జాల.. నెపుడు
పాదముల మ్రొక్కెదను భక్తి భావ మూర..
నవు.. నిదే సుమా! నూపురం.. బా రమణిదె!
నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే
నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్..
లక్ష్మణుని సచ్ఛీలాన్ని ఆవిష్కరించటంలో సుప్రసిద్ధమైన దీ శ్లోకం. (రామాయణము.. కిష్కింధా కాండము.. ఆరవ సర్గము 22) ఒక వదినపట్ల మరిది ఎలా ప్రవర్తించా లనే దానికి ఉదాహరణగా లక్ష్మణుని పేర్కొంటూ పై శ్లోకాన్ని చెబుతారు.
సీతా రామ లక్ష్మణుల వనవాస కాలంలో రావణుడు సీత నపహరించినాడు. రామ లక్ష్మణులు క్రమంగా ఋష్యమూక పర్వతం చేరుకున్నారు. హనుమంతుడు వారితో సుగ్రీవునికి మైత్రి కుదిర్చినాడు.
రాముడు వాలిని వధిస్తా నని సుగ్రీవునికి వాగ్దానం చేసినాడు. అతడు కూడా రాము నోదార్చి సీతను తెచ్చి నీ కప్పగించే ఏర్పాటు చేస్తా నని మాట యిచ్చినాడు. అంతేగాక ఒక రాక్షసు డాకాశ మార్గాన ఒక మహిళ నపహరించుకొని పోతూవుంటే ఆమె విలపిస్తూ తన సొమ్ములు చీర చెరగులో మూట గట్టి కిందకు వదలివేసిం దని ఆమె సీతయే అయివుంటుం దని ఆ నగలు తాము దాచినా మని పలికి అవి తెప్పించినాడు.
రాము డవి చూసి కన్నులనిండా నీళ్ళు తెచ్చుకొని లక్ష్మణుని గుర్తించు మన్నాడు.
పరిశీలించిన లక్ష్మణు డిలా అన్నాడు.
"నేను ప్రతినిత్యం మా వదినగారికి భక్తితో పాదాభివందనం చేస్తూ వుండేవాణ్ణి. కాబట్టి ఆమె కాలి యందెలను మాత్ర మెరుగుదును. ఇవి ఆమెవే! చెవిపోగులు గాని దండకడియములనుగాని నే నెరుగను. ఎందుకంటే నే నెన్నడూ తల ఎత్తి చూసినవాణ్ణి కాదు."
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి