ఆనాటి ఆరోగ్య సాధనాల్లో మణులదే మొదటిస్థానం. మణిమంత్రౌషధాలు వారి కారోగ్యదాయకాలు.
మణులు ధరించటంవల్ల వ్యాధులేగాదు ఆధులుగూడా శమిస్తాయి.
మన పురాణాల్లో వీని మహాత్మ్యాలకు సంబంధించిన కథలకు అదుపు లేదు.
మహిళది సహజంగా ఉష్ణతత్వంగాబట్టి వారికి నైసర్గికమైన ఆ తత్వాన్ని క్రమబద్ధం చేసేందుకు తద్వాహకమైన స్వర్ణధారణం వారికి విధిగా ఏర్పరచారు.
మణిధారణం వ్యక్తికి నక్షత్రాన్ని దాని రాశినిబట్టి ఉంటుంది.
ఆధివ్యాధులకవసరమైన రత్నస్వర్ణాలు రెండూ కలిసి హిందువుల్లో భూషణకల్పనకు దారితీశాయి.
హిందూస్త్రీల కాభరణదీక్ష వివాహకాలంలో విధింపబడుతుంది.
అగ్రవర్ణుల్లో తలంబ్రాల తదుపరి స్థాలీపాకం, ప్రధానం, సదస్యం అనే వరుసలో వివాహక్రియలు నడుస్తాయి.
స్థాలిపాకంలో వధూవరులకు గృహస్థదీక్ష ఇవ్వటం జరుగుతుంది.
సదస్యంలో సభాపూజ ఉంటుంది. గృహస్థదీక్ష పొందిన దంపతులు అలంకారయుక్తులై సభనర్చింపవలసి ఉంటుంది కాబట్టి దానికి పూర్వరంగంగా వివాహవిధుల్లో ‘‘ప్రధానం’’అనే లాంఛనం విధింపబడిరది.
అందులో వధువుకి భూషణారోపంచేస్తారు.
అది ఒకరకంగా సువాసినీ దీక్ష లాంటిది.
సువాసిని ఎల్లప్పుడు నగలు అలంకరించుకోవలసినట్లు అది ఆమె భర్తకు చెబుతుంది.
భర్తకు క్షేమదాయకమైనట్లు మనకు సుగాత్రికథ చెబుతుంది.
ఆనాడు అత్తగారు కొని ఇచ్చిన నగలనలంకరించటం సర్వత్రా ఆచారంగ ఉండేది .
అత్తగారు వధువుకి ఎక్కువ లేకున్నా తాటంకాలు, వాలపాళ్యం (సిగబిళ్ళ), కంకణాలు, తీగ అనేవైనా ముఖ్యంగా తీసుకువెళ్లవలసి ఉంటుంది.
వీనిలో మొదటి మూడు ముత్తయిదువ లాంఛనాలు నాలుగవదైన తీగ వంశాభివృద్ధి కారకం.
అది పెట్టకుంటే తమవంశం తీగసాగదని మనవారి నమ్మకం.
ఈ విధంగా ప్రధానం తెలుగుపడుచులకి సువాసినీ దీక్ష. భూషణధారణం తమకు తమ వంశానికి క్షేమంకరమయింది కాబట్టి వివాహంలో ఈ క్రియను ‘‘ప్రధానం’’ అని పిలిచారనిపిస్తుంది
శూద్రుల్లో ప్రధానం జరిగే వరకు వధువుని తలబ్రాలకే పంపరు.
పూర్వం స్త్రీపురుషులిద్దరూ సమానంగా భూషణాలు ధరించేవారు.
గోపాలచూడామణి నాసాగ్రంలో నవమౌక్తికం గూడా ధరించాడు.
అతడు కేళి చలన్మణి కుండలుడు. యజ్ఞశ్రీశాతకర్ణి లలాట పట్టిక, తిక్కనగారి కీచకునికి మెట్టెలుండేవి.
కుండలాలు, హారాలు, కంకణాలు, కటిసూత్రాలు ఆకాలంలో స్త్రీపురుషులిద్దరికీ సమానమని శ్రీ రాళ్లపల్లి వారన్నారు.
భామాకలాపం చూసినవారందరికి జడరహస్యం కాస్తోకూస్తో తెలుసు.
సత్యభామ తెర లోపలికి రాగానే తనజడను తెరపైవేసి దాన్ని వ్యాఖ్యానిస్తుంది.
ఆ జడ పడగలుగల ఓ పెద్ద నాగరానికి యిరవయ్యేడు సైజువారీ అర్ధచంద్రాకారపు పాళెలు గ్రుచ్చి తయారుచేయబడుతుంది.
దాని చివరకు ఓ పెద్ద గంటనుండి వ్రేలాడే తొమ్మిది చిన్నగంటల గుత్తిఉండేది.
జడ చివరన ఉండే ఈ తొమ్మిది గంటలు నవగ్రహాలు.
వానిమేరువు బ్రహ్మాండ కర్పరం. జడలోని యిరవయ్యేడు బిళ్లలు అశ్విన్యాది నక్షత్రాలు.
వానిపైనుండే నాగరం ఈ సృష్టినంతా భరించే ఆదిశేషుడు.
ఈ విధంగా విశ్వకర్మ దాన్ని తనసృష్టికి సంకేతంగా రూపొందించాడు.
‘‘కలాపం’’ అంటే శిరోభూషణ కాబట్టి తత్ప్రదర్శనతో ప్రారంభమయ్యే ఈ సంగీతరూపకం భామాకలాప మనబడిరది.
దేశీసాహిత్యంలో కలాపాలు తెలుగువారి సొంత ఆస్తి అనుకోవచ్చు .
ఈ జడను బంగారంతో చేయించుకోలేనివారు సైజువారీగా యిరవయ్యేడు చేమంతిబిళ్ళలు చేయించుకొని, జడపై త్రిప్పుకొని, చివరకు గంటలు కట్టుకొనేవారు.
ఈ జడలాగే స్త్రీలు ధరించే సమస్త భూషణాలకు తాత్విక రహస్యముంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి