మొత్తం పేజీ వీక్షణలు

4, డిసెంబర్ 2022, ఆదివారం

ఆభరణాల ప్రాచీన విశేషాలు - ఉంగరాలు

 మన ఆభరణాల్లో వజ్రం దేనిలో పొదగకున్నా ఉంగరంలో పొదగటం పరిపాటి. 

పంచీకరణంలో హస్తాని కింద్రుడధిపతి. చేతి అయిదువ్రేళ్లు పంచేంద్రులకు సంకేతాలు. 

ఇంద్రుడు వజ్రపాణి కాబట్టి వజ్రాలను దేనిలో పొదగకున్నా ఉంగరంలో విధిగా పొదిగే నియమం ఏర్పరచారు.

పురుషులు కొందరీ వజ్రపుటుంగరాలకు బదులు నవగ్రహాల ఉంగరాలు, పవిత్రపుటుంగరాలు ధరిస్తారు. ప్రకారాంతంగా అవికూడా చేతికుండే యింద్రత్వాన్ని స్ఫురింపజేస్తాయి.

మన స్త్రీలు ధరించే భూషణాల్లో ఒక్కొక్కటి మళ్ళీ ఏడేసిరకాలు. వాటిని ఏడువారాల సొమ్ములంటారు. అవి వారాన్నిబట్టి ధరిస్తారు. 

భారతీయుల సంసారంలో స్త్రీ పురుషునికి మార్గదర్శి. అందువల్ల పురుషునికవసరమైన యోగమార్గమంతా ప్రాచీను లాభరణరూపంలో ఆమె దేహంపై శిల్పించి చూపారు. 

పురుషుడు గతించినపుడామె కాభరణాలతో నిమిత్తం లేకుండా పోతుంది. 

పురుషుడు హిరణ్యగర్భుడుగాబట్టి మానవులు తమ ఊర్ధ్వకాయాన్ని హిరణ్యంతో ఆలంకరించుకోవలసి ఉన్నట్లు మాంగల్యశాస్త్రం చెబుతుంది.

మనదేహం ఓ దేవాలయం. ఇందలి జీవుడు దేవుడు. ‘‘దేహోదేవాలయ పోక్తః జీవోదేవస్సనాతనః’’ అని శాస్త్రం చెబుతుంది. శంకరాచార్యులు ‘‘చిదానందరూపశ్శివో హంశివో హం’’ అని నిర్వాణషట్కంలో చెప్పాడు 

శివుని జడముడికి సర్పం - స్త్రీలకు తలపై నాగరం

శివుని చెవులకు సర్పాలు - స్త్రీల చెవులకు సర్పిణీలు

శివుని మెడలో పన్నగహారం - స్త్రీల మెడలో బన్నసరం

శివుని దండ చేతులకు సర్పాలు - స్త్రీల రెట్టలకు నాగవంకు

ఈ విధంగా శివుడేయే స్థానాల్లో సర్పాలు ధరించాడో స్త్రీలాయా చోట్లలో ధరించే నగలు సర్పవాచకాలతో రూపొందించి ప్రాచీనులు జీవునియందలి శివత్వాన్ని లింగదేహంపై ముద్రించారు.

పంచీకరణంలో ఒక్కొక్క యింద్రియానికి ఒక్కొక్క అధిదేవత చెప్పబడ్డాడు. 

వారందరీ దేహంలోని శివునికి పరివార దేవతలుగాబట్టి ఆభరణాల వెనక ఉండే ఈ రహస్యం తెలిసినపుడు మానవులు చేసికునే అలంకారమంతా ఆయా పరివార దేవతల కంగరంగ భోగాలుగా పర్యవసించి తద్వారా అదంతా ఈ దేహంలోని జీవరూపుడైన శివునికి చేసే మహార్చనగా భాసిస్తుంది. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి