స్త్రీకి ఉండవలసిన భూషణాల్లో ప్రధానమయింది మాంగల్యం.
మాంగల్యాలను గుఱించితెలిపే ఈ శాస్త్రానికి ‘‘మాంగల్యశాస్త్ర’’ మని పేరు.
హిందూమతంలో స్త్రీ ప్రక ృతి స్వరూపిణి. ఆమె ఓ పురుషుని కంకితమై పోయి మరో పురుషుని కనటంతో తన జన్మచరితార్థమైనట్లు భావిస్తుంది.
భారతీయుల దాంపత్యం ప్రకృతి పురుషుల సంయోగానికి ప్రతిరూపం.
వారి సంసారంలో పురుషునికి కలుగవలసిన మాంగల్యపరంపర స్త్రీ హృదయ మూలంగా కలుగవలసి ఉంది కాబట్టి ఈ రహస్యాన్ని తెలుపటానికే కల్యాణ సమయంలో మంగళచిహ్నమైన మాంగల్యధారణం స్త్రీకి శరీరంలో ఏ హస్తపాదాదులకోగాక హృదయ స్థానంలో ధరించే యేర్పాటు చేశారు.
పురుషునికికూడ సహచరి లేకుండా క్రతుక్రియా కలాపాల కర్హతలేదు. అందుకే శ్రీరాముడు పసిడి సీతను చేయించుకొన్నాడు.
వివాహకాలంలో కన్యకు తల్లివారు, అత్తవారు యిద్దరూ మాంగల్యాలు చేయిస్తారు.
తల్లివారు గిన్నెపుస్తె, అత్తవారాకుపుస్తె చేయిస్తారు.
ఈ విషయం ‘‘అన్న గారిచ్చింది. గిన్నెపుస్తె, అత్తగారు తెచ్చింది ఆకు పుస్తె’’ అని బాలికలపాటలో కూడా ఉంది.
ఈ పుస్తెలు గౌరీశంకరులకు ప్రతిరూపాలు. అవి అలాగే ఎందుకు చేయాలో మాంగళ్యశాస్త్రం చెబుతుంది.
గౌరి మాంగల్యదేవతగాబట్టి ఆమె సుహాసినులకు నిత్యపూజనీయ.
గౌరి గిరిరాజపుత్రిక గాబట్టి స్త్రీలామెను గౌరవర్ణంగల పసుపుతో గిరి ఆకారంగా చేసి పూజిస్తారు.
వధువుకి తల్లివారు చేయించే పుస్త్తె ఈ ఆకారంలో ఉంటుంది.
అత్తవారిపుస్తె పానవట్టంపై లింగాన్ని నిలిపినట్లుంటుంది. అత్తవారు వరపక్షంవారు గాబట్టి వారు చేయించే పుస్తె పుంరూపమైన లింగాకారంలో, తల్లివారు వధూపక్షంవారు గాబట్టి వారు చేయించే పుస్తె స్త్రీ రూపమైన ‘‘గౌరమ్మ’’ ఆకారంలో ఉండేటట్లు పూర్వులు చేసిన నిర్ణయం తత్వమెరిగి చేసిందనకతప్పదు. పుస్తెలీవిధంగా ఆదిదంపతులైన శివశక్తుల రూపాలు గాబట్టి అవి సతీకంఠాన్నలంకరించి ఆమెకు మాంగల్యాన్ని ప్రసాదిస్తాయి.
పుణ్యస్త్రీకి ప్రొద్దునే నిద్రలేవగానే పుస్తెనొక పర్యాయం అరచేతి లోనికి తీసికుని దర్శించి కన్నులకద్దుకొనే నియమం ఏర్పరచారు.
దానితో ఆమెకు దినదినం జగత్పితలను దర్శించిన పుణ్యం దక్కుతుంది.
దానితో పాటు పతియెడ తన కర్తవ్యం గూడ స్మరణకు తగులుతుంది.
వివాహానంతరం కొందరు మాంగల్యాలకు ‘‘తాళిసామాను’’ చేయించుకుంటారు.
దానిలో ముప్పదిమూడు జతల బిళ్ళలు, మత్స్యకూర్మ వరాహాది అవతార చిహ్నాలు, భేరీస్వస్తిక మొదలైన మంగళ చిహ్నాలు ముద్రింపబడి ఉంటాయి.
ఈ బిళ్లలు పుస్తెలకు రెండువైపులా సమానంగా గుచ్చుకుంటారు.
దీనిలో ఈ ముప్పది మూడు సంఖ్య ముప్పది మూడుకోట్ల దేవతలకు ప్రతీక గాబట్టి స్త్రీలు వీటిని చేయించుకుని మాంగల్యానికి గ్రుచ్చుకోవటమంటే, దాని రక్షణకు వారందరు దేవతలనావాహనం చేసికొని సేవించటమన్నమాట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి