పూర్వం నాసాభరణాలులేని స్త్రీ ఉండేదిగాదు.
నాసారంధ్రాలలో కుడివైపు దానికి సూర్యనాడి, ఎడమవైపుదానికి చంద్రనాడి అనిపేరు.
అందువల్ల కుడిముక్కుకి మండలాకారమైన ఒంటిరాయిపుల్ల, ఎడమముక్కుకి ఆర్ధచంద్రాకారమైన బేసరి ఏర్పాటు చేశారు.
దినదినం వార స్వరాన్ని అనుసరించి స్త్రీలు వీనిని మార్చుకునే అవకాశంకూడ ఉంది గాని ఈ ఆవకాశం ‘‘చేర్చుక్క’’ ప్రక్కలందు ధరించే సూర్యచంద్రవంకల కీయలేదు.
మన నాసారంధ్రాల్లో సంచరించే శ్వాసకు ‘‘హంస’’ అని మరోపేరు.
దీన్ని తిరగేసినపుడది అజపగాయిత్రి అవుతుంది.
జీవుడే ఈ హంసరూపంలో ఇక్కడ సంచరిస్తుంటాడని వేదాంతుల మతంగాబట్టి దీన్ని పురస్కరించుకొని ముక్కుకి ధరించే నత్తుకి హంసరూపాన్ని కల్పించారు.
ముత్తయిదువులకు నాసాభరణం పంచమాంగల్యాల్లో ఒకటి.
అగ్రవర్ణాలలో కొందరు వధువుకి ముక్కర అలంకరించకుండా ధారవోయరు.
శూద్రుల్లో గూడ ముక్కరకు విశిష్టస్థానముంది.
విధవకు వివాహం చేయవలసివచ్చినపుడు ఆమెకు చేయించే మంగళస్నాన జలంలో ఓ ముక్కర వేసి, ఆ నీటితో అభిషేకం చేయిస్తారు. దానితో ఆమెకు వైధవ్యదోషం తొలగిపోతుందని వారినమ్మకం.
స్నానాంతరం ఆమెకు మళ్ళీ గాజులు తొడిగించి పెండ్లి కూతురిని చేస్తారు.
ఈ విధవా వివాహానికి ‘‘ముక్కర నీరు’’ అని రూఢయేిర్పడిరది.
ముక్కర ఈ విధంగా ము త్తయిదువతనానికి ముఖ్య మయింది కాబట్టే నిగమశర్మ అక్కగారు సంసారం కొల్లవోయినదానికంటె మిక్కిలిగ అడలిందికాని ఔచిత్యం తెలియకకాదు.
స్త్రీలు ముక్కుకి ముత్యం తప్పక ధరించాలని పూర్వులమతం.
శ్రీదేవి దాన్ని ధరించినట్లు శంకరాచార్యులు సౌందర్యలహరిలో వర్ణించాడు.
ఈ మౌక్తికం జీవుడు పొందవలసిన ముక్తిని సూచించటంతోపాటు ఆరోగ్య ప్రదమయిందిగూడ.
స్త్రీ నిశ్వాస దుష్టమయిందని, ముత్యం వాయుశుద్ధి ద్రవ్యమని అందువల్ల దాన్ని నాసాభరణాల్లో గూర్చినపుడు శ్వాసకు శుద్ధి మత్త కలుగుతుందని చెబుతారు.
ఇక ముంగర ముక్కుకి ధరించినా దాని శోభమాత్రం అధరాలకే చెందుతుంది.
‘‘ముక్కున హురుమంజి ముత్యాల ముంగర కమ్మవాతెరపైన గంతులిడగ’’ అని శ్రీనాథుడు వర్ణించాడు.
వాగింద్రియమైన వదనానికి జలాధిపతిjైున వరుణుడధిదేవత.
ముత్యాలు రత్నాలు నిజానికతని సొమ్మే కాబట్టి రదనచ్ఛదమైన యధరాలపై అధరచ్ఛదమైన రవ్వలముంగర వరుణదేవుని కెత్తిన మణినీరాజనమై ముఖాని కెంతో నిండుదనాన్ని చేకూరుస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి