మొత్తం పేజీ వీక్షణలు

4, డిసెంబర్ 2022, ఆదివారం

అతివల శిరోభూషణాలు - ప్రత్యేకతలు

శిరోభూషణాల్లో చెప్పదగినవి` పింపిణి, కేతకి, రాగిణీచంద్రవంకలు లేదా నాగరం. 

వీనిని పాపెట చివరినుండి నడినెత్తి పైవరకు వరుసగా ధరిస్తారు. 

పాపిడికి సీమంతమని పేరు. అది ముక్కుకి సూటిగా నడినెత్తిపైనుండి కపాలంవరకు వెళ్ళి ఆగిపోతుంది. 

అక్కడ కొన్ని వెంట్రుకలు పట్టి సన్ననిజడ అల్లి దానికి పింపిణి మొదలైనవి గ్రుచ్చుకుంటారు.

యోగశాస్త్ర ప్రకారం మానవకపాలంలో సహస్రారం దానిలో సూర్యచంద్రులున్నారు. 

మూలాధారంనుండి మొదలైన సుషుమ్న వెన్నుపాము క్రిందినుండి వెళ్ళి సహస్రారాన్ని కలుసుకుంటుంది. 

దానికిరువైపులా ఇడా పింగళానాడులు సర్పాలక్రమంలో పెనచుకొని ఉంటాయి. 

యోగులు తమ సాధనలో మూలాధారంలో నిద్రించిన కుండలిని మేల్కొలిపినపుడది వెళ్ళి సహ స్రారాన్ని చేరుకుంటుంది. 

అపుడక్కడ ఉండే చంద్రమండలం నుండి యోగి శరీరంలోనికమృతం స్రవిస్తుంది. 

దానితో అతడజరామరుడౌతాడు. స్త్రీలు ధరించే శిరోభూషణాల్లో ఈ రహస్యముంది.

పింపిణి అంటే వేణిక. ఇది ఇడా పింగళా సుషుమ్నానాడులకు చిహ్నం. 

అందువల్ల ఇది త్రిముఖాకారంగా చేయబడుతుంది. దీని వెనుకది కేతకి. ఇది గేదగి రూపాంతరం. రాంబస్‌ ఆకారంలో ఉండే దీనికి మొగిలిరేకు అని మరోపేరు. 

ఈ మొగిలిరేకు కుండలినీ నాడులను సహస్రారానికి కలిపే సంధిదళానికి చిహ్నం. 

దీనివెనక రాగిడీచంద్ర వంకలుంటాయి. అవి సూర్యచంద్ర మండలాలకు ప్రతీకలు. 

తలలో యించుమించు వాని స్థానంలోనే సహస్రారం ఉంటుంది.

రాగిడీ చంద్రవంకల స్థానంలో కొందరు నాగరం ధరిస్తారు. 

అది చుట్టలు చుట్టుకున్న సర్పాకార భూషణం. 

రాగిడీ చంద్రవంకలు సహస్రారంలోని సూర్యచంద్ర మండలాలను తెలిపితే నాగరం కుండలినక్కడికి చేర్చవలసిన రహస్యాన్ని తెలుపుతుంది.

రాగిడీ చంద్రవంకలు సూర్యచంద్రులకు చిహ్నాలుగాబట్టే రాగిడిలో కాళీయమర్దనం అంటే సర్పంపైగల విష్ణువు, చంద్రవంకలో ఓషధీశుని చిహ్నాలైన లతలు పూలు చెక్కుతారు. 

స్త్రీకి సీమంతాగ్రం శుక్రస్థానం. అందువల్ల పాపెటలో అక్కడ ‘‘చేర్చుక్క ’’ దానికిరువైపులా సూర్య చంద్రనాడులను తెలిపే సూర్యవంక , చంద్రవంక బిళ్లలు ధరించే నియమం చేశారు.

పూర్వం తల తరువాత చెవుల కెక్కువ నగలు ధరించేవారు. 

పంచీకరణంలో శ్రోత్రమాకాశతత్వం.  కర్ణాభరణాల్లో నక్షత్రాలతో సామ్యంగల మణులు ముత్యాలు తరుచుగా ఉపయోగిస్తారు. శ్రవోలంకారాల్లో ముఖ్యమైనవి తాటంకాలు. అవి సూర్యచంద్ర బింబాలకు ప్రతిరూపాలు. 

ప్రాచీనకాలంలో పురుషులు చెవులకు నవగ్రహ కర్ణవేష్టనాలు ధరించేవారు. 

నిగమశర్మ బావగారికి  ఉండేవి. చెవులను గురించి ప్రాచీనుల కాకాశ తత్వభావన లేకుంటే తమ్మంట్లకు నవగ్రహ కర్ణవేష్టనాలని నామకరణం చేయవలసిన అవసరం కనిపించదు. 

కర్ణాభరణాల్లో మరో ముఖ్య భూషణం కుండలాలు. 

శ్రీ మహావిష్ణువు మకరకుండల మండితుడు. ఇవిగూడా మనకు శ్రవస్తత్వాన్ని నిరూపిస్తాయి.

ఆకాశంలో సమస్త గ్రహనక్షత్రాలను గర్భీకరించుకున్న శింశుమారచక్రం దక్షిణావర్తమైన మకరాకారంలో తలక్రిందుగా వేలాడుతూ పుచ్ఛబలంపై నిలిచి ధ్రువునిచుట్టూ తిరుగుతూ కాలచక్రాన్ని నడిపిస్తుంది. 

దీన్ని పురస్కరించుకొనే చెవులకు వేలాడే కుండలాలకు ఆవర్తమైన మకరాకారాన్ని రూపొందించారు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి